[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]ఫో[/dropcap]ను రింగయ్యింది. ఫోనులో వచ్చిన పేరు చూసి
“ఎందుకే ఫోను చెయ్యనే చెయ్యవు? మీ అక్క చూడు. రోజుకొకసారి పలకరించనిదే రోజు గడవదు దానికి…” పార్వతమ్మ మాటలు పూర్తి కాకనే
“ఒక వేళ అక్క రెండురోజులు ఫోను చెయ్యకపోతే నీవే చేసి మాట్లాడుతావు కదా”.
“అవునే రోజూ ఫోను చేసేది ఎందుకు చెయ్యలేదా అని నేనే అడుగుతాను ఏమయ్యిందే అని”
“కదా… అదే నేను ఫోను చేసి పదిరోజులు దాటినా ఏనాడైనా పలకరించావా? ఏమైందే? ఎలా వున్నావు? అని అడిగావా??” కరుకుగా అనిపించింది మంజు గొంతు.
“అదేమిటే అలా అంటావు? పెద్దసంసారం నీది. ఎంతమంది మనుష్యులు మీ ఇంట్లో. నీకు తీరికగా మాట్లాడే టైం ఉంటుందా? ఫోను చేసినా ‘అత్తగారికి బాగా లేదనో, మరిది వూరికి వెడుతున్నాడనో’ ఏదో ఒక కారణం చెబుతూ ఎక్కువసేపు మాట్లాడవు కూడా. అక్కది ఒంటరి జీవితమే కదా. తనూ మొగుడూ… కడుపు వచ్చినా నిలవకపాయె… బావ ఆఫీసుకి వెళ్ళిపోతే ఏమీ తోచక నాతో మాట్లాడుతుంది.”
“దేనికైనా సమాధానాలు బాగానే చెబుతావు నీవు. గుండెల మీద చెయ్యి వేసుకుని నిన్ను నీవే అడుగు… అక్కకూ నాకూ నువ్వు చూపే తేడా…” పెట్టేసింది మంజు. ఆ మాట అంటూంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
బాత్రూం వెళ్లి ముఖం మీద చల్లనీళ్ళు చల్లుకుని వచ్చి గదిలో మంచం మీద పడుకుంది… మనసు నిండా ఆలోచనలు ముసురు కుంటున్నాయి. అమ్మకు ఇంకా చాలా చెప్పాలనివుంది. ఫోనులో చెప్పే టైము వుండదు. పోనీ ఒక ఉత్తరంలా రాసి పెడితే… ఆలోచనతో లేచి పేపరూ పెన్నూ తీసుకుంది.
“అమ్మా,
ఫోనులో నేను అలా మాట్లాడినందుకు కారణాలు వున్నాయి. అందుకే నా మనసులో మాట నీకు తెలియాలి.
నాన్న బతికి ఉన్నప్పుడు చేసిన సంబంధం బావ రవిది అక్క రాధకు. పెళ్లికి బాగానే ఖర్చు పెట్టి చేశారు. పైగా బావగారు ఆఫీసరు! నాకూ అలాగే చెయ్యాలని మీరు అనుకున్నా నాన్న హఠాత్తుగా పోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. మూడేళ్ళలో నా వయసు పెరిగింది. తమ్ముడి చదువుతో మీ బ్యాంకు బాలెన్స్ తరిగింది. నాకు ఘనంగా పెళ్లి చెయ్యడం కలలో మాటే. అప్పుడు తమకు తాముగా వచ్చిన సంబంధం మా ఆయన మురళిది. డిగ్రీ పాసయినా ఇంటి పెద్దకొడుకుగా, బాధ్యతగా వ్యవసాయం లోకి దిగినవాడు ఆయన. పల్లెలో ఉండటానికి ఇష్టపడే అమ్మాయి అయితే చాలని అన్నారు. అప్పుడు నీవు నాతో
“మంజూ, ఈ సంబంధం ఒప్పుకుంటే బాగుంటుంది. ఉద్యోగం చెయ్యడని ఒకటే గానీ నలుగురికి అన్నం పెట్టే కుటుంబం. అక్కలాగా ఆఫీసరు కావాలంటే బోలెడు కట్నం ఇవ్వాలి. ..ఆలోచించు” అన్నావు.
తమ్ముడి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేయడానికి ఇంకా టైము పడుతుంది. మురళిని చేసుకొంటే కొంతవరకూ సమస్యలు తీరుతాయి అనుకుని సరే’ అన్నాను.
నా పెళ్లి లోనే బావగారికి ఎక్కడ అమర్యాద జరుగుతుందో అనే ఎక్కువ తాపత్రయ పడ్డారు మీరు.
మురళి వాళ్ళ కుటుంబం పెళ్లిలో వ్యవహరించిన తీరుతో పల్లెటూరి వారైనా ఎంతో సంస్కారవంతంగా అనిపించింది.
