Site icon Sanchika

2024 మేడారం జాతర ప్రత్యేక కవితలు

[2024 మేడారం జాతర సందర్భంగా విమెన్ రైటర్స్ అసోసియేట్ సభ్యులు రచించిన భక్తి కవితలని అందిస్తున్నాము.]

విమెన్ రైటర్స్ అసోసియేట్ వ్యవస్థాపకురాలు నెల్లుట్ల సునీత. నిర్వహణ: శ్రీమతి విజయ శ్రీదుర్గా. మహిళా కవితల కోసం 2021లో మహిళల ఆత్మగౌరవ ప్రతీకగా ఈ సాహితి వేదికను వ్యవస్థాపించి సృజన రంగంలో కవయిత్రులను ప్రోత్సహిస్తూ సాహిత్య మెలకువల్ని తెలుపుతూ పలు ప్రత్యేక సందర్భాలలో సమకాలీన సామాజిక అంశాలపై సాహిత్య పోటీలు నిర్వహిస్తూ ఉత్తమ రచనలకు విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేస్తూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ మహిళా సాహిత్యంలో స్ఫూర్తిదాయకంగా విమెన్ రైటర్స్ అసోసియేట్ ప్రత్యేక వేదికగా కొనసాగుతుంది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతర సందర్భంగా కవితల పోటీలు నిర్వహించగా బృందం సభ్యులు నుంచి అనేక రచనలు వచ్చాయి.
~
1. అనుగ్రహం

తెలంగాణలో పేరుగాంచిన ఉత్సవం
జనుల మదిలో ఉప్పొంగే ఆనందోత్సవం
ఆటపాటలతో సాగే హోరెత్తించే సంబరం
భక్తితో పూజించే గిరిజన పర్వదినం
వనదేవతలుగా పూజలందుకునే సాంప్రదాయం….

ఆసియా ఖండంలో అరుదైన మహాత్యం
తండోపతండాలుగా తరలివచ్చే జనం
ఆపదలనుంచి కాపాడే ఆపద్భాందవ దైవం
రెండేళ్లకి ఒకసారి జరిగే ఆచారం
విగ్రహాలే లేని సమక్క సారక్క దివ్యరూపం…..

రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం
కుంభమేళని సంతరించుకున్న ప్రాముఖ్యం
సామంత కాకతీయుల మధ్యసాగిన వైరం
స్వయంగా జంపన్న చేసుకొన్న ప్రాణత్యాగం
ధైర్యంగా పోరాడిన సమక్క వీరత్వం…..

నాలుగు రోజుల పాటు నిర్విరామంగా
కొనసాగి మొదటి రోజు సారలమ్మని గద్దె పై
రెండో రోజు భరిణెరూపంలో సమ్మక్కని
గుట్టపై భక్తసందోహానికి దర్శనభాగ్యం కలిపించగా భక్తులు
మొక్కులు తీర్చుకొని తరించేరు ఆ మహిమ
అంతా ఇంతా కాదు చూసిన వారికి కన్నులపండుగ
వినిన వారికి ఆ అమ్మల అనుగ్రహం……

రచన: యామిని కోళ్ళూరు


2. మేడారం జాతర

కారడివిని మేడరాజు వేట కెళ్ళే
కేరింతల పాప కనిపించే పుట్టమీద
సరదాపడి రాజు సమ్మక్క అని పేరు పెట్టే
పుట్ట చుట్టూ పులులు సింహాలు పాపకు కాపు కాచే
దేవతగా తలచి కొలిచారు
రుగ్మతలను బాపే మహిమాన్విత సమ్మక్క
పగిడిగిద్ద రాజు కిచ్చి పెళ్లి చేసే
చక్కని సంసారంలో సారలమ్మ నాగులమ్మ జంపన్నలకు జన్మనిచ్చే
కాకతీయ ప్రతాపరుద్రుడు కాంక్షతో పొలవాసపై దండెత్తే
మేడరాజు పారిపోయే మేడారం
కరువు కాటకాలతో కప్పం కట్టలేదని పాలవాసురాజు ఆశ్రయమిచ్చాడని ఆగ్రహంతో దండయాత్ర కావించే ప్రతాపరుద్రుడు…
కుటుంబమంతా ఎదురేగి పోరాటం చేసి సేన దాటికి తట్టుకోని కుటుంబం వీరమరణ మొందారు
అవమానం సహించని జంపన్న వాగునాశ్రయించే
సమ్మక్క కాళియై కాకతీయ సైన్యాన్ని వీరోచితంగా పోరాడి హతమార్చింది
శత్రువుల చేతికి చిక్కిన సమ్మక్క
రక్తపు ధారలలో చిలుక గుట్టపై
అదృశ్యం అవుతుంది
జాడ లేని నీడలా కుంకుమ భరిణ కనిపించే
అప్పటినుండి మాఘశుద్ధ పౌర్ణమి రోజున రెండేళ్లకి ఒకసారి సమ్మక్క జాతర జరుగుతుంది…
నాటికి నేటికీ సమైక్యతా చిహ్నం గా మేడారం జాతర
మహా ఉత్సవంగా అలరారుతున్నది….

రచన: శ్రీమతి సత్య వీణా మొండ్రేటి


3. మేడారం జాతర

సమ్మక్క సారక్క జాతర
ఆసియాలోనే అతిపెద్ద జాతర
తెలంగాణ రాష్ట్ర పండుగ
చూడచక్కని తెలుగు సున్నితంబు

గిరిజన ప్రజల దేవత
కష్టాలను కడతీర్చే అమ్మ
కోరికలను నెరవేర్చే తల్లి
చూడచక్కని తెలుగు సున్నితంబు

నిండుజాతర నాడు సమ్మక్క- సారక్కను
పూనకాలతో గద్దలపై ప్రతిష్టించి
గిరిజనలే పూజారిగా వ్యవహరిస్తారు
చూడచక్కని తెలుగు సున్నితంబు

అంగరంగ వైభవంగా జాతర
పసుపు కుంకుమ భరణితో
చీరగాజులు అమ్మకి సమర్పిస్తారు
చూడచక్కని తెలుగు సున్నితంబు

లక్షలాదిమంది వచ్చి వెన్నతెచ్చి
జంపన్న వాగులో స్నానమాడి
బంగారంతో మొక్కులు చెల్లించుకొందురు
చూడచక్కని తెలుగు సున్నితంబు

రచన:మహమ్మద్ చాంద్ బేగం


4. కీర్తిస్తు పాడేరు

సంపెంగ వాగు యే జంపన్న వాగాయె
చిలుకల గుట్టయే తల్లి సమ్మక్కను గుట్టుగా తప్పించె
గిరిజిన జాతరే జన జాతరై సాగి
రాష్ట్ర పండుగగా వన్నెతెచ్చుకొనగ

