Site icon Sanchika

‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-4

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

VI. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో ఛందో నవ్యత

ఆది కవి నన్నయ కాలం (11వ శతాబ్ది) నుండి 19వ శతాబ్ది అంతం వరకు ఆంధ్ర కవిత్వం సంప్రదాయ పద్య ఛందస్సులతో కొనసాగిందని, 20వ శతాబ్ది నవ్య కవిత్వ యుగారంభంలో గురజాడ అప్పారావుగారు ఆ సంప్రదాయ ఛందస్సులను ప్రక్కకు నెట్టి, ‘ముత్యాల సరము’ అనే మాత్రా ఛందస్సును సృజించి తెలుగు కవితా ఛందస్సును కొత్త మలుపు తిప్పారని సాహిత్య రంగంలో ఒక అభిప్రాయం నెలకొని ఉంది. కానీ అది వాస్తవం కాదు.

గురజాడ కంటే ఒక వంద సంవత్సరాల పూర్వమే, అంటే 19వ శతాబ్ది ఆరంభంలోనే ఒక కవి వతంసుడు ఇంచుమించు ఇదే ఛందస్సును తన కావ్యంలో ప్రయోగించాడని తెలిస్తే ఈనాటి ఆధునికులు ఆశ్చర్యంలో మునుగక తప్పదు. కాని ఇది సత్యం. 1810వ సంవత్సర ప్రాంతంలో రేవణూరి వేంకటార్యుడనే కవి తన ‘శ్రీపాద రేణు ప్రభావము’ అన్న కావ్యంలో ఈ ఛందస్సును ప్రయోగించాడు. తొట్ట తొలి తెలుగు వాగ్గేయ కారుడు, తిరుమల వేంకటేశ్వరుని పరమ భక్తుడు తాళ్ళపాక అన్నమయ్య పుత్రీ వంశీయుడైన రేవణూరి వేంకటార్యుడు ప్రయోగించిన ఈ ఛందస్సు పేరు ‘తురంగ వృత్తము’. ఈ వృత్త లక్షణాన్ని పరిశీలిస్తే ఇలా గోచరిస్తుంది. ప్రతి పాదంలో మూడు మాత్రలు, ఆపైన నాలుగు మాత్రలు, మళ్ళీ మూడు మాత్రలు, ఆపైన నాలుగు మాత్రల చొప్పున ఉంటాయి. కవి ముప్పయి పాదాల మాలికగా ఈ వృత్తాన్ని వెలయించాడు.

ఇప్పుడొకసారి గురజాడ ముత్యాల సరాన్ని, అందులోని మాత్రా చాలనాన్ని గమనిద్దాం.

(*చివరి పాదంలో 2 మాత్రల తగ్గింపు)

ఇప్పుడు రేవణూరి వేంకటార్యుని ‘తురంగ వృత్తం’ చూద్దాం.

 (19vaShatabdiPart4Image2)

వేంకటార్యుడు కూర్చిన యతిప్రాసలు, గురజాడ సడలించుకొన్నారు తప్ప-పై రెండు ఛందస్సులలో సామ్యం ఇట్టే అవగతమవుతుంది. కాకపోతే గురజాడ 4వ పాదంలో రెండు మాత్రలను తగ్గించి చిన్న మార్పు చేసారు. బహుశః ఆయన –

తకిట   తకధిమి  తకిట తకధిమి

తకిట    తకధిమి  తకిట తా

అన్న నృత్యానుగుణ్యమైన తాళంతో స్ఫూర్తి నొంది ఈ చిన్ని మార్పు చేసి ఉంటారు. అయినా గురజాడ కూడా కొన్ని కవితల్లో నాలుగవ పాదాన్ని కూడా మొదటి మూడు పాదాల్లాగా వ్రాసిన సందర్భాలు లేకపోలేదు. ఆయన రచించిన ‘దించు లంగరు’ కవితలో ఈ పంక్తులను గమనించండి.

ఇది యథాతధంగా, యతి ప్రాసలు సడలించిన రేవణూరి వేంకటార్యుని తురంగ వృత్తమే. పైగా మూడు, నాలుగు మాత్రలతో సాగిన ఈ వృత్తంలో ‘తురంగ వల్గనం’ నడక కలిగి ఉండడంతో ఈ ఛందస్సును ‘తురంగ వృత్తం’ అనడమే ఔచితీవంతంగా తోస్తుంది. ఆ విధంగా 19వ శతాబ్ది ఆరంభంలోనే ఛందఃపరమైన నవ్యత సాధించిన మహాకవి రేవణూరి వేంకటార్యుడు.

ఈ కవి కాల నిర్ణయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ కవి 16వ శతాబ్దికి చెందిన వాడని తొలుత కొందరు పండితులు భావించారు. అందుకు కారణం ఈ కవి రచించిన ‘శకుంతలా పరిణయం’ అన్న కావ్యంలో స్వీయ పరిచయాన్ని అందిస్తూ –

“శ్రీ వత్సాన్వయ రేవణూరి కులజున్, శ్రీపాద రేణు ప్రభా

సావర్ణ్యస్ఫుట కావ్య కల్పక కవిన్, సంకీర్తనాచార్య పు

త్రీ వంశోత్తము, నంద వైదిక బుధాది ప్రోక్త వృత్తి స్వయం

భావున్ దిర్మల కొండయార్య సుతు శుంభద్వేంకటాభిఖ్యునిన్–”

అని తెలిపాడు.

ఇందులో ‘సంకీర్తనాచార్య పుత్రీ వంశోత్తము’ అన్న మాటను చూచి పండితులు ఈయనను అన్నమాచార్య పుత్రికా పుత్రునిగా భావించి, ఇతడు 16వ శతాబ్ది వానిగా భావించారు. తెలుగు అకాడమి వారు ప్రచురించిన ‘తెలుగు సాహిత్య కోశము’లో ఈ కవిని 16వ శతాబ్దికి చెందిన వానిగానే పేర్కొనడం జరిగింది. అయితే సంకీర్తనాచార్య పుత్రీ వంశోత్తముడు’ అంటే సంకీర్తనాచార్యుని పుత్రిక కుమారుడే కానక్కరలేదు. ఆ పుత్రిక వంశంలో తరువాతి తరంలోని ప్రసిద్ధుడైనా కావచ్చు. పైగా అన్నమయ్య కుటుంబీకులంతా తరతరాలుగా సంకీర్తనాచార్యుల కుటుంబంగా ప్రసిద్ధి చెందినప్పుడు సంకీర్తనాచార్యుడంటే అన్నమయ్యే కానక్కర లేదు. ఆ తరువాత తరంలోని ఆ కుటుంబీకులలో ఎవరైనా ప్రసిద్ధుడు కూడా కావచ్చు. ఇటీవలి కాలంలో అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య యొక్క నాలుగవ పుత్రుడు తాళ్ళపాక చిన్నన్న –

“హరి యవతార మీతడు – అన్నమయ్య!

అరయ మా గురువితడు – అన్నమయ్య!!”

వంటి ఎన్నో సంకీర్తనలు వెలయించినట్లు పరిశోధనలలో తేలింది. లోగడ కూడా, ‘అల తాళ్ళపాక చిన్నన్న రోమములైతె తంబురా దండెకు దంత్రులగునె’ అని అర్వాచీనులు ఇతనిని వాగ్గేయకారునిగా ప్రస్తుతించినట్లుగా ఆధారాలున్నాయి. అంతే కాదు స్వయంగా రేవణూరి వేంకటార్యుడు కూడా తన ‘శ్రీపాద రేణు ప్రభావము’ కావ్యావతారికలో-

“శ్రీలలరంగ మంగమకు శ్రీహరి కిన్నటు ధార వోయుచో

తాళులపాక యన్నమయ తా గడిగెన్ బదముల్ ధరిత్రి, మా

తాళుల పాక చిన్నన పదంబులు బాడిన నాడె సర్వరాట్

శైల విభుండు తత్పదరజంబును మాకు నొసంగ జెల్లదే,”

