Site icon Sanchika

‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-2

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

III. తెలుగు కవిత్వం – యుగ విభజన – 19వ శతాబ్ది స్థానం

ఇంతవరకు వెలువడిన తెలుగు సాహిత్య చరిత్రలలో వివిధ చరిత్రకారులు యుగ విభజన చేసిన విధానం, వాటి ఔచిత్యం, వాటిలో 19వ శతాబ్దికి ఇచ్చిన స్థానం తదితర విషయాలను ఈ అధ్యాయంలో చర్చిద్దాం.

మొదట ‘యుగము’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ‘యుగము’ అంటే కొన్ని విశిష్ట సమాన ధర్మాలు గల కాల పరిమితి అని చెప్పవచ్చు. ఆ కాల పరిమితి దాటిన పిదప సాహిత్యం కొత్తదైన, భిన్నమైన మార్గాన్ని అనుసరించవచ్చు. “ఒక మార్గం ప్రారంభం నుండి మరియొక మార్గం ప్రారంభయ్యే వరకు గల మధ్య కాలాన్ని ‘యుగ’ మంటారు” అని నిర్వచించారు కె. రామ్మోహన్ రాయ్. ఒక యుగంలో అనుసరించిన నవ్య లేక భిన్న మార్గాన్నే ఆ యుగ సాహిత్య లక్షణంగా గుర్తిస్తారు.

అయితే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. ‘లోకోభిన్న రుచిః’ అన్నది ఆర్యోక్తి. ఒక యుగంలోని కవులందరూ ఒకేలా ఆలోచించరు. ఒకే లాంటి కావ్య నిర్మాణం చేయరు. అంతెందుకు – ప్రతి కవి తన కావ్యాలలోనే ఒక దానికొకటి భిన్నంగా నవ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అలాంటిది ప్రతిభాపూర్ణమైన ఇరువురు కవుల్లో ఎవరు, ఏ సమయంలో ఎలాంటి రచన చేస్తారో ఎలా చెప్పగలం? అందుకే ‘ముఖే ముఖే సరస్వతి’ అంటారు. అయితే కవులలో సామాజిక అవగాహన పెరిగాక, సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులు చాలా మంది కవులను ఒకే లాంటి భావావేశానికి లోనుచేసి, ఒకే రకం కావ్య నిర్మాణం చేసేందుకు దోహదం చేస్తాయి. ‘సునామి’ ఉపద్రవం ఏర్పడినప్పుడు చాలా మంది కవులు ‘సునామి’పై కవితలు వ్రాయడం ఇలాంటిదే. కొన్ని సార్లు సామాజిక రాజకీయ పరిస్థితులు కాకుండా, ఆనాటి సామాజిక, రాజకీయ అవసరాలు కూడా ఒకే రకం కావ్యాలు రచించేలా చేస్తాయి. ఉదాహరణకు ప్రబంధ యుగంలో ఆనాటి మహారాజు శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా ప్రబంధ కవి. ‘ఆముక్త మాల్యద’ అన్న ప్రౌఢ ప్రబంధాన్ని వెలయించాడు. కాబట్టి అతని పోషణలో ఉన్న కవులందరు అటువంటి ప్రబంధాలనే సృజించి రాజును మెప్పించే ప్రయత్నం చేసారు. ఆ యుగం ఒక ప్రత్యేక యుగంగా, ఆ పంథా ఆ యుగ లక్షణంగా గుర్తించబడింది. ఆ ప్రబంధయుగం తరువాతి కాలాల్లో అది ఒక ‘ట్రెండ్’గా, ‘ఫ్యాషన్’గా మారిపోయింది. ఆ ‘ఫ్యాషన్’కి, ‘ట్రెండ్’కి అందరు మోజుపడి అలాంటి రచనలే చేయాలని ప్రయత్నించడం కూడా సామాజిక అవసరమే. ఒక ప్రత్యేక యుగంగా గుర్తించిన కాలం కంటే ఆ తరువాతి కాలంలోనే అటువంటి రచనలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. అంత మాత్రాన ఆ కాలాన్ని కూడా ఆ యుగంలోనే చేర్చలేము. ఎందుకంటే కవులు మోజుపడి రచించినా, వాటిలో ‘మందెక్కువయితే మజ్జిగ పలచన’ చందంగా నాణ్యత తగ్గి ప్రజలకు మొహం మొత్తడం ప్రారంభమయింది. అదే సమయంలో కొందరైనా కవులు మారిన సామాజిక రాజకీయ పరిస్థితులు కనుగుణంగా కొత్తగా ఆలోచించి ఉంటారు. దానినే ద్రష్టత్వం అంటారు. అటువంటి వాళ్ళే కొత్త రకమైన రచనలు చేస్తారు. ఆ రచనలు, అందులోని కొత్తదనం పఠితలను విశేషంగా ఆకర్షిస్తాయి సంఖ్యాబలంలో ఆ రచనలు తక్కువగా ఉన్నా అవే ఒక నవ యుగానికి తెరలు లేపుతాయి. భావిలో మరిన్ని విశిష్ట రచనలు ఆ పంథాలో వచ్చేందుకు దోహదం చేస్తాయి. ఆ పంథా తన విశిష్టతను నిలబెట్టుకొంటూ గాఢంగా పఠితలను ప్రభావం చేస్తూ ఆకర్షించిన కాలమే ఆ నవ్యయుగ పరిమితిగా భావించాలి. అలాగే గత యుగ లక్షణం గాఢత, విశిష్టత కోల్పోగానే ఆ యుగ పరిమితి ముగిసిందని అర్థం చేసుకోవాలి. అంతే కాని, గత యుగంలోని పంథా గాఢత, ప్రభావం కోల్పోయి, అలాంటి రచనలే చర్విత చర్వణంగా తరువాతి కాలంలో మితిమీరిన సంఖ్యలో వచ్చినా, ఆ కాలాన్ని కూడా కేవలం సంఖ్యా బలాన్ని బట్టి అదే యుగంగానో, లేక ఆ యుగ ప్రభావంతో సాగిన మరొక క్షీణ యుగంగానో భావించడం సరైన పద్ధతి కాదు. అంటే ఒక యుగ ఆరంభ, సమాప్తులను, లేక లక్షణాన్ని ఆ కాలంలో వచ్చిన ఒకే రకం కృతుల సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించడం తప్పు. ఆ కాలంలోనే నవ్య లక్షణాలు పుణికి పుచ్చుకొని ఒక్క కృతి వెలువడినా, అది భావి కాలాన్ని ప్రభావితం చేసి మార్గదర్శనం చేయగలిగితే, ఆ ఒక్క కృతి ఆవిర్భావమే ఒక నవ్యయుగానికి అంకురార్పణగా భావించాలి. అలాంటి కవి ఒక్కడే ఉంటే అతడే యుగకర్త అవుతాడు. ఒకరి కంటె ఎక్కువ మంది ఉంటే వారు యుగ వైతాళికులు అవుతారు.

“ఎవరు నడచిన మార్గమును అర్వాచీనులు శిష్యప్రాయులుగా ననుసరించెదరో, ఎవరి అవతారముకై ఆ కాలమునందలి పూర్వ కవుల సాధన తపః ప్రాయమగునో, ఎవడు సూత్రధారుడై కావ్య సరస్వతిని నూత్న వేషములో అలంకరించి, రంగమున ప్రవేశపెట్టునో, ఎవడు క్షీణ దశ యందున్న వాఙ్మయమును, నూత్న మార్గము దొక్కి శక్తిమంతము జేయునో, అతడు ‘యుగకర్త’ అనిపించుకొనును” అంటారు పింగళి లక్ష్మీకాంతంగారు. భావ కవిత్వ కావ్యాలు ఉధృతంగా వస్తున్న కాలంలో శ్రీశ్రీ, శిష్ట్లా ఉమా మహేశ్వర రావు వంటి ఒకరిద్దరు మాత్రమే నవ్యమైన భావనలతో నవ్యరచనలు చేశారు. ముఖ్యంగా శ్రీశ్రీ ఒక్కరే ‘మహాప్రస్థానం’ వంటి విశిష్ట నవ్య కావ్యాన్ని వెలయించారు. భావకవితా గ్రంథాలు కోకొల్లలుగా వస్తున్నా, ‘మహా ప్రస్థానం’ కావ్య మహోదయాన్నే భావ కవితా యుగానికి భరత వాక్యంగా, అభ్యుదయ కవితా యుగమనే నవ్యయుగానికి నాందీ వాక్యంగా భావిస్తున్నామే! శ్రీశ్రీని ఆ నవ్య యుగానికి యుగకర్తగా గుర్తించామే! మరి 19వ శతాబ్ది విషయంలో ఇలా ఆలోచించక పోవడం మన చరిత్రకారులు చేసిన తప్పిదమే కదా! దురదృష్టకరమైన విషయమేమంటే ‘యుగకర్త’ను పైన పేర్కొన్న విధంగా నిర్వచించిన లక్ష్మీకాంతం గారే చర్విత చర్వణరీతి వచ్చిన ప్రబంధాలను చూచి ఆ శతాబ్దిని క్షీణయుగంగా పేర్కొన్నారు గాని, ఆ శతాబ్దిలోని వైతాళికులను గురించి పట్టించుకోలేదు. 19వ శతాబ్దిలో తొలితరం స్మృతికావ్యాలను వెలయించిన వడ్డాది సుబ్బారాయకవి; తొలితరం ఖండ కావ్యాలను రచించిన ఆచంట సాంఖ్యాయన శర్మ; విదేశీ భాష నుండి తొలిసారిగా కావ్యాలను నాటకాలను అనువదించిన వావిలాల వాసుదేవశాస్త్రి, తొలి వ్యంగ్య, హాస్య కావ్యాలను రచించిన కందుకూరి వీరేశలింగం; ఆధునిక నగర వర్ణన చేసిన మతుకుమల్లి నృసింహశాస్త్రి; కొత్త కొత్త ఛందస్సులను సృజించిన కొక్కొండ వెంకట రత్న శర్మ వంటి మహానుభావులను ఆయన గుర్తించలేదు.

19వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం పూర్తిగా నవ్యమైపోయిందని ఎవరూ అనలేరు. ప్రబంధాల శృంగార వర్ణనల వైపరీత్యం, రసహీనమైన ద్వ్యర్థి, త్ర్యర్థి కావ్యాల వెల్లువను కాదని ఎవరూ ఖండించలేరు. ఏ శతాబ్దిలోనైనా అంతకుముందు శతాబ్దిలో ప్రసిద్ధి చెందిన కావ్యాల అనుకరణ ఒక ‘ఫ్యాషన్’గా వెల్లువెత్తడం సహజమే. యండమూరి సత్యనారాయణరావు (శ్రీవాత్సవ) గారు ఒక చోట అంటారు – “ఈ కాలపు కావ్యములలో నాటి యభిరుచుల ననుసరించి శబ్దాలంకారములకు, చమత్కారములతో కూడిన శ్లేషార్థములకు, ఛేకానుప్రాస, లాటానుప్రాసాది శబ్ద చమత్కృతికి కొంత ప్రాధాన్యమిచ్చిన మాట నిజమే. అది ఆ కాలపు సాహిత్యములో ‘ఫేషన్’. దానిని గుణముగాగాని, దోషముగా గాని పేర్కొనవలసిన పనిలేదు.”

