17. ఈ క్షణవైరాగ్యం

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీలలో సంచిక సంపాదకవర్గం వారి ప్రోత్సాహక బహుమతి పొందిన కవిత.[/box]

[dropcap]ఒ[/dropcap]కనికి చూపులేదు మరియొక్కనికిన్ వినిపింపబోదు వే
రొకనికి మాటరాదు మతి యొక్కనికిన్ స్తిమితంబు కాదు నే
నొకడిని వేరుగా మిగిలి యుంటిని మంచితనంబు లేక యిం
కొకరును నావలెన్ గల రహో భగవంతుడ! నిర్దయామయా!

తగునా నీకిది ? నావలెన్ కరకుడెందంబున్ వినోదింప నే
ల? గుడిన్ రాయిగ నైతివో? పరమదుర్మార్గుండ నేనే నిజం
బుగ నీరైతిని లిప్తపాటు! కరుణాంభోధీ ! జలంబింకెనా ?
చిగురుల్ చిద్రములవ్వ చూచెదవె సాక్షీభూతమై దెయ్యమై!

వైకల్యంబున నున్నవారనుచు నవ్వారిన్ సమీపింప నా
వైకల్యంబులు వెల్లడయ్యె నిదె నాభాగ్యంబు లోపంబులే
దాకారంబున జూడకాని తరమా ? ఆ రీతి స్వచ్చంబుగా
లోకాతీతుని కాలిమువ్వగ సుధల్ రువ్వంగగా నవ్వగా !

పుట్టితినేల? పుట్టితినిబో! యతి మూర్ఖత నిన్ని యేళ్ళుగా
పట్టితినేలనో అహము ? పట్టితిబో! పది మందిత్రోవలో
నెట్టులొ బోవ కీ పలవరించుటలేల? అహంబునింకనూ
గట్టిగ చుట్టి వట్టి పడిగట్టుపదంబుల కైతలేలనో?

నేననుదాని లోతులను నేర్వని వాడను నాకు జన్మమా
దేనికి? లక్షమున్ మరచు ద్రిమ్మరికేల విశాల విశ్వముల్
లోనికి చూపుకన్పపడని గ్రుడ్డికి దేనికి సృష్టి యందముల్
మౌనము చేతగానపుడు మాటలు పద్యములేల దైవమా!

బ్రతుకుట కష్టమై బ్రతుకువారలనేకులు నిండియున్న యీ
అతుకులబొంత విశ్వమున కర్థమెరుంగక పిచ్చివానిలా
బ్రతుకుచునున్న నాకు సదుపాయములేల పొగడ్తలేలనో
బ్రతుకుచునుంటి చాలు నను భావన నిత్యము నిండనీయుమా!

నే లేకున్నను లోపమేమి జగతిన్ నేనున్న నే లాభమో
చాలీచాలని బుద్ధితో మిగిలితిన్ సాధింపనేమున్నదో
ఈ లోకంబున చేయనేమి గలదో ఈ సృష్టి దే గమ్యమో
కాలక్షేపవికారముల్ మనిషి లక్ష్యంబుల్ మనఃకల్పనల్ !

కారణమేమిటో జగతి గమ్యమదేమిటి దారియేమిటో
తీరముకానరాని జలధిన్ పడిదేలుచు మున్గుటేమి? సం
సారఫలంబులోనసలు సారమదేమిటి రూపమేమిటో
పేరుకునెట్టులో బ్రతుకు పిచ్చితనంబు మదీయకార్యముల్!

ఎక్కడికేగు నూహతతి? యెక్కడ నా యనుభూతి దాగు? తా
మెక్కడ నాగు భావనలు? హృన్మథనంబున రేగిరేగి నల్
దిక్కుల పొంగిపోయినవి తిక్తము తీపు లవెక్క డింకెనో ?
అక్కడ నేను జేరు సమయంబది యెప్పుడు వచ్చునో గదా!