‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం -1

0
2

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

I. ప్రవేశిక

పురాణ మిత్యేవ న సాధు సర్వం
నచాపి కావ్యం నవ మిత్య వద్యం
– కాళిదాసు

‘పందొమ్మిదవ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – ఈ శీర్షిక చూడగానే ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేసిన వారు చాలా మంది కనుబొమలు ముడివేయకపోరు. “పందొమ్మిదవ శతాబ్ది క్షీణయుగంగా ప్రసిద్ధి చెందింది కదా! ఇరవయ్యవ శతాబ్దిలోగాని నవ్యకవిత్వం అంకురించలేదు కదా! మరి, అంధకారం ఆవరించియున్న 19వ శతాబ్దిలో నవ్యత ఎక్కడిది?” అన్న సందేహం ఒక్కసారి కలుగక మానదు.

ఇదీ 19వ శతాబ్ది తెలుగు కవిత్వానికి జరిగిన అన్యాయం. నిజంగా 19వ శతాబ్దిలో వెలువడిన కావ్యాలను కూలంకషంగా అధ్యయనం చేస్తే, వాటిలోని నవ్యతా పరిమళాలను ఆస్వాదించగలిగితే, ఈ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. అసలు 20వ శతాబ్దిలోని ఆధునిక కవిత్వాన్నే నవ్య కవిత్వంగా భావిస్తున్న వారు ఆ నవ్యత ఒక్క మారుగా ఆ శతాబ్దిలో ఊడిపడిందని ఎలా భావించగలరు? దానికి పూర్వ రంగంలో జరిగిన ఆద్యవస్థల గురించి ఆలోచించక పోతే ఎలా? పూర్ణ గర్భం దాల్చకుండానే, పురిటి నొప్పులు లేకుండానే పుత్రజననం ఎలా జరుగుతుంది? నాయక రాజుల కాలం వరకు అవిచ్ఛిన్నంగా తెలియ జెప్పిన మన సాహిత్య చరిత్రను అక్కడ నిలిపివేసి, నూరు నూట యాభై సంవత్సరాలు ముందుకు జరిపి, 20వ శతాబ్ది చరిత్రను చెప్పడం మన సాహిత్య చరిత్రకారులకు అలవాటైపోయింది. ఎవరైనా ఒకరిద్దరు చరిత్రకారులు ఆ యుగం గురించి ఒకటి రెండు పుటలలో చర్చించినా, దానిని అంధకారయుగంగానే చిత్రించారు. మితిమీరిన శృంగారం, వెర్రితలలు వేసిన ద్వ్యర్థి, త్ర్యర్థి కావ్యాలను ఒకటి రెండు (-అవీ 18వ శతాబ్దికి చెందినవో లేక 19వ శతాబ్దికి చెందినవో సరిగా నిర్ధారించకుండానే) తెలిపి వాటిని క్షీణయుగం కావ్యాలుగా పేర్కొంటూవచ్చారు. ఇంతవరకు ఆరుద్ర, కొర్లపాటి శ్రీరామమూర్తి తప్ప తక్కిన ఏ సాహిత్య చరిత్రకారుడైనా, ముద్దుపళనిచే రచింపబడిన ‘రాధికా సాంత్వనము’, లేదా ఒకటి-రెండు పిల్ల వసు చరిత్రలను పేర్కొని, 19వ శతాబ్దిలో కూడా అవే మూసలో గ్రంథాలు వెలువడ్డాయని, ఆ యుగానికి న్యూనతా భావాన్ని పులిమి, దాటవేసే ప్రయత్నమే చేశారు కాని, కించిత్తు శ్రమకోర్చి ఆ శతాబ్దిలో నవ్యతా స్పర్శ గల గ్రంథాలను సాధించి, అధ్యయనం చేసి, లోతుపాతులను స్పృశించే ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. ఆరుద్ర, కొర్లపాటిగార్లు మాత్రం 19వ శతాబ్ది కవులు, వారి కావ్యాల గురించి కొంత పరిచయం చేసినా వారిలో కూడా క్షీణయుగమన్న ముద్ర ఉండడం వలన నవ్యతా దృష్టితో పరిశీలన జరుగలేదనే చెప్పాలి.

ఒకవేళ బ్రౌను మహాశయుడు మన దేశానికి వచ్చి ఉండకపోతే, ఒక్క 19వ శతాబ్దికే కాదు – అంతకు పూర్వం (11వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది వరకు) కూడా మనకు సరైన సాహిత్యమే లేదు – అన్న అపప్రథ నెలకొని ఉండేదేమో!

బ్రౌను పరిశోధనల కన్న పూర్వం, ఆంగ్లేయులు తెలుగువారికి మౌఖిక సాహిత్యమే తప్ప చెప్పుకోదగ్గ లిఖిత సాహిత్యమే లేదని భావించారు. బ్రౌను పుణ్యమా అని 18వ శతాబ్ది వరకు గల గ్రంథాలు ముద్రించబడి ప్రజా బాహుళ్యంలో అందుబాటులోకి రావడం వలన ఆ గ్రంథాల అధ్యయనంతో మన సాహిత్య చరిత్రకు రూపకల్పన చేసే ప్రయత్నాలు జరిగాయి. 19వ శతాబ్దిలోనే గురజాడ శ్రీరామమూర్తిగారు ‘కవి జీవితములు’ అన్న గ్రంథాన్ని, కందుకూరి వీరేశలింగం పంతులుగారు ‘కవుల చరిత్రము’ అన్న గ్రంథాన్ని వెలయించారు. అయితే వీటిలో 18వ శతాబ్ది వరకు గల కవుల ప్రస్తావన మాత్రమే ఉంది. 20వ శతాబ్ది ఆదిలో వంగూరి సుబ్బారావుగారు రచించిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర’ లో చిన్నయ సూరికి పూర్వ వాఙ్మయమే చర్చించబడింది. అనగా గురజాడ శ్రీరామమూర్తిగారు, కందుకూరి వీరేశలింగంగారు రచించు కాలానికి సమకాలికుల రచనలను వారు ఉపేక్షించడం, వంగూరి సుబ్బారావుగారి కాలానికి, ఆ శతాబ్ది గ్రంథాల వివరాలు సులభంగా అందుబాటులో లేకపోవడం జరిగి ఉండాలి. పైగా వీరి రచనలలో కవుల వివరాలకు ఇచ్చిన ప్రాధాన్యత వారి సాహిత్య అధ్యయనానికి ఇవ్వలేదు. వంగూరి సుబ్బారావుగారి ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర’ గ్రంథానికి పీఠిక వెలయిస్తూ కట్టమంచి రామలింగారెడ్డిగారు ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు –

“కవుల చరిత్రల ననేకులు మహనీయులు వ్రాసియున్నారు. కాని యవి వాఙ్మయ చరిత్రలు కావని నా మనవి.”

కట్టమంచి రామలింగారెడ్డి గారన్నట్టు సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఆ విధంగా సమగ్ర సాహిత్యాధ్యయనం జరుగనంత వరకు అంధకార యుగంగా ముద్రపడిన 19వ శతాబ్దికి ఆ మచ్చ చెరిగిపోయే అవకాశం లేదు.

మరి, బ్రౌను మహాశయుడు సమకాలికుల రచనలు సేకరించి ముద్రించ లేదా? అంటే, దాదాపుగా లేదనే చెప్పాలి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు చెప్పుకోవాలి. ఒకటి – అంతకు ముందు తొమ్మిది శతాబ్దుల తాళ పత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి, పండితులతో తిరగ రాయించి, ముద్రింపజేయడమే శారీరకంగా, ఆర్థికంగా కొండంత కార్య భారం. ఇక సమకాలికుల ఉద్ధరణకు శక్తి ఎక్కడిది? సమయ మెక్కడిది? పైగా ఆనాటి సామాజిక ఆర్థిక స్థితిగతుల మూలాన, ఆనాటి కవులు తమ పాండిత్య ప్రదర్శనతో బ్రౌనును మెప్పించి పొట్ట కూటి మార్గాలను వెదుక్కొన్న సందర్భాలే కనిపిస్తున్నాయి కాని, తమ కవిత్వాన్ని వెలుగులోకి తెమ్మని వేడుకొన్న సందర్భాలు కనిపించడం లేదు. ఇక రెండవ కారణం – “ఏ గతి రచియించి రేని సమకాలము వారలు మెచ్చరే గదా!” అని ఏనాడో చేమకూర వెంకట కవి అన్నట్టుగా, బ్రౌనే కాదు – ఆ శతాబ్దిలోని ఏ పండితుడూ సమకాలిక సాహిత్యాధ్యయనానికి, వాటి ఔన్నత్య వ్యాఖ్యానానికి ఆసక్తి చూపి ఉండకపోవచ్చు. అప్పుడు నవ్యతా దృష్టితో ఏ కవియైనా ప్రయోగాలు చేసినా, వాటిలో కించిత్తు పాశ్చాత్య ప్రభావం కనిపించి బ్రౌను దొరకు పెద్దగా రుచించి ఉండకపోవచ్చు. ఇక తెలుగు పండిత కవులలో ఆనాడు చాలా మంది వైదిక సంప్రదాయ బద్ధులే కావడం వలన నవ్య ప్రయోగాలను ఈసడించి ఉండే అవకాశం ఎక్కువ. అలా ఆదరించవలసిన సమయంలో ఆదరణ లభించక, చాలా గ్రంథాలు ముద్రణ పొందక మరుగునపడి ఉంటాయి.