అయితే ఇటువంటి కావ్యాలు మిక్కుటంగా వెలువడినంత మాత్రాన, ఆ సంఖ్యాబలం చూచి ఆ యుగ లక్షణాన్ని నిర్ణయించడం సరికాదు. మారుతున్న కాలమాన పరిస్థితుల కనుగుణంగా 19వ శతాబ్దిలో నవ్య స్పర్శ గల కావ్యాలు కూడా రాకపోలేదు. ఇది గమనించకుండా 19వ శతాబ్దిని ‘క్షీణయుగం’ లేక ‘అంధయుగం’ అనటం సమంజసం కాదు. ఈ రోజుల్లో కూడా మన తెలుగు సినిమా ఒకటి హిట్టయితే, అదే ఫార్ములాతో మరో పది సినిమాలు వరుసగా రావడం చూస్తూనే ఉంటాం. మనం మొదటి సినిమా గురించి చెప్పుకొంటాంగాని, తరువాతి సినిమాల గురించి కాదు. పైగా అవన్నీ ప్రజాదరణ కూడా పొందవు. మళ్ళీ అనతికాలంలోనే కాస్త కొత్తదనంతో మరొక సినిమా వస్తుంది. అది మళ్ళీ సక్సెస్ అవుతుంది. మనం దాని గురించి చర్చించుకొంటాం. అలాగే సాహిత్యంలో కూడా విస్తృతంగా వస్తున్న పాత చింతకాయ పచ్చడి వంటి కావ్యాలను పక్కనబెట్టి, కాసైనా నవ్యత గల కొన్ని రసవంతమైన కావ్యాలపై మనం దృష్టి నిలపాలి. వాటిని కాపాడుకోవాలి కానీ, వాటినీ ఆ గాటిలోనే కట్టి పక్కకు తోస్తే మనకు మిగిలేది శూన్యమే. ఆరంభంలో మన సాహిత్య చరిత్రకారులు 19వ శతాబ్దికి అలాంటి అన్యాయమే చేశారు. అలా ఆనాటి ఎన్నో మధుర నవ్య కావ్యాలు ఈనాడు మనకు లభ్యం కాకుండా పోయాయి. కనీసం కొందరు మహానుభావుల కృషి వల్లనైనా ఆ శతాబ్దికి చెందిన కొన్ని నవ్య స్పర్శ గల కావ్యాలు తిరిగి వెలుగులోకి రావడంతో ఆలస్యంగానైనా ఆ శతాబ్దిలోని నవ్యతను ఆస్వాదించగలిగే అదృష్టానికి మనం నోచుకొంటున్నాం. ఆ మాటకొస్తే, మన ప్రాచీన కావ్యాలు కూడా మనకు అలా మిగిలినవే. ప్రాచీన గ్రంథాలన్నీ సేకరిస్తూ, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌను, అందులో అంతో ఇంతో విశిష్టత, నవ్యత గల సత్కావ్యాలను మాత్రమే అచ్చువేయించి మనకందించాడు. నిరర్థకమని భావించిన వాటిని వదిలి వేశాడు. కొన్ని కావ్యాలకు ఆయన వ్రాసుకొన్న నోట్సు ఇలా ఉన్నాయి –

  1. గజవల్లి కొండయ్య రచించిన ‘శ్రీ పర్వత పురాణం’ గురించి – “It is a silly stupid book utter by worthless, yet written by a man of learning and in a good style of poetry.”
  2. అక్కినేపల్లి నరసింహం రచించిన ‘ఆది లక్ష్మీ విలాసం’ గురించి – “This poem is so obscured with pedantry, it is quite worthless.”
  3. సింహాద్రి వెంకటాచార్యులు రచించిన ‘చమత్కార మంజరి’ గురించి – “This poem is useless, it is composed in a bud pedantic style and is in many places nearly intelligible. Yet it is much admired by some learned Telugus. The subject of the poem is the marriage of Krishna which is the theme of at least twenty Telugu Poems.”
  4. సకల కథా సార సంగ్రహము’ గురించి – “This is an ellitrate poem of no merit, whatever parts are superior one stolen from better authors”
  5. ‘పరశు రామాయణం’ ద్విపద కావ్యం గురించి – “This poem is more rubbish and on perusing the beginning, I desired the transcriber to desist. The illiterate composer did not even know the laws of rhyme.”

అంటే, ఈ రోజు మనం గొప్పగా చెప్పుకొంటున్న తెలుగు కావ్యాలన్నీ ఎన్నో చెత్త కావ్యాల నడుమ ప్రకాశించిన జాతి రత్నాలన్న మాట. మనం పదకొండో శతాబ్ది అనగానే నన్నయ భారతాన్ని గుర్తు  చేసుకొంటాం. ఆ శతాబ్ది మొత్తంలో ఆ ఒక్క రచనే వచ్చి ఉండదు కదా! కాని వచ్చిన ఎన్నో రచనలలో అదొక్కటే రస నిర్భరమై వినూత్నమై వెలసింది కాబట్టి, అది నిలిచింది. 14వ శతాబ్దిలో ఎందరో కవులుండగా, శ్రీనాథుడు, పోతనలకు వచ్చినంత ప్రఖ్యాతి ఇతరులకు రాకపోవడానికి కారణం కూడా అదే. వారి రచనల ముందు ఇతరుల రచనలు వెలవెలబోయాయన్నమాట. అంత మాత్రాన ఆ యుగాన్ని ఉపేక్షించలేం కదా! పైగా ఆ యుగ సాహిత్య ప్రస్థానానికి శ్రీనాథుడు, పోతనలనే సారథులుగా గుర్తిస్తున్నాం.

అలాగే 19వ శతాబ్దిలో కూడా ఎన్నో రచనలు వచ్చాయి. అందులో చాలా భాగం నలిగిన బాటలోనే నడచిన రచనలు; సంఖ్యలో తక్కువే అయినా, కొత్తదనంతో వెలసిన ఉత్తమ రచనలూ వచ్చాయి. కాని మనం ఆ శతాబ్దిని ఆ ఉత్తమ రచనలతోనే గుర్తించాలి. ఆ రచనలలోని నవ్యతనే ఆ యుగ సాహిత్య పరిణామంగా అంగీకరించాలి.

ఈ అవగాహనతో వివిధ తెలుగు సాహిత్య చరిత్రకారుల యుగ విభజనను పరిశీలిస్తే, వాటిలోని ఔచిత్యానౌచిత్యాలు ఇట్టే బోధపడతాయి. తెలుగు సాహిత్య చరిత్రకారులు తమ తమ అభిరుచులను బట్టి, రచనా సౌలభ్యం కోసం వివిధ రకాలుగా యుగాలుగా విభజించారు. ప్రధానంగా వాటిని ఆరు రకాలుగా పేర్కొనవచ్చు.

1.కవులను బట్టి యుగ విభజన; 2. కవితా పోషకులను బట్టి యుగ విభజన; 3. కావ్య ప్రక్రియలను బట్టి యుగ విభజన; 4. కావ్య లక్షణాలను బట్టి యుగ విభజన; 5. కాలాన్ని బట్టి యుగ విభజన; 6. పై పద్ధతులలో కొన్ని కొన్ని కలగలిపి చేసే యుగ విభజన.

20వ శతాబ్ది ఆరంభంలో వంగూరి సుబ్బారావుగారు రచించిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర’లో ప్రక్రియాపరమైన విభజన చేశారు. అది ఇలా ఉంది.

1.పురాణ కవులు; 2. ప్రబంధ కవులు; 3. గేయ కవులు అన్న ఈ విభజన స్థూలమైనదేగాని, సూక్ష్మ వివరణలను అందించలేదు.

కేవలం కావ్య లక్షణాలను బట్టి సాహిత్య యుగ విభజన చేసినవారు ‘కవిత్వ వేది’ కే.వి. నారాయణరావు. ఆయన విభాజనం ప్రకారం తెలుగు సాహిత్యం – 1. ప్రాచీన కవిత్వం (క్రీ.పూ. 28 – క్రీ.శ. 1000); 2. పురాణ కవిత్వం (క్రీ. శ. 1001-1380); 3. కావ్య, ప్రబంధయుగం (క్రీ. శ. 1381-1650); 4. అర్వాచీన కవిత్వం (క్రీ.శ. 1651-1900); 5. నవ్య కవిత్వం (క్రీ. శ. 1901 నుండి) అని ఐదు యుగాలు. దీని ప్రకారం నన్నయ నుండి ఎర్రన వరకు అందరూ పురాణ కవిత్వంలోకి రావడం వలన ఇది కూడా స్థూల విభజనే అవుతుంది తప్ప సూక్ష్మ పరిశీలన అనిపించదు. అలాగే నాయక రాజుల కాలం నుండి 19వ శతాబ్ది అంతం వరకు అర్వాచీన యుగంలో చేర్చడం వలన చేమకూర వెంకట కవి వంటి ప్రతిపద్య చమత్కృత కవి నుండి 19వ శతాబ్ది కవుల వరకు అంతా అర్వాచీనమని చెప్పడం జరిగింది. ఇది కూడా స్థూల విభజనే. ఈ గ్రంథంలో కవిత్వవేది 19వ శతాబ్దిలో వచ్చిన మార్పులను స్వల్పమైనా గమనించలేదనే చెప్పాలి. అయితే 19వ శతాబ్ది సాహిత్య చరిత్రని ‘వీరేశలింగ యుగము’ పేరుతో ప్రత్యేక చరిత్రగా ఆ తరువాత వెలువరించారు. ఇందులో ఆయన 19వ శతాబ్దికి చెందిన చాలా మంది కవులను పరిచయం చేసి స్థాలీపులాకంగా వారి రచనలు, వివరాలను పొందుపరిచారు. కాని ఈ గ్రంథం ఆనాటి రచనలలోని నవ్యతను స్పృశించింది తక్కువే అని చెప్పాలి.

ఖండవల్లి లక్ష్మీరంజనంగారు కవులను, కాలాన్ని, కావ్య లక్షణాలను మూడింటిని కలగలిపి యుగ విభజన చేశారు. ఆయన ఉద్దేశ్యంలో తెలుగు సాహిత్యం – 1. నన్నయ పూర్వ యుగం, 2. నన్నయ తిక్కనల నడిమికాలం, 3. తిక్కన యుగం; 4. ఎర్రన యుగం; 5. శ్రీనాథయుగం; 6. అనంత ప్రబంధ యుగం – అని ఆరు యుగాలుగా విభజించబడింది.

ఇందులో కూడా నన్నయ తిక్కన నడిమికాలాన్ని సూక్ష్మంగా కాక నన్నయ యుగాన్ని, శివకవుల యుగాన్ని కలిపి స్థూలంగా చూచినట్టయింది. అంతే కాకుండా, శ్రీనాథయుగం తరువాత సాహిత్యమంతా ‘అనంత ప్రబంధయుగం’ అనడం వల్ల ఆయా కాలాలలో వచ్చిన సాహిత్యంలో భేదాన్ని గుర్తించనట్టయింది. 19వ శతాబ్ది కూడా ఇందులోనే చేరడం వల్ల ఖండవల్లి వారు ఆ శతాబ్దిలో సంఖ్యా బలంలో అధికంగా ఉన్న చర్విత చర్వణ రీతి ప్రబంధాలనే పరిశీలించారు గాని, కొత్తదనంతో వచ్చిన కొన్ని కావ్యాలను ఉపేక్షించారన్నది సుస్పష్టం.

పై ఇరువురు కూడా 19వ శతాబ్ది సాహిత్యానికి ఎలాంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. దానిని ఇతర యుగాలతో కలిపి చూశారు. అయితే పింగళి లక్ష్మీకాంతంగారు మరొక అడుగు ముందుకు వేసి, ఆ శతాబ్దిలోని అత్యధిక భాగాన్ని ఒక యుగంగా చేసి, దానిని క్షీణ యుగమని మొట్ట మొదటి సారిగా పేర్కొన్నారు. ఆయన చేసిన యుగ విభజన ఇలా ఉంది – 1. ప్రాఙ్నన్నయ యుగం (క్రీ.పూ. 200 నుండి క్రీ.శ. 1000 వరకు) 2. నన్నయ యుగం (క్రీ.శ. 11వ శతాబ్ది); 3. శివ కవి యుగం (12వ శతాబ్ది) ; 4. తిక్కన యుగం (13వ శతాబ్ది); 5. ఎర్రన యుగం (క్రీ.శ. 1300-1350 మధ్య); 6. శ్రీనాథ యుగం(క్రీ.శ. 1350-1500 మధ్య); 7. శ్రీకృష్ణదేవరాయల యుగం (క్రీ.శ. 1500-1600 మధ్య); దక్షిణాంధ్రయుగం (క్రీ.శ. 1600-1775 మధ్య); క్షీణయుగం (క్రీ.శ. 1775-1875 మధ్య); ఆధునిక యుగం (క్రీ.శ. 1875 నుండి). ఇందులో లక్ష్మీకాంతంగారు కవులను బట్టి, కాలాన్ని బట్టి, కవితాపోషకులను బట్టి, కావ్య లక్షణాలను బట్టి అన్నిరకాల పద్ధతులను సమయోచితంగా కలగలిపి యుగ విభజన చేశారు.

