[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]
[dropcap]సం[/dropcap]జీవరెడ్డి నగర్లో అల్మాస్ హోటల్కు దగ్గర ఉమేష్ చంద్ర విగ్రహం పక్కనున్న మెట్రోస్టేషన్ దగ్గర అరగంట పైనుండి నిలబడి ఉన్నాను. అశోక్ వస్తానన్నాడు. కలుస్తానన్నాడు. కాని రాలేదు.
“ఒరేయ్ గోపాల్..! అక్కడే ఉండరా.. వస్తున్నా.. ట్రాఫిక్ బాగా ఇబ్బంది పెడుతోంది. నేనొస్తున్నా… కొంచం వెయిట్ చెయ్ రా..” అంటూ ఫోన్ చేశాడు.
వెళ్లిపోదామనుకున్న వాడిని కాస్త ఆగిపోయాను. నడుచుకుంటూ వచ్చినా అరగంట దూరం. ట్రాఫిక్లో ఇరుక్కొని అరగంట దాటిపోతుందని చెప్తున్నాడు. అవును మరి! హైదరాబాదులో ఈ ట్రాఫిక్ ఈ రోజే ఉంది మరి!
పాశ్చాత్య దేశాల్లో దూరాన్ని కాలంతో కొలుస్తారు. మనం మాత్రం కిలోమీటర్లలో కొలుస్తాం. అంటే పది కిలోమీటర్ల దూరాన్ని పది నిమిషాల్లో చేరుకోవడం పాశ్చాత్యులకు సాధ్యమైంది. రెండు కిలోమీటర్ల దూరాన్ని అరగంట దాటినా చేరుకోలేకపోవడం మనకు అలవాటైంది.
సమయం వృథా అవుతున్నా వాడిమీదున్న అభిమానంతో దిగమింగుకున్నాను. కొద్దికొద్దిగా సహనం నశించిపోతుంది. వాడు బ్రతిమాలుతూ మెసేజ్లు పెడుతున్నాడు. మరోపక్క ఉక్కపోత చిరాకును తెప్పిస్తోంది. ఎదురుచూడడం చాలా కష్టమైన పని. ఏం చేస్తాం! ప్రేమాభిమానాలు ఉన్నచోట కొన్ని పట్టు విడుపులు తప్పవు! పక్కనున్న గోడపై కూర్చొన్నాను.
అంతలో అటువైపుగా నలుగురు హిజ్రాలు వచ్చారు. వాళ్ళను చూడగానే ఆడవాళ్ళు బెదిరిపోయారు. కొంతమంది మగవాళ్లు చీదరించుకుంటూ పక్కకు తప్పుకున్నారు. నేనక్కడే కదలకుండా కూర్చొన్నాను. హైదరాబాదు రాకముందు హిజ్రాలంటే ఏవగింపు ఉండేది. కాని వచ్చాక మాత్రం వారి పైనున్న చెడు అభిప్రాయం చెరిగిపోయింది. నిజమైన (అసలైన) హిజ్రాలు ఇలా ఎవరిని పడితే వారిని భయపెడుతూ డబ్బులు గుంజరు. ఎవ్వరినీ ఏమీ అనరు. దుకాణాలకు వెళ్లి, వాళ్ళెంతిస్తే అంత పట్టుకుని వెళ్ళిపోతారు తప్ప నోరెత్తి మాట్లాడరు. బహుశా అలా అటూ ఇటూ కాకుండా ఉన్నందుకు లోలోన బాధపడుతుంటారేమో! అందుకే వారిమీద అపారమైన గౌరవం ఏర్పడింది. ఇప్పుడొచ్చిన వాళ్ళు అసలైన హిజ్రాలు కాదు. వాళ్ళు వేషం కట్టి, డబ్బులు అడుక్కోవడానికొచ్చిన మగవాళ్లే! వాళ్ళెందుకు ఈ వృత్తిని ఎన్నుకున్నారో అప్రస్తుతం!