అన్న పద్యంలో చిన్నన్నను వాగ్గేయకారునిగా ప్రస్తుతిస్తూ, ‘మా తాళ్ళపాక చిన్నన్న పదాలు పాడిన నాడె’ అంటూ గతాన్ని స్మరించుకొన్నట్లుగా పేర్కొన్నాడు. ఒకవేళ వేంకటార్యుడు అన్నమయ్యకు దౌహిత్రుడే అయితే, అన్నమయ్యకు పౌత్రుడయిన తాళ్ళపాక చిన్నన్నకు దాదాపు సమ వయస్కుడయి ఉండాలి. అలాంటప్పుడు ‘పదాలు పాడిన నాడె’ అని పేర్కొనే అవకాశం లేదు. కాబట్టి రేవణూరి వేంకటార్యుడు చిన్నన్న కంటె ఎంతో నవీనుడై ఉండాలి. అంతే కాదు వేంకటార్యుడు తన గురించి ‘సంకీర్తనాచార్య పుత్రీ వంశోత్తముడ’నని చెప్పుకొన్నప్పుడు, అక్కడ సంకీర్తనాచార్యుడు అంటే అన్నమయ్య కాకుండా చిన్నన్నయే అయి ఉండాలి. ఎందుకంటే పైన పేర్కొన్న పద్యంలో, అలుమేలు మంగమ్మను శ్రీహరికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది అన్నమయ్యగా, పదాలు పాడింది చిన్నన్నగా ఆయన వర్ణించాడు. ఆ విధంగా చిన్నన్న పుత్రిక వంశంలో పుట్టిన కవి రేవణూరి వేంకటార్యుడని స్పష్టమవుతుంది. (ఇక్కడ చిన్నన్న పుత్రికకు నేరుగా పుత్రుడు కాదన్న విషయం కూడా గమనార్హం.) దీనిని బట్టి రేవణూరి వేంకటార్యుడు 16వ శతాబ్ది వాడు కాడని, ఆధునిక కాలానికి సమీప కాలం వాడని తెలుస్తోంది. దీనికి బలం చేకూర్చే ఆధారం ఒకటుంది. 1899లో వెలువడిన ‘కవుల చరిత్రము’లో వీరేశలింగం పంతులు ఈ కవి గురించి ‘నూరు, నూటయేబది సంవత్సరములు క్రిందటి వాడు’ అని పేర్కొన్నాడు. అనగా 1750, 1800ల మధ్య జన్మించి ఉండాలి. మధ్యస్థంగా 1775 అని తీసుకొన్నా, ఏ కవి అయినా ఆధ్యాత్మిక పరిణతి గల కావ్య రచన చేయాలంటే కనీసం ముప్పయి, ముప్పయి ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండడం సర్వ సాధారణం కాబట్టి 1810 ప్రాంతంలో ‘శ్రీపాద రేణు ప్రభావం’ కావ్యాన్ని రేవణూరి వేంకటార్యుడు రచించి ఉండాలి. తెలుగు సాహిత్య చరిత్రకారులు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

దీనిని బట్టి గురజాడ వారి ‘ముత్యాల సరం’ ఛందస్సుకు ఆద్యరూపమైన ‘తురంగ వృత్తం’ 19వ శతాబ్ది ప్రథమాంకం నాటికే ఉన్నదని తెలుస్తుంది. ఇందుకు బలం చేకూర్చే ఒక విషయాన్ని ఆచార్య సి. నారాయణరెడ్డిగారు తమ “ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు” గ్రంథంలో పేర్కొన్నారు. అదేమిటంటే- “ఆంధ్ర భారతి – పత్రిక (శా. శ. 1831 మాఘ సంచిక)లో ‘మేలుకొలుపు’ అను శీర్షికతో ఒక గేయము ప్రచురింపబడినది. కర్త పేరు లేదు. అప్పటికి గురజాడ వారి ముత్యాల సరములు వెలువడలేదు. ఈ ‘మేలు కొలుపు’ గేయము మిశ్రగతిలో నున్నది. అనగా గురజాడ వారు 1916లో ప్రచురించిన ‘ముత్యాల సరము’ ఛందస్సులో నున్నది. అనగా 20వ శతాబ్దిలో కూడా గురజాడ కన్న ముందే ఈ ఛందస్సులో రచనలు చేసిన వారున్నారన్నమాట. కాబట్టి గురజాడ క్రొత్తగా మాత్రా ఛందస్సులో ‘ముత్యాల సరం’ ఛందస్సును సృజించాడన్నది పూర్తిగా వాస్తవం కాదన్న విషయం అంగీకరించక తప్పదు.

ఇలా పాత ఛందస్సుకే కొత్త పేరును పెట్టి, 20వ శతాబ్దిలోనే కాదు 19వ శతాబ్దిలోనే నూతనత్వాన్ని భ్రమింపజేసిన మరొక కవి సాక్షాత్తు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. పంతులుగారు తమ ‘సత్యా ద్రౌపదీ సంవాదం’ను ‘ఏక పాద వృత్తము – పాట’ అని పేర్కొన్నారు. భార్యాభర్తలకు పరస్పరం ప్రేమానురాగాలను పొందడానికి “ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును.” అని సద్బోధ చేసిన ఒక చక్కని రచన అది.

“శ్రీకృష్ణుడొక నాడు చెలగు వేడుకను

విపినంబు లోపల వెతనొందుచున్న

పాండవులను జూచి పరతెంచుకొరకు

పయనమై యల సత్యభామను గూడ-”

అంటూ ప్రారంభమయిన ఈ కవిత ఇదే ఛందోనియతితో ఆసాంతం సాగిపోతుంది. అయితే దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇది సుపరిచితమైన ‘మంజరీ ద్విపద’ అని ఇట్టే తెలిసిపోతుంది.

ద్విపద లక్షణాలు గమనిస్తే –

“ద్విపదకు రెండు పాదములుండును. ప్రతిపాదమునందును 3 ఇంద్ర గణములు + ఒక సూర్య గణమునుండును. ప్రాస నియతి గలదు. ప్రాస నియతి లేనిచో ద్విపదకు ‘మంజరి’ అని పేరు.”

వీరేశలింగం గారి పై రచనను పరికిస్తే –

ఇది ఖచ్చితంగా మంజరీ ద్విపదే (ప్రాసనియతి లేదు కాబట్టి). మరి కవి ఎందుకు ‘ఏక పాద వృత్తము – పాట’ అని పేర్కొన్నారు? ప్రాస నియతి ఉంటే, రెండు పాదాలు ఆ సంబంధం కలిగి ఉండి, ఒకే పద్యంగా అగుపిస్తుంది. ఎప్పుడైతే ఆ సంబంధం లేదో, ఏ పాదానికి ఆ పాదం ఒక స్వతంత్ర పాదమై ‘ఏక పాద’ వృత్తంగా అగుపిస్తుంది. కాబట్టి మంజరీ ద్విపదకు కవి ‘ఏక పాద వృత్తం’ అని నామకరణం చేశారని భావించవచ్చు. అలాగే ఈ ఛందం పాడుకోవడానికి అనుగుణంగా ఉండడం వల్ల, దీనిని ‘పాట’ అని కూడ కవి పేర్కొన్నారు. విమర్శకులు గురజాడ, ఇది వరకే ఉన్న ఛందస్సుకు కొత్త పేరు పెట్టడం ద్వారా, 20వ శతాబ్దిలో ‘ముత్యాల సరం’ అనే కొత్త ఛందస్సును సృజించాడని భావిస్తే, కందుకూరి వారి ఏక పాద వృత్తాన్ని కూడా నవ్య ఛందస్సుగా అంగీకరించక తప్పదు మరి! కాని అది సమంజసం కాదు గదా!

పంతులు గారు ‘మంజరి’ అన్న పేరు ఉండగా, అదే ఛందస్సుకు కొత్త పేర్లు పెట్టడాన్ని బట్టి, ఆనాటి కవులకు కొత్త ఛందస్సు సృజించిన వారిగా, లేక ప్రయోగించిన వారిగా ఖ్యాతినొందాలన్న తపన ఉండేదన్నది రూఢి అవుతుంది.

