Site icon Sanchika

38. భూమిసుతుడి బావగార్లు

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]మం[/dropcap]గళ్రావు తల్లిదండ్రులకి ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన కొడుకు. అయిదో క్లాసు వరకూ చదువుకొని, ఆ తర్వాత తండ్రివెనక తన పదో ఏటనుంచే వ్యవసాయప్పనుల్లో తలదూర్చేసి పాలికాపుల్నీ, వ్యవసాయపు కూలీల్నీ గదమాయించే ద్వంద్వార్థాల మాటల పురాణాల పండితుడైపోయాడు. అయినా మంగళ్రావు మనసు మంచిది కావడంతో ఎవరూ తప్పు పట్టేవారు కాదు. వ్యవసాయ సంస్కృతిలో ఇలాంటి భాషాప్రయోగం చిరకాలంనుంచీ వస్తూన్నదే. మంగళ్రావు తండ్రిది పాతిక ఎకరాల భూమి. ముగ్గురి కూతుళ్ల పెళ్లిళ్లూ చదువున్న కుటుంబాల్లో చేసి, అయిదేసి ఎకరాలు భరణంగా యిచ్చి, చివరికి పదెకరాలు మిగుల్చుకోగలిగాడు. అల్లుళ్లు ముగ్గురూ వ్యవసాయపు రాబడి భవిష్యత్లో తమకి సరిగా అందుతుందో లేదో అన్న భయంతో భార్యల్ని ఒప్పించి, మంగళ్రావు తండ్రి  నచ్చచెప్పినా వినకుండా ధాన్యభూమిని అమ్మిపారేసి నేరుగా ధనలక్ష్మిగా మార్చేసుకొన్నారు.

ఓ సారి ధాన్యవ్యాపారప్రాంగణానికి పోయి సైకిలుమీద తిరిగివస్తున్న మంగళ్రావు తండ్రి మీద ఓ తాగుబోతు డ్రయివరు లారీ ఎక్కించేయడంతో, ఆయన ప్రాంగణం అమ్మవారైన ధాన్యలక్ష్మి దివ్యసన్నిధికి వెళ్ళిపోయారు. అప్పటికి మంగళ్రావు వయసు పద్దెనిమిది సంవత్సరాలు. తల్లి పెదమాణిక్యం మంగళ్రావుకి దన్నుగా నిలబడింది. వయసులో వెర్రివేషాలు వేయకుండా తెలిసున్న బంధువుల్లోంచే ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసేసింది. మంగళ్రావు పెద్దగా చదువుకోకపోయినా వ్యసనాలవైపు దృష్టి సారించకుండా, సంప్రదాయాల్ని పాటిస్తోనే, ఆర్భాటాలకి పోకుండా మిగిలిన పదెకరాల్నీ సక్రమంగా సాగు చేసి, పాతిక ఎకరాలు చేశాడు. అయిదెకరాల మామిడితోట కొన్నాడు. మంగళ్రావుకి కూతురు చినమాణిక్యం, ఆ తర్వాత కొడుకు చినకర్షకరావు. మంగళ్రావు తండ్రి పేరే!

చినమాణిక్యం పదకొండో ఏటనే పెద్దమనిషైoది. నాయనమ్మ పెదమాణిక్యం నానా హంగామాచేసింది. పంచాయితీ పాఠశాలలో ఆరో తరగతిలో ఉన్న మనవరాలి చదువు అటకెక్కించే ప్రయత్నం చేసింది. జుబ్బా, పరికిణీలో ఉండే చినమాణిక్యం చేత కండువా పరికిణీ కాకుండా ఏకంగా చీరే కట్టించేసింది. దానికి త్వరగా పెళ్లిచేసేయండి అని కొడుకుమీదా, కోడలిమీదా ఒత్తిడి పెంచేసింది.

