[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
~
V. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో సంప్రదాయ వ్యతిరేకత, అభ్యుదయాత్మక నవ్యత
“శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయస్త్రి పురుషాస్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజ భవ శ్రీ కన్దరాశ్రేయసే”
ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారత రచన ప్రారంభిస్తూ చెప్పిన మొట్ట మొదటి శ్లోకం ఇది. రచన ఆంధ్రంలోనైనా, మొదటగా దేవ భాషలో శ్లోకం చెప్పడం, అదీ ‘మ’ గణంతో ప్రారంభించడం మంగళకరమని భావించి, నన్నయ భట్టారకుడు ఈ శార్దూల విక్రీడిత శ్లోకంతో రచనను ప్రారంభించాడని పండితులు భావిస్తుంటారు. కావ్యారంభాన్ని శ్రీకారంతో చేయడం కూడా మంగళ కరమని నన్నయ నమ్మిఉంటాడని పండితులు వివరిస్తుంటారు.
ఇటువంటి విశ్వాసాలు ప్రాచీన కాలం నుండి భారతీయులలో అధికంగా ఉండేవి. శతాబ్దుల తరబడి ఈ విశ్వాసాలు ఇలాగే చెక్కు చెదరకుండా ఒక సంప్రదాయంగా కొనసాగాయి. అయితే ఆంగ్లేయుల పరిపాలనలో క్రీ.శ. 1857లో ఆధునిక విశ్వవిద్యాలయాలు నెలకొన్నాక, ప్రజలలో అవగాహన పెరిగి, ఈ విశ్వాసాలు మెల్ల మెల్లగా సన్నగిల్లాయి. క్రీ.శ. 1917లో రష్యాలో కమ్యూనిస్టు పాలన ప్రారంభమయ్యాక, ప్రపంచ ప్రజల దృష్టి మార్క్సిజం వైపు మళ్ళింది. హేతువాద దృష్టి, మార్క్సిస్టు దృక్కోణం భారతీయులలో ప్రసరించాక ఈ విశ్వాసాలపై తిరుగుబాటు ధోరణి అక్కడక్కడా కనబడింది. ఆ ఫలితంగానే తెలుగులో శ్రీశ్రీ వంటి అభ్యుదయ కవులు ఉదయించారు. అంతదాకా తెలుగు కవులంతా తమ తమ కావ్యాలను అదే సంప్రదాయంగా శ్రీకారంతో ప్రారంభించడం విధిగా పాటిస్తూ వచ్చారన్నది పండితాభిప్రాయం.
అంతేకాదు – నన్నయ చూపిన మార్గంలో ప్రతి తెలుగు కవి తమ కావ్యంలో కృత్యాద్యవస్థలను పాటిస్తూ వచ్చాడు. అంటే ప్రతి కావ్యంలో కూడా ‘అవతారిక’, ‘కృతి పతి ప్రశంస’, ‘షష్ఠ్యంతాలు ‘ వంటి కావ్య భాగాలను కలిగి, ఆ పైనే అసలు ‘కథా ప్రారంభము’ జరుగుతుంది. అలాగే ప్రతి ఆశ్వాసాంతంలో ‘ఆశ్వాసాంత గద్య’ను పొందుపరచడం జరుగుతుంది. శతాబ్దుల పాటుగా ఈ సంప్రదాయాన్ని ప్రతి కవి విధిగా పాటించాడంటే, కృత్యాద్యవస్థలకు కావ్య జగతిలో గల ప్రాముఖ్యాన్ని గుర్తించవచ్చు.
“శ్రీయన గౌరినా బరగు చెల్వకు జిత్తము బల్లవింప..” అన్న పద్యంతో తిక్కన తన మహాభారత రచనలో అవతారికను ప్రారంభించి, కృత్యాద్యవస్థలతో బాటు ఆశ్వాసాంత గద్యలను రచించడం; ‘శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్..” అనే పద్యంతో పోతన తన భాగవత రచనలో అదే సంప్రదాయాన్ని పాటించడం మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా చెప్పుకొంటూపోతే ఉదాహరణలు కోకొల్లలు. దీనితో రాను రాను కావ్య రచన ప్రారంభానికి ‘శ్రీకారం చుట్టడం’ అన్న నుడికారం రూపుదిద్దుకొంది. ఇది ఎంత వరకు వెళ్ళిందంటే జన వ్యవహారంలో ఏ కార్యం ప్రారంభించినా ‘శ్రీకారం చుట్టడ’ మన్నది సర్వ సాధారణమయింది.
ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొందరు సంప్రదాయవాదులైన పద్యకవులు పాటిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీచే పురస్కృతమయిన ‘శ్రీకృష్ణ చంద్రోదయం’ అనే శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్యుల వారి పద్య కావ్యంలో శ్రీకారారంభంతోపాటు, అవతారిక కూడా రచింపబడింది. కాని ఆధునిక కాలంలో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించినవారే ఎక్కువ. వచన, గేయ కవులంతా తమకు మార్గదర్శకుడైన యుగకర్త శ్రీశ్రీని అనుసరిస్తూ, ఈ సంప్రదాయానికి వ్యతిరేకులుగా నిలచారు. అంతకు ముందే జాషువా, ఆపైన డా. దాశరథి కృష్ణమాచార్యులు, ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ శాస్త్రి తదితర పద్యకవులు సైతం తాము ఈ సంప్రదాయాన్ని పాటించక ఆధునికులమని చాటుకొన్నారు. అయితే వీరందరికన్నా ఎంతో ముందు, భారతీయులకు మార్క్సిజం గురించి పరిచయం కాకముందే, హేతువాద దృష్టి. అభ్యుదయ భావాలు బలపడకముందే ఒక కవి తెలుగులో ఈ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆధునికంగా ఆలోచించాడు.
19వ శతాబ్దిలోనే, అంత వరకు అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఈ సంప్రదాయ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి నవ్యతను చూపిన ఆ మహానుభావుడు శ్రీశిష్టు కృష్ణమూర్తిశాస్త్రి. ఇతని ‘సర్వకామదా పరిణయము’ అన్న ప్రబంధంలో అవతారిక లేదు. ద్వితీయాశ్వాస ప్రారంభంలో ఒక పద్యం తప్ప, మిగితా ఆశ్వాసాలన్నింటికీ ఆశ్వాసాది మరియు ఆశ్వాసాంత పద్య, గద్యలు లేవు. షష్ఠ్యంతాలు లేవు. ఇది ఆ రోజులలో సంచలనం అనదగ్గ సంప్రదాయ వ్యతిరేక నవ్యతగా గుర్తించవచ్చు. ఈ కవి 1835-40 సంవత్సరాల మధ్య ‘రామచంద్రపురం’ జమీందారుల ఆస్థాన కవిగా ఉన్నాడు. ఈ ‘రామచంద్రపురం’ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రామచంద్రపురం జమీందారు కాకర్లపూడి రామచంద్రరాజు సోదరుడైన పద్మనాభరాజుకు ఈ కృతి అంకితం చేయబడింది. అంటే సుమారు 1835-40 సంవత్సరాల మధ్య ఈ ప్రబంధ నిర్మాణం జరిగి ఉంటుంది. శిష్టు కృష్ణమూర్తి కవి సంప్రదాయానికి వ్యతిరేకంగా చూపిన నవత్య భారత దేశంలో ఆధునిక విశ్వవిద్యాలయాలు ఏర్పడక ముందే – అంటే ఆంగ్ల సాహిత్య ప్రభావం భారత దేశంలో పడకముందే 19వ శతాబ్ది పూర్వార్థంలోనే తటస్థించడం నిజంగా చెప్పుకోదగ్గ విశేషం.
ఈ కవి ఈ నవ్యతను సంతరించడనాకి కొన్ని విశేష కారణాలున్నాయి. తొలుత ఈ గ్రంథాన్ని జమీందారు సోదరులలో ఒకడైన కాకర్లపూడి వేంకట కృష్ణంరాజుకు అంకితమివ్వాలని కవి రచించాడట. అయితే ఈ కవికి, పిండిప్రోలు లక్ష్మణకవి అనే మరోకవికి విరోధం ఉండేది. ఈ పిండిప్రోలు లక్ష్మణకవి 19వ శతాబ్దికి చెందిన విశిష్ట కవులలో ఒకడు. ఇతడు అనేకమైన చాటువులు, ‘రావణ దమ్మియము’ అనే నవ్యత సంతరించుకొన్న ఒక అధిక్షేపాత్మక ద్వ్యర్థి కావ్యం రచించాడు.
లక్ష్మణ కవి కపట ప్రయత్నం వలన శిష్టు కృష్ణమూర్తి కావ్య సమర్పణను కాకర్ల పూడి వేంకట కృష్ణంరాజు తిరస్కరించాడు. దానిని కృష్ణమూర్తి కవి చాలా అవమానంగా భావించాడు. తరువాత జమీందారు మరో సోదరుడు పద్మనాభరాజుకు ఈ కావ్యాన్ని అంకితం చేసాడు. బహుశః వేంకట కృష్ణంరాజును కృతిపతిగా సంభావిస్తూ వ్రాసిన అవతారిక, ఆశ్వాసాద్యంత పద్యాలను, షష్ఠ్యంతాలను కవి అప్పుడు తొలగించి (ద్వితీయాశ్వాసాదిలో గల పద్యాలలో ఒకటి కృష్ణం రాజు ప్రసక్తి లేక పోవడం వల్ల ఆ ఒక్క పద్యం అలాగే ఉంచి ఉంటాడు), కావ్య ప్రధాన భాగాన్ని మాత్రమే పద్మనాభరాజుకు అంకితం చేసి ఉంటాడు. శిష్టు కృష్ణమూర్తి కవి పద్మనాభరాజును ప్రస్తుతిస్తూ కావ్యావతారికను, ఆశ్వాసాది పద్యాలను పునఃప్రయత్నంగా వ్రాయాలనుకొంటే వ్రాసి ఉండవచ్చు. కాని ఆయన ఆ పని చేయలేదు. దానికి కారణాన్ని సులభంగానే ఊహించగలం. సంప్రదాయ బద్ధంగా సాగుతున్న జీవనంలో ఒక అవమానం, హృదయానికి బాధ కలిగినప్పుడు – సంప్రదాయ వ్యతిరేకత, హేతువాద దృష్టి మొలకెత్తుతాయి. శిష్టు కృష్ణమూర్తి కవిలో అదే జరిగింది. “సంప్రదాయ బద్ధంగా దైవ ప్రార్థన, కృతి కర్త ప్రశంసలతో కూడిన అవతారిక, ఆశ్వాసాది పద్యాలను రచిస్తే ఏం శుభం జరిగిందని? కావ్య స్వీకారానికి తిరస్కారం, అవమానం జరిగాయి.” అని కవి భావించి ఉండవచ్చు. అందుకే కావ్యావతారిక, ఆశ్వాసాద్యంత పద్య గద్యలు లేకుండానే కావ్యాన్ని పద్మనాభరాజుకు అంకితం చేసాడు. ఇందులో పద్మనాభరాజు సహృదయత కూడా ఎన్నదగింది. తన ప్రశంస లేకపోయినా, సంప్రదాయం పాటించకపోయినా, ఆయన కృతి స్వీకృతికి నిరభ్యంతరంగా అంగీకరించడం – ఆయన ఔన్నత్యాన్ని చాటుతుంది. అయితే కృష్ణమూర్తి కవి ఈ నవ్యతకు తెర తీయడానికి కేవలం ఇవే కారణాలని భావిస్తే పొరపాటవుతుంది.