బంగారు కానుకగ బెల్లాలు అర్పించ
ఇసకేస్తె రాలని భక్తులతొ నిండగా
వంశపారం పర్యపు పూజారి వంశాలు
మాఘపూర్ణిమ నుండి
చిత్తశుద్ధిగ కొలిచి

తల్లి బిడ్డలందరికి మొక్కులే మొక్కగా
ఏళ్ళ నాటి చరిత కథలు కథలుగ పలుకగా
ముడుపులన్నీ కట్టి మొక్కుబడులను తీర్చి
నమ్మకంగా చేరి కొలిచేరు జనులంతా
సమ్మక్కమ సారలమ్మల జారతకి విచ్చేసి

మరువలేని స్మృతులెన్నొ మనసులో నింపుకుని
మరు యేడు నాటికి మరల వచ్చేమంటు
చల్లంగ చూడమ్మ సమ్మక్క సారలమ్మంటు
భక్తి తత్పరత చూపేరు గిరి జనులంత కూడి..

ప్రకృతికి , పడతి సాహసానికి చేయెత్తి మొక్కుతూ
సాగేరు జనులంత మేడారం జాతరకు
జాతరంటె జాతర మేడారం జాతరంటు కీర్తిస్తు పాడేరు..

రచన: యాళ్ళ ఉమామహేశ్వరి


5. తెలంగాణ కుంభమేళా

జాతరొచ్చింది అమ్మా జాతరొచ్చింది
వనదేవతలు కదిలొచ్చే జాతరొచ్చింది

కష్టాలు కడతేర్చే సమ్మక్కకు
కన్నీలు తుడిచేసే సారక్కకు
పసుపు కుంకుమలిచ్చే జాతరొచ్చింది

కోరిన కోరికలు తీర్చే మాతల్లికి
ఆరోగ్యం కాపాడే మాలక్ష్మికి
నిలువెత్తు బంగారమిచ్చే జాతరొచ్చింది

గద్దెలపై కొలువు దీరిన అమ్మలకు
యుద్దభూమిలో పోరాడిన వీరవనితలకు
నీరాజనాలు పలికే జాతరొచ్చింది

జలజలపారు జంపన్నవాగులో
పుణ్యస్నానాలు చేసి
భక్తిశ్రద్ధలతో తరించే జాతరొచ్చింది
పల్లె జాతరొచ్చింది

రెండేళ్లకోసారి జనసంద్రమయ్యే మేడారాన
భక్తులను కరుణించ అమ్మ నడిచొచ్చే
జాతరొచ్చింది పల్లె జాతరొచ్చింది

సమ్మక్క సారలమ్మలను దర్శించి తరించే
జాతరొచ్చింది మన తెలంగాణ పండగొచ్చింది

రచన: మంజీత కుమార్


6. తెలంగాణ కొంగు బంగారం

పచ్చని ఆడివంతా
పులకరించిన వేళ
కంక వనంలో..
కనక వర్షం కురిసిన వేళ
జంపన్న వాగులో జలకాలాటలు
తడి బట్టల తానాలతో
తనవంతా పరవశించిన వేళ
దేవుళ్ళ పూనకాలు
నిలువెత్తు బంగారాలు
రెండేళ్లకొకసారి అంబరాన్నంటే సంబరాలు
కోరిన కోరికలు తీర్చే
తెలంగాణ కొంగు బంగారం
అదే అదే మన మేడారం
ఆనందాలకు ఆలవాలం
అమ్మా అని పిలిచినంతనే
ఆపదలు తీర్చే దేవతలు
పేద,ధనిక బేధం లేక
దర్శనమిచ్చే దయగల తల్లులు
శరణన్న వారిని కరుణించే
శక్తి స్వరూపాలు
చరిత్రలో నిలిచిపోయిన
వీర నారీమణులు
వారే మన సమ్మక్క సారక్కలు

రచన: అనాసి. జ్యోతి


7. చల్లంగా చూడమ్మ

పల్లవి:
సమ్మక్క సారలమ్మ
పండుగొచ్చింది
తెలంగాణ ప్రజలలో
ఆనందం నింపింది..

చరణం:
అడవిలోన సింహాలతో
ఆటలాడుచూ తాను
దేవతా రూపంగా
ప్రత్యక్షమైంది..

శరత్కాల వెన్నెలలా
హృదయంలో నిలుస్తూ..
దివ్యమైన తేజస్సుతో
జాబిలిలా మెరిసింది..

చరణం:
పగిడెద్ద రాజునే తనలోని
భాగంగా చేసుకొని
ముగ్గురు బిడ్డలకు
కన్నతల్లెయ్యింది..

కాకతీయ రాజులతో
ధైర్యంగా పోరాడి
కాకతీయుల గుండెల్లో
సింహమై కూర్చుంది..

చరణం:
ప్రతాపరుద్రునికి కలలోన
దైవంగా కనబడి
కుంకుమభరిణిగా
భక్తులకు దర్శనమిచ్చింది..

రెండేళ్ళ కొకమారు
సంబరమే చేయమనుచు
భక్తుల కోర్కెలను
తీర్చే ఇలవేల్పు అయ్యింది..

చరణం:
జంపన్న వాగులో స్నానమాచరించిన
సంతాన లక్ష్మిగ
వరములిస్తుంది..

దయ్యం వాగులోన
స్నానమాచరించిన
ఆరోగ్యప్రదాతగ
ఆయుష్షు నిస్తుంది

చరణం:
భక్తితోడ నినుగొలిచి
పూజలే చేస్తాము
బెల్లమునే ప్రీతిగ
నీకు ఇచ్చుకుంటాము

మా పసుపు కుంకుమలను
చల్లంగా చూడమ్మ
మా పిల్లపాపలకు
చిరునవ్వులివ్వమ్మ..

రచన: శ్రీదేవి సురేష్ కుసుమంచి


8. మేడారం జాతర

సమ్మక్క సారక్క జాతరంట
ఆసియా ఖండానికే గొప్పదంట
చిన్నా, పెద్దా కలిసి కదిలేరంట
మేడారం జాతర చూడరారండి ..!!

బంగారం అమ్మలకు సమర్పించేరంట
బ్రతుకు చల్లగుండాలని మ్రొక్కుకునేరంట
మతంతో సంబంధం లేదంట
మేడారం జాతర చూడరారండి ..!!

కోరి కొలిచిన వారి కొంగు బంగారమంట
గిరిజనుల కోసం పుట్టిన దేవతలంట
వీరోచితంగా పోరాడిన వనితలంట
మేడారం జాతర చూడరారండి …!!

