19. పందెం

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి 12 గంటలు దాటింది. రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.

బస్టాండుకి కొంచెం దూరంలో ఆగిన లారీలోనుంచి దిగి రోడ్డు పక్కగా వున్న మట్టిరోడ్డు మీద ఊరిలోకి నడవ సాగాడు అభిరాం. గాలి ఆగి ఆగి వీస్తూ ‘నేను కూడా ఉన్నానన్నట్లు’గా గుర్తుచేయసాగింది.

చెట్లకొమ్మలు కాలువను ముద్దాడుతున్నట్లుగా నీటిపైకి వంగి మళ్ళీ పైకి లేస్తున్నాయి.

సగం పైకెత్తిన గేట్లలోనుంచి వింత రొదచేస్తూ నీళ్ళు పల్లానికి ప్రవహిస్తున్నాయి.

రోడ్డు పక్కనున్న రంధ్రాల్లో నుంచి బయటికి వచ్చిన ఎలుకలు ‘రోడ్డంతా మాదే’ అన్నట్లుగా తిరుగుతున్నాయి.

ఒక మూల ముడుచుకుని పడుకున్న కుక్కలు అడుగుల చప్పుడుకి ఏదో గుర్తొచ్చినట్లుగా లేచి తోకలు దులుపుకుని ‘కుయ్’మంటూ తోచిన చోటికి పరిగెత్తసాగాయి.

కాలిబాటమీద అరకిలోమీటరు నడిస్తే తను వెళ్లాలనుకున్న ఊరు చేరుకోవచ్చు. కొన్ని విషయాల గురించి విన్నప్పుడు ‘ఓస్ ఇంతేనా’ అనిపిస్తుంది. వాటికోసం ప్రయత్నాలు చేసినపుడు వాటిలోని లోటుపాట్లు అర్థమై ఒక్కోసారి నిరాశ నిలువునా ఆవహిస్తుంది. ఆరంభశూరత్వం చూపించి అర్థాంతరంగా ఆపేస్తే చెప్పడం కష్టంగానీ, ‘ఛాలెంజ్’గా తీసుకుని సాధించాలనే తపనతో ప్రయత్నిస్తే ఆ పనిని సాధించడం పెద్ద కష్టంకాదు.

అభిరాంకి చిన్నప్పటినుంచీ ‘అడ్వెంచర్స్’ చేయడమంటే మహా సరదా. పదిరూపాయల పందెంకోసం పది గంటలు ఆపకుండా సైకిల్ తొక్కి పందెం గెల్చాడు. ఆ తర్వాత కాళ్ళనొప్పులతో వారం రోజులపాటు వీథి ముఖం చూడలేదు. మరోసారి స్నేహితులంతా ఊరికాలువలో ఈతపందెం పెట్టుకున్నారు. కాసేపు ఈదిన తర్వాత ఒక రాలుగాయి పిల్లవాడు “ఒరే… ఎంతసేపూ ఇక్కడినుండి అక్కడికి, అక్కడినుండి ఇక్కడికి ఈదడమేనా? ఏదైనా ‘కిక్’ వచ్చే పందెం చెప్పండ్రా?” అన్నాడు.

అందరూ తీవ్రంగా ఆలోచించారు. చివరికి ఎవరైతే నీళ్ళలో మునిగి ఎక్కువసేపు వుంటారో వాళ్ళకి మిగతా పిల్లలనుంచి వసూలుచేసిన ఇరవై రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం జరిగింది. ఒక్కొక్కరూ మునగడం, కాసేపు నీళ్లల్లో బుడగలు తీయడం, ఊపిరాడక కొద్దిసేపట్లోనే ‘తమ వల్లకాదంటూ’ చేతులెత్తేయడం జరిగిపోయింది.

అందరి కళ్ళూ అభిరాం మీద నిల్చాయి.