శిష్టు కృష్ణమూర్తికి సర్ వాల్టర్ ఇలియట్ అనే తెల్ల దొరతో మంచి పరిచయం ఉండేది. ఆయనకు ద్రాక్షారామ శాసనాక్షర పరిశోధనలో కృష్ణమూర్తి కవి సాయపడ్డాడు. ఆ సంపర్కంలో ఆంగ్ల సాహిత్యంలో కృత్యాద్యవస్థలు లేని విషయం ఈ కవి తెలుసుకొని ఉంటాడు. అదే పద్దతిని తొలిసారి ఆంధ్ర సాహిత్యంలో ప్రయోగించడానికి కవి ధైర్యం చేసి ఉంటాడు.
అంతే కాకుండా ఈ కవికి మండ కామేశ్వర కవి అనే మరొక నవ్యతకు పట్టం కట్టిన కవితో మైత్రి ఉండేది. మండ కామేశ్వర కవి ఆంధ్ర సాహిత్యంలో తొట్ట తొలిసారి 19వ శతాబ్దిలోనే సంప్రదాయ ఛందస్సులను కాదని, మాత్రా ఛందస్సులను ప్రవేశపెట్టి ‘ఆంధ్ర తులసీ రామాయణం’ కావ్య నిర్మాణం చేసిన ఘనుడు. ఈయన గురించి సోదాహరణంగా ‘19వ శతాబ్ది తెలుగు కవిత్వం – ఛందస్సు పరమైన నవ్యత’ అన్న అధ్యాయంలో చర్చిద్దాం. ఈ కవి రచించిన ‘తులసీ రామాయణము’ ఆంధ్రానువాదంలో కొన్ని అధ్యాయాలను శిష్టు కృష్ణమూర్తి కవి రచించి తోడ్పడ్డాడు. ఇటువంటి అధునాతన భావాలు గల స్నేహితుల సాంగత్యం కూడా శిష్టు కృష్ణమూర్తి కవి నవ్య మార్గంలో ప్రయాణించేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.
ఏమైనా కృత్యాద్యవస్థలు లేకుండా శిష్టు కృష్ణమూర్తి వెలార్చిన ‘సర్వకామదా పరిణయం’ ఆంధ్ర సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పాలి. ఇది సాధారణ ‘పరిణయ ప్రబంధం’ కాకుండా, ఇతర పరిణయ ప్రబంధాల కంటే కాస్త భిన్నంగా నడచి, ఆ విధంగా కూడా కొంత నవ్యతను చాటుకొంది. ఈ కావ్యాన్ని గురించి వివరిస్తూ ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి –
“ఇది పరిణయ ప్రబంధమైనను ఇతర పరిణయ ప్రబంధములు కంటే ఇంచుక భిన్నము. విజయనగరములోని రామలింగ క్షేత్రమునకు సంబంధించిన ఇతివృత్తము. రామలింగ శంకరుని కోరికను పార్వతి మరల హిమవంతునికి జన్మించును. ఆమె పేరు సర్వకామద. ఆమె యౌవనవతి కాగానే దేవతలు ఆమె సౌందర్యమును వర్ణించి, రామలింగ శంకరునితో “నీ కాంత యగుట కనుగుణ” మనిన, రామలింగ శంకరుడు సప్తర్షులను రాయబారము పంపును. సర్వకామదా రామలింగ శంకరుల వివాహము జరుగును. వివాహముతో కావ్యము సమాప్తమగును. వివాహానంతర విశేషము లేకపోవుట విశేషము” అని ప్రశంసించారు.
హరికథా పితామహులుగా ప్రసిద్ధులైన ఆదిభట్ల నారాయణదాసు క్రీ.శ. 1888లో ‘బాటసారి’ అన్న కావ్యంలో మరింత ముందుకు వెళ్ళి మరింత నవ్యతను ఆంధ్ర సాహిత్య ప్రస్థానంలో నిలిపారు. కవిగారి వయసు ఈ కావ్య నిర్మాణ సమయంలో కేవలం ఇరవై నాలుగేళ్ళే. దాసు గారు ఈ కావ్యంలో ఎటువంటి కృత్యాద్యవస్థలు పాటించలేదు – సరికదా! పైగా, కావ్యాన్ని ‘శ్రీ’ అన్న అక్షరంతో ప్రారంభించకుండా, ‘ఒ’ అన్న అక్షరంతో ప్రారంభించి, సంప్రదాయానికి విరుద్ధంగా ముందడుగు వేసారు. ఈ కావ్యంలోని ప్రారంభ పద్యం ఇలా ఉంది.
“ఒక్క మహానుభావుడు మహోదధి యానము చేసి, ముప్పున
న్దక్కి తొలంగిపోవు నిజదార, సుతార్థమునై సరోనదీ
పక్కణ సీమల న్వెదకి, వారలు సుస్థితి నుంటగాంచి, పెం
పెక్కెను బాటసారియయి – యిక్కడ పేర యశోవిహారియై”
‘బాటసారి’ కావ్యం కథా వస్తు పరంగా కూడా నవ్యతను సంతరించుకొంది. ఆ వివరాలను ‘వస్తు నవ్యత’ను వివరించే అధ్యాయంలో తెలియజేస్తాను.
19వ శతాబ్దిలోనే మరొక కవి కూడా శ్రీకారం చుట్టకుండా నవ్యతను తన కావ్యంలో నిలిపారు. ఆ కవి పేరు – శొంఠి భద్రాద్రి రామశాస్త్రి. ఈయన కూడా తన కావ్యంలో కృత్యాద్యవస్థలు పాటించక పోవడమే కాకుండా, కావ్య రచనను ‘శ్రీకారం’తో కాకుండా
“కలదొక రాచ కూతురతి కాంత విలోల దృగంత పాతమున్
వలనతి ధీర వృత్తులను వైచుచు బాముల బెట్టునట్టి దు
ర్లలిత పదారు వత్సరము లంగడి దాటని జవ్వనంపు
పుల దుల లేని దవ్వలపు ముద్దియ కిట్లని రామె నెచ్చెలుల్!”
అని ప్రారంభించారు. అంతకుముందు ‘కాళిందీ పరిణయము’, ‘శంతనూపాఖ్యానము’ వంటి కావ్యాలను సంప్రదాయ పద్ధతితో వెలయించిన ఈ కవి ‘చిత్ర సీమ’ అన్న కావ్యంలో ఈ నూతనత్వాన్ని ప్రదర్శించారు. అయితే ఈ కావ్యాన్ని రచించిన సంవత్సరం కచ్చితంగా తెలియకపోవడం వలన నారాయణదాసు, భద్రాద్రిరామశాస్త్రి కవులలో ఎవరు ముందు ఈ నవ్యతను సాధించారో నిర్ధారించలేని పరిస్థితి ఏర్పడింది. రామశాస్త్రి 19వ శతాబ్ది చివరిభాగంలో ఈ కావ్యాన్ని రచించారని యండమూరి సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భావ కవితా రీతిలో ఈ విద్వత్కవి రచించిన ఈ కావ్య వైశిష్ట్యాన్ని వివరిస్తూ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఇలా అన్నారు –
“ఈ కవి వరుడు ప్రాచీన కవితా ధోరణి కలవాడే గాక నవీన పథమున గబ్బములల్లు మేధావి కూడను. వీరి ‘చిత్రసీమ’ కావ్యము పరికించిన నిది స్పష్టపడును. చిత్రసీమ కళా పూర్ణోదయమును బోలు కల్పిత కావ్యము. ఇందు గృత్యాద్యవస్థ లేదు. ఇది క్రొత్త పద్దతి. ‘కలదొక రాచకూతురు–’ అని కావ్యము నుపక్రమించినారు. ఇందలి యాశ్వాసములకు దళములని పేరు. అవియు ద్వితీయ దళము మొదలుకొని యారంభింపబడినవి. తత్కారణము గ్రంథములో విశదమగును. ‘మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’యను చొప్పున నాది మధ్యాంతములందు గృతి నాయకుని స్తుతించు పద్యములు రచించెను. ఆ పద్యములు కేవల షష్ఠ్యంతములు గాక ద్వితీయాద్యంతములుగా వ్రాయుట మరియు నూతనత. ఆ పద్యములలో భూత భావి కథలు సూచితములు. ఈ కావ్యములో గార్యము ముందును, గారణము వెనుకను కన్పించుటచే జదువుట కింపు పుట్టించుచుండును. ఇందు నాయకుడు ‘చిత్రసీమ’. ఈ పేరులో నొక విచిత్రము. ‘సీమ’ నకారాంతము, ఆకారాంతము కూడ నుండుటచే స్త్రీత్వ, పుంస్త్య వ్యవహారములకీ పేరే యుపయోగించెను. ఇది యవశ్య పఠనీయ కావ్యము.”