సమ్మక్క, సారలమ్మ గద్దెనెక్కుతారంట
భక్తుల కోరికలను తీర్చుతారంట
బెల్లం బంగారమే వారి నైవేధ్యమంట
మేడారం జాతర చూడరారండి ….!!

తెలంగాణ రాష్త్ర పండగంట
కోటిమందికి పైగా వచ్చేరంట
పూనకంతో భక్తులు ఊగేరంట
మేడారం జాతర చూడరారండి ..!!

ధైర్యసాహసాల్లో వీరవనితలంట
సార్వభౌముల్ని గడగడ లాడించారంట
స్రిశక్తికి వారు మారుపేరంట
మేడారం జాతర చూడరారండి..!!

రచన: అవ్వారి ఉమాభార్గవి


9. ఆసియా ఖండాన అతి పెద్ద జాతర

కరువుతో తల్లడిల్లిన కోయదొరలు…
కప్పం కట్టలేక కాకతీయ సైన్యంతో చేసిరి పోరాటం…
పగిడిద్దరాజు పత్ని సమ్మక్క…
జరిగిన పోరాటంలో వారి సంతానమైన నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు
గోవిందరాజులు నేలకొరిగిరి!

ఓటమి భరించలేని
కొడుకు జంపన్న…
సంపెంగి వాగులో ఆత్మాహుతినొందె!

సంపెంగి వాగు జంపన్న
స్మృతి చిహ్నమై జంపన్న
వాగుగా ప్రవహించే!

పుత్రుని మరణ వార్త
విన్న సమ్మక్క..
మరు నిమిషమే రౌద్రమూర్తియై …
కత్తిపట్టి కదనరంగానికి కదిలే…
వీరనారియై విజృంభించే!

చివరకు సైనికుడి
వెన్నుపోటుకు గురై…
నెమలినార చెట్టు క్రింద
కుంకుమ భరిణయై వెలిసే!

ప్రతాపరుద్రుడు కోయదొరల కప్పాన్ని రద్దుచేసి సమ్మక్కకు కానుకలర్పించే…
రెండేళ్లకోమారు జాతర జరపమంటూ ఆదేశమిచ్చే!

“కుట్రలు,కుతంత్రాలతో
సాధించిన రాజ్యం
వీరభోజ్యం కాదు…
ఈ గడ్డపైని ప్రతి వ్యక్తీ
వీరునిగానే జీవించాలి” అని సందేశమిస్తున్నట్టుగా గద్దెపై
ప్రతిష్ఠించబడిరి సమ్మక్క, సారలమ్మలు!

వెదురు కర్ర,కుంకుమ భరిణలు
వారి ప్రతిరూపాలుగా…
వారి ధైర్యసాహసాలకు, ధీర
సౌభాగ్యాలకు, ఆత్మత్యాగానికి గుర్తుగా…

శివసత్తుల శివాలతో నాటి
కదనరంగాన్ని తలపిస్తూ…
మాఘమాసంలో నాలుగు
రోజులపాటు జరిగే
మేడారం జాతర…
భక్తితో సమర్పించే బెల్లమే
బంగారమై భాసిల్లుతూ…

ఆసియా ఖండంలోనే అతి పెద్ద
గిరిజన జాతరగా వాసిగాంచే!

రచన: చంద్రకళ. దీకొండ


10. మేడారం జాతర…

సమ్మక్క, సారలమ్మను పూజించే సంప్రదాయం..
ఎన్నో ఏళ్లుగా
గిరిజన వాసులు జరుపు ఆచారం…
రెండేళ్లకోసారి వచ్చు పర్వము..
మాఘ మాసమున కన్నుల పండువగా జరుపు జాతర మహోత్సవము…

ఆసియాలోనే అతిపెద్ద జాతర
తెలంగాణ ఘనకీర్తిని ప్రపంచానికి చాటే ఈ కుంభ మేళా…

వివిధ రాష్ట్రాల భక్తులు
కోర్కెల ముడుపులతో హాజరు..
అమ్మవార్ల అనుగ్రహానికి ఎదురుచూపులు….

జంపన్న వాగులో చేయు స్నానాదులు
అత్యంత భక్తితో మహిళలు సమర్పించు వడిబియ్యాలు…

గద్దెలే దేవతల ఆవాసం
బెల్లం నైవేద్యంతో పొందెదరు సంతసం..

మన హిందూ పండుగల అంతరంగం…
తెలిపే చెక్కు చెదరని భక్తుల ఆత్మ విశ్వాసం!

రచన: కె.కవిత


11. మేడారం జాతర

చారిత్రాత్మకమైన వన దేవతల జాతర
మేడారం జాతర మహా జన జాతర.
పిల్లా పాపలతో కుటుంబ సభ్యులంతా
జరుపుకుని మొక్కుబడి తంతు తీర్చుకుని
ఆనందంగా గడిపే మహత్తరమైన జాతర.
వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అందరూ
తల్లి చల్లని దీవెనల కోసం తరలివచ్చారు.
ఎడ్ల బండ్ల పైన వాహనము లపైన కాలి…
నడకన ఎంతో శ్రమించి భక్తి శ్రద్ధలతో
పూజించి, అమ్మ వారి ఆశీస్సులు పొంది.
భక్తులంతా నిలువెత్తు బంగారం అర్పించి…
తమ తమ మొక్కుబడులు చెల్లించుకుని…
కోరుకున్న కోర్కెలు తీర్చే కల్పవల్లి
నమ్ముకున్న వారికి కొంగు బంగారమై
తెలంగాణ లోనే జరిగే అతిపెద్ద జాతర.
మేడారం జాతరకు భారీ గా నగరమంతా
జనం జంపన్న వాగు లో జలక్రీడలు గావించి
తమ అమూల్యమైన భక్తి ప్రపత్తులతో
ఒడి బియ్యం, ముడుపు గట్టి తమ తమ
భక్తి శ్రద్ధలతో అమ్మ వారి ని పూజలు చేసే
రెండేళ్ల కోసారి అరుదెంచె నిండైన జాతర.
మేడారం సమ్మక్క సారలమ్మ లను….
దర్శించుకుని వారి ఆశీస్సులను పొంది..
వీరత్వాన్ని,శూరత్వాన్ని, వారి శక్తి నీ….
తలుచుకునే మహిమాన్వితమైన జాతర.

