30. మహా ప్రస్థానం

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]రా[/dropcap]ఘవరావు తండ్రి రామయ్య ఒకరోజు అర్ధరాత్రి గుండె నొప్పితో హఠాత్తుగా చనిపోయాడు. చనిపోయే నాటికి రామయ్యకి ఎనభై సంవత్సరాలు. అయినా భర్త చిన్న వయస్సులోనే చనిపోయాడని భార్య కాంతమ్మ భావన. ‘ఈ ముసలాడికి చాకిరి చెయ్యలేక ఛస్తున్నా, ఎప్పుడు పోతాడా’ అని ఎదురు చూస్తున్న పెద్ద కోడలికి మనశ్శాంతి. రాఘవరావుకి ఇంటి పెద్ద దిక్కు పోయాడని విచారం. పెద్దగా విచారం వ్యక్తం చెయ్యనిది రామయ్య రెండో కొడుకు, కూతురు ఎందుకంటే, రామయ్య మొదటినుంచి పెద్దకొడుకు రాఘవరావు దగ్గరే ఉండటం, పెద్ద వయసులో పోవటం.

రామయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దకొడుకు రాఘవరావు. అందరు దగ్గరూళ్ళల్లోనే ఉంటున్నారు. బంధువులందరికీ కబురు వెళ్ళింది. శవాన్ని ఇంట్లో ఉంచకూడదని, ఆరు బయట చాపవేసి దానిమీద పడుకోబెట్టారు. తల దగ్గర ఒక దీపం పెట్టారు. ఆ దీపం ఎందుకు పెట్టాలో పూర్తిగా ఎవరికి తెలియక పోయినా, అది ఎప్పట్నించో వస్తున్న ఆచారమట. జీవుడికి యమలోకంలో దారి చూపుతుందని పండితులు చెపుతారు. రామయ్య భార్య కాంతమ్మ భర్త శవం దగ్గర కూర్చుని, “నన్ను అన్యాయం చేసి పోయారు దేవుడో” అంటూ, భర్త బతికున్నప్పుడు ఆయనన్న మాటలను, చేసిన పనులను తలచుకొంటూ బిగ్గరగా ఏడుస్తున్నది. రెండో కొడుకు, కూతురు వచ్చారు. వాళ్ళు తండ్రి శవాన్ని చూసి మౌనంగానే కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. పెద్ద వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక పిల్లలు కూడా ఏడుపులు మొదలు పెట్టారు. రామయ్య చావు కబురు అందుకున్న బంధువులు, తెల్లవారి ఇంట్లోకి వస్తూనే ఏడుస్తూ కొంతమంది. విచారం వెలిబుచ్చుతూ కాంతమ్మను ఓదారుస్తుంటే, కాంతమ్మ ఇంకా బిగ్గరగా ఏడుస్తున్నది. కాసేపటి తరువాత రామయ్య సన్నిహితులు, స్నేహితులు అందరు వచ్చారు. అందరు రామయ్య చనిపోయినందుకు, విచారం వెలిబుచ్చారు. మొత్తానికి అక్కడ వాతావరణం గంభీరంగాను, కొంత గందరగోళంగానూ ఉంది.

ఏది తప్పినా, సాపాటు తప్పదన్నట్లుగా, వచ్చిన వారందరికీ, కాఫీలు ఇచ్చారు. వద్దువద్దంటూనే అందరూ కాఫీలు తాగారు. ఈ లోపల దహనకర్మలు చేసే శాస్త్రి గారికి కబురు వెళ్ళింది. శాస్త్రిగారు దర్భలతో రాఘవరావు ఇంటికొచ్చాడు. వస్తూనే, అక్కడ ఉన్న వాళ్ళందరిని పరికించి చూశాడు. ‘నన్ను ఎవరు పిలిపించారు, ఎవరు ఇక్కడ బాధ్యత తీసుకునేది’ అన్నట్లుగా ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు.

