Site icon Sanchika

‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం-9

[డా. ఆచార్య ఫణీంద్ర గారు పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

~

X. 19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో వస్తు నవ్యత – మొదటి భాగం

[dropcap]19[/dropcap]వ శతాబ్ది తెలుగు కవిత్వంలో రూపొందిన వివిధ రకాల నవ్యతలను – ముఖ్యంగా, సంప్రదాయ వ్యతిరేక నవ్యత, అభ్యుదయాత్మక నవ్యత; ఛందో నవ్యత; ప్రక్రియా పరమైన నవ్యత; భాషాపరమైన నవ్యత; పాశ్చాత్య సాహితీ, సాంస్కృతిక, మత, రాజకీయ ప్రభావ నవ్యతలను ఇంతకు ముందు అధ్యాయాలలో సవిస్తరంగా చర్చించడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు – 19వ శతాబ్దిలోని తెలుగు కవిత్వంలో రూపొందిన వస్తు నవ్యత ఒక ఎత్తు. ఎందుకంటే ఏ కావ్యానికైనా వస్తువు ప్రాణం వంటిది. ఇంతకు ముందు వివరించిన నవ్యతలు ఆనాటి దేశ, కాల, సామాజిక, రాజకీయ ప్రభావాలతో ఏర్పడినవయితే, వస్తు నవ్యత మాత్రం కవి సృజన శక్తికి సంబంధించింది.

19వ శతాబ్ది తెలుగు కవిత్వంలోని వస్తు నవ్యత ప్రధానంగా నాలుగు రకాలుగా విస్తరిల్లిందని చెప్పవచ్చు. అవి –

  1. అల్ప వస్తువులకు కావ్య గౌరవం కల్పించడం.
  2. సమకాలీన సంఘటనలను కావ్య వస్తువులుగా స్వీకరించడం.
  3. సోషియో ఫాంటసీ కథా వస్తువులను రూపొందించడం.
  4. విచిత్ర కల్పనలతో కావ్య వస్తువులను తీర్చిదిద్దడం.

ఈ అంశాలను ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు సవిస్తరంగా చర్చిద్దాం.

1. అల్ప వస్తువులకు కావ్య గౌరవం:

20వ శతాబ్ది నవ్య కవిత్వంలో ఆధునికులు ఒక ముఖ్యమైన అంశంగా పేర్కొనే విషయం – అల్ప వస్తువులను కూడా హీనంగా చూడకుండా, వాటిని కూడా కవితామయం చేస్తూ కావ్యాలను నిర్మించడం. దీనికి ప్రాతిపదికగా మహాకవి శ్రీశ్రీ 1934లో రచించిన ‘ఋక్కులు’ అన్న కవితను పేర్కొన్నడం మనకు విదితమే.

కుక్కపిల్లా,
అగ్గి పుల్లా,
సబ్బు బిళ్ళ –
హీనంగా చూడకు దేన్నీ!
కవితా మయమే నోయ్ అన్నీ!
రొట్టె ముక్కా,
అరటి తొక్కా,
బల్లి చెక్కా –
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్ళెం,
హారతి పళ్ళెం,
గుర్రపు కళ్ళెం
కాదేది కవిత కనర్హం!
ఔనౌను శిల్ప మనర్హం!!

ఈ కవిత వెలువడక ముందు కవితా వస్తువులుగా పౌరాణిక కథలు లేక ఉదాత్తమైన కల్పిత కథలతో పురాణ పురుషులు లేక ఉదాత్త పురుషులను నాయికా నాయకులుగా కావ్య నిర్మాణం జరుగుతుండేదని, నవ్యయుగ కర్త అయిన శ్రీశ్రీ ఈ నవ్య దృష్టిని ఆధునిక కాలంలో ప్రసరింప జేశాక, ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని విమర్శకులు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే జాషువా కవి, ‘సాలీడు’, ‘గిజిగాడు’, కరుణశ్రీ రచించిన ‘పుష్పవిలాపం’, ‘పాకీ పిల్ల’ మొదలయిన కవితలు ఆధునిక కాలంలో వెలువడ్డాయని పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే శ్రీశ్రీ ఈ భావనను వెలువరించటానికి 50, 60 సంవత్సరాలకు వస్తువులను ముందే ఇలా అల్ప వస్తువులను కావ్య వస్తువులుగా ఎంచుకొని కావ్య నిర్మాణం చేసిన కవులున్నారు. 19వ శతాబ్దిలోనే ఇలా అల్ప వస్తువులకు కావ్య గౌరవాన్ని కల్పించి అపురూపమైన వస్తు నవ్యతను ప్రదర్శించిన ఈ కవులు నిజంగా అభినందనీయులు, ఆదర్శ ప్రాయులని అంగీకరించక తప్పదు.

