15. మాతృత్వము

0
2

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]ఫో[/dropcap]న్ రావడముతో  ఢిల్లీ నుండి  హైదరాబాద్ కు ఆఘ మేఘాల మీద ప్రయాణమయ్యాడు అరుణ్.

ప్రయాణము తాలూకు అలసట బాధిస్తున్నా, విన్న సమాచారము ఒక వైపు ఆనందాన్ని,మరొక వైపు అనిశ్చితిని కలిగిస్తుండడముతో మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నాడు.

హైదరాబాద్ లోని అతి పెద్ద కార్పొరేట్  మెటర్నిటీ హాస్పిటల్ చేరుకున్నాడు. “పదినిమిషాలలో విజిటింగ్ అవర్స్ ప్రారంభమవుతాయి. అంత వరకు కూర్చోండి” అన్న రిసెప్షన్ వారి మాటలు మన్నిస్తూ, అక్కడే లాంజ్‌లో, ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాడు.

గతము తాలూకు రకరకాల ఆలోచనలు వెంటాడటముతో అలసటగా కళ్ళు మూసుకున్నాడు.

***

“అరుణ్! నీకు ఎన్ని సార్లు చెప్పాను, మనకు పిల్లలు వద్దని. చూడు ఇపుడు యేమి జరిగిందో”

“ఇపుడేమి జరిగింది. భగవంతుడు మనని దీవించాడు. సానుకూలంగా ఆలోచించు. ఇది మంచి విషయమే కదా.”

“నీకు మంచి విషయము. నాకు కాదు. మొదటి నుండి నెత్తీ నోరుకొట్టుకుంటున్నాను. నా మాటకు నీవు విలువ యివ్వలేదు. ఆవేశము రాగానే పశువులాగా మీద పడడము తప్ప కనీస జాగ్రత్తలు తీసుకుందామన్న ఇంగితము కూడా చూపలేదు.”

“హారిక ప్లీజ్! డోంట్ షవుట్! అందరూ మననే చూస్తున్నారు.”

“చూస్తే చూడనీ. నీకు భార్య అభిప్రాయాలను గౌరవించే సంస్కారము లేదు.”

“హారికా! నోరు పారేసుకోకు. ఇందులో నేను అంతగా చేసిన తప్పేమిటి?”

“ఏమిటా? నాకు మరొక నెలలో ఎక్జిక్యుటీవ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ రాబోతుంది. మరొక రెండు నెలలలో నన్ను మా ఆఫీస్ వాళ్ళు అమెరికాకు పంపబోతున్నారు. నా జీతము నెలకి నాలుగు లక్షలు కాబోతుంది. అంటే నీ జీతము కంటే ఐదింతలు ఎక్కువ. ఇన్ని మంచి అవకాశాలు, పదోన్నతులు రాబోతుంటే అవి అన్నీ వదులుకొని నీ పిల్లలలకు తల్లినై వాళ్ళ మూతులు, ముడ్లు తుడుస్తూ కూర్చోవాలా? నీ వంశాన్ని పెంచాలా. నేనేమైనా పిల్లలని కనే యంత్రాన్నా?”

“ఓహ్ డ్యామిట్! హారికా! చిన్న విషయాన్ని పెద్ద రాద్దాంతము చేస్తున్నావు. స్త్రీకి తల్లి కావడము కూడా పదోన్నతియే. మంచి భర్త, మంచి పిల్లలు, మంచి కుటుంబము దొరకడము కూడా అదృష్టమే.”

