Site icon Sanchika

జ్ఞాననేత్రం

[dropcap]“హ[/dropcap]లో యూనివర్సిటీయేనా? జిలాయలజీ డిపార్ట్‌మెంట్లో పనిచేసే ప్రొఫెసర్ విశ్వనాథం గారి ఫోన్ నెంబరు చెబుతారా?” ఫోన్‌లో ఎవరో అడిగిన ప్రశ్న విని, క్షణంలో తడుముకోకుండా అడిగిన వారికి విశ్వనాథం గారి సెల్ నెంబర్ చెప్పాడు రోహిత్.

యూనివర్సిటీ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ ఎన్‌క్వైరీ కౌంటర్ లో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు రోహిత్. యూనివర్సిటీలోని వివిధ విభాగాలూ, అందులో పనిచేసే అధికారులూ, సిబ్బంది, ఇతరత్రా ఫోన్ నెంబర్లు, ఒక రెండువేల వరకూ అతని మనో ఫలకంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరే ఫోన్ నెంబరు అడిగినా తడుముకోకుండా చెప్పగలడు. ఏ పుస్తకమూ, పేపర్ చూసి ఆ నెంబర్లు చెప్పడు. అసలు చూడాలన్న చూడలేడు. ఎందుకంటే రోహిత్ పుట్టుకతో అంధుడు.

ఆ ఎన్‌క్వైరీ కౌంటర్ ఉదయం ఎనిమిదింటి నుండి రాత్రి ఎనిమిదింటి వరకూ పనిచేస్తుంది. రోహిత్ డ్యూటీ మధ్యాహ్నం రెండంటి వరకే, అతని నుండి ఛార్జి తీసుకోవడానికి వచ్చిన శకుంతల అనే మరో ఉద్యోగి రోహిత్ మెమోరీ పవర్ చూసి ఆశ్చర్యపోతుంది.

“మాకైతే డైరీ చూసి, ఆ నంబరు చెప్పడానికి రెండు, మూడు నిమిషాలు పట్టేది. ఠక్కున ఏ నెంబరైనా, ఎలా చెప్పగలవు రోహిత్?” అప్పుడే అక్కడకు వచ్చిన శకుంతల అడిగింది.

“అంతా ఆ పరమేశ్వరుని అనుగ్రహం” చిరునవ్వు నవ్వి చెప్పి రోహిత్ బయటకు నడిచాడు. ప్రతిరోజూ సాయంత్రం తన రూమ్ దగ్గరలో ఉన్న ఈశ్వరుడి గుడికి వెళ్లి, స్వామి దర్శనం చేసుకొని వస్తుంటాడు రోహిత్.

ప్రత్యక్షంగా కళ్లతో దేవతామూర్తిని చూడలేకపోయినా, పురోహితుడు శంకరశాస్త్రిగారు చెప్పే మంత్రాలు వింటాడు. స్తోత్ర పాఠాలు, ఆలకిస్తాడు. మనసులోనే దేవుడిని, తన మనోఫలకంపై ప్రతిష్ఠించుకొని ఆరాధించి, గుడిలో ఏ పురాణ ప్రవచనమో జరుగుతూ వుంటే శ్రద్ధగా దాన్ని విని, తన రూమ్‌కి చేరుకుంటూ ఉంటాడు.

అంధుడైనా, భగవంతుడి పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు గలిగిన రోహిత్ అంటే శంకరశాస్త్రి గారికి కూడా ప్రత్యేకమైన అభిమానం.

ఆ రోజు సాయంత్రం యధావిధిగా గుడికి వచ్చిన రోహిత్‌ను, పిలిచి శాస్త్రిగారు “రోహిత్, మన గుడిలో ఈ రోజు ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. అవి విని ఇంటికి చేరుకో. నీకు శుభం కలుగుతుంది” అన్నాడు వాత్సల్యంగా.

