Site icon Sanchika

‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-7

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

VIII. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో ప్రక్రియా పరమైన నవ్యత – రెండవ భాగం

గ్రుడ్డి గుర్రము మీద కీర్తన

గ్రుడ్డి గుర్రాన్నీయడు వడ్డాణపు శాలుగప్పి

ఒక దిడ్డిన స్వారైతే అడ్డా?

గుణ శోభనాద్రి రాజ నృపాలా!

కమ్మవారి హయము కమ్మగ భోంచేసి

డమ్ములోదులు వెనుక డాచె కాని

ముందు చూడ కాస్త రొమ్మైన లేదురా!

నమ్మ జాలదు శోభనాద్రి నృపాలా!

అది గ్రుడ్డిది – ఇది నడ్డిది

పద్దెనిమిది పరగణాల ప్రభువిచ్చినదా?

అదె యందురు పుడమిని నదరాగదు

చూడగ రణ విద్దరి శోభనాద్రి నృపాలా!

గుర్రాన్నీవలె దొరా !

కరాళించేది, మంచి కాహల దిరిగేది

మిర్రయిన ఎత్తు గలదిగ

కుర్రది గాకుండ మంచి కోడెది గాగ!

~

ఇదిలా ఉండగా ఉర్దూ సాహిత్యంలో బహుళ ప్రచారంలో ఉన్న ‘గజల్’ ప్రక్రియ 19వ శతాబ్ది ఉత్తరార్ధంలోనే తెలుగు సాహిత్యంలో ప్రవేశించిందన్న విషయం కూడా తెలుస్తున్నది. తెలుగు అకాడమి వారు ప్రచురించిన ‘తెలుగు సాహిత్య కోశము’లో ఈ విషయం ఉటంకించబడింది. “గజల్, డోరా, తొహరా మొదలైన ఫార్సీ మట్లు 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో తెలుగు దేశంలో ధార్వాడ నాటక సమాజం వారి నాటకాలకు ప్రచారం వచ్చిన కాలంలో తెలుగు సారస్వతంలో ప్రవేశించాయి” అని అందులో పేర్కొనబడింది. అయితే 20వ శతాబ్దిలో డా. దాశరథి, ఆచార్య సి. నారాయణ రెడ్డి తదితరులు రచించిన గజళ్ళకు, వీటికి ప్రక్రియాపరంగా ఏమైనా భేదముందేమో వివేచించవలసి ఉంది.

ఏదేమైనా 19వ శతాబ్దిలో గేయ కవిత్వం ఇలా వినూత్నమైన మార్పులు చెంది కొత్త కొత్త పుంతలు తొక్కి, 20వ శతాబ్దిలో బహుళ ప్రసిద్ధినొందిన లలిత గేయ రూపకల్పనకు దారి తీసిందని చెప్పవచ్చు.

పద్య కావ్యం, ఖండ కావ్యం, గేయ కావ్యం వంటి రూపపరమైన ప్రక్రియలతో బాటు 19వ శతాబ్దిలో వస్తుపరమైన నవ్య ప్రక్రియలు కూడా తొలిసారిగా రూపుదిద్దుకొన్నాయి. వాటిలో ప్రధానంగా వ్యంగ్య కావ్యం, స్మృతి కావ్యం, యాత్రా చరిత్ర, జీవిత చరిత్ర, స్వీయ చరిత్రలను పేర్కొనవచ్చు.

వ్యంగ్య కావ్యం:

తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి వ్యంగ్య కావ్యం కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన ‘అభాగ్యోపాఖ్యానం’. క్రీ.శ. 1876లో ఈ తొట్ట తొలి వ్యంగ్య కావ్యం ఆవిర్భవించింది. ఈ ప్రబంధ రచన లక్ష్యాన్ని తమ స్వీయ చరిత్రలో వివరిస్తూ పంతులుగారు- “శృంగార ప్రబంధములు చేయు మేలు కంటే కీడెక్కువగా నుండు నన్న భావమునకు వచ్చిన వాడనగుట చేత ప్రబంధ ప్రణీత్ఫ పంథాను పరిహసింపవలెనన్న యుద్దేశ్యముతో నభాగ్యోపాఖ్యానమును చేసితిని” అని వ్రాసుకొన్నారు.

హితకారకం కాని సామాజికాంశాన్ని గాని లేక సాహిత్యాంశాన్ని గాని పరిహాసం చేస్తూ నవ్వు పుట్టించే విధంగా చేసే రచనను ‘వ్యంగ్య రచన’ అని చెప్పవచ్చు. దీనిని ఆంగ్లంలో ‘సెటైర్’ అని అంటారు. దీనికి ‘పేరడీ’ అనగా ‘వికట కవిత్వా’నికి కొంత భేదముంది. ఇదివరకే వచ్చిన ఒక రచనను అపహాస్యం చేస్తూ, మూలంలోని వస్తువుకు భిన్నమైన ఒక రకంగా చెప్పాలంటే అల్పమైన వస్తువుతో నవ్వు పుట్టించే విధంగా చేసే రచన ‘పేరడీ’ అనబడుతుంది. రెండింటిలోనూ నవ్వు పుట్టించడం సాధారణమైనా, పేరడీకి అంతకు మించి ప్రత్యేకమైన ఆశయం ఉండనవసరం లేదు. కాని వ్యంగ్య రచనకు ఆ రచనలోని వ్యంగ్య వైభవం ద్వారా, అహితమైన సామాజికాంశం గురించి గాని లేక సాహిత్యాంశం గురించి గాని కను విప్పు కలిగించే ఉదాత్త ఆశయం ఉంటుంది.

కొందరు ఈ భేదాన్ని గమనించకుండా 18వ శతాబ్దిలో కూచిమంచి జగ్గకవి రచించిన ‘చంద్ర రేఖావిలాపము’ను మొదటి వ్యంగ్య కావ్యంగా పేర్కొంటున్నారు. అది తిట్టు (అధిక్షేప) కావ్యం అవుతుందే కాని వ్యంగ్య ప్రబంధం కాజాలదు.

