Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-41

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

హైదరాబాద్.. టు.. పాలకొల్లు..!!

[dropcap]ప్ర[/dropcap]యాణం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరమే! ప్రయాణం లేకుండా జీవితం లేనే లేదు. అందరూ ఒకేచోట ఉండడం అన్నది ఈ రోజుల్లో జరగని పని, అదే విధంగా ఇల్లు ఉన్నచోటనే విద్యాభ్యాసం చేయడం అనేది అందరికీ కుదరని పని. ఉన్నవూళ్ళోనే ఉద్యోగం చేయడం ఏ కొద్దిమందికో సాధ్యం, అలాగే పుట్టిన ఊరిలోనే పెళ్లి సంబంధాలు కుదరాలనుకోవడమూ మూర్ఖత్వమే! ఈ నేపథ్యంలో ప్రయాణం అనేది తప్పనిసరి. అది సైకిలు ప్రయాణం కావచ్చు, మోటార్ బైక్ కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, రైలు ప్రయాణం కావచ్చు,లేదా విమాన ప్రయాణం అయినా కావచ్చును.

దగ్గరి ప్రయాణాల గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు కానీ, దూరం ప్రయాణాల విషయం వచ్చేసరికి కొన్ని అనుభావాలు మూట కట్టుకునే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇతరులతో కలసి ప్రయాణం చేయడం, టూరిస్టులుగా గుంపులు గుంపులుగా తిరగడం, రైళ్లలో ఇతరులతో కలసి ప్రయాణం చేయడం వంటివి జరిగినప్పుడు సహజంగా కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. ఇంచుమించు అందరికీ ఏదో రూపంలో రకరకాల అనుభవాలు ఉంటాయి. కొందరు వాటిని పెద్దగా పట్టించుకొనకపోయినా.. అనుభవం తాలూకు పరిస్థితిని బట్టి, అవి మనసులో గూడు కట్టుకుని వుండి పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా విద్యార్థి దశలోనూ, బ్రహ్మచారిగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడూ, అంటే యవ్వన కాలంలో ఎదురైన అనుభవాలు వింతగానూ, గుర్తుండి పోయే విధంగానూ కలకాలం నిలిచిపోతాయి.

యవ్వనం అంటేనే విద్యార్థి దశ (చదువుకునే వాళ్లకు) ఆ కాలంలో వయసుపెట్టే అల్లరి అంతా ఇంతా కాదు, దానిని తట్టుకుని ముందుకు సాగేవాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, వాటిని అదుపు చేసుకోలేని వాళ్లకు ఎదురయ్యేవి ఇబ్బందులే!

నా విద్యార్థి దశ నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ, కొన్ని అనుభవాలను నాకు మూట కట్టి పెట్టింది. అందులో ఒక అనుభవాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. నేను వృత్తి విద్యాకోర్సు చదివింది హైదరాబాద్. కొన్నాళ్ళు అద్దె గదిలో, మిగతా కాలం అంతా ఉస్మానియా మెడికల్ కాలేజీ మెయిన్ హాస్టల్‌లో ఉండేవాడిని. ఎప్పుడైనా సెలవులకి ఇంటికి (దిండి, తూ.గో.జి) వెళ్ళడానికి అనువైన రైలుబండి, హైదరాబాద్ – నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ఉండేది. అప్పుడు ఆ రైలు వయా కాజీపేట మీదుగా మాత్రమే వెళ్ళేది. ఆ రైలు ఇప్పుడు వయా నడికూడి – గుంటూరు మీదుగా వెళుతున్నది.

ఈ రైలులో తొంబై శాతం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రయాణికులే ఉండేవారు. స్వంత జనంతో ప్రయాణం చేస్తున్న భావన కలిగేది. ఆ భాష యాస వినసొంపుగా ఉండేది. పబ్లిక్ హాలీడేస్ వున్నప్పుడు కాలేజీ నుండి రైల్వే కన్సెషన్ ఇచ్చేవారు. చాలా తక్కువ రుసుము చెల్లించి ప్రయాణం చేసే వెసులుబాటు విద్యార్థులకు ఉండేది. అందుచేత ఆ సదుపాయాన్ని తప్పకుండా నేను సద్వినియోగం చేసుకునేవాడిని. నాలాంటి వాళ్ళు చాలామంది ఉండేవారు. పండుగల సీజన్లలో రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం విద్యార్థుల క్యూ లే పెద్దగా ఉండేవి. ఆ ప్రయాణం చాలా సరదాగా సాగిపోయేది.