అదీగాక 19వ శతాబ్ది పూర్వార్థం తెలుగు సాహిత్య చరిత్రలో, తాళ పత్ర గ్రంథాల, ముద్రిత గ్రంథాల మధ్య సంధికాలంగా చెప్పవచ్చు. సుప్రసిద్ధ పరిశోధకురాలు డా. జోలెపాళెం మంగమ్మగారు అంటారు –

“శ్రీరాంపురంలో అచ్చు అక్షరములు తయారీ 19వ శతాబ్దారంభంలో మొదలయింది. శ్రీరాంపురం మిషనరీలు 6000 రూపాయలకు ఒక ఇల్లు కొన్నారు. 40 పౌండ్ల స్టర్లింగ్‌కు కొయ్యతో తయారయిన ముద్రణ యంత్రాన్ని కొన్నారు. ఆ తర్వాత ముద్రణ వ్యాసంగం అక్కడ అమితంగా జరిగింది. హాలెలో షుల్జ్ తరువాత తెలుగులో ముద్రణ అంతగా జరిగినట్టు ఆధారాలు లేవు. శ్రీరాంపురంలో ముద్రణ యంత్రం ఏర్పాటయ్యాక స్థానికంగా ‘పంచానన్’ అనే కమ్మరి ఉద్యోగాన్వేషణలో అక్కడికి చేరాడు. అక్షరాలు పోతపోయడం అతడు చార్లెస్ విల్కిన్స్ వద్ద నేర్చుకొన్నాడు. తనకు సహాయంగా మరొకరిని తెచ్చుకొమ్మన్నప్పుడు ‘మనోహర్’ అనే వ్యక్తిని పంచానన్ తనతో కలుపుకొన్నాడు. మనోహర్ దాదాపు నలభై సంవత్సరాలు శ్రీరాంపురం మిషనరీలతో కలిసి పని చేశాడు. దేశంలో తెలుగు అక్షరాల అచ్చులను బహుశా మనోహర్ శ్రీరాంపురంలో పోతపోసి ఉండవచ్చు.”

దీనిని బట్టి 19వ శతాబ్ది పూర్వార్థంలో అతికొద్ది మంది కవులకు మాత్రమే ముద్రణ అవకాశం, అవగాహన ఉండి ఉండాలి. 1820లో తెలుగు ముద్రణను శ్రీరాంపురం నుండి మద్రాసు ఆక్సిలరీ బైబిల్ సొసైటికి బదలాయించాలని నిర్ణయించడం జరిగిందని డా. మంగమ్మగారు ‘తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు’ అన్న గ్రంథంలో వివరించారు. అలా ముద్రణయంత్రాలు విస్తృతంగా లేని ఆ రోజుల్లో బ్రౌను వంటి అధికారులకో లేక మహా ధనవంతులకో అవి అందుబాటులో ఉంటాయి గాని కవులందరూ తమ గ్రంథాలను ముద్రించుకొని ప్రచారంలోకి తెచ్చుకొనే పరిస్థితులు ఉండవుగదా! పత్రికారంగం కూడా ప్రారంభదశలోనే ఉండడం వలన కవులు తమ కావ్య భాగాలను ముద్రణలో చూచుకొనే అవకాశాలూ తక్కువే. అలా 1801 నుండి 1850 వరకు వచ్చిన రచనలలో ఎక్కువ మట్టుకు వ్రాతప్రతులు, కొన్ని మాత్రమే ముద్రిత గ్రంథాలుగా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో 20వ శతాబ్దిలో సాహిత్య చరిత్ర రచనకు పూనుకొన్న చరిత్రకారులకు ఆ వ్రాతప్రతులు దొరికే అవకాశాలు తక్కువే. ఒకటి రెండు దొరికినా అంతకు ముందు తరంలోని కంకంటి పాపరాజు, ఏనుగు లక్ష్మణ కవి వంటి కవుల రచనలతో పోల్చి, చిన్న చూపు చూసి ఉంటారు. వాటిలో నవ్య ప్రయోగాలు కనిపించినా, సంప్రదాయం పట్ల స్వభావ సిద్ధంగా ఉండే అనురక్తి వలన ఉపేక్షించి ఉంటారు. పిలకను వదలి జన బాహుళ్యం క్రాపును తలకెక్కించుకోడానికి కొన్ని తరాలు పట్టినట్టు తెలుగు సాహిత్యంలో నవ్య ప్రయోగాలను సాహిత్యాభిమానులు, పండితులు పూర్తిగా తలకెక్కించుకొని ఆదరించడం ప్రారంభించే సరికి 20వ శతాబ్ది వచ్చేసింది. ఆ దశలో 18వ శతాబ్ది అంతం వరకు ఉన్న కవిత్వం గురించి బ్రౌను మహాశయుని కృషి వల్ల వెలువడిన ముద్రిత గ్రంథాల ద్వారా, 20వ శతాబ్ది ఆరంభంలో విజృంభణతో వస్తున్న నవ్య కవిత్వం గురించి, ఆనాటి ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకొంటున్న సాహిత్యాధ్యాయులకు సమగ్రంగా 19వ శతాబ్ది కవిత్వం గురించి, దానిలో నవ్యత గురించి, తెలుసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఇందుకు ఉదాహరణగా శేషాద్రి రమణ కవుల వ్యాఖ్య ఉటంకించదగ్గది –

“ఈ రాష్ట్రము (నిజాము) నందలి యాంధ్ర సంస్థానములలో వాఙ్మయ చరిత్రమున సువర్ణాక్షరములలో వ్రాయదగినవి గద్వాల, వనపర్తి, ప్రాగుటూరు, సురపురము, ఆత్మకూరు, దోమకొండ, జటప్రోలు సంస్థాన చరిత్రములు. ఈ సంస్థానాధీశ్వరులలో పేరెన్నిక గన్న కవులు గలరు. వారి పోషణమున విరాజిల్లిన వాఙ్మయ మెంతయేని కలదు. దొంతి, నారాయణపురము, పాపన్నపేట, గోపాల పేట సంస్థానములు కవుల నాదరించి, కవితా కళను బెంపొందించెను గాని యా సంస్థానములలోని రాజకవుల పేరులు, నాటి కవుల గ్రంథములు, ఆంధ్రుల దుదృష్ట వశమున నేటి దనుక మిగులక పోవుట సంతాపకరము.”

ఇలా ఒకమారు నిర్లక్ష్యానికి గురైన కావ్యాలు మళ్ళీ లభించే అవకాశాలు సన్నగిల్లడం వల్ల ఈ శతాబ్ది సాహిత్య చరిత్రకు తీరని నష్టం వాటిల్లింది. అయితే పెనుమార్పు సంభవించినప్పుడు సంధికాలానికి నష్టం వాటిల్లడం సహజమే కదా!

20వ శతాబ్ది పూర్వార్థం ముగిసే నాటికి గాని ప్రచార మాధ్యమాలు పూర్తిగా ఉచ్చస్థితికి చేరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ కూడా 1956 వరకు రెండు ముక్కలుగా ఇతర భాషీయులతో కలిసి ఉండేది. అలా సమగ్ర తెలుగు రాష్ట్రం లేని కాలంలో వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రంథాల వివరాలు ఇతర ప్రాంతాల వారు తెలుసుకొనే అవకాశం కూడా తక్కువగా ఉండేది. ప్రాంతీయ పరిమితులతో, విస్తృత ప్రచార సాధనాలు లేని కాలంలో ఉపేక్షించబడిన 19వ శతాబ్ది తెలుగు సాహిత్యం గురించి నిజంగా అధ్యయనం చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ తరువాతే లభించిందని చెప్పక తప్పదు. అంతకు ముందు వచ్చిన సాహిత్య చరిత్రలన్నింటిలో మరి సాహిత్యకారులు 19వ శతాబ్దిని గురించి దాటవేయక ఏం చేయగలరు – చెప్పండి!

ఇక్కడ డా. మంగమ్మ గారి వ్యాఖ్యను స్మరించాలి – “చరిత్రలో ఆఖరి మాటంటూ ఏదీ లేదు. కొత్త విషయాలు వెలుగులోనికి వచ్చినపుడు కొన్ని అంశాలను తిరిగి రాయాల్సి వస్తుంది. తెలుగు భాష, సాహిత్యం విస్తరణకు దూరమవుతున్న సమయంలో అంటే 18వ శతాబ్దం మధ్య కాలం నుండి 19వ శతాబ్దం మధ్య కాలం వరకు యూరోపియన్లు స్వార్థంతోనైనా చూపిన శ్రద్ధతో తెలుగు భాష నవీన పుంతలు తొక్కేందుకు నాంది ఏర్పడి, భాషకు పునరుజ్జీవం కలిగింది. వ్యాకరణాలు, నిఘ౦టువులు, పదకోశాలు ఎంతో ప్రయోజనకారులుగా వెలువడినాయి. భాషా ప్రయోగాలతోబాటు విదేశీయులు చేసిన భాషా సేవ ప్రశంసనీయం. ఈ వందేండ్లు భాషారంగంలో చరిత్రాత్మక మనుకోవాలి.”