తరువాతి రోజుల్లో అక్కను నన్ను పండగలకు పిలిచే తీరులో గానీ, మాకు పెట్టె చీరలలో గానీ మీరు చూపిన వ్యత్యాసం నన్ను క్రమంగా మీకు దూరం చేసింది.
ఎప్పుడూ బావకి మీరు ఇచ్చే గౌరవం ప్రత్యేకం! అదే మా ఆయన వస్తే అందరికీ సామాన్యమే ఎందుకని ఈ వివక్ష? బావ ఆఫీసరుగా పని చేస్తున్నాడనే అంత గౌరవమా? ఆయన రాగానే “రండి కూర్చోండి…కాఫీ తాగుతారా? స్నానం చేసి రండి. వేడిగా మసాలా దోశ వేస్తాను” అని పలకరింపు.
మా ఆయన వస్తే “ఓ మురళీ ఇప్పుడేనా రావటం ..” అని వంటింట్లో నుండే పలకరింపు. నేను గమనించ లేదు అనుకున్నావా??
ఇద్దరూ ఇంటి అల్లుళ్ళే కదా. ఇంత వ్యత్యాసం ఎందుకు?? ఫోను చేసినప్పుడు నేను అత్తగారి అనారోగ్యం వల్లనో, ఆడబడుచు పనులవల్లనో ఎక్కువసేపు మాట్లాడలేను అన్నప్పుడు నీవు గర్వపడాలి గానీ ఎందుకు? అని అడగ కూడదు.
అమ్మా తల్లులు కూడా ప్రేమలో తేడా చూపుతారు అని చెబితే ఎవరూ నమ్మరు. పిల్లలందరూ తల్లికి సమానమే అంటారు. కానీ నేను తల్లి తన ప్రేమలో తేడా చూపుతుంది అని ఉదాహరణలతో చెప్పగలను. కానీ చెప్పి ప్రయోజనం ఏమిటి?
మౌనంగా వుండి పోతే మన మధ్య సంబంధాలు బాగానే వుంటాయి అన్న భావనలో వున్నాను..”
***
మంజు ఉత్తరం అందుకున్న పార్వతమ్మకు మనసు చాలా బేజారు అయ్యింది.
తను తేడా చూపిందా? రాధ అన్నా, మంజు అన్నా తనకు రెండు కళ్ళ వంటి వారు అనుకోలేదా?
అప్పుడే రాధ ఫోను చేసినా సరిగా మాట్లాడలేక పోయింది.
“ఏమిటి? ఈ రోజు ఉత్సాహంగా లేవు?” అన్న రాధతో
“తలనొప్పిగా వుంది. తరువాత మాట్లాడతా”అని ఫోను కట్ చేసింది.
మళ్ళీ ఆలోచించసాగింది.
పెళ్లి విషయంలో కాస్త తేడా వచ్చింది… రాధ పెళ్ళప్పుడు వాళ్ళ నాన్న వున్నాడు. ఆయన హఠాత్తుగా పోయేసరికి ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. అది అర్థం చేసుకునే కదా మంజు పల్లెటూరి సంబందానికి ఒప్పుకుంది.
ఒక అల్లుడు ఆఫీసరు, ఇంకొక అల్లుడు సామాన్యుడు అన్న తేడా ఎక్కడ వచ్చినట్టు??
‘హోదా’ కొత్త అయిన తమకు హోదాలో వున్న అల్లుడికి ఏమీ తక్కువ జరగకూడదు అని కాస్త జాగ్ర్తత్త పడటం తప్పించి మనసులో కూడా మురళికి ఏనాడూ తక్కువ చెయ్యలేదే… ఆఫీసరు హాలులో సోఫాలో కూర్చుంటే, చనువుగా లోపలి వచ్చి పలకరించే మురళి తమ మనస్సులో కూర్చోలేదా?
రాధకు అత్తా మామ ఇద్దరూ లేకపోవడం, మరిది అమెరికాలో వుండటంతో అత్తగారింటి వైపు ఎక్కువ రాకపోకలు వుండవు. ఒంటరితనం ఎక్కువై, కాలక్షేపానికి తనకు తానుగా రోజూ అమ్మతో మాట్లాడ్డం అలవాటు చేసుకుంది. పైగా రెండు సార్లు అబార్షన్ కావడంతో కాస్త డిప్రెషన్ లోకి వెడుతున్నట్టు అనిపించి తను కూడా కొంచెం ఎక్కువగానే మాట్లాడుతూ ఉండవచ్చు.