ఇంతలో రాఘవరావు ముందుకు వచ్చి “నేనే మీకు కబురు పెట్టాను.” శవంవైపు చూపిస్తూ “ఈయన మానాన్న గారండి. రాత్రి అనారోగ్యంతో పోయారు. ఈయన దహన సంస్కారాలు చేయాలి. ఎంతవుతుంది. అసలు ప్రొసీజరు ఏమిటి” అని అడిగాడు.

అప్పుడు శాస్త్రిగారు “ఈ కార్యక్రమాలకు కూడా కొన్ని ప్యాకేజీలు ఉన్నాయన్నాడు”.

‘ప్యాకేజీలా’ అంటూ రాఘవరావు ఆశ్చర్యపోయాడు.

“అవునండి ఒక్కొక్కదానికి ఒక్కో రేటుంటుంది”

“అయితే చెప్పండి” అన్నాడు రాఘవరావు, అప్పుడు శాస్త్రిగారు

“వినండి. దహన సంస్కారాల వరకే అయితే ఒక రేటు, దహన సంస్కారాలు, పదకొండు రోజుల వరకు అయితే మరొక రేటు. దానాల ఖర్చు కూడా నాదే అయితే ఒక రకం, దానాల ఖర్చు కూడా మీదే అయితే మరొక రకం. మీకేది కావాలో చెబితే నేను అంతా వివరంగా చెపుతాను”

“చాలా తతంగం ఉందే” అని మనసులో అనుకొని, “ఇవాళ ఒకరు, రేపు మరొకరు ఎందుకు శాస్త్రిగారు? అన్ని మీరే చెయ్యండి పదకొండో రోజు కార్యక్రమంతో సహా”అన్నాడు రాఘవరావు.

“అయితే నిత్య కర్మలు చేస్తారా, చివర మూడు రోజులు చేస్తారా?” అన్నాడు

“నిత్యకర్మలు చేసే ఓపిక నాకు లేదండి శాస్త్రిగారు. అందుకని చివర మూడు రోజులు చేస్తే చాలు లెండి”

“సరే అయితే దానాలు, గోదానంతో సహా అన్నీ నా ఖర్చేనా?” “అన్ని ఖర్చులు మీవే శాస్త్రిగారూ” అన్నాడు రాఘవరావు

“దహన సంస్కారాలు, చివరి మూడు రోజులు, అంటే తొమ్మిది, పది, పదకొండో రోజు కార్యక్రమాలు, బ్రాహ్మలకిచ్చే దానాలు, గోదానంతో సహా ఖర్చులు అన్నీ నేనే చూసుకుంటాను. మొత్తం ఒక నలభైవేలివ్వండి” అన్నాడు..

“నలభైవేలే?” అంటూ గుడ్లు తేలేశాడు రాఘవరావు. “పిల్లలు గలవాణ్ణి, మధ్యతరగతి కుటుంబీకుణ్ణి. అంతిచ్చుకోలేనండి. కొంత వెసులుబాటుగా చెప్పండి శాస్త్రిగారు” అన్నాడు.

“అన్నీ గమనించే చెప్పానండి రాఘవరావు గారు. ఇదే ఇంకొక చోటయితే యాభై, అరవైవేలకు తక్కువ తీసుకోనండి”