మధునాపంతులవారి అభిప్రాయంతో 99% ఏకీభవించినా, ఒక విషయంలో విభేదించక తప్పదు. శొంఠి రామశాస్త్రి కవి షష్ఠ్యంత్యముల బదులు – ఆదిలో, మధ్యలో, తుదిలో రెండేసి పద్యాల చొప్పున రచించడం సంప్రదాయానికి భిన్నంగా, నవ్యంగా ఉండాలనే గాని, మధునాపంతుల వారు అభిప్రాయపడినట్లు ‘మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని’ అని మంగళాన్ని ఆశించి కాదు. ‘మంగళం’, ‘అమంగళం’ అని ఎంచుకొనే వాడే అయితే సంప్రదాయంగా పలువురు మంగళకరంగా భావిస్తున్న శ్రీకార ప్రారంభాన్ని తిరస్కరించేవాడు కాడు. ఏదేమైనా భద్రాద్రి రామశాస్త్రి కవి కావ్య రచనా సంప్రదాయాన్ని మార్చి, నవ్యత్వం చూపి, 20వ శతాబ్ది నవ్యకవులకు ఆదర్శంగా నిలిచాడని అందరూ ఒప్పుకోవలసిందే. రామశాస్త్రి కవి నవ్యత్వప్రీతి అంతటితో ఆగలేదు. మధునాపంతుల వారు చెప్పినట్టు కథా నాయకుని పేరు ‘చిత్రసీమ’ అని ఉంచడం కూడా ఒక క్రొత్తదనమే. అలాగే కథానాయకుని నామమే యథాతథంగా కావ్య నామంగా ఉంచడం కూడా ఆ కాలానికి నవ్యతే. ఎందుకంటే అంతవరకు ఏ కవి అయినా ‘విలాసము’, ‘విజయము’, ‘పరిణయము’, ‘కల్యాణము’, ‘చరిత్రము’, ‘సంవాదము’, విలాపము’ వంటి పదాలను, మూలకథా సంబంధ శబ్దాలకు చేర్చి, గ్రంథ నామాలుగా ఉంచడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ సమయంలో, ‘చిత్రసీమ విలాసము’ అనో లేక ‘చిత్రసీమ చరిత్రము’ అనో కాకుండా కేవలం ‘చిత్రసీమ’ అని కావ్యనామం ఉంచడం నిజంగా నవ్యతే. మధునాపంతుల వారు ఈ కావ్యాన్ని ‘కళాపూర్ణోదయమును బోలు కల్పిత కావ్యము’ అని ప్రశంసించడం గమనార్హం.
ఇలా కావ్య నామాన్ని సంప్రదాయానికి విరుద్ధంగా నవ్యంగా ఉంచిన మరొక కవి డా. కట్టమంచి రామలింగారెడ్డి. ఈనాటికీ చాలా మంది ప్రజలు ‘మరణము’ అన్న శబ్దాన్ని అమంగళకరంగా భావిస్తుంటారు. అలాంటిది 19వ శతాబ్దిలోనే ఆ కవి తన కావ్యానికి ‘ముసలమ్మ మరణము’ అని నామకరణం చేశారు. పైగా ఆ రోజుల్లో ఏ కావ్యమైన మంగళాంతంగా ముంగించాలన్న విశ్వాసం ఉండేది. ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తున్న ఆ విశ్వాసాన్ని ప్రక్కకు బెట్టి కట్టమంచి వారు ఆ కావ్యాన్ని నాయిక మరణంతో ముగించడం ఒక సంచలనాత్మక నవ్య మార్గం. రెడ్డిగారు ఈ కావ్యాన్ని అలా సంప్రదాయానికి వ్యతిరేకంగా నవ్యతతో విషాదాంతంగా ముగించడానికి కారణం, ఆయనకు ఆంగ్ల సాహిత్యం పట్ల గల విశేష పరిజ్ఞానమే అని చెప్పవచ్చు. ఆంగ్ల సాహిత్యంలోని ‘ట్రాజెడీ’లను గురించి తెలిసిన రెడ్డిగారు ఎంతో మంది పండితులు ఆ కావ్యాన్ని సుఖాంతంగా మార్చమని హెచ్చరించినా లెక్క చేయలేదు. అదే ఆ కావ్యానికి తొట్ట తొలి నవ్య కావ్యంగా విశేషమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ కావ్యం రచించిన తరువాత సుమారు ఏబయి ఏళ్ళకు వెలువడిన పునర్ముద్రణకు ఉపోద్ఘాతం వ్రాస్తూ పింగళి లక్ష్మీకాంతం ఇలా వివరించారు.
“ఇరువదియవ శతాబ్ది యుదయింపనున్న వేగుబోకలో నక్షత్రము వలె మన సారస్వతాకాశమున నవ్యకాంతులతో నావిర్భవించిన నూత్నాంధ్ర కావ్యము ‘ముసలమ్మ మరణము’. రెడ్డిగారు 19 సంవత్సరముల యువకులైయున్నపుడు (1899వ సంవత్సరములో) చెన్నపురి క్రైస్తవ కళాశాల ఆంధ్ర భాషాభిరంజనీ సమాజ పోషకులగు శ్రీ సమర్థి రంగయ్య శ్రేష్ఠి గారు ఈ కావ్యము యొక్క పుట్టుకకు కారణ భూతులు. ఉత్తమ కావ్య రచనలను బ్రోత్సహించుటకై శ్రీ శ్రేష్ఠిగారు నెలకొల్పిన పోటీ పరీక్షలో నెగ్గి, పందెము గెల్చుకొని బహూకరింపబడిన యీ కావ్యమును, తత్కర్త యైన యువకవిని, సుప్రసిద్ధులైన ఆంధ్రకవి పండితులెందరో ముద్దుగా మెచ్చుకొని బహుగా నాశీర్వదించిరట! మన సంప్రదాయమును బట్టి కావ్యము శుభాంతముగా నుండవలెను గనుక మరణాంతముగా రచింపబడిన యీ కృతిని ఎట్లైనను – కృత్రిమ కల్పనతోనైనను సరే – మంగళాంతముగా సంస్కరింపవలసినదని కొందరు ఈ బాల కవిని హెచ్చరించిరట. రామేశ్వర యాత్రాది బహు గ్రంథముల రచించి ప్రసిద్ధి వహించిన శ్రీ గుండు అచ్చమాంబగారు అందరి కంటే నెక్కువ హెచ్చరిక చేసిరట. మొగమాటమిచే నట్టి వారి కోరికను ఈ గ్రంథకర్త మన్నించియే యుండునేని ఈ కావ్యమునకు నుండవలసిన పరిపూర్ణ నవ్యత యుండెడిది కాదు.”
19వ శతాబ్ది ముగింపు దశలో వెలువడిన ఈ కావ్యం ఇంకా అనేక విధాలుగా నవ్యతను సంతరించుకొని, 20వ శతాబ్ది ఆధునిక యుగానికి మార్గదర్శకంగా నిలిచింది. అంత దాకా ఆంధ్ర సాహిత్యంలో ఏ కావ్యమైనా నాయక ప్రాధాన్యంగా వెలువడినవే. ఒకటి రెండు కావ్యాల్లో నాయికా ప్రాధాన్యమున్నా, అవి నాయక పాత్రలతో సమ ఉజ్జీగా నిలిచేవే తప్ప, కేవల నాయికా ప్రాధాన్య కావ్యాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇది ఒక రకంగా ఆంధ్ర సాహిత్యానికి పట్టుకొన్న పురుషాధిక్య భావజాలమే. కట్టమంచి వారు తొట్టతొలిసారి ఈ పురుషాధిక్యతను ధిక్కరించి, ముసలమ్మ అనే ఒక గ్రామీణ యువతి పాత్రను ప్రధాన పాత్రగా ఈ కావ్యాన్ని రూపొందించారు. మరొక విశేషం. ఈ కావ్యావతరణకు పూర్వం స్త్రీని ఒక సౌందర్య సాధనంగా, అంగాంగ శృంగార వర్ణనలకు ఆలవాలంగా కవులు భావించేవారు. ప్రబంధ యుగంలో ఆ తరువాతి కాలంలో ఇది మరింత పెచ్చుమీరి, 19వ శతాబ్దిలోనూ ఇలాంటి కావ్య నాయికలు ఎందరో మనకు దర్శనమిచ్చారు. కాని రెడ్డి గారు ముసలమ్మ పాత్రను సమాజహితం కోసం ఆత్మ బలిదానం చేసే త్యాగశీలగా తీర్చిదిద్దారు. కవి ఈ నవ్యతను కాకతాళీయంగా సాధించలేదు. ఒక నిర్దిష్టమయిన మనోదృక్పథంతో ఆయన ఈ కావ్య నిర్మాణం చేపట్టారు. కావ్య ప్రథమ ముద్రణలో కట్టమంచి వారు ఆంగ్లంలో అందించిన అభిప్రాయం చూస్తే ఈ విషయం మనకు అవగతమవుతుంది.
“I seem to be incapable, in my lofty moods, of feeling joy at the sight of a beautiful woman. Human beauty I can never enjoy. Beauty in trees, mountains, birds etc, I do enjoy. why is this? the moment I call to my imagination a most charming picture of a woman, my heart asks; Is life a matter of muscles? No doubt her muscles in the different parts are properly developed and she wears a delicate skin. But muscles are muscles and skin is skin. Muscles all over the world are intrinsically the same. They all sweat and emit odour. Cut the most beautiful and the most ugly to pieces and anatomize them. You find all things the same! Thus my heart positively hates human beauty. But it loves moral beauty. My creation of ‘Musalamma’ was from the moral point of view. The thing is, when I am absorbed in the contemplation of moral or spiritual excellence, my mind invests these abstract things with form and colour of the most ethereal nature and this beauty thrills every fibre of my heart. Humanity means morality and spirituality and nothing more. It was in this spirit, I wrote Musalamma.
