17. మళ్ళీ వసంతం

0
2

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]కృ[/dropcap]ష్ణమూర్తికి చాలా అసహనంగా ఉంది. ‘అప్పుడెప్పుడో చూసిన ‘ఆదిత్య 369′ సినిమాలోలాగా కాలం గిర్రున పాతికేళ్ళు వెనక్కి వెళ్ళి తన ప్రయాణం మళ్ళీ సరికొత్తగా మొదలుపెడితే ఎంత బాగుంటుందీ?’ అనిపిస్తోంది. అమ్మ, నాన్న, ఆ వయసులో అల్లర్లూ, ఆ రోజులూ అన్నీ గుర్తుకు వస్తున్నాయి.

పల్లె, నగరం కాని ఒక చిన్న పట్టణంలో తన తండ్రి లక్ష్మణమూర్తి గవర్నమెంటు బ్యాంకులో ఒక మామూలు స్థాయి ఉద్యోగిగా ఉండేవారు. అందరికీ తలలో నాలుకగా ఉండే ఆయనంటే ఊర్లో అందరికీ ఎంతో గౌరవం ఉండేది. తల్లి అన్నపూర్ణ సాధారణ గృహిణి. తల్లిదండ్రుల తరఫు కుటుంబాలు చాలా పెద్దవి కావడంతో, వచ్చిపోయేవాళ్ళతో ఇల్లంతా ఎపుడూ సందడిగా ఉండేది.

అయితే ఎదిగీ ఎదుగుతున్న వయసులో తనకు ఆ వాతావరణం అస్సలు నచ్చేది కాదు. అమ్మ, నాన్న తమ పిల్లలమయిన తమకు మాత్రమే పూర్తి సమయం కేటాయించకుండా బంధుగణంలో పిల్లలందరితోనూ సమానంగా గడుపుతూ ఉంటే తాను ఎంతో కుతకుతలాడిపోయేవాడు. తాను ఏది కొనమని సరదాపడినా సరే, ‘ఇప్పుడు వాటి అవసరమేముంది కృష్ణా?’ అనేవారు. ఫ్రెండ్స్ లాగానే తాను కూడా అన్ని సినిమాలకు వెళ్ళాలనీ, దూర ప్రదేశాలకు తిరిగాలనీ తనకీ ఎంతో కోరికగా ఉండేది. అదే విషయం మీద ఇంట్లో అప్పుడప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు.

“కన్నా! మనది మధ్య తరగతి కుటుంబం. దుబారాగా ఖర్చు పెట్టడానికి తగ్గ తాహతు మనకి లేదు. నువ్వు ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని మసలుకో. చదువు మీద మరింత దృష్టి పెట్టు. ఈ వయసులో బాగా చదువుకుంటేనే పెద్దయ్యాక పూర్తిగా సుఖపడతావు” అని ఆ రోజు తల్లీ, తండ్రి చెప్పిన విషయాలు తనకి మరోలా అర్థమయ్యాయా? ఏమో…

ఆ రోజు నుండీ కసీ పట్టుదల మరింత పెరిగాయి. పూర్తిగా చదువుకే పరిమితమయ్యాడు. ఎవరితోనూ సరిగా కలిసేవాడు కాదు. ఇంటర్‌లో మంచి మార్కులతో పాటు ఎమ్‌సెట్‌లో కూడా మంచి ర్యాంకు రావడంతో ఇంజనీరింగ్‍లో సీటు వచ్చింది. అందరూ ఎంతో సంతోషించారు. కానీ తనకు అప్పుడు కూడా ఏదో అసంతృప్తి! ‘తండ్రి తనని ఉన్న ఊరి గవర్నమెంటు కాలేజీలో కాక, విశాఖపట్టణంలోని పేరున్న పెద్ద కాలేజీలో జాయిన్ చేసి ఉంటే, ఐఐటిలో సీటు వచ్చి ఉండేదేమో’ అని! ‘ఇంటికి వచ్చే చుట్టాల తాకిడితో అయ్యే ఖర్చు తగ్గించుకుంటే ఆ అవకాశం ఉండేది కదా?’ అని మనసులో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తిట్టుకునేవాడు.

“నాన్నా కృష్ణా! జీవితంలో అసంతృప్తిని ఎపుడూ దరి చేరనీయకు! నీకు వచ్చిన ర్యాంకుకు మన ఆంధ్రా యూనివర్సిటీలోనే, నీకు నచ్చిన కంప్యూటర్ సైన్సులో సీటు వస్తుంది. అందరమూ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఉంటాము కదా! ఒంటరితనమే అనిపించదు. హాయిగా చదువుకోవచ్చు” అని చెప్పేదేది తన బుర్రకెక్కలేదు.