“అమ్మా! చిన్నమ్మ తెలివైనది. దాన్ని చదువుకోనివ్వవే! ఒకప్పుడు ఆస్తులు చూసి అబ్బాయిలకు పిల్ల నిచ్చేవారు. ఆ తర్వాత ఆస్తుల తోనే కాకుండా చదువులు కూడా చూస్తున్నారు. యిప్పుడు మనం కంగారు పడి మాణిక్యం కోసం సంబంధాలు వెతికితే, మన ఆస్తి మీద కన్నేసి ముందుకొస్తారు. అది ఇప్పటి పరిస్థితులకు అనుకూలం కాదు. ఏదైనా అవాంతరం జరిగితే ఆడపిల్ల తనకాళ్లమీద తాను నిలబడగల అవకాశం మనం కలిగించాలి. అందుకు చదువు చాలా అవసరం,” అన్నాడు మంగళ్రావు.

“నేనేం చదువుకొన్నానని, నువ్వేం చదువుకొన్నావని? పెరిగామా లేదా?” పెదమాణిక్యం అన్నమాటల్లో అంతులేని ఆత్మవిశ్వాసం తొంగి చూసింది.

మంగళ్రావుకి తల్లంటే ఎనలేని గౌరవం, అభిమానం. తండ్రిపోయిన తర్వాత అన్నీ తానే అయి నిల్చింది.

“అదృష్టం కలిసివచ్చింది కాబట్టి. మూడేళ్లు వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిన్నా, పెట్టుబడులకోసం నీ వంటి మీది నగలు ఆసరాగా ఇచ్చావు కాబట్టి. అనేకరకాలైన భౌగోళిక కారణాలమూలంగా ప్రపంచ వాతావరణం మారిపోతోంది. అధిక, అనావృష్టిలూ, లోతుకు పోయిన భూగర్భజలాలూ, నకిలీ విత్తనాలూ, నాణ్యతలేని ఎరువులూ, క్రిమిసంహారులూ వ్యవసాయాన్ని దెబ్బతిస్తున్నాయి. వ్యవసాయంపట్ల ప్రభుత్వ విధానాలూ, రాష్ట్రాలమధ్య జలవనరుల పంపిణీలూ అంత ప్రోత్సాహకరంగాలేవు. ముందు ముందు రోజుల్లో వ్యవసాయం చెయ్యడంలో ప్రయాస ఎక్కువైపోతుంది కానీ, శ్రమకిదగ్గ ఫలితముండదు. భూములున్నకుటుంబంలోకి చిన్నమ్మని పంపే ముందు దాని చదువు సంగతి ఆలోచించాలి.” అన్నాడు మంగళ్రావు.

“నేను పై సంబంధాల మాటా చెప్పటంల్లేదు, భూములున్న కుటుంబాలవారి సంగతీ చెప్పటoల్లేదు. నీ అప్పలు ముగ్గురికీ చిన్నమ్మ వయసుకుదగ్గ కొడుకులున్నారు. వాళ్ళు నన్ను కంగారు పెడ్తున్నారు. నీ కూతురికి ఎవరు నచ్చుతారో వాడికి కట్టబెట్టేద్దాo. కుర్రవాళ్లు మంచి చదువులే చదువుకొంటున్నారు కదా?”

“అమ్మా! బాల్యవివాహాలు ఇప్పుడు నేరంగా పరిగణింపబడ్తున్నాయి. చిన్నమ్మకి పద్ధెనిమిదో ఏడు వచ్చేసరికి పన్నెండో తరగతి ప్యాసైపోతుంది. అప్పుడు నీ మాట ప్రకారం పెళ్లి ప్రయత్నాలు చేస్తాను.“

“పన్నెండు ప్యాసైన తర్వాత కాలేజీ చదువంటుంది. అప్పటికి నీ అప్పల కొడుకులు తెలివిమీరి చిన్నమ్మని కాదనవొచ్చు.”