“అన్నీ కలిపి ఒక ముప్ఫయి వేలకి సెటిల్ చెయ్యండన్నాడు” రాఘవరావు

“కుదరదండీ రాఘవరావు గారు, ఏ సంగతీ చెపితే కార్యక్రమం మొదలు పెడతాను, లేదంటే, మీరు మరొకరిని చూసుకోండి. నాకు అవతల ఇంకొక చోటికి వెళ్ళాలి, వాళ్ళు నాకోసం ఎదురు చూస్తుంటారు” అన్నాడు. అంతా ఉత్తదే. రాఘవరావుని బెదరకొట్టటానికి ఆవిధంగా మాట్లాడాడు. సాధ్యమయినంత ఎక్కువగా డబ్బు పిండుకోవటానికి ఇదే మంచి అవకాశం. రాఘవరావుకి వేరే దారిలేదు శాస్త్రిగారు చెప్పిందానికి ఒప్పుకోవటం తప్ప. రాఘవరావు బ్రతిమలాడగా, శాస్త్రిగారు ముఫ్పై వేలకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఖర్చుల కోసం ఒక పదివేలు, కర్మ మొదలు పెట్టిన రోజున ఇంకో పదివేలు, ఆఖరి రోజున మిగిలిన పదివేలు ఇచ్చేటట్లుగా ఒప్పందం చేసుకొన్నారు.

“ఇహపోతే, ఊళ్ళో కర్మలు చేసే సత్రం ఉంది. ఆ సత్రానికి అద్దె కట్టాలి. అక్కడ ఉండే కాపలా మనిషికి, పనమ్మాయికి, అంటు తోమే అమ్మాయికి రోజుకి వంద రూపాయలు చొప్పున మూడు రోజులకు ఇన్వాలి. వెళ్ళిన రోజు, వచ్చేరోజు, కరెంటు యూనిట్లు నోట్ చేసుకొని, కరెంటుకి డబ్బులు కట్టాలి. ఈ మూడు రోజులకు పంట మనిషికి డబ్బులు ఇవ్వాలి. మీకు కావాలంటే వంట మనిషిని నేనే మాట్లాడి పెడతాను” అన్నారు. నిజానికి, ఆ వంట మనిషి శాస్త్రిగారి భార్యే. అన్నింటికి ఒప్పుకున్నాడు రాఘవరావు.

అంతా ఒ.కె. అయిన తరువాత, ముందే మాట్లాడి పెట్టుకున్న ఇద్దరు మనుషులను ఫోనులో రమ్మని చెప్పాడు. వాళ్ళు వచ్చేటప్పుడు రెండు వెదురు వాసాలు, కొన్న చిన్న ముక్కలు, కాళ్ళు పట్టుకొచ్చారు. శవాన్ని మోసుకు పోవటానికి ఒక పాడెను తయారు చేశారు. (అదివరకు అయితే నలుగురు మనుషులు శవాన్ని మోసుకు పోవటానికి కావలసి వచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ‘స్వర్గారోహణం’ అని ఒక వ్యానును ఏర్పరిచారు). ఒక గంట తరువాత రమ్మని ఆ వ్యానుకు ఫోను చేశాడు. అలాగే శ్మశానం దగ్గర శవాలను దహనం చేశే వాళ్ళకి (కాటి కాపరి) కబురు పంపించాడు. ఒక శవం వస్తుంది చితి పేర్చి రడీగా ఉండమని.

అసలు కార్యక్రమం అప్పుడు మొదలు పెట్టాడు. శవానికి స్నానం చేయించాడు. కొత్తబట్టలు కట్టబెట్టారు. మంత్రాలు చదువుతూ తతంగమంతా పూర్తి చేశాడు. సంబంధీకులను శవం చుట్టూ తిరగమన్నారు. కొందరు పైకి ఏడుస్తూ తిరిగితే, కొంతమంది మౌనంగా రోదిస్తూ తిరిగారు. మిగతా కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత శవాన్ని పాడిమీద పడుకోబెట్టి ఒక తెల్లబట్ట తలనుంచి కాళ్ళదాకా శవం కనిపించకుండా కప్పి, చూట్టూ తాళ్ళతో గట్టిగా కట్టేశారు. ఈలోపల ‘స్వర్గారోహణం’ వ్యాను వచ్చి అగింది. నలుగురు కలసి, ఆ శవాన్ని వ్యానులో పడుకో పెట్టారు. రాఘవరావు. ఇంకా ఒకరిద్దరు వ్యానులో కూర్చుని, నేరుగా శ్మశానానికి వెళ్ళారు. మామూలుగా అయితే, ఆ పాడెను. నలుగురు మోసుకుంటూ వెళుతూ, మధ్యమధ్యలో ఉంచుతారు. దాన్నే ‘దింపుడు కళ్ళం’ అంటారు. ఏమో, మధ్యలో అదృష్టవశాత్తు ప్రాణం పచ్చి బతుకుతాడేమోనన్న ఆశతోనట!! శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళిన తరువాత చితిమీద పడుకోపెట్టారు. కుండలో నీళ్ళతో ఆ చితి చుట్టూ రాఘవరావు మూడు సార్లు తిరిగారు. ప్రతి సారి ఆ కుందకు ఒక కొడవలితో కొట్టి కన్నం పెట్టి, నీళ్ళు ధారగా కారేట్టుగా చేసి, చివరగా ఆ కుండను కింద పడేశారు. తరువాత చితికి నిప్పంటించాడు. కపాలమోక్షం కాగానే అందరు స్నానాలు చేసి ఇంటికి వచ్చారు.

