37. నిత్య దీపావళి

0
5

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]ఆ[/dropcap]కాశం చీకటిని లడ్డూలా మింగేసి తన కళ్ళలో వెలుగుల మతాబులు పూయిస్తున్న సమయం.

దీపావళి టపాసుల చిటపటలు వినిపించడంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు లీలానందం. ప్రక్కనే ఆదమరిచి నిద్రపోతున్న ఆండాళ్ళును తట్టి లేపాడు. ఆమె ఒక పట్టాన లేవలేదు. నాలుగుసార్లు కుదిపి కుదిపి లేపాడు.

లేస్తూనే, “ఏమిటండీ! అసలే సామానంతా ఆ ఊరి నుంచీ ఈ ఊరికి తెచ్చే పనులు చేసి చేసి అలసిపోయాను. అర్ధరాత్రి దాకా ఆ పనిలోనే ఉన్నాం. ఇప్పుడయినా కాసేపు నిద్రపోనివ్వరా? ఏం కొంప మునిగిపోయిందని ఇంత అర్జెంటుగా నిద్రలేపారు? ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కూడా” అంది ఆవలిస్తూ.

తను లేచిన వేళ బాగుంది. ఆండాళ్ళు తిట్టలేదు. అందుకే ధైర్యం తెచ్చుకుని, “రేపేమన్నా దీపావళా?” ఆత్రంగా అడిగాడు.

“ఇప్పుడు దీపావళి ఏమిటండీ? కలగన్నారా? ఇంకా రెండు నెలలుంది. ఈ ప్రశ్న వెయ్యటానికా కమ్మటి నిద్ర పాడుచేశారు?” అంది విసుక్కుంటూ.

“అయితే ఈ రోజు భోగి ఏమో!”

“మీకు గానీ పిచ్చి పట్టిందా యేం? ఈ రోజు భోగీ కాదూ, దీపావళీ కాదు. నిద్రలో ఏదో కలగని ఉంటారు. మాట్లాడకుండా పడుకోండి.”

ఇంతలో మళ్ళీ టపాసుల చిటపటలు వినిపించాయి.

“అదుగో చూశావా ఆండాళ్ళూ! నేను చెబితే నమ్మలేదు. భోగినాదు కాకపోతే ఇంకెప్పుడు కాలుస్తారేం దీపావళి సామానులు?”

ఆవిడ ఆలోచనల్లో పడింది, ‘ఏమిటబ్బా’ అనుకుంటూ.

“బయటకు వెళ్ళి చూద్దామా?”

“భలేవారే! క్రొత్తగా వచ్చాం. ఆ శబ్దాలు ప్రక్కింట్లోంచి వస్తున్నాయని తెలుసు. పరిచయం కాకుండానే ఇలాంతి వెధవ సంశయాలతో వెళితే ఏం బాగుంటుంది? వాళ్ళింట్లో ఎవరిదైనా పుట్టినరోజు అవ్వచ్చుగా! సరదాగా కాల్చుకుంటున్నారేమో వదిలెయ్యండి.”

“సరేలే, పడుకో” అని అటు తిరిగి పడుకున్నాడే కానీ అతనికి నిద్ర రావడం లేదు. అటూ ఇటూ దొర్లుతుననడు అసహనంగా.

అతనికి ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే అదంతా తెలుసుకునేదాక నిద్ర పట్టదు. ఏమయ్యి ఉంటుంది? ఏమై ఉంటుంది? పదే పదే ప్రశ్న వేసుకుంటున్నాడు కానీ సమాధానమే రావడం లేదు. అది తట్టుకోలేక జుట్టు పీక్కోవాలనిపిస్తోంది అతనికి. కానీ బట్టతల. చుట్టూ ఉన్న రవ్వంత జుట్టు చేతుల్లోకి కూడా రాదే!

క్రిందకి దిగి వెళదామంటే మళ్ళీ డిస్ట్రర్బ్ చేశారని భార్యామణి తిడుతుందేమోనని భయం. కాసేపు భయపడినా ఆ పైన తెగించాడు. ఆగకుండా మ్రోగుతున్న ఆ చిటపటలు అతన్ని నిలవనీయలేదు. నెమ్మదిగా పిల్లిలా మంచం దిగాడు. అతను తీసుకున్న అతి జాగ్రత్త వికటించి ప్రక్కనున్న ఫ్లవర్ వాజ్‌ని క్రిందపడేసాడు.

“ఏమిటండీ ఆ శబ్దం?” అటు తిరిగి పడుకుంటూ అడిగిందావిడ.