అసలు 20వ శతాబ్దిలో గురజాడ, అంతకు ముందు కందుకూరి వంటి కవులకే కాదు – కొత్త కొత్త ఛందస్సులను; సంప్రదాయ ఛందస్సులే కాకుండా, విశిష్టమైన, ప్రత్యేకమైన ఛందస్సులను ప్రయోగించాలని 19వ శతాబ్దిలో కూడా అనేక కవి పుంగవులు తపన పడ్డట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో ప్రత్యేకంగా పేర్కొనదగిన కవి – ‘శ్రీమత్రికూటాచల మాహాత్మ్యము’ కావ్యకర్త కొప్పరాజు నరసింహం. గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకాలో నున్న ‘కోటప్పకొండ’ అనే పుణ్యక్షేత్రం పై క్రీ.శ. 1862లో వెలయించిన ఈ ఆధునిక క్షేత్ర మాహాత్మ్య కావ్యంలో కవి చూపిన ఛందోవైవిధ్యం అసాధారణం. సాధారణ వినియోగంలో గల ఛందస్సులు కాక ఈ కవి ముప్పయికి పైగా విశిష్ట ఛందస్సులను ప్రయోగించడం విశేషం. ముఖ్యంగా ద్వితీయాశ్వాసంలో ఇంద్రుడు శివుని స్తుతించు ఘట్టంలో మాలిని, సుగంధి, స్రగ్విణి, శ్రీ, నారి, కన్య, పంక్తి, శశివదన, హంసమాల, విద్యున్మాల, భుజంగ శిశురుతము, ప్రణవము, దోదకము, ఇంద్ర వంశము, మత్త మయూరము, వన మయూరము, అలసగతి, పంచ చామరము, మందాక్రాంత, పద్మనాభము, తన్వి, భాస్కర విలసితము, మంగళ మహాశ్రీ తదితరములైన 27 రకాల ఛందస్సులను వరుసగా ఏకబిగిని రచించడం పాఠకులను ఆకర్షిస్తుంది. అంతకుముందు శతాబ్దుల ఆంధ్ర సాహిత్యంలో నన్నయాదులు, ఇతర కవులు వీనిలోని కొన్నింటిని అక్కడక్కడా ప్రయోగించినా, ఇన్ని రకాల విశిష్ట ఛందస్సులను ఒక చోట గుది గ్రుచ్చి రచించడం ఒక విశేషమైన నవ్యత. ఇది క్షేత్ర మాహాత్మ్య కావ్యం కావడం వల్ల, ఈ భక్తిమయ కావ్యంలో ఆ క్షేత్ర నాథుని స్తుతిని 27 రకాల ఛందస్సులలో చేయడం – ఆ స్వామికి నక్షత్ర హారతిని అందించినట్లుగా కవి భావించి ఉంటాడు. ఈ గ్రంథాన్ని ముద్రించి ఇచ్చిన అజంతా ముద్రణాలయాధిపతులు, శతావధానులు శ్రీ శ్రీనివాస సోదరులు తమ ముందుమాట ‘మేలి పలుకు’ లో ఈ విషయాన్ని ఇలా ప్రస్తుతించారు.

“అఖిల చ్ఛందోమయుండగు పరమేశ్వరుని దేవేంద్రునిచే వివిధ చ్ఛందోమయ స్తోత్రమున స్తుతింపజేసిన కవి యుచితజ్ఞత మెచ్చదగినది.”.

కొప్పరాజు నరసింహ కవి ప్రయోగించిన మాలిని, సుగంధి, స్రగ్విణి, దోదకము, ఇంద్ర వంశము, పంచ చామరము, మందాక్రాంత తదితరాలకు అంతకు ముందు పూర్వకవుల ప్రయోగాలున్నాయి. కాని శ్రీ, నారి, కన్య, పంక్తి తదితర ఛందస్సులకు పూర్వకవుల ప్రయోగాలున్నట్టు కనిపించవు. ఈ వృత్తాల గురించి తెలుసుకోవాలంటే ఛందశ్శాస్త్రం గురించి కొంత ప్రాథమిక అవగాహన అవసరం.

నిజానికి ఛందశ్శాస్త్రం ఒక సముద్రం. “పెంపమరు సముద్రమ్ముల చందములై ఛందములు” అంటాడు అనంతామాత్యుడు. అంటే శాస్త్రకారులు ఛందశ్శాస్త్రంలో కొన్ని కోట్ల రకాల ఛందస్సులను ఎప్పుడో నిర్వచించి ఉన్నారన్నమాట.

ఒక పాదంలో ఒక అక్షరం చొప్పున ఉండే పద్యాలను, ఒకటో ఛందస్సుగా పరిగణిస్తారు. ఈ ఛందానికి ‘ఉక్త’ అని పేరు. ఈ ఒకటో ఛందంలో – అయితే పాదానికి ఒక హ్రస్వాక్షరం (లఘువు)తో ఒక వృత్తంగానీ, లేదా పాదానికి ఒక దీర్ఘాక్షరం (గురువు) తో ఒక వృత్తంగానీ, ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఒకటో ఛందంలో కేవలం రెండు రకాల వృత్తాలు మాత్రమే ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా పాదానికి ఒక లఘువు (1) తో ఏర్పడే ఛందాన్ని ‘క్షితి వృత్తం’ అని, అలాగే పాదానికి ఒక గురువు (U) తో ఏర్పడే ఛందాన్ని ‘శ్రీ వృత్తం’ అని పిలుస్తారు.

ఉదా:- శ్రీ వృత్తం

నీ

వే

నే

నై

అలాగే, పాదానికి రెండక్షరాలు చొప్పున ఉండే ఛందస్సును రెండో ఛందస్సు అంటారు. దీనికి ‘అత్యుక్త’ అని పేరు. ఈ అత్యుక్త చందంలో 4 రకాల వృత్తాలేర్పడతాయి. అవి – 1. లఘువు లఘువు (II); 2. గురువు – గురువు (UU) ; 3. గురువు – లఘువు (UI) ; 4. లఘువు – గురువు (IU) . అంతకన్నా వేరే రకంగా ఏర్పడే అవకాశమే లేదు. ఈ క్రమంలో పాదానికి మూడక్షరాల నియతితో సాగే ఛందాన్ని మూడో ఛందస్సు అంటారు. దీనికి లక్షణకారు లుంచిన పేరు ‘మధ్య’. దీనిలో 8 రకాల వృత్తాలేర్పడే అవకాశం ఉంటుంది. అంతకన్న మించి వృత్తాలు ఆ మూడో ఛందస్సులో ఏర్పడ లేవు. ఎలాగంటే –

1) UII; 2) UUI; 3) UUU; 4) IUI; 5) IIU; 6) III; 7) IUU; 8) UIU

అదే వరుసలో 4వ ఛందస్సులో 16 రకాల వృత్తాలు, 5వ ఛందస్సులో 32 రకాల వృత్తాలు, 6వ ఛందస్సులో 64, 7వ ఛందస్సులో 128, ఇలా చెప్పుతూ పోతే 24వ ఛందస్సులో (అంటే పాదానికి 24 అక్షరాలుండే ఛందస్సులో) 1,67,77,216 (ఒక కోటి 67 లక్షల, 77 వేల, 216) వృత్తా లేర్పడతాయి. 25వ ఛందస్సులో 3, 35, 54, 432 వృత్తాలు, 26వ ఛందస్సులో 6, 71, 08, 864 వృత్తాలు ఉంటాయని శాస్త్రకారులు వివరించారు. ఇలా నాలుగు పాదాలలో హెచ్చు తగ్గులు లేకుండా సమాన సంఖ్యలో గురు లఘువులు, యతి స్థానాలుండే పద్యాలను సమవృత్తాలంటారు.

ఈ సమవృత్తాలలో ఆరక్షరాలుండే ఆరవ ఛందస్సును ‘గాయత్రి’ ఛందస్సు అంటారు. దీనిని విశ్వామిత్ర మహర్షి ప్రసాదించాడంటారు. దీనిలో 64 రకాల వృత్తాలుంటాయి. 8 అక్షరాలు ప్రతిపాదంలో ఉండే 8వ ఛందస్సును – ‘అనుష్టుప్పు’ ఛందస్సని వ్యవహరిస్తారు. వాల్మీకి ముఖతః తొలి కవిత ఈ ఛందస్సులోనే వెలువడింది. ఈ అనుష్టుప్పు ఛందస్సులో 256 రకాల వృత్తాలేర్పడతాయి. ఈ వరుసలో ఉత్పలమాల – 20వ ఛందస్సులో (దీని పేరు ‘కృతి’) ఉద్భవించే 10, 48, 576 వృత్తాలలో ఒకటి. ‘చంపకమాల’ అనే వృత్తం ‘ప్రకృతి’ అనబడే 21వ ఛందస్సుకు చెందిన 20, 97, 152 వృత్తాలలో ఒకటి. ఇలా ఏకాక్షర ఛందస్సు నుండి మొదలుకొని, 26 అక్షరాల ఛందస్సు వరకే 13 కోట్లకు పైగా సమ వృత్తాలు ఉద్భవిస్తాయి. ఇంకా 26 అక్షరాల కంటే అధికంగా అక్షరాలు గల పాదాలతో ఏర్పడే పద్యాలను ఉద్దుర వృత్తాలంటారు. ‘లయగ్రాహి’, ‘లయ విభాతి’, ‘లయహారి’, ‘త్రిభంగి’ వంటి వృత్తాలు ఈ తరగతికి చెందినవే. ఇవిగాక జాతులు, ఉపజాతులలో కందం, ‘సీసం’, ‘గీత’ పద్యాలతో బాటు ‘అక్కరలు’, ‘ద్విపదలు’, ‘త్రిపదలు’, ‘చతుష్పదులు’, ‘షట్పదలు’, ‘రగడలు’ సరేసరి! ఇలా చెప్పుకొంటూ పోతే ఇదంతా ఒక గణిత శాస్త్రంలా కనిపిస్తుంది. కంప్యూటర్ విద్యలో బైనరీ సిస్టంలాగే, గురువంటే రెండు మాత్రలు, లఘువంటే ఒక మాత్ర అన్నది కూడా గణితమే.