డబ్బులకోసం కాకపోయినా ఎలాగైనా గెలవాలనే తపనతో నీళ్లలో మునిగి అలాగే వుండిపోయాడు. కాసేపు గడిచాక లోపలినుంచి ఏ అలికిడీ లేకపోవడంతో బయటున్న అందరిలోనూ కంగారు మొదలైంది. టైం ఎంతయిందో తెలియదు…. బయటికి కనిపించిన చేతిని పట్టుకుని పిల్లలందరూ అభిరామ్‌ని బయటికి లాగేశారు.

చచ్చి బతికాడు అభిరాం. పిల్లలంతా చుట్టూచేరి పొట్టమీద చెయ్యి పెట్టి నొక్కుతూ మింగిన నీళ్లన్నీ బయటికి వచ్చేలా చేయసాగారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పెద్దవాళ్ళకి చేరింది. కంగారుతోనూ, భయంతోనూ పెద్దవాళ్ళు కాలవగట్టుకి రావడం చూసిన పిల్లలు తలోదిక్కుకీ పరుగులు తీశారు. ఆ తర్వాత వారం రోజుల జ్వరం. వీథి ముఖం చూడకుండా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. అయినా అటువంటి అడ్వెంచర్స్ మానలేదు అభిరాం. స్నేహితులు కలిసినప్పుడల్లా సరదాకి ఏదో ఒక పందెం వేసుకోవడం అలవాటైపోయింది.

ఒకసారి బిళ్ళంగోడు ఆటకి బయల్దేరారు స్నేహితులంతా. నెత్తిమీద నిప్పుల కుంపటి పెట్టినట్లుగా మండిపోతున్నాయి ఎండలు. చేలన్నీ పెద్దపెద్ద గ్రౌండులతో రారమ్మన్నట్లుగా ఆహ్వానం పలుకుతున్నాయి. ఆట ఆడుతూనే “ఏరా… సరదాగా ఒక పందెం వేసుకుందామా?” అన్నాడొకడు. అందరూ చుట్టూమూగారు. “కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుమీద చెప్పులు లేకుండా నడవాలి’ అంటూ పందెం కట్టుకున్నారు. ఒక్కొక్కరూ వెళ్ళడం, కాసేపటికి ‘అమ్మా అబ్బా” అంటూ వెనక్కిరావడం జరిగిపోయింది. మొండిగా చెప్పులు విడిచేసి బయల్దేరాడు అభిరాం. వాళ్ళు చెప్పినంత దూరం నడిచి వెనక్కి వచ్చేశాడు. కాళ్ళు పెద్దపెద్ద బొబ్బలెక్కి ఇంటిదాకా నడవడం కూడా కష్టమైపోయింది. ఆరోజు బొబ్బలకంటే నాన్న కొట్టిన దెబ్బలే బాగా గుర్తున్నాయి.

నడుస్తూ తనలో తనే నవ్వుకున్నాడు అభిరాం. ఎంతైనా చిన్నతనం… చిన్నతనమే! ఆకలిదప్పులు తెలియదు. ఏ పని చేసినా గెలవాలన్న తపన తప్పితే అందులో ఎంత ప్రమాదముంటుందో ఊహించలేరు. నలుగురు స్నేహితుల్ని వేసుకుని ఊరంతా తిరగడం, తోచిన ఆటలు ఆడడం, అలసిపోయి ఇంటికి చేరడం, ఆదమరచి నిద్రపోవడం…. తల్చుకునే కొద్దీ అదేదో వెన్నెలపండుగలా మారి మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి.

