26. మార్పు రావాలి

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]గ[/dropcap]ణపతి కళామందిరం అలంకరణ ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరబోతుంటే “సార్, కళామందిరం ఏర్పాట్లు అన్ని పూర్తి అయింది. ఇక రచయిత్రి జ్వాల రావాలి… అనుకున్న సమయానికి వస్తారుగా” అంటూ కళామందిర్ సభ్యుడు ప్రశ్నించాడు.

“ఆలస్యం కావడానికి అవకాశమే లేదు. జ్వాల గారు ప్రస్తుతం మా ఇంట్లో అతిథిగా ఉన్నారు” అని చెప్పాడు గణపతి.

గణపతి రిటైర్డ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్. గణపతి పదవీ విరమణ పొందిన తరువాత కళామందిర్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మంచి మంచి సాహిత్య కార్యక్రమములు ఏర్పాటు చేసేవాడు. ఈ రోజు సాయంత్రం ప్రముఖ రచయిత్రి జ్వాలా సాహిత్య ప్రసంగం ఏర్పాటు చేశారు. సాయంత్రం కార్యక్రమంలో ‘నేటి సమాజంలో ప్రేమ వివాహాలు’ గురించి జ్వాలా ప్రసంగించనుంది.

ఇంటి లోపల ఏదో గొడవ జరుగుచున్నదని గుర్తించి వేగంగా వెళ్ళాడు. జగదీష్ కోపంతో విక్రమ్‌ని తిడుతున్నాడు. వారి ప్రక్కనే కూతురు తనూజ, భార్య సుకన్య, రచయిత్రి జ్వాల ఉండటం గమనించాడు. మరోప్రక్క విషణ్ణ వదనంతో నిలబడి ఉన్న రంగస్వామి, భారతిల వైపు ఎవరా అని అనుమానంగా చూసాడు గణపతి

తనూజ తండ్రి వైపు చూస్తూ “నాన్న వీడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న మోసగాడు. నాకన్నా ముందుగా ఆమెను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాక వదలి వచ్చి నాతో ప్రేమించినట్లు నటించి….. మోసం చేసి పెళ్లి చేసుకొన్నాడు, వీడ్ని నేనే గొంతు పిసికి  చంపుతాను….” కోపంగా కోపంగా అంటూ విక్రమ్ వైపు ఆవేశంతో వెళ్ళబోతున్న తనూజను గట్టిగా పట్టుకొన్నాడు జగదీష్.

భారతికి, రంగసామికి ఆ దృశ్యం చాలా ఆశ్చర్యంగానూ,వింతగానూ తోచింది. ‘మొగుడు మోసం చేస్తే కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడటం మానుకొని తనూజ ఇలా కోపంగా నడచుకొంటున్నదే’ అని అనుకొన్నారు.

“వాడ్ని నువ్వేమిటి చంపడం, నేనే ముక్కలు ముక్కలుగా నరుకుతాను…..”  ఎవరూ ఎదురు చూడని విధంగా వేగంగా వెళ్లి విక్రమ్ కడుపులో తన్నగానే ఒక్క సారిగా క్రింద పడ్డాడు.

క్రింద పడ్డ విక్రమ్‌ను మరలా తన్న దానికి కాలు ఎత్తుతుంటే భారతి అడ్డుగా నిలబడి “అయ్యా, ఆయనను కొట్టవద్దండి, నేను ఆయనను తీసుకొని మా గ్రామానికి వెళ్లి కాపురం చేసువుకొంటాను” అంటూ కన్నీళ్లతో చేతులు  జోడించింది.

“మా నాన్న పోలీసు డిపార్ట్‌మెంట్ మనిషి అని తెలిసీ, నేను చదువుకున్న దానినని తెలిసీ ఎంతో చక్కగా నటించి మా కుటుంబ సభ్యులనందరినీ నమ్మించి నన్ను పెళ్లి చేసుకొన్నాడు. వాడొక పెద్ద క్రిమినల్…. వాడ్ని నమ్మద్దు” కోపంగా అంది తనూజ.

