[dropcap]ప్ర[/dropcap]తి సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించే విమలాశాంతి సాహిత్య పురస్కారాల కోసం ఈ ఏడు రచయిత్రుల నుండి 62 కథా సంపుటాలు పోటీకి వచ్చాయి.
ప్రాథమిక పరిశీలనలో ఎంపికయిన 32 కథాసంపుటాలను న్యాయ నిర్ణేతలకు పంపగా వారు సమగ్రంగా పరిశీలించి ఇద్దరు రచయిత్రులను పురస్కారాల కోసం ఎంపిక చేశారు. న్యాయ నిర్ణేతల నిర్ణయం ప్రకారం సుజాత వేల్పూరి (గుంటూరు జిల్లా) గారి ‘పల్నాడు కథలు’, ఎండపల్లి భారతి (చిత్తూరు జిల్లా) గారి ‘బతుకీత’ కథా సంపుటాలకు ‘విమలా స్మారక కథా పురస్కారాలు-2022 ‘ ను ప్రకటిస్తున్నాం.
అట్లే , పద్దం అనసూయ (భద్రాద్రి జిల్లా) గారి ‘చప్పుడు’ కథాసంపుటికి స్పెషల్ జూరీ అవార్డు ఇస్తున్నాం. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి ₹ 7500/-, జూరీ అవార్డీకి ₹ 1116/- ప్రకటిస్తున్నాం.
పురస్కార గ్రహీతలను మనసారా అభినందిస్తున్నాం. ముఖ్యంగా 5వ తరగతి వరకు మాత్రమే చదువుకొని, పల్లెలో దళిత మహిళగా, వ్యవసాయ కూలీగా జీవనం కొనసాగిస్తూ కథా రచయిత్రిగా మారిన ఎండపల్లి భారతి గారి ‘బతుకీత’ కథలు ప్రసిద్ధ సాహిత్యవేత్తలైన న్యాయ నిర్ణేతలు మువ్వురినీ ఆకర్షించడం హర్షణీయం.
ఈ పురస్కారాల ఎంపిక ప్రక్రియలో న్యాయ నిర్ణేతలయిన శీలా సుభద్రాదేవి, కె.వరలక్ష్మి, ఆచార్య కిన్నెర శ్రీదేవి గార్లకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం. పురస్కార కార్యక్రమ వివరాలను త్వరలో ప్రకటిస్తామని సవినయంగా తెలుపుతూ –
డా.శాంతి నారాయణ
విమలాశాంతి సాహిత్యసేవా సమితి