29. పసి మొగ్గలు

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రాగానే వేడి వేడి కాఫీ తాగుతూ దినపత్రిక చదవడం… ఆ తరువాత ఒక అర్ధగంట పాడు మొబైల్‌లో ఈమెయిల్స్, వాట్స్‌అప్ మెసేజులు చూసుకుని, వాటికి తగిన సమాధానాలు పంపడం… సదానంద్ దినచర్యలో ఓ ముఖ్యమైన భాగం.

అలా చూస్తుంటే మిత్రుడు డాక్టర్ ప్రశాంత్ వాట్సప్‌లో పంపిన ఒక ఆహ్వాన పత్రిక సదానంద్ దృష్టిని ఆకర్షించింది. మనవరాలు చి. అక్షర మొదటి జన్మదినోత్సవం, వచ్చే ఆదివారం, సాయంత్రమ్ ఆరు గంటల నుంది, హైదరాబాద్ జుబిలీ బస్టాండ్ దగ్గర ఉన్న ‘అభినవ్ ప్యాలస్’లో జరగబోతుంది.

చాలా సంతోషించాడు సదానంద్. ఎందుకంటే, హనుమకొండలో వుంటున్న స్నేహితుడు ప్రశాంత్‍ని, హైదరాబాద్‌లో కలుసుకుని తనతో కొంత సమయం గడపబోతున్నందుకు.

చూస్తుండగానే ఆ రోజు రానే వచ్చింది. పాపకిచ్చేందుకు ఒక మంచి గిఫ్ట్ కొనుక్కుని సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు అభినవ్ ప్యాలస్‌కు చేరుకున్నాడు సదానంద్. వెంటనే ప్రశాంత్‌ని చూడడానికి సదానంద్ కళ్ళు వెతకసాగాయి. వచ్చిన అతిథుల్ని స్వాగతించడంలో తలమునకలై వున్న ప్రశాంత్‌కి అడ్డు తగిలి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, కొద్దిసేపు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిద్దామనుకున్నాడు సదానంద్.

కార్యక్రమం జరుగుతున్న భవనం ఒక పురాతన కట్టడం. బహుశా ఒకప్పుడు పెద్ద ఉమ్మడి కుటుంబం నివసించిన బంగ్లా అయ్యుంటుంది. దానికి కొన్ని మరమత్తులు, మరికొన్ని మార్పులు చేర్పులతో, ఒక అందమైన అధునాతన భవనంగా తీర్చిదిద్ది, చిన్నపాటి ఫంక్షన్స్ జరుపుకోడానికి సరసమైన రోజూవారి అద్దెతో అందుబాటులో ఉంచారు.

ఒకవైపు పిల్లలందరూ కేరింతలు కొడుతు, ఆటపాటలలో మునిగిపోయారు. వచ్చినవారంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఉభయకుశలోపరి సంభాషణలతో ఆనందోత్సాహాల అలలపై తేలియాడుతున్నారు.

సువాసనలు వెదజల్లే పూలమాలలతో, ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల బూరల సముదాయంతో, కనులు మిరమిట్లు గొలిపే విద్యుద్దీపాల కాంతులతో ఆ భవనమంతా శోభాయమానంగా ఉంది. వినసొంపైన సంగీత ఝరి సవ్వడి చేస్తూ వీనుల విందు చేస్తుంది.

పిల్లలు, పెద్దలు యుక్తవయస్కులు… అందరూ అందంగా ముస్తాబై కార్యక్రమానికి నిండుతనాన్ని చేకూర్చారు. ఓ ప్రక్కగా గోడపై ఆరోహణ క్రమంలో అమర్చబడిన వివిధ భంగిమలలో వున్న, ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న చి. అక్షర తాలుకూ ఓ డజను ఫోటోలు చూడముచ్చటగా వున్నాయి.

సింహద్వారానికి ఎదురుగా లోపల వేదికను ఒక అడుగు ఎత్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బహు సుందరంగా అలంకరించారు. వేదిక చుట్టూ, క్రింద ఆహుతులు ఆసీనులయ్యేందుకు ఆసనాలను వరుస క్రమంలో సర్ది వుంచారు. వచ్చినవారంతా ఆ ఆసనాల్లో కూర్చుంటున్నారు. ఫోటోగ్రాఫర్లు, తమ తమ సామాగ్రిని సర్దుకుంటూ ఆనాటి మధురక్షణాలను బంధించి తీపి గుర్తులుగా అందించడానికి సమాయాత్తమవుతున్నారు.

