Site icon Sanchika

‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-8

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

IX. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో పాశ్చాత్య ప్రభావ నవ్యత

[dropcap]క్రీ.[/dropcap]శ. 1000 నుండి మహమ్మదీయుల పాలన భారతదేశంలో వ్యాప్తి అయిన కాలంలో భారతీయ సమాజంలో వచ్చిన మార్పుల కంటె, క్రీ.శ. 18, 19వ శతాబ్దులలో పాశ్చాత్య దేశాల పాలన ప్రారంభమయ్యాక వచ్చిన మార్పులు ప్రత్యేకమైనవి, గణనీయమైనవి. ముఖ్యంగా 19వ శతాబ్దిలో బ్రిటిష్ పాలన సుస్థిరమయ్యాక, మిగతా భారత ప్రాంతాలలాగే, ఆంధ్ర దేశంలో కూడా పెనుమార్పులు సంభవించాయి. ఆధునిక విద్య సాంకేతిక ప్రగతి, పత్రికల ద్వారా విస్తృతమయిన విశ్వ సమాచార పరిజ్ఞానం, మూఢాచారాలపై సదవగాహన, పునర్నిర్వచించబడిన మానవీయ సంబంధాలతో కూడుకొన్న ఈ మార్పులు ఆంధ్రదేశంలోని సామాజిక పరిస్థితులను పూర్తిగా మార్చి వేసాయి. ఈ విషయాలన్నీ ‘19వ శతాబ్దిలో సాంఘిక, రాజకీయ పరిస్థితులు’ అన్న అధ్యాయంలో వివృతమైనాయి. ఆ పరిస్థితులు మన తెలుగు కవిత్వంపై ఎలాంటి ప్రభావం చూపాయో, 19వ శతాబ్ది తెలుగు కవిత్వం పాశ్చాత్య ప్రభావ నవ్యతను ఎలా సంతరించుకొందో ఈ అధ్యాయంలో చర్చిద్దాం. ఈ నవ్యత ప్రధానంగా మూడు కోణాలలో ప్రసరించిందని చెప్పవచ్చు.

  1. పాశ్చాత్య సాహిత్య, సాంస్కృతిక ప్రభావం
  2. పాశ్చాత్య రాజకీయ ప్రభావం
  3. పాశ్చాత్య మత ప్రభావం

ఈ మూడు ప్రధానమైన ప్రభావాలు 19వ శతాబ్ది తెలుగు కవిత్వంపై ఎలా పని చేసాయో, ఒక్కొక్క దానిని గూర్చి వివరంగా ఇప్పుడు పరిశీలిద్దాం.

1. పాశ్చాత్య సాహిత్య, సాంస్కృతిక ప్రభావం:

క్రీ.శ. 1857లో భారతదేశంలో విశ్వ విద్యాలయాల స్థాపన జరిగాక, భారత దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలలాగే ఆంధ్ర దేశంలో కూడా ఆధునిక విద్యాభ్యాసం విస్తృతమై తెలుగువారికి పాశ్చాత్య గ్రంథాలతో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు కవులు, మేధావులు చాలా మంది ఆంగ్ల సాహిత్య గ్రంథాలను, ఆంగ్లేయుల సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆంగ్ల సాహిత్యంలోని క్లుప్తత, విషయ గాఢత, నవ్య ప్రక్రియలు, ఆధునిక సామాజిక పరిశీలన వంటి అంశాలు, ఆధునిక విద్యార్హతలు కలిగిన తెలుగు కవులను విశేషంగా ఆకర్షించాయి. వాటితో స్ఫూర్తి నొందిన ఆనాటి తెలుగు కవులు నవ్య మార్గంలో రచనలు చేయడానికి ఉపక్రమించారు. ముఖ్యంగా ఆంగ్లేయుల సాహిత్యాన్ని, సంస్కృతిని తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి, ముందుగా వారు ఆంగ్ల కావ్యాల అనువాదంపై దృష్టి నిలిపారు. అంతవరకు తెలుగు కవులు అనువాదమంటే ప్రధానంగా సంస్కృతం నుండో లేక ఇతర దేశీయ భాషలనుండో చేసేవారు. కాని, 19వ శతాబ్దిలోనే మొదటిసారిగా తెలుగు కవులు ఒక విదేశీ భాష నుండి అనువాద ప్రక్రియకు పూనుకొన్నారన్నది గమనార్హం.

క్రీ.శ. 1874లో వావిలాల వాసుదేవ శాస్త్రి వెలువరించిన ‘సీజరు చరిత్రము’ అన్న తొలి అనువాద నాటకం, ఆయనే క్రీ.శ. 1879లో రచించిన ‘మాతృ స్వరూప స్మృతి’ అన్న తొలి అనువాద స్మృతి కవిత, క్రీ.శ. 1884లో మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించిని ‘ఆత్మ చర్య’ అన్నతొలి స్వీయ చరిత్ర, క్రీ.శ. 1892లో ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ’ ఆంధ్ర పద్యావళి’ పేరిట విరచించిన తొట్ట తొలి ఖండ కావ్యాలు వంటి రచనలన్నీ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో రూపొందినవే. వీటి గురించి ‘ప్రక్రియా పరమైన నవ్యత’ అన్న అధ్యాయంలో వివరించాను. కాబట్టి చర్విత చర్వణంగా మళ్ళీ స్పృశించవలసిన పని లేదు.

19వ శతాబ్ది ఉత్తరార్థంలో ఆధునిక విద్యావంతులైన తెలుగు కవులను ‘షేక్స్పియరు’, ‘టెన్నిసను’, ‘గోల్డుస్మితు’, ‘షెరిడను’, ‘కౌపరు’ వంటి ఆంగ్ల కవులు ఎంతో ప్రభావితం చేసారు. కందుకూరి వీరేశలింగం పంతులు, వావిలాల వాసు దేవశాస్త్రి, గోపిశెట్టి రామచంద్రరావు వంటి చాలా మంది కవులు పై ఆంగ్ల కవుల రచనలను తెలుగులోకి అనువదించారు. ఈ ఆంగ్ల సాహిత్య గ్రంథాల ఆంధ్రీకరణంలో కూడా అగ్రతాంబూలం కందుకూరి వీరేశలింగం పంతులు గారికే దక్కింది. వావిలాల వాసు దేవ శాస్త్రి ‘షేక్స్పియరు’ రచించిన ‘జూలియస్ సీజరు’ నాటకాన్ని ‘సీజరు చరిత్రము’ పేరిట క్రీ.శ. 1874లోనే రచించినా, క్రీ.శ. 1876లో గాని ముద్రాపణ జరుపలేదు. కందుకూరి వారు క్రీ.శ. 1875లోనే షేక్స్పియరు విరచిత ఆంగ్ల నాటకం ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ను అదే పేరుతో ద్విపద ఛందస్సులో పద్యనాటకంగా రచించ బూనుకొని, కొంత భాగాన్ని తమ ‘వివేక వర్ధని’ పత్రికలో ప్రచురించారు కూడా. అయితే వాసుదేవ శాస్త్రి రచించిన ‘సీజరు చరిత్రము’ పూర్తిగా తేటగీతిలో ఒకే ఛందంలో ఉండడం విమర్శలకు దారి తీయడం వల్ల, తాను కూడా ద్విపదలో ఒకే ఛందంలో రచన చేస్తుండడం ఆయనకు రుచించలేదు. అందుకే దానిని మధ్యలోనే వదలి వేసారు. ఇదే నాటకాన్ని ఆయన తరువాత (క్రీ.శ. 1880లో) ‘చమత్కార రత్నావళి’ పేర ఒక గద్య నాటకంగా రూపొందించడం ఈ అభిప్రాయాన్ని బలపరుస్తుంది.