బూట్లు టకటకలాడించుకుంటూ తను వెళ్ళవలసిన ఇల్లెక్కడో అంచనా వేయసాగాడు. వరుసలు వరుసలుగా వున్న వీధులన్నీ చాలా శుభ్రంగా కనిపించాయి. వీధిదీపాలు తప్ప ఏ ఇంట్లోనూ వెలుతురు జాడ కనిపించలేదు. రామ మందిరం పక్కన నాలుగో ఇల్లు… లెక్కపెట్టుకుంటూ ఆ ఇంటివైపు నడవసాగాడు. ఆ ఇంట్లోని గదిలో నుండి లైటు వెలగడం అభిరాంలో కొంత ఉత్సాహాన్ని నింపింది. బహుశా తనొస్తున్నట్లు ముందుగా చెప్పడం వల్ల మెలకువగా వుండి వుంటారు. లేకపోతే పల్లెల్లో ఇంతరాత్రి వరకూ మేల్కొని వుండడం చాలా అరుదు.

వాకిట్లో రాలిన ఆకులమీద అడుగులు పడగానే అదోరకం చప్పుడు కొత్తగా వినిపించింది. చెట్టుమీద పడుకున్న పిట్టొకటి మధ్యలో ఏదో గుర్తొచ్చి ఆగిఆగి కూస్తూ ఆనందపడసాగింది.

ఇంటిగుమ్మం తెరవడంతో ఇంట్లోని వెలుతురు వాకిట్లో ప్రసరించింది. వరండా దగ్గర బూట్లు విప్పి వాకిట్లో మూలనున్న పంపుదగ్గర కాళ్ళు కడుక్కున్నాడు అభిరాం.

“బాగా ఆలస్యమయినట్లుంది బాబూ..” అన్నాడు ఇంటి యజమాని రాఘవయ్య. “అవునండీ… ఆఫీసులో పనెక్కువై ఇంటికొచ్చేసరికి బాగా లేటయింది. వెంటనే మళ్ళీ ఇక్కడికి రావలసి వుండడంతో భోజనం చేసి బయల్దేరిపోయాను. తీరా బస్టాండుకి వెళ్తే ఆఖరుబస్సు వెళ్ళిపోయిందన్నారు. వెనక్కి వెళ్ళడం ఇష్టంలేక దొరికిన లారీ పట్టుకుని అక్కడక్కడా ఆగుతూ ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఈ వేళయింది.” చెప్పడం ఆపి రాఘవయ్య వంక చూశాడు అభిరాం. తలపంకించాడు రాఘవయ్య.

తర్వాత భార్యవైపు తిరిగి “ఎప్పుడు తిన్నాడో మరి… అన్నం పెట్టు అబ్బాయికి….” అన్నాడు.

మొహమాటపడ్డాడు అభిరాం. అంతరాత్రిలో ఆశ్రయం ఇవ్వడమే గొప్పవిషయం. దానికితోడు అతిథి మర్యాదలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకే రాఘవయ్య వైపు తిరిగి “అయ్యో… మీకు శ్రమ ఎందుకని నేను బయటే భోజనం చేసివచ్చాను. నా గురించి మీరు ఇబ్బంది పడకండి…” అన్నాడు అభిరాం.

“ఇందులో ఇబ్బందేమీ లేదులే అబ్బాయ్… నువ్వు వస్తున్నావని చెప్పినప్పుడే మాతోపాటు నీక్కూడా వండింది మా ఆవిడ. మాకు పిల్లల్లేరు. ఏదో నీలాంటివాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి చెయ్యి కడిగితే ఈ ముసలి ప్రాణాలకు తృప్తి..” అన్నాడు రాఘవయ్య లోపలికి దారితీస్తూ.

మనసులో బాధపడ్డాడు అభిరాం. పిల్లల్లేని లోటు తల్లిదండ్రుల్ని ఎంతగా బాధిస్తుందో అర్థమయింది.

పక్కనే కూర్చుని వడ్డించసాగింది రాఘవయ్య భార్య రాజేశ్వరమ్మ. “ఏ పనిమీద వస్తున్నావని మొన్న ఫోనులో అడిగితే చెప్పలేదు… ఎవర్నెనా కలవాలా బాబూ…” అడిగింది.