ధైర్యంగా అక్కడ కూర్చొన్న నాదగ్గరికొచ్చి “ఏయ్.. డబ్బులు..” అంటూ అదో రకమైన చప్పట్లను కొట్టారు. తలను అడ్డంగా ఊపాను. నేను కూర్చొని ఉండడం, వాళ్ళు నా దగ్గరే నుంచొని ఉండడంతో, చొక్కా జేబులో నలబై రూపాయలు కనిపించినట్లున్నాయి.
“ఏంది…! జేబులో డబ్బులు పెట్టుకుని లేవంటున్నావ్?” కాస్త సీరియస్ గా అడిగారు.
తలొంచుకుని కూర్చొన్న నేను వెంటనే తలపైకెత్తి “తల అలా ఊపితే నా దగ్గర డబ్బులు లేవని కాదు. నేనివ్వనని అర్ధం” అంటూ ధీమాగా చెప్పాను.
“ఏం.. ఎందుకు.?” అంటూ ఇంకొకరు అడిగారు.
“అది నా ఇష్టం భయ్యా!” అంటూ బంధుత్వం కలిపాను. ఏమనుకున్నారో ఏమో, కనీసం నోరు తెరిచి మాట్లాడుకోలేదు, సైగ కూడా చేసుకోలేదు. అందరూ వెంటనే వెళ్ళిపోయారు. ‘హమ్మయ్య’ అనుకున్నాను. అశోక్ ఇంకా రానందుకు తిట్టుకున్నాను.
వీళ్ళు వెళ్ళిపోయాక ఓ సన్నివేశం నాలో సంఘర్షణను రేకెత్తించింది. ఒక బిచ్చగత్తె! ఒక్కరేమిటి – ఈ మహానగరంలో వేలల్లో ఉన్నారు. కాని నా దృష్టి ఎవ్వరిమీదా అంతగా పడలేదు. ఆమెమీద తప్ప! కట్టు, బొట్టులన్నీ వాళ్ళ సంప్రదాయం ప్రకారమే ఉంది. తలకు నూనె లేక చింపిరి జుట్టులా రేగిపోయింది. చీరల్లో రకాలు తెలీక ఇక్కడ వ్యక్తపరచలేకపోతున్నాను కాని అదో రకమైన చీర కట్టుకుంది. అదెక్కడ దొరికిందో మరి? చీరను, లంగాను కలిపి కొంచం పైకెత్తి బొడ్డులో దోపుకుంది. శుష్కించిన శరీరం కదా, పాదాల్ని చూడాలి – అయ్య బాబోయ్.. పుల్లల్లా ఉన్నాయి. చూస్తేనే దగ్గర కెళ్లాలనిపించదు.
పోరాటాలన్నీ నిర్దేశించిన కర్మఫలాలు.! విజయాలు పోరాటాలకు ప్రతీకలు..!! ఆమె పోరాటం ఈ రోజు గడవడానికే.! ‘పని చేసుకొని బ్రతకొచ్చుగా?’ వెటకారంగా అడుగుదామనిపించింది. వెంటనే ఓ పెద్దాయన చెప్పిన మాట గుర్తుకొచ్చింది.
“నీకు సాధ్యమైతే బిచ్చం వేయి. లేకపోతే లేదు. అంతేకాని నోటికొచ్చినట్లు వాగకు. ఒకరో వృత్తిని ఎన్నుకున్నారంటే, నేపథ్యం ఏదో ఉంటుంది. ఏం చేయాలో, ఏం చేయకూడదో సృష్టికర్తకు తెలుసు. సాయం చేసే స్థితిలో నీవున్నావు. సాయాన్ని తీసుకునే స్థితిలో వేరేవాళ్ళు ఉన్నారు. ఇది మనకీ వర్తిస్తుంది. వాళ్ళు అడిగేది సాయం. నీ బోడి ఉపన్యాసం కాదు. కర్మఫలాల గురించి మాట్లాడకూడదు. చులకన చేయనే కూడదు” అంటూ ఒకప్పుడు చెప్తే అర్థం కాక వదిలేసినా, అదెందుకో ఇప్పుడు జ్ఞప్తికొచ్చింది.