“అలా అనే స్వాతంత్ర్యం చిన్నమ్మకి కూడా ఉండాలి కదా? వాళ్ళు కాదనడంకూడా ఒకవిధంగా మనకి మంచిదే! ఎందుకంటే మేనరికాలు మంచివి కాదని ఇటీవలి వైద్యశాస్త్రం చెబ్తోంది. పై సంబంధాలు చూద్దాం.”

“అదన్న మాట మీ ఇద్దరి కడుపులో ఉద్దేశ్యం. నీ నాయన పోయిన తర్వాత నిన్ను శాసించే అధికారం ఉంది కాబట్టి నీ వెంట నిలిచాను. ఇప్పుడు చిన్నమ్మ జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత నీదీ, కోడలిదే కానీ నాది కాదు. కానీ నాకున్న భయాలు నాకున్నాయి. అందుకనే చదువు మానిపించి పెళ్లి చేసేయమన్నాను?”

“అంటే చిన్నమ్మి ఇంత చిన్నవయసులో ….?”

“అలాంటిదేమీ లేదు. పెదవీరస్వామిగారి ఆఖరి చెల్లెలి ఏడో తరగతి చదువుతున్న కూతుర్ని క్లాసుపంతులే చెరిచాడు. పసికందులమీద కూడా అత్యాచారాలు జరిగిపోతున్న రోజులు. చిన్నమ్మది చిదిమిన దీపంలాంటి అందం. పాతకాలం దాన్ని కాబట్టి, నా భయాలు నాకుంటాయి. మీ ఇష్టానికి నేను వ్యతిరేకించనుగాని, చిన్నమ్మని మితిమీరిన గారాబం చేయకండి. మేనరికాలు మంచివి కావని నీ అప్పలకి సమాధానం మీరే చెప్పుకోండి. ‘అంతా వాళ్ళ యిష్టం’ అని నెపం మీ ఇద్దరి మీదకు నెట్టేస్తాను, సరేనా?” అంది పెదమాణిక్యం వెంటనే రాజీ పడిపోతూ.

వాస్తవానికి తల్లి ఉద్దేశ్యమూ ఇదే కావొచ్చునని మంగళ్రావుకనిపించింది. తమ ఊరైన పిఠాపురంనుంచి రాజమండ్రి, అమలాపురం, విజయవాడ వెళ్ళి ముగ్గురక్కల్నీ కలుసుకొని బావలకి తెలియకుండా, ‘చిన్నమ్మకి తామిప్పుడే వివాహం చెయ్యదల్చుకోలేదనీ, అది చదువుకోవాలనీ, మేనరికాలు మంచివి కావనీ’ తన ఉద్దేశ్యం ఎరిక పరచి,  మేనరికం కలుపుకోవాలని తమ మీదా, తల్లీమీదా ఒత్తిడి తీసుకురావద్దనీ చనువు తీసుకొని చెప్పేసి వచ్చాడు.

అప్పలు కాస్తంత మొహాలు ముడుచుకొన్నా, చిరునవ్వులు మొహాన చిందించి, తమ్ముడికిష్టమైన అల్లం మిరపకాయ, జీలకర్రల నేతి పెసరేట్లు తినిపించి మరీ పంపించారు. తల్లికి తను పిల్లుల మెడల్లో గంటలు కట్టి వచ్చేశానని చెప్పాడు. పెదమాణిక్యం ‘హమ్మయ్య, గండం గడిచింది!’ అనుకొంది. లేకపోతే ముగ్గురు కూతుళ్లూ మేనకోడలు చినమాణిక్యంకోసం పోట్లాడుకొంటారు. ఎందుకంటే దాని అందం అలాంటిది. మంగళ్రావు భార్యకి మొగుడంటే మరింత గౌరవం పెరిగింది.

చాపకింద నీరులా సాగిన ఈ వ్యవహారామంతా చినమాణిక్యానికి తెలియదు. చదువు ఆగకుండా, కండువా పరికిణీతో స్కూలుకి వెళ్ళనారంభించింది. నాలుగైదు రోజులు సిగ్గుపడ్డా, ఆ తర్వాత అలవాటైపోయింది.

