సంధ్య గారి సద్భావనా సభ

0
2

[dropcap]“భా[/dropcap]రతీయ యోగుల గూర్చి వ్రాసిన పుస్తకం విశాఖపట్నంలో విడుదల చేయదలచాను. సభకు మీరు వచ్చి పుస్తకాన్ని పరిచయం చేయాలి” అని ఫోన్ చేశారు సంధ్య గారు అమెరికా నుంచి.

“అలాగే, చేస్తాను. నాల్రోజులు ముందుగా నాకు చేరేటట్టు చూడండి పుస్తకాన్ని” అన్నాను. ఎందుకంటే, గంట పరిచయం ఉన్న వ్యక్తిపై కథ వ్రాయమంటే వ్రాసేస్తాను గానీ 45 మంది యోగుల గూర్చి వ్రాసిన గ్రంథాన్ని ఆకళింపు చేసుకుని సభలో సమీక్ష చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. నాకు కలం ఝళిపించమంటే కాస్త ఝళిపించగలనేమో కానీ మైకు పట్టుకోమంటే మ్రాన్పడిపోయే రకం నేను.

పాపం పనుల ఒత్తిడి వలన సంధ్య గారు పుస్తకం పంపలేక పోయారు. సరే, ముందు రోజు సాయంత్రం నాలుగు గంటలు ఔపోసన పట్టి ఉదయం సభలో పరిచయం చేద్దామనుకున్నాను.

వినాయకుని పెళ్ళికి వేయి విఘ్నాలంటారు! బండి నాలుగు గంటలు లేటుగా వచ్చింది. పుస్తకం నా హస్తగతం అయ్యేసరికి రాత్రి ఎనిమిది దాటింది. అప్పటికే నా వసతి గదికి చేరుకున్న మిత్ర బృందం కబుర్లతో తేదీ మారిపోయింది.

ఉదయం లేచేసరికి ఆలస్యమైంది పుస్తకాన్ని ఒక అరగంట సేపు తిరగేసి సభకు బయలు దేరిపోయాను. ఈ సంజాయిషీ అంతా ఎందుకంటే పుస్తక పరిచయం సరిగ్గా జరగలేదు. ఇక సభ విశేషాలు!

సభా పర్వము

సత్సంకల్పానికి సర్వేశ్వరుని సహకారం సర్వదా ఉంటుందంటారు! అందులోనూ సంధ్య గారు ఇటీవలనే కాశీ దర్శనం చేసుకుని వచ్చారు! ఆవిడ పడిన శ్రమకు తగ్గట్టుగానే సభ చక్కగా నిర్వహంచబడింది. సభ సంధానకర్త శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారి పొలకువ ప్రతి అంశంలోనూ అగుపించింది. సంధ్యగారి శ్రీవారు శ్రీ కొండల్ గారు వెనుక ఉండి అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగేటట్టు చూసుకున్నారు.

ఖమ్మం నుండి విచ్చేసిన శ్రీ తెన్నేటి కృష్ణమూర్తి గారి స్వాగత వచనాలతో సభ ఉ.గం. 10.00 లకు ప్రారంభమైంది! వేదిక విశాఖపట్నం ‘మేఘాలయ’ సమావేశ మందిరం! సందర్భం – శ్రీమతి యల్లాప్రగడ సంధ్య గారిచే విరచితమైన ‘భారతీయ యోగులు – పరమాత్మ ప్రతినిధులు’ అనే పుస్తక ఆవిష్కరణ సంరంభం.

ఆత్మీయతా భావం ఉట్టిపడే ఆథ్యాత్మిక సమావేశంగా సభను నిర్వహించాలనే ఆశయం సంధ్య గారిది. కనుక అధ్యక్షులు, ముఖ్య అతిధులు వగైరా సంబోధనల కతీతంగా సభ నిర్వహించబడడం, ఎంతో ముదావహం. సంచలన కర్తగా సర్వేశ్వర శాస్త్రి గారు వ్వవహరించారు. చాలా కాలం తర్వాత మిత్ర బృందం కలయిక చాలా మందిలో భావోద్వేగం కలిగించింది.