– C.R. Reddy (Date : 8-2-1900)
సహృదయ జన సదవగాహన కోసం ఈ విషయాన్ని తెలుగులోకి అనువదించాను –
ఒక అందమైన స్త్రీ కనిపించగానే, పెద్దగా ఆనందించగలిగే మానసిక స్థితిని పొందడానికి నేను అశక్తుణేమో అనిపిస్తుంది. మానవ సౌందర్యాన్ని నేనెప్పుడు ఆస్వాదించలేను. వృక్షాలు, పర్వతాలు, పక్షులు మొదలైన వాని అందాన్ని నేను ఆస్వాదించగలను. ఎందుకిలా? ఒక స్త్రీ యొక్క అతి మనోహర చిత్రాన్ని నా ఊహల్లోకి దింపిన తత్ క్షణం నా హృదయం ప్రశ్నిస్తుంది – ప్రాణమంటే మాంస కండరాలతో కూడిన పదార్థమా? సందేహం లేదు! ఆమె వివిధ దేహ భాగాలలో మాంస కండరాలు సౌష్టవంగా పెరిగాయి. ఆమె సున్నితమైన చర్మాన్ని ధరించి ఉంది. కాని మాంసం మాంసమే – చర్మం చర్మమే. ప్రపంచంలో ఎక్కడైనా మాంసకండరాలు సహజంగా ఒక్కటే! అవి అన్నీ చెమటను కక్కుతాయి – వాసనను గుప్పుతాయి. అతి సౌందర్యమైన, అతి వికారమైన శరీరాలను కోసి శాస్త్ర శోధన చేసి చూడండి. అన్నీ ఒకేలా కనిపిస్తాయి. అందుకే నా హృదయం మానవ సౌందర్యాన్ని నిస్సంశయంగా అసహ్యించుకొంటుంది. కాని అది యుక్తా యుక్త వివేక సౌందర్యాన్ని ప్రేమిస్తుంది. ఆ యుక్తాయుక్త వివేక దృష్టితోనే నా ‘ముసలమ్మ’ పాత్ర జనించింది. విషయమేమిటంటే, నేను ఈ యుక్తాయుక్త వివేక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఔన్నత్యపు ఆలోచనలో మునిగినప్పుడు, నా బుద్ధి ఈ విధమైన ప్రత్యేకమైన సూక్ష్మమైన స్వభావం గల విషయాలకు రూపురేఖలు దిద్దుతుంది. ఆ సౌందర్యానికి నా హృదయంలోని ప్రతి పొర పులకిస్తుంది. మానవత్వం అంటే యుక్తాయుక్త వివేకం మరియు తాత్విక దృక్పథం – అంతకు మించి ఇంకేం లేదు. ఈ స్ఫూర్తితోనే నేను ‘ముసలమ్మ’ను రచించాను.
– సి.ఆర్.రెడ్డి (తేది : 8-2-1900)
19వ శతాబ్దిలో 19 ఏళ్ళ వయసులో ఇంత మానసిక పరిపక్వత, విశాల భావనా పటిమ గల సాహితీమూర్తి ప్రబంధ సరణిలో అంగాంగ వర్ణనలు, శృంగార చేష్టలను ఎలా వర్ణించగలడు? అందుకే ఎంతో నవ్య దృష్టితో రెడ్డిగారు ఈ కావ్యాన్ని సృజించారని అందరూ అంగీకరించక తప్పదు.
స్థూలంగా ఈ కావ్య కథాక్రమం ఏమిటంటే – బుక్కరాయ సముద్రం అన్న గ్రామంలో విపరీత వర్షాల వల్ల ఆ ఊరి చెరువు కట్ట తెగి గ్రామాన్ని ముంచి వేయబోతున్న సమయంలో, ఊరి రైతులు గ్రామ దేవతను ప్రార్థించగా, బసిరెడ్డి అనే రైతు చిన్న కోడలు ముసలమ్మ చెరువుకు బలి అయితే ఆపద తొలుగుతుందని ఆకాశవాణి పలుకుతుంది.
“బసి రెడ్డి గడ కోడలు
ముసలమ్మ యనంగ నొప్పు పుణ్యాంగన తా
వెస బలిగా బోయిన మీ
కిసు మంతయు గష్ట మెన్నడేలా కలుగున్?”
అప్పుడు గ్రామ ప్రజల హితంకోసం ఆ ఇల్లాలు తన భర్తను అత్తమామలను ఒప్పించి, ఆత్మత్యాగం చేస్తుంది. సామాజిక హితం కోసం నిస్వార్థంగా ప్రాణ త్యాగానికి సిద్ధపడిన మహనీయ సాధ్వి పాత్రను కట్టమంచి వారు ఎంతో కరుణ రసాత్మకంగా కళ్ళకు కట్టినట్టు చిత్రించారు. అనంతపురం మండలంలో ఒకప్పుడు జరిగిన యథార్థ సంఘటనకు కమనీయమైన కల్పనలు జోడించి రచించిన ఈ వినూత్న కావ్యం 1899వ సం.లో మదరాసు క్రైస్తవ కళాశాలలో నిర్వహించిన ఉత్తమ కావ్య రచన పోటీలో, సుప్రసిద్ధ పండిత కవి వేదం వేంకట రాయశాస్త్రి ప్రభృతుల న్యాయ నిర్ణయానుసారం ప్రథమ బహుమతిని సాధించింది.
ముఖ్యంగా, ఆత్మ త్యాగ నిర్ణయానందం, ఆత్మీయులతో వియోగ కారణ దుఃఖం, ఈ రెండూ కలగలసిన హృదయంతో భర్త ఎదుట నిలిచిన ముసలమ్మను కవి వర్ణించిన తీరు హృదయాలను కదిలిస్తుంది.
“తనకు గడు గూర్చు ప్రజలకై తాను వేగ
బ్రాణముల్ వీడ సంతస పడియు బాల-
మగని, నత్తను, మామను, మరదుల, మరి
గల జనమ్ముల విడిచి పోగాళ్ళు రాక –
లేనగవును, గన్నీళ్ళును
గా నెద తట తట యనంగ, గాంతుని యెదుటన్
వానయు, నెండయు గలిసెడు
చోనొప్పెడు నభమనంగ, సుందరి నిలిచెన్”
అలాగే తన ప్రాణత్యాగానికి ముసలమ్మ తన భర్తను ఒప్పించుకొను సన్నివేశం మరింత హృదయ విదారకం.
“కుడువను గట్టను దొరకక
కడు వగలం బొగలు జనుల గాంచెదవా? యీ
పుడమికి భారంబగు న
న్విడ నాడ దలంతువా? వివేక నిధానా!
తనకు దేవుడిచ్చిన శక్తి కనుగుణముగ
నన్నదమ్ములు నాదగు నఖిల జనుల
కలక నేనాడు దీర్పంగ దలపడేని
పుట్ట నేల నరుడు మరి గిట్టనేల?
జనులకు మేలొనరింపని
తనువేలా? కాల్పదగదొ? తానొక్కండై
తన వార లడల నేలా
గున దలయెత్తికొని తిరుగ గూడు నరునకున్?
మీరు కన్నార జూచుచు గారవింప
గన్ను మూసికొనుట నాకు ఘనము కాదొ?
తమకు దమ భార్య యిటు చేసె దగు దగునని
యెల్ల వారును వర్ణింప నింపు కాదొ?”
~
సమష్టిజీవన హితం కోసం వ్యష్టిజీవన త్యాగాన్ని ప్రబోధించే ఈ పద్యాలు తరువాతి కాలంలో ఆంధ్ర హితం కోసం దేశంలోని ఏ కొందరు యువకులనైనా స్వాతంత్య్ర పోరాటానికై, స్వరాష్ట్ర సాధనకై త్యాగాలు చేయడానికి స్ఫూర్తి ఇచ్చి ఉంటాయని నా ప్రగాఢ విశ్వాసం.
అయితే ఈ కావ్యంలో పంటి కింద గులక రాయిలా తగిలే విషయం ఒకటి ఉంది.
అదేమిటంటే-
ఆకాశవాణి ఒక అబల ఆత్మత్యాగాన్ని కోరడం వల్ల అంధవిశ్వాసాన్ని కవియే చిత్రించినట్లయింది. అలాకాకుండా, ఆకాశవాణి ప్రమేయం లేకుండా, ఆ ఊళ్ళో తరతరాలుగా నెలకొన్న అంధ విశ్వాసానికి నాయిక స్పందించి ఆత్మత్యాగం చేసినట్లుగా చిత్రించి ఉంటే ఆ పాపం కవి కలానికి అంటుకొని ఉండేది కాదు. పైగా అంధ విశ్వాసాల వల్ల అమాయకులు ఎలా బలి అవుతున్నారో కవి సమాజానికి చాటినట్టయేది. కానీ, ప్రచారంలో ఉన్న ఒక యథార్థగాధను వస్తువుగా స్వీకరించడం వలన కవిని ఈ విషయంలో మనం ఏ విధంగానూ తప్పు పట్టనవసరం లేదు. అయినా కవి ఆనాటి పరిస్థితులలో ఈ కావ్యంలో ఇన్ని రకాలయిన నవ్యతలు సంతరించడమే ఆశించిన దాని కంటే ఎక్కువ. ఇంకా అది నవ్యంగా లేదు – ఇది నవ్యత కాదు అని, వంద సంవత్సరాల పైన గడిచాక, మారిన పరిస్థితులలో మనం భావించడం సరికాదు.
అయినా కొన్ని సందర్భాలలో కొందరు ఆధునిక విమర్శకుల కన్న కట్టమంచివారే నవ్యులనిపిస్తారు. దుఃఖాంతంగా ముగిసిన ఈ కథా కావ్యాన్ని పింగళి లక్ష్మీకాంతం పండితులు మంగళాంతంగా నిరూపించేందుకు చేసిన ప్రయత్నం చూడండి.
“కథాంతమున జరిగెడి మరణము లోక కల్యాణప్రదముగా బ్రదర్శింపబడునేని అది మంగళాంతమనియే భావించవలెను. సంఘ శ్రేయమునకై నవ్వు మోముతో ఆత్మబలిని అంగీకరించి స్వయముగా మృత్యుదేవతాశ్లేషణ మొనర్చుకొన్న ఆ కాపు బిడ్డ ముసలమ్మ త్యాగము ఎంత లోకకల్యాణ హేతువో చెప్పనక్కరలేదు. ఆ మహానుభావురాలి యఖండ త్యాగమువలన ఆ గ్రామీణులందరు బిడ్డలతో బచ్చగా నిల్చియుండటమే ఈ కథ వలన కలిగిన మంగళము.”
