Site icon Sanchika

24. మరో (మారిన) ప్రపంచం

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]నే[/dropcap]ను బ్రతికే ప్రపంచమే వేరు
ఆధునికతని పెట్టేను దానికి పేరు

ప్రక్కనున్న మనిషి ఊసే పట్టదసలు
ఎవరేమైపోతే నాకెందుకసలు

చేతిలో చరవాణి పట్టుకుంటాను
అన్నపానాలు ఊసే మరి ఎత్తను

ప్రక్కన కూర్చున్నది స్నేహితుడైతేనేమి
సాక్షాత్ శ్రీమన్నారాయణుడైతే నేమి

చరవాణే కదా నిజమైన నేస్తమెపుడూ
గడుపుతాను దానితోనే కాలమెపుడూ

చెవులకు పెట్టుకుంటాను తంత్రీ తీగలు
మరలనివ్వను దృష్టి దాన్నొదిలసలు

నన్నంటిపెట్టుకున్న ప్రపంచమంటే ఏవగింపు
వాట్సప్‌లో కన్పించే మరో ప్రపంచమంటేనే మనసుకింపు

సందడేమైతే నేమి, సందర్భమేదైతే నాకేంటి
చరవాణి ఉంటే చాలు ఏదేమైతే నాకేంటి

చరవాణికే నా మొదటి పలకరింపు
స్వీయ చిత్రానికే నా మొదటి పిలుపు

ఇంటనున్న పాప ఊసే వద్దసలు.
అంతర్జాలంలో కన్పించే పాపకే వేస్తా నా లైకులు

నా పల్లెలో నడయాడే సెలయేటి చప్పుడే వద్దసలు
వాట్సప్‌లో కన్పించే జలపాతాల సవ్వడులే ముద్దసలు

అమ్మా నాన్నల పలకరింపుకు సమాధానమే ఉండదసలు
ప్రత్యేక దినోత్సవమైతే నా పోస్టే ముందుగా ఉంటుందసలు

పెన్నుతో వ్రాయలేను పట్టుమని పదిలైన్లు గట్టిగా
చరవాణిలో టైపు చేస్తా ఎంతైనా అలుపెరగగ

తింటున్నదాని రుచి తెలియదు, తిన్నదేదో గుర్తుండదు
ఒకపరి తిండి, నిద్ర లేక బక్కచిక్కుతున్న శరీరమంటే పట్టదు మరి

క్లాసు పుస్తకాల పాఠాలు చదవలేనసలు
వాట్సప్‌లో వచ్చే సమాచారమైతే వదలనసలు

ఇంట్లో అందరితో కూర్చుని మాటలంటే వద్దేవద్దు
వాట్సప్‌లో స్నేహితులతో చాటంటేనే ముద్దేముద్దు

చదువులో ముందుండాలని పట్టింపే లేదు నాకు
విపణిలో విడుదలైన చరవాణి లేకుంటే దుఃఖం రెట్టింపే నాకు

ఇన్నున్నా అమ్మా నాన్నల ముద్దుబిడ్డనే నేను
ఏమైనా తల్లిదండ్రుల వారసుడ్నే నేను

Exit mobile version