పూసపాటి విజయరామరాజు బావమరిది చింతల పాటి నీలాద్రిరాజు సత్కారం చేస్తానని చెప్పి జగ్గకవిని ఒక కావ్యం వ్రాయమని కోరాడట. జగ్గకవి ‘చంద్రరేఖావిలాస’ మనే ప్రబంధాన్ని రచించి ఇచ్చాడట. అయితే నీలాద్రి రాజు అన్న మాట నిలబెట్టుకోకుండా, తిరస్కరిస్తే కవి కోపించి, అతనిని దూషిస్తూ ‘చంద్ర రేఖా విలాసము’ నకు వ్యతిరేకంగా ‘చంద్ర రేఖా విలాపము’ అనే బూతు కావ్యాన్ని రచించాడని ప్రచారంలో ఉంది. డా. వెలుదండ నిత్యానందరావు భావించినట్లుగా, ఇది “మొట్ట మొదటి పద్యం మొదలుకొని చిట్ట చివరి పద్యం వరకు బహుశా మనకు దొరకని చంద్రరేఖా విలాసానికి ప్రతి పద్య వికృతీకరణం కావచ్చు”. ఆ విధంగా ఈ దూషణ కావ్యాన్ని ‘వికట ప్రబంధం’గా (పేరడీ)గా అంగీకరించడంలో ఎటువంటి ఆక్షేపణ ఉండదు. కాని దీనిని వ్యంగ్య ప్రబంధంగా పేర్కొనజాలం.

ఇలాంటి రచనలు 19వ శతాబ్దిలో కూడా కొన్ని కనిపించక పోవు. 19వ శతాబ్ది ప్రారంభంలో పిండిప్రోలు లక్ష్మణ కవి రచించిన ‘లంకా విజయము’ అందులో ఒకటి. దీనికి ‘రావణ దమ్మియము’ అని నామాంతరముంది. ధర్మారాయుడనే వెలమ కులస్థుడు కవి గారి లంక నేలను కొంత ఆక్రమిస్తే, అతనిని రావణునితో, క్షేత్రాపహరణను రామాయణ కథతో పోల్చి, కవి ద్వ్యర్థి కావ్యంగా దీనిని రచించాడు. మచ్చునకు అందులోని రెండు పద్యాలను పరిశీలిద్దాం.

ఏడు పందు ముల్లోకంబు లెరుగ లంక

నేల కొల పర క్షేత్రాప్తి మేలు గాదు –

పేర్మి నా భూమిజాత సంప్రీతి తోడ

వీడు – మదియె సౌఖ్యము లిచ్చు – వేయు నేల?

~

జ్యేష్ఠుడా లక్ష్మణాగ్రజ క్షేత్ర మీవు

వదలకుండిన మోసంబు వచ్చునింక –

జండ నిర్భీక వనాచారి పిండిప్రోలి

కవికుల వరుతో రిపుత ముఖ్యముగ వలదు!

ఒక వంక స్వీయ బాధ – మరొక వంక రామాయణ గాథ – వ్యక్తమయేలా కవి రచించిన ఈ పద్యాలు పండితుల ప్రశంసల నందుకొన్నాయి. కవి తన గురించి తాను చెప్పుకొంటూ భీమకవి, శ్రీనాథులు కూడా తనలా తిట్టలేరని వివరించాడు. ఆ విధంగా ఈయన తిట్టుకవిగా బహుళ ప్రసిద్ధుడు. అందుకే ‘రావణ దమ్మియము’ తిట్టు కావ్యంగా రాణించింది.

అలాంటిదే మరొక కావ్యం- ‘ఖల కర్ణ విషయనం’. దీని రచయిత పన్నాల సీతారామబ్రహ్మయ్యశాస్త్రి. ఈయన కందుకూరి వీరేశలింగం గారికి సాహిత్య విద్యా గురువులు. సంకుసాల నృసింహ కవి రచించిన ‘కవి కర్ణ రసాయనం’ కావ్యనామానికి ప్రతిగా ఈయన తన కావ్యానికి ‘ఖల కర్ణ విషాయనం’ అని నామకరణం చేశారు. క్రీ.శ. 1820-1900 మధ్య జీవించిన ఈ కవి ‘కూచిమంచి గోపాలకృష్ణమ్మ’ అనే జమీందారుపై కోపించి, అధిక్షేపిస్తూ చేసిన రచన ఇది.

అయితే ఇవన్నీ ఆయా కవులు, వారి కోపాగ్నికి గురైన వ్యక్తులను నిందిస్తూ చేసిన వ్యక్తిగత దూషణ కావ్యాలే అవుతాయి. కాని వీరేశలింగం పంతులు రచించిన ‘అభాగ్యోపాఖ్యానం’ అలాంటిది కాదు. సాహిత్యంలో పతనావస్థకు చేరుతున్న ప్రబంధశైలిని నిరసిస్తూ, కవులకు కనువిప్పు కలిగించేలా, వ్యంగ్య వైభవంతో ఒక సామాజిక (సాహిత్య) ప్రయోజనాన్ని ఆశించి చేసిన రచన, ఇదే విషయాన్ని డా. వెలుదండ నిత్యానందరావు ఇలా వివరించారు.

“కూచమంచి జగ్గకవికి ‘చంద్రరేఖా విలాప’ రచనతో వ్యక్తిగత ఆక్రోశాన్ని, తనకు లభించలేదన్న కసిని తీర్చుకోవడమే ప్రధానశయం – కందుకూరిది ధర్మాగ్రహం – వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించింది కాదు. సాహిత్యం వైవిధ్య రహితమై, గతానుగతికమైపోతోందన్న ఆవేదన ఆయనది. అందుకే విమర్శిస్తూ వ్యాసం రాయకుండా – జవసత్యాలు కోల్పోయిన ప్రబంధ లక్షణాలను ‘అభాగ్యోపాఖ్యానం’ (1876) ద్వారా అతిశయింప జేసి మరింత అవహేళన చేశాడు. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా వెలిగిన ప్రబంధ ప్రక్రియ కాల ప్రవాహంలో ఎంతగా దిగజారిపోయిందో, ఎటువంటి జీవ చైతన్యం చూపలేని దశకు చేరుకుందో కందుకూరి అమిత శక్తిమంతంగా నిరూపించాడు. ఈ రచన కేవలం ఆవేశం వల్ల రచించింది కాక సాహిత్య ప్రగతి కోసం చేసింది. అందుకే జగ్గకవిలోని బండ బూతులు, వ్యక్తి నిందలు అభాగ్యోపాఖ్యానంలో కనిపించవు. సభ్యత మీరని పలుకుబళ్ళతో పఠితృలోకానికి ఆనందాన్ని కలిగిస్తుంది ఇది. కాల గమనాన్ని గుర్తించి, తమను హెచ్చరిస్తున్న రచనగా కందుకూరి అభాగ్యోపాఖ్యానాన్ని చదువరులు ఆదరిస్తారు.”

ఇక ‘అభాగ్యోపాఖ్యానం’లోని వ్యంగ్య వైభవమెలాంటిదో పరిశీలిద్దాం. అసలు ఆ ప్రబంధ నాయకుని పేరే ‘అభాగ్యుడు’గా ఉంచి కందుకూరి వారు ఈ ప్రబంధంలో వ్యంగ్యానికి నాంది పలికారు.

