[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]
[dropcap]వా[/dropcap]యుసంద్రాలతో వెదురు రంధ్రాలు ఏకమవని
వాయులీనాలలో ప్రాణవాయువులు లీనమవని
వాతాయువులలా ప్రాణాలు కదలాడని
వాతాశ్వాలతో హృదయాలు పరుగెత్తని
వాతాయనాలై దేహదీపాలు తెరుచుకోని
వాతాశుల విషతిమిరాలు తొలగిపోని
వాసురవాకిలిలో భాసురఖేలులు వాలని
వాశితంలా మధుభాషితాలు చెవి చేరని
వాతావరణాలు వర్షించని
వానలోని స్వచ్ఛత హర్షించని
వాత్సల్యసమీరాలు స్పృశించని
వానవిల్లుల్లాంటి వచనకవితలను సృజించని
వాక్కులు గేయాలను ఆశించని
వాగ్గేయములై జనించని
వార్నిధులలా కరగని
వారధులలా కలపని
వాగ్ఝరులలా మారని
వాఙ్మయవృద్ధి కలగని
వాడి వచనాలతో చీడకవచాలు చీల్చని
వాడిమితో తప్పొప్పులు తేల్చని
వాక్సిద్ధితో వాణిని కీర్తించని
వాగ్మియై వాగ్ధాటి సృష్టించని
వాహినినై పదసిరితో ప్రవహించని
వాల్మీకినై మరో రామాయణం రచించని
వారసుడినై అక్షరజ్ఞానాన్ని అందుకొనని
వాచస్పతినై వాచకాలు వల్లె వేయించని
వాలఖిల్యుడినై సూర్యభ్రమణం చేయని
వాల్లభ్యము పొంది వ్యతిరేకతను కాల్చేయని
వాజతూలికతో ప్రఫుల్లపత్రాలపై లిఖించని
వాజపేయములో ప్రణీతమంత్రాగ్నినై ప్రభవించని
వాజసనిలా ప్రకాశప్రభాతాన ప్రజ్వలించని
వాజసనేయశాఖలో ప్రసన్నప్రసూనమై వికసించని
వారిజవాసిని దీవెనతో పత్రంజనం పారించని
వాతెర తొలగి పదకన్యలు నర్తించని
వాచవి చూడ జనం వీనులు రిక్కించని
వాయవ్యాస్త్రవేగాన కావ్యరచన కావించని
వామనకావ్యమయినా వాసికెక్కని
వారణాసిక్షేత్రాన వెలిగే వాశికి మొక్కని
వార్తలన్ని కావ్యకర్తలుగా మెదిలిపోని
వాక్యాలన్నీ కావ్యాలుగా మెరిసిపోని
వాసుపదమంజీరనాదమై వినిపించని
వాసుదేవుడు కరుణాజల్లు కురిపించని
వాసుకమును చేర వరములిడని
వాసుకిలా అక్షర వామదేవున్ని చుట్టెయ్యని
వానప్రస్థాన పురుషార్థపు వల్లరులు అల్లుకోని
వారుణి రూపాన అహం తొలగిపోని
వార్ధక్యాన కూడా దేహానికి కవితాజవం కలిగించని
వాటన్నిటితో నా జీవరాజీవం మరింత వికసించని