34. నాన్న మాట

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]నా[/dropcap]న్నా! ఏమైపోయావు? ఎక్కడికెళ్ళిపోయావు?

గడిచిన గత పది రోజులుగా ఇదే ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది

నాన్నా! ఇంట్లో అందరూ ఉన్నారు. కానీ మా అందరి మధ్యా నువ్వే లేవు! ఇంకెప్పటికీ రావు!

“రావా? నాన్నా?” నమ్మలేక పోతున్నాను.

నువ్వు లేవు, తిరిగి రావన్నా నిజాన్న జీర్ణించుకోలేక పోతున్నాను. స్నేహితులు, బంధువులు, అందరూ పరామర్శగా నన్ను పలకరించేందుకు వస్తుంటే, వాళ్ళందరితో నువ్వు చనిపోయావనీ, ఎలా పోయావో! ఎందుకు పోయావో, వాళ్ళు నన్నుడుగుతూన్నప్పుడు నా నోటితో నేను చెబుతున్నా నా మనసు సమ్మతించడం లేదు నాన్నా!

సరిగ్గా పది రోజుల క్రితం పడక్కుర్చీలో కూర్చుని ఉదయం కాఫీ తాగబోతూ, అరుగు మీద నుండి నువ్వు కింద పడిపోతే కాలు జారి పడిపోయావనుకున్నాం మేమంతా! కాని నిన్ను హూటాహుటిన హాస్పటల్లో అడ్మిట్ చేసిన తరువాత, ఎం.ఆర్.ఐ స్కానింగ్ చేసిన డాక్టర్ చెప్పేవరకూ తెలియ లేదు నాన్నా!

నువ్వు కాలు జారి పడిపోలేదనీ, హై బీపీ కారణంగా, బ్రైన్ హ్యమరైజ్ అయి పడిపోయావనీ టెన్షన్ ఎక్కువైనప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పారు.

తట్టుకోలేనంత టెన్షన్‌కు ఎలా గురైయ్యావు నాన్నా!

అప్పుడు నీ స్థితీ.. పరిస్థితీ! నీ కళ్ళు ఎటో చూస్తున్నాయి! నాన్నా… నాన్నా… అంటున్నా అరుస్తున్నా…. కూడా నువ్వు వినిపించుకోవడం లేదు. నన్ను గుర్తుపట్టడం లేదు. నన్నే కాదు, అమ్మను, ఇంకెవ్వరినీ కూడా గుర్తు పట్టడం లేదు. బాధ వేసింది… భయం వేసింది.

ఏడుపు ఆగలేదు… నిన్ను ఆ స్థితిలో చూసి! అమ్మ అయితే ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది! డాక్టర్ నన్నుపిలిచారు.

నీ వయసు డబ్భై సంవత్సరాలు దాటినందుకు… ఆపరేషన్ సమయంలో హార్ట్ వీకై ఆగిపోవచ్చనీ.. చెప్పలేమనీ… ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఛాయిస్ అనీ చెప్పారు.

డాక్టర్స్ గ్యారంటీ ఇవ్వలేదు. నా నిర్ణయం అడిగారు. దేవుడిపై భారం వేశాను. ఆపరేషన్ చేయమని చెప్పాను.

ఆపరేషన్ సక్సెస్ అయింది. నా ఆనందం అంతా.. ఇంతా కాదు. రెండు రోజులకు కాన్షియస్‌లోకి వచ్చావు. నన్ను గుర్తుపట్టావు.. అమ్మని పలకరించావు… నిన్ను పలకరించడానికి వచ్చిన అందరి పేర్లు అడిగిన వెంటనే చెప్పేశావు.

కానీ నీ మాట ముద్దగా వస్తోంది. ఎడమ కాలు, ఎడమ చేయీ నీ ఆధీనంలో లేవు. డాక్టర్ నడిగితే, పెరాలసిస్ స్ట్రోక్ కారణంగా వచ్చిందనీ, ఫిజియోథెరిపీ చేయిస్తే… రికవరీ ఛాన్సెస్ ఉన్నాయనీ చెప్పారు.

అప్పుడు నాతో నువ్వు మాట్లాడిన మొట్టమొదటి మాట.

భరణీ! డబ్బులున్నాయా?.. అని! కార్పోరేట్ హాస్పిటల్లో తట్టుకోగలవా? అని! మంచంపై ఉన్నా… నీ గురించి ఆలోచించకుండా మా గురించి అడిగావు!

నాన్నంటే బాధ్యత అని నిరూపించుకున్నావ్! ఈ డబ్బంతా నీ కష్టార్జితమే కదా! నాన్నా!