ఇదే విషయాన్ని ఇటీవల గడియారం శేషఫణి శర్మ కవి తన కృతి ‘కల్యాణ రాఘవము” పీఠికలో చక్కగా వివరించారు. ఆయనంటారు ‘పింగళుడు వేదములను పరమ ప్రమాణముగ సంభావించుచు, గణిత శాస్త్రము నాధారముగ గైకొని ఛందశ్శాస్త్ర నిర్మాణ మొనర్చియున్నాడు”. దీనిని సశాస్త్రీయంగా ఆయన ఇలా నిరూపించారు –

“గణిత శాస్త్రమున ‘n’ విజాతీయ వస్తువుల సమితి నుండి ప్రతి వస్తువును ఒక్కొక్క పర్యాయము గ్రహించుచు” వస్తువుల నెన్నుకొనినచో ఏర్పడు ప్రతి అమరిక (Arrangement) ను ప్రస్తారము (Permutation) అంటారు. ఆ ప్రస్తారముల మొత్తాన్ని “p. అన్న సంకేతంతో సూచిస్తారు. గణిత శాస్త్రానుసారం.

ఇక్కడ (factorial n) అంటే n సహజ సంఖ్యల లబ్దము. అలాగే [factorial (n-r)] అంటే (n-r) సహజ సంఖ్యల లబ్ధము. ఈ ప్రస్తార సూత్ర మూలముగా మరియొక ఉప సిద్ధాంతము నిష్పన్న మగును. ప్రతీ వస్తువును ఒక పర్యాయము గాక ఎన్ని మార్లైనను గ్రహించుచు వస్తువుల నెన్నుకొన్న నేర్పడు ప్రస్తారముల సంఖ్య = nr (n to the power of r).

ఛందశ్శాస్త్రంలో గురువు (U), లఘువు (1) అనే రెండే రెండు విజాతీయాక్షరాల సమితియే ఉంటుంది కావున, ‘r’ అక్షర సంఖ్య గల ఛందస్సులో 2r (2 టుది పవర్ ఆఫ్ r) సంఖ్యతో వృత్తాలేర్పడతాయి. అనగా

ఇలా వరుసగా చూస్తూ పోతే –

26వ ఛందస్సులో 226 = 6, 71, 08, 864 రకాల వృత్తాలేర్పడుతాయి. ఇలా గణిత బద్ధంగా, నియమ బద్ధంగా సాగే ప్రతి ఛందస్సులో ఎన్ని రకాల వృత్తా లేర్పడే అవకాశముందో అన్ని రకాల ఛందస్సులను వృత్తాలను లక్షణకారులు ఇది వరకే తెలిపి ఉన్నారు. ఇవి కాక, ఇంకా జాతులు, ఉప జాతులలో అనేక మాత్రా బద్ద ఛందస్సులను నిర్వచించి ఉన్నారు. దీని వలన, ఎవరైనా కొత్త వృత్తాలను లేక ఛందస్సులను సృష్టించామనుకొన్నా, ఆ వృత్తం అది వరకే ఉండి ఉండే అవకాశం ఉంది. కాకపోతే అన్ని కోట్ల ఛందస్సులను పూర్తిగా తెలుసుకోవడం కష్టం కాబట్టి, ఎవరైన అరుదుగా కనిపించే ఛందస్సును ప్రయోగిస్తే, అది కొత్త ఛందస్సుగా పాఠకులు భావించే అవకాశం ఉంది. గురజాడ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన ముత్యాల సరాన్ని కొత్తగా సృష్టించానను కొన్నారు. రేవణూరి వేంకటార్యుని ‘తురంగ వృత్తం’ పరికించని వారంతా అది నిజంగా కొత్త ఛందస్సే అనుకొన్నారు. కాని ఛందశ్శాస్త్రాన్ని లోతుగా మథించినవారికి ఇందులోని మర్మాలు తెలుస్తాయి.

కాని కొప్పరాజు నరసింహం అలా కాకుండా, నిజాయితీగా ఛందశ్శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసి, ఎవరూ ప్రయోగించని ఛందస్సులను ప్రయోగించి నవ్యతను చూపారు. ఎవరూ ప్రయోగించని ఛందస్సులను ప్రయోగించినా వాటిని తాను సృష్టించానని చెప్పుకోలేదు. పాత ఛందస్సులకు కొత్త పేర్లు పెట్టే ప్రయత్నం చేయలేదు. పాదానికి కనీసం అయిదారు అక్షరాలు కూడా లేకుండా, భావ గర్భితమైన పద్యమెలా వ్రాయగలమని, పూర్వ కవులు స్పృశించడానికి కూడా సాహసించని ఛందస్సులను ప్రయోగించడం కొప్పరాజు నరసింహ కవి ఘనత. ముఖ్యంగా ‘శ్రీ వృత్తం’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాదానికి ఒకే ఒక దీర్ఘాక్షరం ఉండే ఈ వృత్తాన్ని కవి ఎలా రూపొందించాడో చూడండి.

“శ్రీ

కో

టీ

శా!”

సుప్రసిద్ధ పరిశోధకులు, చారిత్రికులు ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి ఈ కావ్యాన్ని గురించి వ్రాస్తూ, “ఛందో వైవిధ్యము కలదు. అందు శ్రీ అను ఏకాక్షర పద్యము అపూర్వ విశేషము” అని ప్రస్తుతించారు.

ఇదే విధంగా తెలంగాణంలో రంగరాజు కేశవరావు అనే కవి రచించిన ‘ఇంద్రద్యుమ్నాయము’ క్రీ.శ. 1870వ దశకంలో విరచితం) లో అనేకమైన విశిష్ట ఛందస్సుల ప్రయోగాలున్నాయి. అలాగే, అప్పటికి వాడుకలో లేని ఛందో విశేషాలు, వృత్తాలు సందర్భానుసారం వాడి పండితులను మెప్పించిన మరోకవి గోపీనాథం వేంకట కవి. క్రీ.శ. 1887లో ఈయన రచించిన ‘రామాయణము’, ‘శిశుపాల వధ’ కావ్యాలు, ఈయన విద్వత్తును విశదపరుస్తాయి.

19వ శతాబ్ది చివరి దశకంలో ఇదే స్ఫూర్తితో విస్తారమైన ఛందో వైవిధ్యాన్ని, నవ్యతను ప్రదర్శించిన మహా కవి బ్రహ్మశ్రీ కొక్కండ వేంకట రత్న శర్మ. ‘ఆంధ్ర భాషా సంజీవని’ పత్రికా సంపాదకులుగా, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితులుగా ప్రసిద్ధులైన ఈ పండిత కవి తమ ‘బిల్వేశ్వరీయము’ కావ్యంలో అనేకమైన విశిష్ట ఛందస్సులతో బాటు ‘బంగారము’, ‘వెండి’ వంటి ఎప్పుడూ కనీ, వినీ, ఎరుగని నవ్య ఛందస్సులను ప్రయోగించి నవ్యతకు పట్టం కట్టారు. ఆచార్య సి. నారాయణరెడ్డిగారు ఇదే విషయాన్ని ఉటంకిస్తూ – “బిల్వేశ్వరీయము, కుమార నృసింహము వంటి జటిల కావ్యములు రచించిన వీరు సీసము మొదలైన పద్యములకు ఉజ్జీగా వెండి, బంగారము మొదలైన పేర్లతో క్రొత్త వృత్తములను సృష్టించుట చరిత్రలో సరిక్రొత్త ప్రయోగము” అని పేర్కొన్నారు.

ఈ కవి 1893లో వెలువరించిన బిల్వేశ్వరీయ ప్రబంధంలో ఇంతకు ముందు వివరించిన ‘శ్రీ’ వృత్తాన్ని కూడా పలుమార్లు ప్రయోగించారు. కొప్పరాజు నరసింహకవి లాగే ఈ కవి కూడా ఈ పద్యాన్ని సంబోధనకే వినియోగించారు.

ఉదాహరణకు –

“శ్రీ

బి

ల్వే

శా!

అట్లాగే –

ల్యా

ణే

శా!

ఈ ఏక దీర్ఘాక్షర ఛందస్సును తొలుత ప్రయోగించిన కొప్పరాజు నరసింహ కవి కన్న కొక్కొండ వేంకట రత్నం కవి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఏక లఘ్వక్షర ఛందస్సును కూడా తొలిసారిగా ప్రయోగించి నవ్యతకే నవ్య భాష్యం చెప్పారు. ‘క్షితి’ వృత్తమనే ఈ పద్యాన్ని చూడండి.