పంతులుగారు ఇలాగే 1880లోనే షేక్స్పియరు కవి రచించిన ‘మర్చంట్ ఆఫ్ వినీస్’ నాటకాన్ని కూడా ‘వినీసు వర్తక చరిత్రము’ పేర రెండంకాల వరకు ద్విపదలో రచించి పూర్తి చేయకుండా వదలిపెట్టారు. అదే సమయంలో మరో కవి గురజాడ శ్రీరామమూర్తి ఇదే నాటకాన్ని ‘వెనీసు వణిజ నాటకము’ పేర గద్య, పద్యాత్మకంగా రచించారు. ఆ తరువాత వీరేశలింగం పంతులు ఆంగ్ల నాటకాలను గద్యంలోనే అనువదిస్తే నయమని నిర్ణయించుకొన్నారని తెలుస్తోంది.

అయితే ఆయన తనకు బాగా నచ్చిన రెండు ఆంగ్ల పద్య కావ్యాలను మాత్రం తెలుగు పద్య కావ్యాలుగానే అనువదించారు. మొదటిది – ‘జాన్ గిల్ఫిన్’, రెండవది – ‘పథిక విలాసము’.

విలియం కౌపరు కవి ఆంగ్లంలో రచించిన “The diverting history of John Gilpin’ అన్న హాస్య కావ్యాన్ని కందుకూరి వారు ‘జాన్ గిల్ఫిన్’ పేర పూర్తిగా తేటగీతులలో రచించారు. కౌపరు రచన ఆంగ్లంలో Ballad form లో అంటే గేయాత్మక పద్ధతిలో ఉండడం వలన, వీరేశలింగం ఆ పద్ధతికి దగ్గరగా ఉండే తేటగీతి ఛందస్సును స్వీకరించి ఉంటారు. కొంత వరకు వావిలాల వాసుదేవ శాస్త్రి ప్రభావం కూడా పని చేసి ఉండవచ్చు.

వీరేశలింగం పంతులు తమ స్వీయ చరిత్రలో “రాజశేఖర చరిత్రమునకు ముందు కౌపరనెడి యింగ్లీషు కవీశ్వరుడు రచియించిన జాన్ గిల్పినను పుస్తకమును తెలుగులో పద్యములతో చేసితిని” అని తెలియజెప్పారు. రాజశేఖర చరిత్ర రచన క్రీ.శ. 1878 నుండి జరిగింది. అంతకు ముందు (అంటే, 1878కి ముందే) ‘జాన్ గిల్పిన్’ పద్య కావ్యాన్ని ఆయన రచించారని స్పష్టమవుతోంది. ఈ విషయాన్నే ఉటంకిస్తూ డా. అక్కిరాజు రమాపతిరావు “ఆంగ్ల కావ్యముల ననుసరించి తెలుగు కావ్యములుగా వెలసిన వానిలో పంతులుగారు రచించిన నీ జాన్ గిల్ఫిన్ మొట్ట మొదటిది. అనగా నాంగ్ల కావ్యములను తెలుగున ననుసరించి పద్య కావ్యవములుగా ననువదించిన వారిలో పంతులుగారే ప్రథములని యేర్పడుచున్నది.” అని తెలియజేసారు. ఆ విధంగా పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో, 19వ శతాబ్దిలో తెలుగు సాహిత్యానికి కందుకూరి వారి ‘జాన్ గిల్ఫిన్’ కావ్యం ఒక విశిష్టమైన నవ్యతను ప్రసాదించింది.

ఈ హాస్యకృతి ఇతివృత్తం ఇలా ఉంది – జాన్ గిల్పిన్ తన భార్య కోరిక మేరకు వేరే గ్రామంలో వివాహ వార్షికోత్సవం జరుపుకోడానికి అంగీకరిస్తాడు. జాన్ తప్ప మిగతా కుటుంబమంతా బండిలో బయలు దేరుతుంది. జాన్ మాత్రం తన స్నేహితుని వద్ద అరువు తెచ్చుకొన్న గుర్రంపై ప్రయాణం అవుతాడు. వార్షికోత్సవంలో త్రాగేందుకు రెండు సారాయి బుడ్లను కూడా తీసుకొని వెళుతాడు. అయితే ఆ గుర్రం అతివేగంగా పరిగెత్తడం ప్రారంభించి, చూసే వాళ్ళకు జాన్, గుర్రపు స్వారీ పందెంలో పాల్గొంటున్నాడన్న భ్రమను కలుగజేస్తుంది. తన గమ్య స్థానంలో, అప్పటికే చేరుకొన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు చూస్తుండగానే, గుర్రం ఆగకుండా ఇంకా పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ గ్రామాన్ని దాటి, ఆ గుర్రం వెళ్ళి తన యజమాని ఇంటి ముందు ఆగుతుంది. జరిగిన దానికి జాన్ గిల్పిన్ మింగలేక కక్కలేక, తిరిగి అదిలించి వెనుకకు తిప్పగానే, మళ్ళీ అదే వేగంతో పరిగెత్తుతూ, అందరూ చూస్తుండగానే మళ్ళీ గమ్యస్థానాన్ని దాటి ముందుకు సాగిపోతుంది.

పరిస్థితిని అర్థం చేసుకొన్న జాన్ భార్య, ఒక కుర్రవాణ్ణి, తన భర్తకు సాయం చేయుమని బండిలో పంపుతుంది. ఆ కుర్రవాడు జాన్ ఎక్కిన గుర్రం వెనుక వెంటాడుతుంటే చూసే జనులు జూన్ను దొంగగా భావిస్తారు. మరో ఆరుగురు అశ్వికులు “దొంగ దొంగా!” అంటూ అరుస్తూ గిల్పిన్న పట్టుకోడానికి వెంటబడుతారు. మధ్యలో వేగానికి సారాయి బుడ్లు పగిలి, సారా అంతా దారిలో కాలువ కట్టుతుంది. గుర్రం ఎవరికీ అందకుండా పరిగెత్తి, చివరికి జూన్ గిల్పిన్ బయలు దేరిన స్థలంలోనే వచ్చి ఆగుతుంది. ఇదీ కథ.

కందుకూరి వారు హాస్యప్రియులు. ఆయన రచించిన ‘సరస్వతీ నారద విలాపము’, ‘అభాగ్యోపాఖ్యానము’లలో ఆయన పండించిన హాస్య వ్యంగ్య వైభవాలను గురించి ఇంతకు ముందు అధ్యాయాలలో చర్చించడం జరిగింది. సహజంగానే కౌపరు రచించిన కావ్యంలోని హాస్యం ఆయనను ఆకర్షించి ఉంటుంది. ఆ హాస్యాన్ని, ఆంగ్లేయుల సంస్కృతిని కూడా తెలియపరిచే లాగా తెలుగు ప్రజలకు అందించాలని ఆయన ఆశించారు. వేగంగా పరిగెత్తుతున్న గుర్రంపై నున్న జాన్ పరిస్థితిని కందుకూరి వారు వర్ణించిన తీరు చూడండి.