నా చిన్నతనంలో తెలియలేదు. ఇప్పుటిప్పుడే తెలుస్తోంది. నువ్వు చేసే బట్టల వ్యాపారంలో లాభం… వచ్చినా… నష్టం… వచ్చినా.. నాకేనాడు ఏ లోటూ తెలియకుండా రానీయకుండా పెంచావు. కష్టం విలువ నాకు తెలికుండా, కష్టపడి చదివించావు. నీ వ్యాపారానికి వారసుడినంటూ నన్ను ఎం.బి.ఎ చదివించావు.

ప్లాట్‌ఫాం స్థాయి నుండి ప్లాటినం స్థాయికి వ్యాపారాన్ని తీసుకొచ్చావు.

నాన్నా… ఒక్కటి మాత్రం బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు.. మనం పూరిపాకలో ఉన్నప్పుడు ఓ అర్థరాత్రి.. చాక్లెట్ కావాలని నేను మారాం చేస్తే… వేళ కాని వేళ చాక్లెట్ దొరకదని, నన్ను దండించకుండా… సైకిల్ మీద ఐదు కిలోమీటర్లు వెళ్ళి 24 గంటలూ వుండే షాపు కోసం సిటికి వెళ్ళి చాక్లెట్ కొని తెచ్చావు.

 తిరిగి వచ్చేటప్పుడు నిన్ను కుక్క కరిస్తే… పంటి కింద ఆ బాధను భరిస్తూనే… నేను ఆ చాక్లెట్ తింటూంటే నన్ను చూసి నవ్వుతూ ఆనందించావు.

ఎక్కడిది నాన్నా నీకు అంత ఓర్పు? అంత మమకారం చూపిస్తూనే… ఇప్పుడు నన్ను గాడాంధకారంలోకి నెట్టేస్తావా?

నాన్నా… నీకిది… న్యాయమా?

ప్రముఖ వ్యాపారస్తుడు భూషణంగారి అబ్బాయి భరణి భయస్తుడు అని అందరూ అనుకోకూడదని, నేను పైకి ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నానంతే…! లోలోపల కుమిలి పోతున్నాను.

నువ్వుంక రా(లే) వని నలిగిపోతున్నాను.

నా ఆరేళ్ళ కోడుకూ, నీ మనువడూ, బుల్లి భూషణం… దీనంగా నా వద్దకొచ్చి… గోడపై వేలాడుతూన్న నీ ఫోటో చూపిస్తూ          “తాత! దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడా!” నాన్నా అని ఎంతో అమాయకంగా నన్నడుగుతాడు.

నిజం చెప్పద్దూ… నేను కూడా పెద్దవారి నెవరినైనా.. వాడు నన్నడిగినట్టుగా.. అడగాలనిపిస్తుంది!

సమాధానం చెబుతారా?… నిన్ను చూపిస్తారా? నువ్వు లేకుండా వ్యాపారం చేసేదెలా? అమ్మను ఓదార్చేదెలా?

ఒక్క సారి కనబడు నాన్నా… జరిగినదంతా కల.. నిజం కాదని చెప్పు! నువ్వు బ్రతికే ఉన్నావని అందరికీ కనబడి చెప్పు!

***

భరణీ బైక్ కొత్తదే కావచ్చు… కానీ గోతుల్లో కెడితే అదీ పడుతుందీరా… నెమ్మదిగా పోనీ…. !

అలాగే నాన్నా… నువ్వు భయపడకు. నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళే బాధ్యత నాది. కుక్క అడ్డొస్తోందని పక్కగా నడిపాను…. చిన్న గోతిలో బండి పడుతున్నా… తప్పించాను…

 “నా డ్రైవింగ్ పై నమ్మకం ఉంచు! ” ఎడమ వైపు అద్దం లోంచి చూశాను, నాన్న చిన్నగా నవ్వారు.

ఇల్లు వచ్చేసింది. బైక్ బ్రేక్ వేసి ఆపాను. నే లోపలకు వెడుతూ… గదిలోపలకు రా నాన్నా! అన్నాను.

వద్దురా… నేను ఆరుబయట పడక్కుర్చీలోనే కూర్చుంటాను… నాకిదే ఇష్టం..

సరే నాన్నా… నేనూ నీ పక్కనే నంటూ ఆయన కాళ్ళ వద్ద కూర్చుంటూ… నాన్నను చూశాను.