“అలాగే స్వామీ” అని రోహిత్ శాస్త్రి గారికి నమస్కరించి, ఆయన ఆశీర్వాదం తీసుకొని గుడి వెలుపల, ఒక మండపం వద్ద జరుగుతూ ఉన్న పురాణ ప్రవచనం జరిగే ప్రదేశానికి చేరుకొని, ఒక కుర్చీలో కూర్చున్నాడు. జగన్నాథం గారు కాసేపటికి పురాణ ప్రవచనం ప్రారంభించి, ‘నవగ్రహ స్తోత్ర విధానాన్ని, నవగ్రహాలను ఎలా పూజించాలి’ మొదలైన అంశాల గురించి, భక్తులకు వివరించసాగాడు. రోహిత్ ముందు వరుసలో కూర్చుని శ్రద్ధగా ఆ పురాణ ప్రవచనం విని, అది పూర్తయ్యాక రూం చేరుకొన్నాడు. అప్పటికే అతని రూమ్మేట్ ముకుందం వంట పూర్తి చేసి ఉన్నాడు.

ముకుందం, రోహిత్ ఒకే ఊరివాళ్ళు. ముకుందం నగరంలోని ఒక కోచింగ్ సెంటర్లో చేరి, పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. నిరుద్యోగైన ముకుందాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రోహితే రూం రెంట్ చెల్లిస్తూ ఉంటాడు. కొన్నాళ్లు హోటళ్లలో, మెస్‌లో భోంచేసి, ఆ భోజనం పడక ఇబ్బంది పడ్డారు వారు. ముకుందానికి వంట వచ్చు. వారిద్దరికీ కావలసిన అన్నమూ, కూరలూ కోచింగ్ నుండి తిరిగొచ్చి ముకుందమే చేస్తూ ఉంటాడు.

***

శ్రీకృష్ణా ఐ బ్యాంక్ లోకి అడుగుపెట్టాడు రోహిత్. ఒక డాక్టరు స్థాపించిన స్వచ్ఛంద సంస్థ అది. నేత్ర దాతల నుండి, వారి మరణం తరువాత నేత్రాలు సేకరించి భద్రపరిచే సంస్థది. ఆ బ్యాంక్‌లో రిజిస్టరు చేసుకొన్న వారికి వారి అర్హత, సీనియారిటీ బట్టి, కళ్లు అమర్చబడుతాయి. కానీ ‘ఐ డొనేషన్’ చేసే వారి సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ఎక్కువ మంది అంధులు నిరాశతోనే కాలం గడుపుతూ ఉంటారు.

రోహిత్ ఆ నగరంలోని అంధుల సమాఖ్య సెక్రెటరీ కూడా, అప్పుడప్పుడూ అంధులతో సంగీత విభావరీ, పాటల పోటీలు రక్తదానం, క్రీడలు వంటివి నిర్వహిస్తూ ఉంటుందా సమాఖ్య. అప్పుడప్పుడూ ఐ బ్యాంక్ కు కూడా వెళ్లి, నేత్రదానాల గురించి తెలుసుకుంటాడు రోహిత్.

“మేడమ్, ఈ వారం రోజుల్లో ఏవైనా ఐ డొనేషన్స్ అందాయా? ” రిసెప్షన్లో ఉన్న మహిళనడిగాడు రోహిత్.

“లేదు రోహిత్, వచ్చిన అవకాశం పోగొట్టుకున్నావు. మళ్లీ నీకవకాశం ఎప్పుడు దొరకుతుందో” అందామె.

“నేను అడగడం నా కోసం కాదు మేడమ్, ఇంకా నా లాంటి వాళ్లు చాలా మంది మా సమాఖ్యలో ఉన్నారు. వారందరి కోసమే మిమ్మల్ని అప్పుడప్పుడూ ఎంక్వైరీ చేస్తూ ఉంటాను” అన్నాడు రోహిత్.

ఏడాది క్రితం ఐబ్యాంక్‌లో రోహిత్ రిజిస్టర్ చేసుకున్న సీనియారిటీ బట్టి అతనికి ఐడొనేషన్ పొందే అర్హత వచ్చింది. కానీ రోహిత్ ఆఖరి క్షణంలో ఆ అవకాశాన్ని మంగళ కోసం వదులుకున్నాడు.