“బ్రహ్మశ్రీ అరుణ్ గారూ! దయ చేసి పాతచింతకాయ పచ్చడి ప్రవచనాలు నాకు చెప్పవద్దు. నాకు పెళ్ళీ, పిల్లలు, సంసారము వీటి కన్నా కెరీర్, ప్రమోషన్, డబ్బు సంపాదించడము, స్టేటస్, ఉన్నత జీవనవిధానము అంటే ఇష్టము. మా పేరెంట్స్ పోరు పడలేక పెళ్ళిచేసుకున్నాను. పెళ్ళైన రోజు నుండి చెబుతూనే ఉన్నాను పిల్లలు, సంసారము, అత్తామామల సేవలు వంటి లంపటములోకి నన్ను లాగ వద్దని. అయినా వినలేదు. ప్రెగ్నెన్సీ రాకుండా ప్రికాషన్స్ తీసుకుందామని చెప్పినా, యేవో సాకులు చెప్పి నీవు జాగ్రత్త పడలేదు, నన్ను జాగ్రత్తలు పడనీయలేదు. చివరికి యేమి జరిగింది. ఉద్యోగములో ఇపుడిపుడే వస్తున్న మంచి అవకాశాలు చేజార్చుకోవాలి. అసలే పోటీ ప్రపంచము. ఒక్క క్షణము ఏమరుపాటున ఉన్నా మన అవకాశాలు వేరే వాళ్లు తన్నుకుపోతారు. రాబోయే రోజులు మెటర్నిటీ లీవు అనీ ఇంటిలో కూర్చుంటే నా ప్రమోషన్, అమెరికా అవకాశము చేజారిపోతుంది. నేను అసహ్యంగా ఈ పొట్టనూ, అవమాన భారాన్ని మోస్తూ నీకు బిడ్డను కనిపెట్టాలి. మీరు చేయించే సీమంతాలు, బారసాలలు ఎంజాయి చేయాలి. ఓహ్ గాడ్! అబార్షన్ కూడా చేసుకోవద్దని, చేసుకుంటే నా ప్రాణానికి ముప్పని డాక్టర్ చెప్పింది. ఐ హేట్ దిస్ నాన్సెన్స్!”

“హారికా! ప్లీజ్ స్టాప్! మన ఇంటికి వెళ్ళి ప్రశాంతముగా మాట్లాడుకుందాము. ముందు క్షేమంగా నీకు డెలివరీ అయి, బిడ్డ ఆలనాపాలనా సక్రంగా జరిగేట్లుగా, ఆపై నీ  కెరీర్ కూడా సక్రమంగా ఎదిగేట్లుగా మంచి ఆలోచన చేద్దాము.”

“ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా అరుణ్ గారూ! ఇల్లు నాది. నా సంపాదనతో కొనుక్కున్నది. నేను నా ఇంటికి వెళతాను. నా ఇంటిలో నీకు చోటు లేదు. నాకు ఇష్టము కాని పని నీవు చేసావు. ఇకపై నీ ముఖము నాకు చూపించవద్దు. బిడ్డను కనగానే సమాచారము ఇస్తాను. వచ్చి తీసుకొని పో. పెంచుకుంటావో, మురికి కాలువలో పారేసుకుంటావో నీ ఇష్టము. నిన్ను కట్టుకున్న పాపానికి ఈ ఆరు నెలలు నా ప్రొగ్రస్‌ను వదులుకొని జీవచ్చవములా బ్రతుకుతాను. పుట్టబోయే బిడ్డపై  ప్రేమతో కాక నా మీద ప్రేమతో ఈ కాలము గడుపుతాను. నీ పాపాన్ని నీకు డెలివరీ చేసిన తరువాత నా స్వప్నాలను సాకారము చేసుకుంటాను. ఈ హడావిడి అయిన తరువాత్ డైవోర్స్ పేపర్స్ పంపుతాను. సైన్ చేసి పంపు. కావలిస్తే మనోవర్తిగా నీకు కొన్ని లక్షలు ఇస్తాను. నీ లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్, సెంటిమెంటల్, ఓల్డ్ మాన్యుమెంట్‌తో నేను కలిసి బ్రతుకలేను. ఆ… అన్నట్లు పెద్దవాళ్ళతో, బంధువులతో, స్నేహితులతో చెప్పించే ప్రయత్నాలు చేయకు. నేనసలే మొండిదానిని. మరింత రప్చర్ అవుతుంది తప్ప లాభము ఉండదు.”

శర పరంపరగా కురుస్తున్న ఆమె వాక్ప్రవాహానికి ఖిన్నుడైన అరుణ్‌ను అక్కడున్న వారు జాలిగా, వింతగా చూస్తుండగా, హారిక అరుణ్ చేతిలోనుండి కార్ కీస్ తీసుకొని అక్కడి నుండి వడిగా వెళ్ళి పోయింది.