“ఓ అదా… పనంటే పెద్ద పనేమీ కాదులెండి. మా కొలీగ్స్ అందరితో సరదాగా పందెం కాశాను. ఈ ఊరిలో మంగమ్మ డాబా వుందట. దానిలో దెయ్యాలున్నాయని మా కొలీగ్, లేవని నేను పందెం కాసుకున్నాం. మా కొలీగ్ ద్వారా వినడమే గానీ ఈ ఊరి గురించి తెలియదు. అందుకే వచ్చానండీ..” అన్నాడు అన్నం కలుపుకుంటూ.

మంగమ్మడాబా పేరు వినగానే దంపతులిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కాసేపు మౌనం తర్వాత “ఇంకా పెళ్ళి కూడా అయినట్లు లేదు, ఏదో మంచి ఉద్యోగంలో ఉన్నట్లున్నావు. చక్కగా నచ్చిన పిల్లను పెళ్ళి చేసుకుని హాయిగా జీవితాన్ని గడపక ఈ పందేలు ఎందుకు బాబూ ? ఈ ఊళ్ళో వున్నవాళ్ళే పగటిపూట ఆ డాబా దగ్గరకు వెళ్ళడానికి భయపడి ఆ డాబా చుట్టూ వున్న పొలాలను కూడా సాగుచేయడం మానేశారు. సాగుచేయాలంటే భయం, అమ్ముదామంటే కొనడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఎవరి బిడ్డవో, ఎక్కడి నుండి వచ్చావో తెలియదు. నీకెందుకు బాబూ… ఈ పనులన్నీ. హాయిగా ఈ రాత్రి పడుకుని ఉదయం లేచి ఎక్కడినుండి వచ్చావో అక్కడికెళ్ళిపో. ఇంకెప్పుడూ జీవితాలతో పందెం కట్టకు బాబూ…” అన్నాడు రాఘవయ్య.

అభిరాంకి ఒక్కసారిగా తండ్రి గుర్తొచ్చాడు. ముద్ద మింగుడుపడలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చిన్నతనంలో చేసిన ఇటువంటి పనులను మానమని తనని తండ్రి ఎంతగానో బ్రతిమాలడం గుర్తొచ్చింది. కానీ తనకున్న ‘పందెం’ కాసే అలవాట్లు ఇప్పటికీ మానుకోలేకపోయాడు.

ఆలోచనలతోనే అన్యమనస్కంగానే భోజనం అయిందనిపించాడు.

పడకకి ఏర్పాటుచేసిన గదిలోకి వెళ్ళబోతూ “అయితే అక్కడికి వెళ్ళి రాత్రి గడపడం ప్రమాదమంటారా?” అనుమానంగా అడిగాడు అభిరాం.

“అవన్నీ ఇప్పుడెందుకులే బాబూ… బాగా అలసిపోయావు… వెళ్ళి హాయిగా నిద్రపో! తెల్లారాక మాట్లాడుకుందాం…” చెప్పి వెళ్ళిపోయాడు రాఘవయ్య.

***

కిటికీలో నుండి పడుతున్న సూర్యకిరణాలతో శరీరం చురుక్కుమనడంతో తుళ్ళిపడి లేచాడు అభిరాం. అప్పుడే గదిలోకి వచ్చిన రాజేశ్వరమ్మ “ఇప్పటికే రెండుసార్లు వచ్చాను బాబూ. బాగా నిద్రపోతున్నావు. లేపడమెందుకులే అని వెళ్ళిపోయాను. టిఫిన్ చేద్దువుగాని ముఖం కడుక్కుని రా బాబూ…” చెప్పి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ.