అలాంటి ఆలోచనతో 19వ శతాబ్ది తెలుగు సాహిత్యానికి న్యాయం చేసే ప్రయత్నం, నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తరువాత, తొలిసారి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి చేసింది. 1959వ సంవత్సరంలో అకాడమి – ‘19వ శతాబ్ది సాహిత్య చరిత్ర’ అన్న అంశాన్ని నిర్దేశించి, కవి పండితులను రచన చేయవలసిందిగా ఆహ్వానించగా, వచ్చిన వ్యాసాలలో అత్తుత్తమమైన వ్యాసంగా బహూకృతమైన రచన చేసిన ఘనత శ్రీ యండమూరి సత్యనారాయణరావు గారికి దక్కింది. ఆ తరువాత ఆయన ఆ వ్యాసాన్ని ఇతర రచయితలు వ్రాసిన వ్యాస భాగాలను కూడా చేర్చి ‘ఉషః కిరణాలు’ పేరిట గ్రంథంగా వెలయించారు. ఆ గ్రంథంలో శ్రీ యండమూరి సత్యనారాయణరావు గారి ఆవేదన ఇలా ఉంది –

“సమష్టి భాషా చరిత్ర రచనా విధానమును కన్నడ, హిందీ, బెంగాలీ భాషా వాఙ్మయుల చరిత్రలు రచించిన కొందరు, పాశ్చాత్య పండితులు కొంత వరకు అనుసరించినారు. తెనుగులో వంగూరి సుబ్బారావును, ‘కవిత్వ వేది’ యును యీ పద్ధతిని తమ గ్రంథ రచన చేసినారు. అయినను 19వ శతాబ్దికి చెందిన వాఙ్మయ ప్రసక్తి యిందంతగా లేదు. కవుల చరిత్రలు వ్రాసిన చాగంటి శేషయ్యగారు తమ ‘ఆంధ్ర కవి తరంగిణి’ లో పెక్కురు 19వ శతాబ్ది కవి జీవితములను గూర్చి వ్రాసిరి కాని, వాఙ్మయ చరిత్ర ఎక్కువగా స్పృశించలేదు. ‘ఆంధ్ర రచయితలు’ పేరున శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు రచించిన గ్రంథములో 1800-1900 వరకు గల మధ్యకాలములో జన్మించిన వారి కావ్యముల ప్రసక్తి తెచ్చిరి గాని, 1800కు ముందే జన్మించి ఆంధ్ర భాషా సరస్వతికి అమూల్యాలంకారములర్పించిన అనేక కవులను విడిచి వేయుట జరిగినది. ఇటీవల వెలువడిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము’లోను, ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహములోను స్థాలీపులాకముగా తప్ప 19వ శతాబ్ది చరిత్రను చర్చించలేదు. ఇంకను అనేకులు వ్రాసిన వాఙ్మయ సూచికలో 19వ శతాబ్ది వచ్చునప్పటికి అలక్ష్యముగా వదలివేయుట జరిగినది.”

దానికి కారణం విశ్లేషిస్తే ఒక విషయం గోచరిస్తుంది. 19వ శతాబ్దిని ‘అంధయుగం’ లేక ‘క్షీణ యుగం’ అని పేర్కొంటూ ఆంధ్ర విశ్వ విద్యాలయ స్థాపన తరువాత, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వాఙ్మయ చరిత్రను బోధించేందుకు తెలుగు శాఖ వారు ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించుకొన్నారు. తరువాతి కాలంలో మద్రాసు, ఆంధ్ర, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విద్యాలయాలలో దానినే అనుసరించారు. ఇది సవరించడానికి గానీ, పునర్విమర్శ చేయడానికి గానీ ప్రయత్నం జరుగలేదని యండమూరి సత్యనారాయణరావు గారు అభిప్రాయపడ్డారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా ఉన్న పింగళి లక్ష్మీకాంతం గారి స్వాభిప్రాయం ఇందుకు దోహదమై ఉంటుందని భావించవలసి వస్తుంది. ఆయన అంటారు-

“క్షీణ యుగమున (1775-1875) చోళ, పాండ్య రాజ్యముల పతనముతో సామ్రాజ్య స్థాపకులైన ఆంధ్రులకు సామంత రాష్ట్రములైనను లేకుండ పోయినవి. స్వాతంత్ర్య రహితములు, ప్రాచీనైశ్వర్య శూన్యములు అయిన జమాలు మిగిలినవి. జాతి ముఖకళ క్షీణించినది. ఆ క్షీణ లక్షణమే కవిత్వమునకు పట్టినది.”

ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా, ప్రతిభావంతమైన ఒక జాతిలోని ప్రజ్ఞా పాటవాలు ఒక్కమారు అడుగంటవు. ఒక వేళ అడుగంటినా, మళ్ళీ అనతికాలంలోనే మహోధృతితో విజృంభించవు. 1785 వరకు దక్షిణాంధ్ర యుగంలో ఉత్తమ కవిత్వం వచ్చిందని అంగీకరిస్తూ మళ్ళీ 1901 నుండి (అనగా 20వ శతాబ్దిలో) ఆధునిక కవిత్వం నవ్య మార్గాలలో విజృంభించిందని పేర్కొనే విమర్శకులు మధ్యలో ఒక శతాబ్దిలో మాత్రం అధమ స్థాయి కవిత్వం వచ్చిందని తేల్చి పారేయడం ఎంతవరకు సబబు? 19వ శతాబ్దిలో అత్యధికంగా రచనలు వచ్చాయి. యండమూరి సత్యనారాయణరావుగారు అంటారు –

“ఈ యుగమున అత్యధిక సంఖ్య గల గ్రంథములు వచ్చినవి. సంఖ్యాధిక్యమే కాక విషయ వైవిధ్యములో కూడా ఈ శతాబ్దిదే పై చేయి. కవులు, రచయితలు ఇంత ఎక్కువ మంది మరియే శతాబ్దిలోనూ రాలేదు.”

అలాంటప్పుడు ఏ శతాబ్దిలోనైన ఉత్తమ కావ్యాలు, అథమ కావ్యాలు రెండూ ఉంటాయి. రచనలే జరుగకపోతే అవకాశం లేదు కాని, ఇంత విస్తృతిగా రచనలు వెలువడ్డాక ఉత్తమ కవిత్వం బొత్తిగా రాలేదని ఘంటాపథంగా ఎలా చెప్పగలరు? అందుకే ఈ శతాబ్ది రచనలపై విస్తృతమైన పరిశోధన చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. సత్యనారాయణరావు గారన్నట్లు-

“19వ శతాబ్ది వాఙ్మయ దశ తెనుగు సాహిత్య చరిత్రలో ఒక నూతన యుగమును ప్రారంభము చేసిన సంధికాలము. రానున్న మహోదయమునకు వైతాళిక గీతులు పాడిన ఉషఃకాలము” – అన్న విషయాన్ని ఆ శతాబ్ది కావ్యాలను పరిశీలిస్తే అంగీకరించక తప్పదు.