ప్రబంధంలో ఆదిలో సాధారణంగా పురవర్ణన ఉంటుంది. కథాగమనానికి ఆలవాలమైన నగరాన్ని అప్లైశ్వర్యాలతో తులతూగుతున్నట్లుగా అది స్వర్గానికి ప్రతిరూపంగా వర్ణించడం కవులకు పరిపాటి. అందుకు వ్యతిరేకంగా గొడ్డుపోయి, జలం లేని పాడుకొలను దగ్గర దండకారణ్యం మధ్యలో ఉన్న పాపులసదనంగా పురాన్ని వర్ణించారు కవి.

“వింధ్య ధాత్రీధర ప్రాంత వంధ్య భూమి

జలము లేనట్టి యొక పాడు కొలను దరిని

దండ కారణ్య మధ్యంబు దనర జేయు

పాప సదనము వ్యాఘ్రాఖ్యా పట్టణంబు”

అంతే కాదు. అక్కడి ప్రజల కుటిలత్వ స్థాయికి ఓడిపోయి పాములన్నీ పాతాళానికి వెళ్ళిపోయాయని చమత్కరిస్తారు కవి మరో పద్యంలో.

“అన్నగరంబున గరమ

భ్యున్నతి వహియించు కుజన పుంగవ కౌటి

ల్యోన్నతి కోడుట గాదే

పన్నగ కులమెల్ల జేరె పాతాళంబున్”

ప్రబంధాల్లో ఆ తరువాతి ఆ నగరంలోని చాతుర్వర్ణ్య వ్యవస్థను వర్ణిస్తుంటారు. సాధారణంగా అయితే అక్కడి బ్రాహ్మణులు బృహస్పతితో సమానులని, వైశ్యులు లాభాపేక్ష లేకుండా న్యాయ సమ్మతంగా వ్యాపారం చేసుకొనే ఉదారులనీ, క్షత్రియులు వీరాధివీరులని, శూద్రులు సమాజాభ్యున్నతికై పాటుపడే కష్టజీవులని కవులు గోరంతలు కొండంతలు చేసి వర్ణించడం చూస్తుంటాం. కాని కవి ఈ వ్యంగ్య ప్రబంధంలో – “సారాయి పీపాల కొలది ద్రావి యెడలు తెలియక వీధుల బడెడివారు” బ్రాహ్మణులనీ; “పిరికి తనంబునం బురిని పేరు వహించిన రాజపుంగవుల్” అని క్షత్రియులనీ; “బియ్యమున వడ్ల బెడ్డలు పెక్కు గలిపి తప్పుతూనిక తూచుచు దక్కువగను” కోమట్లు సొమ్ము కూర్చుకొంటారనీ; “జూదముల దొంగతనముల శూరులగుచు శోభగాంతురు పురిలోన శూద్రజనులు” అనీ వర్ణించి అపహాస్యం చేస్తారు. ఇక కథానాయకుడైన ‘అభాగ్య’నామ రాక్ష సాధిపుని వర్ణన మరింత హాస్య స్పోరకం.

“వాని దుష్కీర్తితో వాసి చెందగ బూని

కుందుచు చీకట్లు గుహలనడగె

వానిమై బిగితోడ వాదులాడగ బూని

ఖడ్గ మృగంబులు కాన డాగె

వాని చాపలముతో బ్రతి బొందగా బూని

వానర జాలంబు వనము దూరె

వాని మాంద్యముతో సమానంబు రాబూని

దున్నలు బురదలో దొర్లదొడగె.

వాని క్రౌర్యంబుతో దినుసూన బూని

జడిసి వ్రాఘ్రంబు లడవిలో సంచరించె

వాని కంఠస్వరంబుతో వాదు పూని

పొరలె గార్దభ బృందంబు బూదిలోన”

అటువంటి రాక్షసరాజు ఒకరోజు వేటకు ప్రయాణమౌతాడు.

“ముడ్డి యెండి యున్న మొద్దు గుర్రము మీద

కదలకుండ నెక్కి కాళ్ళు నేల

దగుల గూరుచుండి తక్కిన వారలు

వెనుక జేరి తోల వెడలె నతడు”

ఇక ఆపైన కవి అనేక హాస్య సన్నివేశాలను కల్పించారు. ఉదాహరణగా ఈ చంపూ ప్రబంధంలోని హాస్యరసపూరితమైన ఈ వచనాన్ని గమనించండి.

“ఇట్లు భట శ్వానంబులు బెదరి చెదరిన రాక్షసాధ్యక్షుండు రూక్ష వీక్షణుండయి కుర్కుర, మర్కట, మార్జాల, శశకాద్యనేక క్షుద్ర మృగ కులంబుల బొలియించి మృగయా వినోదంబు సలుపు చుండ నొక్కచో నొక తరుక్షువు వీక్షించి తురంగంబు భయాకులాంతరంగంబయి యికిలించుచు నపరాష్ట్ర సమయంబున సరోవర సమీపంబున బురద నేల నతనిం గూలవైచి చనిన యనంతరంబ, యింతకుమున్న విట్చరంబుచే దరుమంబడి యచ్చట డాగి యున్న భృత్యుండొకరుండు చనుదెంచి లేవనెత్తిన..”

ఆ పైన “శునక రోదనంబు గతి, సూకర నాదము భంగి, గార్దభ స్వనము విధంబులనన్ బ్రబల సైరిభ రావము పోల్కి దవ్వులన్” వినబడగా ఒక భృత్యుని పిలిచి వివరాలు కనుక్కొని రమ్మని పంపుతాడు. వాడు ఆ స్వరము ఒక రాక్షస కన్యదని కనుగొని, తన స్వామితో ఆమె కురూపాన్ని వర్ణిస్తూ

“కొమ్మ గాదది మేటి పెద్దమ్మగాని

బాల గాదది యముచేతి కోలగాని

కన్నె గాదది బలిసిన దున్న గాని

నారి గాదది జనులకు మారి గాని –

~

అట్టి కనియయును నీవు ననగి పెనగి

కనరు లేనట్టి మమతల గలసిరేని

యెందు నీత చెట్టు పయి కోరింద తీగె

యల్లుకొను రీతిగాదె యో యమరవైరి!”

అని ప్రోత్సహించడం ఒక వైచిత్రి. అప్పుడు చెలునితో పాడుబడ్డ గుడి వద్ద ఉన్న ఆమె చెంతకు వెళ్ళి, ఆమె చేయిని వెనుక నుండి వెళ్ళి పట్టుకోగానే, అతని ముందరి పండ్లు రాలేట్టుగా ఎడమకాలితో ఆమె తన్ని గర్భగుడిలో దాగుకొంటుంది. ఆ తరువాత ఆమె దూతిక యొకదాని సహాయంతో అభాగ్యుడు ఆమెను సుముఖం చేసుకొని, గుడి లోపల రమిస్తుంటాడు. ఆ సమయంలో సుఖాంతమవుతుందనుకొన్న ఈ హాస్య ప్రబంధంలో ఆమె భర్త పాత్రధారి ప్రవేశించి గుడి తలుపులు బద్దలు కొట్టి, లోన ఉన్న ఆ ఇరువురికి దేహ శుద్ధి చేయడం ప్రబంధంలోని వ్యంగ్యానికి పరాకాష్ఠగా నిలుస్తుంది.