“పగ్గమును, గళ్ళెమును గల్గి పనికి రాక
యల్ల దాటులె వడి బరుగయ్యె గాన
తిన్నగా గూరుచుండ లేకున్న వాడు
గాన, దానిపై నడ్డము గాగ వంగి
రెండు చేతులతో నేక రీతిగాను
బలము కొలదిని జూలును బట్టుకొనియె –
తొల్లి యెన్నడు నా రీతి దురగ మద్ది
యూది పట్టుకో బడ్డది కాదు గాన
దనదు వీపుపై నెద్ది యెక్కెనొ యటంచు
జడిసి మరి మరి యద్భుత పడుచునుండె
దూరముగ బోయె గిల్పిను, దూరముగను
బోయె జుట్టును, టోపి బోడి తలగ;
నతడు బయలుదేరెడి యప్పు డాత్మ యందు
నింత పని సంభవించు నం చెరుగడయ్యె!
గాలి వీవంగ జొచ్చెను, గదల దొడగె
నంగియును బెద్ద ధ్వజ పట మట్లు మిగుల;
కొక్కెములును, గుండీలును గూడ నూడి
తుదకు బైనుండి యంగియు దొలగిపోయె!
……………………………….
……………………………….
కుక్కలరచెను, వీధిలో గుర్రవాండ్రు
పెద్ద కేకలు వైచిరి, పెద్ద వారు
తమ గవాక్షములను జేరి తగిన యట్టు
లయ్యె నంచును గట్టిగా నరచి రకట!”

అయితే, పంతులుగారు ఈ కృతిలో ఆంగ్ల సమాజాన్ని, సంస్కృతిని, వ్యక్తులు, ప్రదేశాల పేర్లను యథాతథంగా ఉంచి, అనువదించడం వల్ల తెలుగు పాఠకులకు కొన్ని సందర్భాలలో కొత్తగా, వింతగా, కొన్ని కొన్ని చోట్ల కొంత ఎబ్బెట్టుగా కూడా తోస్తుంది. ఈ క్రింది పద్యాన్ని చూడండి.

“మనదు పెండిలి నడచిన దినము రేపు;
రెండు గుర్రాల బూన్చిన బండినెక్కి
వేగ ‘నెడ్మాంటను’ న నుండు ‘బెల్లు’నకు
నందరము గూడి పోవుద మందు కొరకు”

ఇందులో “మనదు పెండిలి నడచిన దినము రేపు” అనడం మన తెలుగు నుడికారంలా లేక, ఎబ్బెట్టుగా ఉంది. ‘మన వివాహ వార్షిక పర్వదినము రేపు” అని దాని అర్థం. అలాగే ‘ఎడ్మాంటను’, ‘బెల్లు’ అన్న పదాలను మార్పు చేయకుండా అలాగే వాడారు. ఇంకా, పాశ్చాత్య సంస్కృతిలో ఉన్న ‘ముద్దు పెట్టుకోడం’, ‘విగ్గు ధరించడం’ వంటి విషయాలను యథాతథంగా అనువదించారాయన. ‘విగ్గు’ను ‘కృతక శిఖ’, ‘కల్ల జుట్టు’, ‘మాయ జుట్టు’ అంటూ పేర్కొనడం ఆ సంస్కృతి తెలియని వారికి అయోమయం కలిగిస్తుంది. అయితే కందుకూరి వారు ఉద్దేశ్య పూర్వకంగా ఆంగ్ల సాహిత్యంతోబాటు, ఆంగ్లేయుల సమాజాన్ని గురించి, వారి సంస్కృతిని గురించి కూడా తెలుగు ప్రజలకు తెలియ జెప్పాలని ఇలా అనువదించారని భావించవలసి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఆంగ్లేయ సాహిత్య ప్రభావ నవ్యతతో బాటు, సాంస్కృతిక ప్రభావ నవ్యతగా కూడా అంగీకరించక తప్పదు.

ఈ విషయంలో తాను చేసిన ప్రయత్నాన్ని గురించి వీరేశలింగం పంతులు తన మరో కావ్యం ‘పథిక విలాసము’లో స్పష్టంగా చెప్పారు. అంతే కాదు – ఒక భాషలోని కావ్యాన్ని మరో భాషలోనికి అనువదించడం చాలా కష్టమైన పని అని కూడా ఆయన పేర్కొన్నారు.

“హూణ కవుల పోక లొక యింత తెలుపంగ
దెలుగు వారి కొరకు దేటగాను
‘గోల్డు స్మిత్త’ ను కవి కూర్చిన యట్టి యీ
‘పథిక చరిత’ మేను వ్రాసినాడ!
~
ఒక భాషలోని సరసత
నొక భాషకు దెచ్చుటెంతయును దుస్సాధ్యం
ఒకటా! నా కది శక్యమె?
సకల కవులు నా యశక్తి క్షమియింపదగున్!”

‘పథిక విలాసము’ ఆలివర్ గోల్డ్ స్మిత్ అన్న ఆంగ్ల కవి రచించిన ‘ది ట్రావెలర్’ అన్న ఆంగ్ల కావ్యానికి పంతులుగారి తెలుగు అనువాదం. ఈ కావ్యంలో కవి ‘జాన్ గిల్ఫిన్’ కావ్యంలోలా ఒకే ఛందస్సును కాక ఛందో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఈ కావ్యాన్ని ఆయన క్రీ.శ. 1892లో రచించారు. గోల్డ్ స్మిత్ తన లోక సంచారానుభవాలను, అనుభూతులను, లోక రీతులను మూలంలో చక్కగా వర్ణించారు. వీరేశలింగం పంతులు పర్వతాలు, నదులు, దేశాల పేర్లను తెలుగులో యథాతథంగా ప్రయోగించారు. ఉదాహరణకు

“అదె కుడి వైపున దవ్వుల
ముద మొదవగ ‘నాల్స్ను’ మిన్ను ముట్టిన చోటన్
బొదలెడు ‘నిటలీ’ దేశం
బదిర! వసంతంబు బోలె నతిశయ శోభన్!”

ఇక్కడ ‘ఆల్ప్సు’ – యూరపు ఖండం మధ్య నున్న పర్వతాలు; ‘ఇటలీ’ – యూరపులో ఒక ప్రసిద్ధ దేశం.

ఈ కావ్యంలో చక్కని ప్రకృతి వర్ణనలు, లోక రీతులను తెలియజెప్పే పద్యాలు కూడా ఉన్నాయి.

“కలకలను నవ్వు నీ భూమి కాంత మీద
వింత వలపులు కలయంగ విసరు కొరకు
నబి బొడము గంధవహ విహంగమములు
చల్లనగు తమ రెక్కల జాచునెపుడు!”
~
“ఘన లోభాత్మకు డొంటిగా దన ధనాగారంబు దర్శించి, యో
లిని గూర్చుండి ధనంబు బల్మరును దా లెక్కించి, లెక్కించి, యా
ధనముల్ కుప్పలు కుప్పలై కడు బ్రమోదం బియ్య, నుప్పొంగు; ద
ద్దన రాశుల్ మరి చాలవంచు బిదపన్ దా బుచ్చు నిట్టూర్పులన్!”

19వ శతాబ్దిలో ఇలా తెలుగు సాహిత్యంలో విదేశీ ప్రదేశాల గురించి, పద్ధతుల గురించి తెలియజెప్పడం నవ్యతే కదా! ఆ విధంగా వీరేశలింగం గారిచ్చిన స్ఫూర్తితో చాలా మంది కవులు ఆంగ్ల సాహిత్యం నుండి అపురూపమైన కావ్యాలను తెలుగులో పద్య కావ్యాలుగా రచించి, తెలుగు ప్రజలకందించి, వారి మనోవికాస పరిధిని విశ్వస్థాయికి పెంచారు.