ఇంజనీరింగ్ చదువుతూనే తన కలల ధామమయిన ‘అమెరికా’లోని మంచి యూనివర్సిటీలో ‘ఎం.ఎస్’ సీటు వచ్చింది. ‘ఇంట్లో ఏమంటారో? అమెరికా వెళ్ళడానికి తగిన డబ్బు సర్దుబాటు అవుతుందా’ అన్న సందిగ్ధత.

కానీ, తన ఆలోచనలకు విరుద్ధంగా, ఆశ్చర్యంగా ఇంట్లో అంతా, ఎంతో సంతోషించారు. తాను వెళ్ళడానికి తగ్గ డబ్బు ఏర్పాట్లన్నీ తన తండ్రితో పాటుగా మావయ్యలు, బాబయ్యలు చూసుకుంటే, తన సరంజామా అంతా తల్లితో పాటు అత్తలు, పిన్నిలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా సమకూర్చారు.

“ఈ సంతోష సమయాన్ని ఎప్పుడూ మర్చిపోకు కృష్ణా! ఏ దేశంలో ఉన్నా మాతృదేశాన్ని, జన్మనిచ్చిన కుటుంబ బాంధవ్యాలను ఎప్పుడూ మరవకు. వారందరి అండదండలే మనకు ఎప్పటికీ శ్రీరామరక్ష!”

‘అబ్బా! మళ్ళీ ప్రారంభించారా నీతి వాక్యాలు? హాయిగా ఒక్కడినే ఉండాలి అన్న తన కల ఇప్పటికైనా తీరబోతోంది’ అనుకుంటూ, ఒకింత బాధతో, అంతకు రెట్టింపు ఆనందంతో అందరికీ బై చెప్పి, విమానం ఎక్కాడు కృష్ణమూర్తి.

అక్కడ కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, చదువు, పార్ట్‌టైమ్ ఉద్యోగం వంటి విషయాలతో సమయం ఎలా గడిచిపోతోందో తెలిసేది కాదు. ఇలా చెయ్యి, అలా చెయ్యకు అని చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో, తనకు నచ్చినట్లు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యడం, కొత్త కొత్త ప్రదేశాలు తిరగడంతో ఎంతో ఆనందంగా అనిపించేది. మధ్య మధ్యలో ఇంటికి ఫోన్ చేసి పలకరించేవాడు.

అక్కడే తనకి జూనియర్‌గా వచ్చిన శాంతితో ప్రేమలో పడి, పెళ్ళి చేసుకుందామని అనుకున్నా, కులాలు వేరవడంతో ఇంట్లో ఏమంటారో అని సందేహపడ్డాడు. మనసులో కొద్దిగా బాధపడినా సరే, “నీ ఇష్టమే మా ఇష్టం కన్నా! నీ సంతోషం కన్నా మాకేమి కావాలి చెప్పు” అని తల్లిదండ్రుకు ఆశీర్వదించడంతో పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్ళయి పదిరోజులు కూడ తిరగకుండానే, శాంతికి తమవాళ్ళు పూర్తిగా పరిచయం కాకుండానే, ఇద్దరికీ సెలవులు లేకపోవడంతో వెంటనే తిరిగి అమెరికా వచ్చేయవలసి వచ్చింది. ఒక సంవత్సరం తరువాత తన తల్లీ, తండ్రి అమెరికా వచ్చినా, వారితో గడిపే సమయం కూడా తమకు లేకపోవడం, శాంతి వారితో కొత్తవారిలాగానే గడపడం, సంప్రదాయాలలో తేడాలతో అన్యమనస్కంగానే తిరిగి ఇండియా వెళ్తున్న వారిని, ఆ తేడా గమనించినా సరే, ఏమీ తెలియనివాడిలా, వారికీ, మిగతా బంధువులు అందరికీ కావాలసిన బహుమతులు కొని ఇచ్చి వారిని ఇండియా పంపించేశాడు. ‘వారికి కావలసినది వారితో సమయం గడపడమే కానీ, ఖరీదయిన బహుమతులు కాదు!’ అని తెలిసినా సరే!

తరువాత కొంత కాలానికి శాంతి కన్సీవ్ అయిందని తెలిసి, అందరూ ఎంతో సంతోషించారు. అయితే ఇండియా వెళితే, బేబీకి గ్రీన్‌కార్డు రాదు కాబట్టి, డెలివరీ అక్కడే జరగాలని నిర్ణయించుకున్నారు శాంతి, కృష్ణమూర్తి.