***

శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి కాంతమ్మకు, పొట్టు తీసేసి, గాజులు పగలకొట్టి, మంగళసూత్రం తీసి, తెల్లటి చీర కట్టి చీకటిగా ఉన్న గదిలో ఒకమూల కూర్చో పెట్టి ఒక దీపం పెట్టారు. అసలే భర్త పోయిన దు:ఖంలో ఉంటే, ఒకొకళ్ళు వచ్చి చూసి వెళుతుంటే సిగ్గుతో చితికి పోయి మొహాన పమిట చెంగు వేసుకొని ఏడుస్తూ కూర్చుంది.

***

రామయ్య చనిపోయినందుకు సంబంధీకులు పదిరోజులు మైల పట్టారు. ఆ పదిరోజులు ఇంట్లో ఏవీ ముట్టుకోకుండా దూరంగానే ఉండాలట. అందుకని ఆ పదిరోజులు వంటపనికి ఒక మనిషిని మాట్లాడు కొన్నారు. ప్రొద్దున్నే వచ్చి అందరికీ కాఫీలు, ఫలహారాలు, మధ్యాహ్నం వంట.. సాయంత్రం మళ్ళీ కాఫీ ఫలహారాలు, రాత్రికి మళ్ళీ వంటచేసి మైలవాళ్ళందరికి పెట్టి, తను తిని ఇంటికి ఇకపోయేది.

***

తొమ్మిదో రోజున అందరు సత్రానికి వెళ్ళారు. సత్రానికి ఉన్న కాపలా దారుడు తాళాలు తీసి తాళం చెవులు రాఘవరావుకి ఇచ్చాడు. తొమ్మిది, పది, పదకొండు రోజుల కార్యక్రమాలు పూర్తిచేశారు. పదో రోజున జనం చాలామంది వచ్చారు. ఆ మూడు రోజులు నాలుగు కూరలు, పప్పు, పచ్చళ్సు, గారెలు, పరవాన్నం మొదలగు భక్ష్యాలతో భోజనాలు పెట్టారు. పదకొండో రోజున ఇంటికి వెళ్ళే రోజున వంటమనిషికి, సత్రం కాపలాదారుడికి, పనిమనిషికి, అంట్లుతోమే అమ్మాయికి లెక్కచూసి అందరికి డబ్బులు ఇచ్చేశాడు. అంతా కలసి రాఘవరావుకి చాలా ఖర్చయింది. తండ్రి కర్మకాండలు రాఘవరావు బాగా చేశాడని అందరి చేత అనిపించుకొన్నాడు. కాని రాఘవరావుకి మాత్రం అరవై వేలు ఖర్చు తేలింది. రాఘవరావు తమ్ముడు ఇంతే ఇవ్వగలనురా అంటూ ఒక పదివేలు మాత్రం ఇచ్చాడు. మధ్యతరగతి రాఘవరావుకు అంత డబ్బు సమకూర్చుకోవటం తలకు మించిన పనే.