ఆమె ఆర్ద్రంగా ఎదురుపడిన ప్రతివారినీ, చూసిన ప్రతివారినీ అడుక్కుంటూనే ఉంది. ఎవరి మానాన వారు వెళ్ళిపోతున్నారు. ఈ ఐదు నిమిషాల కాలంలో ఇద్దరూ ముగ్గురూ భిక్షం వేసినట్లున్నారు. అంత దగ్గరగా, అంతసేపు వాళ్ళ వృత్తిని పరిశీలించడంతో వారి వృత్తిపట్ల, వాళ్ళ ఆత్మాభిమానం పట్ల జాలి కలిగింది. ఇంకా ఎవరన్నా ఇస్తారేమోనని చూస్తూనే ఉన్నా. ఆమె నడకలు అందర్నీ దాటుకుంటూ నావైపు పడుతున్న సంగతి అర్ధమైంది. ఎప్పుడూ, ఎవ్వరికీ ఒక్క రూపాయ కూడా దానం చేయని వాడిని, ఇప్పుడీమే అడిగితే ‘చేయాలా.. వద్దా..’ అనే సంకోశం మొదలైంది. మథనం ప్రారంభమైంది.
ఊహించినట్లుగానే ఆమె నన్ను అడిగింది. కాని నా మనస్సే గెలిచింది. రూపాయ్యివడం నాకిష్టం లేదు. నోట్లు తప్ప చిల్లర లేదని నన్ను నేను సముదాయించుకుని సంతోషపడ్డాను. ఆమె నన్ను తిట్టుకోకూడదని, తిట్టుకున్నా మనకవి వినపడకూడదని మొబైల్ తీశాను. అశోక్ రావడానికి టైం పట్టేలా ఉందని కాలక్షేపం ప్రారంభించాను.
ఫేస్‌బుక్‌లో చిన్నవి వీడియోలు మీద వీడియోలు దొర్లిపోతున్నాయి. కొన్ని నవ్వు తెప్పించాయి. ఒకటి ఆలోచించేలా చేసింది. నాలాగే ఆ వీడియోలో ఒకతను ఒకరిగురించి ఎదురుచూస్తూ ఉన్నాడు. ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నాడు. అతను వెయిట్ చేయమంటాడు. ఆకలేయ్యడంతో పక్కనున్న స్వీట్ షాపులో లడ్డూలు కొంటాడు. పక్కనున్న బల్లమీద స్వీట్ బాక్స్ పెట్టగానే ఫోన్ మోగడంతో దాని ఆన్సర్ చేసే పనిలో పడిపోయాడు.
పక్కనే ఇంకొకతను కూర్చొని ఒక్కొక్కటి స్వీట్ తింటుంటాడు. అప్పుడే ఫోన్ మాట్లాడడం అయిపోయిన మొదటివాడు రెండోవాడిని చూసి నిర్ఘాంతపోతాడు. తన స్వీట్స్ తన పర్మిషన్ లేకుండా రెండోవ్యక్తి తింటుంటే కోపంగా అలానే చూస్తుండిపోయాడు. ఎందుకో, ఏమీ అనక అలా చిరాగ్గా చూశాడు. అదే నేనైతే లాగిపెట్టి కొట్టేవాడినే. మొదటి వ్యక్తి కూడా లడ్డూ తీసుకుని రెండోవ్యక్తికీ పోటాపోటీగా తినడం ప్రారంభించాడు. ఇద్దరూ అలా తింటుండగా చివరికి ఒక లడ్దూనే మిగలడంతో రెండోవ్యక్తి దాన్ని రెండు సరిభాగాలు చేశాడు. మొదటివ్యక్తికి సగం ఇచ్చి తను సగం తిన్నాడు. అదేంటి అలా జరిగిందని అలానే ఆతృతగా చూస్తూనే ఉన్నాను. అది అయిపోగానే రెండోవ్యక్తి ఆనందంగా నవ్వుతూ లేచి వెళ్ళిపోతాడు. బాగా చిరాకొచ్చిన మొదటివ్యక్తి, తానూ ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా కోటును బల్లమీద పెట్టినదాన్ని తీస్తాడు. ఆశ్చర్యం.! అక్కడే ఇంకో స్వీట్ బాక్స్ ఉంది. అంటే అప్పటివరకు అతను తిన్న స్వీట్స్ రెండోవ్యక్తి స్వయంగా కొనుక్కున్నవి. అతని పర్మిషన్ లేకుండా ఇతను తిన్నందుకు సిగ్గుపడ్డాడు. మొదట అతని గురించి చెడుగా ఆలోచించినందుకు బాధపడ్డాడు. తొందరపడినందుకు తిట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో తలపైకెత్తి చూశాడు. వెళ్ళిపోతున్న రెండోవ్యక్తి దూరంగా మొదటివ్యక్తిని చూస్తూ, దీవించినట్లుగా రెండు చేతుల్ని పెడుతూ నవ్వుతూ కనుమరుగయ్యాడు. పశ్చాత్తాపంతో తన స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు మొదటివ్యక్తి.