“తనూజా నీవు ఒక కంప్లైంట్ వ్రాసివ్వు, వీడ్ని సెల్‌లో త్రోసి వీడ్ని నా కసి తీరా ఉతికి పారేస్తాను” అన్నాడు జగదీష్

“కంప్లైంట్ ఏమీ వద్దు. వీడ్ని నేను చంపి నీతో జైలుకు వస్తాను”ఆవేశంగా అన్నాడు గణపతి.

“పెదనాన్నా, ఇప్పటికే కులం హత్యలు జరుగుతుందంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీడ్ని  చంపారంటే మరలా ఇంకో కులపు హత్య…” అంటూ జగదీష్ చెబుతున్న మాటలకు అడ్డు పడుతూ…

“తనూజ వీడ్ని ప్రేమించానని చెబితే ఎటువంటి వ్యతిరేకత చూపకుండా అంగీకరించాను. పెళ్లి తరువాత తెలిసింది వాడు…. కులం వాడని. అయినా పట్టించుకోలేదు. కానీ వాడు ఇంతటి మోసగాడు అని తెలిసాక ఊరికే వదలను, ఇక్కడ కుల ప్రసక్తే లేదు మోసగాడిని హత్య చేశారు అని చెబుతారు” అని చెప్పిన తరువాత మరింత ఆవేశంతో వస్తున్న గణపతిని అడ్డుకున్నాడు జగదీష్.

భారతి ఒక్కసారిగా గణపతి కాళ్లపై పడి గట్టిగా పట్టుకొంటూ “మీరు ఆయన్ను వద్దనుకొంటే క్షమించి వదిలి వెయ్యండి. ఆయనను కొట్టవద్దండి. నేను ఆయనను మా ఊరికి తీసుకెళ్లి కాపురం చేసుకొంటాను” అంటూ భోరుమని ఏడవసాగింది.

“వాడు మంచివాడైతే తప్పకుండా పంపే వాడ్ని. వాడు ఎటువంటి దుర్మార్గుడో ఇప్పుడే తెలుసుకున్నాను. వాడ్ని చంపి నేను జైలుకెళతాను. నిన్నూ నీ పిల్లల భవిష్యత్తును మా తనూజ చూసుకొంటుంది. ఇలాంటి రాక్షసులు …” కోపంగా అన్నాడు గణపతి

“మీరెన్ననయినా చెప్పండి, ఎవరైనా ఆయనకు ఏమైనా చేశారంటే నేను చస్తాను ….”అంది భారతి.

                                                      *  *  *

రంగు రంగుల కరెంటుదీపాలతో కళామందిరమును శోభయానముగ అలంకరిచారు. కానీ సభ ప్రారంభం కావడానికి ముందు కరెంటు పోయింది. ఆ సమయము జెనరేటర్ పని చెయ్యలేదు. కళామందిరం సభ్యులు దగ్గరలో తెలిసిన వారి దగ్గరకెళ్ళి ఎమర్జెన్సీ లాంపులు తీసుకొని వచ్చి స్టేజి మీద వుంచారు. మైకుకు బాటరీ కనెక్షన్ ఏర్పాటు చేసారు.

“ప్రముఖ రచయిత్రి జ్వాల గారి ప్రసంగం”అని వేదిక మీద పెద్ద బ్యానర్ అమర్చారు. వేదిక మీదున్న కుర్చిలలో తనూజ, సుకన్య,  గణపతి, విక్రమ్ కుర్చోని వున్నారు. జ్వాలకు ముందు నిలబడి విక్రమ్  యొక్క గత జీవితాన్ని అందరికి తెలుపుతోంది. ప్రేక్షకులు ముందున్న వి.ఐ.పి. వరుసలో జగదీష్ రంగస్వామి, భారతిలు  కూర్చొని వున్నారు