రచన: రాధా సురేష్ యర్జల్


12. సమ్మక్క సారలమ్మ జాతర

కరువు కాటకాల కారుణ్యం
రెక్కాడినను డొక్కాడని జీవనం
క్షామంతో అల్లాడిన ప్రజానికం
ఆక్రందనలతో అట్టుడికిన రైతాంగం

కడుపేదల ఆకలి కేకల రోదన
తీరని ఆరని జీవన వేదన
పాలిత రాజు జూపని కరుణ
కప్పం కట్టలేదని నేరారోపణ

పగిడిద్ద రాజుపై అత్యంత ఆగ్రహం
తక్షణమే ప్రకటించిన సంగ్రామం
పోరులో పొందిరి వీర స్వర్గం
జంపన్న గాంచే బలవన్మరణం

అంతిమ పోరులో మ్రోగించిన భేరి
వీరోచితంగా పోరాడిన వీరనారి
అధర్మ పోరాటంలో నేలకొరిగిరి
న్యాయ ధర్మ నీతిలో గెలిచితిరి

అందుకు చిలకల గుట్ట సజీవసాక్షం
ఆకాశవాణి పలికిన సత్యం
కుంకుమ భరణిగ అగుపడిన దృశ్యం
ప్రతాప రుద్రుడు పొందిన పశ్చాతాపం

గిరిజన విజయసూచికగ సుదినం
యావత్కుటుంబానికి పలికిన నీరాజనం
రెండేళ్లకోమారు జాతరతో సంబరం
చరితలో వినుతి కెక్కిన ఘట్టం

జంపన్నవాగు పారు పవిత్రముగ
తెలంగాణకే మకుటా యమానమీ పండుగ
బెల్లమే బంగారమగు మెండుగ
భక్తి పారవశ్యంతో శివసత్తు లూగగ

రచన: అందోల్ పుష్పలీల రేవతి


13. మేడారం దేవతలు

సమ్మక్క సారక్క వన దేవతలే
మహిమలను చూపగ వెలసినారే!

కొండా కోనలలో కోయల మేలును కోరినారే
బిడ్డలై మేడరాజును తరింప జేసినారే!

సత్య వాక్ప్రబోధకులే కానలను ఏలినారే
ఆచరణ సాధ్యమని నిరూపించినారే!

దురాక్రమణను ధైర్యంగా ఎదిరించినారే
అధర్మానిపై న్యాయ పోరాటము సలిపినారే!

త్యాగ దర్పణమై ప్రాణాలను త్యజించినారే
పసుపు,కుంకుమ భరిణలై దర్శనమిచ్చినారే!

వాంఛలీడేర్చి జనుల మనసులను దోచినారే
సంతును ప్రసాదించి సద్గతి కల్పించినారే!

మేడారం గద్దె నెక్కి దీవించగ వచ్చినారే
ఆనందామృత వృష్టిని వర్షించినారే!

జగన్మాత అంశగా భవిష్యవాణి వినిపించినారే
మేడారం జాతరలో విశ్వ జ్యోతులై వెలుగులు పంచినారే!

రచన: వి.వి.వి.కామేశ్వరి


14. మేడారం జాతర

మాఘ మాసంలోని తిరునాళ్ళు
చూడడానికి చాలవు రెండుకళ్ళు
వస్తారు వివిధ రాష్ట్రాల భక్తులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఆదివాసుల హక్కులకై ప్రాణత్యాగం
కాకతీయుల అరాచకాలపై పోరాటం
సమ్మక్క సారక్కల వీరమరణం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

తెలంగాణ మూలుగు జిల్లాలోని
రెండేళ్లకు ఒకసారివచ్చే జాతర
వనదేవతలను పూజిస్తారు భక్తులు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

జంపన్న వాగులో పుణ్య స్నానాలు
ఆదిశక్తి రూపాలుగా కొలుస్తారు
బెల్లంతో అమ్మవారికి నైవేద్యాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

సమ్మక్క సారక్క వీరనారీమణులు
చిలకలగుట్ట చేరినా రిరువురు
కుంకుమ భరిణగా మారినారు
చూడచక్కని తెలుగు సున్నితంబు

రచన: అద్దంకి లక్ష్మి


15. మేడారం జాతర

మేడరాజు కోయల మేలు కోరెడి రాజు
వేటాడ మృగముల వెదుక పాప దొరకెనుపు
మాఘ పౌర్ణమి నాడు మంచి పేరు పెట్టెను
అల్లారు ముద్దుగా నామెపెంచ సాగెను॥

సరి ఆట పాటలా సమ్మక్క పెరిగెను
పగిడిద్దరాజుతో పాపకు పెండ్లాయెను
సంతసముల వేడ్కగా సారమ్మయెపుట్టెను
ఆ దంపతులిరువురు ఆనందము నొందెను॥

కాకతీయ సామంతు కట్టలేదని సిస్తు
ప్రతాపరుద్రుడుా ప్రజ్ఞాశాలి రాజు
అసుాయతోడ నతడు అతనిని సాధించగ
పుారించెను పోరుకై పుార్ణ సమర శంఖము ॥

మాఘ పౌర్ణమి నాడు మరి జరిగె పోరాటం
మరణించిరి పోరున మన అక్క కుటుంబము
కన్నీరు మున్నీరు కడు బాధ మిగిలినది
ఒంటరేై మిగిలినది ఒక్కతౌ సమ్మక్క॥

కసి నిండు బాధతో కదన రంగము జేరి
పోరాడె సారక్క పోరునలసినదక్క
వెన్నుపోటు పొడచిరి వెళ్ళ నీక తరిమిరి
మధ్యలో సమ్మక్క మాయమైపోయెను॥

తా ప్రతాపరుద్రుడు తప్పు తెలుసుకొనెను
పుట్టవద్ద దొరకెను పుార్తి కుంకుమ భరిణె
సమ్మక్క రుాపుగా సత్యమంచు కొలచెను
వనదేవిగ మారిన మన అక్కను కొలచెను ॥

సమ్మక్క కుతురే సారమ్మదేవతగా
జనులంత కొలచితిరి జగమంత చాటితిరి.
మేలైన జాతరా మేడారము జరిగెను
నాల్గేైన దినముల నాపండగ జరిగెను॥

అదెనందరు జేయు అతిపెద్ద జాతరా
కొలిచేటి గిరిజనుల కొలువమ్మల జాతరా.
సమ్మక్క సారమ్మ సరి దేవతలుగను
వనమందు వెలసేరు వరమీయు వేల్పులుగ॥

కధను విన్న ఈశ్వరి కలసి చేసె పుాజలు
సమ్మక్క సారక్కల సందడి పండగలు
తరలిరారె తరుణులు తమ కోర్కెలు తీరగ
వనదేవతలువారి వరదాభయమందగ ॥