నరసాపూర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్

ఒక సంవత్సరం, సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. నాకు తోడుగా పెద్దన్నయ్య మీనన్ దగ్గర ఉద్యోగాన్వేషణలో వున్నదగ్గరి బంధువు రమేష్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. నాకేంటి కొద్దీ సంవత్సరాలు పెద్దవాడు అతను. ఆయన భీమవరంలో దిగాలి, నేను నరసాపురంలో దిగాలి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేయవచ్చునని ఇద్దరం అలా ప్లాన్ చేసుకున్నాం. ఇద్దరం నాంపల్లి రైల్వే స్టేషన్లో కలిసాం. ప్లాటుఫారం పైకి బండి రాగానే మా కంపార్ట్మెంట్ వెతుక్కుని బండి ఎక్కాము. చాలామటుకు బెర్తులు ఖాళీగానే వున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయింది. అందరూ లగేజి సర్దుకోవడంలో నిమగ్నమై పోయారు. క్రమంగా మాతోపాటు అందరూ కబుర్లలో పడిపోయారు. బండి ఇంచుమించు కాజీపేట స్టేషన్ దాటేవరకూ చాలా మంది కబుర్లు చెప్పుకుంటూనే వున్నారు. కొద్దిమంది సికింద్రాబాద్ లోనే దుప్పటి ముసుగేసారు. నా బెర్తు విండో సైడు వచ్చింది. ఇప్పటి మాదిరి గా కాక, పైవరుస బెర్తులు వరుసగా ఉండేవి. అంటే బెర్తుకీ, బెర్తుకీ మధ్య అడ్డు ఉండేది కాదు. వంచిన రాడ్ మాదిరిగా చిన్న అడ్డు ఉండేది. తలకి- తల, కాళ్ళకి -కాళ్ళు తగిలే విధంగా ఉండేవి. ప్రైవసీ ఉండేది కాదు. నాకు పైన బెర్తు వచ్చింది కాబట్టి, నాకు కేటాయించిన బెర్తు చూసుకుని దానిమీద దుప్పటి పరుచుకున్నాను. నా బెర్త్‌కు ఆనుకుని వున్న బెర్తు ఖాళీగా వుంది. అప్పటికి ఎవరూ దానిని ఆక్రమించలేదు. నేను మామూలుగా బెర్తు పైకి ఎక్కి పడుకున్నాను. రైలు వేగం పుంజుకుంది. ఎన్నెన్నో చిన్నస్టేషన్లు దాటుకుంటూ వెళ్లి పోతున్నది. రమేష్ నిద్రపోయి చాలా సేపు అయింది. నేను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాను. బండి విజయవాడ దాటిన తర్వాత ఒక వింత స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఎవరో నా అరికాళ్ళు గీకి కితకితలు పెడుతున్నారు. వింతగా అనిపించింది, కలలో నేను కూడా వాళ్ళ అరికాలు మీద మెల్లగా గ్రీకు తున్నాను. అది అలా చాలాసేపు కొనసాగింది. ఈ లోగా కల చెదిరి కళ్ళు తెరిచాను. ఆశ్చర్యం అది కల కాదు, నిజమే! నా ఎదురు బెర్తులో ఒక పడుచు అమ్మాయి నా కాళ్ళ వైపు కాళ్ళు పెట్టుకుని పడుకుంది. పదహారేళ్ళకు పైమాటే మరి!