క్రీ.శ. 1894లో శిష్టు జగన్నాథ శాస్త్రి కవి ‘చిల్లా బంది అనుభ్రాతృ సౌహృదము’ అనే కావ్యాన్ని, ఆంగ్ల భాషలో ‘బైరస్’ కవి రచించిన ‘ప్రిజనర్ ఆఫ్ చిల్లాన్’ అన్న కావ్యానికి అనువాదంగా అందించారు. ఇది ఏకాశ్వాస కావ్యం. 126 పద్యాలతో రూపొందిన ఈ అనువాద కావ్యంలో కవి మూలంలో పేర్లను యథాతథంగా ఉంచారు. అందువల్ల ఈ కవి కూడా కందుకూరి వారి వలె ఆంగ్ల సాహిత్యంతో బాటు ఆ దేశస్థుల సంస్కృతిని కూడా తెలుగు వారికి పరిచయం చేయాలని భావించారని చెప్పవచ్చు. ఈ అనువాదం భావ ప్రధానంగా సాగిందని ‘తెలుగు సాహిత్య కోశము’లో పేర్కొనబడింది.

ఆంగ్ల కావ్యాలను యథాతథంగా కాక మన సమాజానికి అనుగుణంగా మార్చి అనుసృజన చేసిన కవులు కూడా 19వ శతాబ్దిలో లేకపోలేదు. క్రీ.శ. 1888లో రాజా పానుగంటి పార్థసారథి రాయణి కవి తన చిన్నారి పొన్నారి చిరుత కూకటి వయసులోనే ఆలివర్ గోల్డ్ స్మిత్ రచించిన ఆంగ్ల కృతి ‘వికార్ ఆఫ్ ది వేక్‌ఫీల్డ్’ లోని ‘ది హెర్మిట్’ అన్న భాగాన్ని స్వీకరించి, ‘సత్యాకృష్ణ సమాగమము’ అన్న ద్విపద కావ్యంగా మలచారు. ఈ కవి పాత్రల పేర్లను, సన్నివేశాలను తెలుగు సమాజానికి అనుగుణంగా మార్పు చేయడం గమనార్హం. అలతి అలతి పలుకులతో నూట నలభై ఆరు పంక్తులలో సాగిన లఘు కృతి అది. ఇదే కవి క్రీ.శ. 1892లో రచించిన మరొక ఆంగ్లానువాద కావ్యం ‘కమలా కల్యాణము’. ఇది షేక్స్పియరు మహాకవి విరచిత ‘ట్వెల్‌ఫ్త్ నైట్’ నాటకానికి స్వేచ్ఛానువాదం. ఈ అనువాద కృతిని గూర్చి డా. తూమాటి దొణప్ప ఇలా వివరించారు –

“మూల కర్త యభిప్రాయము చెడకుండ, తెలుగు నుడికారమునకును, తెలుగు వాతావరణమునకును దూరము గాకుండ ననువాదము సాగినది. ఇది ప్రతిపద భాషాంతరీకరణము కాదు. ఇది రాజా గారి చిన్న నాటి రచన. బాల్యోత్సాహము ప్రాబల్యము వలన నానా విధ వృత్తముల నిందు బొందు పరచిరి. బాల్యము వలన పాద పూరణ పదములు కొన్ని ప్రవేశించినవని రచయితయే స్వయముగా నంగీకరించిరి. 1892లో పట్ట పరీక్షకు జదువుచు సంధానించిన కృతి యిది.”

ఆంగ్ల సాహిత్యంలోని కాల్పనికోద్యమం చేత ప్రభావితుడై ప్రకృతి చిత్రణం ప్రధానంగా రచనలు సాగించిన గోపిశెట్టి రామచంద్రరావు నాయుడు 19వ శతాబ్ది అంత్య కాలంలో ‘సుమతి’ అనే కావ్యాన్ని వెలయించారు. ఇది లార్డ్ టెన్నిసన్ అనే ఆంగ్ల కవి రచించిన ‘డోరా’ అన్న కావ్యానికి అనువాదం అనటం కన్న అనుసరణ అనవచ్చు. కవి ‘డోరా’ అన్న పేరును ‘సుమతి’గా మార్చారు. కథనంలో కూడా తెలుగుదనం జొప్పించారు. 138 పద్యాలున్న ఈ కావ్యం అచ్చ తెలుగులో రచించబడింది. ఒక ఆంగ్ల కృతిని అచ్చ తెనుగులోకి అనువదించడం ఇదే ప్రథమమేమో! ఈ ‘సుమతి’ కృతికి, మద్రాసు క్రైస్తవ కళాశాలకు అనుబంధంగా, సమర్థి రంగయ్య శెట్టి పోషణలో సాహిత్య కృషి చేస్తున్న ‘ఆంధ్ర భాషాభిరంజనీ సంఘం’ వారు కావ్య రచనలో ద్వితీయ బహుమతిని అందజేసారు. ప్రథమ బహుమతిని కట్ట మంచి రామలింగారెడ్డి కృతి – ‘ముసలమ్మ మరణం’ గెలుచుకొంది. వేదం వేంకటరాయ శాస్త్రి ఈ పోటీకి న్యాయ నిర్ణేతలలో ఒకరు. గోపిశెట్టి రామచంద్రరావు ఎఫ్.ఏ. విద్యార్థిగా ఉన్నప్పుడు రచించిన ఈ ‘సుమతి’ కావ్యాన్ని, రెండు సంవత్సరాల తరువాత అదే ఎఫ్.ఏ. కోర్సుకు పాఠ్యాంశంగా నిర్ణయించబడడం ఆ కావ్య వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. టెన్నిసన్ కవి రచించిన ఈ ‘డోరా’ కావ్యాన్నే తరువాతి కాలంలో (క్రీ.శ. 1910) రాయప్రోలు సుబ్బారావు ‘అనుమతి’ పేరిట తెలుగు చేయడం కూడా గమనార్హం.

19వ శతాబ్ది ముగింపు దశలో జయంతి భావ నారాయణ కవి మూడు షేక్స్పియరు నాటకాలను తెలుగు పద్య కావ్యాలుగా రచించారు. క్రీ.శ. 1899లో ‘ది వింటర్స్ టేల్’ అన్న నాటకాన్ని అనుసరించి ‘సుమిత్ర చరిత్ర’ అన్న పద్యకావ్యాన్ని రచించారు. అదే సంవత్సరం ‘పెరికిల్స్’ అన్న నాటకాన్ని ‘శ్రీరఘు దేవ రాజీయము’ అన్న పద్య కావ్యంగా ఆంధ్రీకరించారు. క్రీ.శ. 1900లో ‘సింబలైన్’ అన్న మరో నాటకాన్ని ‘కళావతి పరిణయము’ అన్న పద్య కావ్యంగా మలచారు. గోపిశెట్టి రామచంద్ర రావు నాయుడు లాగే ఈ కవి కూడా ఈ కావ్యాన్ని అచ్చ తెనుగు భాషలో రూపొందించారు. మూడు కావ్యాలలోనూ జయంతి భావ నారాయణకవి, షేక్స్పియరు పెట్టిన పేర్లను అన్నింటిని తెలుగుదనానికి అనుగుణంగా మార్చేసారు. ఉదాహరణకు ‘కళావతీ పరిణయము’లో చేసిన మార్పులను చూద్దాం.

