Site icon Sanchika

ఉత్కంఠకి గురి చేసే 369

[dropcap]కా[/dropcap]లం నీ గాయాన్ని మాన్పిందంటే అది గాయమే కాదు”

(మలయాళం -సస్పెన్స్, క్రైం థ్రిల్లర్) (అమెజాన్ ప్రైం లో లభ్యం)

ఈ కొటేషన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది.

“కాలం అన్ని గాయాలని మాన్పుతుంది.

కానీ కాలం నీ గాయాన్ని మాన్పిందంటే అది గాయమే కాదు”

చివరి సీన్‌లో కూడా ఈ కొటేషన్ తెరపై కనిపించడంతో చలన చిత్రం పూర్తవుతుంది.

ఈ సినిమా కథ పగ, ప్రతీకారం ఆధారంగా అల్లుకొనబడింది. ఈ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ చివరి అంకం వరకు మన ఊహకు అందని మలుపులు తిరుగుతూ ఉత్కంఠకి గురి చేస్తుంది ఈ సినిమా.

చివర్లో నిజం తెలిసేటప్పటికి మనం అవాక్కవుతాం.

ఈ చిత్రం బాగా నచ్చింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. నేను సమీక్ష వ్రాశాను అంటే ఒకటే గుర్తు. ఆ చలనచిత్రం బాగా ఆకట్టుకుని ఉండాలి, లేదా విపరీతంగా కోపం వచ్చి ఉండాలి.

ముఖ్యంగా ఈ చిత్రంలో తారాగణం అంతా కొత్తవాళ్ళు కావటం వల్ల ఎలాంటి అంచనాలు లేకుండా చూడటం వల్లకూడా ఈ చిత్రం నచ్చిందేమో. యుగళగీతాలు, మెరుపుపాటలు, చౌకబారు నృత్యాలు, వెకిలి హాస్యం లేకపోవటం కూడా ఈ చిత్రానికి బలాలు. కేవలం కథ మీద ఏకాగ్రత పెట్టి ఎక్కడా బిగి సడలకుండా చిత్రం తీసిన విధానం అద్భుతం.

దర్శకులు అత్యుత్సాహంతో ఉత్కంఠ పెంచటానికి కొన్ని దృశ్యాలు తీసి, వాటికి వివరణ ఇవ్వకుండా వదిలివేస్తుంటారు సాధారణంగా ఇలాంటి చిత్రాలలో. ఆ విధంగా సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు మిగిలిపోతుంటాయి.

కానీ ఈ చిత్రంలో ప్రతి ఒక్క దృశ్యానికి వివరణ లభిస్తుంది. ప్రేక్షకుల తెలివి తేటల్ని తృప్తి కలిగించేలా తీశాడు దర్శకుడు అన్ని కీలక ఘట్టాలని.

***

ఇక కథలోకి వస్తే..

రీతూ (మియాశ్రీ) మెడిసిన్ చదివిన ఒక విద్యార్థిని. పై చదువులకి ప్రయత్నిస్తుంటుంది. ఆమె ప్రియుడు సంజయ్/సంజు (హేమంత్ మీనన్) చలన చిత్ర రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంటాడు.

ఒక రోజు, రీతూకి తన ప్రొఫెసర్ దేవరాజ్ (బెన్ సెబాస్టియన్) వద్ద నుంచి మెసేజ్ రావడంతో ఆయన్ని కలవటానికి ఆయన ఇంటికి వెళుతుంది. అప్పటికే ఆయన ఇంటి నిండా పోలీసులు వచ్చి విచారణ చేస్తుంటారు. ఆయన గతరాత్రి నుంచి అదృశ్యం అయి ఉంటారు. ఆయన సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ అయి ఉంటుంది. ఆయన కిడ్నాప్‌కి గురయ్యాడు అని అంచనాకి వస్తారు పోలీసులు.