మొట్టమొదట ఇలాంటి కార్యాన్ని సాధించిన కవి పన్నాల సీతారామ బ్రహ్మ శాస్త్రి. ఈయనను ఆనాటి యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారు సాహితీ గురువుగా భావించేవారు. క్రీ.శ. 1820-1900 మధ్య జీవించిన ఈ కవి వతంసుడు ‘పూచి పుడుక శతకము’ అన్న కృతిని రచించాడు. దీనికి ‘పూచి పుల్ల శతకము’ అని నామాంతరం ఉంది. ఒక పూచిక పుల్ల వంటి అల్ప వస్తువును స్వీకరించి శతక కావ్యాన్ని నిర్మించడం, ఉదాత్త పాత్రలతో పురాణ, శృంగార కథావస్తువులతో ద్వర్థి, త్ర్యర్థి ప్రబంధాలు జోరుగా వెలువడుతున్న 19వ శతాబ్దిలో, నిజంగా ఒక విప్లవాత్మకమైన నవ్యతగా భావించాలి.

అలాగే క్రీ.శ. 1896లో బుద్ధిరాజు ఈశ్వరప్ప పంతులు అనే మరోకవి ‘అట్టు కథ’ అన్న పద్య కావ్యాన్ని రచించినట్టు తెలుస్తున్నది. తెలుగు వారికి ప్రీతిపాత్రమైన తినుభండారం ‘అట్టు’ పై ఈ కవి ఒక పద్య కావ్యం రచించడం వినూత్నమైన విషయం. ఈ రెండు గ్రంథాలకు సంబంధించిన వివరాలు తెలుగు అకాడమి ప్రచురించిన ‘తెలుగు సాహిత్య కోశము’ లో లభ్యమవుతున్నాయి. అయితే ఈ రెండు కావ్యాలు మాత్రం ఈనాడు అనుపలబ్ధంగా ఉన్నాయి. దీనికి కారణమేమిటా? – అని ఆలోచిస్తే మనకు ఒక విషయం అవగతమౌతుంది. పన్నాల సీతారామ బ్రహ్మశాస్త్రి, బుద్ధిరాజు ఈశ్వరప్ప పంతులు అనే ఈ ఇరువురు కవులు 19వ శతాబ్దిలోనే ఆధునిక చిత్తవృత్తిని ప్రదర్శిస్తూ అల్ప వస్తువులకు కావ్య గౌరవం కల్పించినా, ఆనాటి సాహితీ పాఠకులు, పండితులు “పూచి పుల్ల పై కవిత్వమేమిటి?” అంటూ, “అట్టు పై కవిత్వమా?” అంటూ హీనంగా చూచి ఉంటారు. ఆ నిరసన భావం వల్ల ఆనాటి సాహితీ ప్రియులు ఇలాంటి తెలుగు సాహిత్యంలోని అమూల్య గ్రంథాలను కాపాడుకోవాలన్న స్పృహ లేక వాటిని పదిల పరచలేక పోయారని భావించవలసి ఉంటుంది. అందుకే ఆ కావ్యాలు నేడు మనకు అలభ్యంగా మరుగున పడి పోయాయని చెప్పవచ్చు. అయితే కాలం ఖచ్చితంగా తెలియక పోయినా 19వ శతాబ్దిలోనే సామినేని వేంకటాద్రి అనే మరోకవి ‘చీపురు పుల్ల శతకము’ను రచించారు. బహుశః ఈ కవిని పన్నాల వారి ‘పూచి పుల్ల శతకము’ ఈ శతక రచనకు స్ఫూర్తి నిచ్చి పురికొల్పి ఉంటుంది. ‘చీపురు పుల్ల శతకము’లోని విశేషాలను డా. కె. గోపాల కృష్ణా రావు తమ ‘ఆంధ్ర శతక సాహిత్య వికాసము’ లో ఇలా వివరించారు.

“చీపురు పుల్ల శతకము – నీతి, హాస్యము ప్రధానముగా సామినేని వేంకటాద్రి కవి రచించిన శతకము, సామాన్య వస్తువు నితివృత్తముగ గ్రహించిన కృతిగా ప్రశస్తి వహించినది. మనము సాధారణముగా నిత్య ముపయోగించు వస్తువుల ప్రాధాన్యము దానికి గల ప్రయోజనమును నాలోచించము. అవసరము వచ్చినప్పుడు దానినొక పరికరముగ నుపయోగింతుము. చీపురు పుల్ల వైభవము వర్ణనాతీత మనియు, నలుమోముల దైవము కాని, రెండు వేల నాలుకలు గల నాగేంద్రుడు కాని చీపురుపుల్ల మహిమ నభివర్ణింపలేరని కవి వచించెను. అతి సామాన్యమైన చీపురు పుల్లపై పొత్తము రచించుటేమి? అని పరిహసించి పండ్లిగిలించు వారి పెదవులను చీల్చి హెచ్చరింపుమని కవి చీపురు పుల్లను కోరెను. వామనుడు బలి నణచుటకు వచ్చినప్పుడు రాక్షసుల గురువు శుక్రా చార్యుల కన్ను పొడిచినట్లు నేటి రాక్షసులను కూడ శిక్షింపు మని కవి చీపురు పుల్ల నర్థించెను.”