కవి ‘బ్రిటన్’ దేశాన్ని ‘ఘార్జర దేశం’గా మార్చారు. రాజు ‘సింబలైన్’ పేరును ‘రాజ వాహనుడు’గా మార్చారు. రాజ కుమార్తె ‘ఇమోజెన్’ పేరును ‘కళావతి’గా మార్చడమే కాకుండా కావ్య మకుటాన్ని కూడా ఆమె పేరనే ‘కళావతి పరిణయము’గా ఉంచారు. ‘ఇటలీ’ దేశం బదులు ‘మాళవ దేశం’ అని పేర్కొన్నారు. ఆ దేశ సేనాని ‘లూసియస్’ పేరును ‘దృఢ సేనుడు’గా మార్చి వేసారు. కళావతి (ఇమోజెన్) వరించిన భర్త పాత్ర నామధేయాన్ని షేక్స్పియర్ ‘పోస్టుమస్’గా ఉంచితే, భావ నారాయణ కవి దానిని ‘విజయ సారుడు’గా మలచారు. అంతే కాకుండా నాటక రూపంలో ఉన్న మూల కథను గ్రహించి, దానిని అనుసరించి, సరికొత్త కథా కావ్యంగా రూపుదిద్దారు. మన తెలుగు ప్రబంధ శైలిలో సందర్భాన్ని బట్టి ప్రకృతి వర్ణనలను జోడించారు. అచ్చ తెనుగు బాసలో చేసిన ఈ అందమైన ఆమని వర్ణనను చూడండి –

“పండిన యాకు లూడ్చి, పరువంపు జిగుళ్ళను దాల్చి చెట్లు క
న్పండు వొనర్చె; గానయను పైదలి యామని రేని రాకనున్
నిండు తమిం జెలంగి కడు నేర్పుగ బ్రాదొడవుల్ విదుర్చుచున్
మెండుగ గెంపురాన గల మేనును దా గయిసేసెనోయనన్
~
బట్టులై పులుకాసి పిట్టలగ్గింప గో
యిల కూత బూర కొమ్ములుగ మొరయ
విరిసిన మోదుగు విరుల దివ్వెలు గ్రాల
గమ్మ పుప్పొడి దుమ్ము గ్రమ్ము కొనగ
జిగురు టాకులు లాలుజెండాల చాలుగ
నెల్ల తుమ్మెద దిమ్ము వెల్లువలుగ
మొగిలి పూరేకులు ముల్కుల గుమిగాగ
వలి గాలి యులువు బేరులుగ వరల

దనకు దగ్గర చుట్టమై తనరు నలరు
విలు దొరను గూడి సంపెగ విరుల తేరి
నెక్కి తెరువర్ణ నేచగ నెద దలంచి
దాడి వేం చేసె నామని రేడు హాళి”

ప్రసిద్ధి చెందిన ఆంగ్ల సాహిత్య గ్రంథాన్ని ఇలా మన వారికి మన పద్ధతిలో అందజేయడం కూడా నవ్యతే కదా! చిగురుటాకులను ‘లాలు జెండాలు’ (ఎర్ర జెండాలు) గా పేర్కొనడం ఆ రోజుల్లో (రష్యను విప్లవానికి ఎంతో ముందు సుమా!) ఎంత నవ్యోపమానం! ఎంత నవ్య ప్రయోగం!!

కేవలం వర్ణన కొరకు జయంతి వారు ‘లాలు జెండాలు’ అన్న పదబంధాన్ని ప్రయోగిస్తే, మరో కవి ఆ భావజాలాన్నే తెలుగు సాహిత్యానికి పరిచయం చేసారు. 19వ శతాబ్ది కడపటి సంవత్సరమైన క్రీ.శ. 1900లోనే గొట్టు ముక్కల రమాకాంతాచార్యులు, ‘గ్రే’ అనే ఆంగ్లేయ కవి విరచిత కృతిని ‘కరుణా రస తరంగిణి’ పేర తెలుగు చేసారు. ఆంగ్ల భాషాధ్యయనం చేసిన ఫలంగా ఈ కావ్య రచన చేయ గలుగుతున్నానని రమాకాంతాచార్యులు ఈ కావ్యారంభంలో పేర్కొన్నారు.

“తండ్రి! నా నేర్చు హుణ విద్యకు ఫలంబు
గాగ, దద్భాష ‘గ్రే’ యను కవి వరుండు
భవ్య గతి రచించిన మహా కావ్య మేను
దవిలి తెనిగించుచున్నాడ! నవథరింపు!”

ఈ కావ్యంలో కవి కాయకష్టం చేసుకొనే కర్షకులు, పేదలపై తన అనురాగాన్ని, సంపన్నుల పట్ల తిరస్కార భావాన్ని ప్రకటించి వామ పక్షీయ భావజాల ఛాయలను ఆనాడే తెలుగు సాహిత్యంలో ప్రవేశ పెట్టారు.

“కొడవట నెన్ని సన్యములు కోసిరి వారు గడంగి పల్మరున్
గడపిరి నాగెటిం బ్రబల కాశ్యపి బ్రద్దలు గానొ యూరమే
కడ దులకింప దోలి రరకల్ మడి చాయల నిబ్బరంపువ్రే
ట్లడరిన నమ్రతన్ శిరము లక్కట వంచె నరణ్య భూజముల్
~
వారి యమాయిక సుఖములు
వారల లాభకర కార్య వైఖరి మరియున్
వారి నిగూఢ చరితలా!
శారమణి! తృణీకరింప జనునే నీకున్?
~
సంగ్రహంబయి సారళ్య సహితమైన
పేదవారి చరిత్రము ల్వినగ దగునె
సార సంపన్నిధులు తిరస్కార భావ
సూచకంబగు దరహా స రుచి తోడ!”

ఈ విధంగా 19వ శతాబ్దిలో తెలుగు కవులు పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో అనువాదాలు, అనుసరణలు, అనుసృజనలు చేసి, వారి సాహిత్యాన్ని, సంస్కృతిని, నవ్య భావజాలాన్ని మనకు పరిచయం చేసే ప్రయత్నంగా తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

2. పాశ్చాత్య రాజకీయ ప్రభావం:

క్రీ.శ. 1857లో ప్రప్రథమ భారత స్వాతంత్య్ర సమరం తలెత్తిన తర్వాత 1858లో మహారాణి విక్టోరియా భారత దేశంలో నేరుగా పరిపాలనాధికారాన్ని స్వీకరించింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకోడం కోసం విశ్వవిద్యాలయాల స్థాపన, రైల్వే వ్యవస్థ, తంతి – తపాల వ్యవస్థలను నెలకొల్పి, విద్యా సాంకేతిక ప్రగతి ఫలాలను భారతీయుల కందించింది. భారతీయ మూఢాచారాలను ఖండిస్తూ చట్టాలను రూపొందించింది. పకడ్బంధీ న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఆంగ్ల విద్యనభ్యసించిన భారతీయులకు ఉద్యోగాల నిచ్చింది. సంఘంలో పలుకుబడి గల వ్యక్తులకు ‘దివాన్ బహద్దూర్’, ‘రావు బహద్దుర్’ వంటి బిరుదులను ఇచ్చి సత్కరించింది. దీంతో సహజంగానే ప్రజలకు దేశీయుల పాలన కంటె బ్రిటిష్ పాలనే నయమనిపించ సాగింది. సంఘ సంస్కర్తలు కూడా మెరుగైన పాలన కళ్ళముందు కనిపిస్తుంటే, కాస్త దాస్యం అన్న మాటను పక్కన బెట్టి, బ్రిటిష్ సర్కారుకు మద్దతు పలకడం ప్రారంభించారు. ఆంగ్ల విద్య నభ్యసించిన మేధావులు, కవులు బ్రిటిష్ అధికారులతో సత్సంబంధాలను నెరుపుతూ వచ్చారు. అలా బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ ప్రభావం తెలుగు సాహిత్యంలో ప్రతిఫలించడం ప్రారంభమయింది. అందుకే 19వ శతాబ్ది ఉత్తరార్థంలో విక్టోరియా మహారాణిని ప్రస్తుతిస్తూ తెలుగు కవులు పద్యాలను రచించారు. ముఖ్యంగా మహారాణి బ్రిటిష్ సింహాసనం అధిష్టించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రభుత్వం ‘జూబిలీ ఉత్సవాలు’ జరిపినప్పుడు, చాలా మంది కవులు ఆమెపై స్తుతి పద్యాలను వెలయించారు. కొందరయితే ఏకంగా ఆమె జీవిత చరిత్రనే కావ్యాలుగా సృజించారు. కొందరు తమతో స్నేహంగా ఉన్న బ్రిటిష్ అధికారులను స్తుతిస్తూ పద్యాలను రచించారు. కొందరు బ్రిటిష్ పాలనలోని అభివృద్ధికి చిహ్నాలైన రైలు బండిని, తంతి – తపాల వ్యవస్థను ప్రశంసిస్తూ కవిత్వం చెప్పారు. ఆ వివరాల నన్నిటినీ ఆంగ్లేయ రాజకీయ పరిపాలనా ప్రభావ నవ్యతగా ఇపుడు పరిశీలిద్దాం –

