రామం భజే శ్యామలం-28

2
2

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]మ[/dropcap]న దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. మన చరిత్ర గురించి మనవాళ్లెవరు చెప్పినా అది తప్పే.. మూఢనమ్మకమే.. కానీ.. ఎవడో బీబీసీవాడో వచ్చి చెప్తే సూపర్ అని వాడికి పొర్లుదండాలు పెడతాం. ఈ చిత్తభ్రమల నుంచి మనకు మనం బయటకు రావాల్సిందే. లేకుంటే అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు.. గ్రామాలు, పట్టణాలు.. కులాలు, వృత్తులు.. జాతి, మతం.. దేశం, ఖండం వంటి పనికిమాలినవాటి చుట్టూ గానుగెద్దులాగా తిరుగుతుంటాం. చరిత్ర ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది. వాస్తవ చరిత్ర ఏమిటన్నది మనకు తెలియకుండా శతాబ్దాలనుంచి దాచిపెట్టారు. ధ్వంసం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా మనల్ని మనం ఇంకా యురోపియన్ కంటినుంచే చూస్తున్నాం. మనకు కనిపిస్తున్న మనం.. మనం కాదు మొర్రో అన్నా.. వినిపించుకొనే పరిస్థితి లేదు. పైగా మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటారు. దీని మూలాల్లోకి అన్వేషణచేస్తే తప్ప మనం కోల్పోయిన దాంట్లో కొంతైనా తిరిగి తెచ్చుకోలేం. అప్పుడే ఈ తరానికి వాస్తవ చరిత్రను అందించగలం.

భారతదేశ చరిత్ర అంటే మన పూర్వికుల చరిత్రే. దీన్ని తెలుసుకోవడం అన్నది అత్యంత అవసరం. దీని లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ చాలా ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. పదే పదే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రస్తావనకు వస్తున్నది. ఈ ఒక్క సిద్ధాంతం భారత నాగరికత, భాష, సంస్కృతులపై తీవ్రమైన ప్రభావం చూపించింది. మన చరిత్రలోని విధ్వంస రచనకు పూర్తిగా ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమే కేంద్రబిందువుగా మారిపోయింది. కొందరు మతఛాందసవాదులైన యురోపియన్ చరిత్రకారుల పుణ్యమా అని.. భారతదేశమే కాదు.. యావత్ ప్రపంచ చరిత్రే ఒక పరిమిత కాలచక్రంలోకి కుంచించుకుపోయింది. అంతా ఊహాపోహలపైనే రచించిన చరిత్ర నిర్మాణమిది.

ఒక్కసారి ఇవాల్టి ప్రపంచ నాగరికతను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే.. భారతదేశ నాగరికత తూర్పున చైనా, కొరియా, జపాన్ దేశాలను చాలావరకు ప్రభావితం చేసింది. అది మనకు ఇవాల్టికీ స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రతిదేశంలోనూ ఏదోరూపంలో భారతీయ సంస్కృతి మూలాలను చూడవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దాటి మాత్రం మన నాగరికత ఆనవాళ్లు ప్రస్తుతం కనిపించవు. కానీ భాషాపరమైన చాలా దగ్గరి అనుబంధం స్పష్టంగానే కనిపిస్తుంది. ఈ అనుబంధాన్ని యురోపియన్లు తమ ఉనికికి అనుకూలంగా మలచుకొన్నారు. ఇందుకోసమే కొలోనియల్ ఇండాలజీ సృష్టి జరిగింది. మన చరిత్ర వినాశనానికీ కారణం ఇదే అయింది. దీన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.

మనం ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం (ఏఐటీ) గురించి కొంతమేరకే అధ్యయనం చేశాం. కానీ దాని వెనుక చాలా పెద్ద కథే ఉన్నది. యురోపియన్లు తమ అస్తిత్వాన్ని అన్వేషించడంలో భాగంగా.. తమ ఉనికిని మరింత ప్రాచీనం చేసుకోవడంలో భాగంగా మన చరిత్రను తిరగరాశారు. మనల్ని మూఢవిశ్వాసులు, చాందసులు అని తెగిడేవారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. ఇవాళ మనం చదువుతున్న చరిత్ర అంతా కూడా ఈ మూఢ విశ్వాసం.. మత చాందసం ప్రాతిపదికపైనే సాగిందన్నది గ్రహించాలి.