శి

వు

ను

మరొక ఉదాహరణ –

వి

ని

కొక్కొండ వెంకటరత్నం పంతులు రెండవ ఛందస్సు (అత్యుక్త) లోని ‘జిన’ వృత్తాన్ని కూడా తొలిసారి ప్రయోగించారు. అది ఇలా ఉంది.

అను

చున

మును

కొని

ఇది రెండక్షరాల పాదాలతో కూడుకొన్న ఛందస్సు కాబట్టి ఇందులో ప్రాస నియమం కూడా పాటించబడింది. అయితే ఇలా కనీసం మూడు, నాలుగు అక్షరాలైనా లేని పాదాల పద్యాలను పూర్వ కవులు స్పృశించడానికి కూడా సాహసించని దశలో ఇలాంటి పద్యాలను రచించడం నిజంగా ఒక సాహసమే. కొక్కొండ కవి ఇవే గాక ఈ కావ్యంలో ఇంకా భూనుత వృత్తము, చంద్రవదన, చంద్రమౌళి, ప్రభాతము, సరసిజ, పంక్తి, శశివదన, కుసుమ విచిత్రము, కవి కంఠ భూషణము, లక్ష్మి, శత పత్రము, వసంత తిలకము, భూతిలకము, మత్త కీరము, కుసుమిత లతా వేల్లిత, వన మంజరి, భ్రమర విలసితము, ఫలసదనము, లలిత పదము, మదన విలసితము, అలసగతి, చంద్రశ్రీ, సుముఖి, చంద్రిక, లలిత, స్వాగతము, రుక్మవతి, కమల విలసితము, బ్రహ్మ, క్రౌంచ పదము, పద్మనాభము, నారాయణ, మాకందము, వాణి, గౌరి, విద్యున్మాల, శివ, అమృత వాహినీ, రమాకందము, మహాకందము, రుచిరము, గర్భ తను మధ్య, తను మధ్య, ప్రియకాంత, తోటకము, మహాస్రగ్ధర, ఇంద్రవజ్రము, ఉపేంద్ర వజ్రము, అభినవ తామరసము, భుజంగ ప్రయాతము, పంచ చామరము, శిఖరిణి, తోదకము, లయగ్రాహి, సుగంధి, కవిరాజ విరాజితము, మాలిని, ఉత్సాహము, డమరుకము, వన మయూరము, స్రగ్ధర, తాండవ వృత్తము, మంజు భాషిణి, సతి, కమలాకర వృత్తము, శంకర, పరమేశ, పథ్యా కందము, విపులా కందము, ముఖ చపలాకందము, సహజ కందము, అర్థ సమవృత్తము, స్రగ్విణి, తుల్య, కల్యాణ వృత్తము, ప్రమితాక్షర, కాంతి, మానిని, సాయంవృత్తము, ద్రుత విలంబితము, ప్రహరణ కలితము, అశ్వగతి, కరి బృంహిత, రథోద్ధత, నిశా వృత్తము, దోదకము, ప్రభాకలితము, మణి భూషణము, పృథ్వి, బిల్వవృత్తము, మౌక్తిక మాల, సభా వృత్తము, ప్రహర్షిణి, నలిని, శోభన మహాశ్రీ, సుభగ, డిండిమ, జాగ్రద్వృత్తము, జాగ్రజ్ఞాతి, మందాక్రాంత, ప్రభువృత్తము, ప్రియంవద, గాయక వృత్తము, సువర్ణ పద్య రత్నమాలిక, లఘు రత్నావళి, గురు రత్నావళి, మహా గురు రత్నావళి, సుకాంతి, గణనాథ వృత్తము, సంజ్ఞా వృత్తము, భాస్కర విలసితము, సలిల వృత్తము, ఏకావళి, జ్ఞాన వృత్తము, రత్నావళి, శివశంకర వృత్తము, దేవ వృత్తము, దేవ జాతి, మనోహర వృత్తము, మనోహర జాతి, మంజరి, మణిమంజరి, సన్నుత వృత్తము, మంగళమణి, ఉత్సాహ జాతి, ప్రకృతి జాతి, పురుష జాతి, ప్రకృతి వృత్తము, పురుష వృత్తము, శ్రీమతి వృత్తము, మహా మంగళ మణి జాతి, తన్వీ వృత్తము, మణి మాల, నవ నందిని, మణి దీప్తి, వామదేవ వృత్తము, యశస్వి, పుష్పితాగ్ర, శంభునటన, తారక వృత్తము వంటి సుమారు 140 రకాల విశిష్ట వృత్తాలను విస్తృతంగా వినియోగించి, ఛందోవైవిధ్యంలో బిల్వేశ్వరీయ ప్రబంధాన్ని నభూతో నభవిష్యతిగా తీర్చిదిద్దారు. ఇందులో కొన్ని ఛందస్సులను పూర్వకవులు ప్రయోగించినా అవి స్వల్పమే. వీటిలో చాలా ఛందస్సులను కొక్కొండ వెంకట రత్న శర్మ కవి దిగ్గజం మొట్ట మొదటి సారిగా ప్రయోగించి నవ్యతకు పట్టం కట్టారు. కవి వీటిలో చాలా ఛందస్సులకు లక్ష్య, లక్షణ సమన్విత పద్యాలను రచించి, పాద సూచికలలో అందించారు. ఉదాహరణకు ‘మంగళమణి’ వృత్త లక్షణాన్ని అదే ఛందస్సులో కొక్కొండ వారు రచించి ఇలా పాద సూచికలో పొందు పరిచారు.

మంగళ మణి:

మంగళ మణి జాతియవును – మాత్ర లిరువదే!

నంగుగ బదు మూడవదే యతి యవుదుదగా!

మంగళ మణి వృత్తమవు సమ గణముగ – మహా

మంగళ మణి రుద్ర ద్వయ మాత్రల నహహా!

ఇలా కవి తెలుగు సాహిత్యంలో తానే తొలిసారిగా ప్రయోగించిన అనేక ఛందస్సులకు అందించిన లక్ష్య, లక్షణ సమన్విత పద్యాల నన్నింటినీ పేర్కొంటూ పోతే పరిశోధన అవధులు దాటుతుందన్న భయంతో విరమిస్తున్నాను.

ఇవే కాకుండా అనేక గర్భిత పద్యాలను, బంధ పద్యాలను ఈ కావ్యంలో కొక్కొండ వారు అందించారు. వాటిలో ముఖ్యంగా పేర్కొన దగింది ‘తురీయ పాదోద్ధార రథ బంధము’. కవి తేటగీతి ఛందస్సులో రచించిన ఈ పద్యాన్ని రథబంధంగా చిత్ర రూపంలో కూడా చూపారు. అది ఇలా ఉంది.

తేట గీతి:

శ్రీశ నృశరీర సింహాస్య కేశ వాహ

రీ శతానంద వంద్య మహేశ సేవ్య

సేవనమ్మే మొనర్తుము శ్రీలు గోరి

యీ మెదలు శ్రీ నృసింహ మమ్మేలు మేలు

4వ పాదంలోని ‘శ్రీ నృసింహ మమ్మేలు మేలు’ అన్న భాగం రథ బంధం మధ్యలో నిలువుగా రావడం

విశేషం.

అంతే కాకుండా –

కం॥

“నిను నేనన నను నేనన

నిను ననినను, నను ననినను, నేనా నేనా

నననూనుననుని నానే

నెననన నననాను నాన నేనూ ననెనా?”

వంటి ‘న” అనే ఒకే ఒక అక్షరంతో అల్లబడిన ‘ఏకాక్షరి’ పద్యం, అలాగే రెండే రెండు అక్షరాలతో రూపొందే ద్వ్యక్షరి, ఆ విధంగానే త్ర్యక్షరి, చతురక్షరి, పంచాక్షరి, పద్యాలను కూడా కవి ఈ కావ్యంలో అందించారు. ఇంకా, ప్రాసాక్షరాలుగా రెండు, మూడు, నాలుగు అక్షరాలను ప్రయోగించి ద్విప్రాస, త్రిప్రాస, చతుష్ఠాస పద్యాలను కూడా రచించారు.

