33. ఆవిష్కృతి

0
9

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]ఊ[/dropcap]ర్వశీ!
పోల్చుకున్నావా నన్ను చూడగానే?
అవును కదూ – కాలమొక్కటే దీనికి ఏకైక హేతువు కాదు నేను
నీకు దగ్గరైనవాణ్ణి, వశంవదుణ్ణి.
హఠాత్తుగా నిన్నుచూసినపుడు
నా కనుపాపల విప్పారిన ప్రశ్నకి నువ్విచ్చిన ముభావపు జవాబులోని క్లుప్తతకి
మార్కులు ఇప్పటికీ వెయ్యలేని నిరక్షరాస్యుడ్ని,
అసమర్ధుణ్ణి.

ఇంకా ఉన్నానులే అలాగే
కుట్టించుకున్న బట్టలతో, చేతికి రాగి కడియంతో
వంకర పాపిటతో,
ధనార్జన లక్ష్యాల కుంకుడురసం పడి ఎర్రబడ్డ కళ్లతో.
నీ లేమిని విజయాలుగా పేర్చుకొమ్మనే నవీనసూత్రాలు
మింగుడుపడక
కుసుమ వనాలలో, పొలంగట్లపై,
ఇసుక తిన్నెలపై
మహానగరపు పొగలేని రహదారులపై
ముందుకి చూస్తూ నడుస్తున్నాను
ఆర్డినరీబస్సు మెట్లెక్కడానికి యుద్ధం చేస్తున్నాను గెలుస్తున్నాను, ఓడిపోతున్నాను.
హృదయంలో అలజడుల మహాసముద్రపు అలల హోరుని ఆశావహశంఖంలో అదిమిపెడుతున్నాను.
నాలో నేనే పాడుకుంటున్నాను
వింటున్నాను
నేపథ్యంలో ఏ వాయులీనమూ లేదిప్పుడు.

ఊర్వశీ
నువ్వు కులాసా కుదిరి
అంతస్తునందిపుచ్చుకుని
అమరిన అపరంజిమేడ పైని గదిలో
పైసలనే శ్వేతవాసుకిదర్వీడోలికఛాయలలో సేదతీరేవేళ
నేనొక సముద్రతీరంలో
దేవాలయ విమానగోపుర సోపానాలలో
మేకపిల్ల పిలుపులో, లేడికూన గెంతులో
సంజాయిషీ ఇస్తున్న కుర్రవాడి చూపులో
వివశత పొంది
వ్యక్తిత్వ వ్యత్యాసాల కొలమానపు గీతల్ని తల్చుకుని
కంపించేవాణ్ణి.

ప్రాతస్సంధ్యలో శయనించిన
నల్లనావు పొట్టపై పడిన
మొదలింటి నునువెచ్చని లేత ఎరుపు కిరణాన్ని
జేబులో దాచుకోవాలని తాపత్రయం పడేవాణ్ణి

ఊర్వశీ
నన్నింకా పోల్చుకోలేదా
నేను విధివంచితుడిని, విభిన్నుడిని
మావిడిచెట్టు చిటారుకొమ్మనధిరోహించిన
గండుకోయిల పాటలలో
కన్నీళ్లతో కలలు వెతుక్కునేవాణ్ణి.
నువ్వు మారిపోయినదానివి, నవీనవి
నేను నీకు అక్కరకు రానివాణ్ణి
అయినా ఈరోజుకీ
ఒక్కసారి చల్లని పిల్లగాలి తాకితే
నా గుండెగదుల గోడలు తేనె స్రవిస్తాయి
పూవంచుని స్పృశించినపుడు
నా కంఠంలో ప్రభవించే కవిత
సుందర సుగంధపు పన్నీరు చిలుకుతుంది
రాత్రివేళ మడతమంచం మీద శయనించినపుడు
ఏ మహాకవి చాటువో హృదయాన్ని మీటుతుంది
నక్షత్రాల పొడిని మెత్తని పరుపులా పరుస్తుంది.