[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]అ[/dropcap]దొక డిపార్టుమెంటల్ స్టోర్… Buy 1 get 1 free ఆఫర్ చూసి coke టిన్ పరిమాణంలో ఉన్న ఓ పది ఆక్సిజన్ టిన్స్ తీసుకుని ట్రాలీ బాస్కెట్‌లో వేసుకున్నాడు రాజు. గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ ఆక్సిజన్ టిన్ కూడా నిత్యావసర వస్తువైపోయింది. ‘నీటిని కొనుక్కునే రోజులొస్తాయని బ్రహ్మంగారు చెబితే ఏమో అనుకున్నాం ఇప్పుడు గాలిని కొనుక్కుంటున్నాం. హూఁ.. రోజులు మారి పోయాయి’ అని మనసులో అనుకుంటూ ఉండగా…
“రాజూ…!” అన్న పిలుపుకు వెనక్కి తిరిగి చూశాడు.
“హరీ….!” రాజు కళ్ళల్లో చెప్పలేనంత ఆశ్చర్యం.
ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఒక్కక్షణం అలా ఉండిపోయారు మౌనంగా. మరుక్షణం ఆ మౌనం బద్దలైoది.
“ఒరే… మామా….!!!” అన్న పిలుపుతో, కాదు…అరుపుతో. రాజు అలియాస్ రాజేష్, హరి అలియాస్ హరీష్ చిన్ననాటి స్నేహితులు. చాలా రోజుల తరువాత కలుసుకున్నారేమో… అందుకే ఆ సంబరం.
***
“రోజులెంత మారిపోయాయిరా మామా!” ఒకప్పుడు atm ల ముందో, పెట్రోల్ బంక్‌ల ముందో చూసేవాళ్ళం జనాలు ఇలా ‘క్యూ’ లో నిలబడ్డం, ఇప్పుడిలా చూస్తున్నాం” అన్నాడు హరి ‘క్యూ’ లో సర్దుకుంటూ…
“అవున్రా మామా… రోజులు కదా, మారిపోతూనే ఉంటాయ్” అన్నాడు తన వీపునున్న ఆక్సిజన్ సిలిండర్‌ను సరిచేసుకుంటూ…
వాతావరణంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రతీ ఒక్కరూ రోడ్డు మీదకు వచ్చేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్‌లు వీపుకు తగిలించుకుని రావాల్సిందే. అది నిండుకున్నప్పుడల్లా ఇదిగో ఇలా ఆక్సిజన్ బంక్‌లలో నింపుకోవాలి.
***
“ఊఁ… ఇప్పుడు చెప్పురా మామా! ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? పెళ్ళి? పిల్లలు?” అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు హరి…బేరర్ కి కాఫీ ఆర్డర్ ఇస్తూ
రాజు ఒక్కక్షణం హరిని తేరిపారా చూస్తూ…”వాఁ…!” అంటూ భోరు మన్నాడు.
“అరె! మామా… ఏమైందిరా? ఛ… ఛ… ఊరుకో, ఎవరైనా చూస్తే బాగుండదు” అన్నాడు రాజు కన్నీళ్లు తుడుస్తూ
“ఏం చెప్పమంటావ్ రా మామా…! ఆ… కాలేజ్ రోజులు, ఆ… అల్లరి, ఆ…సరదాలు, ఆ… సంతోషాలు, ఆ… ఎంజాయ్ మెంట్ తలచుకుంటేనే ఏడుపొస్తోంది రా…” అన్నాడు రాజు విషాదంగా
“ఇంతకీ…?” హరిలో సందేహం
“చెప్తారా మామా. నీతో కాక ఇంకెవరితో చెప్పుకోను? చాలా రోజులకు కలిసావ్. నీతో చెప్పుకుని నా గుండె బరువు దించుకోనీ…” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు రాజు.
***
“పెళ్ళై 5 సంవత్సరాలు. భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఒక బాబు, అత్తామామలు…ఇదిరా మామా నా జీవితం”
“మరి నువ్వు?”
“ఏముందీ… హౌస్ హస్బెండ్”
ఆ మాటకు అదిరిపడ్డాడు హరి.
“యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్‌వి, నువ్వు హౌస్ హస్బెండ్ ఏమిట్రా…!!”
“ఏం చేస్తాం? అంతా నా ఖర్మ. దేవుడు నా నుదుటన అలా రాసి, కాదు కాదు గీసి పారేసాడు మరి. నెలకు రెండు లక్షల జీతం, పై అలవెన్సులు ఒక లక్ష, ఉండటానికి ఇల్లు, కారు అన్నీ…అన్నీ… వదులుకోవాల్సి వచ్చింది”
“కానీ…! ఎందుకు రా?” ఆత్రుతగా అడిగాడు హరి
“పెళ్ళి కోసం” నిస్పృహగా అన్నాడు రాజు
“అర్ధమైంది” హరి రాజుని ఓదారుస్తున్నాడు
“ఒక మగాడి మనసు మరో మగాడికే అర్ధం అవుతుంది అంటే ఏమో అనుకున్నాను. అది నిజంరా మామా. నలభై దగ్గర పడుతున్నా పెళ్ళి చేసుకోవ డానికి అమ్మాయిలు దొరక్క… దొరికినా… వాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, కన్యాశుల్కం ఇచ్చుకోలేక, వెతికీ… వెతికీ… విసుగెత్తి, మొత్తానికి ఎలాగైతేనేం నా పెళ్ళి చేసి హమ్మయ్యా అనుకున్నారు అమ్మా, నాన్న”
రాజు మాటలు శ్రద్ధగా వింటున్నాడు హరి.