రచన: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి


16. తెలంగాణ కుంభమేళ

తెలంగాణ కుంభమేళకు వేళయింది
వనదేవతల కోసం జన జాతర కదిలోచ్చింది
దయగల తల్లుల దీవెనల కోసం
నిలువెత్తు బంగారమై కానుకిచ్చింది…
అడవంత భక్తి భావంలో తడిసిపోయి
గుడి లేని దేవతలకి గుండెల్లో గుడికట్టి
జంపన్న వాగులో జలకమాడింది
సమ్మక్క సారక్క ఆగమనంతో
మేడారం జనహారమై తాడ్వాయి మెడలో
వదిగి పోయింది ,ప్రకృతి శక్తుల
మహిమలకు పచ్చని చెట్లన్ని
సాక్షాలుగా నిలిచి చరిత్రను చెబుతున్నాయి
బలమైన నమ్మకాన్ని భక్తుల మదిలో నింపిన
అమ్మవార్లు కాదు వాళ్ళు ఆదిపరాశక్తులు
కాకలు తీరిన కాకతీయులపై
కడవరకు పోరాడిన యోధులు
ఆదివాసులకు ఆరాధ్య దైవాలు
విరోచిత పోరాటంలో అదృశ్యశక్తులై
గద్దెలపై కొలువైన ఘనమైన తల్లులకు
వందనం వీరాభివందనం

రచన: భాగ్య లక్ష్మి సిద్దగాని


17. మేడారం అడువుల్లో మా సమ్మక్క

మేడారం అడవుల్లో మా సమ్మక్క
వెలిసినారా తల్లి మా సారక్క
కోరి కొలిచిన వారి
కొంగుబంగారమై
కొలువుదీరినారా
కోయగూడెంలోనా…

పసుపు కుంకుమ జల్లిన
పరవశించిపోయి
పదికాలాలు చల్లంగా
చూసేటి తల్లి
నిలువెత్తు బంగారం
మీకు అర్పించిన చాలు
నిలువెల్ల పులకించి
నీడగా నిలిచేరు….
కోట్లాది జనుల
కోరికలు తీర్చగా
కోరి వచ్చినట్టి
కోమలాంగులు మీరు…

జంపన్నవాగులో
జలకాలాడిన చాలు
జన్మజన్మల పాపాలు
తొలగించే తల్లి
జనులెల్ల భక్తితో
మిమ్ము కొలిచేరు
జాగు చేయక వచ్చి
వరములీరమ్మా….

శివసత్తుల అంతా
శిగమూగుతుండగా
చిలకలగుట్ట నుండి
బయలుదేరిన తల్లి
మా చిరకాల వాంఛలు
నెరవేర్చగా మీరు
వచ్చి చేరినార తల్లి
వనదేవతలై…

రచన: బుదారపు లావణ్య


18. మహిమాన్విత జాతర మేడారం జాతర

ములుగు ముత్యం
తాండ్వాయి తాపడం
మేడారం మేలిమి బంగారం
మేడారం జాతర మహిమాన్వితం

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర
“సమ్మక్క సారలమ్మ జాతర ”
కొండ కోనల మధ్య కొలువుతీరే జాతర
మాఘశుద్ధ పౌర్ణమిన జరిపే సమ్మక్క
సారలమ్మ జాతర
అనాదిగా ప్రకృతిలో మమేకమై
ప్రజలు పూజిస్తున్న దేవతలెందరో!
ముక్కోటి దేవతలను పూజిస్తున్నాం
సిరి సౌభాగ్యాలకు
చేస్తున్నాం ఎన్నో జాతరలు
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర
తెలంగాణలో కొలువైన “సమ్మక్క సారలమ్మ జాతర ”
కుల మతాలకు అతీతమైన జాతర
సామాన్య వనితలు, శక్తికి ప్రతిరూపాలు
భక్తికి నిజస్వరూపాలు
పోరాటానికి పోరు బాటలు

నట్టడవిలో పుట్టపై కోయ దొరకు
దొరికిన కోనలోని రాణి
పగిడిద్ద రాజుతో పరిణయమై
సారలమ్మ, జంపన ,నాగులమ్మ
సంతతితో, కోనకే రక్షకులై
కోనల సిరేగాని, ధన సిరి లేని వారు
కాకతీయ రాజులు కోరిన కప్పమును
కట్టలేక ,కలతచెందు వేళ
‘యుద్ధమో,వీరమరణమో’ అనుకున్న
వీర మహిళలు
ములుగులో సేనలను ముప్పతిప్పలు పెట్టు వేళ
జంపన్న సంపెంగ వాగులో కూలుట
తన వారందరూ బలియగుట చూచి
అపర కాళికై విజృంభించి
సైన్యమును పరిమార్చి
విద్రోహుల వెన్నుపోటుకు బలై
చిలుకల గుట్ట కొండల బండల
మాటుకు వెళ్లి
తను దొరికిన చోటే
చెట్టు కింద పుట్ట మీద అమరిన
కుంకుమ భరిణయై
రెండేళ్ల కోసారి జరిగే జాతరలో
సంపెంగ వాగు జంపన్న వాగై
పవిత్ర స్నానాలు చేసేజాతర
లక్షల్లో భక్తులు పెరుగుతున్న జాతర
సమ్మక్క సారలమ్మ జాతర
ఆరోగ్యాన్నిచ్చే అడవిలో ,అడవి
తల్లుల జాతర
వంశపార్యం పర్యంగా వస్తున్న గిరిజన
పూజారులు చేసే జాతర
‘ఐరన్ ‘వృద్ధి చేసే నిలువెత్తు (బంగారం)
బెల్లం భక్తులు తీర్చుకునే మొక్కులు
టన్నుల బెల్లం అక్కడున్నా
చీమలు ,ఈగలు రానిమహిమాన్విత ప్రసాదం
ఇచ్చే ఆరోగ్య రక్ష
జాతరలో సాగే వ్యాపారాలు, చిరు
వ్యాపారుల స్వయం పోషకాలు
ఎంతోమందికి ఆర్థిక లాభాన్ని కలిగించే
అద్భుతమైన జాతర “సమ్మక్క సారలమ్మ జాతర”