మంజుకు ఆప్యాయంగా చూసుకునే అత్తగారు, ఆడబడుచు, మరిది… వీళ్ళ అన్ని అవసరాలనూ చూసుకుంటూ మంజు ఆ ఇంట్లో దేవతలా వెలిగిపోతూందని ఎంత సంతోషం తనకు. పల్లెలో వున్నా, ఇంటినిండా ధాన్యంతో, నలుగురికి అన్నం పెట్టే యోగ్యత కలిగి, అందరి తలలో నాలుకలా మెలిగే మురళి అంటే ఎంత గౌరవం!
రాధకు హోదా, సిటీ జీవితం తప్ప, వచ్చిపోయే మనుష్యుల సందడి లేకపోవడమే కాకుండా ఇంట్లో చిన్నపిల్లలు పారాడే అదృష్టం కూడా దూరంగా పోతూ వుండటం మనసుకు బాధ కలిగించడం లేదా??
ఇవన్నీ మంజుకు చెప్పాలని తన సందేహాలకు సమాధానాలు తన దగ్గరవున్నాయని అనిపించి మనసు తేలిక అయింది పార్వతమ్మకు
కానీ ఇంకా అమ్మగా ఆలోచిస్తే…
ఇద్దరు ఆడపిల్లల తరువాత ఎనిమిదేళ్ళకి పుట్టిన రాజా అంటేనే నీకు ఇష్టం’ అన్నారు ఆనాడు రాధా, మంజు. చిన్నవాడని ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం వుందని చెప్పినా అర్థం చేసుకునేంత వయసు లేదని సమాధానం చెప్పేది కాదు. అప్పుడు కూడా అమ్మ ప్రేమలో తేడా ఉన్నట్టేనా?
‘ఒకరు బాగా చదువుకుంటూ వుంటే ఇంకొకరిని చదువుకో’ అని చెప్పినా అమ్మ ప్రేమలో తేడా నేనా?
పక్కింటి శారదమ్మ మొన్న మాట్లాడినప్పుడు ఏమంది?
‘చిన్న కూతురు అమెరికాలో వుందని దానికోసమే నీ తాపత్రయం అంతా, నిన్ను ఇక్కడ ఉంచుకుని అన్నీ చేసిపెట్టే నేను అంటే లెక్కేలేదు” అన్నదట ఆమె పెద్దకూతురు నాగమణి.
“కంటి ఎదురుగా లేని మనిషి గురించి ఆలోచించడం తప్పా పార్వతమ్మా?” అని తను ఏమీ సమాధానం చెప్పలేకపోయింది ఎందుకంటే అమెరికా అంత దూరంలో వున్న ఆ పిల్లకి కూడా అమ్మ మీద మమకారం ఉంటుందికదా… దగ్గరగా లేను అన్న బాధ ఉండదా??
అమ్మ చిన్నప్పటి నుండీ ఒక ప్రేమస్వరూపం అనీ, ఆకలి తీర్చే అన్నపూర్ణ అనీ, నడక నేర్చినప్పటి నుండీ ఒక దిక్సూచిగా, జీవితంలో పిల్లలు వేసే ప్రతి అడుగుకూ ఒక మార్గదర్శకంగా ఉండే అమ్మ ఒక భద్రత కాదా??
ఇల్లాలిగా మొదలై అమ్మగా మారాక కడుపులో తన్నులతో మొదలై, లాలిస్తూ, ప్రేమతో, కరుణతో అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ, ఒక గురువుగా అన్నిరకాలయిన విద్యలూ నేర్పుతూ, ఎప్పుడూ మీగురించే ఆలోచనలు చేస్తూ తన శ్వాశ, ఊపిరి అన్నీ పిల్లలే అన్నట్టుగా బతుకుతూ, ఎదుగుతూవున్న పిల్లలకు తోడుగా, ఒక తోబుట్టువులా ఆలోచన చేసే అమ్మ ప్రేమలో తేడా? అని ఎలా అంటారు??
మీ ఆలోచనలే తేడా వున్నాయని ఎందుకు అనుకోరు??
అందుకే తల్లి ప్రేమలో తేడా అన్నదానికి సమాధానంగా
“పిల్లల జీవితాల్లోని ఏదైనా కొరతను బట్టి తల్లి సహకారం అందిస్తుందే తప్ప ప్రేమలో తేడా వుండదు. అది వేరుగా అర్థం చేసుకుని ప్రతి సన్నివేశాన్నీవేరుగా చిత్రీకరించుకుంటే తల్లి తప్పా ??
అమ్మ ఇష్టాయిష్టాలు తెలిపే పద్దతిలో అనాలోచితంగా కాస్త తేడా ఉన్నా పిల్లలు మైక్రోస్కోప్‌లో చూసే విషయాలు ఉంటాయని గ్రహించండి తల్లులూ…..” అని ఒక హెచ్చరిక చెయ్యాలనిపించింది పార్వతమ్మకు.