నాయిక మరణం మరణమే. ఆశుభాంత కావ్యం అశుభాంతమే. అందువల్ల సాహిత్యానికి, కవికి, పాఠకులకూ వచ్చిన ప్రమాదమేమీ లేదు. అది మంగళాంతమని సరి పుచ్చుకొనవలసిన అవసరం కూడా లేదు. ఆంగ్ల సాహిత్యంలో ‘రోమియో జూలియట్’ నాటకం, భారతీయ సాహిత్యంలో ‘దేవదాసు’ నవల విషాదాంతాలయినంత మాత్రాన ఏర్పడ్డ ప్రమాదం ఇసుమంతైనా లేదు. పైగా అవి పాఠకుల విశేషాదరణకు పాత్రమై, అజరామర ఖ్యాతిని పొందాయి. ఆ స్ఫూర్తితోనే ‘ముసలమ్మ మరణం’ కావ్యాన్ని, కూడా మనం స్వీకరించాలి. పైగా తన ఆత్మ బలిదానం వల్ల సమాజ హితం చేకూరుతుందని ముసలమ్మ, ఆ ఊరి రైతులు మూఢ విశ్వాసాల వల్ల భావించినట్టు మనం గ్రహించాలి కాని, లక్ష్మీకాంతం గారు పేర్కొనట్టు, నిజంగా ముసలమ్మ మరణం వల్ల ఆ గ్రామీణులందరు బిడ్డలతో పచ్చగా నిల్చి ఉండటం కల్ల. ఆ ఆత్మ త్యాగం తరువాత ఆపద తొలగిందని గాని, ఆ గ్రామీణులు పచ్చగా విలసిల్లారని గాని, రెడ్డిగారు కూడా ఎక్కడా వ్రాయకుండానే కావ్యాన్ని ముగించడం గమనార్హం. డా. సి. నారాయణరెడ్డి గారి వంటి అభ్యుదయ కవి సైతం లక్ష్మీకాంతం గారి ప్రభావానికి లోనయి – “ఒక వ్యక్తి ఆత్మార్పణము వలన వందల ప్రాణములు నిలిచినవి. అనగా అసంఖ్యాక జనావళికి మంగళము జరిగినది. కావున ఈ కావ్యములోని కథను బట్టి చూచినచో ఇది మరణాంతమైనను, మంగళాంతమనియే చెప్పవచ్చును. అనగా స్థూలముగా మరణాంతము వలె కనపించెడు ఈ కథ నిగూఢముగా సంప్రదాయము వైపు ములు సూపుచునేయున్నది” అని ప్రకటించడం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. శోకాంత కావ్యాన్ని కూడా మంగళాంతంగా భావించడం ఆయా విమర్శకులకు గల కొద్దిపాటి సంప్రదాయ ప్రీతిని తెలియజేస్తుందేమోగాని ఇరవయ్యో శతాబ్ది ఆదిలో వచ్చిన ‘పూర్ణమ్మ’, ‘స్నేహలతాదేవి లేఖ’ వంటి కావ్యాలకు ప్రేరణగా నిల్చేలా, కట్టమంచి రామలింగారెడ్డి 19వ శతాబ్ది అంత్యకాలంలో వెలిగించిన సంప్రదాయ వ్యతిరేకత, అభ్యుదయాత్మక నవ్యతకు ఎలాంటి భంగం వాటిల్లదు.
19వ శతాబ్దిలో ఆంధ్ర సాహిత్యంలో అనేక నూత్న ప్రక్రియలకు ఆద్యుడైన మహాకవి, రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారు వెటకారంగా, వ్యంగ్యంగా, హాస్య భరితంగా, ‘అభాగ్యోపాఖ్యానం’ పేరిట 1876వ సంవత్సరంలో ఒక వ్యంగ్య ప్రబంధాన్ని రచించి, ప్రబంధ ధోరణిలో రచించే ఆనాటి కవులు సిగ్గుతో తలదించుకొని, నవ్య మార్గంలో అభ్యుదయాత్మక కవిత్వ మల్లాల్సిన అగత్యాన్ని కల్పించారు. ఈ వ్యంగ్య ప్రబంధాన్ని గురించి మరొక ప్రత్యేక అధ్యాయంలో సవిస్తరంగా చర్చిస్తాను.
అంతటితో ఆగకుండా, పంతులుగారు ఈ దిశలో రచించిన మరో కావ్యం – ‘సరస్వతీ నారద విలాపము’. ఈ కావ్యం రచనా కాలంపై కొంత భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఆచార్య సి. నారాయణరెడ్డిగారు తమ ‘ఆధునికాంధ్ర సాహిత్యము – సంప్రదాయములు; ప్రయోగములు’లో ఈ కావ్యం 1887లో రచింపబడినదని పేర్కొన్నారు. తెలుగు అకాడమి వారు ప్రచురించిన ‘తెలుగు సాహిత్య కోశము’లో ఇది 1879గా ఉంది. అదే గ్రంథంలో మరోచోట ఈ కావ్యం రచనాకాలం 1895 అని ఉంది. అయితే ఆరుద్ర, అక్కిరాజు రమాపతిరావు వంటి పండితులు దీని రచనా కాలాన్ని 1895గా పేర్కొన్నారు. అయితే అత్యధికులు ఆమోదించిన 1895నే దీని రచనా కాలంగా స్వీకరించవలసి ఉంటుంది.
ఇంతకు ముందు పేర్కొన్న కవులంతా సమకాలీన సాహిత్యంలో కొనసాగుతున్న సంప్రదాయాలకు వ్యతిరేకంగా, అభ్యుదయాత్మకంగా కొన్ని కొన్ని నూత్న ప్రయోగాలు చేస్తే, ఈ కావ్యంలో కందుకూరి వారు డైరెక్టుగా ఆ సాహిత్యం, ఆనాటి సంగీతంలో ఉన్న పెడధోరణులను విమర్శిస్తూ, సరస్వతీ మాత, ఆమె పుత్రుడు నారదుడు సంభాషించుకొన్నట్టు, దిగజారిన ప్రబంధ శైలితో ఆంధ్ర సాహిత్యం అధ్వాన్న స్థితిలో ఉందని వాపోయినట్లు చిత్రించారు. ఆచార్య ఎస్. వి. రామారావు గారు వెలిబుచ్చిన అభిప్రాయం ఇక్కడ గమనార్హం. “స్పెన్సర్ కవి వ్రాసిన The tears of Muses సరస్వతీ నారద విలాపమునకు ప్రోద్బలకము కావచ్చును. అందు Muses (విద్యా దేవతలు) ముఖమున స్పెన్సర్ ఆంగ్ల సాహిత్య ధోరణిని నిరసించినట్లుగానే పంతులుగారు కూడ ఇందు వాగ్దేవి అయిన సరస్వతి ముఖమున క్షీణ ప్రబంధ కవితా ధోరణిని ఖండించిరి.” మొత్తానికి ఆంధ్ర సాహిత్యంలో 19వ శతాబ్ది పూర్వార్థం వరకు కొనసాగిన కుసంస్కారాలను దయ్యబట్టి, ఈ ధోరణులను విడనాడి, సాహిత్యాన్ని 20వ శతాబ్దిలో అభ్యుదయ పథంలోకి నడపాలన్న ఆలోచనను కలిగించే విధంగా 19వ శతాబ్దిలోనే వీరేశలింగం పంతులు ఈ కావ్యాన్ని రూపుదిద్దడం విశేషం. అందువల్ల ఇది కేవలం అభ్యుదయ రచన అనడం కన్న అభ్యుదయానికి బాటలు వేసిన కావ్యం అని ప్రస్తుతించవచ్చు. నిర్వచనంగా పూర్తిగా పద్యాలలో నడచిన ఈ కావ్యం నాటిక రూపంలో ప్రదర్శన యోగ్యంగా ఉండడం మరొక నవ్యత. ఈ విషయాన్ని ‘19వ శతాబ్ది తెలుగు కవిత్వం – ప్రక్రియా పరమైన నవ్యత’ అన్న అధ్యాయంలో చర్చిస్తాను. ఈ అధ్యాయానికి సంబంధించినంత వరకు కవి అభ్యుదయ భావాలు కలిగి, ఆనాడు అధికంగా వెలువడుతోన్న వ్యర్థ ప్రబంధాలను చూచి ఎంతగా చింతించారో చూద్దాం.
కందుకూరి వారు ఆ రోజుల్లో ఆంధ్ర దేశంలో మితిమీరిన వేశ్యా వ్యాపారాలను నిరసిస్తూ ఉద్యమాన్ని నడిపారు. నారదుడు తన హరి కీర్తనాన్ని ఆదరించేవారు కరువవుతున్నారని, విటులు వేశ్యల బూతు కూతలనే సంగీతంగా భావిస్తున్నారని వేదన చెందినట్లుగా పంతులుగారు వ్యంగ్యంగా ఆనాటి సామాజిక స్థితిని వివరించారు. దేవముని ఆవేదన చూడండి –
“కటువులె యీ హరి కీర్తన
లట మటమున విటుల కొక్క యర కాసునకున్
దటుకున మానమె యమ్మెడు
కుటిలాలక లరచు బూతు కూతల కంటెన్?”
ఇలా Anti – nautch ఉద్యమ స్ఫూర్తిని కవితలలో ప్రకటించడం కూడ అభ్యుదయాత్మక నవ్యతే కదా! ఇక, సరస్వతీ దేవి సైతం ప్రాచీన కాలంలో రమణీయోక్తులతో, అర్థ గుణ స్వారస్యాలతో కూడిన కమనీయ కావ్యాలతో తాను సుఖిస్తుండగా, ఆనాటి కవులు రసహీనమైన కావ్యాలు రచించి తనకు ఆర్తిని కలిగిస్తున్నారని వ్యథ నొందినట్లుగా ఆయన వర్ణించారు.