ఇదంతా అప్సెట్ కావడముతో వచ్చిన కోపంగా భావించిన అరుణ్, హారిక కాస్తా కూల్ అయిన తరువాత నచ్చచెప్పవచ్చుననుకొని ఒక పూట తరువాత ఇంటికి వెళ్ళాడు. కానీ హారిక మూడ్ మారకపోవడమే కాక, అరుణ్ ఇంటికి రాగానే హాస్పిటల్లో మాట్లాడిన దానికి పదింతలు మాట్లాడి అతని బట్టలను, వస్తువులను వీధిలోకి విసిరింది. మ్యారేజ్ ఫోటో ఆల్బమ్‌ను నేలకేసి కొట్టింది. కొన్ని ఫోటోలని మాడ్చి మసి బొగ్గు చేసింది.

తమ రెండు సంవత్సరల వైవాహిక జీవితములో హారిక అహంభావి, మూర్ఖురాలు, గర్విష్టి అని తెలిసినా, కాలము ఈవిడను మార్చకపోదా అని ఆశతో ఎదురు చూస్తున్న అరుణ్‌కు ఆనాటి సంఘటనలు విపరీతంగా బాధ కలిగించాయి. అవమానముతో, బాధతో గుండె కరిగి నీరులా మారగా అవి కంటిలోకి రాకుండా జాగ్రత్త పడుతూ ఇంటి నుండి బయట పడ్డాడు.

***

విజిటింగ్ అవర్స్ ప్రారంభము కావడముతో నాలుగవ ఫ్లోర్‌లో ఉన్న హారిక ఉన్న గదికి వెళ్ళాడు.

గది తలుపులు తీసుకొని లోనికి వెళ్ళాడు.

హారిక నీరసంగా పడుకొని ఉంది. ఆమె వైపు చూసాడు.

బహుశా ప్రసవ వేదన బాగా అనుభవించినట్లుంది. మదించిన ఏనుగులు కలవరపరిచిన సరోవరములా ఉంది. స్త్రీ తల్లిగా మారిన తరువాత వచ్చే హుందాతనము ఆమె ముఖములో ప్రస్ఫుటముగా గోచరిస్తున్నది.

హారిక కనుసైగతో, హారిక పక్కన ఉన్న పెయిడ్ అటెండెంట్ భాగ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. అరుణ్ ఉయ్యాల వైపు చూసాడు. పాప బొద్దుగా, ముద్దుగా ఉంది. తన తల్ల్లిలా అనిపించింది.

కనులు చెమర్చాయి. ఎత్తుకొని ముద్దాడాలని అనిపించింది. కానీ నియంత్రించుకున్నాడు.

“హౌ ఆర్ యూ అరుణ్! ఎలా ఉన్నావు?” అంటూ హారిక బెడ్ మీద నుండి లేచి వచ్చి, అరుణ్‌ని కౌగిలించుకొని, ముఖము మీద ముద్దుల వర్షము కురిపించింది. అరుణ్ ఆశ్చర్యముగా, అసహనముగా ఫీల్ అవుతూ హారికను దూరము జరిపాడు. హారిక మళ్ళీ అతడిని హత్తుకొని “ప్లీజ్! నన్ను దూరము జరుపకు. నాకు తెలుసు నిన్ను చాలా అవమానించాను. నీకు చాలా కోపము తెప్పించాను. నిన్ను అర్ధము చేసుకోలేదు. నిన్నేమిటి? నన్నూ, లోకాన్ని సరిగ్గా అర్ధము చేసుకోలేదు. నేను చదివిన ఎమ్‌టెక్ నాకు టెక్కును నేర్పింది తప్ప జీవితము పట్ల పాజిటివ్ అవుట్‌లుక్ నేర్పలేదు” అంటూ దూరంగా వెళ్ళి కూర్చుంది.

ఇంతలో పాప యేడవడముతో పాపను దగ్గరకు తీసుకొని పాలు యివ్వసాగింది.

ఒక వైద్యుడు పేషంట్‌కు అతి శ్రద్ధ్హగా ఆపరేషన్ నిర్వహించినట్లుగా, పూజారి భగవంతునికి భక్తితో నైవేద్యము సమర్పిస్తున్నట్లుగా ఆమె పాపకు పాలు ఇస్తుండటము అరుణ్‌కు ఆశ్చర్యముగా, సంతోషముగా, కొంత కన్ఫ్యూజ్డ్ గా అనిపించింది.