లక్ష్మీకాంతం గారి యుగ విభజన అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులచే పఠించబడి సర్వజనామోదమై భాసిల్లింది. నిజానికి అది ఉన్నంతలో సూక్ష్మదృష్టితో చేసిన చక్కని విభజన. ఒక్క కవులను బట్టి, లేక ఒక్క కవిపోషకులను బట్టి, లేక కావ్య లక్షణాలను బట్టి, లేక కాలాన్ని బట్టి, అని కాకుండా సాహిత్య పరిణామాన్ని బట్టి, ప్రస్థానాన్ని బట్టి ఎక్కడికక్కడా అవసరమైన పద్ధతిని స్వీకరించి ఈ యుగ విభజనను చేసారు లక్ష్మీకాంతంగారు. అయితే ఒక్క 19వ శతాబ్ది విషయంలో మాత్రం, ఆయనకు అందుబాటులో కనిపించిన ప్రబంధాల వల్లనో, లేక ఆనాటి చర్విత చర్వణరీతి ప్రబంధాల వెల్లువను చూచిన ప్రభావం వల్లనో, ఆయన దృష్టి నవ్య స్పర్శ గల కావ్యాలపై పడి ఉండకపోవచ్చు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయన్ని అభినందించాలి. అంతవరకు దక్షిణాంధ్రయుగం పట్ల కూడా పండితులకున్న చిన్న చూపును తొలగించి, గౌరవాన్ని సంతరింపజేసినందుకు నిజంగా లక్ష్మీకాంతంగారు అభినందనీయులే. ఆయన ఆ పరిధిని కేవలం 19వ శతాబ్దికి పరిమితం చేసి వదలి పెట్టారు. ఆ తరువాత ఎన్నో పరిశోధనల ఫలితంగా వెలుగు చూసిన ఆనాటి నవ్య స్పర్శ గల కావ్యాలను చవి చూసిన నేటి తరంపై, ఆ శతాబ్దిపై గల అపప్రథను కూడా తొలగించుకోవలసిన బాధ్యత ఉందని భావిస్తున్నాను.

అలాంటి ఆశావహ దృక్పథాన్ని కొంత ప్రసరింపజేసిన వారు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు, శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు. వీరిరువురూ కావ్య ప్రక్రియలను బట్టి యుగ విభజన చేసారు. దివాకర్ల వారు తమ యుగ విభజనలో – 1. ప్రాఙ్నన్నయ యుగం (లేక) అజ్ఞాత యుగం; 2. పురాణ యుగం (లేక) భాషాంతరీకరణయుగం; 3. కావ్య యుగం; 4. ప్రబంధయుగం; 5. గద్య, గేయ, యక్షగాన యుగం (లేక) దక్షిణాంధ్రయుగం; 6. ఖండకావ్య యుగం (లేక) భావ కవితాయుగం (లేక) ఆధునిక యుగం – అన్న ఆరు యుగాలను ప్రతిపాదించారు. దీంట్లో 19వ శతాబ్దిని దక్షిణాంధ్ర యుగంలోనే చేర్చడం కొంత సబబుగా తోచదు. అయితే దీనిని ప్రత్యేకంగా క్షీణ యుగంగా పేర్కొనక పోవడం అభినందనీయం.

శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారి యుగ విభజనం ఇలా ఉంది –

  1. అజ్ఞాత యుగం (లేక) ప్రాఙ్నన్నయ యుగం (క్రీ.శ. 1000 వరకు)
  2. భాషాంతరీకరణ యుగం (లేక) కవిత్రయ యుగం (క్రీ.శ. 1000 – 1350)
  3. సంధి యుగం (లేక) శ్రీనాథ యుగం (క్రీ.శ. 1350-1500)
  4. ప్రబంధ యుగం (క్రీ.శ. 1500 – 1700)
  5. దక్షిణ దేశ వాఙ్మయ యుగం (క్రీ.శ. 1700-1800)
  6. ఆధునిక యుగం (క్రీ.శ. 1800-1900)

ఇది కాస్త తేడాతో దివాకర్ల వారి విభజన లాగే ఉంది. ఈ ఇరువురి విభజనలలో భాషాంతరీకరణ యుగం అంటూ నన్నయ నుండి ఎర్రన వరకు స్థూల వర్గీకరణ, సూక్ష్మ పరిశీలనకు అవకాశం లేకుండా చేస్తుంది. అయితే కోరాడవారు 19వ శతాబ్ది ఆరంభం నుండి ఆధునిక యుగంగా భావించడం ఆశావహమైన, ఆహ్వానించదగ్గ పరిణామం. క్రీ.శ. 1350-1500 మధ్య కాలాన్ని కోరాడవారు ‘సంధి యుగం’గా పేర్కొనడం ఒక విశిష్ట వర్గీకరణంగా భావింపవచ్చు. భాషాంతరీకరణ యుగానికి, ప్రబంధయుగానికి మధ్య అటు పూర్తిగా అనువాదాలు కాకుండా, ఇటు పరిపక్వమైన ప్రబంధాలు కాకుండా మధ్యస్థంగా వెలువడిన కావ్యాల కాలాన్ని ఆయన సంధియుగంగా పేర్కొన్నారు.

అసలు ‘సంధి యుగం’ అంటే ఏమిటి? – అని సాలోచన చేస్తే ఈ విషయం అవగతమవుతుంది ఒక ప్రస్ఫుటమైన లక్షణం గల యుగం అంతరించి, మరొక ప్రస్ఫుటమైన లక్షణం గల యుగం రూపుదిద్దుకొనే లోపు, మధ్య గల కాలంలో, అటు పాత పద్ధతిలో గ్రంథాలు వెలువడుతూనే ఉన్నా, వాటిలో ఆ పాత పద్ధతిలోని ప్రామాణికత పలచనై మొహం మొత్తి, సాహిత్యాభిమానులు కొత్తదనం కొరకు ఉవ్విళ్ళూరుతుండగా, రాబోయే విలక్షణ యుగానికి బీజాలుగా నిలిచే కొన్ని (సంఖ్యా బలంలో తక్కువే కావచ్చు) కావ్యాలు వెలువడితే, దానిని ‘సంధి యుగ’మని చెప్పవచ్చు. సరిగ్గా 19వ శతాబ్దిలో కూడా అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. 18వ శతాబ్ది అంతం వరకు గల దక్షిణాంధ్ర యుగం అంతరించి, 20వ శతాబ్ది ఆరంభంలో ఆధునిక యుగం ప్రారంభమయ్యే వరకు మధ్య గల 19వ శతాబ్దిలో, అటు చర్విత చర్వణరీతిలో అనేక ప్రబంధాలు ప్రామాణికత క్షీణించి వెలువడుతున్నా, కొన్నైనా 20వ శతాబ్ది ఆధునిక యుగానికి బీజప్రాయమైన కావ్యాలు వెలువడ్డాయి. కాబట్టి ఆ యుగం ‘సంధి యుగ’మని యండమూరి సత్యనారాయణ రావు భావించారు.

ఇంత వరకు వచ్చిన సాహిత్య చరిత్రలన్నీ ఒక ఎత్తయితే, ఆ తరువాత వచ్చిన ఆరుద్ర గారి ‘సమగ్రాంధ్ర సాహిత్యం’; కొర్లపాటి శ్రీరామమూర్తిగారి ‘తెలుగు సాహిత్య చరిత్ర’ మరొక ఎత్తులో నిలిచాయి. సమగ్రతకు చాలా దగ్గరగా వచ్చిన సాహిత్య చరిత్రలు ఇవి. వీరికి ప్రేరణ కలిగించిన గ్రంథం సురవరం ప్రతాపరెడ్డిగారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’. ఆ గ్రంథంలో ఆంధ్రుల సాంఘిక, రాజకీయ, పౌర జీవన చరిత్రను చాలా సవిస్తరంగా, పరిశోధనాత్మకంగా, సమగ్రంగా రూపొందించి అందించారు రెడ్డిగారు.

“స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆంధ్ర సాహిత్యంలో వెలువడిన అనర్ఘ గ్రంథాలు కొన్నిటిలో ఈ గ్రంథము అగ్రగణ్యమని నమ్ముతాను.” అని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు ఈ గ్రంథాన్ని ప్రశంసించారు. ఇందులో ఆయన – 1. తూర్పు చాళుక్య యుగం; 2. కాకతీయుల యుగం; 3. రెడ్డి రాజుల కాలం; 4. విజయనగర సామ్రాజ్య కాలం (క్రీ.శ. 1530 నుండి 1630 వరకు); 6. క్రీ.శ. 1600 నుండి 1757 వరకు (పేరు పెట్టలేదు); 7. క్రీ.శ. 1757 నుండి 1857 వరకు (పేరు పెట్టలేదు); 8. క్రీ.శ. 1857 నుండి 1907 వరకు (పేరు పెట్ట లేదు) అని యుగ విభజన చేసారు. అయితే ఇది సాహిత్య చరిత్ర కాదు. సాహిత్య గ్రంథాల ఆధారంగా రూపొందించిన సాంఘిక చరిత్ర. అంత వరకు సాహిత్య చరిత్రకారులు, కవుల గురించి, వారి కావ్యాల గురించి, వారి పోషకుల గురించి, కావ్య భేదాలు, లక్షణాల గురించి వ్రాసారు కాని, వీటన్నిటి వెనుక సాంఘిక, రాజకీయ, పౌర జీవన విధానాల ప్రభావాన్ని అన్వయం చేసిన సందర్భం లేదు. ప్రతాపరెడ్డిగారి సాంఘిక చరిత్ర స్ఫూర్తితో ఆ పనిని ఆరుద్ర, కొర్లపాటి వారు చేసారు. ఇటీవలి కాలంలో డా. ముదిగంటి సుజాతారెడ్డిగారు ‘చారిత్రిక, సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర’ను క్లుప్తంగా 400 పేజీల గ్రంథంగా అందించారు. కొర్లపాటివారు ఐదు సంపుటాల్లో విపులంగా, ఆరుద్ర 14 సంపుటాల్లో మరింత విస్తారంగా, సాంఘిక చరిత్రతో అన్వయిస్తూ సాహిత్య చరిత్రలను అందించారు.

సురవరం ప్రతాపరెడ్డిగారి స్ఫూర్తితో ఆరుద్రగారు మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్రకు కవి పోషకుల ఆధారంగా యుగ విభజనను సమకూర్చారు. పునర్ముద్రణలలో కాస్త అటు ఇటుగా మార్పులు చేసినా, ఆరుద్ర ముందుగా వేసుకొన్న ప్రణాళిక ప్రకారం చేసిన యుగ విభజన ఇలా ఉంది –

  1. ఆదిమ, చాళుక్య యుగాలు (క్రీ.శ. 12వ శతాబ్ది చివరిదాకా)
  2. కాకతీయ యుగం (క్రీ.శ. 1200 -1290)
  3. పద్మ నాయక యుగం (క్రీ.శ. 1337 – 1399)
  4. రెడ్డి రాజుల యుగం (క్రీ.శ. 1400 -1450)
  5. తొలి రాయల యుగం (క్రీ.శ. 1450 – 1500)
  6. మలి రాయల యుగం (క్రీ.శ. 1500 – 1550)
  7. నవాబుల యుగం (క్రీ.శ. 1550-1600)
  8. నాయక రాజుల యుగం (క్రీ.శ. 1600-1670)
  9. కడపటి రాజుల యుగం (క్రీ.శ. 1670-1750)
  10. కుంఫిణీ యుగం (క్రీ.శ. 1750-1850)
  11. జమీందారీ యుగం (క్రీ.శ. 1850-1900)
  12. ఆధునిక యుగం (క్రీ.శ. 1900 నుండి – )

వీటిలో 19వ శతాబ్ది ‘కుంఫిణీ యుగం’లో, ‘జమీందారీ యుగం’లో సగం, సగంగా విభజించబడింది. ఈ యుగాల సంపుటాలలో ఆరుద్ర చాలా మంది 19వ శతాబ్ది కవుల గురించి, అక్కడక్కడా వారి కావ్యాలలోని ఒకటి, రెండు పద్యాలను ఉటంకిస్తూ, వారి కవిత్వ పరిచయం చేసారు.

కొర్లపాటి శ్రీరామమూర్తిగారు తమ ‘తెలుగు సాహిత్య చరిత్ర’ను ఈ క్రింది విధంగా విభజించారు –

1.ప్రాఙ్నన్నయ యుగం; 2. నన్నయ యుగం; 3. శివకవి యుగం; 4. తిక్కన యుగం; 5. ఎర్రన యుగం; 6. శ్రీనాథ యుగం; 7. రాయల యుగం; 8. దక్షిణాంధ్రయుగం; 9. క్షీణయుగం; 10. ఆధునిక యుగం.