ఇంకా ఇందులోని అనేక చమత్కారాలను ఆయన విపులీకరించారు. భాగ్యవంతులు తిలకం దిద్దుకోడానికి వెండి పుల్లలు ఉపయోగిస్తే, కొందరు ఎదురుగా ఉన్న చీపురు పుల్లనే ఉపయోగిస్తారని, ఆ విధంగా శ్రీ చూర్ణ ధారులకు నదుటిపై మహావిష్ణువు అంశాన్ని నిలపడం వల్ల చీపురు పుల్ల పుణ్యం పొందుతోందని కవి చమత్కరించారు. భూతవైద్యులు భూతాలను పారద్రోలేందుకు చీపురు నుపయోగిస్తారని, వారి దుశ్చర్యలను అరికట్టే బదులు వారికి తోడుగా ఉండడం తగదని, భూతవైద్యులే దయ్యాల వలె ప్రవర్తిస్తారని, వారొనర్చే వైద్యం క్రూరమని కవి చీపురు పుల్లను మందలించారు.

చీపురు పుల్లకు మానవీయ, దృక్పథంతో సానుభూతిని ప్రకటించడం మరొక వైచిత్రి. స్త్రీ పురుషులు విపరీతంగా లావెక్కుతుంటే చీపురు పుల్ల మాత్రం చిరకాలం నుండి చిక్కిపోతున్నదని కవి చమత్కరించారు. ‘చీపురు పుల్లలా సన్నబడడం’ అన్న జాతీయం నుండి కవి ఈ భావాన్ని స్వీకరించి ఉంటారు. ఈ పద్యాన్ని గమనించండి –

“హరి మధ్య నడుము రోలై
వర బాహుల నర కరములు బలు రోళ్ళై బల్
పెరుగుచునుండిన, నీ విటు
చిరకాలము చిక్కియుందు చీపురు పుల్లా!”

అలాగే క్రీ.శ. 1814-1894 మధ్య జీవించిన చిరుమర్రి నరసింహ కవి పొగాకును గూర్చి 14 పాదాల చంపకమాల వృత్త మాలికను రచించి వస్తు పరమైన నవ్యతను ప్రదర్శించడం ఇక్కడ ప్రస్తావార్హం. మిర్యాలగూడ తాలూకా కంపాల పల్లి గ్రామ వాస్తవ్యుడైన ఈ కవి రచించిన ఈ కృతిలోని ఒక 4 పాదాలను మచ్చుకు పేర్కొంటున్నాను.

“ప్రొద్దున లేచి ధూమ్రదళ పుంజము కన్నుల కద్దుకోని, దా
ముద్దుగ చుట్ట దీర్చి, తన మోము పయిం ఘటియించి, మీసముల్
దిద్ది, పొగాకు వేడియును ధీజన కోటికి మోదమిచ్చి, తా
పెద్దల పేరు జెప్పి, పొగ చీల్చిన వాడు కృతార్థు డిమ్మహిన్”

ఇదే విధంగా ‘తెలుగు నాడు’ కావ్యంలో దాసు శ్రీరాములు కవి ‘పొడుము’ను గురించి వ్రాసిన పద్యం కూడా 19వ శతాబ్ది తెలుగు సాహిత్యంలో వస్తు నవ్యతకు అద్దం పడుతుంది.

“పాటి పొగాకు బై పయి మడ్డి గల బారు
దళసరి కొమ్మ ముక్కలు గ్రహించి
నడి మీనె దివిచి, చొప్పడ గణకణలాడు
మేలైన నిప్పుల మీద గాచి,
మంటి కొసను నల్పి, మంచి కర్రను నూరి,
తడి యొత్తి, సున్న మింత తగవైచి
నేర్పుతో గమ్మని నేయి కొంచెమ బోసి,
పొలుపైన వన్నెరా బొడుము జేసి
~
వెండి పొన్మూత గొలుసు బొబ్బిలి పసందు
సోగ మారెడు బుర్ర బోసుకొని, రొండి
నిడి, దలచినపు కించిత్తు పొడి గ్రహించి
బుర్రుమన బీల్చు బాపని ముక్కె ముక్కు!”

శ్రీరాములు కవి ఈ కావ్యంలో వివరించిన వివిధ రకాల బ్రాహ్మణ శాఖలు, వారి ఆచార వ్యవహారాలు, భాషా పద్ధతులు వివిరాలు కూడా వస్తు నవ్యతే కదా! ఇంకా ఈ కావ్యంలో ఆయన తెలుగు వారు జరుపుకొనే వివిధ రకాల పండుగలను గురించి కూడా పద్యాలను రచించారు. వస్తు నవ్యతకు ప్రతీకలుగా నిలిచే ఈ పండుగ పద్యాలలో నుండి మచ్చుకు దీపావళి పండుగ పై ఆయన రచించిన పద్యాన్ని చూద్దాం –

“చిటపట టుప్పుటప్పనెడి సీమ టపాకులు పెట్టెలెన్ని, యు
ద్భటముగ ఢమ్ముడుమ్మను టపాకుల వెన్ని మతాబులెన్ని, పి
క్కటిలెడి ఝిల్లు లెన్ని, మరి కాకర పూవతు లెన్ని, గాల్తురో
దిటముగ దెల్ప నా తరమె దివ్వెల పండుగ రేయి నర్భకుల్!”