అప్పటి నాఫొటో

నాకు మెలుకువ వచ్చిన సంగతి ఆమె గమనించలేదు. ఆమె నా అరికాళ్లను, తన కాలి గోళ్ళతో అదే పనిగా గీకుతూనే వుంది. నేను ఆపినా ఆమె అలా గీకుతూనే వుంది. నాకు అప్పుడు ఆ దైర్యం ఎలావచ్చిందో గానీ నేను కూడా గీకుడు రిప్లై ఇవ్వడం మొదలు పెట్టాను. ఆమె అలా కొనసాగిస్తూనే వుంది. చాలా సేపు అలా ఇరుపక్షాల నుండి కొనసాగింది. క్రింది బెర్తు మీద వున్న రమేష్‌తో ఈ విషయం చెబుదామని లేచి కూర్చున్నాను. ఆమె కాస్త తత్తరపాటు పడి దుప్పటి ముసుగు వేసుకుంది. నేను క్రిందికి దిగి ఈ విషయం వింతగా రమేష్ చెవిలో ఊదాను. ఈ ఉదంతం అతగాడిని కాస్త ఉత్సాహ పరచినట్టు వుంది, తాను నా బెర్తు మీదికి వెళతానన్నాడు. అలాగే నా బెర్తు పైకి ఎక్కి పడుకున్నాడు. ఈ విషయం గమనించిన ఆ అమ్మాయి గమ్మున బెర్త్ దిగిపోయి ఆమెతో పాటు ప్రయాణం చేస్తున్న బంధువుల బెర్త్ మీద షాల్ కప్పుకుని కూచుంది. మా మహానుభావుడు నిరుత్సాహంగా క్రిందికి దిగివచ్చాడు. ఆ తర్వాత మాకు నిద్ర పట్టలేదు. కబుర్లలో పడిపోయాం. ఆ అమ్మాయి అసలు మా వైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది తలచుకుంటేనే, ఒళ్లు గగుర్పొడుస్తుంది. అంత దైర్యం ఎలా వచ్చిందో ఇప్పటికీ ఆశ్చర్యమే! ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. అసలు ఆ అమ్మాయి కూడా అలా చేయడం ఆమె ధైర్యానికి జోహార్లు చెప్పవలసిందే. బహుశః యుక్త వయస్సు అందరికీ ఒకేలా ఉంటుందేమో, ఆడ – మగ తేడా లేకుండా. ఇప్పుడు నా పిల్లలకు పెళ్లిళ్లు అయి వాళ్లకు సంతానం కలిగి, వృద్దాప్యం వైపు పరుగులెడుతున్న ఈ నా వయస్సులో మళ్ళీ ఇలాంటివి గుర్తు చేసుకోవడం గమ్మత్తుగానే ఉంటుంది. కొన్ని అలా గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది అంతే!

ఆ తర్వాత భీమవరం స్టేషన్లో నా బంధువు దిగి పోయాడు. తర్వాత పాలకొల్లు రాగానే, ఆ అమ్మాయి నా పక్కనుండి నవ్వుకుంటూ ట్రైన్ దిగింది. నేను కూడా జరిగిన అనుభవానికి మనసులో నవ్వుకున్నాను. కొన్ని దురదృష్టకర సంఘటనలు ఈ రూపంలోనే జరుగుతాయేమో!

ఇక్కడ ఆ అమ్మాయిది ఎంత తప్పో, నాది కూడా అంటే తప్పు! కానీ తప్పొప్పులను బేరీజు వేసే వయసు కాదది. ఏమైనా ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే! నా మనసు పరి పరి విధాలా ఆలోచిస్తున్న సమయంలో నేను దిగవలసిన స్టేషన్ నరసాపురం రానే వచ్చింది. సూట్‌కేసు తీసుకుని రైలు దిగేసరికి తమ్ముడు ఆశీర్వాదం (పిన్ని కొడుకు, సరిపల్లి) కంపార్ట్మెంట్ ఎగ్జిట్ దగ్గర నవ్వుతూ నిలబడ్డాడు. ఇంటికి వెళ్లేముందు పిన్నిని చూసి వెళ్లడం అప్పుడు ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు అక్కడ పిన్ని లేదు, పిన్నికొడుకు కూడా లేడు!

బ్రదర్ ఆశీర్వాదం, సరిపల్లి.

ఈ ఉదంతం సుమారుగా నలభై అయిదేళ్ల నాటిది. ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంటుంది. నా లాగా ఎందరో..!!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version