“ఒదిగి వడకుచున్న యుష్ట్రయానను, రాక్ష

సాధమునిని జూచి యలుక తోడ

వీసె గుద్దులొకట వేనవేల్ కురిపించి

కొప్పు జుట్టు బట్టి గుంజి యీడ్చి

~

వెలుపలికి దీసికొని వచ్చి వీపు మీద

ముఖము మీదను, మెడ మీద ముక్కు మీద

మణుగు గుద్దుల వానలు మచ్చు చూపి

పిండి పెట్టి రభాగ్యుని నిండుగాను.”

ఇలా ఆసాంతం నవ్వులతో ముంచెత్తుతూ, ఒకే మూసలో నిర్వీర్యమైన పద్ధతిలో వస్తున్న ఆనాటి క్షీణ ప్రబంధాల శైలిని వెటకారం చేసి, తద్వారా కవులు తమ పద్ధతి మార్చుకోవాలని చెప్పకయే చెప్పారు వీరేశలింగం పంతులు.

ఆ విధంగా 19వ శతాబ్దిలో వెలువడిన ‘అభాగ్యోపాఖ్యానం’ మొట్ట మొదటి వ్యంగ్య కావ్యమై వెలసింది. కందుకూరి వారు ఆ ప్రకారంగా తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలతో బాటు వ్యంగ్య కావ్య ప్రక్రియను కూడా ప్రవేశ పెట్టిన ఆద్యులుగా నిలిచారు.

స్మృతి కావ్యం:

ఇది కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగు సాహిత్యంలో ప్రవేశించిన ప్రక్రియ. ఆంగ్లంలో ఈ ప్రక్రియను ‘ఎలిజీ’ అంటారు ఆత్మీయమైన వ్యక్తి గతించినపుడు, కలిగే వియోగ వేదనను కవితాత్మకంగా ప్రకటించే ప్రక్రియ ఇది. వడ్డాది సుబ్బారాయుడు కవి (వసురాయ కవి) రచించిన ‘సతీ స్మృతి’ (క్రీ.శ. 1896) తెలుగు సాహిత్యంలో తొలి స్వతంత్ర స్మృతి కావ్యంగా పేర్కొనవచ్చు.

అంతకుముందు వావిలాల వాసుదేవ శాస్త్రి ‘పిత్రారాధన’ (క్రీ.శ. 1877); ‘మాతృ స్వరూప స్మృతి’ (క్రీ.శ. 1879) వంటి రచనలు చేశారు. వాసుదేవ శాస్త్రి గారి తండ్రి క్రీ.శ. 1897లో పరమపదించారు. శాస్త్రిగారు 1877లో ‘పిత్రారాధన’ వెలువరించే నాటికి ఆయన తండ్రి జీవించి ఉండడం వలన, అది ప్రశంసా పద్యాల కృతి అవుతుందే కాని, స్మృతి కావ్యం కాజాలదు. అలాగే శాస్త్రిగారు రచించిన ‘మాతృ స్వరూప స్మృతి’ తమ మాతృమూర్తిపై రచించిన కావ్యం కాదు. దీనికి ‘మాతృ పటము’ అన్న నామాంతరం కూడా ఉంది. ఇది ఆంగ్లంలో విలియమ్ కౌపర్ అన్న కవి రచించిన ‘ఆన్ రిసీట్ ఆఫ్ మై మదర్స్ పిక్చర్’ అన్న పద్య ఖండికకు తెలుగు సేత. కాబట్టి ‘మాతృ పటము’ స్మృతి కావ్యం అని గట్టిగా చెప్పలేము. అయితే, గియితే అది కౌపర్ రచించిన ఆంగ్ల స్మృతి కావ్యానికి తెలుగు అనువాదం కావచ్చు. ప్రస్తుతానికి ఆ కృతి అలబ్ధం కాబట్టి వివరాలు తెలియవు.

కాని వడ్డాది సుబ్బారాయుడు కవి ‘సతీస్మృతి’ అలాకాదు. ఆయన పత్నీ వియోగం పొందినప్పుడు వేదనతో వ్రాసుకొన్న స్మృతి పద్య సమాహారం ఆ కావ్యం. ఆయన తరువాతి కాలంలో ‘సుత స్మృతి’ అనే మరో స్మృతి కృతిని కూడా రచించారు.

సుబ్బారాయుడు కవి వ్యక్తిగత జీవితాన్ని గురించి టేకుమళ్ళ కామేశ్వరరావు ఇలా వివరించారు.

“ఆయన కుటుంబ జీవితం దుఃఖ భాజనమయింది పాపం! అనేకసార్లు భార్యావియోగం సంభవించింది. అయిదు కంటే ఎక్కువ వివాహాలు జరిగినట్లుంది. మనస్సు చివరకు రాయే అయిపోయిందేమో పాపం! దానికి తోడు మొదట పుట్టిన కొడుకు పెండ్లయి మరణించేడు పాపం! ఆ వియోగ బాధను పద్యాలలో తెలుపుకొన్నారు.”

కాబట్టి తెలుగు సాహిత్యంలో తొలి సారిగా స్మృతి కావ్యాలను రచించిన కవిగా వడ్డాది సుబ్బారాయుడును నిర్ధారించవచ్చు. ఆయన తన భార్యలు పరమపదించినపుడు, ఆ దుర్ఘటన సందర్భాలలో వియోగ బాధను అనుభవించి, ఆవేదనానుభూతులను పద్యాలుగా రచించి, తరువాత వాటినన్నిటినీ కూర్చి 19వ శతాబ్ది చివరి దశకంలో స్మృతి కావ్యంగా వెలువరించారు.

