కుజ గ్రహంపై జీవం, నీరు ఉండే అవకాశం ఉందా? అంగారక గ్రహం మానవ ఆవాస యోగ్యమైన ఇంకో గ్రహం అవుతుందా? అనేది తెలుసుకునేందుకు నాసా పరిశోధనలు చేస్తూ మార్స్ పైకి Perseverance Rover ని పంపింది.
ఈ రోవర్ విజయవంతంగా అంగారకుడి ఉపరితలంపై దిగినట్టు నాసా శాస్త్రవేత్త, భారతీయ సంతతికి చెందిన స్వాతి మోహన్ ప్రకటించారు.
ఈ చారిత్రాత్మక మిషన్‌లో ఉన్న శాస్త్రవేత్తలో బృందంలో స్వాతి మోహన్ కీలకంగా వ్యవహరించారు.
రోవర్ లాండింగ్ వ్యవస్థకు, యాటిట్యూడ్ కంట్రోల్ సిస్టమ్‌కు స్వాతి నేతృత్వం వహించారు. రోవర్ సరైన దిశలో నడించేందుకు యాటిట్యూడ్ కంట్రోల్ సిస్టమ్ చాలా కీలకమైనది.
తనకు ఒక ఏడాది వయసుండగా స్వాతి తల్లిదండ్రులు అమెరికాకి వలస వచ్చారు. తొమ్మిదేళ్ళ వయసులో స్టార్ ట్రెక్ కార్యక్రమం చూసి అంతరిక్ష శాస్త్రవేత్త అవ్వాలనుకున్నారు. ఎరోనాటిక్స్‌లో ఎంఎస్ చేశారు. ఎం.ఐ.టి నుండి పిహెచ్‌డి అందుకున్నారు.
బొట్టు పెట్టుకున్నందుకు ఇతర భారతీయ మహిళలు వేధింపులకు, దూషణలకు గురైన చోట… నుదుటన బొట్టుతో, హృదయంలో భారతీయతతో స్వాతి మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి రోవర్ విజయాన్ని సగర్వంగా ప్రకటించారు.
స్వాతి మోహన్‍కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈనాడు స్వాతి మోహన్ పేరు ప్రతి భారతీయుడి పెదవులు గరంగా పలుకుతున్నాయి. కానీ, ఇదే స్వాతి మోహన్ భారతదేశంలోనే వుండివుంటే ఈ స్థాయిలో వుండివుండేదా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సివుంటుంది. ఒకవేళ వుండదు అన్న సమాధానం వస్తే, ఎందుకని వుండదు? ఎందుకని మన దేశంలో మన యువతకు మనం వారి తెలివిని ప్రదర్శించేందుకు అనువయిన పరిస్థితులను కల్పించలేకపోతున్నాం? అక్కడి వ్యవస్థలోని ఏ అంశం ఇక్కడ అనామకులుగా మిగిలిపోయేవారిని అత్యున్నత స్థానాలలో నిలుపుతోంది? అని ఆలోచించాల్సివుంటుంది.
2009 సంవత్సరంలో నోబెల్ బహుమతి గ్రహీత వెంకి రామకృష్ణన్ భారతీయ పౌరసత్వం వదలుకున్నాడు. భారతదేశంలో అతనికి బహుమతి వచ్చిందని సంబరాలు చేసుకుంటూంటే ఆశ్చర్యము, అసహనము ప్రదర్శించాడు. అతని జీవితం గమనిస్తే, భౌతిక శాస్త్రం చదివి, ఒక స్థాయికి వచ్చాక, తనకు భౌతిక శాస్త్రంపై ఆసక్తిలేదని గ్రహించి స్త్రక్చరల్ బయాలజీ వైపు మళ్ళాడు. రైబోజోంల పరిశోధనలో నోబెల్ బహుమతి పొందాడు. అలాంటి వాతావరణం మన వ్యవస్థలో వుందా? తనకే అంశంపై ఆసక్తి వుందో తెలుసుకునేలోగా వ్యక్తి చట్రంలో బిగుసుకుపోతాడు. దారులు మూసుకుపోతాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక స్వాతి మోహన్, ఒక వెంకి రామకృష్ణన్లను చూసి మనం గర్వించాలా? మనలోకి మనం చూసుకుని ఆలోచించాలా? కనీసం భవిష్యత్తు తరాలలో స్వాతి మోహన్‌లు, వెంకి రామకృష్ణన్‌లు ఇతరదేశాలలో కాదు స్వదేశంలోనే తమ ప్రతిభను ప్రదర్శించే వాతావరణాన్ని కల్పించేందుకు ఇకనైనా నడుం బిగించే అవసరాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తాము?
ఆ బిందీలో భారతీయ హృదయాన్ని చూసి గర్వించటంతో పాటూ, మన భవిష్యత్తు తరాల నుదిటి రాతలను మార్చే ఆలోచనలనూ చేదామా???