2023 ఉగాది కవిసమ్మేళనం – ప్రెస్ నోట్

0
2

ఘనంగా ఉగాది కవిసమ్మేళనం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం

[dropcap]శ్రీ[/dropcap] శోభకృత్ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని పాలమూరు సాహితి, లుంబిని పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 19న మహబూబ్ నగర్ పట్టణంలో గల లుంబిని పాఠశాలలో నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కవి సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడా, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని సంస్కరింపజేసేదే కవిత్వమని అలాంటి కవిత్వమే సమాజంలో నిలుస్తుందన్నారు. పాలమూరు జిల్లా సాహిత్యపరంగా ముందు వరుసలో ఉందన్నారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలు మృగ్యమైపోతున్నాయని వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కవులపై ఉందని అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా కవిసమ్మేళనం నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఉగాది పండుగ కంటే ముందే లుంబిని పాఠశాలలో కవులు కవితాగానం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి సంవత్సరం కొత్త కవులను తయారుచేస్తున్నందుకు ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.

ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రముఖ పరిశోధకులు డాక్టర్ పి. భాస్కరయోగి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గత పదహారు సంవత్సరాలుగా ఉగాది కవిసమ్మేళనం నిర్వహించడం నిజంగా గొప్ప విషయమన్నారు. కవులు కవిత్వం రాసే ముందుగా అధ్యయనం చేయాలన్నారు. బాగా పుస్తకాలు చదవాలన్నారు. సమాజం కోసం రాసిన కవిత్వమే నిలుస్తుందన్నారు.

సభకు లుంబిని హైస్కూలు డైరెక్టర్ కె.లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షత వహించారు. కవిసమ్మేళనాన్ని డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ నిర్వహించారు.

అనంతరం ప్రముఖ కవులైన వల్లభాపురం జనార్ధన, పులి జమునలకు శ్రీ శోభకృత్ ఉగాది పురస్కారాలను అందించారు. అలాగే కవిసమ్మేళనంలో పాల్గొన్న ప్రతి కవిని మెమెంటోలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, బీజేపీ నేత కొండయ్య, ఎస్.విజయకుమార్, జగపతిరావులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here