ఇలా చిన్న, చిన్న అంశాలను తీసుకొని పద్య ఖండికలను రచించి, వాటినన్నిటినీ ఒక చోట గుదిగుచ్చి కావ్యరూపంలో ప్రచురించిన ఇతర కవులలో ‘శ్రీ సూక్తి వస్తు ప్రకాశకము’, ‘వసురాయ చాటు ప్రబంధము’ రచించిన వడ్డాది సుబ్బరాయ కవిని, ‘ఆంధ్ర పద్యావళి’ రచించిన ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మను కూడా పేర్కొనవచ్చు. ముఖ్యంగా ‘శ్రీ సూక్తి వస్తు ప్రకాశకము’ (క్రీ.శ. 1884) లో సుబ్బారాయ కవి – వినయము, కాలము, ఉద్యోగము, విద్య, సంభాషణము, స్నేహము, పరోపకారము, భూతదయ, క్రోధము, ఆశ, ఆపత్సంపదలు, దాతృత్వము – ఇలా ఎన్నో వస్తువులపై ఖండ కావ్యాల వలె శీర్షికలుంచి పద్యాలను రచించారు. ‘ఐకమత్యము’ అన్న శీర్షికతో రచించిన పద్యాలలో ఒకటి మచ్చుకు పేర్కొంటున్నాను.

“తల యొక దారి గాక ప్రమదంబున నల్గురు నేకమైనచో
దలచిన కార్యమేదయిన, దథ్యముగా నెరవేరు; బుట్టెడా
కలిగొని పోయి సిద్ధమగు కంచము నొద్దను గూరుచుండినం,
గుడుచుట యెట్లు వ్రేళ్ళయిదు గూడక వేరుగునేని? మిత్రుడా!”
(నాల్గవ పాదంలో ప్రాస భంగమయింది.)

దీనిని బట్టి 19వ శతాబ్దిలోనే పలువురు కవులు ఏ వస్తువూ అల్పమైనది కాదని భావించారని తెలుస్తున్నది. అసలు అల్పమైనదని కాకుండా శ్రీశ్రీ అన్నట్టు ‘కాదేది కవిత కనర్హం!’ అన్న భావనతో అనేక వస్తువులపై కవితలల్లిన కవులు 19వ శతాబ్దిలో చాలా మంది ఉన్నారని తెలుస్తోంది.

అలాగే సమకాలీన సమాజంపై, సంఘటనలపై కూడా 19వ శతాబ్దిలో అనేక కవులు ఎన్నో నవీన ప్రబంధాలను రచించారు.

2. సమకాలీన సంఘటనాత్మక, సామాజిక వస్తువులు:

క్రీ.శ. 1864 నవంబరు 1వ తేదీన బందరు పట్టణంలో మధ్యాహ్నం ప్రచండమైన గాలితో గూడిన వాన ప్రారంభమై పెను తుఫాను రేగింది. పగలే నగరమంతా కటిక చీకటి అలుముకొంది. రాత్రి పదిన్నర పదకొండు గంటల మధ్య 13 అడుగుల ఎత్తు కెరటం వేయితాళ్ళ ఎత్తున లేచి బందరు నగరం మీద పడి వీధులన్నీ తుడిచి పెట్టుకొని పోయింది. నగర జనాభాలో పదిశాతం కూడా బతికి బయట పడడం కష్టమైంది. ఆ తుఫానులో 2000 మంది జాలరులు బందరు సమీపంలో చనిపోయారు. బందరు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ కకావికలమైపోయాయి. ఆ దృశ్యాలన్నీ కళ్ళారా చూసిన రాయభట్ట వీర రాఘవ కవి అనే కవి ‘గాలివాన సీస మాలిక’ పేరిట ఒక కావ్యాన్ని ఏక ఛందంలో రచించారు. పూర్తిగా సీస పద్య మాలికగా రూపొందిన ఈ కావ్యానికి ‘తుఫాను సీస పద్య మాలిక’ అన్న నామాంతరం కూడా ఉంది. కవి బందరులోనే ఉండి చూచిన హృదయ విదారక దృశ్యాలను ఈ కావ్యంలో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. బహుశః కవి జీవిత కాలంలో ఏర్పడ్డ ఒక ప్రకృతి వైపరీత్యాన్ని కళ్ళారా చూచి వెంటనే కావ్యంగా అల్లడం ఇదే ప్రథమమేమో! 19వ శతాబ్దిలో తొలిసారిగా తెలుగు సాహిత్యంలో రూపుదిద్దుకొన్న వస్తు నవ్యతలలో ఈ సంఘటనాత్మక వస్తు నవ్యత ఒకటి. ఈ కవిని గూర్చి, ఈ రచనను గూర్చి ‘తెలుగు సాహిత్యకోశము’లో ఇలా పేర్కొని ఉంది.