యూనివర్సిటీలో క్లర్కు పోస్టుకు రోహిత్ ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు, ఇంకా ఆ పోస్టుకప్లై చేసిన ఐదుమంది అంధులు ఇంటర్వ్యూకు హారజయ్యారు. అందులో మంగళ ఒకరు. అన్ని పరీక్షలలో రోహిత్‌తో సమానంగా మార్కులు తెచ్చుకున్నా, మెమోరీ టెస్టులో రోహిత్ మంగళ కన్నా చాలా ఎక్కువ స్కోర్ చేయడంవల్ల ఉద్యోగం అతనికి దక్కింది. ఇంటర్వ్యూలో సెలక్ట్ కాని మంగళ నిరాశతో తన స్వస్థలం నెల్లూరుకు తన అన్నతో బాటు వెళ్లిపోయింది.

రోహిత్ అప్పుడప్పుడూ మంగళతో మాట్లాడి, ఆ అమ్మాయికి ధైర్యాన్ని, బ్రతుకు మీద ఆశనూ ఇచ్చేవాడు. మంగళకున్న అర్హతలూ, ఆమె మేధస్సుకూ మంచి ఉద్యోగం ఆమెకు దక్కుతుందన్న నమ్మకాన్ని కల్పించేవాడు. కానీ మంగళకు ఇంత వరకూ ఉద్యోగం రాలేదూ. పెళ్లి కాలేదు. మంగళ చూడచక్కని అమ్మాయి అని రోహిత్ విన్నాడు. కానీ ఉద్యోగం లేకపోవడమూ, ఆమె అంధురాలవడంతో ఆమెకు ఏ సంబంధమూ కుదరడం లేదు. ఆమె నిరాశతో వదినగారి సూటిపోటి మాటల మధ్య ఆమె అన్న భరత్ ఇంట్లో కాలం వెళ్లబుచ్చుతున్నది.

రోహిత్ ఐబ్యాంక్ వాళ్లు తనకు అమరుస్తామన్న డోనర్ కళ్లను మంగళ కమర్చమన్నాడు. తనకైనా ఉద్యోగమనే ఆసరా ఉంది. గుడ్డివాడైనా, ఎలాగోలా బతికేయ గలడు. కానీ ఏ ఆధారము లేని మంగళకు ఆ కళ్లు (చూపు) దక్కితే ఆమె జీవితం ఒక కొలిక్కి వస్తుందని అలా చేశాడతను.

ఆపరేషన్ తరువాత మంగళకు చూపు వచ్చింది. ఆమె రోహిత్‌కు వేన్నోళ్లా కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది. ఆరు నెలల తరువాత నెల్లూరులో జరిగిన ఆమె వివాహానికి రోహిత్ కూడా హాజరయ్యాడు.

***

“రోహిత్ నీకిప్పుడు నా లెక్క ప్రకారం కేతు దశనడుస్తూ ఉంది. జగన్నాథం గారి పురాణ ప్రచవనాలు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతాయి. నామాట విని ఆయన్ను ఒక సారి ఆయన ఇంటికి వెళ్లి కలిసి నీ బాధ చెప్పుకో, ఆయన మహాపండితుడు. కేతు దశలో ఉన్న వారిని వారి భక్తి పరిపక్వతను బట్టి భగవంతుడు కరుణిస్తాడు. జగన్నాథం గారు నీకు మార్గాంతరం చెప్పకపోడు” ఆ రోజు ఈశ్వరుడి దర్శనానికి వచ్చిన రోహిత్‌తో అన్నాడు పూజారి శంకరశాస్త్రి గారు.

శాస్త్రి గారి మాటల ప్రకారం రోహిత్ జగన్నాథం గారిని ఆయన ఇంటి వద్ద కలుసుకున్నాడు. రోజూ తన ప్రవచనాన్ని ముందువరుసలో కూర్చుని వినే రోహిత్‌పై అప్పటికే సదభిప్రాయం ఉంది జగన్నాథం గారికి.