19వ శతాబ్ది సాహిత్యంపై తొలిసారిగా ‘ఉషఃకిరణాలు’ పేరిట యండమూరి సత్యనారాయణ రావుగారు తొలి కిరణాలను ప్రసరించినా, ఆనాటి (1960) పరిమితులకు లోబడి ఆయన పరిశోధన పూర్తి సమగ్రతను సంతరించుకోలేకపోయింది. ఆ గ్రంథం వెలువడిన నాటి నుండి 21వ శతాబ్ది ప్రారంభం వరకు గల మధ్యకాలంలో, ఇంకా ఎన్నో విలువైన విమర్శన, పరిశోధన గ్రంథాలు, సాహిత్య పదకోశాలు వెలువడ్డాయి. కొందరు 19వ శతాబ్దికి చెందిన అముద్రిత గ్రంథాలను సాధించి ముద్రించారు. ఉదాహరణకు 19వ శతాబ్దిలో ‘రంగరాజు కేశవరావు’ అనే కవిచే రచింపబడిన ‘ఇంద్రద్యుమ్నాయము’ అన్న కావ్యాన్ని దాదాపు 90 సంవత్సరాల తరువాత 1968లో పేర్వారం జగన్నాథం గారు తొలిసారిగా ముద్రించారు. అలాగే 19వ శతాబ్దికి చెందిన ‘ఆంధ్రతులసీ రామాయణం’ ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు 1984లో తొలిసారి ముద్రించారు. తెలుగు అకాడమి వారు ‘తెలుగు సాహిత్య పదకోశా’లను రెండు భాగాలుగా నిర్మించి ముద్రించారు. 1980, 1986 సంవత్సరాలలో వెలువడ్డ ఆ కోశాలలో 19వ శతాబ్దికి చెందిన అనేక గ్రంథాల వివరాలను పొందుపరిచారు. ఆధునిక చరిత్రకారులు, విమర్శకులు కూడా గత అర్థ శతాబ్ది కాలంలో కొన్ని 19వ శతాబ్ది కావ్యాల ప్రస్తావన అక్కడక్కడా చేశారు. రెండు ప్రసిద్ధ వాఙ్మయ చరిత్రలు – ఆరుద్రగారి ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ 1968లో, కొర్లపాటి శ్రీరామమూర్తిగారి ‘తెలుగు సాహిత్య చరిత్ర’ (పంచమ భాగం) 1999లో వెలువడ్డాయి. వీటిలో 19వ శతాబ్దికి చెందిన కొందరు కవులు, వారి కావ్యాల గురించి కొంత చర్చించబడ్డాయి. అలాగే తూమాటి దోణప్పగారి ‘ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణము’ గ్రంథం 1969లో వచ్చింది. ఇవన్నీ యండమూరి సత్యనారాయణరావుగారి గ్రంథం వెలువడిన అనంతరం వెలువడ్డాయి. ఇవన్నీ 19వ శతాబ్ది సాహిత్యం గురించి అందులోని నవ్యత గురించి సమగ్రమైన, నిర్దిష్టమైన, నిర్దుష్టమైన అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ జరిపేందుకు వేదిక నేర్పరిచాయి. అయితే ఇంతవరకు అలాంటి పరిశోధన జరుగకపోవడంతో, ‘అంధయుగ’ మన్న అపప్రథ మాత్రం పండితులు సాహిత్యాభిమానుల మనస్సులలో అలాగే ఉండిపోయింది. ఇది నిజంగా విచారించదగ్గ విషయం.

కాబట్టి ఈ ‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ అన్న పరిశోధన ద్వారా, ఇరవయ్యో శతాబ్దిలో వైభవాన్ని సంతరించుకొన్న ఆధునిక నవ్య యుగానికి సంబంధించిన బీజాలు, 19వ శతాబ్దిలోనే పడ్డాయన్న సత్యాన్ని చాటే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నమే ఈ పరిశోధన లక్ష్యం.

19వ శతాబ్దిని తెలుగు సాహిత్య చరిత్రలో ‘అంధయుగం’గా, ‘క్షీణ యుగం’గా కాక, ‘ఉషోదయ యుగం’గా పునర్నామకరణం చేయవలసిన అవసరం ఉందని ఈ పరిశోధన ద్వారా సహృదయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి మధ్య ఈ యుగం ఒక ద్వారబంధంగా నిలిచిందని నా ఉద్దేశ్యం. ఆ ద్వారబంధాన్ని ప్రాచీన సాహిత్యం వైపు నుండి కాక ఆధునిక సాహిత్యం వైపు నుండి దర్శించవలసిన అగత్యాన్ని నొక్కి వక్కాణిస్తున్నాను.

II. కవిత్వం – నవ్యత

“19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత” అన్న అంశాన్ని పరిశీలించే ముందు, కవిత్వం, నవ్యత వంటి మౌలిక విషయాలను గురించి అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయమ్
– భర్తృహరి నీతి శతకము

“జరా మరణ రహితమైన శాశ్వత కీర్తి కాయం దక్కిన రససిద్ధులు, సుకృతులు అయిన కవీశ్వరులకు జయము” అన్న భర్తృహరి ప్రశంస కవి ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. భారతీయ ఆలంకారికులు కవిని పరమోత్రష్ట స్థానంలో నిలిపి గౌరవించారు. ఈశావాస్యోపనిషత్తులో “కవిర్మనీషీ పరిభూః స్వయంభూః” అని పేర్కొనబడింది. పరమాత్మలాగే కవి స్వయంగా జన్మించిన వాడు అని దాని అర్థం. కవిని పరమాత్మకు సమానంగా భావించడం వైదిక ధర్మంలో కనిపిస్తోంది.

తరువాతి కాలంలో పరమాత్మను దర్శించే ఋషులలాగా కవులు కూడా ద్రష్టలు అన్న భావన సమాజంలో బలపడింది.

“నానృషిః కురుతే కావ్యం”, “కవయః క్రాంత దర్శనః” – అన్న లోకోక్తులు కవులను దివ్యదృష్టి కలవారుగా, లోకధర్మా లెరిగిన వారిగా ప్రకటిస్తున్నాయి. “రవి కాననిచో కవి కాంచు నెయ్యడన్” అన్న ఆర్యోక్తి కవి సామర్థ్యాన్ని విశదపరుస్తున్నది. రోమన్లు సైతం కవిని ఋషిగా భావించారు. వారి భాషలో కవిని ‘వాటిస్’ (Vates) అంటారు. ద్రష్ట అని దాని అర్థం.

ప్రాచీన కాలంలో క్రాంతదర్శులైన ఋషులే తాము దర్శించిన దానిని వర్ణించి తెలుపడం వలన కవులయ్యారు. ఉపనిషత్తులు, ఋక్కులు ఆనాటి ఋషుల కావ్యాలు. ఆదికవి వాల్మీకి సైతం తొలుత ఋషి. లోకోత్తరంగా రామాయణాన్ని వర్ణించి వ్రాయడం వలన ఆయన కవి అయ్యాడు. మమ్ముటాచార్యుని “లోకోత్తర వర్ణనా నిపుణః కవి కర్మ కావ్యం” అన్న నిర్వచనం ఇక్కడ గమనార్హం. ఈనాటికీ కవికి కావలసిన ప్రతిభ దైవదత్తమని, ద్రష్టలయిన కవులే లోకోత్తర రచనలు చేయగలరని భారతీయులు విశ్వసిస్తున్నారు. అలా భగవద్దత్తమైన ప్రజ్ఞతో కవి సలిపే విశిష్టమైన కర్మే కవిత్వం లేక కావ్యం.

కవిత్వం:

ప్రాచీనుల దృక్పథంలో కవిత్వమంటే కావ్యమే! అందుకే భారతీయ ఆలంకారికులు కవిత్వానికి పర్యాయపదంగా కావ్యాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. “కవిత్వం కావ్య రూపంలో ఉందా? లేకమరో ప్రక్రియ రూపంలో ఉందా?” అన్నది కాసేపు ప్రక్కన బెట్టి, దాని ప్రయోజనమేమిటి? – అన్నది ఆలోచిస్తే ఈ క్రింది విషయాలు అవగతమవుతాయి.

ఆర్యులు సప్త సంతానాలలో ఒకటిగా కావ్యాన్ని పేర్కొన్నారు. తటాకము, నిధి, అగ్రహారము, దేవాలయము, వనము, ప్రబంధము (లేక కావ్యము), పుత్రుడు – అన్న ఈ సప్త సంతానాలలో మిగితా వానిలాగే కావ్యం కూడా మానవునికి అజరామరకీర్తిని సంతరించి పెట్టే సాధనాలలో ఒకటి. అయితే ఈ సప్త – సంతానాలలో శాశ్వతమైనది కావ్యమే అని ‘గువ్వల చెన్న శతక’ కర్త అన్నమాట ఇక్కడ గమనార్హం.

గుడికూలును, నుయిపూడును,
వడి నీళ్ళను చెరువు తెగును, వనములు ఖిలమౌ!
చెడనిది పద్యం బొకటియె
కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్నా!

ఆ లెక్కన మంచి కావ్యం, ఉద్భవించినప్పుడు నవ్యమై, సార్వకాలీనం, సార్వజనీనమైతే శాశ్వతంగా నిలుస్తుందన్నమాట. అటువంటి కావ్య ప్రయోజనాలను మమ్ముటాచార్యుడు సవిస్తరంగా వివరించాడు.

“కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే, శివేతరక్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతా సమ్మిత యోపదేశయుతే!”