“ఎదిగిన కొడుకు గుండెలపై కుంపటి అనుకున్నారేమో అమ్మాయి తల్లిదండ్రులు పెట్టిన అన్నీ షరతులకు ఒప్పుకుని నా పెళ్ళి చేసేశారు. కన్యాశుల్కంగా మా ఆస్తి అంతా రాయించేసుకున్నారు. అంతేనా కొత్త కాపురానికి కావాల్సిన సారె మొత్తం ఇయర్ బడ్‌తో సహా కొనిపించారు. బావమరిది లాంఛనాలనీ, అవనీ… ఇవనీ… ఒకటేమిటి వాళ్ల గొంతెమ్మ కోర్కెలకు అంతే లేకుండా పోయింది”
వింటున్న కొద్దీ హరికి రాజుపై సానుభూతి పెరిగి పోతోంది.
“అన్నిటికన్నా పెద్ద విషాదం ఏంటంటే… బంగారంలాంటి ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర అత్తా మామలకు సేవ చేసుకుంటూ హౌస్ హస్బెండ్‌గా ఉండి పోవాలి అని కండిషన్ పెట్టడం”
రాజు మాటలకు హరి మనసు ద్రవిoచిపోతోంది.
***
“ఇక ఆ మూడు రాత్రులు గడిచిన తరువాత నుండీ మొదలైంది ప్రత్యక్ష నరకం. ఇంటెడు చాకిరీ చేస్తున్నా… అత్తామామలకు ఏ లోటూ రాకుండా సేవలు చేస్తున్నా… నన్నో మనిషిగా గుర్తించరెవరూ! ఆ ఇంటికి నేను అల్లుడిని కాదు ఒక పనివాడిని మాత్రమే. పోనీ పిల్లలు పుట్టాకైనా వాళ్ళలో మార్పు వస్తుందని ఎంతో ఎదురుచూసా! కానీ నా ఖర్మ కొద్దీ ఆ పుట్టింది మగపిల్లాడు. ఇక నా బతుకు కాపలా కుక్క కన్నా హీనమై పోయిందనుకో. ఈసారి ఆడపిల్ల పుట్టకపోతే విడాకులు ఇచ్చేస్తానని వేధింపులు మొదలయ్యాయి. ఇప్పుడు నా భార్యకు మూడో నెల. భవిష్యత్తుని తలచుకుంటే భయమేస్తోందిరా హరీ!”
ఒకప్పుడు హీమాన్‌లా సిక్స్‌పాక్ బాడీతో హీరోలా ఉండే రాజేష్‌ని అలా చూసేసరికి హరికి గుండె తరుక్కుపోతోంది.
“బాధపడకురా రాజు. మగవాళ్లo దేవుని మీద భారం వేయడం తప్ప ఏం చేయగలం? ఆఁ… దేవుడంటే గుర్తుకొచ్చింది, రేపు శనివారం వరనారాయణ వ్రతం నిష్ఠగా చేసి, నూటొక్క రోజులు ‘డిస్కో బాబా’ వ్రతం ఆచరించు నీకంతా మంచే జరుగుతుంది”
హరి మాటలకు రాజుకు ప్రాణం లేచొచ్చింది.
“డిస్కో బాబా వ్రతమా! ఎలా చేయాలి?”
“ఏం లేదురా మామా, ఉస్కో ఉస్కో బాబా… డిస్కో డిస్కో బాబా అంటూ నూటొక్క సార్లు ఆ మంత్రాన్ని నూటొక్క రోజులు జపించు. నీకంతా మంచే జరుగుతుంది. మనలో మన మాట ఈ నూటొక్క రోజులు నువ్వు బ్రహ్మచారిగా ఉండాలి అర్ధమయ్యిందా?” అన్నాడా చివరి మాట గుసగుసగా…హరి.
ఆ క్షణంలో హరిని దేవుడు తనకోసమే పంపించా డనిపించింది రాజుకి.
***
“అవున్రా హరీ! అన్నీ నన్నే అడుగుతున్నావ్, నీ గురించి చెప్పవేo?”
ఒక్క క్షణం హరి రాజుకళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ మరుక్షణం ‘వాఁ…’ అంటూ భోరు మన్నాడు.
“ఊరుకోరా హరీ! మగపుట్టుక పుట్టాక ఈ తిప్పలు తప్పవురా. కష్టాలు మగవాళ్ళకి కాక మానుల కొస్తాయా? ఇలాంటప్పుడే గుండె దిటవు చేసుకోవాలి. ఊరుకో…ఊరుకోరా…!”