“అటు సుఖియింపుచుండగ మదాస్యమునందు నిరర్థకంబులై
పటపటలాడు శబ్దముల బల్మిని బెట్టి, రసంబు నెట్టి య
క్కటికము లే కలంకరణ కైతవముం గొని మేను కుట్టి యి
ప్పటి ఘను లార్తి పెట్టెదరు ప్రాణము తీసి ననుం గలంచుచున్!
తెలియదు సుమ్మిప్పుడు నా
పలుకుల యర్థంబు నాకె భావము లేమిన్
వెల భూషలు గాకివి సం
కెలలయి కడు నాదు మేనికిన్ వెత నించున్!”
కావ్యంలో ఒక చోట “ఛందోబద్ధంబగు పదబృందాటోపంబు తా కవిత్వంబగునే?” అని డైరెక్టుగా నారదునితో ప్రశ్న వేయిస్తారు వీరేశలింగం పంతులు. 20వ శతాబ్దిలో, తెలుగు సాహిత్యాన్ని చుట్టుకొన్న ఛందస్సు పరిష్వంగాలను తొలగిస్తామన్న కొందరు ఆధునిక అభ్యుదయ కవుల భావజాలానికి ఇది బీజంగా పని చేసిందని చెప్పవచ్చు.
పంతులు గారు ఇంకా ముందుకు వెళ్ళి, మరింత కటువుగా, తన నిశ్చితాభిప్రాయాన్ని ఇలా తెలిపారు.
“విను – ఛందోబద్ధంబను
ఘన కారణముననె బ్రతుకు గననగునేనిన్
తనువది వదలి వెసం జ
క్కని మృతి నొందుటయె లెస్స కవితా సతికిన్!”
కాని, అలాంటి కవిత్వాన్నే ఆనాటి మేధావులనబడే వాళ్ళు పొగుడుతున్నారని సరస్వతి చింతిస్తున్నట్టు కవి వర్ణించారు.
“అవునది నిజమే యైనను –
భువిలో ప్రాణంబు లేని బొందియె యిపుడీ
నవ మేధావుల చేతన్
వివిధంబుగ బొగడ బడెడు! విధినేమందున్?
దయమాలి తుదముట్ట దలకట్ల నిగిడించి
ధీరుడై నన్ను బాధించు నొకడు
పాదంబులోపల పాదంబు లిమిడించి
వీరుడై నన్ను నొప్పించు నొకడు
ప్రాసంబుపై పెక్కు ప్రాసంబు లొదవించి
పోటు బంటై నన్ను పొడుచునొకడు
బెండు పల్కులు గూర్చి నిండించి నగలంచు
దిట్టయై జెవులు వేధించు నొకడు
ఖడ్గ చక్రాది రూపముల్ గానిపించి
వర్ణములు మార్చి నను జిక్కు పరచునొకడు
కుమతు లొడలెల్ల విరిచి ప్రాణములు తీయ
నొడలి పసలేక శుష్కించి యున్న దాన!”
అంటూ ఆనాటి క్షీణ ప్రబంధ కవులకు చిత్ర కవిత్వం, గర్భ కవిత్వం, బంధ కవిత్వం పట్ల గల వ్యామోహాన్ని, ప్రాసలకోసం వారి ప్రాకులాటలను నిశితంగా విమర్శించారు.
నారదుడు సైతం సశాస్త్రీయమైన సంగీత మాధుర్యాన్ని లెక్క జేయక వేశ్యల వెంట తిరిగే యువకులకు చురకలంటించే విధంగా పద్యాలు రచించారు వీరేశలింగం.
సంగీత సాహిత్యాలు భారతికి రెండు కళ్ళ వంటి వని, ఆ రెండు కళ్ళకు ఆనాడు పొరలు క్రమ్మాయని ఆయన ఆనాటి మేధావులకు వివరించారు. ఈ లఘు కావ్యాన్ని, ఆనాటి దీన స్థితిని చూడ లేక సరస్వతీదేవిని తన వీపుపై కూర్చుండబెట్టుకొని నారదుడు ఎక్కడికో పారిపోతున్నట్టుగా ముగించడం కందుకూరి వ్యంగ్య రచనా వైభవానికి పరాకాష్ఠగా భావించవచ్చు.
వీరేశలింగం పంతులు 19వ శతాబ్ది సాహిత్యంలో అసంఖ్యాకంగా వస్తున్న నీరస కావ్యాలను నిరసిస్తూ 19వ శతాబ్దిలోనే ఈ లఘు కావ్యాన్ని రచించి ఆనాటి కవులు నవ్య మార్గంలో ఆలోచించేందుకు దోహదపడి, మార్గదర్శకులయ్యారు. అసలు సమకాలీన సాహిత్యంలోని పెడ ధోరణులను, కుసంస్కారాన్ని విమర్శించడమే ప్రధానాంశంగా తీసికొని ఒక వ్యంగ్య కావ్యాన్ని వెలయించడం కన్న నవ్యత ఇంకేముంటుంది? “సమకాలికులారా! మీ దిశ మార్చుకోండి” అని చెప్పేవాని కన్న వైతాళికు డెవడుంటాడు?
ఆంధ్రదేశ చరిత్రలో వీరేశలింగం పంతులుగారు సాహితీమూర్తిగా ఎంత పూజనీయుడో సంఘ సంస్కర్తగా అంతకన్నా ఆదరణీయుడు. ముఖ్యంగా ఆయన స్త్రీజనోద్ధరణకై చేసిన సేవ తరతరాలకు మరవలేనిది. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు సమానమైన అవకాశాలు ఆదరణ గౌరవం దక్కాలని ఆయన భావించేవారు. అందుకొరకు ఆయన ప్రత్యేకంగా పత్రికలను స్థాపించి విషయాలను ప్రచారం చేసేవారు. స్త్రీలకై ప్రత్యేకంగా రచనలు చేసి ప్రచురించేవారు. వాటిలో ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అన్న కథల సంపుటులు చాలా ప్రసిద్ధి చెందాయి. మొదటి సంపుటి పేరు ‘ఆడు మలయాళం’. అయితే ఇవి గద్య రచనలు. ఈ పరిశోధన పరిధి కేవలం కవిత్వం వరకే కాబట్టి ఆ కథల సంపుటిని గురించి గాని అందులో అభ్యుదయ భావాల గురించిగాని, వ్యంగ్య హాస్య రచనా వైభవం గురించి గాని చర్చించదలచుకోలేదు. కాని అందులో ‘పత్నీవ్రత ప్రబోధము’ పేరిట రచించిన 9 పద్యాల ఒక లఘు ఖండ కావ్యం స్త్రీ జనాభ్యుదయ భావాలతో వ్యంగ్యంగా హాస్యమిళితంగా ఉండి, ఒక స్వతంత్ర కావ్యానికి గల ప్రతిపత్తిని పొంది యుండడం వలన ఆ ఖండ కావ్యం గురించి చర్చించవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను.
కందుకూరివారు తమ స్వీయ చరిత్రలో ‘సత్యరాజా పూర్వ దేశ యాత్రలు’ గురించి ఇలా చెప్పుకొన్నారు
“స్త్రీల విషయమున మన వారు చేసిన యన్యాయములు తేటపడునట్లుగా వ్యాజరీతిని సత్యరాజా పూర్వదేశ యాత్రల యొక్క ప్రథమ భాగమును రచించి ప్రకటించితిని”
భారతదేశంలో స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలు, చూపుతున్న వివక్ష ‘ఆడు మళయాళం’లో పురుషుల పట్ల జరుగుతున్నట్టు ఆయన కల్పన చేశారు. మన హిందూ సంస్కృతిలో చిన్న నాటి నుంచి ఆడపిల్లలకు పాతివ్రత్యం బోధిస్తున్నట్టు, అక్కడ ఆడు మలయాళంలో మగ పిల్లలకి చిన్న వయసునుంచే ‘పత్నీ వ్రత ప్రబోధం’ చేస్తారని ఆయన హాస్యస్ఫోరకంగా రచించారు.
డా. అక్కిరాజు రమాపతిరావు దీనిని గురించి వివరిస్తూ “ఆడు మళయాళంలో అక్కడి పెద్దలు పురాణాలు బోధించే ‘పత్నీ వ్రత బోధిని’ అనే శాస్త్ర సారాంశాన్ని వీరేశలింగం పంతులుగారీ విధంగా సత్యరాజాచార్యులు అనే పాత్ర ద్వారా వెల్లడింపజేసారు. వెక్కిరింతకు, వెటకారానికి, వేళా కోళానికి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ రచనే శ్రీకారం చుట్టిందని చెప్పాలి” అన్నారు. సులభగ్రాహ్యమైన ఆ పద్యాలు చదివితే, హాస్యంతోబాటు ఆ నవ్యత కూడా అవగతమవుతుంది.
~
“పురుషున కిమ్మహి బత్నియె
పరమంబగు దైవతంబు! పత్నీ సేవన్
నిరతము జేసెడి పురుషుడె
పరమున నిహమున సుఖముం బడయుంజుమ్మి!
ప్రతిదినంబును బురుషుండు పత్ని కంటె
ముందుగా లేచి నదిలోన మునిగి, జలము
కలశమున దెచ్చి, నిజపత్ని కాళ్ళు కడిగి
తాను శ్రీపాద తీర్థంబు తాగవలయు!
స్త్రీ పాద తీర్థ సేవన
మే పురుషుడు చేయు నెన్ని యేడులు ధరలో
నా పురుషు డన్ని యుగములు
పాపములంబాసి మోక్ష పదవి సుఖించున్.
కుష్టు రోగిణియైనను, గ్రుడ్డిదైన,
భూరి వికలాంగియైనను, ముసలిదైన –
బత్ని యెంగిలి భుజియింపవలయు సతము
పుణ్య లోకంబు గాంక్షించు పురుష వరుడు!
ఏ పురుషు డతిన యెంగిలి
పాపపు మతి నేవగించి భక్షింపండో
యా పాపాత్ముడు నారక
కూపంబున గూలు జూవె కోటి యుగంబుల్!
దూరమున జూచి పత్నిని
గారవమున లేచి యొంటి కాలున బురుషుం,
డోరగ వంగ వలయును
గూరిమి గూర్చుండ నిల్వగూడదు సుమ్మీ!