అలాగే, గేయ ఛందస్సులో కల్యాణ గీతము, నలుగుపాట, ఆనందగీతము, శోభన గీతము, మహా శోభన గీతం, లాలి పాట, పూల బంతులాటపాట, మంగళగీతము వంటి గీతాలను కూడా రచించి, పద్య కావ్యంలో గేయ ఛందస్సులకు ప్రప్రథమంగా స్థానం కల్పించారు. ఇవే కాకుండా బంగారము, వెండి, ఆట బోటి, తేటి, తేటి బోటి వంటి వినూత్న ఛందస్సులను సృజించి ప్రయోగించారు. ఇది నిజంగా నవ్యాతి నవ్యమైన విషయం. ఆ ఛందస్సులకు లక్ష్య లక్షణ సమన్విత పద్యాలను కూడా రచించి, భావిలో ఆ ఛందస్సులను ప్రయోగించాలనుకొనే కవులకు మార్గదర్శకత్వం చేశారు. ఆయా ఛందస్సుల వివరాలిలా ఉన్నాయి.

బంగారము:

ఇంద్ర గణంబు లారిన గణంబులు రెండు

నిందు గణంబొకండిందునుండు – నీక్షింపుడీ!

నాల్గు పాదములిట్లు నల్వొంద తేటియొ

తేటి బోటియొ కూడ వాటముగను – బాటిలెడున్!

బంగారమనగను పద్యంబు హృద్యంబు

సీసమేల సువర్ణ సిద్ధి గలుగ – శ్రీ మించగా!

ప్రణవ గణావళి పరగుట ప్రతిపాద

మందిది ప్రణవ విఖ్యాతి గాంచు – నారయుడీ!

షడ్గణాళి పాద సరణ నొప్పుటను బ్రాసాదమౌగా

సకల సౌమనస్య సారంబు గ్రహియింప జాలు లీలన్

గాంచ తేటి బోటి గానయ్యె నిది వెలిగారమన్నన్

గదిసి చాల గ్రాలగా జేయు నౌర బంగారమున్ శ్రీ!

తేటి :

సూర్యు డాదినె యుండెడు సురపతులన జొప్పడగా

ఇద్ద రటు పిమ్మటన్ రావు లిద్దరుందు రద్దిరయ్య

తేట గీతియె యఙ్ఞప్తి దేటి యగును వాటముగా

జేరి సీసము జేయు బంగారముగను సారముగా

తేటి బోటి:

ఆట వెలది బేసి యడుగుల యట్లేని, యైన నాల్గు

పాదములు మరి, సరి పాదములట్లేని పై యతితో

నజ్జయుక్తి షడ్గణాంఫ్రి యగుటను షడంఘ్రతాప్తిన్

తేటిబోటినాగ తేజరిల్లెడు నిది తేటి వలెన్

ఆట బోటి :

ఇనులు మువ్వు రిద్ద రింద్రులుందురటంచు, నిందుడు నిం

దొనరు యతి ముఖుడయి యొంటి మూట నొందుసరిన్

హంస పంచకంబు యగుడునా పయినట్లే యౌటనిదే

యాట బోటినాగ నాటవెలది – పాటిలెడిన్

వెండి :

వరుస గూడ నాల్గు బంగారు పాదముల్ పైనెసంగ

నలర తేట గీతి, యాట వెలది యదగు వెండి!

సీస పాదములును జెలగ నాల్గపయి జేరిన న

య్యాట బోటి, తేటి, తేటిబోటియగును వెండి!

పై ఛందస్సులను కవి ఈ కావ్యంలో పలుమార్లు ప్రయోగించారు.

మొత్తానికి ఆంధ్ర సాహిత్యంలో నాటికీ, నేటికీ, ఏనాటికీ, వందలాది విశిష్ట ఛందస్సులకు లక్ష్యాలుగా నిలిచే పద్యాలతో కూర్చబడిన ఏకైక గ్రంథంగా కొక్కొండ వారి బిల్వేశ్వరీయ ప్రబంధం నిలుస్తుంది. ఈ విశిష్ట ఛందస్సులలో చాలా మట్టుకు మాత్రా గణాలతో, గేయ గతులతో సాగే పద్యాలుండడం గమనార్హం. ఉదాహరణకు పంతులుగారు రచించిన ఈ ‘తాండవ వృత్తం’ పద్యాలు చూడండి.

అక్షరాత్మకాంక రూప హర్షదోం నమశ్శివాయ

ఉక్షరాట్చతాంగ దేశికోత్తమోం నమశ్శివాయ

మక్షికాయి తామృతాశ మాక్షికోం నమశ్శివాయ

దక్షవామ పార్శ్వ భూత తత్సదోం నమశ్శివాయ

లక్ష సాంఖ్య లక్షణోప లక్షితోం నమశ్శివాయ

వీక్షితాఖిలాఖిలాశ్రితేష్టదోం నమశ్శివాయ

భక్షితోగ్ర కాలకూట భద్రదోం నమశ్శివాయ

శైక్ష నూత సన్మునీంద్ర సంచయో నమశ్శివాయ

ఈ స్తుతి పద్యాలు త్రిపుట తాళంలో హాయిగా పాడుకోడానికి అనుగుణంగా ఉన్నాయి. అంతే కాకుండా కవి ఈ కావ్యంలో కొన్ని గీతాలను కూడా పొందుపరచారని పైన పేర్కొన్నాను. దీనిని బట్టి కవి అక్షర గణ ఛందస్సు నుండి మాత్రా గణ ఛందస్సు వైపు మళ్ళేందుకు ఉత్సాహం చూపారని, ఆ విధంగా ఛందస్సులో కాస్త స్వేచ్ఛను, నవ్యతను కోరుకున్నారని అవగతమవుతుంది. ఇలా 19వ శతాబ్దిలో రేవణూరి వేంకటార్యుడు, వీరేశలింగం పంతులు, కొక్కొండ వెంకటరత్నం పంతులు రచనల్లో అంకురించిన ఈ స్వేచ్ఛా ప్రియత్వమే మరింత విస్తృతమై 20వ శతాబ్దిలో గేయ కవిత్వానికి, మరియు వచన కవిత్వానికి బాటలు వేశాయంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి స్వేచ్ఛా ప్రియత్వాన్ని, నవ్యతను 19వ శతాబ్దిలోనే మరింత ఎక్కువగా ప్రదర్శించిన కవులు మరికొందరున్నారు. వారిలో మండ కామేశ్వర కవి, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కవి ప్రముఖంగా పేర్కొనదగినవారు.

ప్రసిద్ధ హిందీ కవి గోస్వామి తులసీదాసు రచించిన రామాయణ మహా కావ్యం ‘రామ చరిత మానస’ను ఈ ఇరువురు కవులు తెలుగులోకి అనువదించారు. అనువాదం మన పూర్వ కవులలా తెలుగు, సంస్కృత ఛందస్సులలో చేసి ఉంటే చేసి ఉంటే ఇది కోకొల్లలుగా ఉన్న తెలుగు రామాయణాలలో ఒకటిగా మిగిలిపోయేది. కాని ఈ కవుల నవ్యతా దృష్టి, సృజనాత్మక శక్తి దీనిని ఒక విశిష్టమైన నవ్యకావ్యంగా తీర్చి దిద్దేందుకు దోహదమయ్యాయి. తెలుగులో రామచరితమానస కావ్యాన్ని (మొత్తం ఏడు కాండలు) ఈ కవులు తులసీ దాస మహా కవి వాడిన ‘దోహా – చౌపాయి’ ఛందస్సులోనే అనువాదం చేయడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.

సుప్రసిద్ధ హిందీ భాషా విద్వాంసులు, అనువాదకులు కీ.శే. ఆచార్య భీమ్ సేన్ నిర్మల్ ఈ అనువాద కావ్యాన్ని ఎంతో శ్రమకోర్చి, సాధించి, పరిష్కరించి, ఇందులోని సుందర కాండను మాత్రం తమ సంపాదకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి ద్వారా ముద్రింపజేయడానికి కృషి చేసి కృతకృత్యులయ్యారు. మిగతా కాండలకు కూడా ముద్రణ భాగ్యం కల్పించాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరకుండానే ఆయన పరమపదించడం శోచనీయం.

ఆంధ్ర తులసీ రామాయణము (సుందర కాండము) గ్రంథానికి పరిచయ వాక్యాలు వ్రాస్తూ, ఆ గ్రంథ సంపాదకులు ‘నిర్మల్’ గారు ఇలా వివరించారు.