ఐదో సంపుటంలో 19వ శతాబ్ది అంతం వరకు వివరించబడింది. ఇది 1999లో వెలువడింది. మరి 20వ శతాబ్ది సాహిత్య చరిత్ర (ఆధునిక యుగం), ఆరవ సంపుటంగా భావిలో వెలువడుతుందేమో! ఐదో సంపుటంలో కొర్లపాటి వారు 17, 18, 19 శతాబ్దులను ఒక యుగంగా చేర్చి, దానికి పింగళి లక్ష్మీకాంతం గారి బాటలో క్షీణయుగమని పేరు పెట్టారు. అయితే లక్ష్మీ కాంతంగారు కుదించిన క్షీణయుగాన్ని ఈయన మళ్ళీ పెద్దదిగా చిత్రించారు. 19వ శతాబ్దిని అందులో చివరి అంకంగా పొందు పరిచారు. అయితే కొర్లపాటివారు చాలామంది 19వ శతాబ్ది కవులను పరిచయం చేసారని చెప్పవచ్చు.

ఆరుద్ర, కొర్లపాటి ఇరువురు కూడా 19వ శతాబ్దికి చెందిన చర్విత చర్వణ రీతిలో ఉన్న చాలా ప్రబంధాలను విశ్లేషిస్తూ, కొన్ని, కొన్ని నవ్య స్పర్శగల కావ్యాలను గురించి కూడా అక్కడక్కడా పరిచయం చేసారు. అయితే వీటికి వారంతగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించదు. అక్కడక్కడా ‘ఇది కొత్తదనం’, ‘ఇది ఇంతకు ముందు కనిపించదు’ – అంటూ తేలిక మాటలతో సరిపుచ్చారు. దీనికి కారణం వీరి దృష్టిలో 19వ శతాబ్ది క్షీణయుగంలో భాగమన్న ముద్ర ఉండడమే అని స్పష్టంగా గ్రహించవచ్చు. అయితే, వీరిరువురూ కూడా కొన్ని నలిగిన బాటలోనే నడచిన ప్రబంధాలలో కూడా కవిత్వం బాగుంటే ప్రశంసించడం గమనార్హం. కాని నవ్య స్పర్శ గల కావ్యాలను నవ్యతా దృష్టితో పరిశీలించడం కాని, 20వ శతాబ్దిలోని ఆధునిక కావ్యాలతో వాటిని తులనాత్మక అధ్యయనం చేయడం గానీ, 19వ శతాబ్ది నవ్య స్పర్శ గల కావ్యాల ప్రభావం భావిలో ఎలా ప్రసరించింది అన్న అంశాలపై గాని వారు దృష్టి సారించిన దాఖలాలు గాని అగుపించవు. 19వ శతాబ్దిలో వచ్చిన సామాజిక, రాజకీయ, సాంకేతిక పరిణామాల ప్రభావం ఆ శతాబ్ది కావ్యాలపై ఎలా పని చేసాయన్న అధ్యయనం కూడా కనిపించదు. 19వ శతాబ్ది క్షీణ యుగాంతర్భాగం అన్న ముద్ర, 20వ శతాబ్దిలోనే నవ్యయుగం అంకురించిందన్న భావన, కించిత్తు రస పక్షపాతం – వారిని, భావి నవ్య సాహిత్య మహావృక్షానికి బీజాలుగా నిలిచిన 19వ శతాబ్ది కావ్యాల ఔన్నత్యాన్ని గుర్తించకుండా చేసాయని చెప్పవచ్చు.

డా. ముదిగంటి సుజాతారెడ్డి గారు రచించిన ‘తెలుగు సాహిత్య చరిత్ర’లో యుగ విభజన కవుల పేరిటనే జరిగింది. ఈమె పట్టు సడలకుండా ఇదే పద్ధతిని చివరి వరకు పాటించడానికి ప్రయత్నించడం అంతకు ముందు చరిత్రకారులు కన్న విలక్షణంగా ఉంది. ఆమె – 1. ప్రాఙ్నన్నయయుగం; 2. నన్నయ యుగం; 3. నన్నయ, తిక్కనల మధ్య యుగం; 4. తిక్కన యుగం; 5. ఎర్రన యుగం; 6. శ్రీనాథ యుగం; 7. శ్రీకృష్ణ దేవరాయల యుగం; 8. రఘునాథ నాయక యుగం; 9. వీరేశలింగ యుగం; 10. కృష్ణశాస్త్రి యుగం; 11. శ్రీశ్రీ యుగం – అని విభజించారు.

అయితే శివకవుల యుగంగా ప్రసిద్ధి చెందిన 12వ శతాబ్దిని – ‘నన్నయ, తిక్కనల మధ్య యుగం’ అని ‘కాలం’ ఆధారంగా యుగ నిర్ణయం చేసినా, నన్నయ, తిక్కనల పేర్లు కనిపించగానే, పాఠకుడు తొందరలో ఆ విషయాన్ని గ్రహించకుండా, కవుల పరంగానే ఈ విభజన కూడా ఉందని భ్రమిస్తాడు. బహుశః సుజాతారెడ్డిగారు కూడా ఇలాగే భావించి ఉంటారు.

సుజాతారెడ్డిగారిని ముఖ్యంగా అభినందించవలసిన విషయం ఏమిటంటే, ఆమె 19వ శతాబ్దిని క్షీణ యుగమని, లేక కుంఫిణీ, జమీందార్ల యుగమని కాకుండా ‘వీరేశలింగ యుగం’ అని ఆనాటి వైతాళికుని పేరుతో పేర్కొనడం. “ఆధునిక యుగానికొచ్చేసరికి వీరేశలింగం, కృష్ణశాస్త్రి గార్ల పేర్లతో యుగాలను నిర్దేశించడం ఈవిడ చూపిన విలక్షణ దృక్పథం” అని ప్రశంసించారు డా. సి. నారాయణరెడ్డిగారు. అయితే ఈమె వ్రాసింది చాలా సంక్షిప్త చరిత్ర. ఈ అధ్యాయంలో ఆమె ఆశయం మేరకు సగం పుటలలో సామాజిక నేపథ్యాన్ని వివరించి, ఆ పైన పుటలలో కొంత మంది కవులు, వారి కావ్యాల పేర్లు చాలా క్లుప్తంగా తెలియజేసారు.

ఇటీవలే వచ్చిన మరొక ‘తెలుగు సాహిత్య చరిత్ర’ను ద్వా.నా.శాస్త్రి గారు రచించారు. ఇందులో ఆయన ఏ సాహిత్య చరిత్రకారుడూ చేయనంత స్థూల విభజన చేసి ఆశ్చర్యం కలిగించారు. ఆయన కేవలం రెండే రెండు భాగాలుగా సాహిత్య చరిత్రను విభజించారు. ఒకటి – ప్రాచీన సాహిత్యం; రెండు – ఆధునిక సాహిత్యం. ఈ స్థూల విభజనలో మళ్ళీ అనేక అధ్యాయాలు రచించారు. అవి కొన్ని కవుల గురించి, మరి కొన్ని ప్రక్రియలు, వాదాల గురించి ఉన్నాయి. ప్రాచీన సాహిత్య విభాగంలో చివరలో ‘ఆంధ్ర సంస్థానాలు – సాహిత్య పోషణ’ అన్న అధ్యాయంలో మాత్రం చాలా క్లుప్తంగా కేవలం, నాలుగు పుటలలో 19వ శతాబ్ది గురించి, ఆనాటి కొందరు కవులు, వారి కావ్యాల పేర్లు ఉటంకిస్తూ పరిచయం చేసారు. ఏమైనా, 19వ శతాబ్ది నాటి కావ్యాల గురించి, వాటిలోని నవ్యత గురించి ద్వా.నా. శాస్త్రిగారు పరిశీలించింది ఏమీ లేదు.

‘తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావము’ పేరిట ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు రచించిన గ్రంథంలో 16,17,18 శతాబ్దులను ఉషఃకాలముగా, 19వ శతాబ్ది పూర్వార్థాన్ని బ్రౌణ్యయుగంగా, 19వ శతాబ్ది ఉత్తరార్థాన్ని వీరేశలింగ యుగంగా పేర్కొన్నారు. ఆ రకంగా అందరికన్నా ఎక్కువగా, 19వ శతాబ్ది కవిత్వంలోని నవ్యతను ముఖ్యంగా ఇంగ్లీషు ప్రభావ దృష్టితో విపులంగా చర్చించిన పరిశోధకులు, విమర్శకులు ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగారు అని చెప్పవచ్చు. అంతేకాదు 19వ శతాబ్దిని బ్రౌణ్య, వీరేశలింగ యుగాలుగా విభజించి, అంతకు ముందు మూడు శతాబ్దులను ‘ఉషఃకాలము’గా పేర్కొని కొత్తపల్లి వారు 19వ శతాబ్దికి ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపును కొనితెచ్చారు. ఆ విషయంలో కొత్తపల్లి వారు యండమూరి సత్యనారాయణరావు గారి కంటే ముందంజలో ఉండి అభినందన పాత్రులయ్యారు. ఈయన మతుకుమల్లి నరసింహ శాస్త్రి రచించిన ‘చెన్నపురీ విలాసము’; వావిలాల వాసుదేవ శాస్త్రి రచించిన ‘సీజరు చరిత్రము’, గురజాడ శ్రీరామమూర్తి రచించిన ‘వెనిసు వణిజ నాటకము’ ఇత్యాదుల గురించే కాకుండా, వీరేశలింగం పంతులుగారి అనేక రచనలపై సమగ్ర పరిశీలన జరిపారు. అయితే ఈయన దృష్టి కేవలం కవిత్వానికే పరిమితం కాక పోవడం వల్ల నవల, కథ, వచన నాటకాలు, శాసనాలు, పత్రికలు – ఇలా అనేక రంగాలపై ఆంగ్ల భాషా ప్రభావాన్ని చర్చించారు. అందువల్ల నవ్య కావ్యాల పరిశీలనకు కొంత పరిమితిని విధించుకోవలసి వచ్చింది. అంతే కాకుండా ఆయన నవ్యతా పరిశీలన కేవలం ఇంగ్లీషు భాషా ప్రభావ దృష్టితోనే సాగింది.

మొత్తానికి ఇన్ని సాహిత్య చరిత్రలలో దేనిలోనూ, 19వ శతాబ్ది తెలుగు సాహిత్యానికి సరైన న్యాయం జరుగలేదనే చెప్పాలి. అయితే కొంతలో కొంత ఆరుద్ర, కొర్లపాటి ‘చరిత్రలు’ నయమని అంగీకరించాలి. అయినా అవి కూడా లక్ష్మీకాంతం గారి ‘క్షీణ యుగ’ ముద్రకు వత్తాసు పాడినవే గాని, ఆ ముద్రను చెరిపే ప్రయత్నం చేయలేకపోయాయి. ఇవి యండమూరి సత్యనారాయణరావుగారి ‘ఉషఃకిరణాలు’ గ్రంథం వెలువడ్డాకే వచ్చినా, ఆయన ప్రతిపాదించినట్లుగా, 19వ శతాబ్ది – రాబోయే నవ్య సాహిత్య యుగానికి ముందు ఉషఃకాలమన్న సిద్ధాంతానికి మద్దతు పలుకలేదు. యండమూరి సత్యనారాయణ రావుగారి ఆవేదన ఆవేదనగానే మిగిలింది.

తెలుగు సాహిత్యంలో విమర్శ ప్రక్రియ 19వ శతాబ్దిలోనే అవతరించిందని ఆచార్య ఎస్వీ రామారావుగారు పేర్కొన్నారు. ఆయన అంటారు – “తెలుగు సాహితీ సుక్షేత్రమునందు విమర్శనా స్రవంతిని అవతరింప జేసిన భగీరథుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తొలి తెలుగు విమర్శనా గ్రంథమును వెలయించిన కీర్తి మూర్తి ఆయన. పంతులుగారు రచించిన ‘విగ్రహతంత్ర విమర్శనము’ 1876లో వివేక వర్థని పత్రిక యందు వెలువడినది. ఆంధ్ర వాఙ్మయమున వెలసిన ప్రప్రథమ సాహిత్య విమర్శనా గ్రంథమిదియే.” కందుకూరి వారు రచించిన ‘సరస్వతీ నారద విలాపము’ సమకాలీన సాహిత్య విమర్శనార్థం రచించిన లఘు కావ్యం అన్నది సుస్పష్టం. “కందుకూరి సమకాలీనులైన కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వేదము వేంకటరాయశాస్త్రి, గురజాడ అప్పారావు ప్రభృతులునాడు విమర్శ రంగమును సుసంపన్నము గావించిరి” అని ఎస్వీ రామారావుగారు పేర్కొన్నారు.