రెండు వారాల తర్వాత పెదమాణిక్యానికి రాజమండ్రి పెద్ద కూతుర్నుంచి ఉత్తరం వచ్చింది. పెదమాణిక్యం అల్లుడు  రాజమండ్రి హైస్కూల్లో టీచరు. ‘నీ అల్లుడు గత కొన్ని సంవత్సరాలుగా పేకాటరాయుడుగా మారి చాలా డబ్బు తగలేశాడు. అమ్మాయి పెళ్ళికి దండిగా కట్నం ఇచ్చుకోవాల్సి వచ్చింది. నా కొడుక్కి ఇంజనీరింగ్లో సీటు సంపాదించేసరికి లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇల్లు తాకట్లో ఉండడమే కాకుండా నా నగలన్నీ హరించుకు పోయాయి. అప్పులిచ్చినవాళ్లు నోటీసులమీద నోటీసులిస్తున్నారు. ఆదుకోమని తమ్ముడికి చెప్పు.’

అమలాపురం అమ్మాయినుంచి కూడా ఆవిడకి ఉత్తరం వచ్చింది. ‘నా ఆడపడుచు కూతురి పెళ్లి భారం మా మీద పడేసిన కారణంగా, తాలూకా ఆఫీసులో పనిచేసే ఆయన లంచాలు మరిగి పట్టుబడ్డాడు. ఆ ఊబి నుంచి బయటపడ్డానికి తలకుమించిన అప్పులు చేసి, పంచాయితీ చేసిన అధికారులకు లంచాలిచ్చి ఎలాగో బయట పడ్డాడు. ఈ సంగతి బంధువర్గానికి తెలియకుండా ఉండడానికి నానా యాతనా పడ్డారు. అదీకాక షేర్లవ్యాపారం చేసి నిలువునా కూరుకుపోయాడు. అప్పుల్లో ఇరుక్కు పోయాడు. ఇప్పుడు మొదటిసారి నా గోడు నీకు చెప్పుకొంటున్నాను. తమ్ముడు మంగళ్రావు ముందుకొచ్చి ఆదుకోవాలని అత్తమామాలూ, ఆయనా నస పెట్టి ప్రాణాలు తోడేస్తున్నారు.’

విజయవాడనుంచి మూడో కూతురు కూడా ఉత్తరం రాసింది. ‘మా ఆయన భవన నిర్మాణశాఖలోకి బదిలీ అయిన తదనంతరం సంపాదన పెరిగిందని సంతోషించాను. సంపాదన బావుండడంతో స్నేహితులు పురి ఎక్కించడంతో పురుగు దొలిచి, ఒక అరవ సినిమా లక్షలు వెచ్చించి డబ్బింగ్ హక్కులు కొన్నాడు. డబ్బింగ్ కార్యక్రమం పూర్తి అవడానికి మరికొన్ని లక్షలు పెట్టాల్సివచ్చింది. తీరా అంతా సిద్ధమయ్యే సరికి అసలు ఆ సినిమా తనదనీ, ఎవరో దగుల్బాజీ తనపేరిట ఆ హక్కుల్ని అమ్మివేశాడనీ, అసలు నిర్మాత కోర్టుకివెళ్లి డబ్బింగ్ సినిమా తనకే చెందాలని కోర్టులో వ్యాజ్యం వేశాడు. బినామీ పేర్లతో వ్యవహారం జరగడం మూలాన ఆయన పేరు బయటకి పొక్కలేదు. అసలు నిర్మాతతో రాజీ జరిగి ఇంకొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అయితే ఏ ఒక్క పంపిణీదారూ ముందుకు రాలేదు. ఒక్క ఆటకూడా ఆడ్డానికి హాలు దొరకలేదు. అప్పులు వసూలు చేసే వాళ్ళు బెదిరిస్తున్నారు. అమ్మా, నువ్వే ఆదుకోవాలి!’