“ఏం లేదులేవే! పిల్లి వచ్చినట్లుంది. దాని పని నేను పడతాలే! నువ్వు హాయిగా నిద్రపో” అన్నాడు, ఎక్కడ తనను మళ్ళీ నిద్ర పొమ్మంటుందో అని ఒక వంక భయపడుతూనే.

ఆండాళ్ళు చాలా మంచిదే! ఎంతవరకూ అంటే తన నిద్ర పాడు చెయ్యనంతవరకూ. అదే జరిగితే కుంభకర్ణుడి చెల్లెలి అవతారం ఎత్తి ఇంటిని, ఒంటిని ఒక పట్టు పట్టేస్తుంది. అందుకే తను అంత భయపడటం.

మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది దాటి తలుపు దగ్గరకు వేశాడు. పెరటి తలుపు తీశాడు. ప్రక్క ఇంట్లో వాళ్ళు ఏమయినా కనిపిస్తారేమోనని తొంగి చూశాడు.

లాభం లేదు. ఆ ఇంట్లో మనిషి ఈ ఇంట్లోకి కనిపించే అవకాశమే లేదు. జీవితంలో తను ఇంత పెద్ద గోడను ఎప్పుడూ చూడలేదు. కుర్చీ వేసుకుని ఎక్కినా కూడా అవతలి వారెవరూ కనిపించరు. పోనీ డాబా మీదకు వెళితే…

ఇంతవరకు తన వెధవ బుర్రకు ఆ ఆలొచనే రాలేదు అనుకుంటూ ఉత్సాహంగా అడుగులు వేశాడు.

అరవై దాటిందేమో చివరి మెట్టు మిదకు వచ్చేటప్పటికి ఆయాసం వచ్చింది. కళ్ళు బైర్లు కమ్మి చత్వారం కూడా. ఆ రింగుల రింగుల వలయంలో పెద్ద తలుపూ దానికి వేలాడుతున్న పెద్ద తాళం కప్ప అస్పష్టంగా కనిపించాయి.

అక్కడే చతికిలబడ్డాడు.

మరి తాళాల గుత్తి భార్య బొడ్లో ఉంది మరి.

“హత విధీ!” అని అనుకోకుండా ఉండలేకపోయాడు.

అబ్బా! మెట్లు ఎక్కుతూ ఎన్ని ఊహించుకున్నాడు? సస్పెన్స్ ఏదో ఛేదించేసినంత సంబరపడ్డాడే! అంతా హుష్ కాకి అయిపోయింది. ఓపెన్ థియేటర్‍లో సినిమా చూసినట్లు ప్రక్కింట్లో జరిగేదంతా చూసేసి విషయం గర్వంగా భార్యకు చెప్పేయాలనుకున్నాడు. అందుకే గర్వభంగం అయ్యింది. మళ్ళీ క్రిందకు వెళ్ళినా ఏం లాభం? ఆండాళ్ళను అంగుళం కదిపినా వచ్చేది భూకంపమేనే! అందుకే ఆ ఆలోచనను ప్రక్కకి నెట్టాడు. కాసేపు అక్కడే కూర్చుని మెల్లిగా దిగడం ప్రారంభించాడు.

చివరి మెట్టు దగ్గరికి వచ్చాక కాలు స్లిప్ అయింది.

అంతే, ‘అమ్మో!’ అంటూ గట్టిగా కేక వేసి కూలబడ్డాడు.

భరించలేని బాధ. చూస్తుండగానే కాలు వాచిపోయింది. బెణికినట్టుంది.

కనీసం పైకి లేవాలన్నా లేవలేకపోతున్నాడు.

నిద్రలో ఉన్న ఆండాళ్ళుకి తన అరుపు వినబడి ఉండదు.

అదే మంచిదయింది. ఏ బాత్రూమ్‌లోనో కాలు జారానని చెప్పచ్చు. ఈ మెట్లు ఎక్కానని తెలిస్తే ఇక తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అక్కడే కాలు జాడిస్తూ కూర్చున్నాడు.

అలా కాలు జాడించినప్పుడల్లా యమా బాధ.

తట్టుకోలేక కళ్ళ వెంబడి నీళ్ళు కారాయి.

కర్మ! కర్మఫలం! అనుభవించాల్సిందే! ఆయన లీలలు ఎవరికి అర్థమవుతాయి? వాళ్ళల్లో ఈ లీలానందం కూడా ఒకడు. అంతే! బాధ వైరాగ్యం నేర్పుతుందన్న విషయం అతని పట్ల ఋజువయింది.