అలా, తెలుగు సాహిత్యం 19వ శతాబ్ది ఉత్తరార్థంలో ఆత్మవిమర్శనం చేసుకొనే స్థాయికి ఎదిగిందంటేనే, అంతకు కొంత కాలం ముందే, తెలుగు కవి పండితులు నవ్యంగా ఆలోచించడం ప్రారంభించారని నా అభిప్రాయం. ఆ విధంగా చూసినా 19వ శతాబ్దిని క్షీణ యుగంగా చూడడం భావ్యం కాదని నా భావన. కాని ఈనాటికీ 19వ శతాబ్దిని చాలా మంది సాహితీవేత్తలు క్షీణయుగంగానే భావించడం శోచనీయం.

దీనికి ప్రధానంగా వివిధ సాహిత్యకారులు తమ యుగ విభజనలలో అనుసరించిన పద్ధతులు కూడా ఒక కారణమని చెప్పాలి. వీటిలో ఏ పద్ధతి కూడా 19వ శతాబ్ది సాహిత్యాన్ని సమగ్రంగా, నిర్దిష్టంగా అధ్యయనం చేసేందుకు అనుకూలంగా లేదు. అయినా, వీటిలో ఏ పద్ధతి కూడా పరిపూర్ణమైనదని చెప్పలేము. ప్రతి పద్ధతిలో కూడా ఏదో ఒక పరిమితి ఉంది. కవులను బట్టి చేసే విభజనలో ఒకటి రెండు యుగాలలో, యుగకర్తగా పేర్కొనదగిన కవి కనిపించక, వేరే మార్గాన్ని అనుసరించడమో, లేక యుగకర్త స్థాయి లేని కవిని యుగకర్తగా పేర్కొనడమో జరుగుతుంది. కవి పోషకులను బట్టి చేసే విభజనలో కొన్ని యుగాలలో ఆ స్థాయి పోషకుడు లేకున్నా, ఎవరో ఒకరికి పెద్ద పీట వేయడమో, లేక అన్య మార్గాన్ని వెదుక్కోవడమో జరుగుతుంది. అలాగే మిగతా పద్ధతులలో కూడా ఇలాగే పరిమితులున్నాయి.

ఇలాంటి యుగ విభజనల వల్ల నిజానికి సాహిత్య చరిత్ర పరిణామాన్ని, ప్రస్థానాన్ని నిర్దిష్టంగా వివరించలేము. ఏ యుగంలోనైనా కేవలం సమకాలీన సామాజిక రాజకీయ పరిస్థితులే సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు – శివ, కేశవ వైరుధ్యం ప్రబలి ఉన్నప్పుడు హరిహరనాథ తత్త్వం ప్రబోధిస్తాడు తిక్కన. ప్రజలు భోగ భాగ్యాలతో తులతూగుతున్నప్పుడు శృంగార ప్రబంధాలు వెలువడుతాయి. ‘కన్యాశుల్కం’ దురాచారం ప్రబలి ఉన్నప్పుడు ‘కన్యాశుల్కం’ వంటి నాటకాన్ని రచించడం జరుగుతుంది. అలాగే ‘నిజాం’ వంటి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు కాళోజి, దాశరథి వంటి కవులు ఉద్యమ కవిత్వాన్ని విరచిస్తారు. ఈ విషయం గుర్తెరిగి సాహిత్య చరిత్రను రచించిన ఆరుద్ర, కొర్లపాటి, ముదిగంటి సుజాతారెడ్డి ప్రభృతులు కూడా యుగ విభజన విషయానికి వచ్చేసరికి పాత పద్ధతులనే అనుసరించారు. కారణం -సామాజిక, రాజకీయ పరిస్థితులను విభజించి, వాటి ఆధారంగా యుగ విభజన చేయడం అసాధ్యం.

కాలాయ నమః. కాలాన్ని బట్టి సామాజిక రాజకీయ పరిస్థితులు మారుతుంటాయి. ఆ పరిస్థితులే ప్రజల, పాలకుల మానసిక స్థితిగతులను నిర్దేశిస్తాయి. ఆ స్థితి గతులను బట్టి కవి పోషకుల సాహిత్యాభిరుచులుంటాయి. వారిని బట్టి కవుల రచనలుంటాయి. ఆ కవులను బట్టి వివిధ ప్రక్రియలు, కవితా లక్షణాలు రూపొందుతాయి. ఇంతవరకు వచ్చిన సాహిత్య చరిత్రలలో, కాలాన్ని ఉపేక్షించి, దాని ప్రభావంతో ఏర్పడ్డ తరువాతి ఫలితాలతో ప్రమేయం గల – కవి పోషకులను, కవులను, ప్రక్రియలను, సాహిత్య లక్షణాలను ఆధారంగా చేసుకొని యుగ విభజనలు చేసారు. కాని వీటన్నిటికీ మూలమైన కాలాన్ని బట్టి యుగ విభజన చేసినవారు లేరు – ఒక్క వీరేశలింగం పంతులు గారు తప్ప. అయితే ఆయన విభజన – 1. ప్రాచీన కవులు (క్రీ.శ. 1100-1500); 2. మధ్యయుగం కవులు (క్రీ.శ. 1500-1650); 3. ఆధునిక కవులు (క్రీ.శ. 1650-1900) అంటూ మరీ స్థూలంగా ఉండి, సూక్ష్మాధ్యయనానికి అవకాశమీయక సమంజసంగా తోచదు. పైగా ఆయన చేసిన కాల విభజన ఆనాటికి తగింది గానీ, ఈనాటి కాలానికి అది ఔచిత్యం కోల్పోయింది.

కాబట్టి, ఆధునిక దృష్టితో తెలుగు సాహిత్య చరిత్ర యుగ విభజన కాలం ఆధారంగా, సూక్ష్మ రీతి అధ్యయనానికి అవకాశమిచ్చేలా ఇలా ఉండటం సముచితం.

  1. పదకొండవ శతాబ్దికి పూర్వం తెలుగు సాహిత్యం.
  2. పదకొండవ శతాబ్ది తెలుగు సాహిత్యం.
  3. పన్నెండవ శతాబ్ది తెలుగు సాహిత్యం.
  4. పదమూడవ శతాబ్ది తెలుగు సాహిత్యం.
  5. పద్నాలుగవ శతాబ్ది తెలుగు సాహిత్యం.
  6. పదిహేనవ శతాబ్ది తెలుగు సాహిత్యం.
  7. పదహారవ శతాబ్ది తెలుగు సాహిత్యం.
  8. పదిహేడు, పద్దెనిమిదవ శతాబ్దుల తెలుగు సాహిత్యం.
  9. పందొమ్మిదవ శతాబ్ది తెలుగు సాహిత్యం.
  10. ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్యం.

ఇలా – ప్రతి శతాబ్ది సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ కొనసాగించవచ్చు. ఈ రకమైన యుగ విభజన వల్ల ఈ క్రింది లాభాలున్నాయి.

  1. ప్రతి శతాబ్దిలో మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకనుగుణంగా సాహిత్య పరిణామాన్ని చక్కగా విశ్లేషించే అవకాశం ఉంటుంది.
  2. సాహిత్య చరిత్రాధ్యాయులకు కాలానుగుణంగా సాహిత్యంలో వచ్చిన మార్పులపై కూలంకషమైన అవగాహన ఏర్పడుతుంది.
  3. అనవసరంగా ఏ కాలంలోనూ, ఏ కవికీ, లేక కవి పోషకునికీ పెద్దపీట వేయవలసిన పని లేదు.
  4. ఒకరి కంటే ఎక్కువ మంది గొప్ప కవులు లేక కవి పోషకులు ఉన్నప్పుడు, అనవసరంగా ఇతరులను తక్కువ చేయవలసిన పని లేదు. ఉదాహరణకు ‘శ్రీనాథయుగం’ అనడం వల్ల పోతనను తక్కువ చేసినట్లే గదా!
  5. కొన్ని ప్రక్రియలు లేదా లక్షణాలలో కావ్యాలు విరివిగా వెలువడుతుంటే, వాటి పేరుతో యుగ నామాలుంచితే, ఇతర ప్రక్రియలను ఉపేక్షించే అవకాశముంటుంది. కాలాన్ని బట్టి యుగ విభజన చేస్తే అలాంటి ఆస్కారం ఉండదు.
  6. ఒకే రకంగా వెలువడతున్న కావ్యాల సంఖ్యాబలాన్ని బట్టి యుగ నిర్ణయం జరుగక, సాహిత్యంలో వస్తున్న కొత్త పోకడలను కూడా గమనించే అవకాశం ఉంటుంది.
  7. ప్రతి శతాబ్దిని, ఆ శతాబ్దిలోని ఉత్తమోత్తమ కవులు, వారి కావ్యాలతో గుర్తించవచ్చు.
  8. అనవసరంగా, ఒక కాలానికి క్షీణ యుగమని లేక వైభవోపేత యుగమని, సాహిత్య చరిత్రకారుల స్వాభిప్రాయాలను రుద్దే అవకాశం ఉండదు.
  9. సాహిత్య చరిత్రకారుడు ఒక కవి లేదా పోషకునిపై గల ప్రత్యేక అభిమానంతో ఆ యుగాన్ని అతని పేర దత్తం చేసే అవకాశముండదు.
  10. ప్రతి భాగంలో ఒక నిర్దిష్టమైన కాల పరిమితిలోని సాహిత్యాన్ని చక్కగా విశ్లేషించే అవకాశముంటుంది.
  11. ఒక నిర్దిష్టమైన కాల పరిమితిలోని సాహిత్య మూల్యాలతో, మరొక నిర్దిష్టమైన కాల పరిమితిలోని సాహిత్య మూల్యాలను పోల్చి, తులనాత్మక అధ్యయనం చేసే అవకాశముంటుంది.
  12. శాస్త్రీయ పద్ధతిలో నిర్దిష్ట కాల పరిమితులలో తులనాత్మకంగా కవుల సంఖ్య, కావ్యాల సంఖ్య పెరుగుదల, తరుగుదలల అధ్యయనం చేసే అవకాశముంటుంది.
  13. శాస్త్రీయ పద్ధతిలో నిర్దిష్ట కాల పరిమితులలో తులనాత్మకంగా సాహిత్య ప్రమాణాలు, స్థాయి, ఔన్నత్యాల పెరుగుదల, తరుగుదలల అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది.
  14. ప్రతి శతాబ్ది సాహిత్యంపై, అంతకు ముందు శతాబ్ది సాహిత్య ప్రభావాన్ని, తరువాతి శతాబ్ది సాహిత్యానికి – ఆ శతాబ్ది సాహిత్యం అందించే ప్రేరణను అంచనా వేయగలిగే అవకాశముంటుంది.
  15. ఒక శతాబ్దిలోని ఉత్తమ కవులను, రచనలను సులభంగా జల్లెడపట్టి గుర్తించవచ్చు.
  16. భావిలో కవులు, కావ్యాల కాలాలను గురించి వాదోపవాదాలు చెలరేగే అవకాశానికి తావీయదు.

కావున ఆగామి కాలంలో, శతాబ్దుల పరంగా యుగ విభజన చేసి ప్రతి శతాబ్ది సాహిత్యాన్ని ఒక ప్రత్యేక సంపుటంలో ఆయా శతాబ్దుల సామాజిక, రాజకీయ పరిస్థితుల కనుగుణంగా విశ్లేషిస్తూ, ప్రతి శతాబ్ది సాహిత్యానికి పరిపూర్ణ న్యాయం జరిగేలా ఒక సమగ్ర సాహిత్య చరిత్ర వెలయగలదని ఆశిద్దాం. ఇప్పటికే ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం’ వారు ‘20వ శతాబ్ది తెలుగు సాహిత్యం’ అన్న ఒక గ్రంథాన్ని కె. రామమోహన రాయ్ గారిచే వ్రాయించి, వెలువరించి ఆ దిశలో అడుగులు కదపడం ముదావహం. యుజిసి ప్రాజెక్టు క్రింద, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ సాహిత్యాచార్యులు, సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావుగారు ‘20వ శతాబ్ది తెలుగు కవిత్వం’ అన్న అంశంపై ఒక సమగ్రమైన పరిశోధన జరుపడం మరింత ఆనందదాయకం.