కొంచెం అటుగా వెళ్తే, శాఖాహారులకు మాంసాహారులకు వేరువేరుగా భోజన ఏర్పాట్లను హడావిడిగా చేస్తున్నారు. వంటకాల ఘుమఘుమలు ముక్కు పుటాల గుండా పయనించి అంగిటి చేరి నోరూరిస్తున్నాయి. మొత్తానికి ఏర్పాట్లన్నీ ఘనంగా వున్నాయని మనసులోనే అనుకుంటూ… సదానంద్  హాల్లోకి వచ్చాడు ప్రశాంత్‌ని కలిసేందుకు.

సదానంద్‌ని చూసిన ప్రశాంత్, “ఓ… సదానంద్ గారు! ఎలా వున్నారు? అంతా బాగేనా?’ అని పలకరిస్తూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

“ఓ… బ్రహ్మాండంగా వున్నాం… అన్నట్లు… ఏర్పాట్లన్నీ అదిరిపోయాయి. ప్రశాంత్ గారు… మరి ఈ కార్యక్రమ నిర్వహణలొ మీకు నా సాయం ఏమైనా కావాలా?” అడిగాదు సదానంద్.

“ఏం అక్కర్లేదు. అయినా మనం చేయడానికి ఏం మిగులుస్తున్నారు కనుక ఈ కుర్రకారు. అంతావాళ్ళే చూసుకుంటున్నారు” చెప్పాడు ప్రశాంత్.

తరువాత ప్రశాంత్ తన మాటల్లో తాను ఈ మధ్య కాలంలో వ్రాసిన కవితలు, కథల గురించి చెప్తుంటే విని… రోజు రోజుకీ ప్రశాంత్ ఒక ప్రముఖ రచయితగా ఎదుగుతున్నందుకు లోలోపల ఎంతో సంతోషించాడు.

ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినవాడిలా, ప్రశాంత్…

“ఆ.. మీరు ఒంటరిగా వచ్చారు కదా సదానంద్ గారూ… నేనా… అటూ ఇటూ తిరుగుతూ ఉంటాను. మీరు తోడు లేక ఇబ్బంది పడతారేమో! ఉండండి.. ఒక పని చేద్దాం!” అంటు అటు వైపు తిరిగి దగ్గర్లోనే ఉన్న ఒక వ్యక్తిని ఉద్దేశించి…

“సోమశేఖర్ గారూ… ఒకసారిలా రండి…” అంటూ పిలిచాడు.

ఆ వ్యక్తి మా దగ్గరకు వచ్చి నిల్చోగానే, ప్రశాంత్…

“ఆ! సోమ శేఖర్ గారు! వీరు నా మిత్రులు సదానంద్ గారు. గ్రామీణ బ్యాంకులో ప్రాంతీయ అధికారిగా పనిచేస్తూ ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసి… ఇక్కడే… హైదరాబాదులో స్థిరపడ్డారు” అంటూ సదానంద్‌ని సోమ శేఖర్‌కి పరిచయం చేశాడు.

“గ్లాడ్ టు మీట్ యు” అంటూ సోమ శేఖర్ సదానంద్‌తో కరచాలనం చేశాడు.

“సదానంద్ గారూ! వీరు సోమ శేఖర్ గారు… ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. మీకు లాగే… వీరూ… నాకు ఆప్తమిత్రులు” అంటూ సోమ శేఖర్‌ని సదానంద్‌కు పరిచయం చేశాడు ప్రశాంత్.

మరోసారి కరచాలనం చేసుకున్న సదానంద్, సోమ శేఖర్‍లు.. మరి కాసేపట్లోనే కబుర్లతో మరింతగా దగ్గరయ్యారు.

“ఇక మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. నేనలా వెళ్ళి.. వచ్చినవాళ్ళను పలకరిస్తుంటాను… సరేనా!” అంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు ప్రశాంత్.

అప్పుడే అక్కడున్న పిల్లలందర్నీ అలరించేందుకు వేదికపై ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో లో మెజీషియన్ తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నాడు. మ్యాజిక్‌ షోలో పిల్లలందరూ  హుషారుగా పాల్గొంటూ పరిసరాలను మరిచిపోయి హార్షాతిరేకమ్తో ఉప్పొంగిపోతున్నారు.