గది దాటుకుని వాకిట్లోకి వెళ్ళబోతున్న వాడు వరండాలో నుంచి వినిపిస్తున్న మాటలు విని ఆగిపోయాడు. “రాత్రి మీ ఇంట్లో చాలాసేపు లైట్లు వెలుగుతూనే ఉన్నాయే” ఆరాగా అడిగింది వచ్చినావిడ. “తెలిసిన అబ్బాయొచ్చాడు. అందుకే ఆలస్యమయింది…” చెప్పిందీ రాజేశ్వరమ్మ. “ఏ పని మీద వచ్చాడో…” సాగదీస్తూ అడిగింది. “మంగమ్మ డాబా దగ్గర పని వుందట…”

ఆ మాట విన్న వచ్చినావిడ “ఇంటెనకాల వున్న డాబా దగ్గరికి వెళ్ళడానికి ఊళ్ళో వాళ్ళే భయపడి చస్తుంటే ఆ డాబా చూడడానికి ఎక్కడినుండో వచ్చాడా? బాగానే వుంది చోద్యం…” బుగ్గలు నొక్కుకుంది వచ్చినావిడ.

వాళ్లమాటలు సాగుతుండగానే బయటికి వచ్చిన అభిరాం వాళ్ల పక్కన కూర్చుంటూ “ఎందుకండీ అంత భయపడుతున్నారు? ఇంతకీ ఏమున్నాయో ఆ ఇంట్లో…” అన్నాడు వచ్చే నవ్వును లోలోపలే ఆపుకుంటూ.

“పాడుబడ్డ కొంపలో దెయ్యాలు భూతాలూ కాకుండా మనుషులుంటారా నాయనా? మొన్న మా ఊరివాడొకడు తాగిన మైకంలో ఇంటిదారి మర్చిపోయి డాబాలోకి వెళ్ళి తెల్లారేసరికి నెత్తురుకక్కుకుని చచ్చిపోయాడు. వాడి శవాన్ని తీసుకురావడానికి కూడా ఎవరికీ ధైర్యంలేదు. నువ్వు జాగ్రత్త నాయనా…” జాగ్రత్త చెప్పిందో, హెచ్చరించిందో అర్థం కాలేదు అభిరాంకి. గొణుక్కుంటూ వెళ్ళిన ఆమెవైపే చూస్తుండిపోయాడు.

రోజువారీ పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు.

***

రాత్రి ఏడుగంటలు దాటింది.

టార్చిలైటు, సెల్ ‘ఫోన్ తీసుకుని దంపతులిద్దరికీ ‘వెళ్ళొస్తానన్నట్లు’గా చెప్పి బయల్దేరాడు. ‘వెళ్ళకపోతే బాగుంటుంది….’ అన్నట్లుగా చూశారు దంపతులిద్దరూ. ఎలా వెళ్ళాలో దారి కనుక్కుని ముందుకునడవసాగాడు.

ఆ ఇంటిని దాటి ముందుకెళ్ళాక ఒక సిమెంట్ రోడ్డు వచ్చింది. దానిమీద కొంచెం దూరం నడిచాక, అదీ పూర్తయిన తర్వాత డాబావైపు వెళ్ళే మట్టిరోడ్డు నడవడం ప్రారంభించాడు అభిరాం.

అప్పటివరకు నిర్మలంగా వున్న ఆకాశం ఒక్కసారిగా రంగులు మార్చుకుంది. గట్టుమీద వున్న చెట్లన్నీ పూనకం వచ్చినట్లుగా పైకీ కిందకీ వూగసాగాయి. అనుకోకుండా ఏర్పడిన ఈ పరిణామానికి ముందు బిత్తరపోయినా తర్వాత తేరుకున్న అభిరాం టార్చిలైట్ సాయంతో జాగ్రత్తగా నడవసాగాడు.

మట్టిరోడ్డు పూర్తయ్యాక వచ్చిన పంటకాలువ దాటి అవతలివైపు చేరుకున్నాడు. గట్టుమీద కొంచెం కొంచెం దూరంలో ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్లు, తాడిచెట్లు కనిపించాయి. పొలానికి చివరగా వాడకం లేని బావి ఒకటి కనిపించింది.