IV. 19వ శతాబ్దిలో సామాజిక, రాజకీయ పరిస్థితులు

ఒక్కసారి వాగ్గేయకారుడు త్యాగరాజు జీవితకాలం నాటి ఆంధ్ర దేశాన్ని ఊహించండి – ఆంధ్ర దేశాన్ని అనేక భాగాలుగా చేసుకొని ఎందరో రాజులు, సంస్థానాధీశులు పాలిస్తున్న కాలం. విద్యాభ్యాసానికి సనాతన సంప్రదాయ పరంపరగా వస్తున్న గురుకులాలు. బోధన సంస్కృతాంధ్రాలలోని కావ్యాలే. కావ్య రచనలు తాళ పత్ర గ్రంథాలలో. స్త్రీలకు విద్యావకాశాలు మృగ్యం. ప్రజలలో భగవద్భక్తి, నగర సంకీర్తనలు, పురుషుల తలలపై కొప్పులు, పిలకలు. మతపరమైన నమ్మకాలు, భగవంతుని మహిమలపై విశ్వాసం, స్త్రీలు – పతియే ప్రత్యక్ష దైవంగా భావించే సాధ్వీమణులు. ప్రాచీన సంప్రదాయ వస్త్రధారణ, కాస్త వయసు మీరగానే ప్రాపంచిక విషయాలకన్న మోక్షసాధన పట్ల ఆసక్తి. ఇవన్నీ తలచుకొంటే ఏదో ఒక ప్రాచీనకాలానికి సంబంధించిన చిత్రం మన కళ్ళలో మెదులుతుంది.

ఇప్పుడొక్కసారి సంఘ సంస్కర్త, సాహితీవేత్త కందుకూరి వీరేశలింగం పంతులుగారి జీవిత కాలంలో ఆంధ్ర దేశాన్ని ఊహించండి –

విస్తరించిన ఆంగ్లేయుల పాలన, విద్యాభ్యాసానికి ఆధునిక పాఠశాలలు, కళాశాలలు. ఆధునిక విశ్వవిద్యాలయాల ఆవిర్భావం, ఆంగ్ల భాషా బోధన, విజ్ఞాన గణిత శాస్త్రాల ప్రాధాన్యం, అచ్చు పుస్తకాలు, సంఘ సంస్కరణోద్యమాలు, మీటింగులు, ఉపన్యాసాలు, స్త్రీలకు కూడా విద్య అవసరం అన్న భావనకు అంకురార్పణ, పత్రికా ప్రచురణలు, స్త్రీలకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని గుర్తించేందుకు సంస్కర్తల ప్రయత్నాలు, పురుషులలో ఆధునిక వస్త్ర, వేషధారణల పట్ల ఆకర్షణ, హేతువాద దృక్పథం, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి, సంఘంలో పలుకుబడికై ఆరాటం, తెల్ల దొరలతో పరిచయాలు, ఆంగ్ల సమాజ, సాహిత్య ప్రభావాలు – ఇవన్నీ తలచుకొంటే ఆధునిక కాలంలోని ప్రథమ చరణానికి చెందిన చిత్రం కళ్ళకు కడుతుంది.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే త్యాగరాజు పరమపదించింది క్రీ.శ. 1846లో. వీరేశలింగం పంతులు జన్మించింది క్రీ.శ. 1848లో. ఈ రెంటికి నడుమ తేడా కేవలం రెండు సంవత్సరాలే. ఇది చాలు – 19వ శతాబ్దిలో ఎంత త్వరగా పెను మార్పులు సంభవించాయో తెలుసుకోవడానికి. అందుకే 19వ శతాబ్దిని ప్రాచీన కాలానికి ఆధునిక కాలానికి మధ్య సంధికాలంగా అంగీకరించక తప్పదు. అదే సంధితత్త్వం కొన్ని తెలుగు కావ్యాలలోనూ ప్రతిఫలించింది. ముఖ్యంగా 19వ శతాబ్ది ఉత్తరార్థ సాహిత్యంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రతిఫలనాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే, 19వ శతాబ్దిలో తెలుగు దేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను సంపూర్ణంగా అధ్యయనం చేయాలి.

పూర్వరంగం: క్రీ.శ. 1686లో మొగల్ పాదుషా ఔరంగజేబు, విశాల తెలుగు సామ్రాజ్యం – గోలకొండను ముట్టడించి, ఆఖరు నవాబు తానీషాను ఓడించి, దానిని తన సామ్రాజ్యంలో ‘దక్కను సుబా’గా కలుపుకొన్నాడు. దానిని పాదుషా ప్రతినిధిగా పరిపాలన చేసేందుకు కమరుద్దీన్ ఆసఫ్‌జా నియమింపబడ్డాడు. దక్కను సుబాకు కొన్నాళ్ళు గోలకొండ రాజధానిగా ఉన్నా, తరువాత హైదరాబాదు రాజధాని అయింది. క్రీ.శ. 1707లో ఔరంగజేబు మరణించాక మొగల్ సామ్రాజ్యం బలహీనపడింది. దాంతో ఆసఫ్‌‌జా నామకార్థానికి మొగల్ సామంతుడుగా ఉన్నా, సర్వస్వతంత్రుడుగా దక్కను సుబాను పాలించుకోసాగాడు. దక్కను సుబాలో హైదరాబాదు (నేటి తెలంగాణ ప్రాంతం; కర్నాటకలోని రాయచూర్, గుల్బర్గా, బీదర్ జిల్లాలు; మరాఠ్వాడాలోని నాందేడ్, పర్బణి, ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాలు కలిపి) తో బాటు ఆర్కాటు, కర్నూలు, రాజమహేంద్రవరం, చికాకోలు నవాబుగిరీలు ఉండేవి. క్రీ.శ. 1766లో కుంఫిణీ వారితో కుదిరిన ఒడంబడిక ప్రకారం అప్పటి దక్కను సుబాదారు నిజామలీఖాను మూర్తిజాన్నగర్ (గుంటూరు), ముస్తఫానగర్ (కొండవీడు), ఏలూరు, రాజమహేంద్రవరం, చికాకోలు పరగణాలను కుంఫిణీలకు కవులుకిచ్చాడు. సంవత్సరానికి 9 లక్షల రూపాయలు నిజామలీకి చెల్లించే ఒప్పందం మీద దాదాపు కోస్తా ప్రాంతమంతా కుంఫిణీలకు ధారాదత్తమయింది.

క్రీ.శ. 1799లో మైసూరు పాలకుడు, మహావీరుడు టిప్పు సుల్తాను మరణించడంతో, ఆ రాజ్యంలోని సుక్షేత్రమయిన మైసూరు నుండి కోయంబత్తూరు వరకు గల ప్రాంతం కుంఫిణీ పరమైంది టిప్పుకు వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో తోడ్పడినందుకు కుంఫిణీవారు నిజామలీఖానుకు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను ఇచ్చారు. కాని ఒకటి, రెండు సంవత్సరాలలోనే నిజాముకు సైనిక సహాయం అందిస్తున్న నెపంతో ఆ జిల్లాలను మళ్ళీ కుంఫిణీవారు దత్తం చేసుకొన్నారు. అందుకే ఆ జిల్లాలకు ‘దత్త మండలాలు’ అని పేరు వచ్చింది. బళ్ళారి జిల్లా ఈనాడు కర్నాటకలో చేరింది. ఆనాటి ఆర్కాటు ప్రాంతంలోని చిత్తూరు జిల్లాను, మిగిలిన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతో కలిపి ఇప్పుడు మనం ‘రాయల సీమ’గా వ్యవహరిస్తున్నాం. ఆ విధంగా 19వ శతాబ్ది ప్రారంభం (క్రీ.శ. 1800) నాటికి కోస్తా, రాయల సీమ ప్రాంతాలు మొత్తం ఆంగ్లేయుల వశమై, తెలంగాణ ప్రాంతం మాత్రం ఆసఫీ (నిజాము) పాలకుల పరిపాలనలో నిలిచింది.

19వ శతాబ్దిలో తెలంగాణ ప్రాంతం:

19వ శతాబ్ది ఆరంభం నుండి అంతం వరకు కూడా, తెలుగుదేశం రెండు ముక్కలై హైదరాబాదు (తెలంగాణ) ప్రాంతం నిజాముల పాలనలో; రాయలసీమ, కోస్తా ప్రాంతాలు ఆంగ్లేయుల అధీనంలో ఉన్నాయి. రెండు ప్రాంతాల్లోనూ తెలుగు వాళ్ళు బానిసలుగానే బ్రతికినా రెండింటికీ ఎంతో తేడా ఉంది. నిజాము ప్రాంతీయులు ఉరుదూ భాషా ప్రాబల్యంతో, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని తెలుగు వాళ్ళలా భాషా స్వాతంత్ర్యాన్ని అనుభవించలేకపోయారు. అంత మాత్రాన నిజాము ప్రాంతంలో 19వ శతాబ్దిలో తెలుగు భాషా సాహిత్యం వెలువడలేదని కాదు. నిజాము పాలనా పరిధిలోని తెలుగు సంస్థానాధీశులు ముఖ్యంగా, ఆత్మకూరు, ఆనెగొంది, గద్వాల, జటప్రోలు, దోమకొండ, పాపన్నపేట, పాల్వంచ, బోరవెల్లి, వనపర్తి, సురపురం సంస్థానాధిపతులు ఎందరో తెలుగు కవులను ఆదరించి, అపారమైన సాహిత్య పోషణం చేశారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులయితే అచ్చు యంత్రాలను కూడా ఏర్పాటు చేసి అనేక కావ్యాలను ముద్రింపించారు. అయితే నిజాము పరిపాలనంలో, బ్రిటిష్ పరిపాలనంలో వచ్చినంత, ఆధునిక విద్యాసంబంధ, శాస్త్ర సాంకేతిక సంబంధ చైతన్యం, పరిణతి లేకపోవడం వలన 19వ శతాబ్దిలో ఇక్కడి సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించే ఆస్కారం ఈ ప్రాంతం కవులలో కొరవడింది.

దీనికి ప్రధాన కారణం – నిజాము ప్రభువులు స్వీయ సుఖ భోగాలను అనుభవించడమే గాని, ప్రజా సంక్షేమాన్ని అంతగా పట్టించుకొనేవారు కాదు. క్రీ.శ. 1830 ప్రాంతంలో ఏనుగు వీరాస్వామయ్య అనే వ్యక్తి చెన్నపట్నం నుండి కాశీయాత్రకు బయలు దేరాడు. ఆయన ఈ యాత్రలో భాగంగా జూన్ 21, 1830 నుండి ఆగస్టు 9, 1830 వరకు నిజాము రాజ్యంలో ప్రయాణించాడు. ఆయన యాత్రానుభవాలను ‘కాశీ యాత్రా చరిత్ర’ పేరిట ఒక యాత్రా చరిత్రంగా వెలయించాడు. ఇది “తెలుగులో వెలువడిన సర్వ సమగ్రమయిన తొలి యాత్రా చరిత్ర” అని ఆచార్య సి. నారాయణరెడ్డిగారు వ్యాఖ్యానించారు. 19వ శతాబ్దికి చెందిన తెలంగాణ పరిస్థితులను వీరస్వామయ్య చాలా వివరంగా తెలియజేసారు.

ఆ సంగతులన్నీ చదివితే ఈ క్రింది విషయాలు అవగతమవుతాయి.

  1. నిజాము రాజ్యంలో జమిందారుల నడుమ తరచుగా విద్వేషాలు చెలరేగడం వలన ప్రజలకు శాంతి భద్రతలు కరువయ్యేవి. ఇరువురు జమీందారుల జగడంలో న్యాయం చెప్పవలసిన నిజాము ప్రతినిధి అయిన దివాన్ వారి మధ్య ద్వేషాలను పెంచి, వేడుక చూస్తూ, అటు నుండి, ఇటునుండి డబ్బులు గుంజేవాడు.
  2. జమీందారులకు కోటలు, బురుజులు గట్టిగా, ఘనంగా కట్టుకోడంపై ఉన్న ఆసక్తి ప్రజాబాహుళ్యానికి, రైతులకు ఉపయోగపడే బావులను, చెరువులను తవ్వించడంపై ఉండేది కాదు. స్వీయ సుఖభోగాలే కాని ప్రజా సంక్షేమం పట్టేది కాదు.
  3. గ్రామ ప్రాంతాల్లోని జమీందారులు దేవాలయాల పోషణే పెద్ద ఘనకార్యంగా భావించేవారు.
  4. నగరంలో దేవాలయాల కన్న మసీదులు, దర్గాలు ఎక్కువగా ఉండేవి. తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా దొర్లేవి.
  5. సాధారణ ప్రజలు, ఆయుధ పాణులైన దౌర్జన్యకారులు వలన నిత్యము భయభ్రాంతులై జీవించేవారు. రైతుల పంటలు దోపిడీకి గురయ్యేవి. రైతులు పంటలు వేసుకోడానికే భయపడేవారు. ప్రయాణికులు, వర్తకులు తమ రక్షణార్థం స్వంతంగా కొంత సిబ్బందిని ఉంచుకోవల్సిన పరిస్థితి ఉండేది.
  6. కూరగాయలు, ఫలాల ధరలు ఆకాశాన్నంటేవి. సామాన్యుల జీవనం దుర్భరంగా ఉండేది.
  7. ప్రజలు నిజాము రాజ్యం బయట, ఆంగ్లేయుల పాలనలో ఉన్న ప్రాంతాల్లోని సమాజంలో వస్తున్న పెను మార్పులతో ఏ మాత్రం సంబంధం లేకుండా బావిలో కప్పల్లాగా బ్రదుకుతుండేవారు.