భారతదేశ ప్రాచీన చరిత్ర గురించి చదువుకున్నవారికి విలియం జోన్స్ కొంతమేరకు పరిచయమయ్యే ఉంటాడు. ఆసియా సమాజపు ఆనుపానులు కనుక్కోవడానికి వచ్చిన చరిత్రకారుడు ఈ విలియమ్ జోన్స్. భారతదేశంలో ఇతనికి ముందుగా గ్రీకు, సంస్కృతం, లాటిన్ భాషల్లో ఒకేరకమైన మూలం ఉన్నట్టుగా గోచరించింది. ఈ భాషల మధ్య సారూప్యత ఏమిటన్నది జోన్స్‌కి ముందుగా అర్థంకాలేదు. కానీ.. ఆర్యులకు ఈ సంస్కృతంతో సంబంధం ఉందని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే.. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో అనేకమార్లు ఈ ఆర్య శబ్దం ధ్వనిస్తూ వచ్చింది. పెద్దవాళ్లను, గొప్పవాళ్లను.. సంబోధించిన సందర్భంలో ‘ఆర్య’ అన్న మాట వినియోగం సర్వసాధారణం. దీని అర్థం ఏమిటన్నది తెలియని జోన్స్.. ఆర్యులు అనే ఒక జాతి ఈ దేశంలో విడిగా ఉన్నట్టు భావించాడు. జోన్స్ మెదడులో పుట్టుకొచ్చిన ఆలోచనను ఆ తర్వాత మాక్స్‌ముల్లర్ తదితరులు ముందుకు తీసుకొనివెళ్లారు. మన చరిత్రకు కాలపరిమితి విధించిన మత చాందసుడు కూడా ఈ విలియం జోన్సే. భారతదేశ చరిత్రను రాయడానికి పూనుకున్నప్పుడే.. మన పురాణాలకు సంబంధించిన మౌలికమైన కాల పరిణామాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే.. విలియం జోన్స్ పురాణాలను చదువుతున్నప్పుడు.. వాటిని పరిశోధిస్తున్నప్పుడు వాటి కాలపరిణామం క్రీస్తుపూర్వం ఐదువేల ఏండ్లకు పైగా విస్తరించిపోయింది. కానీ.. ఇతను ఏంజిలికన్ చర్చికి విధేయుడైన మతచాందసవాది. చర్చి సిద్ధాంతం ప్రకారం క్రీస్తుపూర్వం 4,004లో దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. అప్పట్లో ప్రతి ఒక్క ఇంగ్లీష్‌వాడు.. నోవా ప్రళయం ద్వారా క్రీస్తుపూర్వం 3000లో దేవుడు ప్రపంచాన్ని నాశనం చేశాడని నమ్మాడు. కాబట్టి.. చరిత్ర ఏదైనా ఉందంటే.. క్రీస్తుపూర్వం నాలుగువేలకు లోపే ఉండాలని ఇలాంటి చాందసవాదుల బలమైన నమ్మకం. దీంతో భారతీయ వేదాలలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో పేర్కొన్న కాల నిర్ణయం అంతా తప్పుల తడకగా తేల్చారు. ‘మీరు రాసిందంతా తప్పులే.. మీకు చరిత్ర రాసుకోవడం చేతకాలేదు. ఈ తప్పులన్నీ సరిచేయడం ఇప్పుడు మాకు పెద్ద తలనొప్పే అయినప్పటికిన్నీ.. మీమీద ప్రేమతో.. చరిత్రను రాసుకోలేని మీ అసమర్థతపైన జాలితో మీరు చేసిన తప్పులన్నింటినీ సరిచేసి సరికొత్త భారత చరిత్రను రాసేస్తాం. ఇకపై ఇదే మీ చరిత్ర..’ అంటూ.. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరానికి ముందుకు చరిత్రనంతా పట్టుకొచ్చిపెట్టారు. మన పురాణాల్లో పేర్కొన్న కొన్ని తేదీలను ర్యాండమ్‌గా డిసైడ్‌చేశారు. మన టైమ్లైన్‌లో ఐదువేల పూర్వం ఉన్న చరిత్రనంతా క్రీస్తుపూర్వం 1600కు తరువాత తీసుకొచ్చి అక్కడి కాలచక్రంలో ఇరికించారు.