“స్వామీ, నా లాంటి అంధులు ఎందరో నిరాశతో చీకటిలో మగ్గిపోతూ ఉన్నారు. నాకైనా ఉద్యోగం ఉంది. కొందరు ఎటువంటి ఆధారమూ లేక నిరాశా నిస్పృహలతో జీవితాన్ని భారంగా ఈడుస్తున్నారు. మరణానంతరం దయగల దాతలు తమ నేత్రాలను దానం చేసే అవకాశం ఉంది.

కానీ చాలామందిలో తాము కళ్లు దానం చేస్తే, మరుజన్మలో అంధులై పుడ్తామన్న అపోహ ఉంది. కొందరు దానం చేస్తామన్నా, వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. తమ వంటి మహానుభావులకు విన్నవించుకుంటే మాలాంటి వారికేదైనా ఉపశమనం లభిస్తుందని, అందరి తరఫునా, నేనిక్కడికి వచ్చాను” అన్నాడు రోహిత్.

సానుభూతితో రోహిత్ చెప్పిందంతా విన్నాడు జగన్నాథం గారు. రోహిత్ జాతకాన్ని పరిశీలించి, “బాబూ, నీవిప్పుడు కేతువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఈ కేతు మహర్దశలో గ్రహశాంతి చేయాలి. ప్రతి మంగళవారం ఉలవలు దానం చేసి కేతుగ్రహ జపమూ, సోత్రమూ చేయి” అని కేతుగ్రహ అష్టోత్తరాన్ని ఒక కాగితంలో రాసిచ్చి, “నీ బాధ, నీ తోటివారి బాధా నాకర్థమైంది. నేను చేయగలిగింది చేస్తాను” అని రోహిత్ ను ఆశీర్వదించి పంపివేశాడు జగన్నాథం గారు.

ఆ రోజు సాయంత్రం జగన్నాథం గారి పురాణ ప్రవచనం ప్రారంభమైంది. ముందు వరుసలో కూర్చుని వింటున్నాడు రోహిత్.

“భగవంతుడు మనకు ప్రసాదించిన మానవ జన్మ ఉత్కృష్ఠమైనది. ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనకు వీలైనంతగా పరోపకారం చేయాలి. మానవ సేవే మాధవ సేవ. అందుకే మనకు ఆరోగ్యం సహకరించినపుడే తోటి మానవులకు ఉపకారమూ, దాన ధర్మాలు చేయాలి. దానాలన్నింటిలో ఉత్తమమైనది అవయవదానం. మన మరణానంతరం మన ద్వారా మరొకరికి మన అవయవాలు అమర్చబడి వారికి పునరుజ్జీవం కలిగిందంటే అంతకన్నా మనకు కావలసినది వేరొకటి ఉండదు. భగవంతుడిపై మనకు గల భక్తి విశ్వాసాలు ఈ విధంగా ఋజువౌతాయి.

అవయవదానం గురించి మన పురాణల్లోనూ ఉదాహరణలున్నాయి. ఒక గజరాజు మరణానంతరం, తన శిరస్సు వినాయకుడికి అమర్చబడడం వల్ల విశ్వవిఖ్యాతి గాంచాడు. శిబి చక్రవర్తి తన తొడ ఎముకనూ, కర్ణుడు కవచకుండలాలను దానం చేసి చరిత్రలో అమరులుగా నిలిచిపోయారు.

భక్త కన్నప్ప తన కంటిని శివుడికి దారబోయడంతో, చిరస్మరణీయుడైనాడు. మనం మరణానంతరమే మన అవయవాలను దానం చేస్తున్నాము. ఈ దానం వలన ఆ వ్యక్తికి ఉత్తమగతి లభిస్తుంది. వారి వారసులకూ చిరకాల కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

‘సర్వాంగానాం నయనం ప్రధానం’ అన్నారు. అట్టి కళ్లను మన మరణానంతరం దానమిస్తే, భగవంతుడు అట్టివారి భక్తికి మెచ్చి ముక్తి ప్రసాదిస్తాడు. వారికీ, వారి వారసులకు కేతు అనుగ్రహం లభిస్తుంది. కళ్లు దానం చేస్తే మరుజన్మలో గుడ్డివారుగా పుడ్తారనుకోవడం వట్టి అపోహ” అంటూ జగన్నాథం గారు సోదాహరణంగా వివరిస్తూ ఉంటే భక్తులందరూ మంత్రముగ్ధుల్లా విన్నారు. పురాణ ప్రవచనం సాంతం విని రోహిత్ తన గదికి చేరుకున్నాడు.