పురుషుడును గార్దభమున్
స్థిరముగ దండనము లేక చెడిపోదు రిలన్
గరుణయు దలపక నెలకొక
పరియైనను గొటట్టవలయు బత్ని పురుషునిన్!
పత్ని గొట్టిన దిట్టిన బాధయిడిన
భోగ పురుషుల బొందిన బొదవ కీర్ష్య
దరుణియే పురుషునకును దైవమనుచు
భక్తి ననయంబు సేవింప వలయు జుమ్ము!
అతివలకు స్వేచ్ఛ భూషణమైన యట్లు
పురుషులకు లజ్జయే మహా భూషణంబు
సూర్య చంద్రులు మొగమైన జూడకుండు
పరమ పత్నీవ్రతుడె పొందు పరమగతులు”
~
19వ శతాబ్దినాటి పురుషులు పాదపూజలు చేయించుకోవడం; తమ యెంగిలిని భార్యతో విధిగా తినిపించడం; తమ కనుసైగలతో భార్య కూర్చునేలా, నిలుచుండేలా శాసించడం; వంటింటిని దాటి బయటికి రానీయక పోవడం; తమకు ఎదురు తిరగకుండా ఉండేందుకు నెలకొక మారు కల్పించుకొని చితగ్గొట్టడం లాంటి దౌర్జన్యాలను సాగించడం చూసి, ఆవేదనతో అదే పరిస్థితి పురుషులకు కలిగితే ఎలా ఉంటుందో తెలియ జెప్పడానికి సున్నితమైన హాస్యాన్ని మేళవించి చేసిన వ్యంగ్య రచన ఇది. స్త్రీ, పురుషులు సమానమే – వారు పరస్పరం ఒకరినొకరు గౌరవంగా, ప్రేమగా ఆదరించాలన్న ఆలోచనను రేకెత్తించాలన్న ప్రయత్నంగా చేసిన అభ్యుదయాత్మక రచన ఇది. ఈ కవిత గురించి వ్యాఖ్యానిస్తూ డా. అక్కిరాజు రమాపతిరావు – “సత్యరాజాచార్యకృత ‘పత్నీహిత ప్రబోధ నవరత్నమంజరి’ – స్త్రీల విషయమై పురుషాహంకారపు ప్రపంచాన్ని ఆయన ఎంతగా ఏవగించుకొన్నాడో తెలిపే రచన. మహిళా వికాసం కోసం ఆయన వకాల్తా పుచ్చుకొని పురుష జాతిపై ప్రయోగించిన కళాఘాతం ఈ రచన. ఇక్కడ ఈ దేశంలో స్త్రీలు అనుభవిస్తున్న బాధలు, అవమానాలు, అనుమానాలు, పరిభవాలు, నిరసనలు, నిందలు, హింసలు, హీనతలు పురుషుడే అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఆయన సూటి ప్రశ్న. ఆయన హాస్య చమత్కార ప్రజ్ఞ, ఈసడింపు ఆ రచనలో వెల్లి విరిసాయి” అని వివరించారు.
19వ శతాబ్దిలో ప్రధానంగా స్త్రీ జాతి పట్ల పురుషులు చూపే వివక్షను నిరసించడమే పలువురు రచించిన కావ్యాలలో ప్రధానంగా అభ్యుదయాంశంగా నిలిచింది. అయితే ఆ రోజుల్లోనే పర మత సహనం, మత సామరస్యం వంటి అంశాలు కూడ అభ్యుదయాంశాలుగా రూపొందించిన కవి కూడా లేకపోలేదు. క్రీ.శ. 1854లో వారణాశి అచ్యుత రామయ్య అనే కవి ‘సురతాణీ పరిణయము’ అన్న ఒక కావ్యాన్ని వెలయించాడు. ఇది బీబీ నాంచారి, శ్రీరంగ నాథుని ప్రణయ పరిణయ గాథ. ఈ కావ్యం భక్తి, శృంగారాత్మకంగా సంప్రదాయరీతిలో రసవంతంగా నడచినా, అక్కడక్కడా పరమత సహన ప్రబోధకంగా సాగి, మత సామరస్య భావనకు ప్రతీకగా నిలిచింది. ఒక మహమ్మదీయ వనిత, హైందవ దైవాన్ని పరిణయ మాడిన కథ ప్రచారంలో ఉన్నా, దానిని ఒక కావ్య వస్తువుగా స్వీకరించి రసాత్మకంగా తీర్చిదిద్దడం ఆ రోజుల్లో ఒక సాహసమే కాకుండా, అభ్యుదయ పథానికి వేసిన ఒక పునాదిరాయిగా భావించవచ్చు.
ఆ మహమ్మదీయ ప్రభువును కవి – “సేకు ముఖ మ్లేచ్ఛకుల నిసర్గ ధర్మ పరిపాలనుడు” అని ప్రస్తుతించడం, సురతాణుడు (సులతాను) హైందవ దేవతల విగ్రహాలను కొల్లగొట్టి బంధించి నపుడు, విగ్రహరూపంలో ఉన్న శ్రీరంగనాథునికి సురతాణి (బీబీ నాంచారి) ప్రేమ లభించడంతో, ఆ హైందవ దైవం “చెర నుంచిన సురతాణుడు పరికింప మహోపకారి” అంటూ ఆ మహమ్మదీయ ప్రభువును కీర్తించడం, సురతాణుడు “అచ్ఛా బహద్దురుగ యిది స్వచ్ఛంబుగ దోచుచుండె” నని, శ్రీ వైష్ణవ మత సంస్థాపక ప్రవక్త శ్రీ రామానుజాచార్యను తన వద్దకు సగౌరవంగా రప్పించి “మీ య వార్య తేజ మరయ నరుదు! మీరలడిగిన నిచ్చెద బూజ్యమైన, నాదు రాజ్యమైన” అంటూ శ్రీరంగనాథాది దేవతా విగ్రహాలను అతనికి తిరిగి ఇచ్చి వేయడం వంటి ఘట్టాలు, రెండు వేర్వేరు మతాల పాత్రలు పరస్పరం గౌరవించుకోవడం ప్రబోధించి మత సామరస్య భావనకు దోహదం కావడం కవి అభ్యుదయ ధోరణికి తార్కాణాలు. ఆ విధంగా 19వ శతాబ్ది నడిమి భాగంలోనే సాహసోపేతమైన కావ్య వస్తువును ఎన్నుకొని, రసవంతంగా ఉదాత్త పాత్ర చిత్రణలతో అభ్యుదయాత్మక నవ్యతను చూపిన చక్కని కవి శ్రీ వారణాశి అచ్యుత రామయ్య.
ఇలాంటి అభ్యుదయాత్మక రచనల నెన్నో ఆంధ్ర సాహిత్య చరిత్రలో 19వ శతాబ్దిలోనే అందించిన మరొక కవి శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ. ఈయన విద్వత్కవి. సంస్కృతం, వేద శాస్త్రాలు స్వయంకృషితో నేర్చుకొన్నారు. సంగీతం, నాట్యం, చిత్రకళ వంటి లలిత కళలలో మంచి పరిజ్ఞానం కలవారు. ప్రాచీనాధునిక హైందవ రాజ్యాంగ విశేషాలను చక్కగా పరిశీలించినవారు. భౌతిక, రసాయనాది శాస్త్రాలలో విజ్ఞానాన్ని సముపార్జించుకున్న ఆధునికులు. భూ, వృక్ష, క్రిమి, కీటక, ఖనిజ తత్యాలను అధ్యయనం చేసిన వైజ్ఞానికులు. తెలుగు అకాడమి వారు 1986లో వెలువరించిన తెలుగు సాహిత్య కోశం (రెండవ భాగం) లో వీరి సాహిత్య కృషిని గూర్చి గల విశేష పరిచయంలో ఈ క్రింది వివరాలు తెలుస్తున్నాయి.
“1885లో శతఘంట కవిత్వం చెప్పారు. తిరుపతి వేంకట కవులకు పూర్వమే (1884) శతావధానాలు చేశారు. 1921లో తణుకులో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు వార్షికోత్సవ సభకు అగ్రాసనాధిపతులు. ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపకులలో వీరొకరు (1929). తెలుగులో కథానికారచనకు వీరే ఆద్యులనీ, కల్పలత పత్రికలో (1903 నవంబరు) ప్రచురితమైన వీరి ‘లలిత’ తొలి కథ అనీ విమర్శకుల అభిప్రాయం. బాలాంబ, లలిత, చంద్ర వర్మ ఈ కథలోని ముఖ్య పాత్రలు. నాయిక పరంగా పేరు పెట్టడం, సమకాలీన సమాజాన్ని, దేశ కాలాదులను వర్ణించడం, శైలి వర్ణనాత్మకంగా ఉండటం, సంభాషణలు తక్కువగా ఉండటం దీనిలోని నవ్యతా గుణాలు. ‘అపూర్వోపన్యాసము, సారసిక, విశాఖ’ వీరి ఇతర కథలు. అపూర్వోపన్యాసంలో వితంతు వివాహ సమర్థనం, సారసికలో ఆదర్శ ప్రేమ, విశాఖలో ప్రేమ త్యాగం కథా వస్తువులు. వస్తు శిల్పం దృష్ట్యా ఇవి ఎన్నదగిన కథలు. తెలుగులో గేయ కవిత్వానికి శ్రీకారం చుట్టినవారు కూడా వీరే అని పండితాభిప్రాయం. ‘ఆంధ్ర పద్యావళి’ నవ్యకవితా సంపుటి. సంఘ సంస్కరణోద్దేశంతో రాసిన ఖండకృతులతోపాటు దీనిలో దాదాభాయి నౌరోజీ మొ. వారిని గురించిన పద్యాలు కూడా ఉన్నాయి.”