మన చరిత్ర విధ్వంసకుల్లో మరొకడు బెంట్లీ.. ఇతను ఒక మిషనరీ. భారతదేశ ఆస్ట్రానమీని తీవ్రంగా నిరసించినవాడు. భారత దేశ చరిత్రను చాలా పాతదని చెప్పుకోవడానికి భారతదేశ పుస్తకాలన్నీ అడ్డగోలుగా మార్చారంటూ సూత్రీకరించాడు. ఇప్పటికీ.. మనవాళ్లలో కొందరు ఇదే పిచ్చి ప్రేలాపన చేస్తుంటారు.

మరొకడు మాక్స్‌ముల్లర్ అందరికీ తెలిసినవాడే. మన వేదాలకు తనదైన భాష్యం చెప్పినవాడు. ఇంతకుముందు వ్యాసాల్లో చెప్పినట్టే.. ఇతను ఆర్యులను ఒక జాతిగా చెప్పుకొంటూ వచ్చాడు. ఆ తర్వాత మాటమార్చి.. ఆర్యులను ఒక భాష మాట్లాడే వారు అని మాత్రమే పరిగణించాలి అన్నాడు. ఇవాళ్టికీ మనలో కొందరు ఇదే వితండాన్ని చేస్తుంటారు.

హార్బర్ట్ రిస్లే అని ఇంకొకడు ఉన్నాడు. ఇతను ఆంత్రోపాలజిస్టు.. 1901లో మనదేశంలో జనాభా లెక్కల అధికారిగా ఉన్నాడు. భారత సమాజాన్ని సామాజికంగా విడగొట్టి.. మనుషులను సంపూర్ణంగా విభజించిన మహానుభావుడు ఇతడే. ఇతను భారతదేశంలో మనుషుల ముక్కుల పొడవు, వెడల్పును బట్టి.. ప్రజలను జాతుల్లాగా వర్గీకరించాడు. ప్రపంచంలో ఇలాంటి విడ్డూరమైన వర్గీకరణ మరెక్కడా జరగలేదు. ఈ ‘ముక్కు’ మనుషుల దామాషా ప్రకారం ఒక్కో జాతికి ఒక్కో రంగును కల్పిస్తూ కలర్ కోడెడ్ ఇండియా మ్యాప్‌ను తయారుచేశాడు. మాక్స్‌ముల్లర్ తాను చెప్పింది తప్పని నెత్తీనోరూ బాదుకున్న ఆర్యుల సిద్ధాంతాన్ని హార్బర్ట్ మరోసారి ఖరారు చేశాడు. ఆర్యులను ఒక జాతిగా మరొక్కసారి సిద్ధాంతీకరించాడు. దీంతోపాటు ఇతను దేశంలో 2,378 కులాలను సృష్టించాడు.