“నా తల్లికి యేనాడు ప్రేమతో పిడికెడు ముద్ద పెట్టలేదు. అచ్చు నా తల్లిలా ఉన్న నా బిడ్డకు ప్రేమతో పాలు పడుతుంది” అనుకున్నాడు.

పాలు త్రాగి పాప పడుకోవడముతో హారిక ఫ్లాస్క్ లోనుండి కాఫీ తీసుకొని వచ్చి, అరుణ్ పక్కన కూర్చున్నది. అరుణ్  కాఫీని పక్కకు త్రోసి, మౌనంగా గంభీరముగా కూర్చున్నాడు.

“అరుణ్! నీవు వెళ్ళిపోయిన తరువాత… కాదు… కాదు…

నా మూర్ఖత్వముతో అఙ్ఞానముతో నిన్ను దూరము చేసుకున్న తరువాత….,

నాకే అశ్చర్యము కలిగించే విధముగా నాలో చాలా మార్పు వచ్చింది.

ఆఫీసుకు లీవ్ పెట్టి ఇంటి పట్టున ఉన్నాను.

ఈ సమయములోనే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నాలో చాలా మార్పు తీసుకొని రాసాగింది.

నాకు పులుపు అంటే అసహ్యము. కానీ పుల్లని వస్తువులు తినాలి అనిపించేది.

 అక్కడే యిష్టము కాని వాటి పట్ల యిష్టము యేర్పడటము ప్రారంభమైనది.

ఎక్కువగా తింటే శరీరాకృతి పాడైపోతుందని భయపడే నేను, నేను తినే  ఆహారము రక్తములో కలిసిపోయి పుట్టబోయే బిడ్డకు అందుతుందని తెలిసి వాళ్ళనీ, వీళ్ళనీ అడిగి బలవర్ధక ఆహారము ఎక్కువగా తినడము ప్రారంభించాను.

పొట్ట పెరుగుతుంటే అది నా శరీరాకృతి పాడు చేస్తుందని అనుకోకుండా పదేపదే అద్దములో చూసుకుంటూ, మన ప్రేమకు ప్రతిరూపము, మన వైవాహిక జీవితానికి పరమార్ధము ఇక్కడ పెరుగుతుందని సంతోష పడేదానిని.

బిడ్ద తన్నినపుడు  మాతృత్వాన్ని సార్ధకము చేసుకోబోతున్నానని అలౌకిక ఆనందాన్ని అనుభవించే దానిని. కూర్చునా, నిల్చున్నా, పడుకున్నా ఇలా యెప్పుడు యే స్థితిలో ఉన్నా అతి జాగ్రత్తగా వ్యవహరించే దానిని. యే కొద్ది అశ్రద్ధ అయినా బిడ్డకు యేమి ప్రమాదము ముంచుకొని వస్తుందోనని భయపడేదానిని.

హెల్త్ సమస్యలు తలెత్తాయి. నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు. అమ్మ అంతకు ముందే అక్కకు పుట్టిన బిడ్దను చూసుకోవడానికి అమెరికా వెళ్లింది.

ఇంకా ఎవరినైనా పిలిపించుకుందామనుకున్నాను. నా లాంటి వారిని ఎవరు ఆదరిస్తారు.

ఒంటరి దానిని. నిన్ను అవమానించి వెళ్లగొట్టిన దానిని.

అందుకే ఆ న్యూనతతో మీ అక్కయ్యను కానీ, మనకు తెలిసిన వారిని ఎవరినీ ఆసరకు పిలవలేదు.

మంచి పుస్తకాలు చదవుతూ, ప్రవచనాలు వింటూ, గుళ్ళూ, గోపురాలు తిరుగుతూ కాలము భారంగా గడిపాను.

అదే సమయములో నా బాధలను  గమనించిన మన కామన్ ఫ్రెండ్ విశాలి, భాగ్య అనే అమ్మాయిని నాకు అటెండెంట్‌గా పంపించింది. నెలలు నిండాయి. ఇలాంటి ఈ స్థితిలో నాకు అనిపించింది.

