32. దడిగాడు వానసిరా

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]అ [/dropcap]ఆ లు ఆలుమగలు

‘అ’ ఫర్ అమృత, ‘ఆ’ ఫర్ ఆనందరావు

ఆనందరావు ఉద్యోగం చేస్తూనే కథ రాయాలనే ప్రవృత్తి బలంగా కుదిపేయటంతో, దాని బలమెంతో నివృత్తి చేసుకోవటానికి ఆక్షర సేద్యమూ చేశాడు. ‘కాదేదీ కథల కనర్హం’ అంటూ కలాన్ని పరుగెత్తించాడు. చూసింది చూసినట్లు, విన్నది విన్నట్లు రాసి పారేశాడు. పత్రికలకు పంపాడు. స్పందనలేదు.

ఆనందరావుకి కోపం వచ్చింది. అలిగాడు. చెరువు మీద అలిగితే?

కానీ, ఉవ్వెత్తున ఎగసిపడుతూ హృదయ కుహారంలో నుంచి లావాలా పైకి ఉబికి వస్తున్న ఆలోచనా స్రవంతిని ఆపటం ఆనందరావు తరం కాలేదు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించి కన్నది, విన్నది… ఉన్నది ఉన్నట్లుగా రాస్తే వార్త ఆవుతుంది కాని, కథ కాదు అని అవగతమై సేకరించిన సమాచారాన్ని మనసు కవ్వంతో చిలికాడు.

వాస్తు బాగోలేదని కథలు రాసే స్థలం మార్చాడు. దిశ మార్చాడు. కలం మార్చాడు. కలం పేరు మార్చాడు. అర్ధాంగి అమృత పేరుతో కథలు రాయటం మొదలు పెట్టటాడు. మార్కెట్‌లో దొరకని ఒకట్రెండు అజ్ఞాత పత్రికల్లో ఒకటి, అర కథలోచ్చాయి తప్ప ప్రముఖ పత్రిక ఒక్క దాంట్లోనూ… ఒక్క కథా రాలేదు.

దాంతో తనలాంటి ‘అంకుర’ రచయితల్ని ప్రోత్సహించరు అనుకుని నీరసపడ్డాడు. అప్పుడే ఒక సీనియర్ రచయిత తారసపడ్డాడు. ‘పడి లేచే కెరడం చూడు’ అంటూ వెన్ను తట్టాడు. ఆనందరావు మళ్ళీ కలం పట్టాడు. రాస్తూనే వున్నాడు.. ఎదురుచూస్తూనే వున్నాడు.

చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు.. కథలకు ‘క్యాచీ’ టైటిల్స్ పెట్టి ‘సేల్’ చేద్దామనుకున్నాడు. కొనేవాడు కరవయ్యాడు.

ఇక లాభం లేదు. ఎవర్నో పట్టుకుని ప్రాకులాడవలసిన అవసరం లేదు. తనే ఏదో ఒకటి చేయ్యాలి… చేస్తాడు. ఆ రాత్రి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు ఆనందరావు.

పాతిక కథలు.. ఐదొందల కాపీలు.. కథలు సంపుటి అచ్చేయించాడు. వందపేజీలు.. వందరూపాయలు. ఇద్దరి పేర్లు కలిసొచ్చేటట్లు ‘ఆనందామృతం’ అని పేరు పెట్టి, తను.. అమృత కలిసిదిగిన కలర్‌ఫోటో కవర్‌పేజీ మీద వేయించాడు. ప్రతులకు తన చిరునామా, ఫోన్ నంబరు ఇచ్చాడు.

పుస్తకంపై తన పేరు, ఫోటో కూడా ఉండటంతో అమృత ‘ఫిదా’ అయిపోయింది. మొదటి కాపీ గుళ్ళో దేవుడి పాదాల దగ్గరుంచి, పూజ చేయించి, అయ్యవారికి దక్షిణ దండిగా ముట్ట చెప్పి… అక్కడున్న భక్తులకు పుస్తకాలు ఉచితంగా పంచి పెట్టింది అమృత.

ఆనందరావు నలుగురు రచయితల్ని వెతికి పట్టుకుని, ఇంకొంత మందిని సమీకరించి పుస్తకా విష్కరణ కార్యక్రమం స్వశక్తితో ఘనంగా నిర్వహించాడు. పాతిక పుస్తకాలు ఉచితంగా పంచి పెట్టాడు.