మన దేశంలో కులము అనేమాట మొట్టమొదటిసారి ఈ హార్బర్ట్ అనే మహానుభావుడి నుంచి పుట్టుకొచ్చింది. మనదేశంలో అప్పటివరకు కులం అనే మాటే వినిపించింది కాదు. మొఘలుల కాలంలో కూడా ఈ మాట లేదు. వారు కూడా దీని గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. మన దేశంలో గ్రామం అనే భావన అత్యంత ఉదాత్తమైన నాగరికతకు ప్రతీకగా కనిపిస్తుంది. రామాయణంలోని బాల, అయోధ్యకాండల్లో ప్రజలమధ్య జీవనవిధానం ఏమిటో విస్తృతంగానే చర్చజరిగింది. ఇతర ఇతిహాసాల్లోనూ.. రచనల్లోనూ గ్రామానికి ఒక ప్రాధాన్యం ఉన్నది. గ్రామం అంటే ఎలా ఉంటుందన్నదానిపై మన వారికి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఒక గ్రామాన్ని పొందించేటప్పుడు (నిర్మించేటప్పుడు) 18 వృత్తులవారిని తీసుకొచ్చేవారట. (సంకేత పదకోశంలో ఈ 18 వృత్తుల గురించి వివరంగా చర్చించారు.) ఒక్కొక్కరు ఒక్కో వృత్తిలో నైపుణ్యం ఉన్నవారిని ఎంచుకొని గ్రామానికి తీసుకొచ్చి.. కొంత భూమిని వారికి కేటాయించి.. వారి జీవికకు అవసరమైన సదుపాయాలు కల్పించేవారు. వారు కమ్మరి కావచ్చు, వడ్రంగి కావచ్చు, కుమ్మరి కావచ్చు.. చాకలి, మంగలి, నేత, కాపు.. ఇలా అనేక వృత్తుల వారు కలిస్తేనే గ్రామం అయ్యేది. అక్కడ అందుబాటులో ఉన్న భూమిని దున్నుకోవడం.. వచ్చిన ధాన్యాన్ని ఈ వృత్తుల వారికి వారి వారి పనికి ఫలితంగా పంచివ్వడం జరిగేది. ఇక్కడ ఎవరి పని వారిది. భూమి మీద హక్కు, డాక్యుమెంట్ అన్న మాటే లేదు. ఉన్నభూమిని ఎవరు దున్నితే ఆ పంటను అంతా పంచుకొనేవారే. ఒకరిమీద ఒకరికి ఏనాడూ ఆధిపత్యం లేదు. ఒకరిపైన ఒకరు డిపెండెంట్లే. నాకు బట్టలు కావాలంటే టైలర్ కావాలి. కిచెన్‌లో పాత్రలు కావాలంటే కుమ్మరి కావాలి. తలుపులు కావాలంటే వడ్రంగి కావాలి. తిండిగింజలకు రైతు కావాలి. ఒకరికోసం ఒకరు జీవించడమే వారికి తెలిసింది. కరెన్సీ అన్నమాటే లేదు. నైపుణ్యాన్ని బట్టి పని తప్ప.. కుటుంబాన్ని బట్టి వృత్తి అన్న మాటే లేదు. కరువు కాటకాలు వచ్చి.. విపత్తులు సంభవించినప్పుడు గ్రామం అంతా తరలిపోయి మరోచోట గ్రామాన్ని ఏర్పాటుచేసుకొనేవారు. ఏ వృత్తివారు.. తరతరాలుగా ఆ వృత్తిని చేసుకొంటూ జీవించేవారు. ఇక్కడ హెచ్చుతగ్గులకు ఎలాంటి ఆస్కారం లేదు. అందరూ ఒకరికొకరు అన్నా, తమ్ముడు, మామ, తాత, అవ్వ అక్క, చెల్లి వదిన అని పిలుచుకోవడమే తప్ప వ్యత్యాసాలకు చోటులేని సమాజమది. ఇలాంటి సమాజంలో ఈ హార్బర్ట్ రిస్లే అనేవాడు కులం అన్న మాటను జొప్పించి దాన్ని అత్యంత దారుణంగా విచ్ఛిన్నం చేశాడు. ఇతను చేసిన మరో తీవ్రమైన ద్రోహం ఏమిటంటే.. తాను సృష్టించిన సదరు 2378 కులాలను గెజిట్‌లో ప్రచురించేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఆరోహణ క్రమంలో రాయకపోవడం. సాధారణంగా బ్రిటిష్ వారి పద్ధతి ప్రకారం గెజిట్ తయారీ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాస్తారు. కానీ హార్బర్ట్ రిస్లే మాత్రం ఫలానా కులం సమాజంలో పెద్దది.. ఫలానా కులం చిన్నది అంటూ.. ఒక క్రమాన్ని సృష్టించేశాడు. గెజిట్ క్రియేట్‌ చేశాడు. సమాజంలోని గౌరవమర్యాదలనేవి ఇతనికి అంతరాలుగా గోచరించాయి. ఇది భారతదేశానికి 1901లో జరిగిన తీరని ద్రోహం. అప్పటినుంచే సమాజంలో కులం అనే భావన విస్తృతంగా వ్యాప్తిచెందింది. ఈ దేశంలో అనాదిగా అంతరాలున్నాయనే భావజాలం వేళ్లూనుకొన్నది. చివరకు ఇవాళ తొలగించడానికి వీల్లేని రాచపుండులాగా మారిపోయింది.