కావ్యం యశస్సు (కీర్తి) కొరకు, అర్థం (ధనం) కొరకు, అశుభ నివారణం (సమాజంలోని చెడును ఖండించి మార్గదర్శనం చేయడం అశుభ నివారణమే కదా!) కొరకు, సద్యః పరనిర్వృత్తి (ఐహికమును విస్మరింపజేసి, పుడమి కవ్వలి వెలుగులు దర్శింపజేసి, తక్షణము ఆనంద తన్మయత్వము కలిగించడం) కొరకు, కాంతా సమ్మితంగా ఉపదేశమందించడం (మనోహరియైన ప్రేయసిలాగా హృదయంగమంగా వ్యంగ్య ఫణితిలో ధ్వని ప్రధానంగా కర్తవ్యోపదేశం చేయడం) కొరకు అని మమ్ముటుని శ్లోకార్థం. అయితే వీనిలో చివరి రెండు ప్రయోజనాలైన ఆనందోపదేశాలే ప్రధానమైనవని అత్యధిక ఆలంకారికులు తేల్చారు. ఆనంద వర్ధనుడు, అభినవ గుప్తుడు ‘ప్రీతి రేవ ప్రధానం’ అని ఆనందానికి పెద్దపీట వేశారు. ఇక్కడ ఆనందం అంటే రసానందమే అని గ్రహించాలి. పాశ్చాత్యులలో కూడా చాలా మంది కావ్య ప్రయోజనాలుగా ఆనందోపదేశాలనే పేర్కొన్నారు. వర్డ్స్‌వర్తు ఆనందమే ప్రధానమన్నాడు. మిల్టన్ నీతిబోధ ప్రధానమన్నాడు. డ్రెడెన్, బ్లేక్, ఫిలిమ్ సిడ్నీ తదితరులు రెండూ ప్రధానమే అన్నారు. తెలుగులో ఆదికవియైన నన్నయ భట్టారకుడు

“సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో
నారసి మేలునా నితరు లక్షర రమ్యత నాదరింప, నా
నా రుచిరార్థసూక్తి నిధి నన్నయ భట్టు తెలుంగునన్, మహా
భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగాన్!” –

అన్న పద్యంలో తన కవితా లక్షణాలుగా పేర్కొన్న ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థసూక్తి నిధిత్వం అన్న మూడంటిలో మొదటి రెండు రసానందాన్ని, మూడవది ఉపదేశాన్ని సూచిస్తున్నాయి. ‘జగద్ధితము’ అన్నమాట కూడా ఉపదేశ ప్రయోజనాన్ని చాటుతోంది.

అయితే వీటిలో, ‘కళ కళ కోసమే’ అని నమ్మేవారు ఆనంద ప్రయోజనం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఉపదేశ ప్రయోజనం వైపు, ‘కళ ప్రయోజనం కోసమే’ అని భావించేవారు మొగ్గు చూపుతుంటారు. మన తెలుగు సాహిత్యంలో నన్నయ వేసిన బాటలో రెండింటికీ ప్రాధాన్యం ఏర్పడింది. మన ప్రాచీన కవులు ప్రబోధించిన జగద్ధితమే ఈనాటి అభ్యుదయ కవుల ఆశయంగా రూపుదిద్దుకొంది.

కవిత్వానికి ఎందరో భారతీయ ఆలంకారికులు పాశ్చాత్య పండితులు ఎన్నో నిర్వచనాల నందించారు – అవి అన్నీ ఆనంద ప్రధానంగా రూపొందినవే. అన్ని నిర్వచనాలలో కెల్ల – భారతీయ ఆలంకారికుల నిర్వచనాలలో జగన్నాథ పండితరాయల – “రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్” అన్న నిర్వచనం; పాశ్చాత్య నిర్వచనాలలో అలెన్ ఎడ్గార్ పో కవి యొక్క “Poetry is the rhythmic creation of beauty అన్న నిర్వచనం ఉత్తమోత్తమమైనవిగా అందరూ అంగీకరిస్తున్నారు.

ఏదైమైనా, పై చర్చనంతా వడపోసి చూస్తే కవిత్వానికి మూడు ప్రధాన లక్షణాలు ఉండాలని తెలుస్తోంది. అవి –

1. ద్రష్టత్వం; 2. రసానందం; 3. జగద్ధితం.

విచిత్రమేమిటంటే – ఈ మూడూ కూడా ‘నవ్యత’ లేకుండా ఉండలేవు. ఎలాగంటే –

  1. ద్రష్టత్వం:- ద్రష్ట అంటే – చూచువాడు, మనస్సుచే కనుగొనువాడు, గుణదోషములను కనుగొనువాడు, నిర్ణయకర్త, న్యాయాన్యాయములు పరిశీలించువాడు అని అర్థం. అంటే సాధారణ వ్యక్తుల కంటె కవి అన్నవాడు విశేషంగా మనస్సుతో ముందుగా దర్శించేవాడు, అందరికంటె భిన్నంగా నవ్యంగా చూచేవాడు అని చెప్పుకోవచ్చు. అందుకే ద్రష్టత్వంలో నవ్యత అంతర్లీనంగా ఒదిగి ఉంటుంది.
  2. రసానందం:- ‘రసం యన్నిష్ఠం?’ అంటే ‘సహృదయ జననిష్ఠం’ అని పండితుల సమాధానం. అయితే ఎంతటి సహృదయులైనా, నవ్యత లేకుండా నలిగిన బాటలోనే రససృష్టి చేస్తూ పోతే ఆదరించగలరా? జిలేబీ ఎంత ఇష్టమయినా రోజూ అవే అంటే ఏదో ఒక నాటికి మొహం మొత్తకపోదు. కాబట్టి కవి అన్నవాడు రసానందంలో ఎప్పటికప్పుడు నవ్యతను జోడిస్తూ అందించవలసిందే.
  3. జగద్ధితం:- సాహిత్యం’ అంటే హితంతో కూడుకొన్నది అని అర్థం. హితమెవరికి? అంటే ‘జగద్ధితం’ అని ఆదికవి చెప్పనే చెప్పాడు. అంటే జగత్తుకు హితం. ఇక్కడ జగత్తుకంటే జగత్తులోని జనానికి అని. ‘దేశమంటే మట్టి కాదోయ్ – దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ అన్నట్టుగానే. ‘జనము’ అంటే సమకాలీన జనమే అవుతారు. అంటే సమకాలీన సమాజంలోని రుగ్మతలను, దురాచారాలను ఎత్తి చూపి సందేశం అందించడం కవి బాధ్యత. వారికి మార్గదర్శనం చేయడం కవి కర్తవ్యం. కాలాన్ని బట్టి యుగాన్ని బట్టి సామాజిక పరిస్థితులు మారుతుంటాయి. పరిస్థితులను బట్టి సమాజంలోని దురాచారాలు, దుర్నీతులు మారుతుంటాయి. వాటిని బట్టి సందేశాలు మారుతుంటాయి. కాబట్టి ఏయుగంలోనైనా నవ్య సందేశాలుండక తప్పదు. అలా ఇక్కడా నవ్యతకు చోటు లేకపోలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే నవ్యత అన్నది. లేకుండా సాహిత్య పరిణామం, సాహిత్య ప్రస్థానం ఉండదు. అలా నవ్యతతో సాహిత్యాన్ని ముందుకు నడిపినప్పుడే, షెల్లీ కవి అభిభాషించినట్టు – “Poets are the unacknowledged legislators of the world అన్న స్థాయిలో కవులు గౌరవింపబడతారు. భర్తృహరి ప్రబోధించినట్టు – “సుకవితా యద్యస్తిన రాజ్యేన కిం?” (మంచి కవిత్వముంటే రాజ్యమెందుకు?) అన్న స్థాయిలో కవిత్వమూ గౌరవింపబడుతుంది.

ప్రతి శతాబ్దిలో ప్రపంచం అంతో, కొంతో ఆధునికతను సంతరించుకొంటుంది. ముఖ్యంగా 18వ శతాబ్దిలో విదేశీయుల సంపర్కంతో భారతీయ సమాజంలో ఆధునికత మరింత ఊపందుకొంది. ఆ ఆధునికత కాస్త ముందు వెనుకలుగా, సాహిత్యంలో ప్రతిఫలించింది. దానికి అటు తెలుగు సాహిత్యంగానీ, ఇటు 19వ శతాబ్దిగానీ మినహాయింపు కాదు – అన్నది గుర్తించాలి.

నవ్యత:

‘నవ్యము’ అంటే క్రొత్తది, ఆధునికము, ఇప్పటిది, నుతింపదగినది అని నైఘంటికార్థం. దీనిని బట్టి నవ్యత అంటే కొత్తదనం, ఆధునికత అని అర్థం చేసుకోవచ్చు. ఆంగ్లంలో దీనిని Novelty అంటారు. Novelty=Something novel; a new (or) unusual thing or event; the quality (or) state of being novel; Recentness (or) origin (or) introduction; newness అని ఆంగ్ల నిఘంటువులో పేర్కొనబడింది.

భామహుడు కవిత్వంలో నవ్యత అన్నది ఒక ప్రధానాంశంగా భావించాడు.

“ప్రజ్ఞా నవ నవోన్మేషశాలినీ ప్రతిభామతా
తదను ప్రాణనోజ్జీవేద్వర్ణనా నిపుణః కవిః”

నవనవోన్మేష శాలిని యగు ప్రజ్ఞయను ప్రతిభతో వర్ణన సల్పగల నిపుణుడు కవి – అని భామహుడు వక్కాణించాడు. కాబట్టి కవిత్వం రసవంతం కావడమే కాకుండా, నవ్యతను సంతరించుకోవడం కూడా ఆవశ్యకమే అని భామహుడు చెప్పకనే చెప్పాడు.