1892వ సంవత్సరంలో వెలువడిన సాంఖ్యాయన శర్మ రచించిన ‘ఆంధ్ర పద్యావళి’ తెలుగులో, లిరికల్ కవిత్వానికి (అనగా వర్ణనాత్మకమై, శ్రవ్యగుణ సంపన్నమైన కవిత్వానికి) శ్రీకారం చుట్టిన గ్రంథంగా ప్రసిద్ధం. సంఘ సంస్కరణాసక్తి, సామాజిక రుగ్మతలపై అధిక్షేపం, సుప్రసిద్ధ రాజకీయ నాయకుల ప్రశంస, రవివర్మ చిత్ర పటాలు వంటి ఆధునిక వస్తువులపై అనుభూతి కవిత్వం ఈ కవితలలోని విషయాలు. ఈ సంపుటిలోని శీర్షికలు భావాలు అన్నీ నూతన రీతులలో ఉన్నాయి. 20వ శతాబ్దిలో వ్యవస్థీకృతమై రాజ్యమేలిన ఖండ కావ్య ప్రక్రియకు ఈ కవితలు మాతృకలని చెప్పవచ్చు. అలా 19వ శతాబ్దిలోనే ఖండకావ్యాలకు తొలి రూపు దిద్దిన ఆద్యుడు సాంఖ్యాయన శర్మ. ఈ విషయాన్ని ప్రక్రియాపరమైన నవ్యతను పరిశీలించే అధ్యాయంలో సవిస్తరంగా చర్చిస్తాను. ఈ అధ్యాయానికి సంబంధించినంత వరకు ఆచంటవారి అభ్యుదయ కవితా రీతిని ప్రస్ఫుటింపజేసే పద్యాలు కొన్ని పరిశీలిద్దాం.
సాంఖ్యాయన శర్మ ‘ఆంధ్ర పద్యావళి’ సంపుటిలో Anti nautch సాంఘికోద్యమం, ఇతర సాంఘిక సమస్యలపై ఎన్నో పద్యాలను రచించారు. మచ్చుకు ఒక పద్యంలో
“బిందె బిందెడు కాఫీకి పిడుగు తునక
కట్ట చుట్టల కాల్చెడి పుట్టుభోగి
బుట్టెడాకులు నమిలెడి పుణ్య భోగి
నాగరికులన్న యున్నారె, వీరె!” –
అంటూ వ్యసనాలను నాగరికతా లక్షణాలుగా భావిస్తున్న ఆనాటి సామాజికులకు చురకలంటించారు.
ఆచంట వారు కందుకూరి వారిలాగే స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రబోధించే పద్యాలను రచించారు. అయితే ఈయన శైలి వేరు. ఈయనకు గల వైజ్ఞానిక పరిజ్ఞానం వలన, వైజ్ఞానిక విషయాలను, సాంఘిక సమస్యలను మేళవించి చేసిన వ్యంగ్య చమత్కార రచనలు నవ్యతతో అని కాకుండా ‘అతి నవ్యత’తో కూడుకొన్నవని ప్రస్తుతించక తప్పదు. ‘సంఘ సంస్కరణము’ అన్న ఖండకృతిలో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని స్త్రీ సమానత్వ ప్రబోధానికి అన్వయించిన తీరు కవి ధిషణా వైభవాన్ని, లలిత హాస్య చాతుర్యాన్ని చాటుతాయి.
“నెలతలు చంటి బిడ్డలకు బాల్గుడుపుటే
ప్రకృతి ధర్మంబని పలుక రాదు
ప్రకృత శాస్త్రజ్ఞులౌ పండితుల్ డార్విను
మున్నగు వారలు కొన్ని చోట్ల
పురుషులు రొమ్మినం బొడమిన పాలతో
శిశు పోషణంబని చెప్పినారు
ప్రకృతి ధర్మంబులు ప్రభవించు నశియించు
నభ్యాస పద్ధతి ననుసరించి
మగువలకే గాని చన్బాలు మగలకెందు
పొడమవను మాటలన్నియు బూటకములు
పురుషులిక మీద స్తన్యంబు వొదమునట్లు
రొమ్ము సవరించుకొనుట కార్యమ్ము గాదె”
~
అలాగే ఈ సంపుటిలో శర్మగారు సుప్రసిద్ధ భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరోజీపై ఒక ఖండ కృతిని వెలయించారు. దాదాభాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెసు పుట్టక పూర్వం నుంచే స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుడు. 1855లో వ్యాపారం నిమిత్తం ఇంగ్లండ్ వెళ్ళిన నౌరోజీ ఆంగ్లేయులకు భారత దేశ స్థితి గతులను వివరించేవాడు. లండన్‌లో ఇండియన్ సొసైటీ స్థాపించి, హక్కుల గురించి పోరాడాడు. 1855లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరయ్యాడు. 1886లో భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుడయ్యాడు. అంతటి మహా జాతీయ నాయకునిపై ఖండ కావ్యం వెలయించడం వల్ల ఆచంట సాంఖ్యాయన శర్మ 19వ శతాబ్దిలోనే ఆంధ్ర సాహిత్యంలో జాతీయ భావాలను, స్వాతంత్య్రచ్ఛను కలిగించే అభ్యుదయ రచన చేశారని చెప్పవచ్చు. బహుశః తెలుగులో ఇదే తొలి జాతీయ వాద కవిత అయి ఉంటుంది. దురదృష్టమేమిటంటే ఈ కవితా సంపుటి ఇప్పుడు అలభ్యం.
ఇదిలా ఉంటే, క్రీ.శ. 1892 ప్రాంతంలోనే దాసు శ్రీరాములు పంతులు అనే కవి ‘తెలుగునాడు అను ఆంధ్ర వీధిలో బ్రాహ్మణ ప్రశంస’ అన్న ఒక వినూత్న కావ్యాన్ని రచించారు. ఈ కావ్య పీఠికలో కవి తన నవ్య దృష్టిని ఇలా వివరించారు.
“సంఘ విషయముల గూర్చి అబాధకములగు చమత్కార కావ్యములు మన దేశ భాషలలో లేవు. ఐరోపా ఖండము వారి ప్రస్తుత నాగరిక ప్రవర్తనమునకు కారణ భూతములైనవి యిట్టి కావ్యములే యని జెప్పనవసరము లేదు.” – ఇలా అభ్యుదయాత్మకమైన ఆలోచనతో ఈ కావ్య నిర్మాణం చేసిన శ్రీరాములు కవి తన కావ్య రచన లక్ష్యాన్ని గూడ ఈ పీఠికలో తెలియజేసారు. “మన దేశములో బ్రాహ్మణ శాఖలలో వివాహ సంబంధములుండుట శ్రేయోదాయకమని నా యభిప్రాయము.” ఇలాంటి ఆశయంతో ‘ఆంధ్ర వీధిలో బ్రాహ్మణ ప్రశంస’గా రచించిన ఈ ‘తెలుగు నాడు’ కావ్యం నిజంగా ఒక అభ్యుదయాత్మక రచన అని చెప్పక తప్పదు. 19వ శతాబ్దిలోనే చేసిన ఈ శాఖాంతర వివాహ ప్రబోధం 20వ శతాబ్దిలో ఆదర్శంగా నిలిచిన కులాంతర మతాంతర వివాహాలకు నాందీ వాక్యంగా భావించవచ్చు.
అంతే కాకుండా కవి ఈ కావ్యంలో అనాదిగా మన సమాజంలో నెలకొని ఉన్న ‘కన్యాశుల్కం’ దురాచారాన్ని నిరసిస్తూ పద్యాలు రచించి అభ్యుదయ పథంలో సాగిపోయారు.
“చెప్పక యున్న దోషమగు – జెప్పిన గోపము లేమి సేయుదున్?
జెప్పక తప్పదీ వయిపు సీమల, బ్రాహ్మణ కోటి గన్యకల్
గొప్ప గిరాకి! పెద్దపడి గుండున నల్బది సేర్ల వెండికిన్
జప్పుడు లేక దూగు – నది చాలకయున్న మరొక్క సేరగున్!
చెప్పిన కార్యమే మెవరు చేతురు నా పలుకాలకించి, వెం
కప్పకు డెబ్బదేండ్లు, నరసమ్మకు నెన్మిది యేడు లీడుగా
జొప్పడెనంచు నాంధ్ర పద సూరులు తప్పక పొంతనంబులున్
జెప్పుదు రెంత తప్పు పని ఛీ! ముసలిం బసికాయ మెచ్చునే?”
~
ఇలా ఒక కావ్యంలో ‘కన్యాశుల్కం’ దురాచారంపై తన నిరసనను తెలియజేసిన తొలి కవి దాసు శ్రీరాములు అని చెప్పవచ్చు. అంతే కాకుండా గురుజాడ వారి ‘కన్యాశుల్కము’ నాటకం ప్రథమ ముద్రణ క్రీ.శ. 1897లో వచ్చింది. అంతకుముందే శ్రీరాములు కవి ఈ రచనను చేయడం (క్రీ.శ. 1892 ప్రాంతంలో) గమనార్హం.
ఈ విధంగా 19వ శతాబ్ది పూర్వార్థంలో శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి ప్రారంభించిన సంప్రదాయ వ్యతిరేకత, 19వ శతాబ్ది ఉత్తరార్థంలో మరింత విస్తృతమై, దానితో బాటు అభ్యుదయాత్మక రచనలు కూడా తోడై నవ్యతా మార్గానికి తెరతీసి, రాబోయే 20వ శతాబ్దికి మార్గదర్శకంగా నిలిచేలా, ఆయా వైతాళికులు విశిష్ట కృషిని సలిపారు. ఇదంతా 19వ శతాబ్దిలో రచింపబడి, ముద్రితమై ఇప్పటికీ అవసాన దశలో లభ్యమవుతున్న మూలగ్రంథాలు, ఇతర వివరణ గ్రంథాల ఆధారంగా చేసిన అధ్యయనం. ఇంకా ముద్రణకు నోచుకోక, ముద్రితమైనా సరియైన భద్రతకు నోచుకోక రాలిపోయిన 19వ శతాబ్ది నవ్య కవితా కుసుమాలెన్నో!
19వ శతాబ్దిలోని పైన పేర్కొన్న కవి వైతాళికులు చూపిన నవ్య మార్గాలను వ్యవస్థీకరించి 20వ శతాబ్ది కవులు నవ్యయుగాన్ని పరిపుష్టం చేశారు. ఈ విషయం తరువాతి అధ్యాయాలలో మరింత తేటపడుతుంది.
(ఇంకా ఉంది)