‘సతీస్మృతి’ కావ్యం మొత్తం నాలుగు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో కవి ‘సుబ్బలక్ష్మి’ అనే తన పెద్ద భార్య మరణించినప్పుడు రచించిన పద్యాలున్నాయి. రెండవ భాగంలో ‘విజయ లక్ష్మి’ భార్య పరమపదించినప్పుడు వ్రాసిన పద్యాలున్నాయి. ఈ భాగంలో ముందు కొన్ని పద్యాలు ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ‘క్షేమారోగ్యము లిచ్చి మద్విజయ లక్ష్మిం బ్రోవు సర్వేశ్వరా!’ అన్న మకుటంతో రచించిన పద్యాలతో ప్రారంభించి, తరువాత ఆమె మరణించాక ‘క్షేమారోగ్యము లీక మద్విజయలక్ష్మింగొంటి సర్వేశ్వరా!’ అన్న మకుటంతో గల పద్యంతో ముగించారు. మూడవ భాగానికి ఆయన ‘ప్రేయసీ రత్న తారావళి’ అని నామకరణం చేశారు. ఈ భాగంలో ఆయన మూడవ భార్య ‘రత్నాంబ’ మరణించినప్పుడు రచించిన పద్యాలను పొందుపరిచారు.

ఈ పద్యాలలో ఆయన ‘ప్రేయసీ రత్నమా!’ అన్న మకుటాన్ని ప్రయోగించారు. ఇక నాలుగవ భాగం ఆయన నాలుగవ భార్య ‘అన్నపూర్ణ’ చనిపోయినప్పుడు రచించినది. కవి ఈ భాగాన్ని ముందుగా తాను రచించిన, ‘భామినీ విలాసము’ అనే జగన్నాథ పండితరాయల కృతికి అనువాద గ్రంథమైన ‘కరుణ విలాసము’ అనే భాగానికి అనుబంధంగా ముద్రించారు. దీనికి కారణం ఆరెంటిలో గల విషయ సారూప్యమే. ‘భామినీ విలాసము’ మూలంలో జగన్నాథ పండిత రాయలు కరుణ విలాసం భాగంలో తన ధర్మపత్ని మరణానికి చింతిస్తూ వ్రాసిన శ్లోకాలున్నాయి. దాని అనువాద గ్రంథంలో అనుబంధంగా చేర్చిన ఈ ‘సతీస్మృతి’ (నాలు గవభాగం) లో మళ్ళీ నాలుగు భాగాలున్నాయి. ‘ప్రథమ విలాపము’, ‘ద్వితీయ విలాపము’, ‘తృతీయ విలాపము’, ‘తురీయ విలాపము’ అని వీటికి పేర్లు పెట్టారు కవి. వీటన్నింటిలో కూడా ‘అన్నపూర్ణా సతీ’ అన్న మకుటాన్ని పాటించారు కవి. నాలుగవ భార్య స్మృతితో రచించిన ఈ నాలుగవ భాగమే ఒక ప్రత్యేక స్మృతి కావ్యంగా నిలబడగలదు. అయితే తరువాత వసురాయ కవి తన ప్రథమ ద్వితీయ, తృతీయ కళత్రాల స్మృతి పద్యాలతో ఈ నాలుగవ భాగాన్ని చేర్చి ‘సతీ స్మృతి’ కావ్యంగా రూపుదిద్దారు. ఈ కావ్యంలోని పద్యాలను గాఢమైన భావాలతో నింపి దీనిని కవి ఒక చక్కని స్మృతి కావ్యంగా రూపు దిద్దారు.

“చంద్ర కళ యస్తమింప నక్షత్ర సమితి

కతన గగనంబు రూపింత గానబడెడు –

దేవి! నీ వస్తమింప నే దిక్కులేమి

దివ్వె మలిగిన గతి నిల్లు తిమిరమయ్యె!”

~

“నాకు సతివయి, కను సన్నలనె యిష్ట

మెరిగి చరియింప, నేమి గొరంత లేని

దాన వనుకొనుచుండ, బ్రధానమైన

యాయువే నీకు గొదవయ్యెనా? మృగాక్షి”

వంటి పద్యాలు అందుకు ఉదాహరణలు. తన పత్ని నాటిన తీయ మామిడి మొక్కకు కన్నీరే గాని స్వచ్ఛమైన నీరెలా పోయను? – అంటూ వాపోతూ కవి రచించిన ఈ పద్యం హృదయ విదారకం.

“ఘనమని పుట్టినిల్లు కలగంపుడి పోలవరంబు నుండి టెం

కను గొని వచ్చి నాటితివిగా తియమామిడి మొక్క; నేనెటు

ల్పొనరుతు మాతృహీన శిశు పోషణ మక్కట! దీని కింక వె

చ్చని కను నీరే గాక, సఖి! స్వాదు తరాచ్ఛ వయస్సు వచ్చునే?”

మరొక కరుణ రసాత్మకమైన పద్యాన్ని చూడండి –

“తొండ చూలాలొండు దువ్వి లోతుగ నేల

దావ కాళ్ళను నిల్చు తలము వాడు

బలె బంగటించి యా పల్లాన నెన్నేని

గుప్ప వోసిన యట్లు గ్రుడ్లు వెట్టి,

కడుపు దోర్రేలాడ గడు సొమ్మసిలి కాన్పు

బడలిక నిముస మక్కడన యుండ –

దాని యాయువు సెల్లె గానోపు, నాడట్లు

వాయసుండొకడట్టె వచ్చి దాని

~

ముక్కునను జిక్క బట్టి కొంపోవ, జూచి

కంట దడి వెట్టి తీ వంత కంటే శోచ్య

ముగను నిన్ను నేడెత్తుక పోయె మిత్తి;

యాసలన్నియు నడుగంటె – హా! లతాంగి!”

కవి తన మూడవ భార్య రత్నాంబ గురించి వ్రాసిన ఒక పద్యంలో ఆమె సాహిత్యాభినివేశం స్పష్టమవుతుంది.

“కవిత జెప్పెడు వేళ గడు దాపున వసించి

యెలమితో వ్రాయు వారెవ్వరిపుడు?

పాఠాంతరంబుగా బద్యద్వయి రచింప

హెచ్చు దగ్గించు వారెవ్వరిపుడు?

లలిత మంగళ హారతుల జేయ, వరుసలం

దిచ్చి కోరెడు వార లెవ్వ రిపుడు?

కఠినంబులైన వాక్యముల కర్థము నన్ను

నవ్వుచు నడుగు వారెవ్వరిపుడు?

~

ద్విపదగా నే నొనర్చు సావిత్రి చరిత

మెపటి దపు డప్పగించు వారెవ్వరిపుడు?

ప్రేయసీ రత్నమా! యొంటరిగ నొనర్చి

నాక పురికేగి, మరల రానైతి విపుడు!”

నాలుగవ భార్య ‘అన్నపూర్ణ’ మరణించినపుడు ఆయన ఆవేదనను గమనించండి –

“తాళింగట్టితి హేమలంబిని సముత్కంఠన్ మెడన్; శార్వరిం

బాళిం గట్టితి గోక కొంగునను హేమంబుల్, ప్లవాబ్దంబునన్

శైల ప్రాయ కఠోర చిత్తత బటచ్ఛన్నాస్య గావించి యి

ల్లాలిం బాడెను బెట్టి కట్టెదనె నిన్? హా! యన్న పూర్ణా సతీ!”