రచన: మన్నె లలిత


19. అమ్మతల్లులు

మేడారంలో కొలువైన దేవతలు
సమ్మక్క —సారలమ్మలు
కష్టాలు తీర్చేటి కొండ దేవతలు
ఇష్టాలు తీర్చగ వెలుగొందిన ఇలవేల్పులు
భక్తుల పాలిట కొంగుబంగారాలు
శక్తి యుక్తులు నిచ్చేటి కల్పవల్లులు
పూనకాలు, డప్పులవిన్యాసాలు, మొక్కుబడులు
కావేళ్ళతో పసుపు, కుంకాలు, బలులు, బంగారాలు
అందుకోమ్మా వందనాలు…..
కొలువుతీరినట్టి మా చక్కని తల్లులు
నిలువెత్తు బంగారంతో తీర్చేము మొక్కులు
రెండేండ్ల కోమారు వేo చేతురమ్మా
అంగరంగ వైభవంగా ఈ జాతరసాగేనమ్మా
గిరిజనుల ఆచారం –వనదేవతల ఆరాధ్యం
సుస్థిరంగా చేసేరుజగమంతా ప్రచారం
కుoభమేళా మురిపించె జనులందరిని
జంపన్న వాగులో స్నానాల పవిత్ర సాగెనె
రోగాలను నయంచేయు, సంతానం కలుగచేయు
జనులందరి నమ్మకమే ఆ తల్లుల దీవెనలు
మాఘ పౌర్ణమి నాటి వేళ జరిగేలే పండుగ
తన్మయం చెందగ చూసొద్దాం అందరం…
కదిలి పోదాం రారండి మేడారం జాతరకు..
జై సమ్మక్క —సారమ్మ తల్లుల్లారా..

రచన: కె. శైలజాశ్రీనివాస్


20. జాతరో జాతర

ప॥ జాతరో జాతర మా గొప్ప జాతర
మేడారం గ్రామంలో జరిగేటి జాతర
మా మంచి దేవతలు
సమ్మక్క సారమ్మల అందమైన జాతర
అందరూ రారండి అమ్మలను కొలవంగ
జాతరో జాతర మా గొప్ప జాతర

చ॥ పుట్ట పైన దొరికిన
పుత్తడి బొమ్మ సమ్మక్క
తండ్రి అదుపు ఆజ్ఞలలో
పెరిగిన కొమ్మ సమ్మక్క
పెనిమిటి కనుసన్నల్లో
మెలిగిన మగువ మా అమ్మ
హస్త వాసిలో మేటి
మా బంగరు సమ్మక్క
జాతరో జాతర మా గొప్ప జాతర

చ॥ వనముల వెలసిన తల్లి
వన దుర్గా మా అమ్మ
ప్రతాప రుద్రునిపై పోరు సలిపి …
గాయముల పాలయ్యిన
అంబ అటవులలో మాయమై
వెలిసినాది తరుణి
పసుపు కుంకుమ నిండిన భరిణిగా
గిరిజన రాణిని నేటికీ
పూజింతురు ఆ భరిణిని
అమ్మకు ప్రతి రూపుగా
జాతరో జాతర మా గొప్ప జాతర

చ॥ మేడారం జాతర బహు ముచ్చటైన జాతర
పిల్లపెద్దలందరూ ఆడిపాడే జాతర
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన జాతర
తెలంగాణ సర్కారు గుర్తించిన జాతర
అడవి బిడ్డలనే గాక అమ్మ
ఎల్లరినీ కరుణించే జాతర
జాతరో జాతర మా గొప్ప జాతర
మేడ రెడ్డి బిడ్డగా అమ్మ కొలుపులందుకునే జాతర
ఆ అమ్మ కన్నబిడ్డ సారలమ్మ
పేరుల ముచ్చటగా జరిగేటి
వనదేవతల జాతర

రచన: బొల్లాప్రగడ ఉదయ భాను


21. మహిళా సాధికార తేజశీలి

ఆదిపరాశక్తి పరాక్రమం అతివ సొంతమై,
ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపి,
మహిళా శక్తికి మహిమాన్విత తేజమై,
మహిని వెలసిన త్యాగశీలి సమ్మక్క!

పుట్టమీది మాణిక్యమై మేడరాజుకు దొరికి,
శుభాలను మోసుకొచ్చి,దైవాంశ సంభూతగా కొలవబడి,
పగిడిద్దరాజును పరిణయమాడె పరిణీత!

వీర సంతానం సారలమ్మ, జంపన్న, నాగులమ్మలకు జన్మనిచ్చిన ఆదివాసీ అమ్మ!

కన్నీరింకిపోయిన కటిక కరువున,
కప్పమైనా కట్టలేని దైన్యమున,
కాకతీయరేడు ప్రతాపరుద్రుని సేనల
దాష్టీకములను నిలువరించగ,
ఆత్మీయుల ప్రాణ త్యాగాల సాక్షిగా,
పోరుసల్పిన అపర దుర్గాదేవి సమ్మక్క!!

తనువంత గాయపడి చిలుకలగుట్టపై అంతర్ధానమై,
కుంకుమ భరిణె గ మారిన పొలతి,
ఏటేటా పూజలందుకొనె అడవిమల్లెల గుండె గుడిలో, మేటిగా మేడారం జాతరలో!

అడవిలో మొదలైన ఆరాధనం ఆసియా ఖండాన భవ్య తిరునాళ్ళగా గుర్తింపునొంది,
తెలంగాణకు తలమానికమై నిలిచె నేడు!

జన హృదయ గద్దెలపై కొలువైన సమ్మక్క సారక్కలు,
గిరిజన సాంప్రదాయములనే చాటుచుండిరి అఖిల విశ్వమందున!

బెల్లము బంగారమును అర్పించి
నైవేద్యముగా
పంచుకొందురు భక్తులు తమ ఊరూవాడా!
వాడని బొంతపూల పరిమళాలను మది నిండా నింపుకుంటూ!

ఒక ఝాన్సీ, ఒక రుద్రమ వలె
తెగువజూపి మగువ సమ్మక్క,
చరిత నిల్చె చెరగని ధీరతకు చిరునామాగా!
మహిళా సాధికారతకు తానో వీలునామాగా !!

రచన: బత్తిన గీతాకుమారి


22. మేడారం జాతరరా

ఏటేటా మేడారం జాతరరా
మేడారం గ్రామంలో గిరిజన జాతరరా
మేడారంలో సమ్మక్క సారక్క జాతరరా
ప్రపంచమంతాఅశేషఖ్యాత పొందెనురా
పిల్లా పెద్దలు కదిలి వచ్చెను చూడరా
కుంకుమభరణిరూపంలోకొలువైనాదిరా
వంశ పారంపర్యంగావస్తున్న ఆచారము
గిరిజనలుపూజారులుగా జరిపే జాతర
కోర్కెలుతీర్చమని తల్లికి
బంగారం (బెల్లం) నైవేద్యమర్పిస్తున్న భక్తులు
అనేకమతాలుమేడారంలో చేసుకునే వేడుక
కోటికిపైగాభక్తులొచ్చే గొప్ప జాతర,
ఆసియా లోనే అతి పెద్ద జాతర.
మొక్కితే మహిమ చూపే బంగారుతల్లి
తప్పక చూడాలి అందరము వెళ్ళి
అందరమొకటిగా కలసికట్టుగా
ఉమ్మడిగా మూకుమ్మడిగా
భారతీయ సనాతన సంస్కృతులకు .
దర్పణము ఈ మేడారం జాతర మరి.