‘ఇప్పటి వరకు కథలు రాసారు. ఇక మీదట నవలలు రాయండి..’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు అతిథి రచయితలు.

భుజమ్మీద శాలువా, మెడలో పూలదండతో ఇంటికొచ్చిన ఆనందరావుని చూసి, ‘ఇవన్నీ మన డబ్బుతోనేగా…’ అంటూ దండ తీసి, వీధి గుమ్మానికి వ్రేలాడదీసి… శాలువా టేబిల్ క్లాత్‌గా మార్చేసింది అమృత.

ఇక ఆనందరావు తను ఇంతకు ముందు పని చేసిన ఊళ్ళల్లో ఉన్న తన కొలీగ్స్‌కి, దూరపు బంధువులకి… వాళ్ళ అడ్రస్సులు వెతికి పట్టుకుని, పొస్టు ద్వారా మరో పాతిక పుస్తకాలు పంపాడు.

“ఇక చాలు… అభినందనలు, ఆవిష్కరణలు, ఆరగింపు, పందేరాలు, ఇప్పటికే ఏభైవేలు ఖర్చు పెట్టారు. మిగిలిన పుస్తకాలు అమ్మినా, నలభైవైలకి మించిరాదు. ఇక మీరు ఆ ప్రయత్నంలో ఉండండి” అంటూ సలహా ఇచ్చింది ఆనందరావుకి అమృత.

‘అలాగే’ అని కార్యోన్ముఖుడైన ఆనందారావుకి కాళ్ళు పీకటం, చెప్పులు అరగటం తప్ప కాసులు రాలేదు.

అప్పుడే సంవత్సరం గడిచింది. ఆనందరావు అచ్చేయించిన పుస్తకాల్లో ఉచితంగా వంద పోగా, అమ్మకానికి నాలుగు వందలు మిగిలాయి. సంవత్సర కాలంగా కొనటానికి ఒక్కరంటే ఒక్కరు రాలేదు, సరికదా… పుస్తకం ఉచితంగా ఇస్తామన్నా ‘అబ్బే మేము కథలు చదవమండి… మాకు వాట్సప్, ఫేస్ బుక్, యూట్యూబ్.. చూడటానికే సమయం చాలట్లేదు..’ అంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు.

ఆనందరావుకి ఏడుపొచ్చింది. అమృతకి కోపం వచ్చింది. ‘ఇక మీ వల్ల కాదు కాని, ఆ విషయం నాకు వదిలేయండి’ అంటూ రంగంలోకి దిగింది అమృత.

పనమ్మాయిని పిల్చింది. “ఇదిగో నీ జీతం పదిహేను వందలకి, వెయ్య రూపాయలు క్యాష్, మిగిలిన ఐదొందలకి పది పుస్తకాలు పట్టుకెళ్ళు. ఒక్కో పుస్తకం వందరూపాయలు. అమ్మితే మొత్తం వెయ్యొస్తుంది. అంటే నీకు ఐదొందలు లాభం. వచ్చే నెలలో ఐదొందలే క్యాష్. ఇరవై పుస్తకాలిస్తా. అంటే వెయ్య లాభం నీకు. లాభం బ్యాంకులో వేసుకో, సంక్రాంతి పండక్కి ఇచ్చే చీరకు బదులు పది పుస్తకాలిస్తా. జీతం రెండొందలు పెంచుతా. ఆది కూడా పుస్తకాలు రూపంలేనే. నేను చెప్తుంటే నీకు అర్థంకాకపోవచ్చు. పుస్తకాలు అమ్మిచూడు, లాభం కళ్లచూశాక, ఇంకా పుస్తకాలు కావాలని నువ్వే అడుగుతావు.”

‘ఏదో లాభం అంటున్నారు అమ్మగారు’ అనుకుంటూ, ఆశపడి.. వెయ్య క్యాష్‌తో పాటు పది పుస్తకాలు పట్టుకెళ్ళింది పనమ్మాయి.

ఇక పాలబిల్లు… నెలకు రెండు వేలు.

“ఇదిగో పదిహేను వందల క్యాష్.. పది పుస్తకాలు” పనమ్మాయికి చెప్పినట్లే పాలబ్బాయికి చెప్పింది అమృత. చదువురాని పాలవాడు గంగిరెద్దులా తలూపి పుస్తకాలు పట్టుకెళ్లాడు.

అలాగే, కేబుల్ టీ.వి బిల్లు, పేపరు బిల్లుకి పుస్తకాల లింకు పెట్టాలని చూస్తే వాళ్ళు ‘సరఫరా’ ఆపేస్తామంటే వెనక్కు తగ్గింది అమృత.