ప్రశాంత్‌తో తమకున్న అనుబంధాల్ని గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు సదానంద్, సోమ శేఖర్‌లు.

‘ప్రశాంత్ వృత్తిలో డాక్టరుగా మంచి పేరు సంపాదించారు. పైగా మంచి రచయిత. అంతకు మించి మంచి మనిషి’ అని ప్రశాంత్ గురించి మాట్లాడుకున్నారు.

ఇంతలో మ్యాజిక్‌ షో పూర్తయ్యింది. వేదికపై ఒక టేబుల్ వేసి, దానిపైన కేక్ కటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. తరువాత పాప తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఒక్కరొక్కరుగా అందరూ వేదికపైకి చేరుకున్నారు. వెంటనే పాపతో బర్త్ డే కేక్‌ని కట్ చేయించి, అందరికీ కేకు ముక్కల్ని పంచి పెట్టారు.

ఆ తరువాత వచ్చిన వారందరూ వరుసగా వేదికపైకి వచ్చి పాపను ఆశీర్వదించి బహుమతులను అందజేశారు. ప్రతి ఒక్కరూ పాప, పాప తల్లిదండ్రలతో ఫోటోలు దిగారు. అందరితో పాటు సదానంద్, సోమ శేఖర్‌లు కలిసిపోయారు.

అందరు తమ తమ ఆసనాల్లో కూర్చున్న తరువత డా. ప్రశాంత్ మైక్రో ఫోన్ తీసుకుని వేదిక పై నుండే మాట్లాడ్డం మొదలుపెట్టాడు.

“ఈ రోజు… మా చిట్టితల్లి, మా కంటి వెలుగు, మా ఆశాజ్యోతి… చి. అక్షర మొట్టమొదటి జన్మదినోత్సవ వేడుకకు, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు వచ్చిన మీ అందరికీ నా తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇలాంటి మరపురాని రోజున నా బంగారు తల్లికి నేనేమి కానుకగా ఇవ్వాలి అనే ఆలోచనలు గత పది రోజుల నుండి నా మస్తిష్కంలో మెదలుతూనే ఉన్నాయి.

ఆ ఆలోచన నుండి పురుడుపోసుకున్నదే ఈ చిన్ని పుస్తకం.

గత మూడు మాసాలుగా నేను వ్రాసిన కవితలన్నింటిని… ఒక సంపుటిగా తయారుచేసి ‘పసి మొగ్గలు’ అనే పేరుతో పుస్తక రూపంలో ముద్రించిన ఈ చిన్ని పుస్తకాన్ని, ఈ రోజు, ఇప్పుడే, మీ అందరి సమక్షంలో… నా ముద్దుల మనవరాలు చి. అక్షరకి అంకితం చేస్తున్నానని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటున్నాను” అని చెప్పిందే తడవుగా, అక్కడున్న వారందరూ ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో ప్రశాంత్ గారికి అభినందనలను తెలిపారు.

ప్రశాంత్ తిరిగి మాట్లాడుతూ…

“ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతూ, మా మిత్రులు, శ్రేయోభిలాషి, మన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖలో ఉపకార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ పుణ్యమూర్తి, ఐ.ఎ.ఎస్. గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను” అని అనగానే… పుణ్యమూర్తిగారు వేదికపైకి వచ్చారు. వారిని పాప తల్లిదండ్రులు పూలగుచ్ఛంతో స్వాగతించి, పట్టు శాలువా కప్పి సముచితంగా సత్కరించారు.

“ఇప్పుడు పుణ్యమూర్తిగారు తమ అమృత హస్తాలతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, వేదికపైనున్న అందరికీ పుస్తక ప్రతులను అందించి, నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను” అంటూ ప్రశాంత్ పసుపు రంగు కాగితంతో ప్యాక్ చేసి ఆకుపచ్చ రంగు రిబ్బనుతో ముడివేసిన పుస్తకాల ప్యాకెట్‌ని పుణ్యమూర్తికి అందజేశాడు.

ఆ పుస్తకాల ప్యాకెట్‌ని విడదీసి అందులోని పుస్తకాలను వేదికపైన ఉన్న వారందరికీ అందించారు పుణ్యమూర్తి. బర్త్ డే బేబీ ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పుతూ అమాయకంగా ఆడుకుంటుంది.