“నాకన్నా నువ్వే నయంరా రాజూ! ఇంటిపట్టునే ఉంటూ అత్తామామల సేవలో నీ జన్మను సార్ధకం చేసుకుంటున్నావ్. ఇక నా సంగతి… పగలంతా ఆఫీస్‌లో రెక్కలు ముక్కలు చేసుకుని వచ్చేసరికి ఇంటి దగ్గర బండెడు చాకిరీ. పాపిష్టి అత్త, రోగిష్టి మామలకు ముదనష్టపు సేవలు చేయాలి. నా భార్య ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. పెళ్ళై 5 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని ఒకటే సతాయిoపు. పైగా రెండో పెళ్ళి చేసుకుంటానని బెదిరింపులు కూడానూ”
హరి కష్టాలు వింటుంటే రాజుకు దుఃఖం ఆగడం లేదు.
“ఆఫీస్‌లో ఆ లేడీ మేనేజర్ సందు దొరికితే చాలు అడ్డం పడిపోతోంది. రోజూ బస్సులో ఆడమ్ టీజింగ్ గురించి వేరే చెప్పాలా? ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు మా అత్తగారు ఈమఁధ్య నన్ను అదోలా చూస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉందిరా రాజూ. అప్పుడప్పుడు ఏ కరెంటు ప్లగ్‌లోనో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకోవాలనిపి స్తోందిరా రాజూ…” అంటూ కన్నీళ్లపర్యంతం అయ్యాడు హరి.
“అలాంటి అఘాయిత్యo చేశావా నా మీద ఒట్టే…!” హరి చేతిని తన తల మీద ఉంచుతూ అన్నాడు రాజు.
“మామా… నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే. నీకోసమైనా నేను బతికుంటానురా” హరి ఒట్టు వేస్తూ అన్నాడు.
***
“అవున్రా హరీ! మన రవిగాడెలా ఉన్నాడ్రా?”
“ఇంకెక్కడి రవి రా… ఎప్పుడో బుల్లెట్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడుగా”
“మై గాడ్! ఎంత మంచోడురా. కానీ…?”
“ఏముందీ… రోజూ న్యూస్ చానల్స్‌లో చూస్తున్నదే. కన్యాశుల్కం చాల్లేదని భార్య, అత్తా మామలు పెట్టే ఆరళ్ళు భరించలేక”
“డిస్కో బాబా! ఏమిటయ్యా నీ లీలలు? ఇంకా ఎంతమంది అమాయక మగవాళ్ళు ఈ కన్యాశుల్కం పిశాచికి బలి కావాలయ్యా?” రాజులో ఆవేదన.
“వయసొచ్చిన మగపిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే భయమేస్తోందిరా. ఎక్కడ చూసినా మగవాళ్లపై అత్యాచారాలే. లేదంటే ఆసిడ్ దాడులే. మగవాళ్ల మాన ప్రాణాలకు అస్సలు విలువ లేకుండా పోయిందిరా” హరిలో కోపం, ఉక్రోషం.
“ఇదంతా మన ప్రారబ్ధం. మన ముందు తరాల వాళ్లు ముందుచూపు లేకుండా చేసిన దానికి మనం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. మగపిల్లల మోజులో పుట్టకముందు ఊపిరి లాగేసి, పుట్టాక గొంతులో వడ్ల గింజలేసి, అత్యాచారాలు, వరకట్నాలు, లైంగికవేధింపులు, ఆసిడ్ దాడులు, ప్రేమించలేదని, పరువు కోసమని, ఆడపిల్లలను హత్య చేసి వాళ్ల ఉసురు పోసుకున్నాం. అది తగలకుండా పోతుందా? చేసుకున్నవారికి చేసుకున్నంత అని డిస్కో బాబా ఊరికే అన్నారా? మన కష్టాలు తీరి మంచిరోజులెప్పుడొస్తాయో…!”
“అవున్రా రాజూ! నువ్వు చెప్పింది నిజం రా… ఆడా మగా ఒకరికొకరు తోడుగా, ఒకరికోసమొకరుగా ఉన్నప్పుడే అందం, ఆనందం. ఈ సంగతి మన ముందు తరాల వాళ్లు గ్రహించి ఉంటే ఇప్పుడు మనకీ తిప్పలుoడేవి కాదు. సరే… సరే… ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అసలే రోజులు బాగా లేవు. ఒంటరిగా వెళ్ళకు. మగవాళ్ల కోసమే కొన్ని “హి” క్యాబ్ లు నడుపుతోంది మన ప్రభుత్వం. అందులోనే వెళ్ళు. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయరా… మామా! ఉంటాను బై! బై!” హరి వీడ్కోలు తీసుకుంటూ బాధగా
“అలాగే రా! వస్తా… బై!” అంటూ, ‘ఉస్కో ఉస్కో బాబా… డిస్కో డిస్కో బాబా’ నేను క్షేమంగా ఇంటికి చేరుకునేలా దీవించు బాబా, ఐదుగురు మగ ముత్తైదువులకు జేబు రుమాళ్ళు దానం ఇచ్చుకుంటా” అని మనసులోనే మొక్కుకుని క్యాబ్ స్టాండ్ వైపు అడుగులు వేసాడు రాజు.