10. కంచె

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్య ఎందుకని..
పూలన్నీ దిగులుకమ్ముకున్నాయ్?!
ఎన్నడూ లేనంతగా..
గుబులు గా చూస్తున్నాయ్?!
అరె,.. వాటి కళ్ళు తడిగా ఉన్నాయి!..నీ కాళ్ళు కూడా,
ఆ లేతపూల కన్నీటితో నీ కాళ్ళు కడిగావు కదూ?
నాకు తెలుసు, వినయంగా నటించకు!

గుర్తుందా..?
మా తెలియని తనం పై ఎన్ని మాటల్ని రుద్దిపోయావో!
మా విత్తనాల్ని ఎంత నమ్మకంగా ఎత్తుకుపోయావో!
కళ్ళలో పెట్టి చూసుకుంటానన్నావ్..
కంచెలా కాపు కాసుకుంటానన్నావ్..
పూచిన ప్రతిసారీ..పూల పరిమళాల్ని..
విశ్వ వీధుల్లో పన్నీరు గా చిలకరిస్తానన్నావ్!

కంచె కాటేస్తుందని ఊహించలేని
వసివాడని పసి మొగ్గలు..
నీ కనుసన్నల లొనే కొత్త రెక్కలుతో..
తొలి యవ్వనాన్ని తొడుక్కున్నాయి కదూ!
నాకు తెలుసు, మరింక నటించకు!

ఆ కలువ లెందుకు బెదిరిపోతున్నాయి?
రెక్కలు ముడుచుకొని వడలిపోతున్నాయి?
తెలుపు రెక్కల తోడి తొడిమ కు
ఎరుపు మరకలు ఎవ్వరు పూసారు!?
క్రింది కోనేరు లో నీరంతా ఏమైపోయింది!
కోర్కెల దాహం తో నువ్వే తాగావు కదూ?
నాకు తెలుసు,..ఇక ఎంత మాత్రం నటించకు!

మానవత్వం మిగిలే ఉంది.
మూడో..కన్నుగా కనిపెడుతుంది.
మహోజ్వల ఉద్యమమొకటి ఇటే వస్తుంది.
పూలను చిదిమే ఏ పాదాలనూ ..భూమి భరించలేదు.
అవి  ఉరికంబానికి వేలాడే రోజొస్తుంది.
నీకూ తెలుసు..ఇక నటించాల్సిన అవసరం లేదు.
ఇకపై ఏ ఊసరవెల్లి కీ రంగులుమార్చే అవకాశమే రాదు.