కరెంటుపోతే రిపేరు చేయటానికి వచ్చిన ఎలక్ట్రిషియన్‌కి, బాత్రూంలో ‘ట్యాప్’ రిపేరు చేయటానికి వచ్చిన ప్లంబర్‌కి ‘ట్రై’ చేసిందికాని.. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది.

ఇక పెళ్లళ్లికి, ఓణీ ఫంక్షన్, వడుగు, షష్టిపూర్తి… ఇలా ఏ శుభకార్యానికి పిలుపోచ్చినా ప్రెజెంటేషన్‌గా పుస్తకాలే ప్యాక్ చేసి ఇచ్చేసింది. దుర్గానవరాత్రి ఉత్సవాలకి చందా కోసం వచ్చిన వాళ్ళకి ఓ పది పుస్తకాలు ఇవ్వాలని చూస్తే, వాళ్లు వద్దు పొమ్మన్నారు.

ఆ రోజు పనమ్మాయి పని ఎగ్గొట్టింది. రాత్రంతా వాళ్లాయనకి వాంతులు, విరేచనాలంట. ‘ఏం తిన్నాడేంటి?’ అని మర్నాడు అమృత అడిగితే, “తింటం కాదండి… మీరిచ్చిన పుస్తకం ప్రక్కింటి పంతులుగారు చదివితే విన్నాడండి, పుస్తకాలన్నీ తిరిగిచ్చేయమని ఒకటి గోలండి. రేపే పన్లోకొచ్చినప్పుడు అవన్నీ అట్టటుకొచ్చేస్తానండి.. నా క్యాష్ నా కిచ్చేంయండి.”

ఇక పాలతను… “సంగీతం వింటే పశువులు పాలు బాగా ఇస్తాయట కదండీ. అలాగే తమరిచ్చిన పుస్తకంలోని కథలు చదివి వినిపిస్తే పాలు ఎక్కువిస్తాయని మా ఆవిడ గేదె ప్రక్కనే కుర్చీ వేసుక్కూర్చుని, కథలు చదవి వినిపించిందండి. దాంతో, రోజుకు ఆరు లీటర్లు పాలిచ్చే గేదే…. అర లీటరు కూడా ఇవ్వటం లేదు, పొదుగు పట్టుకుంటే కాళ్లతో తంతోంది. మా కొద్దీ పుస్తకాలు. నా క్యాష్ నాకిచ్చేయండి.” అంటూ ఇచ్చిన పుస్తకాలు మొత్తం వెనక్కిచ్చేశాడు. అంత వరకే అయితే పర్వాలేదు, ‘పుస్తకాలు తిరిగిచ్చేయకపోతే, పడక గదిలోకి రానని కూడా తేల్చి చేప్పేసిందట వాళ్లావిడ.’

పనమ్మాయి, పాలబ్బాయి చెప్పింది విన్నాక అమృతకు తల కొట్టేసినట్లైంది. ఆనందరావు మీద కోపం తారాస్థాయికి చేరుకుంది. “ఒక్కటీ పని కొచ్చే పని చెయ్యరు… ఇక నా వల్ల కాదు. ఆ పుస్తకాలు గోదాట్లో వేస్తారో, కృష్ణలో వేస్తారో మీరే తేల్చుకోండి.” అంటూ సెల్‌టవర్ అంత ఎత్తులేచింది.

ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేసి పంపించకుండా, ఇంట్లో ఖాళీగా అట్టిపెట్టుకుంటే, ఇరుగుపోరుగు లైనేయొచ్చు… లేక ఆ పిల్లే తనదారి తను చూసుకోవచ్చు.

ఆనందరావు ఇంట్లో ఏడాదిగా నిరీక్షిస్తున్న నాలుగు వందల పైగా పుస్తకాల పరిస్తితీ అలాగే తయారయ్యింది. చెదపురుగులు సైలెంటుగా లైనేసి, పుస్తకాలతో చెలిమి చేసి, చెంతకు చేరి… ఓ పాతిక పుస్తకాల పైన అత్యాచారం చేసి ఆరగించేసాయి.

‘కనీసం మిగిలిన వాటినైనా దక్కించుకోవాలంటే, ఏ పాత పుస్తకాలు కొనే వాడికో అమ్మేయట మొక్కటే మార్గం. తక్కువలో తక్కువ ఐదొందలైనా వస్తుంది.’ సలహా ఇచ్చింది అమృత.