పరిసరాలు జాగ్రత్తగా చూసుకుంటూ, గట్టుమీద నడుస్తూ డాబా దగ్గరికి చేరుకున్నాడు.

ఆ డాబాని చూస్తుంటే బాగా బతికిన కుటుంబమే అందులో నివసించినట్లుగా అనిపించింది. గుండ్రంగా పోత పోసిన పెద్దపెద్ద సిమెంట్ స్తంభాలు పట్టించుకునేవారులేక అక్కడక్కడా పెచ్చులూడిపోయాయి. డాబా అంతా పైనేమీ లేకుండా టాపులేని జీపులాగా ఉంది. మొండిగోడల్లో నుంచి మొలిచిన రావిచెట్లు, బొప్పాయిమొక్కలు వుండాలో, పడిపోవాలో తెలియక గాలికి అదోరకంగా వూగుతున్నాయి.

టార్చిలైటు సాయంతో లోపలికి ప్రవేశించాడు. వానవచ్చినా తడవకుండా వుండే ప్రాంతాన్ని శుభ్రంచేసుకుని అక్కడ కూర్చున్నాడు. కాసేపటికి గాలితగ్గి వాన మొదలైంది.

కన్నుపొడుచుకుని చూసినా కనిపించని కటికచీకటి….ధారాగా కురుస్తున్న వాన… దానికి తోడైన ఈదురుగాలి… అన్నిటినీ చూస్తుంటే సన్నగా వెన్నులోనుంచి వణుకు మొదలైంది. పెద్దవాళ్ళు చెప్పినట్లుగా వెనక్కెళ్తే బాగుండేదేమో? అనిపించింది. ఒకవేళ అలా జరిగితే తన కొలీగ్ తనను బతకనిస్తాడా? వేళాకోళం చేసి అందరిముందూ అవమానం చేయడూ? అది భరిస్తూ అక్కడ తను ఉద్యోగం చేయగలడా? అయినా అమ్మ మాట వినకుండా వచ్చినందుకు తగిన శాస్త్రి జరిగింది. దీపావళి పండక్కి రెండురోజులు ముందుగానే రమ్మంది అమ్మ. పందెం విషయం చెప్తే ఎక్కడ భయపడుతుందోనని ఆఫీసులో అర్జెంటు పనుందని అబద్ధం చెప్పాడు. ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి మనసులో.

అనుకోకుండా వచ్చిన కునుకు వల్ల ముందుకు తూలిపడి లేచి సర్డుకు కూర్చున్నాడు. ఇంతలో ఎవరో తనమీదకి వేగంగా వస్తున్నట్లు అనిపించింది.

భీతిల్లిపోయాడు అభిరాం. కంగారు నుంచి తేరుకుని టార్చిలైటు అటువైపు వేసిన అభిరాంకి గుండె ఆగినంత పనైంది. జుట్టూగెడ్డం బాగా పెరిగిపోయి, ఎర్రకళ్ళతో టార్చిలైటు వెలుతురులో భయంకరంగా కనిపించింది ఒక ఆకారం.

భయంతో వెన్ను జలదరించింది అభిరాంకి. ఒక్కసారిగా పక్కకి వంగడంతో ఆ ఆకారం విసిరిన బండరాయి తనమీద పడకుండా తప్పించుకోగలిగాడు.

జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు అభిరాంకి. అతని చేతుల్లో మరణించడమా? లేక ప్రతిఘటించి ప్రాణాలు నిలుపుకోవడమా ?

మెదడు చురుగ్గా ఆలోచించసాగింది. చేతికేది దొరికితే దానితో ఎదురుదాడికి దిగాడు. ఎవరు గెలుస్తున్నారో ఎవరి మీద ఎలాంటి ఆయుధం పడుతుందో కూడా ఆ చీకట్లో అర్థంకావట్లేదు. కాసేపటి తర్వాత… నేలమీద దబ్బున పడినట్లుగా చప్పుడు రావడంతో టార్చిలైటు సాయంతో అటుచూసిన అభిరాం ఊపిరి పీల్చుకున్నాడు.