ఆధునికులలో శ్రీశ్రీ తన ‘నవకవిత’ లో “కదిలేదీ, కదిలించేదీ, మారేదీ, మార్పించేదీ – కవిత్వం” అంటారు. డా. దాశరథి – “ముసలి మొహం పడిన వృక్షం మీద యౌవనం చిగురించడం కవిత్వం” అంటారు, ‘పునర్నవం’ అన్న కవితలో. గురజాడ సైతం – “గుత్తునా ముత్యాల సరములు, కూర్చుకొని తేటైన మాటల – కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా” అని వ్రాసుకొన్నారు. కాబట్టి కవిత్వమంటే నవ్యతే అని తీర్మానించకపోయినా, నవ్యత కవిత్వంలో ఒక ప్రధానమైన అంతర్భాగమని అంగీకరించక తప్పదు.

అనూచానంగా వస్తున్న పద్ధతి నుండి వెలువడిన ఒక అసహజమైన ధోరణిని ‘నవ్యత’ అనవచ్చు. అప్పుడప్పుడే ఏర్పడిన ఒక అపూర్వరీతిని నవ్యత అని పిలుస్తున్నారు. “ఒక నిర్దేశ కాలానికీ, సన్నివేశానికీ సంబంధించి రూపుదిద్దుకొన్న ఒక అసామాన్య ప్రక్రియను, ప్రయోగాన్నీ మనం నవ్యమైనదిగా పేర్కొనడం పరిపాటి అయింది” – అంటారు డా. కలువగుంట రామమూర్తిగారు.

ఆ విధంగా ఆంధ్ర సాహిత్య చరిత్రలోని ప్రతియుగంలోనూ మనకు నవ్యత గోచరిస్తుంది. ఆ నవ్యత ఆధారంగానే ఆ యుగ విశిష్టత, ప్రత్యేకతను విమర్శకులు గుర్తిస్తారు. సద్విమర్శకులు ఏ శతాబ్ది లేక ఏ యుగ కవిత్వంలోనైనా నవ్యతను ఒక విశిష్టమైన కవితా గుణంగా భావించి, పరిశీలన, పరిశోధన జరపాలి. ఆ నవ్యత తరువాతి తరాలకు ఏ విధంగా మార్గదర్శకం అయిందో తరచి చూడాలి.

శాసనకాలంలో విషయ వివరణ కోసం దేశీయ ఛందస్సులలో వ్రాయబడ్డ పేలవమైన పద్యాల స్థాయి నుండి, 11వ శతాబ్దిలో నన్నయ యుగంలో నన్నయ భట్టారకుడు అక్షర రమ్యతతో, ప్రసన్న కథా కలితార్థయుక్తితో, నానా రుచిరార్థ సూక్తి నిధియై జగద్ధితం కోసం మహాభారత సంహితా రచనకు పూనుకోవడమే ఒక నవ్యత. అపారమైన ధారాశుద్ధితో, అమోఘమైన శాబ్దిక లయతో నన్నయ రచించిన ప్రతి పద్యం హృద్యమై, నవ్యతకు ప్రతీకగా నిలిచింది. తరువాతి తరాలలోని కవులకు నన్నయ మార్గదర్శకుడయ్యాడు. ఆయన ప్రవేశపెట్టిన నవ్యకవితా మార్గం – మార్గ కవితగా భాసిల్లింది.

“మును మార్గ కవిత లోకం
బున వెలయగ, దేశి కవిత బుట్టించి తెనుం
గును నిలిపి రంధ్ర విషయం
బున జన చాళుక్య రాజు మొదలగు పల్వుర్”

అంటూ “సరళము గాగ భావములు, జాను తెనుంగున నింపు పెంపుతో బరిగొన వర్ణనల్ —” చేశాడు నన్నె చోడుడు. ఆ విధంగా జాను తెనుగులో దేశికవిత, నన్నయ మార్గాన్ని ఒకింత నిలిపి రూపొందిన నవ్యత. ఆ నవ్యత 12వ శతాబ్ది శివ కవుల యుగంలో మహోద్యమ స్థాయికి చేరుకొంది. సర్వ సామాన్యులకు కవిత్వాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రజాస్వామ్య భావనను ఆ కాలంలోనే కలిగి –

“ఉరుతర గద్య పద్యోక్తులకంటే
సరసమై పరగిన జాను తెనుంగు
చర్చింపగా సర్వ సామాన్యమగుట
కూర్చెద ద్విపదలు కోర్కిదైవార”

అంటూ తెనుగు ఛందమైన ద్విపదలో కావ్య సృజన చేసిన ఘనత, నవ్యత పాల్కురికి సోమనాథునిది. సంస్కృత సమాస భూయిష్ఠ రచన సర్వ సామాన్యం కాదని, జాను తెనుగులో కావ్యాలను రచించి శివకవులు నవ్యతను సాధించారు. నన్నయ భట్టారకుని వంటి కవుల విష్ణు ప్రాధాన్య కావ్యాలను నిరసించి, శివతత్త్వ సారాన్ని వస్తువుగా తీసుకోవడం కూడా నవ్యతే కదా!

ఆపైన 13వ శతాబ్దిలో తిక్కన యుగంలో తిక్కన సోమయాజి సాధించింది మరొక రకమైన నవ్యత. సాహిత్య రంగంలో నెలకొన్న శైవ, వైష్ణవ వైరుధ్యాలకు; అచ్చతెనుగు, సంస్కృత పద బాహుళ్యాంధ్రం మధ్య వైరుధ్యాలకు అడ్డుకట్టవేసి, సమన్వయాన్ని కూరుస్తూ ఆయన మహాభారతేతిహాసంలో పదిహేను పర్వాలను ఏకబిగిని రచించాడు. శివుడు, విష్ణువులకు ఏకీకృత రూపంగా హరిహరనాథుని రూపొందించి ఆ స్వామికే తన కావ్యేతిహాసాన్ని అంకితం చేశాడాయన. అటు – “దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్ గర్వాంధ ప్రతి వీర నిర్మథన విద్యా పారగుల్ –” వంటి సంస్కృత సమాస ప్రయోగాలతో, ఇటు “పగయె గలిగెనేని పామున్న ఇంటిలో నున్నయట్లుగాన–” వంటి అచ్చ తెనుగు నుడికారాలతో ఆంధ్ర భాషను సుసంపన్నం చేసి, భవిష్యత్తులో

“కొందరికి తెనుగు గుణమగు –
కొందరకును సంస్కృతంబు గుణమగు – రెండున్
కొందరకు గుణములగు నే
నందర మెప్పింతు కృతుల నయ్యై యెడలన్”

అన్న పోతన వంటి కవులకు మార్గదర్శకుడయ్యాడు. అలాగే 14వ శతాబ్దిలో శ్రీనాథుడు, పోతన, వారి వారి శైలులలో నవ్యతను ప్రదర్శించారు. పోతన మృదుమధుర పద సంయుతమైన అనుప్రాసలతో ఆలంకారిక నవ్యతను సాధించగా, శ్రీనాథుడైతే – “కుసి హెచ్చెన్, పస హెచ్చెన్” అంటూ 14వ శతాబ్దిలోనే పారశీక పదాలను ప్రయోగించి ఆశ్చర్యకరమైన భాషా నవ్యతను చూపాడు. అంతే కాకుండా సీసపద్యంలో ఒక కొత్త లయను సాధించి, ఈనాటికీ ‘శ్రీనాథుని సీసం’ అంటూ మన్ననలందుకుంటూనే ఉన్నాడు.

ఇక 15వ శతాబ్ది సంగతి సరేసరి. ప్రబంధమనే ఒక నూతన ప్రక్రియే అవతరించింది.

పురాణాంతర్గతమైన చిన్న చిన్న కథలను వస్తువులుగా స్వీకరించి, వాటిని విశేషమైన వర్ణనలతో విస్తరించి, రసాత్మకంగా, ప్రౌఢంగా, శృంగార భరితంగా ప్రకృష్టమైన బంధ రచనలైన ‘ప్రబంధాలు’గా రాయలవారు, పెద్దనాదులు రూపుదిద్ది విశిష్టమైన నవ్యతను చూపారు.

“అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరః ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ –
కటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్!”

వంటి భావ చిత్రాలకు ఆనాడే నాంది పలికారు ప్రబంధకవులు. ఇదే శతాబ్దిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య అవతరించి తెలుగు సాహిత్య జగతిలో సంకీర్తనాచార్యునిగా గణుతికెక్కాడు. పదహారవ శతాబ్దిలో రామరాజ భూషణుడు –

“కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నము, లాద్య సత్కథల్
వావిరి పుట్టు రత్నము, లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వ వృత్తములు సానదీరిన జాతి రత్నముల్
గావున నిట్టి మిశ్ర కథగా నొనరింపుము నేర్పుపెంపునన్”

అంటూ విశిష్టమైన మిశ్ర కథతో వసు చరిత్ర వంటి అపూర్వ ప్రబంధాన్ని రచించి నవ్యతను సాధించాడు. అదే శతాబ్దిలో పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ వంటి అపూర్వ కల్పనా కథతో ప్రబంధ రచన కావించి, నవ్యతకు నూత్న ప్రమాణాలను చేకూర్చాడు. డా. వాడపల్లి చక్రపాణిరావు గారు “తెలుగు సాహిత్య చరిత్రలో ఈ కావ్యము ఆధునికమగు నవల వంటిది.” అని శ్లాఘించారు. 16వ శతాబ్దిలోనే తెలంగాణంలో ‘పొనగంటి తెలగన్న’ అన్న కవి ‘యయాతి చరిత్ర’మనే మొట్ట మొదటి అచ్చ తెనుగు కావ్యాన్ని రచించి నవ్యతకు నవ్య భాష్యం చెప్పాడు. “కావ్యంలో అచ్చతెనుగు పద్యాలు ఒకటో రెండో ఉంటేనే మెచ్చుకొంటారు. అలాంటిది మొత్తం కావ్యమే అచ్చ తెనుగులో ఉంటే పఠిత అచ్చెరువొందకపోడు.” అని ఈ కవి తన అవతారికలో వ్రాసుకొన్నాడు.