మతుకుమల్లి నృసింహ కవి ‘చెన్నపురీ విలాసము’ (క్రీ.శ. 1863)లో, భారత దేశంలో తంతి వ్యవస్థను ప్రవేశ పెట్టిన ఇంగ్లీషు వారి పాలనపై ఎలా సంతృప్తిని వ్యక్తం చేసారో చూడండి –

“ఇంగిలీషులు పూన్చు నహీన యంత్ర
మహిమచే సర్వజనుల కిమ్మహి సుదూర
బంధు సందేశ సపది లాభంబు కలిగె –
బ్రభు సమాడంబరము ప్రజార్థంబు గాదె!”

వడ్డాది సుబ్బరాయకవి రైలు బండిని చూచి ఆనందాతిశయాలతో ఇలా వర్ణించారు –

“ధూమ శకట వేగ మేమని వర్ణింతు –
భూమి గంటదీ బడుచు బోవునట్టి
వేవిగాని సాటి రావు దానికి వడి;
దాని వంటి దొకటే దాని నీడ!”

ఎంత చక్కని వర్ణన! వడ్డాది సుబ్బరాయకవి విక్టోరియా మహారాణి జూబిలీ ఉత్సవాల (క్రీ.శ. 1887)లో వ్రాసిన పద్యాలు మధురాతి మధురాలు. ఈనాడవి మనకు దాస్య భావనకు ప్రతీకలుగా కనిపించవచ్చు. కాని ఆనాటి రసజ్ఞులకు అవి వసుధైక కుటుంబ భావనల మాలికలు.

“శ్రీమన్మహా సేతు శీతాద్రి మధ్యస్థ
రత్న గర్భైక సామ్రాజ్యురాల!
సాంభోనిధి ద్వీప సర్వావనీ వ్యాప
కాంగ్లేయ రాజ్యోత్త మాంగురాల!
దుర్వార సర్వారి గర్వాంధకార ప్ర
దీపాయ మాన ప్రతాపురాల!
పుత్రికా పౌత్రికా పుత్ర పౌత్రాది కా
త్మీయ సంతాన సంప్రీతురాల!

దుష్ట సంశిక్షణాశ్రాంత శిష్ట రక్ష
ణైక చరితార్థ జన్మ ధన్యాత్మురాల!
ప్రాజ్ఞ విక్టోరియా మహారాజ్ఞి! నీవె
ధరణి బాలింపు మాచంద్రతారకంబు!”

‘ధవళేశ్వరం’ ఆనకట్ట ఫలాలలను, ఇతర పాలనా పరమైన ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న కవి ఆత్మానందాన్ని గమనించండి –

“నోరెండినను మంచి నీరింత కనరాని
మరుభూమి గౌతమీ భరితమయ్యె;
బరికింపగా గడ్డి పరకైన మొలకెత్తు
టరుదైన పట్టి, లుర్వరలె యయ్యె;
జోడంబళులు గాచి జుర్రువారికి, రాజ
నాల యన్నము భోజనాల కయ్యె;
గాశికేగిన వారు కాటికేగిన వారి
పగిదంట పరిహాస పాత్రమయ్యె;

బులియు, మేకయు నేకమై జలముగ్రోలు
నహహ! నీ పాలనమున ధర్మాత్మురాల!
ప్రాజ్ఞ విక్టోరియా మహారాజ్ఞి! నీవె
ధరణి బాలింపు మాచంద్ర తారకంబు!
~
అంధుడైనను దారి నడుగ నక్కర లేక
యేగ నౌ గాశి, రామేశ్వరంబు;
పంగుడైనను గొంచె పాటి వెచ్చంబుతో
రావచ్చు, ద్వీపాంతరములు సూచి;
బలహీనుడును, న్యాయ పక్షంబు వాడైన
బోరి గెల్వగ వచ్చు భూమి పతుల;
గడ జాతి వాడైన, గడియించుకొన్నచో
నంజకెక్కగ వచ్చు నందలంబు;

నహహ! యీ రథ్య, లీ ధూమ యానములును
న్యాయ సభ, లిట్టి స్వేచ్చ, లేనాడు గలవు?
ప్రాజ్ఞ విక్టోరియా మహారాజ్ఞి! నీవె
ధరణి బాలింపు మాచంద్ర తారకంబు!”

ఈ పద్యాలలో కవి ఆకాంక్షను మనం అంగీకరించలేము గాని, ఆయన చెప్పిన వాస్తవాలను మాత్రం అంగీకరించక తప్పదు. సుబ్బరాయ కవి రాజమండ్రిలోని కాలేజి ప్రిన్సిపాల్ ఐ.పి. మెట్కాఫ్ దొర స్వదేశానికి వెళుతున్నప్పుడు (క్రీ.శ. 1887) వ్రాసిన పద్యాలలో ఒకటి మచ్చుకి పేర్కొంటున్నాను.

జన్మ మధ్యమునందు జదువు రాదనుకొన్న
జడులు శాస్త్ర బ్రహ్మచారులైరి;
హీనులై బిచ్చంబు నెత్తంగ వలయు వా
రురు వేతనంపు టుద్యోగులైరి;
నూనూగు మీసాలు రాని కుర్రలు, మహా
జన సభాపూజ భాజనములైరి;
మాట నేర్పెరుగని మోట మొద్దులు, యుక్తి
యుక్త ప్రసంగ సంశక్తులైరి;

క్రూరులై సాధు జనులను గోడు పరచు
మంకు వారలు బహు బుద్దిమంతులైరి;
యౌర! ‘మెట్కాఫు’ కరుణాళు డరుగు దెంచి
నేర్పి విద్యను, గాలేజి నిలుపబట్టి!”

ఈ పద్యాలన్నీ తరువాతి కాలంలో సుబ్బరాయకవి ప్రసిద్ధ కావ్యం ‘వసురాయ చాటు ప్రబంధం’లో చేర్చబడ్డాయి.

కందుకూరి వీరేశలింగం పంతులు క్రీ.శ. 1883లో గవర్నర్ జనరల్ రిప్పన్ దొర మద్రాసు నగరానికి విచ్చేసి నప్పుడు ‘శ్రీ రిపన్ ప్రభు స్వాగతము’ పేర కొన్ని పద్యాలను, ఒక పాటను రచించి తమ ‘సతీ హిత బోధిని’ పత్రికలో ప్రచురించారు. విక్టోరియా రాణి జూబిలీ ఉత్సవాలలో నవ రత్నాలను రచించారు. పంతులుగారు బ్రిటిష్ ప్రభుత్వం నుండి ‘రావు బహద్దూర్’ బిరుదాన్ని స్వీకరించారు.