ఎలాగో లేచి కుంటుకుంటూ మంచం దగ్గరికి వచ్చి ఎక్కి పడుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు.

ఈ  మంచం మీద పడుకున్నవాడు ఇలా ఏడవవచ్చుగా, ఎక్కడో పేలితే తగదునమ్మా అంటూ తయారయ్యాడు. ఇప్పుడు తనకి పేలింది.

అతనిని వెక్కిరిస్తూ, ఆ ఇంట్లోంచి ఆపకుండా ‘చిటపటలు’ వినిపిస్తూనే ఉన్నాయి.

లేచాకా అతను అల్లిన కథను నమ్మి సందు చివర ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి కాస్త సున్నం అడిగి తీసుకువచ్చి బెల్లం దంచి కలిపి పట్టు వేసింది ఆవిడ.

అది ఝుమ్మని లాగుతుంటే నొప్పి అంతా ఎవరో చేత్తో తీసేసినట్లే అయింది. కానీ కాసేపటికి మళ్ళీ మామూలే!

ఆ రోజంతా అయనకు బెడ్ రెస్ట్ లానే గడిచింది.

ఆవిడ రెండు, మూడుసార్లు పట్టు వేస్తూనే ఉంది.

రెండో రోజు కాస్త కుంటుకుంటూ నడవడం ప్రారంభించాడు.

ఆ చిటపటలు రమ్మని పిలుస్తున్నాయి. మరి మరునాడు కూడా ఆ ఇంట్లోంచి శబ్దాలు వస్తూనే ఉన్నాయి.

కుంటికాలుతో వెళ్ళటం నామోషీగా అనిపించింది.

ఇక ఇక్కడ ఉండేవాళ్ళమేగా!

రేపటికి తగ్గిపోతుందేమో ఈ నొప్పి. అప్పుడు వెళ్ళి అడుగుదాం. అప్పటిదాకా ఈ సస్పెన్స్‌ని నీడ దెయ్యంలా భరించకతప్పదు అనుకున్నాడు.

అతనికి ఎక్కడో చిన్న ఆశ ఉంది. భార్య వెళ్ళి వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడి ఆ రహస్యం తెలుసుకుని వస్తే ఎంత బాగుంటుందని.

కానీ అసలా ఊహ బయటపెట్టడానికి కూడా సాహసించలేదు. ఎందుకంటే ఆమెకు ఎప్పుడు ఏది చెయ్యాలంటే అది చెయ్యటమే కానీ ఒకరు చెప్పారని చేసే అలవాటే లేదు.

అలా అంతరాత్మ గుర్తు చేయటంతో ఆ చిన్న ఆశాదీపం కూడా ఠఫ్‌మంటూ ఆరిపోయింది.

రెండో రోజు కాదు, మూడు రోజులయినా ఆ బాధ తగ్గలేదు. నాలుగో రోజున కాస్త చల్లగాలి పీల్చాలని బయట ఉన్న వేపు చెట్టుక్రింద కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు.

ఆ సమయంలో కూడా ప్రక్కిట్లోంచి ‘చిటపటలు’ వినిపిస్తూనే ఉన్నాయి.

ఇంతలో గేటు తీసిన శబ్దమయింది.

ఎవరో ఆయన. తనకి తెలియదు. అయినా, ‘రండి’ అంటూ ఆహ్వానించాడు.

“నా పేరు పరంధామం. పోస్టాఫీసులో పోస్ట్ మాస్టర్‌గా పని చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యాను. ఇదుగో ఇక్కడ ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాను. మీ ప్రక్కిల్లే మాది. పరిచయం చేసుకుందామని వచ్చాను” అన్నాడాయన.

అంతే లీలానందం  మనసు ఒక్కసారి ఆకాశాన్ని తాకినంత ఆనందమయింది. ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. అడగకుండా అక్షయపాత్ర ప్రత్యక్షమై అన్నీ ఇచ్చేస్తుంటే అలాగే అనిపిస్తుందేమో!

“మా ఆవిడ వంటింట్లో ఉన్నట్లుండి. ఏమీ అనుకోకపోతే, హాలు లోంచి ఓ కుర్చీ తెచ్చుకోండి. కాలు బెణికింది. లేకపోతే నేనే తెచ్చేవాణ్ణి.”

“ఫర్లేదు. ప్రక్కప్రక్కన ఉండాల్సిన వాళ్ళం. ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా?” అంటూ తనే కుర్చీ తెచ్చుకుని వేసుకున్నాడు.