‘పాత పుస్తకాలు కొనేవాడికి కొత్త పుస్తకాలు అమ్మడమా?’ అంత కంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. తను ఎంత కష్టపడి రాశాడు కథలు? తన శ్రమను ఒక్కరు గుర్తించరే! పుస్తకం ఫ్రీగా ఇస్తామన్నా వద్దంటున్నారు. ‘పిలిచి పిల్ల నిస్తామంటే.. ఇలానే’ వుంటుంది. అసలు పుస్తకాలే చదవమంటున్నారు. ఒకప్పుడు ‘పుస్తకం హస్తభూషణం’ అన్నారు. మరిప్పడో? చరవాణి.. స్మార్ట్‌ ఫోను, అందర్నీ చెడగొట్టిందా? ఇలాగైతే మనుషుల్లో సృజనాత్మక శక్తి అంతరించి పోదూ? అనుకుంటూ ఇంటి బయట కొచ్చి నుంచున్న ఆనందరావు… అక్కడ ప్రహారీ గోడ మీద పెద్ద అక్షరాలతో రాసింది చదివి కోపోద్యక్తుడై ‘ఒరేయ్! నిన్ను చంపెస్తా.. ఎవడ్రా ఇది రాసింది?’ అని గట్టిగా అరుస్తూంటే…

ప్రక్కనే వున్న అమృత, “ఏమండీ, ఏమైంది? ఏంటి చూస్తూన్నారు” అని అడుగుతున్నా పట్టించుకోకుండా… ‘నా కథల పుస్తకాలు ఏవి?’ అని ఇల్లంతా తిరిగి వెతికేస్తుంటే.

‘ఛ.. ఊరుకోండి.. కథల పుస్తకాలు లేవు, కాకరకాయలు లేవు. మీరేదో కలగన్నట్లున్నారు. మీకు కథల పచ్చి బాగా పట్టుకుంది. ఇంతకీ బయట గోడమీద ఏం చూస్తున్నారు?’ అని అడిగింది అమృత.

“ఎవడో వెధవ మన గోడమీద ‘ఆనందామృతం.. దడిగాడు వానసిరా’ అని రాశాడు. అంటే నేను గాడిదన నేగా దాని అర్థం” అన్నాడు ఆనందరావు ఆవేశంతో ఊగిపోతూ.

“ఏదీ.. గోడ మీద ఏం రాసి లేదుగా?” అంది అమృత గోడను చూస్తూ.

“అదే నాకు అర్థం కావట్లేదు.. అంటే నేను కలగన్నానంటావా?” అన్నాడు ఆనందరావు.

“ఖచ్చితంగా కలే. అయినా ఎవడో ఎందుకు రాస్తాడు? మీ అంతరాత్మే మీకు ఆత్మ ప్రభోధం చేసింది. కథలు రాయాలన్న తపన మీలో ఉంది. నిజమే, మీ తృప్తికోసం మీరు రాసుకోండి. కానీ, పత్రికలకు పంపి వాళ్లు మీ కథలు వేసుకోవటం లేదని నిరత్సాహపడకండి. మీ కథలు ఎవరూ చదివే అవకాశం రావట్లేదని బాధపడకండి. నిజానికి మీరు ఇతరులు రాసిన కథలు చదివారా చెప్పండి? అపారమైన నిధినిక్షేపాలున్న మన ప్రాచీన, సమకాలీన సాహిత్యంలో ఆణిముత్యాల్లాంటి రచనలు కోకొల్లలు. అవన్నీ మీరు, ముందు చదడవండి. రాయటంలో మెలకువలు తెలుకున్నాకే రాయండి.”

“తక్కువ మాట్లాడండి.. ఎక్కవ వినండి” అన్నారు. అలాగే ఎక్కవ చదడవండి, తక్కువ రాయండి. అసలేమీ చదవకుండా, ఏదో రాసేద్దామనే తపన చూసి, ‘ఏమీ చదవకుండా రాసే వాడు గాడిద’ అని మీకు తెలియచెప్పటానికే ‘దడిగాడు వానసిరా..’ అని కల ద్వారా మీ అంతరాత్మ మీకు తెలియవచ్చింది.. అంతే” అంది అమృత.

ఆనందరావు అవాక్కై అమృత వంక రెప్పవేయకుండా చూస్తూ శిలా ప్రతిమలా నిల్చుండిపోయాడు.