[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]లో[/dropcap]నికి రాగానే “అమ్మా….” అంటూ ఎదురుగా వచ్చి ప్రేమగా అల్లుకుపోయే పిల్లలు కనబడక పోయేసరికి “చిట్టీ… చిన్నీ… అంటూ లోనికి తొంగి చూసా. ఆ గూటిలో ఓ మూల బిక్కుబిక్కుమంటూ భయం భయంగా నా ఇద్దరు పిల్లలు. నన్ను చూసీ చూడగానే “అమ్మా” అంటూ వాటేసుకుని బావురుమన్నారు.
“ఏమైంది చిట్టీ”
“మలి, మలి” ఏదో చెప్పబోతూ చిట్టి చెప్పలేక వెక్కివెక్కి ఏడవ సాగింది.
“నువ్వైనా చెప్పు బంగారం” అన్నాను చిన్నిని చూస్తూ
చిన్నదైనా చిన్ని కొంచెం గడుసైనదే. ధైర్యం ఎక్కువ. చిట్టి వట్టి పిరికిది.
“మలి… ఆలొచ్చారుగా” అంది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ
“ఎవరు?” అన్నాను సందేహంగా
“ఆలే… బూచాళ్లూ”అంది చిన్ని
“ఓ… మనుషులా”
“ఆఁ… ఆఁ…ఆళ్ళే” చిట్టికి కొంచెం ధైర్యం చిక్కినట్టుంది
“నేను వచ్చేసానుగా ఇక వాళ్లు రారు” అన్నాను ధైర్యం చెబుతూ
“మల్లీ వత్తాలేమో”అన్నారు ఇద్దరూ ఒకేసారి
“మళ్ళీ వస్తే ఏం చేయనూ” మాటలతో వాళ్ల భయం పోగొట్టాలని నా ప్రయత్నం
“ముత్తు తోసెయ్”అంది చిట్టి
“వద్దు పిలత తోసెయ్” అంది చిన్ని
“ముత్తు”
“తాదు… పిలతే”
“ముత్తే”
“పిలతే”
ఇద్దరు కాసేపు వాదులాడు – కున్నారు. వాళ్ళ ముద్దు ముద్దు మాటలకు నాకు సమయమే తెలియలేదు. ఇద్దరినీ గోముగా వారించి ఒడిలోకి తీసుకుని గోరుముద్దలు తినిపించ సాగాను.
***
“నాతు ఇంతా బువ్వ కావాలి” అంది చిన్ని మారాము చేస్తూ
నా చేతిలో ఆఖరి ముద్ద… నన్ను వెక్కిరిస్తూ…
పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని పాపిష్టి బతుకై పోయింది. ‘దేవుడా ఈ కష్టం ఏ తల్లికీ రానీకు తండ్రీ’
“బువ్వ కావాలా…. కథ చెబుదామనుకున్నానే”అన్నాను కన్నీళ్లు దిగమింగుకుని, వాళ్ల ధ్యాసను మళ్ళిస్తూ
“నాతు వద్దులే చెల్లికి పెత్తు”
చిట్టి ఇప్పుడిప్పుడే నా కన్నీళ్లకు అర్ధం తెలుసుకుంటోంది. ఆఖరి ముద్ద తినిపించి, మూతి తుడిచి జో కొడుతూ కధ చెప్ప సాగాను.
***
‘అనగనగా ఒక అడవి. అందులోని జంతువులన్నీ ఎంతో సంతోషంగా కలసి మెలసి జీవిస్తూ ఉండేవి.’
పిల్లలు “ఊఁ…” కొడుతూ వింటున్నారు.
‘ఒకరోజు ఆ అడవిలోకి ఒక పెద్దపులి వచ్చింది. కనిపించిన ప్రతీ జంతువునూ చంపి తినేసేది. కొన్ని రోజులకు ఒక్క జంతువూ మిగలలేదు. ఆకలితో మలమల మాడి చివరకు ఆ పెద్దపులి కూడా దిక్కులేని చావు చచ్చిoది.’
అప్పటికే పిల్లలిద్దరూ నిద్రలోకి జారిపోయారు. కథ లోని పెద్దపులి… మనిషిని… విచక్షణ లేకుండా ప్రకృతిని నాశనం చేస్తున్న మనిషికి పెద్దపులికి పట్టిన గతే పడుతుందని తెలుసుకునే వయసు ఇంకా రాలేదా పసికూనలకు.
ఐనా ఈ మనిషికి మా పిచ్చుక జాతి మీద ఇంత కక్ష దేనికో…! కూడు కరువై,గూడు దూరమై,బతుకు బరువై చావలేక బతుకుతున్న మాపై జాలి చూపడే…!!
గూడు అంతటా చీకట్లు పరుచుకుంటుంన్నాయి.రాబోయే పెనుప్రమాదానికి గుర్తుగా.
***
“అమ్మా…” అన్న అరుపు విని ఉలిక్కిపడి లేచి చూసా. చిట్టి వెక్కివెక్కి ఏడుస్తోంది “బూచాలు, బూచాలు” అంటూ.
“చిట్టీ… ఇటు చూడు, అమ్మను నీ పక్కనే ఉన్నానుగా. భయపడకు తల్లీ” అంటూ దగ్గరగా తీసుకుని ఊరడిoచాను.