లీలానందం తనను తాను పరిచయం చేసుకున్నాడు. నాలుగు మాటలు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత అంతదాకా గొంతు దగ్గిర దాగిన మాటను కక్కేసాడు – ఏమా చిటపటల కథా కమామీషూ అంటూ!

“అదా!” అని ఆయన తన బోసి నోరు కనిపించేటట్లు నవ్వి చెప్పడం ప్రారంభించాడు.

***

“అదేమిటోనండి. అదంటే మాకందరికీ ఇష్టం. ప్రొద్దున లేచిన దగ్గర నుంచీ మా ఆవిడ, మా అబ్బాయి దాని కోసం పోట్లాట పెట్టుకోని క్షణం ఉండదు. నేను కూడా అనుకోండి…”

ఇదేమిటి ఈయన ‘చిటపటలు’ గురించి అడిగితే, ఏదో దాని గురించి చెబుతున్నాడు. కొంపదీసి వినపడదాం యేం అన్నట్లు అనుమానంగా చూశాడు అతనివంక. ఆయన అదేమీ పట్టించుకోకుండా చెప్పుకుపోతున్నాడు.

“ఒక రకంగా చెప్పాలంటే అది మా హస్తభూషణం. రాత్రి పగలు అది మా కోసం కష్టపడుతూనే ఉంటుంది. ఏ జన్మలోనో అది మాకు ఋణపడి ఉంది. నిజం చెప్పాలంటే అది భగవంతుడు ఇచ్చిన కానుక.”

“నేను అడిగింది మీ ఇంట్లో వచ్చే ‘చిటపటల’ గురించండీ…” మధ్యలో గుర్తు చేశాడు మనసాగల లీలానందం.

“నేనూ చెప్పేది దాని గురించేనండీ! మా ఆవిడ ముగ్గులేసే ముందు దానిని చంకలో బిడ్డలా తీసుకువెళ్తుంది. నేను దానికి సాయం చేస్తుంటాను. అందరి మగాళ్ళలా ఊరుకోను. బావిలో నీళ్ళు తోడిచ్చేడప్పుడు దాన్ని నేను అందుకుంటాను. అది లేకపోతే బావిలోకి అసలు తొంగి చూడగలమా?”

“బాత్రూమ్‌లోకి కూడా అది లేకుండా వెళ్ళను. దాన్ని ఎప్పుడూ పిల్లి పిల్లను చంకను వేసుకుని తిరుగుతున్నట్లు తిరుగుతూనే ఉంటాను. రిటైర్ అయ్యాక అదే నాకు కాలక్షేపం అయింది.”

ఏం అర్థంగాక తెల్లమొహం వేశాడు లీలానందం.

ఆయన ఇంకా సస్పెన్స్‌లో పెడుతూ, “మా అబ్బాయి కూడా దాని కోసం మాతో దెబ్బలాట పెట్టుకుంటూ ఉంటాడు. దాని కోసం అలా మేమంతా దెబ్బలాడుకోవడం కూడా మాకు ముచ్చటగానే ఉంటుంది” అన్నాడు.

సస్పెన్స్ మాట దేముడెరుగు. లీలానందానికి విసుగు వచ్చేస్తోంది. ఇక తను సహనం కోల్పోయే పరిస్థితి తప్పనిసరి అయిపోయేట్లుంది.

ఆ అవకాశం ఆయన ఇవ్వలేదు.

“సస్పెన్స్ భరించలేకపోతున్నారు కదూ! ఈ ఏరియాలో దోమలు విపరీతం. గుంపులు గుంపులు. గుట్టలు గుట్టలు. వాటిని పోగొట్టే మార్గం తెలియక ప్రక్షాళన కార్యక్రమంగా బ్యాటరీతో పని చేసే బ్యాట్ కొనుక్కొని వచ్చా. ఇక ఎక్కడ కూర్చోవాలన్నా, ఎక్కడ నిల్చోవాలన్నా, ఎక్కడ పని చేసుకోవాలన్నా దానికి పని కల్పిస్తే. దాని బటన్ నొక్కి ముందు వాటిని సంహరించాకా కానీ మన పనులు జరగవు. ఆ దోమలు చచ్చినప్పుడు మోగే బాజాలే ఆ చిటపటలు. మా ఇంట్లో నిత్యం ఆ చిటపటలే నిత్య దీపావళిలా!” అన్నాడు.

నోరెళ్ళబెట్టడం లీలానందం వంతయింది. ‘అమ్మో! ముయ్యకపోతే ఆ దోమలు తన నోట్లో దూరడం ఖాయం’ అనుకుంటూ మూసుకున్నాడు.