ఇంకా పుట్టని బిడ్దపైనే ఇంత మమకారము యేర్పడిందే, ఈ పుట్టుకకు కారణమైన మిమ్మల్ని యెలా దూరము చేసుకున్నానా అని. వెంటనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. అయినా యే ముఖము పెట్టుకొని పిలవాలి. చేసిందంతా చేసి, బాగా అవమానించి, కష్టాలు రాగానే పిలుస్తున్నానని అనుకుంటావనుకున్నాను. అందుకే ఎన్ని  కష్టాలు పడినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా నిన్ను పిలవలేదు. బిడ్డ పుట్టిన సంతోష ఘడియలోనే నీకు చెప్పాలనుకున్నాను. అలాగే చెప్పాను.

అరుణ్! ఇప్పుడు నాకు చాలా అనందముగా ఉంది. నేను తల్లిని అయ్యాను. భగవంతుడు  ఇచ్చే పదోన్నతిని పొందాను.

ఒక బిడ్డకు తల్లినయి, ఒక వరునికి కానుకగా ఇచ్చే ఐశ్వర్యాన్ని పొందాను.

ఫ్యామిలిలో మదర్ స్టేటస్ పొందాను.

ఐ ఏమ్ ఏ ఫూల్. భౌతికమైన, లౌకికమైన వానిని గొప్పగా భావించి, ప్రకృతి ప్రసాదాన్ని వద్దు అనుకున్నాను.

ప్రపంచములో దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులుగా ఉన్న స్త్రీలు, శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య రంగాలలో ఉన్న స్త్రీలు  వారి వారి ఉద్యోగవిధులు నిర్వహిస్తూనే మాతృత్వాన్ని, అమ్మతనములోని కమ్మతనాన్ని  ఆస్వాదిస్తూ, మరింత ఎత్తుకు ఎదగడము నన్ను బాగా ఆలోచించేలా చేసాయి.

ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి తమ నడుముకు బిడ్దను కట్టుకొని యుద్ధాలు చేయడము, అదే విధముగా ఎందరో మహానుభావుల జీవితాల వెనుక మాతృమూర్తుల ప్రేరణ, పశు పక్ష్యాదులు సహితము  మాతృత్వానికై తపించడము, నాకు మాతృస్థానము యొక్క గొప్పతనాన్ని అర్ధము చేయించింది” అంటూ ఊపిరి పీల్చుకొని అరుణ్ వైపు చూసింది.

అరుణ్ ముభావంగా,అభావంగా ఉన్నాడు.

మళ్ళీ హారిక “అరుణ్! సూటిగా చెబుతున్నాను. నేను పెద్ద తప్పు చేసాను. నిన్ను ఘోరంగా అవమానించాను. ముపై యేళ్ల నా జీవితములో నేర్చుకోనిది, ఈ ఆరు నెలలో నేర్చుకున్నాను. నన్ను క్షమించు. నన్నూ, నా బిడ్దను అక్కున చేర్చుకో. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డకు సేవ చేయడము ద్వారా, అత్మీయతా, ప్రేమ చూపడము ద్వారా నా పాపాన్ని కడుక్కుంటాను. ఇక పదోన్నతి, అమెరికా ప్రయాణము అంటావా? ప్రతిభా, పట్టుదల, శ్రమించే తత్వము ఉన్న వారికి ఈ రోజు కాకపోయినా ఏ నాటికైనా అవకాశాలు కలిసి వస్తాయి. రాకున్నా బాధ పడేది లేదు.

నేను తల్లిగా పెద్ద పదోన్నతి పొందాను. అపురూపాల బిడ్దను కని లక్షల విలువ చేసే ఆనందాన్ని సొంతము చేసుకున్నాను. మాతృత్వములోని మాధుర్యాన్ని పొందాను”  చెప్పదలుచుకున్నది చెప్పి, ఊపిరి పీల్చుకొని మంచముపై స్థిరముగా కూర్చున్నది.

అంత సేపు హావభవాలు, ఆంగిక చేష్టలతో ఏకపాత్రాభినయము చేసిన హారిక వైపు చూసిన అరుణ్ మరింత గంభీరముగా మారిపోయి హారికను ఉద్దేశిస్తూ..

“హారికా మేడము గారికి నమస్కారములు. మీ మాజీ భర్తకు బిడ్డను ప్రసాదించినందుకు బాధతో కూడిన అభినందనలు. మీరు ఇంత సేపు చెప్పారు. నన్ను కూడా చెప్పనివ్వండి.”