రచన : వి విజయ శ్రీ దుర్గ


23. గిరిజనుల దేవత

కొండలలో వెలసిన దేవతలు
వాళ్లేనట సమ్మక్క సారలక్కలు
గిరిజనులు పూజించేది ఆ తల్లినేనంట
ఎన్నో కష్టాలు అనుభవించిన తల్లి
అక్కడే తను చాలించి కొలువైందట
ఆ తల్లిని కొలిచే గిరిజనులే పూజారులంట
అడవిలో కొలువు దీరిన నా తల్లులే
సమ్మక్క సారక్కలట్టా నమ్ముకున్నవారికి
కొంగుబంగారమై నిలుచునట
ఆ సమ్మక్క సారలక్కతల్లులకు
ఆనాటి నుండి ఈనాటి వరకు
రెండేళ్లకొకసారి మాఘమాసంలో
దర్శనమిచ్చుట జంపన్న వాగులో
స్నానమాచరించిన పాప పరిహారమగునుట
అదే మేడారం జాతర కనులవిందుగా
జరుపుకొందురట నిలువెత్తు బెల్లాన్ని
తూకాలు వేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ
మొక్కుబడులను చెల్లిస్తూరట
మేడారం జాతర కులమతంతో పనిలేదు
భక్తిశ్రద్ధలతో కొలుద్దాం మన కష్టాలు తీర్చమని
రారండి సమ్మక్క సారక్కలను దర్శించుకుందాం
పోదాం రారండి మేడారం జాతరకు

రచన: సుజాత కోకిల


24. వీరవనితలు సమ్మక్క సారలమ్మ

పులుల నడుమ పుత్తడి బొమ్మ
వనముల వెలసిన వనదేవతవై
గిరిజనులకు ముద్దు బిడ్డగా
మాఘ శుద్ధ పౌర్ణమి నాడు
సమ్మక్క అనే నామకరణ చేసి
చల్లని తల్లి వచ్చింది కరువు కాటకాలు తొలగించి
గిరిజనులు కోయరాజులను
కంటికి రెప్పల కాచింది
కరుణ గల మా తల్లి సమ్మక్క
మేడారం పాలించే పగిడిద్దరాజు తో
సమ్మక్క పరిణయం సారలమ్మ,నాగులమ్మ
జంపన్న వారి సంతానం
కాకతీయ సామంతుడు పగిడిద్దరాజు
కరువు కాటకాలు వల్ల కప్పం కట్టలేదని
ఆగ్రహించిన కాకతీయ రాజు
మేడారం పై సైన్యంతో దండెత్తినా కాకతీయ సైన్యంతో
హోర హోరీగా పగిడిద్దరాజు మేడరాజు గోవిందరాజు
సమ్మక్క సారలమ్మ నాగులమ్మ జంపన్న
గెరిల్లా యుద్ధం చేస్తూ వీరోచితంగా పోరాటం సైన్యం దాడిలో వీరమరణం
ఆగ్రహించిన సమ్మక్క
రణరంగంలో ఉగ్రరూపిణీ లా
కదన రంగంలో కత్తి తిప్పుతూ కదంతొక్కి కాకతీయ సేనను గడగడ లాడించిన
వీరవనిత వీరోచిత పోరాడే సమ్మక్క యుద్ధ పోరాటానికి తాళలేక
దొంగ చాటుగా సమ్మక్కను వెన్ను పోటు పొడిచే సైనికుడు
శత్రువుల చేతిలో దెబ్బతిని
రక్తపు మడుగులో తడిసిన సమ్మక్క తల్లి యుద్ధభూమి నుండి చిలుకల గుట్ట వైపు
వెళుతూ అదృశ్యం చిలుకల గుట్ట ప్రాంతంలో పుట్ట వద్ద పసుపు కుంకుమల భరిణె
లభించే
పసుపు కుంకుమ భరిణె ను సమ్మక్క వనదేవత గా భావించి
తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారిపోయి
సమ్మక్క సారలమ్మ జాతర ను రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిపించే
నాటి నుండి నేటి వరకు
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై మేడారంలో
వెలసిన మహిమ గల తల్లులు
పసుపు కుంకుమలు
ఎత్తు బంగారం (బెల్లం) పట్టువస్త్రాలు ఒడి బియ్యలు
కుంకుమ భరిణె అమ్మ రూపం
అమ్మకు గద్దెనే దేవాలయం
పచ్చని ప్రకృతి అమ్మ నివాసం
రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు అమ్మ దర్శన భాగ్యం
భారత దేశంలో రెండో
కుంభమేళం
ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర
రాష్ట్ర పండుగ గా గుర్తింపు
పలు రాష్ట్రాల భక్తజనం
తండోప తండాలుగా తరలి వస్తారు
సమ్మక్క జాతరకు ప్రతి లోగిలి
అమ్మ నివాసమే
వీరవనితలై చరిత్రలో నిలిచిన
వన దేవతలు

రచన: గజ్జల స్వరూపరాణి


25. మణిపూసలు

1.
మేడారం జాతరంట
చూసి వద్దం రారంట
సమ్మక్క సారలమ్మలు
కొలువైనా జాతరంట!

2.
జగతిలో పెద్దదైన
గిరిజనుల జాతరైన
మేడారం జాతరకు
వెళ్లి చేద్దాం అర్చన!

3.
సమ్మక్క సుత జంపన్న
వాగు పేరున జంపన్న
త్యాగానికి గుర్తుగా
అందు నీరే ఎరుపన్న!

4.
కొండా కోనల నడుమ
వనదేవతలను కనుమ
కోరి మొక్కినను చాలు
కోర్కె లీడేరు మామ!

5.
వన దేవతలుగా నాడు
పూజలందుకొనుచు నేడు
జనుల చేత కొలువబడి
దర్శనంబు నిచ్చిరిపుడు!

6.
అమ్మలను గన్న అమ్మలు
సమ్మక్క సారలమ్మలు
గద్దెపై కొలువు దీర
బంగార మిచ్చిరి జనులు!