ఈ మూడు ఉత్తరాల్నీ పెద మాణిక్యం మంగళ్రావుకి అందించింది. వాటిని చదివి, తల్లికి అర్థంకాని కొన్ని సంగతుల్ని వివరించి అన్నాడు. ”అమ్మా! ఇప్పుడైనా అర్థమైందా ముగ్గురక్కలూ చిన్నమ్మపెళ్లి విషయమై ఎందుకు నీ మీద ఒత్తిడి తీసుకు వచ్చిందీ?”

“పరిస్థితులు ఇంతగా దిగజారిపోయాయని నీ అప్పలు ఇదివరకు మాటవరసకైనా చెప్పలేదు. అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. వాళ్ళ మనోగతం ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అల్లుళ్ళకి చదువులున్నా ఇంగితజ్ఞానం లేకపోయింది. అమ్మాయిలు ఎవరి స్వార్థం వారు చూసుకొని నీ కూతుర్ని వాళ్లబ్బాయిలకి కుదుర్చుకోడానికి చూశారు!”

“ఏం చేద్దామంటావు?” మంగళ్రావు ప్రశ్నించాడు.

“ఎంతకాదనుకొన్నా నాది తల్లి మనసురా!” పెదమాణిక్యం తన అభిప్రాయం చెప్పకనే చెప్పేసింది.

వాస్తవానికి ప్రతీ తల్లిమనసూ కుంతీ దేవి మనసే కదా!? కన్న సంతానం స్థితిగతుల్లో ఎక్కువ తక్కువలుంటే ఆ మనసు క్షోభిస్తుంది.

మంగళ్రావు వ్యవహర్త. తను సంపాదించిన పదిహేను ఎకరాల్నీ మంచి ధరకి అమ్మేసి ముగ్గురి ఋణబాధలూ దగ్గరుండి తీర్చేసి ఇటు తల్లినీ, అటు అప్పల్నీ సంతృప్తి పరిచాడు. తను నోరు మెదపకుండానే బావగార్లకి జ్ఞానోదయం చేసి వచ్చాడు.

వంశ పారంపర్యంగా వచ్చిన పదెకరాల్నీ, తను ఆర్జించిన మామిడి తోటనీ తనకిందే ఉంచుకొన్నాడు. ఒకరోజు రాత్రి మంగళ్రావుకి శ్రీనివాసుడు కల్లోకి వచ్చాడు. “ఏడుకొండల్లోనే కాకుండా నేను మీ ఊళ్ళో కూడా వెలిశాను కదటయ్యా? అందరికంటే పెదబావగార్ని నేనే కదటయ్యా? నన్నేమరిచిపోతే ఎలాగ?” అన్నాడు.

“మా భక్తజనులను అనుగ్రహించే అగ్రసోదరి పద్మావతి దేవిని వివాహమాడ్డానికి మీరు కుబేరులవద్ద ఎంత తీర్చినా వడ్డీయే తీరనంత అప్పు చేశారని విన్నాను. ఏకగర్భ జనితులైన నా సోదరిలను గురించి ఆలోచించానేకానీ, విశ్వగర్భ జనితమైన సోదరి పద్మావతీ దేవిని విస్మరించాను. మీ ఋణం తీర్చవలసిన నాఉడతాభక్తి బాధ్యతను మరిచి పొరపాటే చేశాను. మన్నించు స్వామీ!”అని వేడుకొన్నాడు.

అలశ్యం చేయకుండా కొద్ది రోజుల్లోనే ఓ రెండెకరాల వ్యవసాయ భూమిని ఊరి వెంకటేశ్వరాలయం పేరిట మార్పించి, తానే కౌలు సాగుచేసి ధరావత్తును గుడికి సమర్పించే దస్తావేజు పత్రం తయారు చేయించాడు. మంగళ్రావుకి బావలన్నా, వారి తల్లిదండ్రులన్నా నమ్మకం పోయింది మరి!

Exit mobile version