“వీర రాఘవ కవి (1820-1910) సంప్రదాయ రీతిలో సలక్షణంగా రచనలు చేసిన పండితులు. కార్వేటి నగర సంస్థానానికి చెందిన అష్టదిగ్గజాలలో ఒకరు. వేంకట పెరుమాళ్ళరాజు బహద్దరు ఆస్థానంలో గౌరవాదరాలు పొందారు. బందరులో 1-11-1864న వచ్చిన తుఫానును వర్ణిస్తూ వీరు రచించిన సీస మాలిక చారిత్రికంగాను, సాహిత్యపరంగానూ విలువైనది. ఆ సంఘటనను ప్రత్యక్షానుభవంతో వర్ణించి ప్రకటించిన రచనలలో వీరిదే మొదటి రచన”.

ఇక ఈ సీస మాలికలోని విశేషాలను పరిశీలిద్దాం. కావ్యారంభంలో కవి ఈ గాలివాన ప్రారంభమయిన తిథి, వారాలను, తుంపరలుగా మొదలైన వాన జలప్రళయంగా మారిన వైనాన్ని కవితాత్మకంగా వర్ణించారు.

“రక్తాక్షి సంవత్సరంబున కార్తీక
శుద్ధమందున భూమి సుతదినంబు
విదియ నాడుదయంబు మొదలౌతుషారంబు
లంతంత కెక్కువై యంతకముగ
ప్రొద్దు గ్రుంకెడి వెన్క పొగరౌ తుషారంబు
గాలి వల్లనె లావు గాలి కీలి
ఉత్తరంబున బుట్టి మొత్తన పెళ్ళగిల్
కూకటి వేళ్ళతో కూలె తరులు
అచలంబు లల్లాడె – అవని తల్లడమొందె
దక్షిణ దిక్కంత తక్షణమున
నాతత సేతు శీతాచల మధ్యన
తెలియ జెప్ప న్నారు దేశములను
ద్వారక తొల్లి దూర్వాసు శాపంబున
నమరేంద్రు శ్రీకన్య నడగినట్లు
బందరు పురలక్ష్మి బలువు దుర్దశ బొందె –
మూడె – ఉప్పెన లోన మునుగు కొరకు!”

కవి ఈ కావ్యంలో తాను కళ్ళారా వీక్షించిన దృశ్యాలను మన కళ్ళకు కట్టేట్లు వర్ణించారు.

“గాఢాంధకారమై ఘన ఘన జ్యోతులు
కటికి రక్తచ్ఛాయ గడలుకొనగ
లసమాన తరమైన లవణ సముద్ర త
రంగంబు లాకాశ గంగతోడ
సంగమ క్రియకునై జనియెనో యనురీతి
వెయ్యోజనంబులు వెనుక దీసె
రాఘవ లంకలో లక్ష జోతులు జూచి
దుమికిన దొంగ ప్రొద్దున్న తరిని
హంసల దీవి మూలందున బయలెక్కి
వరదగా పరిపించె ధరణి మీద
వెయి తాళ్ళ యెత్తున వెడలుపు నిడు పౌచు
దరి పల్లెటూళ్ళు ముందరగ ముంచె”

అలా నష్టపోయిన అనేకమైన ఊళ్ళను గురించి, బందరు పట్టణంలో మునిగిన సరికెల్లి (Circle) పేట, కలకటెర్ కచ్చేరి మొదలైన వాటి గురించి విపులంగా వివరించారు. నష్టపోయిన వస్తువులను గురించి, అలాగే ప్రవాహంలో కొట్టుకపోయిన ఆభరణాలు, ఇతర వస్తువులను గురించి చాలా వివరంగా తెలియజేసారు.

“వైశ్యకుల సరుకులు వర్తకుల సరుకులు (గణ భంగాలున్నాయి)
కొబ్బరి బెల్లంపు కొట్లు గిట్లు (గణ భంగాలున్నాయి)
నేతి సిద్దియలు, ఆవాలు వెల్లుల్లి
ఆకులు పొగాకుల పెండెలు
చింత పండుప్పును జీలకర్ర మెంతులు (గణ భంగాలు, యతిభంగాలు – ఇలా అక్కడక్కడా ఉన్నాయి.)
మిరియాల్ లవంగాలు మోడి పిప్పలి”
“కంటెలు నానులు కంకణాల్ కడియాలు
ముక్కు పోగులును, చేర్చుక్క బొట్లు
నడుము వడ్డాణాలు నాను కోళ్ళును మరి
రాగిళ్ళు శశిపువ్వు రంగు మీర
కోటి సొమ్ములు బోయి కోట్లనే గలిసెను
(ఇక్కడ సగం పాదం ఎగిరిపోయింది)
శరవాలు, బిందెలు, కంచాలు పీటలు
రాటాలు, రథచయములు…”

ఇంకా మృత్యువు బారిన పడి కొట్టుకుపోయిన జంతువులు, పక్షులను గురించి సవిస్తరంగా వివరించారు. అలాగే ప్రవాహంలో కొట్టుకు వస్తున్న మానవ శవాలను గురించి హృదయ విదారకంగా వర్ణించారు.