ఈ క్రమంలో పోలీసులు ఈ అమ్మాయిని కూడా ప్రశ్నిస్తారు. ఆ పిల్ల అయోమయంలో పడిపోతుంది. తరువాతి సీన్‌లో సంజూ ఆమెకి ధైర్యం చెబుతాడు. కాస్త మార్పు ఉంటుందని ఆమెని సినిమాకి తీసుకు వెళ్ళి ఇంటి దగ్గర వదిలేసి వెళతాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై హత్యా నేరం జరుగుతుంది ఆ రాత్రి. ఓ ముసుగు మనిషి ఆమెపై హత్యాయత్నం చేస్తాడు. ఆ ఘర్షణలో ఆ ముసుగు వ్యక్తి నుదుటిన గాయం అవుతుంది. అతని రక్తం గోడమీద చిందుతుంది. ఆ రక్తం గ్రూప్ AB+, ప్రొఫెసర్ దేవరాజ్ రక్తం గ్రూప్‌తో సరిపోలుతుంది. ఆయన ఇంకా అదృశ్యంలో ఉన్నప్పటికి ఆయనని అనుమానితుడిగా ప్రకటిస్తారు పోలీసులు. అంతటితో ఊరుకోరు పోలీసులు.

సంజయ్‌ని, ఫైజల్ అనే సేల్స్ బాయ్‌ని కూడా అనుమానితుల జాబితాలో చేరుస్తారు. ఈ ఫైజల్ (ఆష్లీ ఐజాక్) ఒక రెడీమేడ్ గార్మెంట్స్‌లో సేల్స్ బాయ్. ఇతడు అమ్మాయిల ట్రయల్ రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు తీస్తూ ఉంటాడు. గతంలో రీతూ చొరవ వల్ల వాడు అరెస్ట్ అయి ఉంటాడు. ఈ కథా ప్రారంభానికి ఓ రెండు రోజుల ముందే బెయిల్ మీద విడుదల అయి ఉంటాడు.

కానీ సంజయ్, ఫైజల్‌వి రక్తం గ్రూప్ AB పాజిటివ్ కాదు. అది గమనార్హం.

ఇక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది.

పోలీస్ ఆఫీసర్ విల్సన్ జాకబ్ (షఫీక్ రహిమాన్) ఈ కేసుని హేండిల్ చేసిన విధానం సమర్థవంతంగా ఉంటుంది. కానీ నిందితుడు వేసే ఎత్తులు పైఎత్తుల ముందు ఎప్పటికప్పుడు చిత్తవుతుంటాడు.

ఇంత చేసినా ఈ నేరస్థుడు రెండు ప్రధాన తప్పిదాలు చేస్తాడు. మరి పోలీసులు ఎలా స్పందించారు?

అసలు నేరస్థుడు ఎవరు, కథ ఎన్ని మలుపులు తిరిగింది ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే. అమెజాన్ ప్రైం లో లభ్యం.

ఇప్పటి దాకా నేను కథలోని ప్రారంభ దృశ్యాలని మాత్రమే చెప్పుకొచ్చాను. ఇకపై ఏ మాత్రం చెప్పినా మీకు కథ మీద ఆసక్తి పోతుంది. మీకై మీరు చూసి ఆనందించవచ్చు. మీకు ఏమాత్రం నిరాశ కలగదు.

***

ముఖ్యాంశాలు

* ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం కథ మరియు స్క్రీన్ ప్లే.

కథ చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే పకడ్బందీగా వ్రాసుకున్నారు. ఎక్కడా మనకు నిందితుడు ఫలానా వాడు అని చూచాయగా కూడా అనిపించదు. అలాగని చెప్పి కృతకంగా చివరి నిముషంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని, కథతో సంబంధం లేని వ్యక్తిని తీస్కువచ్చి ’ఇదిగో వీడే నేరస్థుడు’ అని చూపించి చేతులు దులిపేసుకోడు దర్శకుడు. సాధారణంగా ఇలా చేస్తూ ఉంటారు కొందరు దర్శకులు. కథలో బలం లేనప్పుడు ఇలాంటి తిప్పలు ఎదురవుతాయి బహుశా. ఈ విషయంలో మీరు కూడా చాలా తృప్తిగా ఫీల్ అవుతారు. నేరస్థుడు ఫలానా అని మీకు తెలిసిపోయిన అరగంట తరువాత కూడా చివరి నిమిషం దాకా మీరు తెరవంక చూస్తూనే ఉంటారు. అది స్క్రీన్ ప్లే యొక్క గొప్పదనం.