నిరంతఱం సారస్వతారాధనలో గడిపే మహాకవి వడ్డాది సుబ్బారాయుడు. కవికి నాలుగు మార్లు భార్యావియోగం సంభవించడం దుర్భరం. నిజంగా పగవానికి కూడా కలగగూడని కష్టం. ఆయన నాలుగవ భార్య చనిపోయినప్పుడు – “నీవు రేపవలు కవితాలతాంగితో జతగూడి సుఖ, కీర్తులను పొందగా చూచి సహించలేక నీ భార్యలు నిన్నెడబాసిరి” అని ఆయన మిత్రుడొకడు ఈ క్రింది పద్యంలో చమత్కారానికి వ్రాసినా, అది సత్యమేనేమో అనిపించకమానదు.

“వర కవితాలతాంగి ననవద్యమతిన్ గవగూడి, రేవగల్

చిరతర సౌఖ్య కీర్తులను జెందుచు దమ్మొక రీతి జూడ, నీ

సురుచిర గాత్ర లందరది చూచి సహింపగ లేక గాదె దు

ర్భర తర చింత తోడ నెడబాసిరి మిమ్ముల నిట్లు మిత్రమా!”

తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగంలో వెలువడిన అనేక స్మృతి కావ్యాలకు ఆద్యమై నిలిచిన ‘సతీ స్మృతి’ కావ్యం, వాసిలో గూడ అగ్రగణ్యమై నిలిచిందని చెప్పక తప్పదు.

జీవిత చరిత్ర, స్వీయ చరిత్రలు:

19వ శతాబ్దికి పూర్వం తెలుగు సాహిత్యంలో ‘కేయూర బాహు చరిత్రము’, ‘సారంగధర చరిత్రము’, ‘మైరావణ చరిత్ర’, ‘మల్హణ చరిత్ర’, ‘తోభ్య చరిత్రము’ వంటి కావ్యాలు ఉన్నా, అవి కావ్య కథాంశాన్ని బట్టి నాయక పాత్రకు చెందిన చరిత్ర భాగాన్ని కొంత వరకు కల్పనలతో రచించినవే తప్ప చారిత్రిక దృక్పథంతో వ్రాసిన సమగ్ర చరిత్రలు కావు. 19వ శతాబ్దిలో మొట్ట మొదటి సారిగా ఇలాంటి ప్రయత్నం చేసిన కవి – కర్నూలు నరహరి రాజామణి శెట్టి. ఈయన తన తండ్రి గారైన ‘నరహరి గోపాల కృష్ణమ చెట్టి’ జీవిత చరిత్రను ఒక శతక కావ్యంలో పొందుపరిచారు. గోపాలకృష్ణమ చెట్టి సుప్రసిద్ధ రచయిత. ఈయన ‘శ్రీరంగరాజు చరిత్ర’ అనే నవలను రచించాడు. తెలుగు సాహిత్యంలో ఇదే మొట్టమొదటి నవలగా (1872) చాలా మంది పండితులు భావిస్తున్నారు. అయితే కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన ‘రాజ శేఖర చరిత్ర’ (1878) ఆ తరువాత రచింపబడినా, కథా సంవిధానంలో, శైలిలో మెరుగైనది కాబట్టి, దానిని తొలి నవలగా మరికొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టరుగా పని చేసిన గోపాలకృష్ణమ చెట్టి చరిత్రను స్వయంగా ఆయన కుమారుడే రచించడం వల్ల ఇది చారిత్రిక వాస్తవాలతో సమగ్రంగా రూపొంది, ఆధునిక పద్ధతిలో రచింపబడిన తొలి జీవిత చరిత్రగా గుర్తింపబడింది. అంతే కాకుండా ఇది శతక రూపంలో వెలువడ్డ తొలి జీవిత చరిత్ర అని పండితుల అభిప్రాయం.

“సకల భూపాల రింఛోళ చక్రవర్తి

క్షీర సత్కీర్తి గోపాల కృష్ణమూర్తి”

అన్నమకుటంతో వ్రాయబడ్డ ఈ ‘గోపాల కృష్ణమూర్తి శతకం’లో కవి నరహరి రాజా మణిశెట్టి, ఆనాటి ప్రభుత్వోద్యోగుల ఔద్యోగిక పరిస్థితులు, వారితో ప్రజలకున్న సంబంధాలు, ప్రజలకు వారి పట్ల గల అభిప్రాయాలు, కర్నూలు మండల విశేషాలు మొదలైన అనేక విషయాలను సందర్భానుగుణంగా చాలా ఆసక్తికరంగా చిత్రించారు. క్రీ.శ. 1889లో రచింపబడిన ఈ జీవిత చరిత్ర ఆ తరువాత వచ్చిన అనేక పద్య, గద్య జీవిత చరిత్రలకు మార్గదర్శకంగా నిలిచింది. విజయనగరం ఆనంద గజపతిరాజు ఆస్థానంలో ఉన్న ఈ విద్వత్కవి క్రీ.శ. 1896లో ఆనంద గజపతి తండ్రి గారైన విజయరామ గజపతి మహారాజు జీవిత చరిత్రను ‘విజయ రామ గజపతీంద్ర చరిత్రము’గా పద్యాలలోనే రచించడం జరిగింది. ఆ విధంగా తొలితరం జీవిత చరిత్రలను 19వ శతాబ్దిలో రచించిన ఘనత కర్నూలు నరహరి రాజామణి శెట్టికి దక్కింది.

‘జీవిత చరిత్ర’ ప్రక్రియతో పాటు ‘స్వీయ చరిత్ర’ ప్రక్రియ కూడా తొలిసారిగా 19వ శతాబ్దిలోనే రూపు దిద్దుకొంది. 19వ శతాబ్దిలో విద్వత్కవిగా, బహుగ్రంథకర్తగా ప్రసిద్ధి చెందిన మండపాక పార్వతీశ్వర శాస్త్రి కవి తన స్వీయ చరిత్రను ‘ఆత్మ సపర్యాచర్య’ (1884) పేరిట పద్య రూపంలో రచించారు. ఇదే తొలి స్వీయ చరిత్రగా పండితులు అభిప్రాయ పడుతున్నారు. 20వ శతాబ్ది ఆరంభంలో చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి రచించిన ‘జాతక చర్య’, ఆ తరువాత జాషువా రచించిన ‘నాకథ’ వంటి పద్య రూపంలో ఉన్న స్వీయ చరిత్రలకు మండపాక వారి స్వీయ చరిత్ర మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెళ్ళపిళ్ళ వారు తన స్వీయ చరిత్రకు ‘జాతక చర్య’ అని నామకరణం చేసి, మకుటం ఉంచడంలో కూడా మండపాక పార్వతీశ్వర కవిని అనుసరించారని పేర్కొనవచ్చు. ఆ విధంగా తెలుగు సాహిత్యంలో తొలి ‘స్వీయ చరిత్ర’ను రచించిన కవిగా మండపాక పార్వతీశ్వర కవి మన్ననల నందుకొన్నారు. కవి గారి స్వీయ చరిత్ర ‘ఆత్మ సపర్యా చర్య’లోని ఒక పద్యాన్ని మచ్చుకి ఉదాహరిస్తున్నాను. కవి 1865లో వావిలి వలస జమీందారగు ఇనుగంఠి సీతారామస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ‘వసు చరిత్ర’లోని ఒక పద్యాన్నిచ్చి సంస్కృతంలోకి అనువదించమని కోరిన సందర్భాన్ని వివరించే పద్యమిది.