“కనక దుర్గమ్మ ముక్కరగ తీతని పూని
వాడ వల్లియు గాంచి వార్థి తిరిగె
చిక్కని చక్కని స్త్రీ శవంబుల జూచి
మోర లెత్తెత్తేడ్చి మొరయు వారు
పట్టె మంచాలపై పతి, సతి రతి గూడి
వదలక కొట్టుక వచ్చువారు
సొమ్ము మీదాశలు నెమ్మెమ్మిడవ లేక
దయ్యంబులై వెంట దగులు వారు”

పైన కొన్ని పాదాలలో ఉన్న గణ భంగాలు, యతిభంగాలు ఎత్తి వ్రాయు లేఖకులు చేసిన తప్పులై ఉంటాయి. ఎందుకంటే కవి ఛందోవిజ్ఞానం, భావుకత ఇతర భాగాలలో ప్రస్పుటంగా గోచరమౌతున్నాయి. ముఖ్యంగా పట్టె మంచాలపై పతి, సతి రతి గుడి వదలక కొట్టుక వచ్చువారు’ వంటి దృశ్యం ఇటీవల వచ్చిన ‘టైటానిక్’ ఆంగ్ల చిత్రంలో చిత్రీకరించబడింది. చలన చిత్రాలే పుట్టని 19వ శతాబ్దిలోనే (క్రీ.శ. 1864 ప్రాంతంలో) కవి ఇలాంటి దృశ్యాన్ని కవిత్వం ద్వారా చిత్రించడం ఆయన దార్శనికతను, భావ శబలతను తెలియజేస్తున్నాయి. ఇలాంటి కావ్యాలు తమ దృష్టిలో పడకనే పింగళి లక్ష్మీకాంతం వంటి సాహితీ వేత్తలు 19వ శతాబ్దిని క్షీణయుగంగా పేర్కొని ఉంటారని భావించవలసి ఉంటుంది.

అలాగే గోదావరి నదికి వచ్చిన వరదలపై మరొక ప్రఖ్యాత కవి ఒక చాటు ప్రబంధాన్ని వెలయించారు. వడ్డాది సుబ్బరాయ కవి. క్రీ.శ. 1886 ప్రాంతంలో ‘గౌతమీ మహాజల మహిమాను వర్ణనము’ పేరిట రచించిన కావ్యంలో గోదావరి నదిని గూర్చి వరద ఉధృతి వలన కకావికలమైన రాజమహేంద్ర వరాన్ని గూర్చి నాలుగు వందల ముప్పయి పాదాల చంపక మాలా వృత్త మాలికలో వర్ణించారు. ఆంధ్ర మహాభారతం అవతారికలో రాజ రాజ నరేంద్రుడు నన్నయను తమ వంశీయుల చరిత్రను వ్రాయమని అభ్యర్థించినట్లుగా ఉండడం మనకు విదితమే. ఆపైన చాలా మంది కవులు భగవంతుడు కలలో కనిపించో లేక తమను పోషిస్తున్న రాజులో, జమీందారులో ఫలానా కావ్యాన్ని రచించమని కోరినట్టుగానో వ్రాసుకోవడం మనకు తెలుసు. కాని వడ్డాది సుబ్బరాయకవి ఈ కావ్యాన్ని హామ్నెట్ అన్న ఒక తెల్ల దొర రచించమని కోరినట్లుగా వ్రాసుకోడం ఒక నవ్య విషయం. బహుశః ఒక విదేశీయుని కోరికపై తెలుగులో కావ్య రచన ఇదే ప్రథమమేమో! ఆపైన కూడా ఇటువంటి సందర్భాలున్నట్టు కనిపించవు.

“పాలతియు, దాను హామ్నెటు విభుండు, సరూపములున్ సమోన్నతం
బులునగు నుత్త మాశ్వముల ముచ్చట నెక్కి యెదుర్పడంగ, నే
జెలగి సలాయొనర్ప, దమ స్నేహపు వెల్లికి నుద్ది యౌచు రం
జిలు ఝరి జూపి, నన్ను “మునిషీ! నదిపై నొక చిన్న కబ్బమున్
సలుపు మటంచు లే నగవు జంద్రిక నక్షి చకోరముల్ ప్రకా
శిల, దయ నానతిచ్చుటయు, జిత్తమటంచును వీడికొంటి..”

రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టర్‌గా పని చేసిన హామ్నెట్ దొర తన వద్ద కొంత కాలం తెలుగు నేర్చుకోవడం వల్ల తనను “మునిషీ!” అని పిలిచే వాడని కవి వివరణ నిచ్చారు.

సుబ్బరాయ కవి ఈ కావ్యంలో ముందు అనావృష్టి ఏర్పడినప్పుడు పరిస్థితులను వర్ణించి, తరువాత అతివృష్టి ఏర్పడ్డాక పొంగిపొర్లుతున్న గోదావరి వరద ప్రవాహంలో కొట్టుక పోయిన అనేక వస్తువులను వర్ణించి, ఆ రెండు పరిస్థితులలోని తారతమ్యాన్ని పాఠకుల కళ్ళకు కట్టారు.