కుల శబ్దం ఇంతకుముందు లేదా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. కుల శబ్దం ఉన్నది. రఘుకులాన్వయ రత్నదీపుడు అని రాముడిని కొనియాడిన సందర్భం ఉన్నది. అలాగే యదుకుల మౌళి అని శ్రీకృష్ణుడిని సంబోధించారు. ఇక్కడ కుల శబ్దం మనదేశంలో వంశ పరంగా.. సమూహపరంగా వినియోగంలో ఉన్నదే తప్ప ఇవాళ మనం వాడే ‘క్యాస్ట్’ అనే అర్థంలో లేదు. ఇక్ష్వాకు వంశం, రఘువంశం, చంద్ర,సూర్య వంశాలు ఇలా ఉన్నాయే తప్ప ఇవాళ మనం వాడుతున్న వృత్తులు, కుటుంబ పరంపరగా కుల శబ్దం ఎన్నడూ లేదు. పర్టిక్యులర్ వృత్తి చేసేవారిని అలా పిలువడమన్నది లేదు. ఈరకమైన కుల సంబోధన హెర్బర్ట్ రిస్లే చేసిన నిర్వచనం వల్లనే వ్యాప్తి చెందింది. కుండలినీ చక్రానికి సంబంధించి కులమార్గాలు ఉన్నాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు సాగే ప్రయాణంలో ఆయా చక్రాలను కులంగా పరిగణించడం ఉన్నది. వాటికి వెళ్లే దారిని కులమార్గంగా చెప్తారు.

ఇక భాషాపరమైన వాదాన్ని గురించి చర్చించడానికి ముందు ఏఐటీలోని మౌలిక ఆరోపణను ప్రస్తావించాలి. యురోపియన్ చరిత్రకారులు.. ఆర్యులు అనబడేవారు క్రీస్తుపూర్వం 1500లో వచ్చారని చెప్పారు. మధ్య ఆసియా నుంచి కొందరు పురుష యోధులు భారతదేశంపైకి దాడిచేసి లేదా వలసవచ్చి.. ఇక్కడ అంతకుముందు ఉన్న నాగరికతను, భాషను (ఏమి ఉన్నాయో వారికీ తెలియదు) తమ వేదమతం, సంస్కృతంతో రిప్లేస్ చేశారని చెప్పారు. బ్రాహ్మణ అస్తిత్వవాదాన్ని నెలకొల్పారని చెప్పారు. ద్రావిడులను వేరుజాతిగా డిఫైన్‌ చేశారు. ఆర్యులు ద్రావిడులను అణచివేసి.. వారిని దారిద్య్రంలోకి నెట్టివేశారన్నారు. ఉత్తర భారతంలో ఆర్యులు.. ద్రావిడులను దక్షిణభారతానికి తరిమికొట్టేశారన్న థియరీనీ తీసుకొచ్చారు. దీనివల్ల భారతీయులు ఒకరిమధ్యఒకరికి అంతరం బాగా పెరిగిపోయింది. మనలోపల అంతర్లీనంగా ఉన్న సాంస్కృతిక వారసత్వపు మౌలిక సూత్రాన్ని మనం గుర్తించలేని స్థితికి చేరుకొన్నాం. అందువల్లే.. మనకు మన చరిత్రలోనే అన్ని అవకతవకలు కనిపించడం మొదలయ్యాయి. అందువల్లే ఆర్యద్రావిడ సిద్ధాంతం ఇంకా బతికి ఉన్నది. మనవాళ్లు దీనిపై రాజకీయం చేస్తూనే ఉంటారు. మనువాదాన్ని గురించి మాట్లాడతారు. కులం గురించి, మతం గురించిన అస్తిత్వాలను చర్చిస్తారు. చివరకు ఎట్లా తయారైందంటే తాజాగా కార్పొరేట్ అస్తిత్వం ఒకటి పుట్టుకొచ్చింది. ఫేస్‌బుక్, వాట్సాప్ జాతులు అవతరించాయి. మరికొందరు తాము ఏకంగా ప్రపంచ జాతులమని చెప్పుకొంటుంటారు. ఇలాంటివన్నీ మనదేశంలో మాత్రమే జరిగే వింతలు. భారతీయులం అని తప్ప అన్నింటినీ అంగీకరించే అపూర్వ సమాజం మనది.

ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా సాకల్యంగా చర్చించినప్పుడు ఒక వినూత్నమైన అంశం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సోకాల్డ్ యురోపియన్ చరిత్రకారులు చెప్పినట్టు 1500 బీసీలో ఆర్యులు వచ్చారని రాసుకున్నారే కానీ.. ఇదే అంశం.. వారి అస్తిత్వపు అన్వేషణకు కేంద్రబిందువైంది. ఎందుకంటే.. ఆర్యులు మాట్లాడిన భాష సంస్కృతం అని తేల్చారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ఈ భాషలోనే ఉన్నాయి. ఆర్యులు మధ్య ఆసియానుంచి భారతదేశానికి వచ్చారని చెప్పాలంటే.. అక్కడ ఉన్న భాష, సంస్కృతి లెక్క ఏమిటో తేల్చాలి. అలా తేల్చాలంటే ముందుగా తాము ఎవరు అన్నది డిసైడ్ కావాలి. పాశ్చాత్యుల (వెస్టర్న్స్) ఉనికికి ఈ భాషాపరమైన అన్వేషణ తప్పనిసరి అయింది. మొదట్లో వాళ్లు (పాశ్చాత్యులు) మాట్లాడే భాషని ఇండోయురోపియన్ లాంగ్వేజిగా పిలిచేవారు. దీనికి ముందున్న ప్రాచీన భాషను (మూలాన్ని) ప్రోటో ఇండో యురోపియన్ లాంగ్వేజి అని పిలిచేవారు. ఈ ఇండో యూరోపియన్ అన్న పదమే పెద్ద చిక్కుగా మారిపోయింది. విలియం జోన్స్ లాంటివారికి ముందుగా తాము (పాశ్చాత్యులు లేదా యురోపియన్లు) ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తమ గురించి తాము తెలుసుకోవాలంటే.. ముందుగా ఇండోయూరోపియన్ అన్న పదబంధంలోని ఇండో అంటే ఏమిటి.. ఇండియన్ అన్నవాళ్లు ఎవరు అన్నది తేలాలి. ఇది తేలితే తప్ప మనం ఎవరు అన్నది డిసైడ్‌ చేయలేము అన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం యురోపియన్ శాస్త్రవేత్తలు భాషాపరమైన పరిశోధన చేశారు. ప్రోటో ఇండో యురోపియన్ భాష ఉన్నట్టు ఎలాంటి స్పష్టమైన ఆధారం వీరికి దొరకలేదు. ఇందుకోసం ఒక భాషా వృక్షాన్ని వీరు కొత్తగా పునర్నిర్మించారు. ఇందుకోసం తులనాత్మక భాషాధ్యయనమనే పద్ధతిని వినియోగించారు. సాధారణంగా కొన్ని భాషల మధ్య అనుబంధం ఉన్నదని భావించినప్పుడు.. వివిధ భాషల్లో మనుషులు విరివిగా వాడే ముఖం, నిద్ర, చెయ్యి, నోరు, ముక్కు, తినడం లాంటి పదాలను సేకరించి.. వాటి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తారు. ఒకభాషలోని పదానికి.. మరోభాషలోని అదే అర్థం వచ్చే పదానికి మధ్య సామీప్యత, సారూప్యతలు ఏమేరకు ఉన్నాయో చర్చిస్తారు. ఉదాహరణకు సంస్కృతంలో పాదం.. ఇటాలియన్‌లో పైదే, ఇంగ్లీష్‌లో ఫూట్ మధ్య సామీప్యం ఉంటుంది. అలాగే.. పిత.. పాద్రే, ఫాదర్ మధ్య సామీప్యాన్ని