* అధిక భాగం చిత్రం వెన్నెల రాత్రులలో నడుస్తుంది. ఇంత టెక్నాలజీ డెవలెప్ అయినా కూడా ఈ చిత్ర దర్శకుడు రాత్రి పూట తీయకుండా కెమెరాకి ఫిల్టర్స్ తగిలించి పగలే తీశాడు షూటింగ్. అది పరీక్షగా చూస్తేనే తెలుస్తుంది, సాధారణ ప్రేక్షకులకి ఇబ్బందేం ఉండదు. బహుశా బడ్జెట్ సమస్యలు ఉన్నాయి అనుకుంటా.

* ఇలాంటి చిత్రాలకి ఫోటోగ్రఫీ, సంగీతం ప్రాణంగా నిలుస్తాయి. ఈ చిత్రంలో ఈ రెండు డిపార్ట్‌మెంట్లు కూడా పెద్దగా ఆకట్టుకోవు, అలాగని చెప్పి నిరాశపరచవు, పాస్ మార్కులు వేయవచ్చు.

* 369 అనే పేరు కొత్తగా ఆసక్తి కలిగించేదిగా ఉంది కద. ఈ పేరుకు కూడా వివరణ ఇస్తాడు నేరస్థుడు. తన పగ ప్రతీకారం తీర్చుకోవటానికి 369 రోజులు పూర్తయ్యాయి అని చెపుతాడు, నేరం తన మీద రాకుండా పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని తగిన వ్యక్తులని ఎన్నుకుని వారిని రంగంలోకి దింపి, తన పని కానిచ్చుకోవటానికి అతనికి 369 రోజులు పట్టింది. ఆ పని పూర్తవంగానే ఏ విధమైన ప్రేమ, వ్యామోహాలకి గురి కాకుండా భావరహితంగా రంగం నుంచి తప్పుకుంటాడు.

* వెన్నెల రాత్రులు, నిండు చంద్రుడు, ప్రకృతి దృశ్యాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు.

* మనకు మలయాళం రాదు కాబట్టి సబ్ టైటిల్సే గతి. కానీ ఈ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ నిండా వ్యాకరణ దోషాలే.

‘ఒక్కో వాక్యంలో ఇన్నిన్ని వ్యాకరణ దోషాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్ నింపి మన ముందు ఉంచుతున్నాడంటే వాడు మగాడ్రా బుజ్జి’ అంటాడేమో తనికెళ్ళ భరణి.

***

కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ స్కిల్స్‌తో పాటు కథ, కథనాలకు సంబంధించి చిట్కాలు అడుగుతుంటారు, ఫిలిం ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు నన్ను. అలాంటి వాళ్ళకి నేను తప్పక చూడమని సూచించే చిత్రాలలో ఇది కూడా ఒకటి.

“కథనే కథానాయకుడు, కథకే పెద్ద పీట వేస్తాం, ఆ తర్వాతే నటీ నటుల్ని ఎన్నుకుంటాం, నటీ నటులని బట్టి కథని తయారు చేసుకోము” అని వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కొందరు తెలుగు, హిందీ దర్శకులు.

కథనే నమ్ముకుని, మనసు పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెల్సుకోవాలంటే, ఇలాంటి చిత్రాలు చూడాలి అని చెప్తాను నేను, ఈ సినిమా తీయటానికి అయిదారు కోట్లకంటే ఎక్కువ ఖర్చు అయ్యుండదు నాకు తెలిసి.

***

ప్రధాన పాత్రధారిలో పగ రగులుతూ ఉండటానికి ఇంధనం లాగా ఉపయోగపడ్డ ఈ కొటేషన్ తెరపై మళ్ళీ చివర్లో కన్పడుతుంది.

“కాలం అన్ని గాయాలని మాన్పుతుంది.

కానీ కాలం నీ గాయాన్ని మాన్పిందంటే అది గాయమే కాదు”

***

2018లో మలయాళంలో విడుదల అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, అందరూ కొత్తవాళ్ళు నటించటం వల్లనుకుంటాను, ఆర్థికంగా పెద్దగా విజయం సాధించలేదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళకి ఖచ్చితంగా లాభం వచ్చి ఉంటుంది.

సాంకేతిక నిపుణులు

అబిన్ బేబి, ఫాతిమా మేరి – నిర్మాతలు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – జెఫిన్ జాయ్ (తొలి చిత్రం)

ప్రదీప్ బాబు, సీజో జాన్ – సంగీతం

అనిల్ ఈశ్వర్ – ఫోటోగ్రఫీ

Exit mobile version