ఇలాంటి పరిస్థితులలో అభిరుచి గల కొందరు జమీందారుల పరిపాలనలో మాత్రమే భాషా సాహిత్యాలు పరిఢవిల్లే అవకాశం ఉంది. ఆంగ్లేయులతో పోలిస్తే, వీరి పాలనలో ఆధునికాభివృద్ధి, ఆర్థిక పురోగతి, శాంతి భద్రతలు అధ్వానంగా ఉండడం వలన ప్రజలు సాహిత్యోన్ముఖులు అయ్యే అవకాశం తక్కువ. ఎక్కడో ఒక చోట జమీందారుల ఆదరణ ఉంటే, వారి అభిరుచి మేరకు, ఆ సాహిత్యం కూడా ప్రాచీన పద్ధతిలోనే సాగే అవకాశాలే మెండుగాని, కొత్త పుంతలు తొక్కే అవకాశాలు దాదాపుగా మృగ్యం. అయినప్పటికీ ఆత్మకూరు, గద్వాల, జటప్రోలు, దోమకొండ, పాపన్నపేట, పాల్వంచ, వనపర్తి వంటి సంస్థానాలలో జరిగిన సాహిత్య కృషి గణనీయమైనదని తెలుస్తున్నది.

అంతే కాకుండా, ఏ రాజాశ్రయం ఆశించకుండా ఆ రోజుల్లో తెలంగాణంలోని పల్లెల్లో ఆవహించి యున్న ఆధ్యాత్మిక తత్యం, భక్తి భావన కూడా చాలా మంది భక్త కవులను సృజించేందుకు దోహదం చేసాయన్నది నిర్వివాదాంశం. 19వ శతాబ్దిలో తెలంగాణ ప్రాంతంలో అనేక భక్తి శతకాలు వెలువడ్డాయనడానికి ఆధారాలున్నాయి. వరంగల్ మండలంలో రంగరాజు కేశవరావు, పరశురామ అనంతుల కవి, తూము రామదాసు, మాడభూషణం రంగాచార్యులు, ముదిగొండ శంకరారాధ్యులు, మరింగంటి లక్ష్మణ దేశికులు; కరీంనగర్ మండలంలో పాత పాపయ శాస్త్రి, కాకుత్థ్సం శేషప్పకవి, కాకుత్థ్సం నరసింహదాసు, కృష్ణగిరి వేంకట రమణయ్య, గోవర్ధనం యామునాచార్యులు, ఖండేరావు రామారావు, సిరిశెనహళ్ శీనయ్య, సీతారామయతీంద్రులు, ఆచి రాఘవాచార్య శాస్త్రులు, జైశెట్టి రాజయ్య; నిజామాబాదు మండలంలో గోవిందుల నింబగిరి శాస్త్రి, మఠం మడి వ్యాళయ్య; నల్లగొండ జిల్లాలో మరింగంటి వేంకట రాఘవాచార్యులు, తిరువాయిపేట వేంకట కవి మొదలయిన వారెందరో ఎన్నో భక్తి శతకాలను, స్తుతులను 19వ శతాబ్దిలో వెలయించినట్లు తెలుస్తున్నది. వీటిలో కాకుత్థ్సం శేషప్పకవి రచించిన ‘నరసింహ శతకము’, కాకుత్థ్సం నరసింహదాసుకవి రచించిన ‘కృష్ణ శతకము’ యావదాంధ్రంలో బహుళ ప్రసిద్ధినొందాయి.

‘కృష్ణ శతకము’ కర్తృత్వంలో కొన్ని సందేహాలున్నా, ఆ శతక కర్త, కరీంనగర్ జిల్లాకు చెందిన ధర్మపురి పుణ్యక్షేత్రంలో జీవించిన కాకుత్థ్సం నరసింహదాసని, ఆయన జీవించిన కాలం సుమారుగా క్రీ.శ. 1820 నుండి 1880 అని డా. మలయశ్రీ ఇటీవలే తమ ‘కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్ర’లో ఆధారాలతో నిరూపించారు. అలాగే శేషప్ప కవి కాలం గురించి కూడా కొంత సందిగ్ధం ఉంది. ధర్మపురి శేషాచల కవి అన్న వ్యవహార నామం గల ఈ కవి కాలాన్ని తెలుగు సాహిత్యకోశంలో క్రీ.శ. 1780 ప్రాంతంగా పేర్కొన్నారు. డా. మలయశ్రీ ఈయన 1750 ప్రాంతం వాడని అభిప్రాయ పడ్డారు. అయితే ఆయన క్రీ.శ. 1800 ప్రాంతంలో ధర్మపురి పుణ్యక్షేత్రంలో జీవించాడని, ‘ఆంధ్ర శతక సాహిత్య వికాసము’ సిద్ధాంత వ్యాసకర్త డా. కే గోపాలకృష్ణారావు పేర్కొన్నారు. ఇటీవల పావని సేవా సమితి వారు వెలువరించిన ‘నరసింహశతకము’ వ్యాఖ్యాన సహిత నవీన ముద్రణంలో వ్యాఖ్యాత విద్వాన్ డా. కసిరెడ్డి వెంకటపతిరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ అభిప్రాయాన్ని ఆ పుణ్యక్షేత్రంలోని అత్యధిక పండితులు, ముఖ్యంగా ఆయన వంశీయులు అంగీకరిస్తున్నారు. మొత్తానికి ఈ కవి క్రీ.శ. 1750 – 1820 మధ్య జీవించి ఉండవచ్చని తెలుస్తున్నది. అయితే పరిణతి చెందిన ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవితానుభవసారాన్ని రంగరించి కూర్చిన ఈ శతకాన్ని కవి తన జీవిత చరమాంకంలో అంటే 19వ శతాబ్ది ప్రథమ చరణంలో (క్రీ.శ. 1800-1810 ప్రాంతంలో) రచించి ఉంటాడని భావించవచ్చు.

ఈ శతకంలో శేషప్పకవి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని స్తుతించడంతోబాటు అనేక సామాజికాంశాలను, నీతులను వివరించడం విశేషం. ముఖ్యంగా

“ఆడు బిడ్డల సొమ్ము నపహరించుట కంటె
బండ గట్టుక నూత బడుట మేలు
బ్రదుక జాలక దొంగ పనులు చేయుట కంటె
కొంగుతో ముద్దైత్తుకొనుట మేలు”
వంటి ఆదర్శాలను;
~
“పసరంబు బందైన పసుల కాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన ప్రాణ నాథుని తప్పు
తనయుడు దుష్ప్రన తండ్రి తప్పు”
వంటి నీతులను;
~
“మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు
మాన్యముల్ చెరప సమర్థులంత
ఎండిన ఊళ్ళ గోడెరిగింప డెవ్వడు
పరిడిన యూళ్ళకు ప్రభువులంత”
వంటి లోక రీతులను;
~
“తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళి పోయెడి నాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు”
వంటి జీవిత సత్యాలను;
~
“అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబాయె
వదరుబోతుల మాట వాసికెక్కె”
వంటి సమకాలీన సామాజిక నిందలను;
~
“వ్యాసుడే కులమందు వాసిగా జన్మించె
విదురుడే కులమందు వృద్ధినొందె
శ్రీ శుకుండెచ్చట చెలగి జన్మించెను
శబరి ఏ కులమందు జన్మమొందె”
వంటి కుల వ్యవస్థ నిరసనలను పద్యాలలో పొందు పరిచాడు.

ఇలా ఒకరిద్దరు కవులు సమకాలీన సామాజిక చిత్రణం, వ్యంగ్య విమర్శనం, కుల వ్యవస్థ నిరసనం చేసినా, అది పెద్దగా నవ్యతగా భావించలేం. మొత్తానికి 19వ శతాబ్దిలో తెలంగాణంలో వెలువడిన సాహిత్యంలో నవ్యత స్వల్పమే అని చెప్పవచ్చు.

ఇక కోస్తా – రాయలసీమ ప్రాంతంలోని 19వ శతాబ్ది నాటి సామాజిక రాజకీయ పరిస్థితులను పరిశీలిద్దాం.

19వ శతాబ్దిలో కోస్తా – రాయలసీమ ప్రాంతం:

భారతదేశంలో 19వ శతాబ్దిలో సాంఘిక సాంస్కృతిక సంస్కరణలు ప్రారంభమైనాయి. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం రాజా రామమోహనరాయితో ముడిపడి ఉంది. ఆ రోజుల్లో వంగదేశంలో ఏ ఉద్యమం బయలుదేరినా అది బ్రిటిష్ వారి పాలనంలోనే ఉన్న కోస్తా – రాయలసీమ ప్రాంతంలో ప్రవేశించేది. అందుకు కారణభూతమయిన పరిస్థితులు ఆ ప్రాంతంలో 19వ శతాబ్దిలోనే నెలకొన్నాయి. అందులో ముఖ్యమయినవి ఇవి.

I. ఆంగ్ల విద్యావిధానం:

19వ శతాబ్ది ఆరంభం నాటికి ఆంధ్ర దేశంలోని పిల్లలు, గురుకులాలలో వీధి బడులలో ఓనమాలు, శతకాలు, సంస్కృతం, పంచకావ్యాలు చదువుకొనేవారు. ఇంకా ఉత్సాహం ఉన్న బ్రాహ్మణులు, వేదాలు, తర్క మీమాంసాది శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. ఆ సమయంలో విలియం బెంటింక్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి, కలకత్తా, బొంబాయి, మద్రాసు నగరాలలో విశ్వవిద్యాలయాలను స్థాపించాడు. ఆ ఫలితంగా 19వ శతాబ్ది ప్రారంభం నాటికే బ్రిటిష్ పాలనలోకి చేరిన కోస్తా – రాయలసీమ ప్రాంత ఆంధ్రులు పాశ్చాత్య విద్యను అభ్యసించి ఆధునికతను సంతరించుకోడం ప్రారంభించారు. దాని వల్ల ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ, హేతువాదం, మానవతావాదం, సాంఘిక సమానత్వం, రాజకీయ స్వాతంత్ర్యాల గురించి మంచి అవగాహన ఏర్పడింది.

II. క్రైస్తవ మిషనరీల కృషి:

క్రైస్తవ మత ప్రచార ధ్యేయంతో 19వ శతాబ్దిలో అనేక మిషనరీలు ఆంధ్ర దేశంలో ఆంగ్ల భాషా విద్యాలయాలను, సేవా సంస్థలను నెలకొల్పారు. ఆధునిక వైద్య సేవలను అందించారు. ముద్రణా యంత్రాలను ప్రవేశపెట్టారు. వారి ఉద్దేశ్యమేదైనా, అది కూడా పాశ్చాత్య విద్యా వ్యాప్తితో, వారి సాహిత్యంతో మన వారికి పరిచయమేర్పడడానికి, వారి సామాజిక రీతులపట్ల మన వారికి అవగాహన ఏర్పడడానికి దోహదపడింది. క్రీ.శ. 1805లో లండన్ మిషనరీ సొసైటీ వారు జమ్మలమడుగును కేంద్రంగా చేసుకొని క్రైస్తవ మత ప్రచారం చేశారు. 1835లో స్థాపితమైన అమెరికా బ్యాప్టిస్ట్ సంఘం రాయలసీమ జిల్లాలలో చురుకుగా పనిచేసింది. 1841లో స్థాపితమైన ‘చర్చిమిషన్ సొసైటీ’ కృష్ణా, గోదావరి జిల్లాలలో విశేషంగా కృషి చేసింది. ఆ తరువాత వచ్చిన ‘గోస్పెల్ మిషన్’ కడప, కర్నూలు జిల్లాలలో అనేక కేంద్రాలను నెలకొల్పి సేవ చేసింది. క్రైస్తవ విద్యా సంస్థలలో చదువుకొన్న రఘుపతి వేంకటరత్నం నాయుడు, కొండా వెంకటప్పయ్య, ముట్నూరు కృష్ణారావు ప్రభృతులు కోస్తాంధ్ర ప్రాంతంలో ఆధునిక సమాజ నిర్మాణానికి దోహదపడ్డ మహనీయులుగా ఎదిగారు.