అభినవ్ పుట్టిన తరువాత, ఇద్దరికీ ఉద్యోగాలలో ప్రమోషన్ రావడంతో, వాడి మీద మరీ గారాబం పెరిగిపోయింది. ఏది కావాలంటే అది సమకూర్చేవారు. అయితే అదే సమయంలో ఇద్దరికీ ఉద్యోగ బాధ్యతలతో ఇంటిని సరిగా పట్టించుకోకపోవడంతో, అభినవ్ ఒంటరిగా పెరగడంతో తనలో మొండితనం అన్నది ప్రారంభమైంది. ‘పిల్లాడు ఒక్కడే ఉండవలసి వస్తోంది’ అన్న నెపంతో అన్ని ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లు, ఖరీదయిన బొమ్మలతో ఇల్లు నింపేసేవారు.

తరువాత నెమ్మదిగా అమెరికాలో ఉద్యోగాల విషయంలో ‘రెసిషన్’ ప్రారంభమవడంతో, ఇక ఎక్కువ కాలం హాయిగా కొనసాగడం కష్టం అన్న భావన ఏర్పడి, మొదట్లోనే ఇండియా వచ్చేస్తే, పెద్ద ఉద్యోగాలలో జాయిన్ అవ్వచ్చు అన్న ఆలోచనతో ఇండియాకి తిరిగి వచ్చేశారు. అనతి కాలంలోనే బెంగుళూరులోని మంచి కంపెనీలలో ఇద్దరికీ మంచి ఉద్యోగాలు లభించాయి.

అక్కడే, పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్‌లో అభినవ్‌ని జాయిన్ చేశారు. కొత్త ఉద్యోగాలలో బిజీగా ఉండడంతో భార్యాభర్తలిద్దరి మధ్యా ‘ఇగో’ ప్రారంభమయ్యి, చిన్న చిన్న కస్సుబుస్సులు కాస్తా పెద్దవిగా మారి తరచుగా గొడవలు పెరగసాగాయి. అవన్నీ అభి చిన్న మనసులో ఏమి ప్రభావం చూపుతాయో అన్న ఆలోచన కూడా లేకుండా, వాడి ఎదురుగానే గొడవపడేవారు.

అమెరికా, ఇండియా వాతావరణాల మధ్య తేడాల వల్లయితేనేమి, తమ ఇద్దరి మధ్యా గొడవల వల్లయితేనేమి, ఒంటరితనం వల్లయితేనేమి, అభినవ్‌లో మొండితనం పెరగసాగిమ్ది. ఎప్పుడూ కంప్యూటర్ ముందే కూర్చుని సమయం గడిపేవాడు.

సెలవులు లేవు అన్న మిష మీద, ఏనాడు పట్టుమని పది రోజులు కూడా సొంత ఊరికి వెళ్ళి గడపలేదు. తన తల్లిదండ్రులు తమని చూడడానికి బెంగుళూరు వచ్చినా సరే అదే తంతు! పిల్లవాడికి చిన్నప్పటి నుంచీ కూడా వారితో సాన్నిహిత్యం లేదు కాబట్టి వాడు ఏనాడూ పట్టుమని పది నిముషాలు కూడా తాతా మామ్మలతో గడిపేవాడు కాదు. క్రమంగా వారు కూడా రావడం తగ్గించేశారు.

