Site icon Sanchika

రెడ్ జోన్

[dropcap]ఇ[/dropcap]ప్పుడు ఇక్కడంతా నిశ్శబ్దం
ఎప్పుడూ రణగొణధ్వనులతో హోరెత్తే రహదారి
ఇప్పుడు మైకం వచ్చినట్లు నిశ్శబ్దంగా పడి ఉంది

ఇది ఒకరినొకరం అంటుకోలేని తరుణం
మాయదారి పురుగు మన మధ్య దూరి మనిద్దరిని చెరో వైపుకి నెట్టేస్తున్నది
ప్రతి ఇద్దరి మధ్యనా దూరాన్ని ఏర్పరుస్తన్నది

అంతా ఆధునికమై పోయి
అటక మీదికెక్కించిన  పరిశుభ్రత సూత్రాలను తిరిగి
వంటపట్టించుకోవాల్సి వస్తుంది

మనకిప్పుడు కావాల్సింది స్వీయరక్షణే
మూతికి మాస్కు చేతికి తొడుగు
ఇవేగా మనకు రక్షణ కవచాలు
ఆలింగనాలకు కరచాలనాలకు ప్రవేశం లేదిక్కడా
సామాజిక దూరం పక్కన పెట్టిన నీకు ప్రవేశం లేదిక్కడా
నీ నా తేడా లేక
రండి నాతో మాట కలిపి ముసుగుతో మబ్బకమ్మిన ప్రపంచాన్ని మేలుకొల్పుదాం

కుల మతాలకతీతంగా
సరిహద్దులతో నిమిత్తం లేకుండా మనిషి చేసిన దోషమో
ఏ యాంత్రికంగా అత్యాసపు జీవన విధానపు పాపఫలమో
ఏదైతేనేమి…
నేనిప్పుడూ పాజిటివ్ కరోనా
కొండచిలువ నోట్లో చిక్కిన మూగజీవిని
చావు పడగ కింద సామూహిక సంచారం
సమాజం మొత్తం మృత్యుకోరల్లోకి  వెళ్ళిపోతున్నది
క్వారంటైనై నరక యాతనతో అల్లల్లాడుతున్న అభాగ్యులను/అనుక్షణం…
చావుబతుకుల మధ్యన ఐసోలేషనై /మరణవేదనతో విలవిల్లాడుతున్న వ్యథాపూరితులను
డాక్టర్లు, నర్సులు… దేవదూతలై  తమ ప్రాణాల్ని సైతం అడ్డుపెట్టి
కొండచిలువ నోట్లోంచి  బయటకు లాగేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు
వారి చేతులు చల్లంగుండలే కానీ
మనం బాధ్యతగుండలే కానీ
మనిషి భవిష్యత్తుకి ప్రమాదం ఏమున్నది?

Exit mobile version