పుస్తకాలను చేతుల్లో ధరించినవారి గ్రూప్ ఫోటోలను తీసేందుకు ఫోటోగ్రాఫర్లు, వీడియోలు తీసేందుకు వీడియోగ్రాఫర్లు పోటీ పడ్డారు. మరో వైపు పాప మేనమామ, పెదన్నాన్నలు ఆ పుస్తక ప్రతులను ఆహుతులందరికీ అందించారు.

ప్రశాంత్ నుండి మైక్రో ఫోన్ అందుకున్న పుణ్యమూర్తి –

“డాక్టర్ ప్రశాంత్ గారు – ఒక పుస్తకాన్ని రచించి, ముద్రించి, ఆ పుస్తకాన్ని ఈ రోజు ఒక సంవత్సరం వయసున్న తన మనవరాలు చి.అక్షరకు అంకితం చేయడమన్నది… అపూర్వం, అద్వితీయం” … అనగానే సభికులందరూ మరోమారు తమ కరతాళ ధ్వనులతో హోరెత్తించారు.

సద్దుమణిగిన తరువాత, తిరిగి మాట్లాడుతూ, “అందుకు నేను ప్రశాంత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా చేయాలి… అనే విశేషమైన ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రత్యేకమైన కారణాలేంటో తెలుసుకోవాలని నాకనిపిస్తోంది. నాలాగే మీ అందరికీ ఆ కారణాలేంటో తెలుసుకోవాలని వుందనుకుంటాను” అని పుణ్యమూర్తి అనగానే…

“అవును… తెలుసుకోవాలని ఉంది…”

“ప్రశాంత్ గారూ… చెప్పాలి…” అంటూ అందరూ గట్టిగా నినదించారు.

“ఇప్పుడు డాక్టర్ ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను” అంటూ మైక్రో ఫోన్‌ను ప్రశాంత్‌కి అందించారు పుణ్యమూర్తి.

అందరూ ప్రశాంత్ ఏం చెప్తాడా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ మైక్రో ఫోన్‌ను  తీసుకుని, గొంతు సవరించుకుని, ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని, అందరి ఉత్కంఠకు తెరదించుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు.

“ఒక్కసారి మనమంతా పదిహేనవ శతాబ్దపు ప్రథమార్ధంలోకి తొంగి చూద్దాం. అప్పట్లో ఆంధ్ర భోజుడు విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయల వారు… అష్టదిగ్గజాలుగా పేరుగాంచిన ఉద్దండ పండితులతో… భువన విజయం నిర్వహించి, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసి… ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని చాటి చెప్పారు.

అంతటి ఘనచరిత్ర కలిగిన తెలుగు భాష మన మాతృభాష అయినందుకు మనమెంతో గర్వపడాలి. నిజానికి… 2011 జనాభా లెక్కల ప్రకారం, మన దేశ జనాభాలో 06.93 శాతం మంది మాతృభాష తెలుగు. అంటే… 08,11,27,740 మంది మాతృభాష తెలుగు భాష.

కానీ, నేతి పరిస్థితులు చూస్తుంటే తెలుగు భాష తేజస్సు రోజు రోజుకి మసకబారుతోందేమోననిపిస్తోంది. ఆంగ్ల భాషపై మోజుతో… అందరూ తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తూ, ఆ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే విని మురిసిపోతున్నారు.

అభిమానాల్ని, ఆప్యాయతను, అపారంగా పంచిపెట్టే అమృతమూర్తి అయిన ‘అమ్మ’ స్థానంలో ‘మమ్మీ’ వచ్చింది.

బిడ్డ యొక్క ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఉవ్విళ్ళూరుతూ, నిరంతరం తపిస్తూ అనునిత్యం శ్రమించే ‘నాన్న’ స్థానంలో ‘డాడీ’ వచ్చాడు.

కనిపెంచిన వాళ్ళతో సమానంగా అండగా నిలుస్తూ, నీకు మేమున్నామంటూ కొండంత మనోధైర్యాన్నందించే ‘అత్తయ్య’, ‘మావయ్య’ స్థానంలో ‘ఆంటీ’, ‘అంకుల్’ వచ్చారు.