***

ఇదంతా చూస్తున్న రాఘవరావుకి ‘ఒక మనిషి చచ్చిపోతే సంబంధీకులు గుండెలవిసేలా ఏడవటం, చుట్టాలు పక్కాల ఓదార్పులు, కర్మకాండ.. మధ్యతరగతి మనుషులు భరాయించ లేనంత ఖర్చు, దానాలు, ధర్మాలు, ఇదంతా అవసరమా?’ అన్న ఆలోచనలు నిరంతరం కందిరీగల్లా చుట్టు ముట్టేవి. ఖర్చు సంగతి పక్కన పెడితే, రాఘవరావు మనసును లోతుగా కలచి వేసిన సంఘటన. పదవ రోజున తన తల్లిని విధవని చేయటంకోసం బొట్టు చెరిపేయటం, గాజులుపగల కొట్టటం, మెట్టెలు తీయటం, తాళిబొట్టు తెంపటం కలచి వేసింది. తెల్ల చీర కట్టించి ఒక గదిలో మూలన కూర్చోపెట్టటం, అందరూ వరుసన వచ్చి చూస్తుంటే ఆవిడ సిగ్గుతో చితికి పోయి మొహాన చెంగు వేసుకొని ఏడుస్తూ భర్త పోయిన దుఃఖంకన్నా అందరూ తన తల్లిని ఒక వింత జంతువును చూసినట్లుగా చూడటం తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూ, నా భర్త కన్నా నేనే ముందు పోయి ఉంటే ఈ నరకం తప్పేదికగా అంటూ తనను పట్టుకొని ఏడవటం గుర్తుకి వచ్చి మనసు కకావికలమయ్యేది. భర్త పోతే భార్య(స్త్రీ)ని నలుగురిలో ఇంతలా అవమానించాలా, హింసించాలా? నిజానికి స్త్రీకి పెళ్ళయితే భర్తవలన అదనంగా వచ్చే అలంకారాలు మెడలో మంగళసూత్రం, నల్లపూసలు, కాలికి మెట్టెలు మాత్రమే. పెళ్ళికాక ముందు బొట్టు పెట్టుకుంటుంది. పూలు పెట్టుకుంటుంది, గాజులు వేసుకుంటుంది, రంగురంగుల బట్టలు ధరిస్తుంది. ఒకవేళ భర్త పోయినప్పుడు తీసివేయవలసివస్తే పెళ్ళయిన తరువాత వచ్చిన అదనపు అలంకారాలు మాత్రమే. భర్తకు ఆయుష్షు లేక చనిపోతే భార్యను శిక్షించటం ఏమి న్యాయం? శోభనం రోజున భార్యచేత తెల్లచీర కట్టిస్తారు. మరి భర్త పోయినా తెల్ల చీరే కట్టిస్తారు. కొన్ని కుటుంబాలలో అయితే, భర్త పోయిన స్త్రీకి తల బోడు చేయించి బయటికి రాకూడదని ఆంక్షలు పెడతారు. ఆవిడని వంటమనిషిగానో, చాకిరిచేసే యంత్రంగానో మారుస్తారు. ఇంటి పనంతా ఆవిడకు వదిలేస్తారు. విధవని చూస్తే అపశకునమని, ఎదురు రాకూడదని చిన్నబుచ్చుతారు. శుభకార్యాలకు వెళ్ళకూడదు. ఆశీర్వదించకూడదు. ముత్తయిదువుగా ఎదురు వస్తే శుభ శకునమని, అనుకొన్న పనవుతుందని ప్రశంసించినవారే భర్త పోగానే ఆ ముత్తయిదువే బొట్టు అలంకారాలు లేకుండా ఎదురు వస్తే అపశకున పక్షి ఎలా అయిందో, స్త్రీకి అటువంటి అమానుష అవమానకరమైన శిక్ష విధించిన దుష్ట పురుషాధిక్య సమాజానికే తెలియాలి.