క్రీ.శ. 1875లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశాన్ని సందర్శించినపుడు, ఆ సందర్శనాన్ని, వర్ణించే భారతీయ రచనలకు ‘లండన్ క్రౌన్ పర్‌ఫ్యూమరీ కంపెనీ’ అనే ఒక వ్యాపార సంస్థ పోటీ నిర్వహించింది.

ఆ పోటీకి కొక్కొండ వేంకటరత్నం పంతులు ‘ప్రిన్స్ ఆఫ్ వేల్సు తారావళి’ పేర 27 పద్యాలను రచించి పంపారు. ఆ పద్యాలు ఆంగ్లంలోకి అనువదించబడి బహుమతిని గెలుచుకొన్నాయి. బహుశః ఒక తెలుగు కవిత ఖండాంతర ఖ్యాతిని పొందడం, అంతర్జాతీయ పురస్కారాన్ని గెల్చుకోడం – ఇదే ప్రథమ మేమో! పంతులుగారు ఈ పురస్కారాన్ని చాలా గౌరవప్రదంగా భావించేవారు. దాదాపు 18 సంవత్సరాల తరువాత (క్రీ.శ. 1893లో) ప్రచురించబడిన తమ ‘బిల్వేశ్వరీయము’ ప్రబంధ గ్రంథం ముఖపత్రంపై పంతులుగారు ఆంగ్లంలో తమ పేరు క్రింద ‘Author of the prize – poem “Prince of Wales Taravali”, accepted by the London crown perfumery company’ అని ప్రత్యేకంగా వేయించుకొన్నారు. ఈ పురస్కారం లభించిన సందర్భంలో కొక్కొండ వారిని, వారి అభిమానులు ‘మహా మహోపాధ్యాయ’ బిరుదంతో సత్కరించారు. 19వ శతాబ్దిలోనే తెలుగు కవితకు అంతర్జాతీయ పురస్కారాన్ని సాధించి పెట్టిన బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకట రత్న శర్మ పంతులు నిజంగానే అభినందనీయులు.

ఇదే విధంగా బొమ్మకంటి నృసింహ శాస్త్రులు ‘తారావళి’ అన్న శీర్షికతో విక్టోరియా రాణిపై స్తుతి పద్యాలను రచించారు. పరవస్తు వేంకట రంగాచార్యులు ‘ఆంగ్లాధిరాజ్య స్వాగతము’ అన్న లఘు కావ్యాన్ని రచించారు. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి క్రీ.శ. 1898లో ‘విక్టోరియా విలాసము’ పేరిట విక్టోరియా మహారాణి చరిత్రను కావ్యంగా మలచారు. అయితే ఇది అంతగా ప్రఖ్యాతి వహించలేదు. ఇదే వస్తువుతో లక్కవరం జమీందారు మంత్రి ప్రెగడ భుజంగ రావు ఒక ప్రబంధాన్ని రచించారు. ఈ కృతి పేరు ‘వసంత కుసుమము’. పేరుకి తగ్గట్టుగా ఈ కృతి నిజంగా వసంత కుసుమమే! ఈ కావ్యం రెండవ కూర్పు క్రీ.శ. 1907లో వచ్చింది. మొదటి కూర్పు ఏడెనిమిది సంవత్సరాల ముందు వచ్చిందనుకొన్నా, ఇది కూడా కాశీభట్టవారి కావ్యం వచ్చిన కాలంలోనే వెలువడి ఉండాలి. రెండవ కూర్పులో రాణి మరణం వరకు అన్ని విషయాలు కలిపి గ్రంథ విస్తరణ చేసారు.

ఇందులో రాణికి సంబంధించిన అనేక ఛాయా చిత్రాలను కూడా పొందు పరిచారు. చాలా ప్రసిద్ధి వహించిన ఈ కావ్యంలో, మహారాణి పరిపాలనా దీక్షా దక్షతలను వివరించే ఈ ముక్త పద గ్రస్తాలంకార భూషితమైన పద్యాన్ని చూడండి –

“ఆ దేవి మేల్కాంచి యర్ధ రాత్రంబున
రాచ కర్ణముల సారంబునెంచు –
నెంచి ప్రెగ్గడలచే నిదమిత్థ మనిపించి
యది యాచరించుట కాజ్ఞసేయు
జేసిన యాత్మీయ శాసనం బన్యధా
భావ మందక యుండ బారజూచు –
జూచి యించుక భేద సూచన గల్గిన
గ్రమ్మర యొట్టోలగమున దెచ్చు

దెచ్చి గుణ దోషముల నెల్ల దీర్పు సేసి
కడగి యవ్యాహత క్రియ నడపు చుండు –
నౌర ! యింతటి చాతుర్య మభ్యసింప
నెవ్వరికి గల్గునని జను లెంచుచుండ!”

ఇలా ఆంగ్లేయుల పాలనా వ్యవహారాలకు సంబంధించి, 19వ శతాబ్దిలో సగటు భారతీయుల అనుభూతులను ప్రతిబింబిస్తూ తెలుగు సాహిత్యంలో వెలువడిన ఈ కవిత్వంలోని నవ్యతను పాశ్చాత్య రాజకీయ ప్రభావ నవ్యతగా పేర్కొనవచ్చు.

3. పాశ్చాత్య మత ప్రభావం:

ఆంధ్ర దేశంలో క్రైస్తవ మత ప్రచారం 17వ శతాబ్ది తొలి రోజుల్లో ప్రారంభమయింది. క్రీ.శ. 1606లో పోర్చుగీస్ ‘జెసూట్’ – ‘రాబర్ట్ డొ నోబిలి’ అనే వ్యక్తి ‘మధుర’ కేంద్రంగా తెలుగులో క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించి, ‘తత్త్వ బోధస్వామి’గా పేరు పొందారు. ఇతనిని ఆదర్శంగా తీసుకొని క్రీ.శ. 1689లో కొంత మంది ఫ్రెంచి ‘జెసూట్లు’ పుదుచ్చేరి చేరుకొని కర్ణాటక మిషన్ను స్థాపించారు. ఈ మిషన్ జెసూట్లు తరువాతి కాలంలో దక్షిణ భారత దేశమంతా వ్యాపించారు. ఈ జెసూట్ల నుండి ‘బ్యాప్టిజం’ స్వీకరించిన తెలుగు విద్యావంతులకు ఫ్రెంచి పాలనలో ఉన్నత పదవులు లభించాయి. ఫ్రెంచి ప్రభుత్వం కాస్త ఆలస్యంగానైనా, బ్రాహ్మణ కవులను చేరదీసి, వాళ్ళ చేత తెలుగులో కావ్యాలను వ్రాయించారు. అలా తెలుగులో తొలి క్రైస్తవ కావ్యాన్ని రచించిన కవి పింగళి ఎల్లనార్యుడు. వీర శైవుడైన ఈ కవి పరిశుద్ధ గ్రంథం – పాత నిబంధనలో 14వ అధ్యాయంలో ఉన్న ‘టోబియో’ చరిత్రను తోభ్య చరిత్రగా రచించారు. ఫ్రెంచి జెసూట్ల ద్వారా బ్యాప్టిజం పుచ్చుకొన్న తుమ్మావారి వంశంలోని అనంత రెడ్డి రాయప్ప అనే జమీందారు కోరిక మేరకు కవి ఈ రచనను చేసినట్టు తెలుస్తోంది. కవి ఈ గ్రంథానికి ‘సర్వేశ్వర మాహాత్మ్యము’ అని నామకరణం చేసారు. ఎల్లనార్య కవి 17వ శతాబ్దికి చెందిన వాడని వీరేశలింగం పంతులు విశదీకరించారు. ఆ తరువాత 18వ శతాబ్ది అంత్యకాలంలో మంగళగిరి ఆనందయ కవి క్రీస్తు చరిత్రను ‘వేదాంత రసాయనము’ పేర కావ్యంగా మలచారు. ఈ రెండు కృతులే 19వ శతాబ్దికి పూర్వం క్రైస్తవ కావ్యాలుగా వెలసినట్లు ఆధారాలున్నాయి. అయితే ఈ ఇరువురు కవులు క్రైస్తవ మతాన్ని అవలంబించినట్లుగా ఆధారాలు లేవు. పైగా, ఇరువురూ శివారాధకులుగా తమ కావ్యాలలో చెప్పుకొన్నారు. రచనలు కూడా ప్రాచీన తెలుగు ప్రబంధ సరణిలోనే సాగాయి. కాని, 19వ శతాబ్దిలో క్రైస్తవ మతాన్ని స్వీకరించి, మనసా వాచా కర్మణా క్రైస్తవ మత ప్రచారార్థం కావ్య రచనలు చేసిన తొలి తెలుగు క్రైస్తవ కవి ‘పురుషోత్తమ చౌదరి’ (క్రీ.శ. 1803-1890). క్రీ.శ. 1833లో బాప్టిజం స్వీకరించిన ఈ కవి అనేక పద్య కృతులను, కీర్తనలను రచించి, ‘ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు’గా ఖ్యాతి నొందారు. ఈ కవి రచించిన గేయ కృతులను, కీర్తనలను గురించి ’19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో ప్రక్రియా పరమైన నవ్యత’ అన్న అధ్యాయంలో వివరించడం జరిగింది. ఈ అధ్యాయంలో చౌదరి కవి రచించిన పద్య కృతులను గురించి పరిశీలిద్దాం –