“సంపూర్ణ రామచరిత మానసాన్ని (ఏడు కాండలను) తులసీదాసు వాడిన దోహా – చౌపాయి పద్ధతిలోనే అనువాదం చేసిన ఘనత శ్రీ శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, మండ కామయ శాస్త్రి గార్లదే. వీరిద్దరూ కలసి చేసిన అనువాదాన్ని గురించి ప్రప్రథమంగా శ్రీ తిరుమల రామ చంద్ర గారు ‘పరిశోధన’ (జూన్ · జూలై 1956) పత్రికలో ‘నివేదిత’ అనే మారు (కలం) పేరుతో ఒక వ్యాసంలో వ్రాశారు. నేను వరంగల్లులో ఉండగా డా. కేతవరపు రామకోటి శాస్త్రి గారి వద్ద ఆ వ్యాసాన్ని చూడడం సంభవించింది. దానిలో మానసానువాద వ్రాత ప్రతి ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరి, మద్రాసులో ఉన్నట్టుగా వారు తెలిపారు. ఇంకో ప్రతి విజయనగరం మహారాజా గారి లైబ్రరీలో ఉన్నట్లుగా వారు తెలిపారు. నేను ఆ విషయం పూజ్యులు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారితో చెప్పగానే, వారు. ఆం. ప్ర. సాహిత్య అకాడమి ద్వారా శ్రీ పి.వి.జి. రాజు గారికి ఉత్తరం వ్రాశారు. శ్రీ రాజు గారు వెంటనే ఆ వ్రాత ప్రతిని పంపించారు. ఆ వ్రాత ప్రతి చాలా శిథిలావస్థలో ఉండడంతో శ్రీ దేవులపల్లి రామానుజారావుగారు దాని శుద్ధ ప్రతి వ్రాసే బాధ్యత నాకున్నూ, శ్రీ ఎస్. వి. శివరామశర్మగారికి అప్పగించారు. మద్రాసులో ఉన్న వ్రాత ప్రతులన్నీ తిరుపతిలో ఉన్న ప్రాచ్య లిఖిత భాండాగారానికి తరలించబడగా శ్రీ శివరామశర్మగారు తిరుపతిలో 15 రోజులు ఉండి తాము వ్రాసిన శుద్ధ ప్రతిని, అక్కడి వ్రాత ప్రతితో సరిపోల్చి చూసి వచ్చారు. కారణాంతరాల వల్ల మానసాంధ్రానువాదం ముద్రణ భాగ్యానికి నోచుకోలేకపోయింది. పూజ్యులు శ్రీ దేవులపల్లి రామానుజారావు గారిని నేను పదే పదే అభ్యర్థించడంతో చారిత్రిక ప్రాధాన్యం గల ఈ అనువాదంలో ‘సుందరకాండ’ ప్రచురించడానికి వారు అంగీకరించారు. తత్ఫలితంగా, సహృదయులైన తెలుగు పాఠకులకు ఈ అనువాదాన్ని గురించి తెలియజేయాలన్న నా అభిలాష నెరవేరింది.”

ఆ విధంగా ఆ మహా కావ్యంలోని ఏడు కాండాల్లో కేవలం సుందర కాండం మాత్రమే ముద్రణ భాగ్యానికి నోచుకొంది. మిగతా భాగాలు నిర్మల్ గారు పరమపదించే వరకు కూడా ముద్రణ పొందలేదు. అయితే నిర్మల్గారు తమ జీవిత పర్యంతం ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. దురదృష్టమేమంటే దేవులపల్లి రామానుజారావుగారు పరమపదించాక ఆ మిగితా భాగాల వ్రాత ప్రతులు ఏమయ్యాయో తెలియలేదు. ఈ విషయం నిర్మల్ గారు తమ చివరి రోజుల్లో స్వయంగా చెప్పారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

నేను కార్గిల్ యుద్ధంపై రచించిన నా దీర్ఘ కవిత ‘విజయ విక్రాంతి’ హిందీ అనువాదానికి ఆచార్య భీమ్ సేన్ నిర్మల్ గారితో పీఠిక వ్రాయించుకోడానికి, ఆయన జీవన సంధ్యలో కలవడం జరిగింది. అప్పటికే ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అయినా ఆ సమయంలో ఆయన ఎంతో దీక్షతో ‘రామచరిత మానస్’ తెలుగు అనువాదాన్ని పరిష్కరిస్తున్నారు. అంతకు ముందే ‘సుందర కాండం’ గ్రంథాన్ని చూసినవాణ్ణి కాబట్టి, “అవి శిష్టు కృష్ణమూర్తి, మండ కామయ్య శాస్త్రాల ఆంధ్ర తులసీ రామాయణం మిగతా భాగాలా?” అని అడిగాను. దానికి ఆయన కాదని, ఆ వ్రాత ప్రతి ఎక్కడ ఉందో తెలియలేదని, దాని ఇంకో ప్రతి కొరకు తిరుపతిలోని ప్రాచ్య లిఖిత భాండాగారంలో కూడా ప్రయత్నించానని, అది కూడా అక్కడ లభ్యం కాలేదని చెప్పారు. ప్రస్తుతం తాను చూస్తున్నది ఆయాచితుల హనుమచ్ఛాస్త్రి అనే మరొక కవి విరచిత అనువాదమని ఆ కవి శిష్టు కృష్ణమూర్తి, కామయ్య శాస్త్రిల తరువాతి కాలంవాడై, 19వ శతాబ్ది చివరి భాగంలో ఉండి ఉంటాడని చెప్పారు. ఆశ్చర్యమేమంటే ఆ కవి కూడా శిష్టు కృష్ణమూర్తి, మండ కామయ్య శాస్త్రిలలాగే దోహా – చౌపాయి ఛందస్సులలోనే రచించారు. నిర్మల్ గారు ఆ వ్రాతప్రతిని పరిష్కరించి, గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ వారికి ముద్రణార్థం అప్పగించారు. అయితే నిర్మల్ గారు పరమపదించాక, అది కూడా ముద్రణకు నోచుకున్నట్లు లేదు. ఇటీవల వారి అమ్మాయి శ్రీమతి బి. వాణి గారిని కలిసి వ్రాత ప్రతి కొరకు అడిగినప్పుడు ఆమె ఎంతో సహృదయతతో వెదికి, అయోధ్యకాండం వ్రాత ప్రతిని సాధించి నాకు పరిశీలనార్థం అందజేసారు.

చెప్పొచ్చేదేంటంటే శిష్టుకృష్ణమూర్తి, మండ కామయ్యశాస్త్రిల స్ఫూర్తితో అయాచితం హనుమచ్ఛాస్త్రి కవి హిందీ ఛందస్సులలో అనువాదం చేసి ఉంటారు. ఈ కవి తనను తాను శ్రీ తులసీ రామాయణం – ఛందోనువక్తగా పేర్కొన్నాడు. ఆ విధంగా ఈ ఛందోనవ్యతను సాధించిన కవుల జాబితాలో శ్రీ అయాచితం హనుమచ్చాస్త్రిని కూడా చేర్చవచ్చు.

మరో విషయం – శిష్టు కృష్ణమూర్తి, మండ కామయ్య శాస్త్రాల కర్తృత్వంలో కూడా కొంత అయోమయం నెలకొంది. ఆచార్య భీమసేన్ నిర్మల్ గారి సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురణ ‘ఆంధ్ర తులసీ రామాయణం’ (సుందరకాండం) కవరు పేజీ పై “తులసీదాసు రామచరిత మానస్ తెనుగు సేత శ్రీ శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి” అని ఒక్క పేరే ఉంది. కాని లోపలి పేజీల్లో నిర్మల్ గారి వ్యాఖ్య ఇలా ఉంది.

“H.H. Maharaja of Vijayanagaram వారి లైబ్రరీలో లభించిన వ్రాతప్రతిలో కొన్ని కాండాల చివరలో – ‘ఇది వ్రాసినది ముక్కామల రుక్మేశ్వరశాస్త్రి’ అని ఉన్నది. కవరు పేజీ మీద ‘రామ చరిత మానస సరోవరము’ అని ఉన్నది.

ఈ వ్రాత ప్రతిలో అయోధ్య కాండం (పూర్తిగాను), అరణ్యకాండంలో మారీచ వధ వరకు మాత్రమే శిష్టు కృష్ణమూర్తి శాస్త్రిగారు రచించారు. బాల కాండం, అరణ్య కాండ శేష భాగం. సుందరకాండం మండ కామయ్య గారు రచించారు. కిష్కంధాకాండాంతంలో మండ నరహరికృతమని ఉన్నది. యుద్ధకాండాంతంలోనూ, ఉత్తర కాండాంతంలోనూ అనువాదకుడి పేరే లేదు.”