17వ శతాబ్దిలో రఘునాథ నాయకుని ఆస్థాన కవి చేమకూర వేంకట కవి – “అమ్మక చెల్ల! నా హృదయ మమ్మక చెల్లదు వీని కియ్యెడన్” వంటి చమత్కారాలతో, “ప్రతి పద్యము నందు చమత్కృతి గలగం జెప్పనేర్పు”తో నవ్యత నందించాడు. అలాగే ఈ శతాబ్దిలోనే జనరంజకమైన సమాహార కళాస్వరూపంగా ‘యక్షగానం’ కొత్త పుంతలు తొక్కి పరమోత్కృష్ట స్థాయికి చేరింది. మరోప్రక్క భక్తి శృంగార రస భావాల మయమైన క్షేత్రయ్య పదాలతో గేయ సాహిత్యం నూత్న పథంలో ప్రయాణించింది ఈ శతాబ్దిలోనే. ఇదే శతాబ్దిలో సమకాలీన సమాజంలోని దురాచారాలను, దుష్ట సంప్రదాయాలను, దుర్నీతులను ఎత్తి చూపుతూ, భాషలో సారళ్యతను సాధించి వేమన తన శతకంలో ఆధునికతను ప్రదర్శించాడు. ఆట వెలదిని జనసామాన్యుల నాల్కలపై ఆడించాడు.

ఇక 18వ శతాబ్దిలో గోగుల పాటి కూర్మనాథుడు, కాసుల పురుషోత్తమ కవి వంటి కవులు శతక సాహిత్యంలో వ్యాజస్తుతిని ప్రవేశపెట్టి ఆంధ్ర సాహిత్యానికి మరొక నవ్యతను సంతరించారు. ఈ శతాబ్ది ఉత్తరార్థంలో “సంగీత జ్ఞానము భక్తి వినా సాఫల్యము కానేరదు” అంటూ త్యాగయ్య భక్తిని, వాగ్గేయకళను మేళవించి, శిఖర స్థాయిలో నిలబెట్టాడు.

ఇంత వరకు సహృదయ విమర్శకులందరూ ఆంధ్ర సాహిత్యంలోని నవ్యతా పరిమళాలను ఆఘ్రాణించిన వారే. అయితే ఏ యుగం కవులకు ఆయుగ కవిత్వమే నవ్యమైనదిగా, అంతకు ము౦దుదంతా పాత చింతకాయ పచ్చడిగా కనిపించడం సహజమే. అసలు ఎంతో కొంత నవ్యతను సాధించకుండా సాహిత్య ప్రస్థానం ముందుకు సాగదు. ఒక యుగంలో సాధించిన నవ్యత, అంతకు ముందు యుగంలోని సాహిత్యానికి, ఆపై యుగంలో వచ్చే సాహిత్యానికి మధ్య వారధిగా నిలుస్తుంది. భవన నిర్మాత ఇటుకను, ఇటుకను కాంక్రీటుతో అనుసంధించినట్టు, సాహిత్య చరిత్రకారుడు ఒక యుగ సాహిత్యాన్ని, మరొక యుగ సాహిత్యాన్ని, ఆ యుగంలో రూపొందిన నవ్యతతో అనుసంధించాలి.

ఇటుకకు, ఇటుకకు నడుమ కాంక్రీటు లేకపోతే ఆ భవనం పటుత్వం కోల్పోయినట్లు, ఈ అనుసంధానం కొరవడితే సమగ్ర సాహిత్య చరిత్ర నిర్మాణం జరుగదన్న సత్యాన్ని సాహిత్య చరిత్రకారులు గమనించాలి. కాని 20వ శతాబ్ది ఆరంభంలో సాహిత్య చరిత్రకారులు మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్ర నిర్మాణం చేస్తూ, 19వ శతాబ్దికి సంబంధించినంత వరకు ఆ ప్రయత్నమేదీ చేయకుండా దాటవేసి, తిరిగి 20వ శతాబ్దిలో నవ్య కవిత్వ మహోదయం జరిగినట్టు చిత్రించే ప్రయత్నం చేశారు. దీని వలన 19వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర డోలాయమాన స్థితిలో నిలిచిందని చెప్పవచ్చు. ఇంతకు ముందు అధ్యాయంలో పేర్కొన్నట్టు ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులున్నా జాగృతమైన ఒక జాతి ప్రతిభ ఒక్కమారుగా నిర్వీర్యం కాదు. ఒక వేళ అయినా అనతికాలంలోనే అది తిరిగి విజృంభణతో వెలికిరాదు. ఎనిమిది శతాబ్దులుగా యుగయుగానికి ఎంతో నవ్యతను సాధించి, ప్రస్థానించిన తెలుగు సాహిత్య చరిత్రలో, ఎంత విస్తార సామ్రాజ్య వ్యవస్థలు నశించినా, చిన్న, చిన్న సంస్థానాలు ఏర్పడినా, ఒక శతాబ్ది మొత్తంలో కొందరైనా ప్రతిభావంతులైన కవులు తమ సాహితీ వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కకపోరు. అయినా తెలుగు నేలపై ఈ శతాబ్దంలో అనేక జమీందారులు ఇతోధిక సాహిత్య సేవ చేశారు. ఆచార్య తూమాటి దోణప్పగారు ఈ విషయంపై ‘ఆంధ్ర సంస్థానములు – సాహిత్య పోషణము’ అన్న బృహద్గ్రంథాన్నే వెలయించారు. అందులో ఆయన వ్యాఖ్య –

“ఉండ్రాజవరము, ఎర్రగూడెము, కపిలేశ్వరపురము, గద్వాల, దోమకొండ, పాపన్నపేట, బొబ్బిలి, ముక్త్యాల, వనపర్తి, విజయనగరము, వుయ్యూరు, వేంకటగిరి వంటి జమీందారులు కొందరు అచ్చుకూటముల స్థాపించియు, ప్రాచీనార్వాచీన గ్రంథముల ననేకము ప్రచురించియు భాషోపకార మొనర్చిరి. చల్లపల్లి, పాల్వంచ, పిఠాపురము, ముక్త్యాల, వల్లూరుల వంటి జమీందారులు ఇతరులు స్థాపించిన ముద్రణ యంత్రశాలలకు ఆర్థిక సాహాయ్యము గావించిరి. అష్టావధా నాశు కవితా శతావధానాది సాహితీ ప్రచారక రూపములకు చేయూతనిచ్చి, సర్వాంధ్రలోకమున సాహితీ జిజ్ఞాసను నవనవోన్మేషముగ నిషేవణ మొనర్చిరి. ఆస్థాన కవి పండితుల నాదరించుటయే గాక, తెలుగు దేశము నాలుగంచుల నుండియు, ఇతర రాష్ట్రములనుండియు తమ యాస్థానములకు వచ్చు కవి పండితులచే శతావధానాదికములు, శాస్త్రార్థములు చేయించి వారిని, సత్కారములు, వార్షికములు, భూదానాదికములు, అగ్రహార ప్రదానము, గజారోహణాది సమ్మానములు మొదలగు వానిచే గౌరవించి, పురా భారత సంప్రదాయములను పునరుద్ధరించిరి. ఉర్లాము, పిఠాపురము, వనపర్తి వంటి సంస్థానములలో వేదశాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఆర్షధర్మ విజ్ఞాన జ్యోతి ఆరిపోకుండనిలిపిరి. కార్వేటి నగరము, గద్వాల, నూజివీడు, పిఠాపురము, బనగానపల్లి, బొబ్బిలి, ముక్త్యాల, వల్లూరు, విజయనగరము మున్నగు సంస్థానములు సంగీత నృత్యాది లలిత కళలను ప్రోత్సహించినవి”

కొందరు ఇతర విమర్శకుల వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి – “19వ శతాబ్దారంభము నుండియు పండితులకు, కవులకు, సాహిత్య ప్రియులకు, నిర్మాతలకు తావొసగి, తాము సాహిత్య ప్రియులై ఆంధ్ర సారస్వతమును సముదార ప్రవర్తనముతో రక్షించి, నేటి ప్రజాయుగము వచ్చు వరకు బోషించిన యాంధ్ర జమిందారులందరికిని మనమెంతయో ఋణపడి యున్నాము” – కల్లూరి వేంకట నారాయణరావు.