***
ఒకప్పుడు ఈ చోటు ఎంతో అందంగా పచ్చగా వుండేది. కళకళలాడుతూ, కిలకిలలాడుతూ.కానీ ఇప్పుడు…? అక్కడొకటి ఇక్కడొకటీ చెట్లు మాత్రమే మిగిలాయి మోడుగా, మొండిగా. సత్తువగల గువ్వలు ఎగిరిపోయాయి. కొత్త తావును వెదుక్కుంటూ… సత్తువ లేనివి మిగిలిపోయాయి రోజులు లెక్కబెట్టుకుంటూ. ఒకసారి గూడు అంతా పరికించి చూసా. నేను, నా పెనిమిటి పుడక, పుడక పేర్చి కట్టుకున్న పొదరిల్లు.ఇప్పుడు పెద్ద గాలి వీస్తే పడిపోయేలా ఉంది. కొత్త పుడకలు తేవాలి. పుడకలు ఎక్కడి నుండి తెచ్చేది? దొరకడమే కనాకష్టమై పోతుంటే.
ఐనా ఇంతకు ముందులా ఎగరలేకపోతున్నాను. గుండెల్లో ఏదో అలజడి.నరాలు మెలి పెట్టినట్టు, గొంతు నులిమినట్టు. మరీ ముఖ్యంగా ఆ పెద్ద, పెద్ద ఇనుప చట్రాల స్తంభాల (సెల్ టవర్) పక్కగా ఎగురుతుంటే. ‘నాకు ఏదయినా ఐతే నా పిల్లలు…?’ ఆ ఊహే భరించలేకపోయాను. ఈ మనుషులు కూడా నాలాగే తమ పిల్లల గురించి ఆలోచిస్తారా…? తమ గురించి, తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారేమో…! లేకపొతే మాకీ కష్టాలెoదుకు? కన్నీళ్ళెందుకు?
***
అప్పుడప్పుడే తెల్లారుతోంది. పిల్లలింకా నిద్ర పోతున్నారు.’నా బంగారు కొండలు’ అని ముద్దులాడి ‘ఈ రోజు ఎలాగైనా పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టాలి’ అనుకుంటూ నింగిలోకి ఎగిరిపోయా. అలా ఎగురుతూనే ఉన్నా సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు.ఒకప్పుడు ఎక్కడ చూసినా పంట పొలాలే. గింజలకు కొఱతే ఉండేది కాదు.మరి ఇప్పుడు ఎక్కడ చూసినా జనాలే. ఇబ్బడి ముబ్బడిగా.ఇళ్ళే అంతస్తులపై అంతస్తులుగా.ఎలాగో కాసిన్ని గింజలు సంపాదించి వెనుదిరిగా.
‘అబ్బా…”గుండెల్లో నొప్పి సన్నగా మొదలైంది. ఎదురుగా ఆ రాకాసి (సెల్ టవర్) వికృతంగా నవ్వుతూ. దారి మళ్ళా. అక్కడా అదే. ఎటు వెళ్ళినా అవే. మాపాలిట యమదూతల్లా.ఎలాగో తప్పించుకుని నా గూడు వైపు సాగిపోయా.నా మనసెందుకో కీడును శంకిస్తోoది. పిల్లలు పదే పదే గుర్తుకు వస్తున్నారు. ‘దేవుడా…నా పిల్లలు అమాయకులు.వాళ్లకి ఏ ఆపదా రానీకు తండ్రీ’ అని మనసులో వేయిసార్లు మొక్కుకుంటూ గబగబా ఎగురుతున్నాను.అల్లంత దూరం లో నా గూడున్న చెట్టుకు దగ్గరగా ఒకపక్క జనం,మరోపక్క పెద్ద పెద్ద
యంత్రాలు.’ఏం జరుగుతోంది? నా గూడు ఏదీ? నా పిల్లలు ఎక్కడ? నా వజ్రాల మూటలు, రత్నాల రాసులు,బంగారు కొండలు ఎక్కడా కనిపించరే…!’
అటూ ఇటూ దిక్కు తోచకుండా ఎగురుతున్నాను గుండెలు అవిసేలా. కోపం, కసి, నిస్సహాయత నాలో ముప్పిఱి గొoటున్నాయి. ఎగిరి ఎగిరి అలసిపోయానేమో… నీరసం ముంచుకొస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి. స్పృహ తప్పుతోంది. నేలపై రాలిపోతున్నాను.
మగతగా ఉంది. కళ్ళు తెరవాలని ఉన్నా తెరవలేక పోతున్నా. గుండె గొంతుకలో కొట్టుమిట్టాడుతోంది. ఇంతలో ఏదో ఆత్మీయ స్పర్శ. బలవంతంగా కళ్ళు తెరిచి చూసా…నా రెక్కలకు అందేటంత దూరంలో నా… పిల్లలు నిస్తేజంగా… నిర్జీవంగా… నిజంగా. ఆ అమాయకపు పసి రూపాలను కళ్ల నిండా నింపుకుంటూ అలా ఉండిపోయాను, ఎక్కడ రెప్ప వేస్తే ఆ రూపం కరిగిపోతుందోనని. ఆ రెప్పల నుండి ప్రాణం బయటకు పోవడం నాకు తెలుస్తూనే ఉంది.