***

ఒకరోజు రాఘవరావు కర్మకాండలకు ఎంత ఖర్చయిందని, లెక్కలు చూస్తూ ‘శాంతా’ అని భార్యని పిలిచాడు. శాంతంటే, అసలు సిసలైన శాంతాదేవే. అనుకూలవతి, సౌందర్యవతి, భర్త మాటకు ఎదురు చెప్పదు కాని అవసరమైనప్పుడు మంచి సలహాలు కూడా ఇస్తుంటుంది. అసలు ఈ విషయం భార్యకు చెప్పకూడదనుకున్నాడు. కాని, తనతో ఇన్ని సంవత్సరాలు కాపురంచేసి చేదోడు వాదోడుగా ఉన్న అర్ధాంగికి చెప్పక పోవటం భావ్యం కాదని, “రా, శాంతా కూర్చో”అని తన పక్కన చోటు చూపించాడు.

“నాన్న చనిపోయినపుడు అమ్మ హృదయవిదారకంగా ఏడవటం, చుట్టాలు రావడం. కర్మకాండలు చేయటం మధ్యతరగతి వాళ్ళు తట్టుకోలేనంత ఖర్చు, అమ్మకు బొట్టు, గాజులు, పూలు, మంగళసూత్రం, మెట్టెలు తీసివేసి, తెల్ల చీర కట్టటం, అందరూ వింతగా చూడటం నా మనసును కలిచి వేసింది శాంతా”

“తప్పదు కదా, మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, అలాంటివి. ఎవరు అధిగమించలేరు”

“ఇవన్నీ మనం ఏర్పరుచుకొన్నవే. ఎందుకు మనం వీటిని అధిగమించకూడదు?”

“ఏమో, అవన్ని నాకు తెలియదు బాబూ, మన పెద్దవాళ్ళు కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పరిచారు. వాటిని ఆచరిస్తూ పోవటమే మన కర్తవ్యం” అన్నది శాంత

“అందుకే ఇవన్నీ నీకు లేకుండా చేయాలనుకుంటున్నాను”

“ఏవిధంగా చేస్తారు? మీరేమన్నా సంఘసంస్కర్తా?

“ఏమో? చూస్తూండు” అన్నాడే కాని మనసులోని మాట బయటపెట్టలేదు .

శాంత రాఘవరావు మాటలను తేలికగా తీసుకొన్నది. “ఇంకేమీ ఆలోచించకుండా పడుకోండి. నలుగురితో నారాయణ” అంది ఆవులిస్తూ శాంత.

***

“నాకు వయసు మీద పడ్డది. నేను ఎప్పుడైనా హరీమనవచ్చు. నేను పోతే నా భార్యను కూడా మా అమ్మలాగా జుగుప్సాకరంగా విధవని చేస్తారు కదా” అని అనుకొని, ఒకరోజున కుటుంబ సభ్యులను పిలిచి, “ఒక వారం రోజుల్లో, నేను, నా స్నేహితులు కొతమంది కలసి తీర్థయాత్రలకు వెళుతున్నాము, ఒక పది రోజుల్లో వస్తామని” చెప్పాడు. మనసులో “నేను ఇంక ఇంటికి తిరిగి రాను. నేను చనిపోయినట్లుగా తెలిస్తే కదా, శాంత విధవయ్యేది. శాంతని వైధవ్యం నుంచి, కొడుక్కి ఖర్చు తప్పించాలంటే ఇదొక్కటే మార్గం” అని అనుకొన్నాడు.

నిజానికి రాఘవరావు స్నేహితులతో వెళ్ళలేదు. ఒక్కడే సరాసరి కాశీకి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. ఎవరికి తనెక్కడుందీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

పది రోజులయింది, నెల అయింది, సంవత్సరాలు గడిచి పోతున్నా, రాఘవరావు తిరిగి వచ్చింది లేదు, శాంతతో సహా కుటుంబ సభ్యులు ఎదురు చూడటం మానింది లేదు.

జీవితాంతం శాంత సుమంగళి గానే జీవించింది.