III. వివిధ సామాజికోద్యమ సంస్థల కృషి:

రాజారామమోహనరాయి స్థాపించిన బ్రహ్మ సమాజం క్రమక్రమంగా ఆంధ్ర దేశానికి విస్తరిల్లి 1878లో రాజమండ్రిలో, 1882లో బందరులో, 1888లో కాకినాడలో, 1898లో గుంటూరులో శాఖలను ఏర్పర్చుకొన్నది. బ్రహ్మ సమాజం కుల, మత, వర్గ భేదాలు లేకుండా మానవులంతా సమానులే అని చాటింది. భగవంతుడొక్కడే అని, విగ్రహారాధన కూడదని ప్రచారం గావించింది. సతీ సహగమనం, వేశ్యావృత్తి, త్రాగుడు, అంటరానితనం వంటి దురాచారాలను నిరసించింది. ఆ తరువాత దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజం కూడా ఆంధ్ర దేశంలో ప్రవేశించి హిందూ మత సంస్కరణోద్యమాన్ని కొనసాగించింది.

IV. పత్రికల పాత్ర:

19వ శతాబ్ది ప్రారంభంలోనే ఆంధ్ర దేశంలో పత్రికలు ప్రారంభమైనాయి. బళ్ళారి క్రైస్తవ మిషనరీ ప్రారంభించిన ‘సత్య దూత’ తెలుగు భాషలో మొట్ట మొదటి పత్రిక. తరువాత గాజుల లక్ష్మీ నరసు శెట్టి ‘క్రిసెంట్’ అనే పత్రికను మద్రాసు నుండి ప్రారంభించాడు. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ వెలువడిన ‘సత్య సంవర్ధని’, బుచ్చయ్య పంతులుగారు నడిపిన ‘హిందూ రిఫార్మర్’, రాయసం వెంకట శివుడు స్థాపించిన ‘జనానా’, మద్రాసు నుండి వెలువడిన ‘థీయిష్టులు’ పత్రికలు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసాయి. ఇంకా ‘అమృత బోధిని’, ‘ఆంధ్ర ప్రవేశిక’, ‘సుజానా’, ‘మనోవిలాసిని’ మొదలగు పత్రికలు సాంఘిక, రాజకీయ సిద్ధాంతాలను ప్రచారం చేసి, ఆంధ్ర దేశంలో సామాజిక చైతన్యానికి దోహదమయ్యాయి. కందుకూరి వీరేశలింగం పంతులుగారు నిర్వహించిన ‘వివేక వర్ధని’, ‘సతీ హిత బోధిని’, ‘సత్య సంవర్ధని’ సంస్కరణోద్యమానికి గణనీయమైన సేవలందించాయి. క్రీ.శ. 1839లో మొట్ట మొదటి తెలుగు వార్తా పత్రిక ‘వృత్తాంతిని’ వెలువడి ఆంధ్రులలో సామాజిక స్పృహను పెంపొందించింది.

V. సంఘ సంస్కర్తల పాత్ర:

19వ శతాబ్దిలో ఆంధ్ర ప్రాంతంలో ఈ క్రింద పేర్కొన్న సంఘ సంస్కర్తలు సాంఘిక పునరుజ్జీవనానికి విశేషంగా కృషి చేశారు.

  1. ఏనుగుల వీరాస్వామి: మద్రాసు సుప్రీంకోర్టులో దుబాసీగా పని చేసిన ఈయన అస్పృశ్యతను ఖండించి, దేవాలయాలలో పూజా విధానాలను విమర్శించాడు. స్త్రీ విద్యా వ్యాప్తికి కూడా ఈయన ఎంతో కృషి చేశాడు.
  2. అనంత రామశాస్త్రి: నెల్లూరు ప్రాంతానికి చెందిన ఈయన హరిజనోద్ధరణకై విశేషంగా కృషి చేసి, వారికి దేవాలయ ప్రవేశాన్ని కలిగించాలని చాటాడు.
  3. గాజుల శెట్టి లక్ష్మీ నరసు: ఈయన సమాజంలో పాతుకు పోయిన వెట్టి చాకిరీని రద్దు చేయాలని కోరాడు. రైతుల కష్ట నష్టాలను ప్రభుత్వానికి తెలియపరచి, విక్టోరియా మహారాణి నుండి హామీలు పొంది, వాటిని అమలు పరిచేందుకు ప్రభుత్వంతో పోరాడాడు.
  4. సామినేని ముద్దు నరసింహం: ఇతడు ‘హితసూచిని’ అనే గ్రంథాన్ని రచించి, దాని ద్వారా, మూఢ విశ్వాసాలను, వేశ్యా వృత్తిని, అస్పృశ్యతను, బానిసత్వాన్ని నిరసించాడు.
  5. ముత్తా నరసింహయ్య నాయుడు: రాజమండ్రిలో మున్సిఫ్ ఉద్యోగిగా ఉన్న ఈయన స్త్రీలకు సమానత్వం, శాస్త్రీయ విద్యావిధానం అమలు జరగాలని, స్త్రీలకు యుక్త వయసు వచ్చాకే వివాహం చేయాలని ప్రచారం చేశాడు.
  6. పరవస్తు వేంకట రంగాచార్యులు: ‘మహామహోపాధ్యాయ’ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ప్రభావంతో ఈయన స్త్రీలకు పునర్వివాహం శాస్త్ర సమ్మతమేనని కరపత్రాలు ముద్రించి ప్రచారం చేశాడు.
  7. ఆత్మూరి లక్ష్మీ నరసింహం: ఈయన వీరేశలింగం గారికి గురుతుల్యులు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ప్రభావంతో ఈయన స్త్రీ పునర్వివాహ సమాజ సభ్యుడై, అందుకు పాటు పడ్డాడు.
  8. కందుకూరి వీరేశలింగం: 1848 ఏప్రిల్ 16న సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ మహనీయుడు సనాతన సంప్రదాయ విద్యతోబాటు ఆంగ్ల భాషను కూడా అభ్యసించి, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడై విద్యార్థులలో విజ్ఞాన బీజాలను నాటాడు. మూఢ విశ్వాసాలను, శకునాలను, దురాచారాలను ఖండించి, పెద్దలు అరిష్టమన్న అరటి చెట్టు పళ్ళను తినడం, అమావాస్య రోజు కొత్త ఉద్యోగంలో చేరడం, భూత వైద్యులను బెదరగొట్టడం, విగ్రహారాధనను తృణీకరించడం, కుల వ్యవస్థను నిరసించడం వంటి పనులను చేసేవాడు. ‘వివేక వర్ధని’, ‘హాస్య సంజీవని’, ‘సతీహిత బోధిని’, ‘సత్య సంవర్ధని’, ‘తెలుగు జనానా’, ‘సత్యవాదిని వంటి పత్రికలు నడిపి, వాటి ద్వారా అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపాలని ప్రజలను జాగృతం చేశాడు. వేశ్యాలోలత, కులవ్యవస్థ, విగ్రహారాధన వంటి దురాచారాలను నిరసించడమే కాకుండా వితంతువుల పునర్వివాహం, స్త్రీ విద్యాభివృద్ధి వంటి ఆదర్శాలను ప్రచారం చేసేవాడు. ఈయన ఆధునికాంధ్ర సాహిత్యంలో గద్య రచనలలో అనేక నూతన ప్రక్రియలకు ఆద్యుడై మార్గదర్శనం చేశాడు.
  9. రఘుపతి వెంకటరత్నం నాయుడు: బందరులో జన్మించిన ఈయన అస్పృశ్యత, బాల్య వివాహాలు, భోగం మేళాలు నిషేధించేందుకు జీవిత పర్యంతం కృషి చేశాడు. ఇందుకోసం 1891లో ‘సాంఘిక శుద్ధి’ అనే సంఘాన్ని కూడా స్థాపించాడు.
  10. దేశిరాజు పెదబాపయ్య: 26 ఏళ్ళకే ఆకాలమరణం చెందిన ఈయన జంధ్యాన్ని త్యజించి, తన బంధువులంతా వెలివేసినా, అత్తమామలు తన భార్యను కాపురానికి పంపక పోయినా తను నమ్మిన సిద్ధాంతాలు, ఆదర్శాలకు బ్రదికినన్నాళ్ళు అంకితమయ్యాడు.
  11. గురజాడ అప్పారావు: మూఢ విశ్వాసాలను నిరసించి, సామాజిక సేవ కోసం, వ్యక్తివాద, హేతువాద, సామాజిక వాదాలను రంగరించిన రచనలతో ప్రజలలో చైతన్యం రేపడానికి పాటుపడ్డాడు. 1896లో ‘కన్యాశుల్కం’ అన్న దురాచారాన్ని రూపు మాపేందుకు అదే పేరుతో రచించిన హాస్య, వ్యంగ్య నాటకం జగత్ప్రసిద్ధం.
VI. వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి:

వీటన్నిటికి తోడు ప్రపంచ స్థాయిలో 19వ శతాబ్దిలో జరిగిన ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి మానవుల జీవన విధానాన్ని, భావాలను పూర్తిగా మార్చి వేసింది. బ్రిటిష్ పాలనలోని ఆంధ్రులకు ఆయా ప్రగతి ఫలాలు సత్వరంగా అందుబాటులోకి రావడం వల్ల నిజాము రాష్ట్ర ఆంధ్రుల కన్న వారెంతో ముందు దశలో నిలిచారు. ఆధునిక విద్య వలన ఆ ప్రగతి వివరాల పట్ల కూడా వారికి తొందరగా పరిపూర్ణమైన అవగాహన ఏర్పడడానికి మార్గం కుదిరింది. 19వ శతాబ్దిలో కనిపెట్టబడిన ఈ ఆధునిక పరికరాల ప్రభావం కోస్తా, రాయలసీమ ప్రాంత ఆంధ్రులపై కూడా ప్రసరించింది.

ముఖ్యంగా 1852లో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట కోస్తా ప్రాంత ఆంధ్రుల స్థితిగతులను పూర్తిగా మార్చివేసి, 19వ శతాబ్ది ఉత్తరార్థంలో వారు ఆర్థికంగా పుంజుకొని అభ్యుదయ మార్గంలో పయనించేందుకు దోహదపడింది. ఆ విధంగా 19వ శతాబ్దిలో నిజాము ప్రాంతానికి పూర్తిగా వైరుధ్యమైన సామాజిక పరిస్థితులతో కోస్తా – రాయల సీమ ప్రాంతం ఆధునికతను సంతరించుకోవడం వల్ల, ఆ శతాబ్దిలోని తెలుగు సాహిత్యంలోని, నవ్య పరిమళాలలో నూటికి తొంభైశాతం అక్కడే గుభాళించాయి.

మొత్తానికి 19వ శతాబ్దిలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆంగ్లేయుల పాలన బాగా సుస్థిరమై, వారి భాషా, సాంస్కృతిక, సాహిత్య, మత, రాజకీయాల ప్రభావంతో మన తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కిందని భావించవచ్చు. అయితే 19వ శతాబ్దిలో వచ్చిన సాంఘిక, రాజకీయ, పరిణామాలకు స్పందించి రచనలు చేసే వారి కన్న, సంప్రదాయ పరంపరగా వస్తున్న పద్ధతిలో రచనలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. వారు వ్రాసిన ‘రామాయణాల’నే మళ్ళీ వ్రాస్తారు. చేసిన ‘పరిణాయాల’నే మళ్ళీ చేస్తారు. పైగా సంప్రదాయ విరుద్ధంగా వచ్చే రచనలను సత్వరమే అందరూ ఆహ్వానించలేరు. కొందరు సహృదయులు తప్ప, వ్యతిరేకించే వారే ఎక్కువగా ఉంటారు. కానీ, సంఖ్యలో తక్కువగానే ఉన్నా, ఆ నవ్య స్పర్శ గల కావ్యాలనే మనం అధ్యయనం చేయాలి. అవి ఆపై శతాబ్దిలో (20వ శతాబ్దిలో) వచ్చిన కావ్యాలకు ఎలా మార్గదర్శనం చేసాయో గమనించాలి. ఆ కావ్యాలలోని నవ్యత్వాన్ని ఆ శతాబ్ది సాహిత్య పరిణామంగా గుర్తించాలి. అప్పుడు 19వ శతాబ్దిని క్షీణ యుగం అనలేము. ఉషోదయ యుగంగా అంగీకరిస్తాం.

(ఇంకా ఉంది)

Exit mobile version