భరణీ.. ఈ నాన్నంటే ఎందుకురా అంత ఇష్టం. నా కేసి ఆప్యాయంగా చూస్తూ అడిగారు. ఏడ్చేశాను… ఇష్టం కాదు నాన్నా… ప్రాణం… అలా కూర్చున్నప్పుడు ఆయన కాళ్ళు నొక్కడం నాకు అలవాటు. కానీ ఆయన కాళ్ళు నాకు కనిపించడం లేదు.

నాన్నా…! నీ కాళ్ళు?

నాన్న… నవ్వారు.

భరణీ! నేను చనిపోయాను కదరా… అప్పుడు గమనించాను. నిజమే… నాన్న నాకు తగలడం లేదు. స్పర్శ తెలియడం లేదు.

నేను నిజం కాదురా… అబద్ధాన్ని… ఆత్మని… తట్టుకోలేక వలవలా ఏడ్చేశాను.

నాన్న… ఓదార్చుతున్నారు. నాన్న కట్టుకున్న పంచ నిండా మరకలే! ఈ మరకలెక్కడివి? అడిగాను.

భరణీ! నీకు గుర్తుందా…? నా శవం చుట్టూ ఆనాడు నువ్వు ప్రదక్షిణం చేస్తూ… బాధతో కళ్ళు తిరిగి కింద పడ్డావు. అప్పుడు నువ్వు కట్టిన పంచికి మరకలు అంటుకునాయరా!

అంటే నా పంచ నువ్వు కట్టుకున్నావా?… నా ప్రాణం కదారా… చితికి నిప్పంటించాకా.. నువ్వొదిలేసిన పంచీ నే కట్టాలిరా…?

నాన్నా… ఆ మాటలోద్దు… నాకు ఏడుపొచ్చేస్తోంది… నన్ను ఓదార్చు నాన్నా… ఒక్కసారి దగ్గరకు తీసుకో…! గట్టిగా అన్నాను… అరిచానంటే సబబేమో? కానీ నా అరుపు నాకే వినబడటం లేదు… అదంతా.. నా కల.. భ్రమ.

దిగ్గున మంచం పై నుండి లేచాను. నాన్న ఫోటో కేసి చూసాను.

చేతిలోకి ఆ ఫోటోను తీసుకుంటూ…!

కలలో కాదు… నిజంగా కనిపించు నాన్నా… చేతులు అమాంతం పట్టు తప్పి, ఫోటో నాన్న రోజూ రాసుకునే డైరీ మీద పడింది. ఫోటో గోడకు తగిలించి ఆ డైరీని తీసుకుని ఒకో పేజీ తిరగేస్తున్నాను.

నేను పుట్టిన వివరాలు, నేను చదివే రోజుల్లో సాధించిన మార్కులూ.. అన్ని వివరాలూ అందులో ఉన్నాయి. ఆశ్చర్యపోయాను. నా గురించి రాశావే గానీ… నువ్వు పడిన కష్టం గురించి ఒక్క పేజీలోనూ రాయలేదు. నాకు కన్నీరు ఆగడం లేదు.

పేజీలు తడుస్తున్నాయి. చదువుతున్న ప్రతీ పేజీ… నాన్న నా పక్కన కూర్చుని మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇక డైరీ… మూడు పేజీల్లో పూర్తైపోతుందనగా… భరణీ! నా కెందుకో ఇంకెంతో కాలం బ్రతకననిపిస్తోందిరా!

ఒక్కసారి ఆయన ఫోటో కేసి చూశాను. ఎందుకంటావా? మా నాన్న ఇప్పుడు నాకున్న వయసులోనే చనిపోయారు. నేను ఇదే వయసులో చనిపోతాననే అనుమానం… ఒకటే భయం.

ఆ భయం కారణంగా రోజురోజుకూ నాలో టెన్షన్ నాకు తెలీకుండానే ఎక్కువోతోంది.

టెన్షన్… జబ్బుకన్నా ప్రమాదం… మళ్ళీ నాన్న ఫోటో కోసి చూశాను. నాన్న… నీ టెన్షన్‌కి కారణం ఇదా..? బాధేసింది. మళ్ళీ చదవసాగాను.

ఆయినా భరణీ… వయసు పెరిగే కొద్దీ శరీరంలో కూడా సత్తువ సన్నగిల్లుతుందిరా..!

ఏదోక సమయంలో శాస్వతమైన విశ్రాంతి కోరుకుంటుంది. నేను చావుకు సిద్ధమే!

కానీ నా బెంగంతా… నీ గురించే! నేను లేనిదే… నీ కూడా రానిదే… ఎక్కడికీ వెళ్ళనంటావ్! వ్యాపారం చేయలేనంటావ్!