జగన్నాథం గారు చెప్పినట్లు కేతుగ్రహ స్తోత్రంతో నిత్యం రాహుకేతుపూజ నలభైరోజుల నుండీ చేస్తున్నాడు రోహిత్. శంకరశాస్త్రిగారు కాలసర్పదోష నివారణ కోసం రోహిత్‌తో కొన్ని పూజలు గ్రహ శాంతీ చేయించాడు. రోజు ఈశ్వరుని ఆరాధించాక,

రాహుకేతు ప్రదక్షిణ చేశాకే, ఆఫీసుకు చేరుకుంటూ ఉన్నాడు రోహిత్.

ఆ రోజు సాయంత్రం రోహిత్ గుడి నుండి తిరిగి వస్తూవుంటే ఐబ్యాంక్ నుండి ఫోన్ వచ్చింది.

“కంగ్రాట్స్ రోహిత్ గారు, ఈ మధ్య మనవారికి అవయవదానం గురించి బాగా అవగాహన కలిగినట్లుంది. నెలరోజుల వ్యవధిలో పద్నాలుగుమంది తమ కళ్లను దానం చేశారు. వారిలో వృద్ధాప్యంతో ముగ్గురు మరణిస్తే, యాక్సిడెంట్లో ఒకరు మరణించారు. ఇప్పటికి మూడు నాలుగు రోజుల్లో మీకు ఆపరేషనకు ఏర్పాట్లు చేసుకోండి” ఆనందంగా చెప్పింది ఆ రిసెప్షనిస్టు.

రోహిత్ ఆనదానికి అంతు లేకుండా పోయింది. తిరిగి గుడికి వెళ్లి ముందుగా శంకరశాస్త్రి గారి చెవిలో ఈ విషయం వేశాడు.

“చాలా సంతోషం నాయనా, నువ్వు ఇన్నాళ్లూ చేసిన పూజలు ఫలించాయి. నీకా సర్వేశ్వరుని అనుగ్రహం లభించింది. నిన్నా కేతుమూర్తి చల్లగా చూశాడు. విజయీభవ” అని ఆశీర్వదించాడు శంకరశాస్త్రిగారు. జగన్నాథం గారింటికి వెళ్లి కూడా ఆ వార్త చెప్పి, ఆయన దీవెనలు అందుకున్నాడు రోహిత్.

“సార్, ప్రబోధాత్మకమైన మీ బోధనలు వినే, అంతవరకూ సంశయంలో ఉన్న చాలామంది నేత్ర దానానికి పూనుకొన్నారు. మీ విశిష్ట వ్యక్తిత్వమూ, ప్రజలకు మీ పట్ల విశ్వాసమే అందుకు కారణం” అన్నాడు రోహిత్. జగన్నాథం గారు నవ్వి “నాయనా, అంతా భగవత్సంకల్పం. నేను ప్రజల్లో ఉన్న కొన్ని మూఢవిశ్వాసాలను పోగొట్టడానికి ప్రయత్నించానంతే. నీకు కేతు మహర్దశ నడుస్తూ ఉంది. కేతువును భక్తితో కొలిచినవారికి శుభసంతోషాలు కలిగిస్తాడు. నీ విషయంలో జరిగిందదే. కళ్లు లేక పోయినా, నీకు జ్ఞాననేత్రం ఉంది. దానితోనే భగవంతుని దర్శించి, ఆరాధించి ఆయన కృపకు పాత్రుడయ్యావు” అన్నారు వాత్సల్యంతో.

Exit mobile version