రచన: డాక్టర్. పోల సాయిజ్యోతి


26. మేడారం జాతర

వీరుల పోరుగడ్డ పై వనదేవతల జాతర
భక్తుల జనసాంద్రతతో కిక్కిరిసిన మేడారం యాత్ర
గిరిజన వీరవనితలు సమ్మక సారక్కల గద్దెల పై రాకలు
అమ్మల ధీరత్వాన్ని , ఉనికిని తెలిపేను ఉత్సవ మేళాలు
నాగులమ్మ మేడిరాజు పగిడిద్దరాజు గోవిందరాజుల వీరమరణపు గాధలు
నేటికి జంపన్న ఆత్మఘోష వినిపించును జంపన్న వాగులో నీటి గలగల సవ్వడ్లలో
రెండేళ్ళకోమారు మేళతాళాలతో గద్దెనెక్కుతారు గిరిజన దేవతలు
పోతురాజుల నృత్యాలతో జాతరలో పూనకలు
రాబోవు కాలాన్ని తెలుపును అమ్మలు పూనిన జోగినులు
తమ చల్లని చూపులని తమ‌ పై కాయమని భక్తులు సమర్పించేరు బెల్లం ముడుపులు
మాఘ శుద్ద పౌర్ణమిన అంగరంగ వైభవంగా అంబరాన్నంటేను
సమ్మక్క సారలమ్మ జాతర కోలాహలు
భక్తులకు అభయమొసగి తిరిగి స్వస్థలాలకు చేరి కొలువైదురు గిరిజన దేవతలు
తమ చల్లని దీవెనలను భక్తులకు సదా అందిస్తూ
మానవాళి వెన్నంటే ఉండేరు సమ్మక సారలమ్మలు!

రచన: అలేఖ్య రవికాంతి


27. హృదయావిష్కరణ.

మాఘపున్నమి వేళ తరతరాలుగా
నిరంతరాయంగా ప్రవహించే
పవిత్ర క్షీరధారపై తేలియాడే
మీగడతరగ మేడారం జాతర!
అవినీతి చట్టాలకు వ్యతిరేకంగా
ఆడపులులై గర్జించి అమరులై,
చరిత్రకు నిలయమై విశ్వమానవ
యవనికపై తనదైన ముద్ర
రచించుకున్న వీర వనితల
ఘనచరిత ఈ అపూర్వ వేడుక!
అంతర్జాతీయ ఖ్యాతి గాంచి
అడవితల్లి ఒడిలో ఆధ్యాత్మిక
పరిమళాలు విరజిల్లుతూ
కోరినవారికి కొంగు బంగారమై
కొలువుదీరిన అతి పెద్ద
గిరిజన జాతర!
వైదిక ప్రభావంలేని, విగ్రహరహిత,
ఆత్మానుగతమైన పవిత్ర
మూర్తులు అశరీరంగా,
అంతర్లీనమైన ప్రతీకలే ఉత్సవమూర్తులుగా
కొలువబడుతున్న అపూర్వ ఘనత!
ఆడబిడ్డలను ఆదిశక్తులుగా
కొలిచే అపూర్వ సాంప్రదాయానికి అంకురార్పణ !
అశేష గిరిజనుల హృదయావిష్కరణ!

రచన: మామిడాల శైలజ


28. తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యం…. మేడారం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో
తలమాణిక్యమైన మరుపురాని
మరో ఘట్టం పేరే మేడారం జాతర!
ప్రపంచ చరిత్రలో
ఇదెంతో మహి మాణిత్వమైన
ప్రదేశంగా పేరొందింది!
పోరాట పటిమ కలిగిన
స్త్రీ జాతి ఔన్నత్యాన్ని
గొప్పగా చాటి చెప్పింది!
ప్రకృతి ఒడిలో సేద తీరే
ప్రజలను ఓదార్చి పండగ
రూపంలో పలకరించి
ప్రేమను పంచింది!
విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు
నిలయమైన భారత దేశ చరిత్రను
మరో మారు ఇలా ఉద్ఘటించింది!
నేల మీద అడవి అందాలను
ఆరబోసి ప్రపంచ పర్యాటకులను
ఆకర్షిస్తూ తన ఒడిలో ఓలలాడిస్తుంది!
తియ్యని బెల్లాన్ని నిలువెత్తు బంగారంలా
స్వీకరించే ఆనాయితీని
కొనసాగిస్తూ గద్దె మీదున్న
సమ్మక్క, సారలమ్మలను
భక్తి శ్రద్దలతో పూజిస్తుంది!
కనువిందు చేసే జనజాతరలో
భాగమైన భక్తులను
జనవాహినిగా వర్ణిస్తూ
కుంభమేళను నిర్వహిస్తుంది!
కోరిన వారి కొంగు బంగారం చేస్తూ
కొలిచి వచ్చిన వారి కోరికలు తీరుస్తూ
వన దేవతల రూపంలో
కొలవ బడుతున్న ఈ ప్రదేశం
అత్యంత మహిమ కలిగిన
పుణ్య క్షేత్రం
ధైర్య సాహసాలు కనబరిచిన
వీర నారి మణులను
కుంకుమ భరిణలుగా ప్రతిష్టించి
కొలిచే పుణ్య స్థలం!!!

రచన: ఎస్. జవేరియా


29. వెలుగుజూపిన స్మృతుల్లో

దశాబ్దాలుగా దారుణ వంచనకు
బలైన అడవి బ్రతుకులు
కరువు కోరల్లో
చిక్కి
కాకతీయుల కఠిన
నియమాలకు
పన్ను కట్టలేని ధైన్యంతో
విలపిస్తుంటే
నిద్రాణమైన అస్తిత్వాన్ని
మేల్కొల్పి
అంతు పట్టని అడవి దారుల్లో
ఎన్నో కంటకాల్ని దాటి
ఆధిపత్య పోరాటంలో
అహర్నిశలు పరిశ్రమించి
అలుపెరగని పోరుసల్పి
సుడిగాలుల విస్ఫోటనమై
విజృంభించిన వీర నారీమణులు
జీవన్మరణ పోరాటంలో
బతుకు మార్గం సుగమం చేసి
అసమానతలను సమం చేసి
నవ్య జగతిని ఆవిష్కరించి
అఖండ కీర్తిని గడించిన
వన దేవతలు
ఆర్తి నిండిన హృదయాల్లో
హరిత జవసత్వాల్ని నింపిన
కుటిలమెరుగని కరుణా మూర్తులు

తిరుగులేని మహారాణులైన
సకల శక్తి స్వరూపాల
ప్రకృతి పుత్రికలకు
మాఘశుద్ధ పౌర్ణమి రోజున
కులమతాలకతీతంగా
తెలంగాణ కుంభమేళ
అంబరపు అంచుల్లో
సంబరాల జాతరైన
మేడారం
వెలుగు జూపిన స్మృతుల్లో
వెళ్ళు వెత్తిన జన సందోహం
తల్లుల్ని స్మరిస్తూ సేవలో తరిస్తూ

రచన: నెల్లుట్ల సునీత

Exit mobile version