కృష్ణమూర్తి విలాసవంతమైన జీవన విధానం చూసి, ఉండబట్టలేక ఒకరోజు కృష్ణమూర్తి తండ్రిగారు కొడుకును కూర్చోబెట్టి, “కృష్ణా! డబ్బు జీవితంలో ముఖ్యమే కానీ, డబ్బే జీవితం కాకూడదు. నేను గ్రహించిన విషయాన్ని బట్టి నువ్వు కానీ, కోడలు శాంతి కాని డెబిట్ కార్డులనీ, క్రెడిట్ కార్డులనీ ఇంట్లోకి కొత్త మోడల్స్ అంటూ కొంటున్న ఖరీదయిన వస్తువులనీ, మీ విలాసవంతమైన జీవన విధానం చూస్తుంటే, చాలా దుబారా చేస్తున్నట్టు అనిపిస్తోంది. కాస్త ఖర్చులని అదుపులో పెట్టుకోండి. మీ పరుగుల జీవనంలో మీరు కాని, అభినవ్ కాని ఎవరికి ఏది కావాలనిపిస్తే వాళ్ళు హోటల్ నుంచి తెప్పించుకోవడం, ఎక్కువయిందని పారేయడం చూస్తున్నాను. ఉద్యొగం మానేయండి అని నేను చెప్పడం లేదు కానీ, కనీసం మీ ఇద్దరిలో ఒకరైనా సరే, కాస్త పని భారం తగ్గించుకుని, ఇంటి మీదా, అభినవ్ మీదా దృష్టి పెడితే మంచిది. సంపాదించడమొక్కటే కాదు, దానిని ఎలా ఖర్చు పెడుతున్నమన్నదీ కూడా అంతే ముఖ్యం. హైస్కూలు కూడా దాటని పసివాడికి అంత స్వేచ్ఛనివ్వడం మంచిది కాదు. కాస్త కష్టపడడం అలవాటు చెయ్యాలి. ఈ వయసులో వాడికి ఖరీదయిన మొబైల్, లాప్‌టాప్, ఏ.టి.ఎమ్. కార్డు ఇస్తున్నారు. అవన్నీ ఈ రోజుల్లో అవసరమే. కాని వాడు సక్రమంగా వాటిని వినియోగిస్తున్నాడా లేదా అన్నది గమనించడం కూడా చాలా ముఖ్యం. మంచి స్కూల్లో జాయిన్ చేశాం కదా, ట్యూషన్లకి పంపిస్తున్నాం కదా అని కాక ఈ వయసులో తన చదువు గురించి మీరు పట్టించుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే మొక్కై వంగనిది, మానై వంగుతాడా అన్నట్లు తయారవుతాడు.”

“ఇంకొక్క విషయం కూడా నాకు చెప్పాలని ఉంది. కష్టంగా అనిపించినా సరే, సంపాదించిన దానిలో కనీసం నలభై శాతమయినా సరిగా జాగ్రత్తగా దాచుకోకపోతే, మనీ మేనేజ్‍మెంట్ జాగ్రత్తగా లేకపోతే ఎంత సంపాదించినా తరువాత ఎంతో కష్టపడతారు” అంటూ చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు.

‘అబ్బా, నాన్న. నాకు నలభై ఏళ్ళు దాటినా కూడా, ఇంత పెద్ద పొజీషన్‌లో ఉన్నా కూడా, నాకేమీ తెలియదని అనుకుంటున్నారా? ఈ రోజుల్లో ఇవన్నీ  మామూలు విషయాలేనని, అందరి ఇళ్ళలో సర్వసాధారణమైనవేనని ఎందుకు అనుకోరు? ఈయన చాదస్తంతో విసుగొస్తోంది. అయినా చిన్నప్పుడు నేను కష్టపడినట్టు, నా కొడుకు కూడా ఎందుకు కష్టపడాలి? వాడికి ఏ లోటూ రాకుండా చూసుకోవాలి’ అనుకుంటూ తండ్రి మీద మనసులోనే విసుక్కున్నాడు కృష్ణమూర్తి. రెండేళ్ళు గడిచాయి.

‘అభినవ్ ప్లస్ టూ చదువుతున్నాడు. ఇంక, ఈ సంవత్సరం గడిచిపోతే, వాడు కోరుకున్న పెద్ద కాలేజీలో, ఎంత డొనేషన్ కట్టయినా సరే జాయిన్ చేయాలి. వాడు కోరుకున్న జీవితం కంటే మంచి జీవితం వాడికి సమకూర్చి పెట్టాలి’ అని కలలు కంటున్నాడు కృష్ణమూర్తి.

అయితే అదే సమయంలో ఇండియాలో కూడా రెసిషన్ పీరియడ్ ప్రారంభమైంది. ‘కాస్ట్ కటింగ్’ పేరుతో జీతం సగమయింది. పోనీ కంపెనీ మారుదామంటే, అంతటా అదే పరిస్థితి. అలవాటయిన జీవన విధానం తగ్గించుకోలేకపోతున్నారు. బ్యాంక్ బ్యాలన్స్ రోజు రోజుకీ తగ్గు ముఖం పడుతోంది. ‘అమ్మా నాన్న ఆ  చిన్న జీతంతో అంత పెద్ద కుటుంబభారం ఎలా మోసేవారు? అందరికి పెళ్ళిళ్ళూ, పేరంటాలు; వచ్చి పోయేవారితో ఎవరికీ ఏ లోటూ రాకుండా ఎలా గడిపేవారు!’ తలచుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతోంది కృష్ణమూర్తికి.

