[dropcap]సం[/dropcap]చిక నిర్వహిస్తున్న దీపావళి కథల పోటీకి 300 పైగా కథలు పంపి పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు.
ఈ 300 కథలను వడబోసి 139 కథలను ప్రత్యేక పరిశీలనకు ఎంపిక చేశాము. వీలయినంత వరకూ సంచికకు అందిన కథలను తిప్పి పంపటం జరగదు, రచయితలు కోరితే తప్ప. ఏవైనా మార్పులు సూచించటమో, అనుమతి తీసుకుని మేమే మార్పులు చేసో కథలను ప్రచురిస్తాము. పలు సందర్భాలలో రచయితకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, కథలలో మార్పులేమీ చేయకుండా ప్రచురించి, మార్పు చేస్తే ఎలా వుంటుంది, చేయకపోతే ఎలా వుంటుందో రచయిత గ్రహించేట్టు చేస్తాము.
ఎంచుకున్న 139 కథలు ప్రాథమికంగా, సాధారణ ప్రచురణకు స్వీకరించినట్టన్నమాట. వీటిని కొన్ని ప్రామాణికాలు ఏర్పరచి ఆ ప్రామాణికాల ఆధారంగా చక్కని కథలు ఎంచుకుని, ఆ ఎంపికయిన కథల నుంచి బహుమతికి అర్హమయిన కథలను 30 కథలను వేరు చేశాము. ఈ కథలలోంచి బహుమతి కథల ఎంపిక జరుగుతుంది. ఇలా ఎంపికయిన కథల జాబితా దీపావళి నాడు ప్రచురిస్తాము. అదే రోజు సూర్యోదయ సమయానికి బహుమతి సొమ్ము రచయితలకు అందుతుంది. అదే రోజు, సాధారణ ప్రచురణకు ఎంపికయిన రచనల జాబితా ప్రచురితమవుతుంది. ఒకవేళ ఏ రచయితకయినా తన కథ సాధారణ ప్రచురణ అవటం ఇష్టంలేక, ఆ కథను వేరే పోటీకి పంపించుకునేట్టయితే ముందు తెలపాల్సి వుంటుంది.
ఇక మిగిలిన కథల రచయితలను ఫోను ద్వారా సంప్రతించి వారి కథల గురించి చర్చిస్తాము. అవసరమయిన మార్పు చేర్పులను సూచించి ఆ తరువాత సంచికలో ప్రచురిస్తాము.
అయితే, కథల పోటీతో పాటూ, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల, దీపావళికే విడుదల కావాల్సిన సైనిక కథల సంకలనం ప్రచురణ కాస్త ఆలస్యమవుతుంది.
దీపావళి నాడు, సైనిక కథల సంకలనంలో ఎంపికయిన కథల జాబితా కూడా ప్రచురితమవుతుంది.
సంచిక రచయితల పత్రిక. కథను పంపిన రచయితలనుభవించే ఉద్విగ్నతను సంచిక అర్థం చేసుకుంటుంది. అందుకే, ఇలా అప్‌డేట్ ఇవ్వటం.
రచయితలు లేకపోతే పత్రికలు లేవు. ఎడిటర్లు లేరు. పుస్తకాలుండవు. పబ్లిషర్లుండరు.. ఇది సంచికకు తెలుసు. అందుకే సంచికలో రచయితలకు అత్యంత ప్రాధాన్యం..