భరణీ.. “మనిద్దరమూ కలసి పుట్టలేదురా.. కలిసి పోవడానికి”. ఇలా ఎందుకు రాస్తున్నానంటే… పోయిన వారిని పదే పదే తలుచుకుని ఏడ్వటం అవివేకం!

నా స్థానాన్ని భర్తీ చేస్తూ… బాధ్యత చేపట్టడమే… కొడుకుగా నీ కర్తవ్యం.

మా నాన్న కూడా నన్ను వదలిపోయాడు అప్పుడు బాధ పడ్డానే కానీ ఏడ్వలేదు.

మనం ఏడుస్తూ కుర్చుంటే బాధ్యతలనెవరు పట్టించుకుంటారు? కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కాను. ఒక దశలోకి కుటుంబాన్ని తెచ్చాను.

మా నాన్న లేడని క్రుంగిపోతే… అదే నాకు అంతిమ దశ అయ్యేది.

ఇప్పుడు నువ్వు కూడా… బాధ్యతగా… కుటుంబాన్ని చూడాలి.. ఇంటి యజమానిగా.. ఒక తల్లికి కొడుకుగా.. భార్యకు భర్తగా.. బిడ్డకు తండ్రిగా.. అన్ని పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేస్తూ.. అందరి అవసరాలు తీర్చాలి. నీ చిన్నతనంలో నువ్వు సైకిల్ నేర్చుకునేటప్పుడు నీ వెనుకే ఉన్నాను.

కొన్ని రోజుల తరువాత… నేను లేకుండానే.. ఒక్కడివే… సైకిల్ పై వెళ్ళేవాడివి.

జీవిత చక్రం కూడా అంతేరా భరణీ! గిరిగిరా తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆగిపోతుంది. అయినా మనిషి మందులు లేక చనిపోడనీ, ఆయుష్యు లేక చనిపోతారనీ పెద్దలేనాడో చెప్పారు.

నేనూ అలాగే చనిపోతాను. ఇవన్నీ నేరుగా నీకు చెప్పాలనుకున్నాను. చెబితే… నువ్వెలా స్పందిస్తావోనన్న సంశయం. అందుకే… డైరీలో రాస్తున్నాను… నువ్వెపట్టికైనా… చదువుతావనీ… నన్నర్థం చేసుకుంటావనీ..!

భరణీ… నేను భౌతికంగా మాత్రమే నీకు దూరమౌతానంతే…!

నీ పురోగతిలో ఉంటా! మనవడి చిరునవ్వులో ఉంటా! కన్నీరు కారుస్తూ, కర్తవ్యాన్ని విస్మరించి విలువైన సమయాన్ని వృథా చేయకు!

ఇది నీ సమయం ఇక నీదే సమయం!! ధైర్యంగా జీవితాన్ని నెట్టుకురావాలి! బాధ్యతలను నెగ్గుకు రావాలి! ఆటుపోటులెదురైనా.. తట్టుకుని నిలబడాలి! అలా ఉంటావనీ.. ఉండగలవనీ.. ఆశిస్తూ..

                                                                   మీ నాన్న

                                                                    భూషణం!

ఆ తర్వాత పేజీ ఖాళీగా ఉంది.

నాన్న ఫోటో కేసి తిరిగి చూశాను. “నాన్న మాట” అవగతమైంది. జీవిత మంటే అర్థమైంది.

ఏడుపు రావడం లేదు. నాన్నా.. ఈ ధైర్యం నీవిచ్చిందే! కర్తవ్యం బోధ పడింది నాన్నా!

 నా పక్క గదిలో లైటు వెలగడం చూసి అటుగదా వెళ్ళాను. అమ్మ నాన్న ఫోటో చూసి ఏడుస్తోంది. అమ్మను దగ్గరకు తీసుకున్నాను. భరణీ.. నాన్న… అన్నాయం చేస్తూ… చనిపోయారడ్రా… ఏడుస్తూ అమ్మ అంటోంది.

లేదమ్మా.. ఆయన కాలధర్మం చెందారు…

మన మనసుల్లో శాశ్వతంగా ఉంటారు. నీ బాధ్యత నాది… ఓదార్చుతూ… అమ్మతో అన్నాను. అమ్మ పసి పిల్లలా… నా ఒడిలో ఒదిగిపోయింది. నిజం చెప్పద్దూ! నాన్న మాట ఆచరిస్తూన్నందకు నాన్న ఫోటో నాకేసి నవ్వుతూన్నట్లున్పించింది.