[box type=’note’ fontsize=’16’] “నటనల కోసమైతే తప్పకుండా చూడాల్సిన ఆసక్తికరమైన చిత్రం” అంటూ “102 నాటవుట్” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]
“ఈ విచిత్ర పోరాటంలో నియమాలు కూడా అనుపమానంగా వుంటాయి
నెరిసింది తలే అయినా కలలు నింగి రంగేలే”
సినెమా కథంతా నాటకీయంగానే వుంటుంది. వుండదు మరీ, దీని మాత్రుకే సౌమ్యా జోషి వ్రాసిన వో గుజరాతీ నాటకమైతేనూ. రెండు పొరలలో సాగే కథలో వొక పార్శ్వం కూర్చోబెట్టేస్తుంది, రెండోది తెలిసిన రామాయణమే కదా అనిపిస్తుంది. ఆ తెలిసిన రామాయణమే భాగం ఇక్కడ వ్రాయను, లేదంటే చూడబోయేవారికి తినబోయేముందే రుచి చూపించినట్టుంటుంది.
75 యేళ్ళ బాబులాల్ రిటైరైన సర్జను. భార్య పోయింది. కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. మనుమలను ఇంకా చూడలేదు. తన వయసుకు తగ్గట్టుగానే జీవిస్తాడు. జూల్స్ వర్న్ నవల అరౌండ్ ద వల్డ్ ఇన్ 80 డేస్ లో ఫిలియాస్ ఫాగ్ లాంటి వాడు. అన్నీ తూనికలు, కొలతలు, సమయాలు వీటి బట్టే చేస్తాడు. 15 నిముషాలు పాటు స్నానం చేస్తే జలుబు చేస్తుందని 14 నిముషాలకు అలారం పెట్టుకుని స్నానం చేసే రకం. వార్ధక్యం మూలాన యెప్పుడు మతిమరుపు వస్తుందో యేమో అని చెప్పి అన్ని జాగ్రత్తలు ముందు నుంచే తీసుకుంటాడు. బాత్రూం లో తువ్వాల వేలాడదీసే దండెం వెనుక వో పోస్టరు గీజరు కట్టేయమని, బాత్‌రూం తలుపు బయట మరో పోస్టరు గీజరు కట్టావా అని మళ్ళీ గుర్తు చేస్తుంది. ఇలాంటి మనిషి ఇక బతికేదెప్పుడు? రోజులో ప్రతి క్షణం ముందు ఆలోచనలతోటి, లాజిక్కులతోటి నిండిపోతే పసి పిల్లలలా ‘ఈ క్షణం లో’ బతికేదెప్పుడు?
ఆ పని అతని తండ్రి చేస్తాడు. 102 యేళ్ళ యువకుడు దత్తాత్రయ వఖారియా (అమితాభ్ బచ్చన్) 118 యేళ్ళు బతికి ప్రపంచ రికార్డు స్థాపించిన వో చైనీయుడిని ఆ స్థానం నుంచి తప్పించాలని కోరిక. కుర్రవాడికుండే చురుకూ, జీవితేచ్చ, హాస్యచతురత కలగలిసిన మనిషి. తన ముందే తన కొడుకు తనకంటే ముసలాడైపోయి, జీవితాన్ని ఆస్వాదించడం మానేయడం చూసి అతన్ని మార్చాలని ప్రయత్నం. “నువ్వెలాగూ ముసలాడివైపోయానని వొప్పుకుంటున్నావుగా, నీ కోసం వో వృధ్ధాశ్రమం చూశా, అక్కడ పడేస్తా” అంటాడు. తనకేమో అన్నీ అలవాటైన ఇల్లు ఇది. తన పదేళ్ళప్పుడు కాశ్మీరులో కొన్న దుప్పటి లేనిదే నిద్ర పట్టదు, తన బాత్‌రూం టైల్స్ మార్చినందుకే ఆర్నెల్లపాటు విరేచనం కాలేదు, అలాంటి తను వుండగలడా ఆ ఆశ్రమంలో? అయితే నేను షరతులు విధిస్తాను, అవి నువ్వు చేస్తూ పో యెక్కడికీ పోనవసరం లేకుండా అంటాడు తండ్రి. ఆ తర్వాతి కథంతా ఇలాంటి హాస్యోక్తులతో, చిత్ర విచిత్రమైన సంఘటనలతో మనల్ను నవ్విస్తూ ఆసక్తికరంగానే సాగుతుంది. (దీనికి 75 శాతం మార్కులు ఆ తండ్రి కొడుకుల నటనకే). ఇదంతా దేనికి దారి తీస్తుంది, తండ్రి అనుకున్నది సాధిస్తాడా, కొడుకులో యెలాంటి మార్పు వస్తుంది అన్నది మిగతా కథ.