అరుణ్ వైపు భయంగా, సందేహగా, దిగులుగా చూస్తూ యేదో మాట్లాడబోయింది  హారిక.

హారికను మాట్లాడవద్దని చేయితో వారిస్తూ, “నీకు మాట్లాడే హక్కు చెప్పే హక్కు లేదు. కాలము  చాలా మహత్తరమైనది.

నీ ఆలోచనలు నిన్ను నడిపినట్లుగా, నీ నిర్ణయాలు నీవు తీసుకొన్నావు. అందుకే నా మనోభావాలను, ఆప్తభావాలను, ఆలోచనలను అవమానించావు.

నీ క్యాలిక్యులేషన్స్‌లో నీవున్నావు కానీ కాలము మనము వేసుకున్న లెక్కలు ప్రకారము, చేసుకున్న ప్రణాళికల ప్రకారముసాగదు.

అదేవిధంగా కాలానుగుణంగా మనలో ఆలోచనలలో ఎన్నో మార్పులు వచ్చినా, మనము మాట్లాడిన మాటలకు, చేసిన చేతలకు తగిన ఫలితాన్ని మాత్రము అనుభవించాల్సిందే.

పచ్చిమిరపకాయ తిన్నాక నోరు మండక మానదు కదా. వేడి నీళ్ళలో వేళ్ళు పెట్టి కాలిన తరువాత అయ్యో తప్పు చేసానే, చేతులు కాల్చుకున్నాను అంటే లాభము లేదు.

నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నీతో కలిసి ఆదర్శ గృహాన్ని నిర్మిద్దామనుకున్నాను. కాని అమెరికా, పదోన్నతి, స్టేటస్ అంటూ నన్ను అవమానించి దూరము చేసావు. నిన్ను వదిలిన మరుక్షణమే నిన్ను నా మనసులో నుండి తొలగించుకున్నాను.

ఇదే సమయములో ఒకానొక పాత స్నేహితురాలు భర్తను కోల్పోయి ఒంటరిగా ఉందని విన్నాను. వెంటనే ప్రపోజల్ చేసాను. ఆమె పేరు విమల.

ఆమె విశాల హృదయముతో నన్నే కాదు, నాకు పుట్టబోయే బిడ్డను కూడా తన జీవితములోకి ఆహ్వానించింది. నన్ను నన్నుగా చూసే భార్యా, నా బిడ్డను తల్లిగా చూసుకొనే తల్లి లభించింది. త్వరలోనే మా పెళ్ళి.

దయచేసి అక్కడికి రావద్దు. ఎందుకంటే ఆ వైభవాన్ని తట్టుకోలేవు. నాకు కాబోయే భార్య నీ కంటే మానసికంగా అందమైనది. నీకంటే ఆధ్యాత్మిక సంపన్నత, సంవేదనా, సంతులన శక్తి కలిగినది. ఉన్నతమైన ఔదార్యము, కారుణ్యము కలిగినది.

ఆమెను  పెళ్లి చేసుకోవడము ద్వారా నాకు భార్యయే కాక నాకూ,నా బిడ్దకు ఒక తల్లి కూడా లభిస్తుంది.

ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఒక సంపూర్ణ స్త్రీ.

మరొకమాట ఇపుడు నీలో కొత్త ఆలోచనలు కలిగాయి కాబట్టి బిడ్డను ఇవ్వనంటే అది నీ యిష్టము, నా  బిడ్ద స్వయముగా తాను నావద్దకు రావాలనుకునేంత వరకు ఎదురు చూస్తాను. ఎప్పుడు వచ్చినా బిడ్డ బాధ్యతలను ఆనందముగా స్వీకరిస్తాను. అన్నట్లు విడాకు పేపర్లు పంపుతాను, సంతకాలు చేసి పంపించు. బాధపడవద్దు, నా ఆస్తి తెగనమ్మి అయినా సరే నీవు కోరిన మనోవర్తి ఇస్తాను.

నీవులేని వేళ రోడ్దుమీద అడుక్కు తిన్నా ఆనందమే. బిడ్డను కని ఇచ్చినందుకు నీ శ్రమ కూడా ఉంచుకోను. సరోగేట్ మదర్‌కు ఇచ్చే చార్జెస్ పే చేస్తాను.