పురుషోత్తమ చౌధరి పద్య కృతులు ఐదు లభిస్తున్నాయి. వాటిలో రెండు శతకాలు – ఒకటి ‘యేసు నాయక శతకము’, రెండవది ‘యేసు క్రీస్తు ప్రభు శతకము’, ఇక, ‘పంచ చామర పన్నములు’ పంచ చామర ఛందస్సులో మకుట సహితంగా సాగిన అర్ధ శతి. ‘పంచ రత్నములు’ ఐదు సీస పద్యాల సంకలనం. ‘క్రైస్తవ నీతి ప్రకాశము’ మరియు ‘సత్య వేద సార సంగ్రహము’ అనేవి పద్య కావ్యాలు వీటిలో క్రీ.శ. 1845లో వెలువడిన ‘యేసు నాయక శతకము’ తెలుగు శతక వాఙ్మయంలో మొట్ట మొదటి క్రైస్తవ శతకం.

“తప్పులు లేని వారొకరు ధాత్రిని లేరని దేవ వాక్యముం
జెప్పుట నిక్కమట్టి నర జీవుల లోపల నాకు మించ బల్
తప్పులు సేయు వాడొకడు ధారుణి నారయ లేడు – నేడు నా
తప్పుల బాపి నీ కరుణ దప్పక బ్రోవవె యేసు నాయకా!”

వంటి కమనీయ ధారతో సాగే క్రైస్తవ మత ప్రబోధక వృత్తాలెన్నో ఈ శతక కావ్యంలో ఉన్నాయి. ముఖ్యంగా క్రీస్తు జీవితంలోని కరుణా రసాత్మకమైన ఘట్టాలను కవి వర్ణించిన తీరు హృదయాన్ని కలచివేసి, భక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఉంది.

“పల్లవ తుల్య పాద, కర పంకజ మధ్యములందు రక్తమున్
చిల్లున జిమ్మ, మేకులు దుసిల్లగ సిల్వను గొట్టి పక్కలో
బల్లెము గ్రుచ్చు వారియెడ వైరము లేక కృపారసంబు శో
భిల్లె గదా భవద్దృదయ వీధిని పెల్లుగ యేసునాయకా!”

అలాగే ‘యేసు క్రీస్తు ప్రభు శతకము’లో కూడ కమనీయమైన భావాలతో అనేక పద్యాలు రూపు దిద్దుకొన్నాయి. మచ్చుకు ఒక పద్యాన్ని చూడండి –

“నా కన్నం గడు పాప కర్ముడొకడైనన్ లేడు భూమండలిన్
నీ కన్నం బ్రియ రక్షకుండెచట నన్వేషించినన్ లేడికన్ –
నాకు న్నీకును జోడు గూడె గద! నన్నుం బ్రోవు మిట్లైన ము
ల్లోకంబుల్ నిను మెచ్చు – నీ బిరుదు నిల్చున్ – యేసు క్రీస్తు ప్రభో!”

నూటికి పైగా విలువైన నీతి పద్యాలతో రూపొందిన కావ్యం – ‘క్రైస్తవ నీతి ప్రకాశము’ (క్రీ.శ. 1851).

“జగతి యందు కులాలుండు సాన మీద
మంటి చే కుండ లొనరించు మాడ్కి, సర్వ
నరుల నొక రక్తమున పరాత్పరుండు చేసె
గాన ఘన నీచు లిల లేరు క్రైస్తవునకు”

వంటి పద్యాలు ఈ కావ్యంలో సర్వ మానవ సమానత్వాన్ని చాటి, మానవ జాతికి మార్గదర్శనం చేస్తాయి.

పురుషోత్తమ కవి క్రీ.శ. 1847లో రచించిన ‘పంచ చామర పన్నములు’, ‘పంచ రత్నములు’ యేసు క్రీస్తుపై అచంచలమైన భక్తితో అల్లిన స్తుతి పద్యాలు.

“వెల లేని పంచ చామర
ములు మరియును పంచ రత్నములు ప్రభువు కృపన్
ఇల చౌధరి పురుషోత్తము
వలన రచితమయ్యె సాదు వర్గంబలరన్”

అని కవి స్వయంగా చెప్పుకొన్నారు.

19వ శతాబ్ది మధ్య కాలంలోనే పరిపక్వమైన క్రైస్తవ భక్తి కావ్యాలను రచించిన పురుషోత్తమ చౌధరికి ‘ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు’ సార్థక బిరుదం అన్నది నిర్వివాదాంశం. పురుషోత్తమ చౌదరి కవి గురించి 19వ శతాబ్దికే చెందిన కవి, లక్కవరం జమీందారు రాజా మంత్రి ప్రెగడ భుజంగ రావు అభిప్రాయం ఇక్కడ ఉటంకించదగింది.

“I read almost all the works of Rev. Purushottama Chowdhuri. He is a true Christian of the highest order. The very fact that almost all the different denominational churches of the Andhra Desa adopted many of his devotional songs in their worship, is a clear proof of his great merit and non-sectarian Christian spirit. In Telugu he proved himself a poet of the classical order. His verses are lucid and run like a natural flow of an ebbing river. He is able to express his thoughts very clearly and no where can we find him blinking to find a suitable word or phrase to express his inner thoughts. He has done a great service to the Christian community and to the Telugu public at large and I am sure, his name will last in the country as long as the Andhras exist. It is the duty of every Andhra to join hands in commemorating his name to perpetuity.”

ఇలా 19వ శతాబ్దిలో పాశ్చాత్య సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, మత ప్రభావ నవ్యతలు తెలుగు సాహిత్యంలో పరిఢవిల్లాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version