“హయిదరాబాదు రాష్ట్రములో సాంస్కృతిక దీపము ఆరిపోకుండ కాపాడిన గౌరవము సంస్థానాధీశ్వరులకు చెందుచున్నది. ఆ సంస్థానములలో ప్రత్యేకముగా ప్రశంసింపదగినవి గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాలు. ఈ మూడు సంస్థానాలు తెలుగు భాషకు గొప్ప సేవ చేసినవి. 1880 ప్రాంతములో గద్వాల, వనపర్తి సంస్థానాలలో తెలుగు అచ్చు యంత్రాలు స్థాపితమై గ్రంథాలు ముద్రితమయ్యెను.. కవులను, గాయకులను, పండితులను పోషించి, యీ సంస్థానాలు సంస్కృతాంధ్రములను కాపాడినవి. ఈ సంస్థానాల పోషణలో ఉద్దండులైన పండితులు, కవి చక్రవర్తులు ఉండిరి” – దేవులపల్లి రామానుజరావు.

“ఈ రాష్ట్రము (నిజాము) నందలి యాంధ్ర సంస్థానములలో వాఙ్మయ చరిత్రమున సువర్ణాక్షరములలో వ్రాయదగినవి గద్వాల, వనపర్తి, ప్రాగుటూరు, సురపురము, ఆత్మకూరు, దోమకొండ, జటప్రోలు సంస్థాన చరిత్రములు. ఈ సంస్థానాధీశ్వరులలో బేరెన్నిక గన్న కవులు గలరు. వారి పోషణమున విరాజిల్లిన వాఙ్మయ మెంతయేని కలదు. దొంతి, నారాయణపురము, పాపన్నపేట, గోపాలపేట సంస్థానములు కవుల నాదరించి కవితాకళను బెంపొందించెను” – శేషాద్రి రమణ కవులు.

వీటన్నిటిని బట్టి చూస్తే, 19వ శతాబ్దిలో కవిత్వ పోషణకు కొరత లేదు. సమర్థ కవులకు లోటు లేదు. సంస్థానాధీశ్వరుల ప్రోత్సాహంతో బాటు బ్రౌను వంటి ఆంగ్లేయ పండితుల, మిషనరీల ప్రోత్సాహం కూడా అంతో ఇంతో తోడయింది. అయితే ఆనాటి చాలా కావ్యాలు 20వ శతాబ్ది ఆరంభంలో అందుబాటులో లేకపోవడానికి కారణం, బహుశా 19వ శతాబ్ది కవి పండితులు, అంతకు ము౦దు శతాబ్దుల ప్రాచీనమహాకవుల కావ్యల సేకరణ, అధ్యయనం పట్ల చూపిన శ్రద్ధ, సమకాలీనుల సాహిత్యంపై చూపకపోవడమే అని చెప్పాలి. సాహిత్య వివరాలెప్పుడూ, ఒక తరం నుండి మరొక తరానికి రసజ్ఞులైన పండితులు, విమర్శకుల వల్లే సంక్రమిస్తాయి గాని కృతిపతుల వల్ల కాదుకదా! కృతిపతులు కృతికర్తలకు ఆర్థిక సహాయం చేసి, చేతులు దులుపుకోవడం కద్దు.

ఈ పరిస్థితులలో 20వ శతాబ్ది ఆరంభంలో పింగళి లక్ష్మీకాంతం గారు 19వ శతాబ్దిని క్షీణయుగంగా పేర్కొనడం జరిగింది. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వంటి సమున్నత గురు పీఠం నుండి వెలువడిన ఆ అభిప్రాయాన్ని తరువాతి విమర్శకులు, చరిత్రకారులు అందరూ శిరోధార్యంగా భావించారు. ఆ అభిప్రాయాన్ని చెరిపేందుకు యండమూరి సత్యనారాయణరావుగారు, తూమాటి దొణప్పగారు కొంత కృషి చేసినా, నేటికీ పండిత విమర్శకుల మదులలో ఆ ముద్ర చెరిగిపోలేదనే చెప్పాలి.

అయితే ఇప్పుడు ఆధునిక ప్రగతి వలన పరిణతి చెందిన పరిశోధనలు, విమర్శల వలన, జిల్లాల వారీగా వెలువడుతున్న సాహిత్య సర్వస్వాల వలన, 19వ శతాబ్దికి చెందిన చాలా కావ్యాల వివరాలు అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటినీ ఒక్క చోట చేర్చి, పరిశీలించి, 19వ శతాబ్ది తెలుగు సాహిత్యాన్ని సమగ్రంగా పరిశోధించి అధ్యయనం చేస్తే, దానిపై గల దురభిప్రాయం తొలగిపోగలదు.

యండమూరి సత్యనారాయణరావు గారన్నట్లు ఏ శతాబ్దిలో రానంతటి సాహిత్యం ఒక్క 19వ శతాబ్దిలోనే వచ్చింది. కవుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పింగళి లక్ష్మీకాంతం గారికి కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే – “ఇంతకు పూర్వయుగములన్నిటిలో నెన్ని పుస్తకములు పుట్టినవో, అంతనెక్కువ యీ యొక్క యుగములో పుట్టినవి.” . కానీ ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు లభ్యం కావడం లేదన్నది వాస్తవం. అయితే అన్ని గ్రంథాలు దొరకక పోయినా, దొరికిన గ్రంథ సమాచారాల వలన, కొన్ని కొత్తగా లభించిన గ్రంథాల వలన సుమారు నలబైకి పైగా గ్రంథాలలో ఏదో ఒక నవ్యత చోటు చేసుకొన్న విషయం ఈ పరిశోధనలో రాబట్టగలిగాను. ఒక్క శతాబ్దిలో ఇన్ని నవ్యతా స్పర్శ గల గ్రంథాలు వెలువడటం అంతకు ముందు శతాబ్దులలో కనీ వినీ ఎరుగని విషయం. ఈ అధ్యయనం, పరిశోధన వలన తెలిసిన మరొక విషయం ఉంది. అంతకుముందు శతాబ్దులలో అక్కడక్కడ ఒక్కోరకమైన నవ్యత గోచరిస్తే, 19వ శతాబ్దిలో పలు రకాల నవ్యతలు ఒక్క శతాబ్దిలోనే అగుపించి ఆశ్చర్యం కలిగిస్తాయి.

అసలు 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత ఎన్ని రకాలుగా ఉండవచ్చో ఆధునిక దృక్పథంతో ఆలోచిస్తే, ఈ క్రింది విభాజనం (Classification) సముచితంగా ఉంటుందని భావిస్తున్నాను.

  1. సంప్రదాయ వ్యతిరేక నవ్యత
  2. అభ్యుదయాత్మక నవ్యత
  3. ఛందస్సు పరమైన నవ్యత
  4. భాషాపరమైన నవ్యత
  5. ప్రక్రియా పరమైన నవ్యత
  6. విదేశీ సాహిత్య ప్రభావ నవ్యత
  7. ఆంగ్లేయ సంస్కృతి, రాజకీయ ప్రభావ నవ్యత
  8. అన్య మత ప్రభావ నవ్యత
  9. సమకాలీన సంఘటన ప్రభావ నవ్యత
  10. వస్తు పరమైన నవ్యత

19వ శతాబ్ది సాహిత్యంలో ఇన్ని రకాల నవ్యతలు గోచరిస్తాయి. నిజం చెప్పాలంటే 19వ శతాబ్దికే తొలిసారిగా ఇన్ని రకాల నవ్యతలను సంతరించుకొనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకు ముందు శతాబ్దులలో అటువంటి పరిస్థితులు లేవు. ఆ శతాబ్దులలో ఏదో ఒకటి రెండు నవ్యతలను సంతరించుకొనే పరిస్థితులే ఉన్నాయి. ఆ ఒకటి రెండే ఆ యుగ లక్షణాలుగా భాసిల్లాయి. ఏ సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల 19వ శతాబ్ది క్షీణ యుగంగా మారిందని ఇన్నాళ్ళు విమర్శక పండితులు భావించారో, ఆ పరిస్థితులే నిజానికి ఇన్ని రకాల నవ్యతలను సంతరించుకొనేందుకు దోహదం చేశాయని భావించవచ్చు. మునుముందు అధ్యాయాలలో ఆ సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి, పైన పేర్కొన్న పది రకాల నవ్యతలు 19వ శతాబ్దిలో ఎలా రూపుదిద్దుకొన్నాయో సమగ్రంగా చర్చించాను. 20వ శతాబ్దిలో ఈ నవ్యతలే విజృంభించి, ఆధునిక కవిత్వ మహా వృక్షాన్ని నెలకొల్పాయి. ఆ నవ్య కవిత్వ మహావృక్షం ఒక్కమారుగా అవతరించ లేదు. 20వ శతాబ్ది నవ్య కవిత్వ మహా వృక్షానికి సంబంధించిన బీజాలు 19వ శతాబ్దిలోనే పడ్డాయని సహృదయులు గమనించాలి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here