గమనించవచ్చు. ఇలా పదాల మధ్య సంబంధం తేలిన తర్వాత ఒక భాషా వృక్ష నమూనాను తయారు చేస్తారు. దీని ప్రకారం పదాలు ఎంత దగ్గరగా ఉన్నాయనేది తేలుతుంది. తద్వారా పేరెంట్ లాంగ్వేజి ఏమిటన్నది తెలుస్తుంది. యురోపియన్ శాస్త్రవేత్తలు ఇదే పద్ధతిలో భాషాధ్యయనం చేశారు. విలియం జోన్స్ 1786లో యురోపిన్ భాషలకు.. సంస్కృతానికి మధ్య ఉన్న మౌలిక లక్షణాన్ని వివరిస్తూ తన భాషా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే ఇతనికంటే ముందే 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన కొందరు యురోపియన్లు ఇండో ఇరానియన్ లాంగ్వేజీలకు, ఇండో యురోపియన్ లాంగ్వేజీలకు మధ్య సారూప్యతను అధ్యయనం చేశారు. 1653లో మార్కస్ జ్యూరియస్, వ్యాన్ బాక్స్‌హర్న్ సిథియన్ అనే ఒక ప్రోటో లాంగ్వేజీని ప్రతిపాదించాడు. ఈ భాషాకుటుంబంలో జర్మనిక్, రొమాన్స్, గ్రీక్, బాల్టిక్, స్లేవిక్, సెల్టిక్ ఇరానియన్ భాషలు ఉన్నాయి. 1767లో గాస్టన్ లారెంట్ కోరెడాక్స్ అనే ఫ్రెంచి భాషాశాస్త్రవేత్త (తన జీవితమంతా భారత్‌లోనే గడిపాడు) సంస్కృతానికి, యురోపియన్ భాషలకు మధ్య ఉన్న మౌలిక సామీప్యతను వివరిస్తూ ఒక డాక్యుమెంట్‌ను ప్రతిపాదించాడు. వీటన్నింటితో పోలిస్తే.. విలియమ్ జోన్స్ 1786లో ప్రతిపాదించిన భాషా సిద్ధాంతానికి హేతుబద్ధత చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇతను అన్ని యురోపియన్, ఇండిక్ భాషలను చర్చిస్తూ హిందీని కావాలనే వదిలేశాడు. 1818లో రాస్మక్ క్రిస్టియన్ రాక్ అనే శాస్త్రవేత్త సంస్కృతం, గ్రీకు భాషల్లోని పదాలను మరింత లోతుగా విశ్లేషించాడు. వీటిలో పూర్తిస్థాయి హల్లులను గుర్తించాడు. 1816లో ఫ్రాంజ్ బాప్ సంస్కృతం, పర్షియా, గ్రీకు, లాటిన్, లిథువేనియన్ ఓల్డ్ స్లావిక్, గోథిక్, జర్మన్ భాషల మధ్య సామీప్యమైన లక్షణాల్ని విశ్లేషించాడు. 1833లో ఇవే భాషలమధ్య ఒకేరకమైన తులనాత్మకమైన వ్యాకరణాన్ని ప్రచురించాడు. 1822లో జేకబ్ గ్రిమ్ ఇండో యురోపియన్ లాంగ్వేజీలో ధ్వని మార్పును విశ్లేషించాడు. వీటిమధ్య ఉన్న మౌలిక లక్షణాన్ని కూడా చర్చించాడు. ఇందులోనూ సంస్కృతం యొక్క ప్రాధాన్యాన్ని ప్రస్తావించాడు. ఆ తర్వాత ఆగస్ట్ స్క్లీషర్, జూలియస్ పొకార్నీ కూడా ఇండో యూరోపియన్ భాషా సమాజానికి తులనాత్మక వ్యాకరణాన్ని ప్రతిపాదించారు. వీటన్నింటిలోనూ సంస్కృతం అత్యంత మూలమైన భాషగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