చివరగా మరొకమాట ఎన్నడూ కాలము మన చెప్పుచేతుల్లో నడవదు. నీ ఆలోచనలు మారినా,ఎదుటి వారు నీ ఆలోచనలకు అనుగుణంగా మారుతారు అనుకోవడము బుద్ధితక్కువ. ఈ విషయాలు చెప్పడానికి వచ్చాను” అంటూ అవేశంగా అక్కడి నుండి వెళ్ళాడు.

***

స్వయంకృతాపరాధానికి చింతిస్తూ, ఎంత సేపు యేడ్చి, యేడ్చి నిదురపోయిందో తెలియదు.

అటెండెంట్ భాగ్య లేపడముతో మేలుకుంది హారిక.

ఎదురుగా అరుణ్, అరుణ్ వాళ్ళ అక్కయ్య, అరుణ్ వాళ్ళ నాన్న.

ఏమి జరుగబోతుందో అర్థము కాకపోయినా అందరినీ పలకరించింది.

అరుణ్ వాళ్ళ అక్కయ్య పాపను దగ్గరికి తీసుకొని, “కంగ్రాట్స్ వదినా! పాప అందముగా ఉంది. అచ్చము మా అమ్మలా ఉంది” అంటూ పాపను దగ్గరికి తీసుకొని హత్తుకొని, తండ్రి చేతిలో పెట్టింది.

“నాకు చాలా అనందముగా ఉంది. పాప ముద్దుగా ఉంది. డాక్టర్ గారితో మాట్లాడాను. సాయంత్రము డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. అరుణ్‌తో కలిసి ఇంటికి వచ్చేయి. అమ్మాయి కూడ ఒక నెలపాటు నీకు తోడుగా ఉంటుంది. అరుణ్‌ను కూడా లీవ్ పెట్టమని చెప్పాను. అతడు కూడా ఈ నెల అంతా డ్యూటీ వదులుకొని  మన దగ్గరే ఉంటాడు. నేను ఇంటికి వెళ్ళి నీకు, పాపకు కావలసిన యేర్పాట్లు చేస్తాను. జాగ్రత్తగా వచ్చేయండి. వెళ్లి వస్తాను” అంటూ కోడలితో ప్రేమగా మాట్లాడి, తన మెడలో నున్న బంగారు గొలుసును పాప మేడలో వేసి వెళ్లిపోయాడు.

అరుణ్ అక్కయ్య కూడా ”నాన్న ఒక్కరే వెళుతున్నారు. నేను ఇంటికి వెళ్ళి కావలసిన యేర్పాట్లు చూస్తాను. మీరు జాగ్ర్త్తత్తగా వచ్చేయండి” అంటూ తండ్రితో పాటు వెళ్ళిపోయింది.

యేదో పని పురమాయించి అటెండెంట్‌ను  అరుణ్ బయటికి పంపాడు.

హారిక అరుణ్ వైపు ఆశ్చర్యంగా, ప్రశ్నార్థకంగా, సందేహంగా చూసింది.

అరుణ్ హారిక దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాడు.

“పిచ్చిదానా! నేను నిన్ను విడిచి ఉండగలనా? పాప పుట్టినదని తెలియగానే చాలా ఆనందము కలిగింది. వెంటనే పరుగెత్తుకు వచ్చాను. నేను భౌతికంగా దూరంగా ఉన్నా నిన్నూ, నీ బాగోగులను చూస్తునే ఉన్నాను. మన కామన్ ఫ్రెండ్ విశాలికి చెప్పి అటెండెంట్‌ను యేర్పాటు చేయించింది నేనే. ఈ హాస్పిటల్‌లో చేరేలా చేసింది నేనే. అంతేకాదు డాక్టర్ హైమ గారితో గత కొన్ని రోజులుగా ప్రతి దినము మాట్లాడి, నీ బాగోగులు తెలుసుకున్నది నేనే. నీవు ఏడవ నెలలో ఉన్నప్పుడు మెట్ల మీదనుండి జారి పడ్డావని తెలిసిన మరుక్షణము అంబులెన్స్ యేర్పాటు చేసి, హాస్పిటల్‌కు పంపినది నేనే. ఇలా చెప్పుకుంటూ పోతే యెన్నో.

