[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]
[dropcap]కు[/dropcap]మ్మరిపుట్టు గ్రామంలో బోడిగాడు, బోడెమ్మ అనే దంపతులుండేవారు. వారి కొడుకు గుండుగాడు. వాడు పుట్టిన తర్వాత తలమీద జుత్తు పెరగకుండా వాడి తండ్రి బోడిగాడు కత్తితో ఎప్పటికప్పుడు నున్నగా గుండు చేసేవాడు. వారికి ఆ పేరు సార్థకమయింది.
గుండుగాడు తిండిపోతు. రోజుకు నాలుగు మార్లు తిన్నా వాడి ఆకలి తీరదు. ఊర్లో అందరి ఇళ్లకు తిరగడం వాడి పని. ఎవరింట్లోనైనా తగవులాడుకుంటుంటే అక్కడికెళ్లి వారి తగవుల్లో తల దూరుస్తుంటాడు. ఆలూమగల తగవులంటే వాడికిష్టం.
ఒకరోజు వారి ఇంటికి సమీపంలో వున్న కొండడు, కొండమ్మ అనే దంపతులు తగవులాడుకుంటున్నారు. అల్లం అమ్మిన డబ్బులు ఏం చేశావని కొండమ్మ అడుగుతోంది. దీనికి ఆమె మొగుడు కొండడు జవాబు చెప్పడం లేదు.
“ఏరా కొండా, అడుగుతుంటే సమాధానం చెప్పవేమిరా? ఆ డబ్బులు ఎవరికైనా అప్పుగాని ఇచ్చావా?” అని గుండుగాడు అడిగాడు.
“నీకెందుకురా ఆ విషయం. నేను కష్టపడి సంపాదించిన డబ్బులు. నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాను” అని కొండడు కోపంగా అన్నారు.
“అలాగా అయితే నీం పెళ్లాం కూడా ఆ పంటను నీటితో తడిపింది. భూమిలో నుంచి తవ్వితీసి శుభ్రం చేసి తట్టల్లో సర్దింది కదా! ఆమె కష్టం నువ్వు మరిచిపోతున్నావు” అన్నాడు.
“ఏరా! నీకు పనిపాటా లేదా? పోయి మా పశువులశాలల్లో పశువులకు మేతవేసి, వాటి పేడ తీసి కొట్టంలో వేయి. నీకు గిన్నెడంబలి పెడుతుంది కొండమ్మ” అని కొండడు వాణ్ని అక్కడి నుంచి పంపించేశాడు.
ఇంకో ఇంట్లో అత్తా, కోడలు తగవులాడుకొంటున్నారు. అక్కడికి వెళ్లి అత్తను సమర్థిస్తూ మాట్లాడసాగాడు. కోడలికి కోపం వచ్చి పొయ్యి మీద మరుగుతున్న వేడినీళ్లు తెచ్చి గుండుగాడి ముఖం మీద పోసింది. వాడు బాబోయి, నాయినోయి అంటూ ఇంటికి పోయాడు.
గుండుగాడి దగ్గర ఒక నల్లకుక్క వుంది. దానిది దొంగబుద్ధి. ఇళ్లల్లో దూరి అన్నం తినేస్తుంటుంది. కోడిపిల్లలను ఎత్తుకుపోయి తింటుంది. ఈ కుక్క ఒక రోజు సంతకెళ్లింది. సంతలో మాంసం అమ్ముతున్న సాహెబ్ దుకాణం దగ్గరకు వెళ్లింది. సాహెబ్ కత్తితో మాంసాన్ని ముక్కలుగా కొడుతున్నాడు. ఒక దుమ్మ ఎగిరిపడగా దానిని నోట కరచుకొని పారిపోయింది. దాన్ని నమిలినమిలి విడిచిపెట్టింది. సంతలో ఒక వ్యాపారి బెల్లం అమ్ముతున్నాడు. నల్లకుక్క అక్కడికి చేరింది. వ్యాపారి కన్నుకప్పి ఒక బెల్లం ముక్కను నోట కరచకుంది. వ్యాపారి ఇది కనిపెట్టి తక్కెడతో దాని మూతిమీద కొట్టాడు. అది కుయ్యో, మొర్రో అంటూ ఆ బెల్లం ముక్కను విడిచిపారిపోయింది. ముఖం మీద దెబ్బతో ఇల్లు చేరిన కుక్కను గుండుగాడు చూశాడు. ఎంతో బాధపడ్డాడు.
ఎవరో గుండుగాడితో “నువ్వు ఊర్లో కుక్కలా అందరి ఇళ్లు తిరిగి చెప్పుదెబ్బలు, చీవాట్లు తింటున్నావు కదా! నీ దొంగ కుక్క సంతకెళ్లి తక్కెడ దెబ్బలు తింది” అని చెప్పాడు.
“అయ్యో! ఎంత పని జరిగింది. నేను రేపటి నుంచి అడవికెళ్లి అడ్డాకులు కోసుకొని వచ్చి ఎండబెట్టి సంతలో అమ్ముకుని బ్రతుకుతాను. కుక్క బ్రతుకు అని అందరూ తిడుతున్నారు” అని తండ్రి బోడిగాడు, తల్లి బోడెమ్మతో చెప్పాడు. వారు ఎంతగానో సంతోషించారు.