సభకుల పరస్పర పరిచయాలనంతరం ముంబై నుండి వచ్చిన శ్రీమతి కల్యాణ గౌరి భమిడిపాటి గారు పుస్తకావిష్కరణ చేశారు. ఆవిష్కరణ వినూత్న విధంగా జరిగింది. అందమైన స్వర్ణకాంతుల పేటికలో పదిల పరచిన పుస్తకాలను పేటిక తెరిచి కల్యాణి గారు ఆవిష్కరణ చేశారు.

బరంపురం నుండి వచ్చిన శ్రీ ఎమ్మెస్వీ గంగరాజు గారు పుస్తక పరిచయం క్లుప్తంగా చేశారు. తదనంతరం వక్తలు సంధ్యగారి రచనా విధానం గూర్చి ప్రసంగాలు చేశారు.

గుంటూరు నుండి సతీ సమేతంగా వచ్చిన మురళీ కృష్ణ గారు వారి ప్రసంగంలో పుస్తకంలో ఉటంకించిన ఒక యోగి గారితో తన పూర్వ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సిహెచ్ రమణ మూర్తి గారు కొన్ని ఆధ్యాత్మిక విషయాలను ఉటంకిస్తూ పుస్తకం ముఖ చిత్ర ఔచిత్యాన్ని ప్రస్తావించారు. రచయిత్రి తన స్పందనలో సంపూర్ణ వివరణ ఇస్తానన్నారు.

శ్రీమతి లక్ష్మీ వసంత గారు సంధ్య తన నెచ్చెలి పూర్వ అనుభావాలను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. సాహితీ వేత్త, రచయిత్రి శ్రీమతి రాజేశ్వరీ అచ్యుత్ గారు తన ప్రసంగంలో రచయిత్రిని అభినందిస్తూ పుస్తకంలోని మహానుభావుల జీవన విధానం భావి తరాల వారికి ఆచరణీయం కావాలని ఆకాంక్షించారు.

సుప్రసిద్ధ సాహితీ వేత్త, ‘సాహో’ పత్రిక సంపాదకులు శ్రీ ఇందూ రమణ గారు, కథకులు రాజేష్ యాళ్ళ గారు, శ్రీ ఓరుగంటి శర్మ గారు, శ్రీమతి అమ్ము బొమ్మిడి గారు, భాష్యం నీలం గారు పుస్తకంలో ప్రస్తావించిన యోగుల చరిత్రలు తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నామని రచయిత్రిని కొనియాడేరు.

చి. ఐశ్వర్య పాడిన రెండు గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. చివరి గీతం గరువుల పట్ల గౌరవ భావం తొణికిసలాడుతూ సందర్భోచితంగా ఉన్నది.

సంధాన కర్త శ్రీ శాస్త్రిగారు మాట్లాడుతూ సంధ్య గారికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలననే ఇటువంటి రచనలు చేయగలుగుతున్నారని, ఆవిడ ఇటువంటి రచనలు ఇంకా కొన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. శ్రీమతి కలవల గిరిజా రాణి, శ్రీమతి పద్మజ ముడుంబై రచయిత్రిని ప్రశంసిస్తూ మాట్లాడేరు.

తదనంతరం, ‘భావుక’ గ్రూపు అడ్మిన్లు సంధ్య గారినీ, వారి శ్రీవారు శ్రీ కొండల్ గారిని సత్కరించి ఆశీస్సులందజేశారు.

రచయిత్రి తన స్పందనలో రచనా నేపథ్యాన్ని వివరిస్తూ కొందరి సందేహాలను నివృత్తి చేశారు. తాను అమ్మవారిచే ప్రేరేపించబడి రచన చేపట్టేనని, యోగుల చరిత్రలు ఒక వరుస క్రమంలో వ్రాయడం అందువలన కుదర లేదని, భవిష్యత్తులో అమ్మవారి అనుగ్రహంతో మరి కొందరు యోగుల గూర్చి కూడా వ్రాయదలచేనని అన్నారు.

శ్రీమతి రాజీ కోడూరి గారి వందన సమర్పణతో సభ సంతోషదాయకంగా ముగిసింది. తరువాత శ్రీ కొండల్ గారి పర్యవేక్షణలో షడ్రసోపేతమైన విందు భోజనం ఆహూతులను అలరించింది. మొత్తం మీద సభ ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తూ ‘సభా పర్వం’ (పండగ) గా పరిణమించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here