హఠాత్తుగా పిడుగులాంటి వార్త. “మీ అబ్బాయి డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నాడు. ‘హెవెన్స్ పబ్’లో మా స్వాధీనంలో ఉన్నాడు. వెంటనే రండి” అంటూ పోలీసుల నుండీ ఫోను.

ఆకతాయి ఫోనేమో అనే అనుమానంతో, అక్కడికి వెళ్ళి చూస్తే నిజమే. బుర్ర గిర్రున తిరిగినట్లయింది. నెమ్మదిగా ఆలోచిస్తుంటే అర్థమవుతోంది. ఈ మధ్య ఫ్రెండ్స్‌తో పార్టీలని ఎక్కువగానే బయటకి వెళుతున్నాడు. అయితే, ఎక్కడికి వెళుతున్నాడని కానీ, తన ప్రవర్తనలో, మాటలో తేడాలని గమనించలేనంత బిజీలో తామున్నారు. కొంతలో కొంత నయం. పూర్తిగా డ్రగ్ ఎడిక్ట్ కాలేదు. ఒక హైస్కూల్ పాప అయితే డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయి, చేతిలో డబ్బులు లేక, తన న్యూడ్ ఫోటో పంపిస్తే డ్రగ్స్ ఇస్తామని చెప్పడంతో మొబైల్‍లో పంపించిందనీ; పిల్లలు కొంతమంది ఆన్‌లైన్‌లో నేరుగా ఇంటికే తెప్పికుంటున్నా తమలాంటి తల్లిదండ్రులు బిజీ పేరుతో ఏమీ పట్టించుకోకుండా ఉన్నారని, పోలీస్ ఆఫీసర్ చెబుతూ, కౌన్సిలింగ్ చేస్తుంటే షాక్‌కు గురయ్యాడు కృష్ణమూర్తి. ఆయనకి ధన్యవాదాలు చెప్పి, ఇక జాగ్రత్తపడతానని మాట ఇచ్చి, అభినవ్‌ని ఇంటికి తీసుకువచ్చాడు.

తన తండ్రి అంతకు ముందు ప్రస్తావించిన విషయాలు ఒకటీ ఒకటీ అర్థం అవువూ ఉండడంతో, చాలా గిల్టీగా ఫీలయ్యాడు. కాలం గిర్రున వెనక్కి వెళ్ళి, తన ప్రయాణం మళ్ళీ సరికొత్తగా మొదలుపెడితే ఎంత బాగుంటుందీ అనిపిస్తోంది కృష్ణమూర్తికి.

“మనం ఎంత పెద్ద తప్పు చేశామో తెలుస్తోంది శాంతీ! ‘మనిషి సంపాదించడం, తాను జీవితంలో ఎదగడం మంచిదే గానీ, తనను తాను, తన వాళ్ళను కూడా మరిచిపోయేటంతగా కాదు; ఉద్యోగంలో ఎంత ఎదిగినా సరే, కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు. తనవారిని మరిచిపోకూడదు’ అని తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఇప్పుడే పూర్తిగా అవగతమవుతుననయి. నలుగురితో కలిసి పెరగటం అభికి ఎంత అవసరమో ఇప్పుడే తెలుస్తోమ్ది. ప్రస్తుతం అభికి కష్టమే కావచ్చు, కానీ భవిష్యత్తులో వాడి మంచి కోరి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ క్షణమే తనని ఈ నగర వాతావరణానికి దూరంగా మన ఊరు తీసుకుపోదాం. మన వాళ్ళందరి మధ్యా తనని మరలా ఒక కొత్త వ్యక్తిగా మారేడట్లు పూర్తిగా వాడితో గడుపుదాము…”

“… మనకి వచ్చిన విద్యతో, మన ఎక్స్‌పీరియన్స్‌తో అక్కడే ఒక కొత్త కంపెనీ మనం ప్రారంభించి, అక్కడి ప్రాంత విద్యార్థులనే ఉద్యోగంలోకి తీసుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా, మన జీవనోపాధి కూడా చూసుకుందాం, సరేనా?” అన్నాడు కృష్ణమూర్తి భార్య శాంతి వంక నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ.

“అవును, అదే మంచి నిర్ణయం. రేపే వెళ్ళిపోదాం” అంది శాంతి భర్త వంక అనునయంగా చూస్తూ.

కృష్ణమూర్తి మనసు ఇపుడు ఎంతో తేలికగా ఉంది!!