“సుత నిరామయతకై సూర్యనారాయణ

స్వామిని గని హర్షవల్లి నుండి

వావిలి వలసకు వచ్చి యిన్గంటి సీ

తా రామ విభుగాంచి తత్ప్రతిజ్ఞ

నణచి యా ‘తన్వంగి’ యనెడు వసు చరిత్ర

లోని పద్యమునకు శ్లోకరచన

ప్రతిన నిన్నూట యేబది యారు పద్యముల్

గలుగు షోడశ విధ కంద రచన

~

తత్కవుల కన్న నెక్కుడు ధార గల్గి

వింత యగునట్టి యాశు కవిత్వ రచన

నాకు గల్గించి చెలగించినాడ వౌర

హరి హరేశ్వర దేవ! మహానుభావ!”

మండపాక వారు ఈ స్వీయ చరిత్ర కావ్యంలో ‘హరిహరేశ్వర దేవ! మహానుభావ!’ అన్న మకుటాన్ని పాటించడం విశేషం. అందుకే, ‘ఆత్మ సపర్యా చర్య’ లేక ‘ఆత్మ చర్య’ అన్న పేర్లతో పిలువబడిన ఈ స్వీయ చరిత్రకు హరి హరేశ్వర శతకము’ అన్న నామాంతరం కూడా ఉంది. 19వ శతాబ్దిలో ఆశుకవిగా, శతాధిక గ్రంథకర్తగా ప్రసిద్ధుడైన మండపాక పార్వతీశ్వర కవి (1833-1897) తెలుగు సాహిత్యంలో ప్రప్రథమ స్వీయ చరిత్రకారునిగా గుర్తింపు నొందారు. ఆపైన కందుకూరి వారు వచనంలో తొలి స్వీయ చరిత్రను వెలయించేందుకు స్ఫూర్తిగా నిలిచారు.

యాత్రాచరిత్ర:

19వ శతాబ్దిలో ప్రారంభమైన మరొక మహత్తరమైన ప్రక్రియ ‘యాత్రాచరిత్ర’. ఆంగ్ల సాహిత్యంలో ఉన్న ‘ట్రావల్ – లోర్’ అన్న దానికి సాదృశ్యమైన ప్రక్రియ ఇది. అన్ని ప్రక్రియల లాగే ఈ ప్రక్రియ కూడా 19వ శతాబ్దిలో ముందుగా పద్యరూపంలో రూపుదిద్దుకొంది. ‘చెన్నపురీ విలాసము’ పేరిట క్రీ.శ. 1860లో ప్రబంధాన్ని రచించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కవి మతుకుమల్లి నృసింహశాస్త్రి. తోట వల్లూరు జమీందారైన రాజా బొమ్మదేవర నాగన్న నాయనితో కలిసి ఈ కావ్యకర్త ఆనాటి చెన్నపట్టణాన్ని దర్శించినపుడు చూసిన వింతలు విశేషాలన్నిటినీ ఈ యాత్రా చరిత్ర కావ్యంలో కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి రక్తి కట్టించారు. క్రీ.శ. 1863లోనే ఈ ప్రబంధం ప్రథమ ముద్రణ జరిగింది. ఆ పైన తెలుగు సాహిత్యంలో వెలువడ్డ అనేకమైన గద్యాత్మక, పద్యాత్మక యాత్రాచరిత్రలకు ఇది ఆద్యమై మన్నన లందుకొంది అని చెప్పవచ్చు.

‘చెన్నపురీ విలాసము’ కావ్యాన్ని కవి మొత్తం ఆరు పద్ధతులుగా విభజించారు. స్వరూప పద్ధతి, పూర్వ పద్ధతి, దక్షిణ పద్ధతి, పశ్చిమ పద్ధతి, ఉత్తర పద్ధతి, అంతరాళ పద్ధతి అనే ఈ ఆరు పద్ధతులలో అంతర్భాగాలుగా వీధి ప్రకరణము, సౌధ ప్రకరణము, పౌర ప్రకరణము, వీర భట ప్రకరణము, ఉపవన ప్రకరణము, సముద్ర ప్రకరణము, నౌకా ప్రకరణము, సేతు ప్రకరణము, సభా ప్రకరణము, పుస్తక సౌధ ప్రకరణము, తంత్రీ వార్తా ప్రకరణము, ధూమ శకట ప్రకరణము, ముద్రాక్షర శాలా ప్రకరణము, ఫోటోగ్రాఫీ ప్రకరణము, ఇలెక్ట్రో గేల్వానిక్మిషన్ ప్రకరణము, టంకశాలా ప్రకరణము, వేశ్యా ప్రకరణము, వాణిజ్య శాలా ప్రకరణము మొదలైన 64 ప్రకరణాలున్నాయి. ఈ ప్రకరణాలన్నీ చదివితే క్రీ.శ. 1860 నాటి చెన్నై నగరంలోని స్థితి గతులు మనకు చక్కగా అవగతమవుతాయి.

మహిమ ప్రకరణములో, ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పేర్కొంటూ, ఆ జిల్లాలన్నిటికీ రాజధానిగా వెలసిన చెన్నపురి ప్రాభవాన్ని వర్ణించిన తీరు ప్రశంసనీయం.

“కుంభకోణము, కల్లికోట, కర్ణోలు, బ

ళ్ళారి, చిత్తూరు, సేలంబు, కడప,

కబడాల, బందరు, కనరా, మధుర, తిర్న

వల్లియు, తిరిచెనా పల్లి మరియు

కోయముత్తురు, మంజకుప్పంబు, నాగ, చెం

గల్పట్టు, నెల్లూ రనల్ప పటిమ

వరలు గుంటూరు, బందరును, రాజమహేంద్ర

వరము నాగ, విశాఖ పట్టణంబు

~

ననగ శ్రీకాకుళము, గంజ మనగ బరగు

నిరువదియు రెండు జిల్లాల కిరవు మీరు

రాజ కార్యంబులకు నెల్ల రాజధాని

యా పుర ప్రాభవము భువి నసదృశంబు”

వీర భట ప్రకరణములో, పోలీసుల కవాతులలో తుపాకుల ‘చకచ్చక’ కదలికలను, ఫైరింగులో ‘ఫెళత్పెళ’ ధ్వనులను వర్ణిస్తూ, రచించిన పద్యాన్ని గమనించండి.