“కలిగిన వేపగిం బొగిలి గ్రామము లాహుతులయ్యె; నెయ్యెడన్
గొలకులు శూన్యమయ్యె; మడుగుల్ బయలయ్యెను; వంకలింకె; గ
య్యలు వృథయయ్యె; బావు అడుగంటెను; గుంటలు, నూతులుం, దొనల్
చెలమలు వట్టె; నేళ్ళిగిరె, జెర్వులు, దొర్వులు శోషిలెన్, మహా
ప్రళయమునందు బోలె జలభాగములన్నియు రూపు మాయగా,
మలమల మాడె సస్యములు; మంగల మందలి పేల గింజలుం..”
…………………………………..
……………………………………
“తలుపులు, ద్వారబంధములు, ద్రావులు, బెండెలు వాసముల్, దనా
బులు, గిటికీలు, దూలముల్, బొంగులు, గుజ్జులు గంబముల్ మొదల్
గల కణజంబులుం, బెసలు, గందులు, సెస్టలు, మిన్ము లమ్ములుం..”

ఆనాటి వరద బాధితుల మనోభావాలను కూడా కవి చాలా సహజంగా చిత్రించారు.

“..మన పాలిటి కీ పెను భూత మేటికిం
బిలువని పేరటం బిటు లభించెను బో దనువారు, నేరయో
నిలువ యొనర్చె గొంపలకు నీళ్ళను వారు, శత్రుసేనయుం
బలె నిలు ముట్టడించె ఝరి, మా బ్రదుకెట్లను వారు, మిద్దె మే
డలు గల వారమే? యెచట దాగుదు మేమను వారు, నాలు బి
డ్డల మిటు పడ్డ పాటు పదటం గలిసెన్; నువు, గొర్ర, చామ, గం
టెలు మొదలైన పంటలు మునింగె గటా! యనువారు, జాలమున్
గలకను గాళ్ళవ్రేళ్ళబడి, క్రన్నన బైరును జుట్టు ముట్టె బెన్
జలమున, నీచ వర్తనుల నైజమిదే యను వారు, డ్రాగనున్
జలములు లేకనాడు, బశు సస్య గృహాదులు మున్గినేడు, మే
మలమర నయ్యె జూడు – డతి యన్నిట గీడను వారు..”

వసురాయకవిగా ప్రసిద్ధులైన వడ్డాది సుబ్బరాయ కవే, క్రీ.శ. 1884లో ‘గోదావరి ధూమ నౌకా విహారము’ అన్న మరొక వస్తు నవ్యత గల చాటు ప్రబంధాన్ని కూడా రచించారు. కవి ఒక ఆదివారం సెలవు దినాన – జేవలి సోమయ, మంగు వేంకటాచలం, నిడమర్తి దుర్గయ, జోగిలింగం అనే నలుగురు మిత్రులతో కలిసి గోదావరి లో పొగనావపై బొబ్బరిలంకకు ‘సికారు’గా వెళ్ళిన ఉదంతాన్ని వస్తువుగా నెంచుకొని కావ్య నిర్మాణం చేయడం నిజంగా అద్భుతం. 19వ శతాబ్దిలోనే ఇలాంటి నవ్యమైన ఆలోచనతో కావ్యాన్ని నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలుగు సాహిత్యంలో ఇలాంటి కావ్యాలు చాలా అరుదు అని చెప్పక తప్పదు. కొన్నాళ్ళ క్రితం తెలుగులో ‘అందాల రాముడు’ అన్న చలన చిత్రం, ఇటీవల ‘గోదావరి’ అన్న చలన చిత్రం ఇలాంటి కథా వస్తువుతోనే రూపొందడం మనకు విదితమే.

కవి ఈ కావ్యంలో నౌకా విహారంలో కలిగిన ప్రత్యక్షానుభూతులను చక్కగా వర్ణించారు. ధూమనౌక వేగంగా ముందుకు వెళుతున్నప్పుడు ఒడ్డుపై నున్న చెట్లు, ఇళ్ళు, మేడలు వెనుకకు పరిగెత్తినట్లు కనిపించడాన్ని “ప్రళయము పుట్టినట్టులు ధరాజము, లిండ్లును, మేడలున్ మనుష్యుల వలె బర్వులెత్తె” అని వర్ణించారు. “ధూమనావ శరవేగమునం జనుచుండునప్పు డవ్వలి దరి నుండి వచ్చు పడవల్ పెనుగాలికి నెత్తి నట్టి చాపల గర మేటవా లగుచు, వంగి సలాములు సేయు భృత్యులుం బలె నెదురయ్యె” వంటి పద్యపాదాలు కవి భావనా పటిమకు అద్దం పట్టాయి. నౌకా విహారం చేస్తూ వీక్షించిన అనేక విషయాలను ప్రయాణికులు ఆ సమయంలో మాట్లాడుకున్న విషయాలను, తదితరాలను కూడ కవి చాలా విపులంగా వివరించారు.

“..యట పైనొక గుట్టను జూపు మేరలో
విలసిలు దూర్పువైపున హవేలి యొకండది జూచి, పూర్వమా
స్థలమున బాలెముల్ దిగుట, దద్గృహముం బడవాలు వాసమున్
సలుపగ గట్టిరంచు ముదుసళ్లొక కొందరు సెప్ప వించు, న
వ్వల ధవళాద్రి నెత్తమున స్వామి జనార్దనాలయంబు న
ర్మిలి గని, రాజశేఖర చరిత్రమునం గవి లింగ మచ్చపుం
బలుకుల దేట తెల్లముగ వ్రాసిన యంశములన్ దలంచుచున్..”