విక్రమ్ సిగ్గుతో చితికిపోతున్నాడు. తల పూర్తిగా వంచుకున్నాడు. అవమానభారంతో రక్తం సలసలా కాగుతోంది. జ్వాల ప్రసంగం విక్రమ్‌కి పుండు మీద కారం చల్లినట్లుగా వుంది.  ‘ఈ రోజు నా జీవితంలో ఎన్ని విచిత్రమైన మలుపులు తిరిగింది.  ఉదయం రంగస్వామి, భారతిలు కలసి ఇంటికి రావడం ఒక పెద్ద షాక్ కలిగినట్లయింది. సంగతి తెలుసుకొన్న తనూజ అనకూడని మాటలతో తిట్టడమే కాకుండా దాని అన్న జగదీష్‌ను పిలిపించింది. వాడు పోలీసు దెబ్బ ఎటువంటిదో చూపించాడు. గణపతి తనూజలు చంపుతానంటూ భయపెడుతుంటే వణికిపోయాను. వాళ్లలో కోపం చూస్తుంటే వాళ్ళ చేతుల్లోనే నేను అంతమౌతానన్న భయం….. సమయానికి పిచ్చి భారతి అడ్డుకొంది. నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తనూజ నిర్నయించుకొన్నప్పుడు ఎంతగా భయపడ్డాను. అలా జరిగివుంటే విచారణ పేరుతో జగదీష్  ఏమి చెయ్యబోతాడో తలచుకుంటే వణుకుపుట్టుతోంది. మరలా ఆ పిచ్చి భారతి  తనూజ కాళ్ళ మీద పడి నా భర్తకు ఏ విధమైన అపకారం జరిగినా నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ భోరున ఏడవటంతో తనూజ పోలీసులకు చెప్పను అంటూ పార్వతికి మాట ఇవ్వటంతో నరక ద్వారం దగ్గరకు వెళ్లి వెంట్రుక వాసిలో తప్పించుకొన్నట్లయింది. పెద్ద గండం గడిచిందిలే అనుకొని ఊపిరి పీల్చుకొంటే…. ఈ  జ్వాల సలహా మీద తనూజ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. జీవితాంతం ఈ పట్టణంలో తలఎత్తుకుని తిరగకుండా ఉండేలా చేస్తోంది. ఏ మాత్రం ఆవకాశం దొరికినా ఈ తనూజ మీద పగ తీర్చుకోవాలి. అలాగే ఈ గొడవకు ముఖ్య కారణమైన ఆ భారతికి జీవితాంతం నరకం చూపించాలి….’ కసిగా అనుకొన్నాడు మురళి .

‘తల పైకి ఎత్తితే చాలు ముందు వరుసలో నున్న పత్రికా విలేఖరుల కెమరాలు క్లిక్‌మంటోంది. గుడ్డికన్నా మెల్ల నయమన్నట్లు పవర్ కట్ కావడం కాస్త నయమనిపించింది ఈ వెధవ కార్యాక్రమం ముగిసే వరకు ఇలాగే తల వంచుకునే కూర్చోవాలి. ఈ కాస్సేపు అవమానాన్ని భరించాలి. ఛ …చ్చ… ఇంత వరకు ఇలాంటి  అవమానం నాలాంటి మోసగాళ్లలో ఎవరికీ జరిగి ఉండదు’ అని మనసులో అనుకొన్నాడు విక్రమ్.