నీవు ఇక్కడ గర్భము దాలిస్తే, నేను అక్కడ భారాన్ని మోసాను. నీవు ఇక్కడ పుట్ట బోయే బిడ్ద గురించి కలలు కంటుంటే, నేను మన ఇద్దరము, ముగ్గురుగా మారబోయే రోజు కోసము ఆశగా ఎదురుచూసాను” అంటూ ఆమె వైపు ప్రేమగా చూసాడు అరుణ్.

హారిక అదంతా విని విస్మయము చెందినదై, మళ్ళీ కాసేపు దుఃఖించి, యేదో గుర్తుకు వచ్చిన దానిలా

“మరి ఇంతకు ముందు అలా మాట్లాడారే?” అని అడిగింది.

“నిన్ను వదిలి వెళ్లిన తరునాత భౌతికముగా నీకు దూరమయ్యానే తప్ప మానసికంగా యేనాడు నిన్ను వదులుకోలేదు. అందుకే అంతటి  అవమానాన్ని, వేదనను దిగమింగి ప్రతిక్షణము నీ నీడలా నిన్ననుసరిస్తూ, నీ ఆలనాపాలనా చూసుకున్నాను. క్షణక్షణము నీ యోగ క్షేమాలు కనుక్కోవడములో మునిగిపోయాను.

ఆ రోజు నీవు నన్ను తూలనాడినపుడు నిన్ను చూస్తే, సంతలో బొమ్మ కోసము నేల మీద పడి యేడ్చే పసిపిల్లలా అనిపించింది. మనిషి యెదిగింది తప్ప బుద్ధి యెదగలేదు అనిపించింది. అపరిపక్వమైన, బుద్ధి యెదగలేని మనుషులను పనిష్ చేయడము పాపము అనిపించింది. నీ మీద జాలి తప్ప కోపము రాలేదు. నీకు దూరంగా ఉన్నా, నీ గురించి అనుక్షణము తెలుసుకుంటూనే ఉన్నాను.

క్రమంగా నీలో వస్తున్న మార్పులను భాగ్య ద్వారా, విశాలి ద్వారా తెలుసుకుంటునే ఉన్నాను.

అయితే ఆ మార్పు శాశ్వతముగా వచ్చే వరకు వేచి చూడాలని ఇన్ని రోజులు ఎదురుచూసాను.

అయితే నా మనసులో ఎక్కడో నీవు చేసిన గాయము అపుడపుడు రేపుతుండేది.

ఎంతైనా మగాణ్ణి కదా? నా అహము నాకుంటుంది కదా. నీకే అంతుంటే నాకు ఎంతుండాలి? అందుకే నేనేమిటో,యేమి చేయగలనో నీకు తెలియచెప్పాలనిపించింది. అందుకే పెళ్ళీ, విడాకులు అంటూ చిన్న షో చేసాను.

హారికా! మనము భార్యాభర్తలుగా కాట్ల కుక్కలలా పోట్లాడుకున్నా పరవాలేదు.

తల్లిదండ్రులమైన తరువాత ఆ హక్కు మనకు లేదు. ఉండేదల్లా బాధ్యతనే. అయితే అది అందమైనది, ఆనందకరమైనది. బాధ పడినట్లున్నావు? బాగ యేడ్చినట్లున్నావు. కళ్ళు బాగా ఎర్రబడ్డాయి” అంటూ మరింత  దగ్గరికి తీసుకున్నాడు.

“హమ్మయ్య!ఎంత హడలిచ్చాను. నా పై ప్రాణాలు పైననే పోయాయి. అంతా నిజమే అనుకున్నాను. నాకు ఆ మాత్రము పనిష్మెంట్ కావల్సినదే. మీరు వెళ్లిపోగానే ఎలా మిమ్మల్ని ప్రసన్నము చేసుకోవాలో అన్న అలోచనలతో  కొట్టుమిట్టాడాను. ఇదిగో ఇపుడే చెబుతున్నాను. మీరు, యీ పాపే నాలోకము. మీ మాటే నాకు వేదము” అంటుండగా పాప యేడుపు వినిపించింది. పాపను సముదాయించడానికి ఇద్దరూ కలిసి ఉయ్యాల దగ్గరికి వెళ్ళారు.