అంటూ ఆయా ప్రదేశాలను చూచినప్పుడు సాటికవి వీరేశలింగం రచించిన ‘రాజశేఖర చరిత్రము’లోని అంశాలను గుర్తు తెచ్చుకొని “అచ్చపుం బలుకుల దేట తెల్లముగ” వ్రాసారని ప్రశంసించడం సుబ్బరాయ కవి సహృదయతకు నిదర్శనం. కవి ఈ కావ్యాన్ని మొత్తంగా ఆత్మాశ్రయ రీతిలో రచించడం రోజుల్లో మరొక నవ్యతగా భావించవలసి ఉంటుంది.

వినూత్నమైన వస్తువుతో 19వ శతాబ్దిలో ఒక నవ్య కావ్యంగా రూపుదిద్దుకొన్న ఈ ‘గోదావరి ధూమనౌకా విహారము’ రస దృష్టితో చూచినా ఒక ఉత్కృష్టమైన కావ్యమని అంగీకరించక తప్పదు.

ఇంతకు ముందు అధ్యాయంలో వివరించినట్లు, క్రీ.శ. 1860లో మతుకుమల్లి నృసింహ కవి రచించిన ‘చెన్నపురీ విలాసము’ లో కూడా కవి తాను ప్రత్యక్షంగా చూచిన ఒక ఆధునిక మహా నగరాన్ని (చెన్న పట్నం) వర్ణిస్తూ రచించడం వస్తు నవ్యతగా భావించవచ్చు. అదే స్ఫూర్తితో ఆయన సోదరుడు మతుకుమల్లి కృష్ణ శాస్త్రి రచించిన ‘మచిలీ బందరు చరిత్రము’ క్రీ.శ. 1879లో వెలువడింది. క్రీ.శః 1862లో కొప్పరాజు నరసింహ కవి రచించిన ఆధునిక క్షేత్ర మాహాత్మ్య కావ్యం ‘శ్రీమత్రి కూటాచల మాహాత్మ్యము’లో కోటప్ప కొండ జాతరను వర్ణించిన తీరు వస్తు నవ్యతకు అద్దం పడుతోంది. కవి సకుటుంబంగా క్రీ.శ. 1852లో శివరాత్ర్యుత్సవానికి వెళ్ళినపుడు కళ్ళారా వీక్షించిన జాతర దృశ్యాలను పఠితలకు కళ్ళకు కట్టేలా వర్ణించారు. ముఖ్యంగా జాతర రోజు కొండపైన, కొండ క్రింద గల విపరీతమైన భక్తుల రద్దీని, ఉత్సవాలకు తరలివచ్చిన ‘ప్రభల’ను వర్ణిస్తూ, అందులో తన భావుకతను కూడా కొంత జోడించి కవి రచించిన ఈ పద్యం కడు రమణీయం.

“పై నున్న జనము లాపైన నిల్చిన యట్టి
ప్రభలకు గట్టు దర్పణములందు
క్రింది యుత్సవముల బొందుగా నీక్షించి
బహుళోత్సవంబు లీ పర్వతమున
బరగుచున్నవటంచు భ్రాంతిచే భావించి
యందె నిల్చిరి; గిరి క్రింది జనులు
క్రిందటి ప్రభల నింపొందు నద్దములందు
కుధరంబుపై నుండు గుడిని గాంచి
ఇచటి భక్తుల బ్రోవ గోటీశ్వరుండు
పరగ గుడితోడ గ్రిందికి వచ్చెననుచు
భ్రాంతి నీక్షించి యచటనే పాయకుందు
రద్భుతము గాదె యాచంద మరసిచూడ!”

అలాగే కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’ కావ్యం కూడా సమకాలీన సంఘటన పై వ్రాసింది కాకపోయినా, కవి గతంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను కావ్యంగా మలచడం వస్తు నవ్యతే కద! క్రీ.శ. 1899లో రచింపబడిన ఈ కావ్యాన్ని కవి, బ్రౌను దొర ప్రకటించిన ‘అనంత పుర చరిత్రము’ అన్న గ్రంథంలో పేర్కొన్న ఒక వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకొని రచించినట్టు చెప్పుకొన్నారు. గ్రామ క్షేమం కొరకు ఆత్మ త్యాగం చేసిన ఒక గృహిణి కథను రెడ్డిగారు కరుణారసపూరంగా చిత్రించిన వైనాన్ని ఇంతకు ముందు అధ్యాయంలో వివరించడం జరిగింది.

ఇలా 19వ శతాబ్దిలోనే సాధారణ వస్తువులపై, సమకాలీన సమాజంపై మరియు సంఘటనలపై నవ్య దృష్టితో కావ్యాలను రచించి వస్తు నవ్యతను ప్రదర్శించిన కవులుండడం గమనించాలి. ఇలాంటి దృష్టి కేవలం 20వ శతాబ్ది నవ్య కవిత్వ యుగంలోనే ప్రారంభమయిందని భావించడం 19వ శతాబ్ది తెలుగు సాహిత్యానికి అన్యాయం చేయడమే అవుతుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version