జ్వాల ప్రసంగాన్ని వినసాగాడు

“భారతి చదువుకోలేదు. పల్లెటూరిలో ఒక ప్రైవేట్ బడి నందు స్కూల్ మాస్టర్‌గా పని చేస్తున్న విక్రమ్  భారతిని ప్రేమ పేరుతో మోసం చెయ్యాలనుకున్నాడు. భారతి అటువంటి వాటికీ అవకాశం ఇవ్వక పోవడంతో నేరుగా వాళ్ళ తల్లి తండ్రులకు భారతిని ప్రేమిస్తున్నట్లు తెలుపుతూ ఇష్టమైతే వివాహం చేసుకొంటాననడం…. వాళ్ళు అంగీకరించి పెళ్లి చేయడం… ఇద్దరు పిల్లల తరువాత వాళ్ళను అక్కడే వదలి ఇక్కడ తనూజను మాయ మాటలతో ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకొన్నాడు. ఎవరో విక్రమ్ చిరునామా చెప్పగానే భారతి తన తండ్రిని తీసుకొని వచ్చింది. ఎందుకు తెలుసా జరిగిందంతా మరచి  పల్లెటూరికి భర్తతో వెళ్లాలని నిర్ణయించుకొంది తప్ప భర్తను పల్లెత్తు మాట కూడా అనలేదు…. భారతి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చద్దన్నానికి ఊరగాయ అద్దుకొన్నట్లు….. భర్త ఇలాంటి పొరపాట్లు చేయడం సహజంగా భావిస్తోంది తప్ప ఆమె దృష్టిలో ఇదొక నేరం కాదు. తనూజ తనను మోసం చేసి రెండవ వివాహం చేసుకొన్న ఈ విక్రమ్‌ని చట్టరీత్యా శిక్షించాలనుకొంటే ఆ పల్లెటూరి భారతి  అడ్డుపడింది. ఆ సమయాన నాకు కలిగిన ఆలోచన చెప్పగానే తనూజ అంగీకరించింది. నేను ఇచ్చిన ఆలోచన ఏమిటంటే…. ఈ నిండు సభలో తనూజ తన మెడలో వున్న తాళి తీసి వాడి మొహంపై విసిరి కొట్టి, వాడికి ఒక గుణపాఠము నేర్పడంతో పాటు వాడితో తనకున్న బంధాన్ని తెంచుకొంటుంది. ఈ సంఘటన గురించి రేపు  ఉదయం ప్రముఖ  దిన పత్రికలలో, ప్రముఖ టీవీ చానెల్స్ నందు వస్తుంది. ఇప్పుడు తనూజ  తన తాళి తీసి విక్రమ్ ముఖం పై విసిరి కొడుతుంది.  ఆ తరువాత నా ప్రసంగాన్ని  కొనసాగిస్తాను….” అంది జ్వాల.

సుకన్యకు ఒక్కసారిగా బి.పి. పెరిగింది. తనూజ తన మెడలో తాళి తీయబోతున్నసమయాన “అమ్మా తనూజా…..” బిగ్గరగా అరుస్తూ వచ్చి తనూజను పట్టుకొని భోరుమని విలపించింది. “నిన్ను మోసం చేసిన ఆ నీచుడ్ని నేను ఇప్పుడే చంపుతాను, ఆ తరువాత నీవు తాళి తీయమ్మా” అంటూ  అపర కాళిలా విక్రమ్ దగ్గరకు ఆవేశంతో వెళ్తున్న సుకన్యను గణపతి గట్టిగా పట్టుకొని సముదాయించసాగాడు. ప్రేక్షకుల్లో  ఆ దృశ్యం చూసిన చాలామంది మనసు మూగగా బాధపడితే, మరికొంతమంది ఆ నిర్ణయం సరికాదంటూ, మొదట విక్రమ్‌కి శిక్ష పడవలెనని ఆవేశ పడ్డారు. అలా ఆవేశ పడ్డ వాళ్ళలో పట్టణ మహిళా మండలి అద్యక్షురాలు వేగంగా వేదిక పైకి ఎక్కి మైకు ముందు నిలబడి “ముందు ఆ నీచుడిని శిక్షించండి. పోలీసులకు ఫిర్యాదు చెయ్యండి. పోలీసులను ఇక్కడకు పిలిపించి ఖైదు చేయించండి, ఆ తరువాత ఆ అమ్మాయి  తాళి తీయించండి” అంది. చాలా మంది ప్రేక్షకులు ఆమె మాటలకు బలపరస్తూ “ముందు ఆ నీచుడ్ని శిక్షించండి “అంటూ అరవసాగారు.  జ్వాల మైకు ముందు నిలబడి “మీ అందరికి మరొక్కసారి నమస్కరించి విన్నవించుకోనేదేమిటంటే దయచేసి గొడవ చెయ్యవద్దండి. భారతి వల్ల ఆ విక్రమ్   తప్పించుకోనగాలిగాడు. భర్త ఎంతటి దుర్మార్గుడైనా సరే అతని కాళ్ల దగ్గరే పడివుండాల్లనదే అ భారతి  జీవితాశయం. ఇలాంటి స్త్రీలు మన దేశంలో చాలా మంది వున్నారు, స్త్రీ  సమాజములో  ఎంత ముందుగా వెళ్తుందో  వీరికి తెలీదు. లోక్ సభ స్పీకర్ ఒక మహిళ అన్న సంగతి భారతికి తెలీదు. రక్షణ శాఖా మంత్రి ఒక మహిళని భారతికి తెలీదు. భారతి లాంటి మహిళల్లో మార్పు రావాలి అంతవరకు విక్రమ్ లాంటి మోసగాళ్లను ఏమీ చేయలేము.”

