‘కులం కథ’ పుస్తకం – ‘పాలేరు తమ్ముడు’ – కథా విశ్లేషణ-1

0
1

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న పి. పరిమళ ఈ పుస్తకంలోని ‘పాలేరు తమ్ముడు‘ కథను విశ్లేషిస్తోంది.

***

‘కులం కథ’ సంకలనంలోని ‘పాలేరు తమ్ముడు’ అను కథను నేను ఎన్నుకున్నాను. దీనిని మానేపల్లి తాతాచార్య రచించారు.

ఈ కథ యందు నాకు కలిగిన భావన, బాధ, ఆనందం, ఆత్రుత, అన్వేషణ ఇక్కడ పొందుపరిచాను.

పాలేరు అంటే అందరికీ పాత రోజుల్లోని సాకలి, పాచిపనివారు గుర్తుకొస్తారు. కానీ ఈ కథలో ఒక 8 ఏళ్ళ కుర్రవాడు పొట్టకూటి కోసం పాలేరు అయ్యాడు. వందేళ్ళ తన పచ్చని జీవితం కేవలం పాలేరు పనికే అంకితం.

నాకు కలిగిన బాధ:

వెంకయ్య అనే పాలేరును దొర కొడుకైనటు వంటి బుల్లెయ్య అతనిని దగ్గరకు రానిచ్చేవాడు కాదు. కనీసం ముట్టుకోనివ్వడు. అప్పుడు ఆ వెంకయ్య మనసులో బాధ. ఇలా నా జీవితం ఇంతేనా, నేనెప్పుడు పెద్దవాడయ్యేను, నేను చిన్న పిల్లవాడినేగా? నన్నెందుకు ఈ బుల్లెయ్య ముట్టుకోనీడం లేదు అని వెంకయ్య చాలా బాధగా కృంగిపోతాడు.

నాలో కలిగిన అన్వేషణ:

ఇంతలో ఒకతను బుల్లెయ్యకు మంచి చెడు వినిపించాడు, బోధించాడు. ఆ బుల్లెయ్య తనలో తనను వెతుక్కుని మంచి చెడు అర్థం చేసుకుని వెంకయ్యను చూసి “ఆడుకుందాం రా” అన్నాడు.

చిన్న వయసులోనే ఆ బుల్లెయ్య ‘కలసి ఉంటే కలదు సుఖం’ అనే మంచిని గ్రహించి ముళ్ళబాటపై కాకుండా పూలబాటపై నడిచాడు.

నాకు కలిగిన ఆనందం:

బుల్లెయ్య తన తప్పును అర్థం చేసుకుని చిన్న వయసులోనే చలించి వెంకయ్యను అక్కరకు చేర్చుకున్నాడు.

‘మొక్కై వంగనిది మానై వంగునా’ అనినట్లు తను చిన్నతనంలోనే మంచితనానికి బాట వేసుకున్నాడు.

నాలో కలిగిన ఆత్రుత:

బుల్లెయ్య తల్లికి కులం పట్టింపు. తక్కువ కులంవాళ్ళని దగ్గరకు రానివ్వదు. కొడుకు వెంకయ్యతో (పాలేరు) ఉండడం తనకు నచ్చలేదు. ఎలాగైనా కొడుకు మనసును మార్చాలనే ప్రయత్నంలో ఇలా బుల్లెయ్యకు చెప్పేది: “వాడు మురికిగా వున్నాడు, వాడి దగ్గర వాసన వస్తుంది, మంచి బట్టలు గాని లేవు. వాదితో ఉండకు” అన్నది.

బుల్లెయ్య తల్లితో “నా చొక్కా లాగు ఒకటి వాడికివ్వు” అని మారాం చేశాడు. చివరకు బుల్లెయ్య నెగ్గాడు. చిన్నవయసులో బుల్లెయ్యకు పొరుగువారికి సాయం చేయాలనే తత్వం కలిగింది. ‘అసూయాపరులకు వేరే శత్రువులు అక్కర్లేదు, వారి అసుయే వారి శత్రువు’ అన్న సూక్తి గుర్తుకువస్తుంది ఈ కథ చదువుతుంటే.

నాకు బుల్లెయ్య నెగ్గుతాడా లేదా తల్లి నెగ్గుతుందా అనే ఆత్రుత. కులం వల్ల పట్టుకున్న పిచ్చి తల్లిది, కలసి ఉండాలనే స్వభావం కొడుకుది.

నాలో కలిగిన భావన:

‘కులం’ అన్న ప్రతి ఒక్కరి నోటా ‘గుణం’ అని ఖచ్చితంగా రావాలి. కులాన్ని మించినది గుణం. గుణంతో కూడిన మన సంస్కారానికి ఎంతటివారైనా నమస్కారం పెట్టాలి. కులం కన్నా విలువైనది కలం. కలం (చదువు) బలంతో మనం అంతరిక్షాన్ని సైతం చుట్టిరావచ్చు.

సర్వేజనా సుఖినోభవంతు.

పి. పరిమళ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here