Disclaimer alert! కథంతా తెలిసిపోయినా పర్లేదు అనుకుంటే ఈ పేరా చదవండి, లేదంటే ఈ వొక్క పేరా దాటెయ్యండి. భార్య పోయింది. వున్న వొక్క కొడుకు చదువుల కోసం తండ్రి తన ప్రతి పైసా ఖర్చు పెట్టాడు. ఆ కొడుకు తండ్రికి నిజమైన పుత్రోత్సాహము కలిగించే కొడుకు కాదు. విదేశాలకెళ్ళగానే తండ్రిని మరచి పోయి, అక్కడి అమ్మాయినే చేసుకుని, ఆ తర్వాత తెలియ పరుస్తాడు. తల్లి చనిపోయినప్పుడూ రాడు, వీలు కాలేదని. పిల్లలను కూడా తీసుకొచ్చి చూపించడు. ఇన్నేళ్ళ తర్వాత ఆస్తి కోసమని చెప్పి తండ్రిని గుర్తు చేసుకుంటాడు, పుట్టినరోజుకి పువ్వుల బొకే అందే యేర్పాటు చేస్తాడు. కాని తండ్రి తండ్రే, ఇవన్ని కళ్ళకి కనబడుతున్నా రక్త సంబంధం అన్నిటినీ క్షమించేలా చేస్తుంది; అంతే కాదు కొడుకు పలుకు కోసం, చూపు కోసం బిచ్చగాడిలా పాకులాడుతాడు. 102 యేళ్ళు నిండిన దత్తా కు మెదడులో ట్యూమర్ వచ్చిందని బయట పడుతుంది. తను పోయేలోగా కొడుకుని తనను తాను గౌరవించుకునే వ్యక్తిలా, తన జీవితాన్ని ఉత్సాహంతో బ్రతకగలిగేలా చేయాలని నాటకం రచిస్తాడు. అతను అనుకున్నట్టే చివరికి బాబులాల్ తన కొడుకు ఆంతర్యం అర్థం చేసుకోవడం, మానసికంగా మారడం జరుగుతాయి. అయితే ఈ మెలోడ్రామా మనకు కొత్త కాదు గాని, ముసలితనంలో కూడా అంతే ఉత్సాహంగా చివరి వరకూ బతకాలన్నది మనకు నచ్చుతుంది. కాస్సేపు ఆనంద్ లో రాజేష్ ఖన్నా గుర్తుకొస్తాడు. ఈ వాక్యం ముందు వ్రాయలేను మరి.
గుజరాతీ తెలిసిన వాళ్ళకు చిన్న చిన్న డీటైల్స్ బాగా నవ్వు తెప్పిస్తాయి. సీరియళ్ళలో లాగా మరీ యెబ్బెట్టుగా మాట్లాడించలేదు. అక్కడక్కడా గుజరాతీ పదాలు పెట్టి తక్కిందంతా మామూలు హిందీనే. ఆ మూడో పాత్ర తండ్రిని “బాబాయ్” అని సంబోధిస్తాడు కొడుకుని “తాత” అని. ఇలాంటి కథ సంభాషణల మీదే ఆధార పడక తప్పదు, అయినా అవకాశమున్న చోట్ల దర్శకుడు నిశ్శబ్దాలను బాగానే వాడుకున్నాడు. ఇదివరకు OMG తీసిన ఉమేశ్ శుక్లా దీన్ని వో నాటకం ఆధారంగా తీశాడు. ఆ పరిమితులు యెలానూ వుంటాయి, కాని బాగానే తీశాడు. అన్నిటికంటే ముఖ్యంగా చూడాల్సింది ఆ తండ్రీకొడుకుల నటన కోసం. అమితాభ్ మొదటినుంచీ తన నటనా కౌశలం చూపిస్తూనే వచ్చాడు గాని, రిషీ కపూర్‌కే వయసులో వున్నప్పుడు కేవలం చాక్లెట్ బాయ్ పాత్రలు వచ్చాయి. ఇప్పుడొస్తున్నటువంటి వైవిధ్యభరిత నటన చూపే అవకాశం అప్పట్లో రాలేదంటాడు. ఇలాంటి చిత్రాలు రాకపోతే మనం రిషి కపూర్ ని మిస్ అయ్యేవారం కదా. ఇక వృధ్ధ పాత్రల సినెమా అంటే ఈ మధ్య వచ్చిన పికూ గుర్తుకు రాకుండా పోదు. అది multi dimensioned layered narrative అయితే ఇది కేవలం రెండు అంశాలను తీసుకుని వో సరళ రేఖలా సాగే కథనం.
నటనలకోసమైతే తప్పకుండా చూడాల్సిన చిత్రం.