[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]
[dropcap]కు[/dropcap]మ్మరి సారే, కమ్మరి కొలిమి, చాకలి రేవు, రైతన్న నాగలి
ప్రతి పనిముట్టు యంత్రాల దాటికి మాడి మసై పోయాయి
యంత్రాలు మంత్రాలై మనిషిని మాయ చేసాయి
ప్రపంచీకరణ మాంత్రికుడు మాయలఫకీరై మంత్రదండంతో మరమనుషులుగా చేసాడు.
ఎవరికీవారే యమునాతీరై ఇంట్లోని నలుగురు నాలుగు ప్రపంచాలవుతారు
మనిషికి, మనిషికి మధ్య మాటల్లేవు తీగల తరంగాల ‘సెల్లు’లో ‘సొల్లు’ కబుర్లు తప్ప.
కలిసి భోంచేయడం లేదు, మాయల పెట్టి మాయలో మింగేయడం తప్ప
పర్యావరణ పరిరక్షణ లేదు, ప్లాస్టిక్ ఉపద్రవంతో ప్రకృతి విద్వంసం తప్ప
అపార విజ్ఞానం లేదు నీతి పద్యాలు లేని అర్థం కాని రైమ్స్ అరచేతిలో ఐపాడ్లు తప్ప
‘బుక్ రీడింగ్’ లేదు….’ఫేస్ బుక్ ‘ రీడింగ్ తప్ప
తక్షణ ఆపద నివారించడం లేదు, ఫోటో తీసి, షేర్ చేసి ఆనందించడం తప్ప
శారీరక వ్యాయామాలు లేవు, ఉరుకుల పరుగుల ఉద్యోగాలు తప్ప
పసందైన విందు భోజనాలు లేవు, పాచి,ఫాస్ట్ ఫుడ్ వేడి చేసి మింగడం తప్ప
ప్రకృతి అస్వాదన, ఆరాధన లేదు అనుక్షణం టెన్షన్‌ల సునామీలు తప్ప
ఆత్మీయతానురాగాల బంధం లేదు, కనిపించని ఇంటర్ నెట్ బందం తప్ప
ముఖాముఖీ చూసుకోవడం లేదు, స్కైప్‌లలో దర్శించడం తప్ప
ఆత్మీయులతో ఆస్వాదించే ఆర్రోజుల సంప్రదాయ వివాహాలు లేవు
ఫేస్‌బుక్‍లో చూసుకుని ఇంటర్‌నెట్‌లో చేసుకునే సుడిగాలి పెళ్ళిళ్ళు తప్ప
అనుభవాన్ని ఆదరించే అనురాగం లేదు ఆశ్రమాల పాల్జీసే ధనహంకారం తప్ప
కలకాలం కలిసుండే అన్యోన్య ఆదర్శ దాంపత్యాలు లేవు
మిడిమిడి జ్ఞానంతో విడాకుల పాలై పెటాకులైన పెళ్లిళ్లు తప్ప
ప్రపంచీకరణ నేపథ్యంలో గమ్యం తెలియని ప్రయాణం ప్రశాంతత లేని జీవితం
మనసున్న మనిషి మాయమై ఆర్ద్రత నింపే మానవత్వం మటుమాయమై
జీవితం యాంత్రికమై వ్యసనాలకు తనకు తెలియకనే బానిసవుతున్నాడు
అందలాన్ని అందుకుంటున్నాననుకుంటూ అధః పాతాళానికి జారుతున్నాడు
విజ్ఞాని ననుకుంటూ అజ్ఞానిగా మిగిలిపోతున్నాడు
విజ్ఞానం సంపాదించు కాని బానిసవకు
అభివృద్ది ఆకాంక్షించు కాని మూలాలు మరవకు
సాంకేతికతను వినియోగించు కాని దుర్వినియోగం చేయకు
శాస్త్ర పరిజ్ఞానం సాధించు కాని మానవత్వం మరవకు.