“పటిమ బురోపకంఠతట వాటికల న్వడి బార్లుదీరియు

ద్భట సుభటచ్చటాపటల ధాటులు రేపును మాపు బాహు సం ఘటితములౌ తుపాకుల చకచ్చక లొప్ప గవాతు సేయ ని

ష్కుట కుటజ ప్రతిధ్వనిగ ఘార్ణిలు ఫైర్ల ఫెళత్ఫెళ ధ్వనుల్”

నౌకా ప్రకరణములో పొగ ఓడలను ఇలా వర్ణించారు కవి.

“సంఘములై పొగ యోడలు

జంఘాలత బరచు నెపుడు జలనిధి వీచీ

సంఘాత విహృతి లీలా

లంఘన కృత్తిమి తిమింగిలంబుల పగిదిన్”

లైబ్రరీని వర్ణిస్తూ పుస్తక సౌధ ప్రకరణములో –

“ఆ పుస్తక కోశము భువి

భూప స్తవనీయ లీల బొలుపగు కాలే

జీ పేర; నందు లేని మ

హా పుస్తక మభ్ర పుష్పమై తనరారున్”

అని పద్యం చెప్పారు.

ధూమశకట ప్రకరణములో రైలుబండిని వర్ణించిన విధానం ఎంతో రమణీయంగా ఉంది.

“ఘన ఘటా కఠిన ఘర్ఘర ఘోర నిర్ఘాత –

నిర్దోష ఘోషముల్ నింగి ముట్ట –

తతముఖోత్తంభి తోద్దామ ధూమస్తంభ

రంధ్ర నిర్యద్ధూమ రాజి గ్రాల –

క్రమ పరిక్రమ దవక్ర క్రాంత దీక్షక్ర

చక్ర చంక్రమణముల్ చౌకళింప –

ద్రుత జితానిల తార్య దుర్నిరీక్ష్యా చింత్య

చిత్రాతి వేగ మచ్చెరువు సేయ –

~

ధూమ శకట పరంపరతూర్ణ వేగ

దుర్నివారంబులై పర్వు నిర్నిరోధ

వార్షికాంబుద మాలికావళుల మాడ్కి

సుభయ సంధ్యల నగరికి నుత్తరమున

~

అమరులు మున్ను దివ్య మహిమాతిశయంబున గన్న దేవ యా

నములు దివిన్మనోరయమునం జను గామ చరంబులంచు విం

టిమి – యిపుడింగిలీషులు పటిష్ఠత చేసిన రైలు బండ్లు నే

గు మహి మనోజవంబును జిగుర్కొనగా బురి నద్భుతంబుగాన్”

దేవతలు మనోవేగంతో చేసే కామ చరాలను గురించి విన్నాం గాని ఇప్పుడు ఇంగ్లీషు వాళ్ళు మనోజవంతో ప్రయాణించే రైలుబండ్లను తయారు చేశారని కవి తన ఆశ్చర్యాన్ని ప్రకటించారు.

‘ఫోటోగ్రాఫీ ప్రకరణము’ అన్న మరో ప్రకరణంలో కూడా ఇలాంటి భావాన్నే ప్రకటించారు కవి.

“ఛాయాగ్రాహణి యాంజనేయుని తనుచ్ఛాయ వ్వడిన్నిల్సి తా

డాయం దీసె ననంగ వింటి మది చూడ న్యంత్ర పేటిన్ ఘన

ప్రాయాదర్శములందు నీడల బొటోగ్రాఫీ క్రియన్నిల్వగా

జేయం జాలిరి యింగిలీషులు పురిం జిత్రాతిచిత్రంబుగన్”

‘ఇలక్ట్రో గేల్వానిక్మిషన్ ప్రకరణము’లో మతుకుమల్లి నరసింహకవి ‘ఎలక్ట్రిక్ షాక్’ను గురించి వర్ణించి చెప్పిన పద్యాలు మహాద్భుతం.

“కాయము లోని ప్రాణము పెకల్చు మహాలయ కాల కాల కా

లాయ సకాల పాశమున కచ్చపు నెచ్చెలి సర్వ దేహ భృ

త్కాయ నికాయమందు గల ధాతులు పీల్చెడి మారి జిహ్వకుం బాయని తోడు నీడయగు భారపు తంత్రిని ముట్టశక్యమే?

~

కందురీగెల యొక కోటి గరచినట్లు –

కూడి వెయి మండ్ర గబ్బలు కుట్టినట్లు –

దాక మ్రోచేతికిని దెబ్బ దాకినట్లు –

తల్లడిలు ప్రాణములు తంత్రి దాకినంత!”

19వ శతాబ్ది మధ్యస్థ భాగంలో రచించబడిన ఈ యాత్రాకావ్యంలో కవి ఆనాటికి అత్యాధునిక విషయాలను అత్యద్భుతంగా పద్యాలలో వర్ణించి నవ్యతకే నవ్య భాష్యం చెప్పారు. కావ్యంలో చాలా చోట్ల సందర్భానుసారం ఆంగ్ల శబ్దాలను ప్రయోగించి క్రీ.శ. 1860లోనే భాషాపరమైన నవ్యతను కూడా చూపారు మతుకుమల్లి నరసింహ శాస్త్రి కవి.

ఇలా కవిత్వానికి సంబంధించినంత వరకు ఇన్ని రకాల ప్రక్రియలతో బాటు వచన రచనలలో కథానిక, నవల, సాంఘిక వచన నాటకం. విమర్శ, వ్యాసం, కవుల చరిత్ర వంటి అనేక ప్రక్రియలు కూడా 19వ శతాబ్దిలోనే ప్రారంభించబడ్డాయి. అయితే అవి ఈ పరిశోధన పరిధిలోకి రావు గాబట్టి వివరాల్లోకి వెళ్ళడం లేదు గాని, 20వ శతాబ్దిలో ప్రక్రియా బాహుళ్యంతో విస్తరిల్లిన నవ్య కవిత్వంలోని అనేక ప్రక్రియలకు పునాదులు 19వ శతాబ్దిలోనే పడ్డాయన్నది నిర్వివాదాంశమని నొక్కి వక్కాణిస్తున్నాను.

(ఇంకా ఉంది)

Exit mobile version