మొన్నీ మధ్య మా అపార్టుమెంటులో వుంటున్న స్కూలు పిల్లలు ఆడుకుంటుంటే… గమనించాను. అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. ఇక కొంతమంది యువతీయువకులైతే తామేదో పరాయి దేశస్థుల్లాగా వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ తెగ ఇబ్బంది పడిపోతుంటారు.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలుగు భాష మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు.

ఇలా అంటున్నానంటే నేను ఆంగ్ల భాషను ద్వేషిస్తున్నానని అనుకోవద్దు. ఆ మాటకొస్తే ఆంగ్ల భాష అవసరం కూడా ఈ రోజుల్లో చాలా వుంది. విశ్వమంతా ఒక నగరంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో మనవాళ్ళు విదేశాలలో నెగ్గుకురావాలంటే ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పనిసరి.

అందుకే ఆంగ్లభాషను నిర్లక్ష్యం చేయకుండా, మన తెలుగు భాషకు కూడా మరింత ప్రాధాన్యతను ఇవ్వాలన్నదే నా భావన.

అందుకోసం మనమందరం, ప్రాచీన కాలం నుండి తెలుగు భాషకున్న ప్రాభవాన్ని దిగజారిపోనివ్వకుండా పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోవాలి.

ముందుగా తల్లిదండ్రులందరూ ఇంట్లో పిల్లలతో విధిగా తెలుగులో మాట్లాడాలి. ప్రతిరోజు నిర్ణీత సమయంలో పిల్లలకు తెలుగులో వ్రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పాలి. పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర తెలుగు పుస్తకాలను చదవడం అలవాటు చేయాలి. ప్రతివారిలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించాలి. అందుకోసం ఎవరి పరిధిలో వారు, తమకు అనుకూలమైన రీతిలో ఈ బృహత్తర కార్యక్రమానికి పథక రచన చేసుకుని పకడ్బందీగా అమలు చేయాలి.

మరి ఈ రోజు నేను రచించి, ముద్రించిన ఈ చిన్ని పుస్తకం గురించి ఒకే ఒక్క ఏడాది వయసున్న నా మనవరాలు చి.అక్షరకు ఏమీ తెలియదు. కాని పెరిగి పెద్దదవుతూ… ఈ పుస్తకాన్ని చూసినప్పుడల్లా… నా తాతయ్య తెలుగు భాషకు వీరాభిమాని అని, తెలుగులో మంచి రచయిత అని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ తరువాత తను కూడా తాతయ్య మార్గంలో నడుస్తూ, తెలుగులో మంచి రచయిత్రిగా ఎదుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ చిన్ని పుస్తకాన్ని ఆ చిట్టి తల్లికి అంకితం చేశాను…” అంటున్న ప్రశాంత్ గద్గద స్వరం కొద్ది సేపటికి మూగవోయింది.

ఒక్కసారిగా అక్కడున్న వారందరూ లేచి నిల్చుని ప్రశాంత్ గారి ఆలోచనలకు ప్రశంసలను కురిపిస్తూ, వాటికి తమ సంఘీభావాన్ని తెలపడానికి సంకేతంగా గట్టిగా చప్పట్లు కొట్టారు.

తదుపరి అతిథులందరితో పాటు సదానంద్ కూడా షడ్రసోపేత విందు భోజనాన్ని కడుపారా ఆరగించి, ప్రశాంత్ దంపతుల దగ్గర, పాప తల్లిదండ్రుల దగ్గర శలవు తీసుకుని ఇంటి ముఖం పట్టాడు.

దారిపొడవునా సదానంద్ చెవుల్లో, స్ఫూర్తి నింపే ప్రశాంత్ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రశాంత్ ఆవేదనను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న సదానంద్… తనుకూడా సాధ్యమైనంత ఎక్కువమంది పిల్లలతో తెలుగు భాషలో వ్ర్రాయించేందుకు, చదివించేందుకు, మాట్లాడించేందుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని వెనువెంటనే అమలు చేయాలనే కఠోర నిర్ణయాన్ని అప్పటికప్పుడే తీసుకున్నాడు.

ఇంతలో సదానంద్ ఇల్లొచ్చింది. కారాపడానికి డ్రైవర్ వేసిన బ్రేకు, సదానంద్ ఆలోచనలకు కూడా ఫుల్‌స్టాప్ పెట్టింది.