కొనఊపిరితో… రక్తపు మడుగులో కొట్టుమిట్టాడసాగింది ఆ ఆకారం. ఇన్నాళ్ళూ జనం అనుకుంటున్నట్లుగా ఇక్కడ తిరిగేది దెయ్యాలూ… భూతాలూ కాదు. మనిషేనన్నమాట! ఆ ఊరిమీద ఇతనికెందుకు పగో, వాళ్ళని ఎందుకు భయపెడుతున్నాడో అర్థంకాలేదు. పైగా ఇప్పుడు బయటికెళ్ళి ఇతని గురించి చెప్పినా ఎవరూ నమ్మేలా లేరు. ఉదయమయ్యాక ఈ శవాన్ని చూసిన ఊరిప్రజలందరూ ఇతన్ని కూడా దెయ్యమే చంపిందని అనుకుంటారు.

మనిషివల్లే సాటిమనిషి అర్థంలేని భయాలతోనూ, స్వార్థం నిండిన ఆలోచనలతోనూ బతుకుతున్నారు. కనిపించని దెయ్యాలకంటే అణువణువూ విషం నింపుకుని తిరుగుతున్న మనుషులే నిజమైన దెయ్యాలు అనుకున్నాడు అభిరాం. సాటి మనిషిని చైతన్యపర్చాల్సింది పోయి ఇంకా చీకట్లోనే బతికేలా చేస్తున్నారు. సరదాగా కాసిన పందెమే అయినా తన గెలుపుకంటే ఊరిప్రజలు ఊపిరి పీల్చుకుంటారనే ఆలోచన సంతోషం కలిగించింది అభిరాంకి.

తనలో తానే నవ్వుకుంటూ… ఉదయం కోసం ఎదురుచూడసాగాడు.

***

“మీరిచ్చిన ఆతిథ్యానికి, నాపైన చూపించిన పుత్రప్రేమకి ధన్యవాదాలు…” అన్నాడు బట్టలు సర్దుకుంటూ.

“నువ్వు క్షేమంగా వచ్చావు బాబూ… ఒంటరిగా గాలివానలో, చీకట్లో ఎలా వున్నావోనని మేమిద్దరం సరిగా నిద్ర కూడా పోలేదు…” అన్నాడు రాఘవయ్య. అభిరాం కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కాసేపటి తర్వాత “ఈరోజునుంచీ మీరు నిశ్చింతగా నిద్రపోవచ్చు. దట్టంగా అలుముకున్న చీకటి తెరలన్నీ తొలగిపోయి ప్రతీ గుమ్మంలో దీపాలు తోరణాల్లా వెలుగుతాయి. ఇన్నాళ్ళూ మీరంతా అనవసరంగా భయపడ్డారు. ఆ డాబాలో దెయ్యాలూ లేవు, భూతాలూ లేవు. నేను క్షేమంగా తిరిగిరావడమే దానికి నిదర్శనం…” అన్నాడు అభిరాం.

“కొన్ని విషయాలు నిరూపించడానికి ఆధారాలు కావాలి. మరికొన్ని విషయాలు నమ్మకాల మీద సాగిపోతుంటాయి. ఈ ఊరంతా అక్కడేదో వుందని నమ్ముతున్నారు. ఇప్పుడు నీ విషయం ఊరంతా తెలిసి భయపడడం మానేస్తే మా ఊరికి నిజంగానే దీపావళి వచ్చినట్లవుతుంది బాబూ…” అన్నాడు రాఘవయ్య.

ఇద్దరికీ నమస్కరించి అక్కడినుండి బయల్దేరాడు అభిరాం.