వీరందరి సిద్ధాంతం ప్రకారం ప్రోటో ఇండో యురోపియన్ భాష అనేది బాల్టో స్లావిక్, జర్మనిక్, సెల్టిక్, ఇటాలిక్, హెలినిక్, ఇండిక్, ఇరానియన్ భాషలకు మూలమైనది (ఆన్సెస్టర్). కానీ.. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందేమిటంటే.. వీటన్నింటిలోనూ సంస్కృతం ఉన్నది. ఒకవేళ మనం ఈ భాషలతో ఒక మ్యాట్రిక్స్ రాస్తే.. (వాటి మధ్య ఉన్న సామీప్యతను అనుసరించి).. మూలంగా ప్రొటో ఇండో యురోపియన్ లాంగ్వేజీ బదులు సంస్కృతాన్ని కనుక వినియోగించి కొత్త మ్యాట్రిక్స్‌గా ట్రాన్స్‌ఫామ్ చేస్తే.. మ్యాథమెటిక్స్ పరంగా వచ్చే ఫలితాలు నూటికి నూరుపాళ్లు కరెక్టు అవుతాయి. అన్ని భాషలు సంస్కృతంలో ఇముడుతాయి. అంటే సంస్కృతం వీటన్నింటికీ మూలభాషగా తేలుతుంది. యురోపియన్ చరిత్రకారులు తమ అస్తిత్వ అన్వేషణలో భాగంగా చేసిన ఈ భాషాపరమైన సిద్ధాంతానికి బలం చేకూర్చడానికి ఆర్కియాలజీ సహాయం చాలా అవసరమైంది. దీంతో ఆర్కియాలజీ ఆనవాళ్లను వెతుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలో భారత్ అన్నది పాశ్చాత్య ఉనికిని కనుక్కోవడంలో కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా ఏఐటీ అన్నది వాళ్ల వ్యాఖ్యానికులకు కేంద్రబిందువుగా మారింది. వీళ్లలో మరిజా నింబుటాస్ కుర్గాన్ హైపోథిసీస్‌ను 1950లలో ప్రతిపాదించింది. దీని ప్రకారం నల్లసముద్రంలో ఎక్కడో దీని మూలం ఉన్నదని పేర్కొన్నది. ఇండో యురోపియన్ విస్తరణ 4000 బీసీ నుంచి 1500 బీసీ వరకు మూడు రకాలుగా జరిగిందని పేర్కొన్నది. గుర్రాలను మనుషులకోసం వినియోగించుకోవడం వంటి లక్షణాల ద్వారా ఈ విస్తరణ జరిగిందని నిర్ధారించింది. తరువాత ప్రొఫెసర్ కాలిన్ రెన్‌ఫ్రూ (కేంబ్రిడ్జి యూనివర్సిటీ 1987) అనటోలియన్ హైపొథిసీస్‌ను ప్రతిపాదించాడు. ఇవన్నీ కూడా పైకి ఇండోయూరోపియన్ అని చెప్తున్నా.. అన్ని భాషల్లోనూ సంస్కృతమే నిండి ఉన్నది. సంస్కృతాన్ని విస్మరించి ఏ భాష కూడా పరిపూర్ణం కాలేదని అన్ని సిద్ధాంతాలు కచ్చితంగా చెప్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సంస్కృతం లేకుండా మిగతా భాషల వికాసాన్ని ఊహించడం సాధ్యమయ్యే పని కాదు. సంస్కృతాన్ని అంగీకరించాల్సి వస్తే.. భారతీయ నాగరికత, సంస్కృతాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు యురోపియన్ అస్తిత్వం సంకుచితమవుతుంది. అందువల్ల సంస్కృత భాషను, ఆర్యులను భారతదేశం నుంచి బయటకు పంపించాలి. యురోపియన్లు చేసిన పని అదే. అలా పుట్టుకొచ్చిందే ఏ.ఐ.టీ. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. మనం కూడా ఇదే మాయలో పడిపోయాం. ఈ సంస్కృతమే మన నాగరికతకు, జీవనవిధానానికి ఆధారభూతమైంది. దీన్ని మనం పూర్తిగా విస్మరించాం. బ్రిటిష్‌వాడు విస్మరించేటట్టు చేశాడు. దీనివల్లనే మన చరిత్రను మనం కాదనుకున్నాం. వెటకారం చేసుకున్నాం. మొత్తంగా మన మూలాలనే విచ్ఛేదం చేసుకొనే దశకు చేరుకున్నాం. ఇప్పటికైనా ఈ భాషాసిద్ధాంతంపై మరింత లోతుగా పరిశోధిస్తే.. యావత్ ప్రపంచానికి మూలమైన భాష ఏమిటన్నది కచ్చితంగా తేలుతుంది. మన పాలకులకు ఈ పనిచేయడానికి అడ్డంకి ఏమిటి?

మరి ఆర్యులుద్రావిడుల మాటేమిటి? వారిద్దరూ వేర్వేరా? ఒకటేనా? తరువాతి వ్యాసంలో..

***

Willam Jones

Image Courtesy: Internet, Swadhyaya Resource Centre,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here