పై విషయం గ్రహిస్తే ఒక సందేహం తలెత్తక మానదు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ముద్రించింది సుందరకాండ ఐతే కవరు పేజీ మీద దాని కర్త మండ కామయ్య శాస్త్రి పేరు ముద్రించక కేవలం శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి పేరే ముద్రించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే కిష్కింధకాండ కర్త మండ నరహరి అని ఉంటే, నిర్మల్ గారు మండ నరహరి, మండ కామయ్యశాస్త్రి ఒక్కరేనని తేల్చారు. చాలా మంది పండితులు దీనితో విభేదించలేదు. కాని నరహరి, కామయ్యశాస్త్రి ఒక్కరు కానక్కర లేదు. శిష్టు కృష్ణమూర్తితో కర్తృత్వాన్ని పంచుకొన్నట్లే, తన బంధువో, సోదరుడో, తనయుడో అయిన మండ నరహరికి మండ కామయ్య శాస్త్రి ఒక కాండం రచన బాధ్యత అప్పగించి ఉండవచ్చు కదా! ఆంధ్ర మహాభారతాన్ని కవిత్రయం అనువదించినట్లు, కృష్ణమూర్తి శాస్త్రి, కామయ్య శాస్త్రి, నరహరి కవి అనే కవిత్రయం ఈ తులసీ రామాయణాన్ని అనువదించి ఉండవచ్చు కదా! ఏమైనా దీనికి తగిన ఆధారాలు లేవు. నిర్మల్ గారు గ్రంథంలో తన పరిచయ వాక్యాల్లో ఇలా అన్నారు.

“శ్రీ మండ నరహరి లేక కామయ్యశాస్త్రి గారిని గురించి వివరాలు ఏమీ తెలియవు. ‘మండ’ వంశీకులు విజయనగరంలోనూ, ఆ చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఎక్కువగా ఉన్నారు. మండ వంశీయులు విజయ నగర సంస్థానంలో ఆస్థాన కవులుగా ఉండేవారట.”

మాత్రా బద్ధంగా సాగే హిందీ ఛందస్సులను తెలుగులో ప్రవేశపెట్టి 19వ శతాబ్దిలోనే గణనీయమైన ఛందో నవ్యతను సాధించిన ఈ కవులు ఎవరెవరైనా, ఎంతమందైనా, మొత్తానికి వీరు సాధించిన నవ్యత ఎలా ఉందో పరిశీలిద్దాం.

ముందుగా తులసీదాసు మూలంలో అనుసరించిన ఛందస్సు పద్ధతులను పరిశీలిద్దాం. ఈ పద్ధతిని హిందీ సాహిత్యంలో ‘దోహా – చౌపాయి’ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో 5 చౌపాయిలు (ఈ సంఖ్యా నియమంపై పెద్ద పట్టింపు ఉండదు – కవి సడలించుకోవచ్చు) రచించిన పిదప ఒకటి (లేదా రెండు) దోహాల చొప్పున రచించడం జరుగుతుంది. తులసీదాసు అక్కడక్కడా దోహాబదులు ‘సోరఠా’ అనే ఛందస్సును వాడాడు. అలాగే కావ్యంలో అక్కడక్కడా ‘ఛంద్’ అనే పేరుతో వర్ణవృత్తాలు వాడాడు. అనువాద కవులు కూడా ‘దోహా – చౌపాయి’ పద్ధతిని పాటించి, అక్కడక్కడా ‘సోరఠా’, ‘ఛంద్’ అనే ఛందస్సులను కూడా ప్రయోగించారు.

చౌపాయి:

ఇది నాలుగు పాదాల రచన. ఒక్కొక్క పాదంలో 16 మాత్రలుంటాయి (అప్పుడప్పుడు 15 లేక 17 ఉండవచ్చు. మూలంలో కూడ ఈ సడలింపులున్నాయి). రెండు రెండు పాదాలకు అంత్యప్రాసలుంటాయి. పాదాంత విరతిని పాటించాలి.

తులసీదాసు రచన :- అయోధ్య కాండం – 134 భాగంలో 2వ చౌపాయి.

దోహా:

ఇది కూడా నాలుగు పాదాలతో ఉంటుంది. బేసి సంఖ్యా పాదాలలో (అనగా ఒకటి, మూడు పాదాలలో) 13 మాత్రలుంటాయి. (కొన్ని సందర్భాలలో 14 లేక 12 మాత్రలు వేయవచ్చు) సరి సంఖ్యా పాదాలలో (అనగా 2 మరియు 4వ పాదాలలో) 11 మాత్రలుంటాయి (కొన్ని సార్లు 12 లేక 10 మాత్రలు కూడా ఉండవచ్చు). సరి సంఖ్యా పాదాలకు అంత్యప్రాసలుండాలి. బేసి సంఖ్యా పాదాలను ‘జగణం’తో ప్రారంభించకూడదు. అన్ని పాదాలలో పాదాంత విరతి ఉండాలి.

తులసీదాసు రచన:- (సుందరకాండము – 3వ దోహా)

సోరఠా:

‘దోహా వుల్టా సోరఠా’ అని నియమం. అంటే బేసి సంఖ్యా చరణాలలో 11 మాత్రలు,

సరి సంఖ్యా చరణాలలో 13 మాత్రలు. అయితే సరి సంఖ్యా పాదాలకే అంత్యప్రాసలు పాటించాలి. కవి అక్కడక్కడా బేసి సంఖ్యా పాదాలకు కూడా అంత్యప్రాసలు వేశాడు. పాదాంత విరతి ఉండాలి.

తులసీదాసు రచన : (అయోధ్య కాండంలో 226వ సోరఠా)

ఛంద్:

ఇందులో నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలో కాస్త అటూ ఇటూగా 28 మాత్రలుంటాయి.

మొదటి రెండు పాదాలకు అలాగే మూడు, నాలుగు పాదాలకు అంత్యప్రాసలుంటాయి. పాదాంత విరతి పాటించాలి.

తులసీదాసు రచన : (సుందరకాండం 3వ భాగంలో 1వ ఛంద్)

ఇప్పుడు ఇవే పద్యాలకు అవే ఛందస్సులలో మన తెలుగు కవుల అనువాదాలను పరిశీలిద్దాం.

తెలుగు చౌపాయి:

అయాచితుల హనుమచ్ఛాస్త్రి రచన – ‘శ్రీ తులసీ రామ చరిత మానస’లో అయోధ్యాకాండంలో 134వ చౌపాయి – దోహా భాగంలో రెండవ చౌపాయి :-

తెలుగు దోహా:

మండ కామయ్య శాస్త్రి రచన – ఆంధ్ర తులసీరామాయణం. సుందరకాండంలో 27వ పద్యం.

తెలుగు సోరఠా:

అయాచితుల హనుమచ్ఛాస్త్రి రచన (అయోధ్య కాండంలో 226వ పద్యం).

తెలుగు ఛంద్:

మండ కామయ్య రచన సుందరకాండంలో 24వ పద్యం.

ఈ విధంగా మూల భావాలను ప్రప్రథమంగా యథాతథమైన హిందీ ఛందస్సులలో అనువదించి అలవోకగా మంచి ధారతో రక్తి కట్టించారు మన తెలుగు కవులు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పాదాంత విరతి మన తెలుగు ఛందస్సులకు లేదు కాబట్టి, తెలుగులో ఈ హిందీ ఛందస్సులను ప్రయోగించేప్పుడు ఆ నియమాన్ని ఈ కవులు తప్పనిసరిగా పాటించలేదు. కొన్నిసార్లు ఒక పాదంలో నుండి ఇంకోపాదంలోకి చొచ్చుకు వెళ్ళేట్టుగా పదాలను ప్రయోగించారు. అలాగే హిందీ ఛందస్సులలో ఉన్న అంత్యానుప్రాసలను పాటిస్తూనే, తెలుగులో సహజమైన ప్రాసనియమాన్ని మండ కామయ్యశాస్త్రిగారు పాటించారు. ఆ విధంగా హిందీ ఛందస్సులను తెలుగులో ప్రయోగించేప్పుడు శాస్త్రిగారు ఇంకా అదనంగా నియమాలను జోడించుకొని రచించారన్నమాట. ఏమైనా మన వృత్త పద్యాల కన్న జాతుల కన్న ఎంతో స్వేచ్ఛతో కేవలం మాత్రాబద్ధంగా సాగే ఈ ఛందస్సులను గురజాడ ముత్యాలసరం కన్న ఎంతో ముందు 19వ శతాబ్దిలోనే ప్రవేశపెట్టి, 20వ శతాబ్దిలో విస్తృతంగా వచ్చిన గేయ కవిత్వానికి స్ఫూర్తి నిచ్చిన కవులు మండ కామయ్య శాస్త్రి, శిష్టు కృష్ణమూర్తి మరియు అయాచితం హనుమచ్ఛాస్త్రి.

ఆ విధంగా 20వ శతాబ్ది నవ్యకవిత్వ యుగంలో మాత్రాగణాలతో వివిధ గతులలో గురజాడ, రాయప్రోలు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి, ఆరుద్ర, సినారె ప్రభృతులు వెలార్చిన గేయ ఛందస్సులకు బీజం 19వ శతాబ్దిలోనే పడిందని అంగీకరించక తప్పదు.

(ఇంకా ఉంది)

Exit mobile version