మహిళలపై  అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. మహిళలకు భద్రత లేదంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. మహిళలు మారాలి….. సమాజం మారాలి….. అప్పుడే…. అప్పుడే  స్త్రీలకు భద్రత. భారతి లాంటి అమాయక స్త్రీలు ఉన్నంతవరకు విక్రమ్ లాంటి వారు చట్టానికి  దొరకకుండా ఎటువంటి శిక్ష పడకుండా తప్పించుకొంటున్నారు. భారతిలో మార్పు వస్తే మీరు కోరిన విదముగా విక్రమ్‌ని చట్టం ద్వారా శిక్షించడానికి అవకాశం వుంది. దయచేసి ఇప్పుడు  జరుగుతున్న కార్యక్రమమునకు అడ్డు చెప్పకండి. “

అప్పటికే భారతిలో ఎన్నో ఆలోచనలు ఒక్కరు కూడా ఏదో పొరపాటు జరిగిపోయింది, సమాధానానికి పొండి అంటూ ఒక్కరూ చెప్పలేదు. తన గ్రామం నుండి బయలుదేరేటప్పుడు ఎలాగోలా కాళ్ళా వెళ్ళా పడి బ్రతిమలాడి ఒప్పించి తీసుకొని రమ్మని చెప్పిన వారే తప్ప వాడి చెంపలు వాయించమంటూ చెప్పలేదు…. తనూజ తల్లితండ్రుల నిర్ణయాలు…. మాటలు, ఆవేశం, దైర్యం…. జ్వాల ప్రసంగం…. ప్రేక్షకుల ఆవేశం, అభిప్రాయం…. మొదటి సారి భారతి  ఆలోచనలు కొత్త కోణంలోనికి వెళ్ళింది. భారతి తండ్రి వైపు చూస్తూ “నాన్నా నేను ఆయనతో కాపురం చెయ్యను. ఆయనకు…. వాడికి శిక్ష పడాలి” లోలోన భయపడుతూ మెల్లగా అంది. రంగస్వామి  మౌనంగా తల ఆడించగానే భారతిలో కొండంత దైర్యం ఒక ప్రక్క, మరో ప్రక్క తండ్రిలో మార్పు రావడం ఆశ్చర్యం కలిగించింది. తన నిర్ణయం తనూజకు చెప్పడానికై వేదిక పైకి వెళుతుండగా  భవిష్యత్తుకు సంబంధించిన భయాల్ని, బ్రాంతుల్ని బట్టబయలుచేసి దైర్యం ప్రసాదించేలా ఒక్క సారిగా కరెంట్ రావడంతో కళామందిరం వెలుగుతో నిండిపోయింది.  సమాజంలో భారతిలాంటి వారు ఎందరో వున్నారు….. వారి లోనూ ఇలాంటి మార్పు రావాలి.