ఇందులో నాకు అర్ధం కానిదుంది. పర్మిషన్ లేకుండా మొదటివ్యక్తి, రెండోవ్యక్తి స్వీట్స్ తింటున్నా అతనెందుకు అడ్డు చెప్పలేదు.? అతనెందుకు కోప్పడి గొడవ చేయకుండా నవ్వుతూ అందించాడు? ఏదో సాధించాననే భావం అతనిలో ఎందుకు స్పష్టంగా కన్పిస్తుంది.? అంత తృప్తిగా ఎలా వెళ్ళగలిగాడు? ఆ మోహంలో అంతటి తేజస్సు ఎక్కడ్నుంచి వచ్చింది? బాబోయ్ ఏంటిది..? అనుకుంటూ హెడ్ ఫోన్స్ బయటకు తీశాను. సిట్యుయేషన్ సింక్ అయ్యినట్లుంది, అందుకే అంత ఆలోచన.
అశోక్ ఏమయ్యోడని అటు ఇటు చూస్తుంటే పక్కనే ఉన్న చెత్తకుండీ దగ్గర బిచ్చగత్తె ఏదో వెతుకుతూ కనిపించింది. ఏం వెతుకుతుందా అని చూస్తూనే ఉన్నాను. ఆనందంగా ఏదో కవర్ ను బయటకు లాగింది. ఆమె కళ్ళల్లో వెయ్యి ఓల్టుల ఆనందం కనిపించింది. విచిత్రంగా ఆమె వంకే చూస్తున్నా. కవర్ ఓపెన్ చేసింది. అందులోది చేతుల్లోకి తీసుకుంది. ఊహించినదే జరిగింది. నిన్న రాత్రి మిగిలిపోయిన రైస్ కవర్లో పెట్టి ఎవరో చెత్తకుండీలో వేయడంతో, ఆకలికి ఆగలేక తీసుకుని తింటుంది. అప్రయత్నంగా వెంటనే పరిగెత్తికెళ్ళాను. చేతిలోనున్న కవర్ లాగేశాను. చుట్టూ అందరూ నా వంకే చూశారు. నేనూ వాళ్ళ వంక అదోలా చూశాను. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయినా, నేనేం చేస్తున్నానో గమనిస్తూనే ఉన్నారు.
“ఏయ్… ఏంటిది తింటున్నావ్?” గద్దించేసరికి వెక్కి వెక్కి ఏడ్చింది. కళ్ళవెంట నీళ్ళు ఉబికొచ్చాయామెకు. నాకూ లోపలేదో తిప్పేసిన భావన కలిగింది. ఎందుకో అమ్మ గుర్తుకొచ్చింది. బెంగ పడ్డాను. ఆకలేస్తుందని పొట్టను చూపిస్తూ చేతులు ఆడించింది. ఇంకేం ఆలోచించలేదు. జేబులో ఉన్న నలభై రూపాయలు ఇచ్చేశాను. తినే మెతుకు మీద పేరు రాసుంటుందని అంటారు. ఈ నలబై రూపాయల మీద ఆ బిచ్చగత్తె పేరు రాసుందేమో! ఆమె పేరు తెలియదు కాబట్టి నోట్ల మీద కనిపించలేదేమో! హిజ్రాలకు దగ్గనిది బిచ్చగత్తెకు దక్కింది.
సంతృప్తి పడితే ఆనందం. పడకపోతే దుఃఖం. మనసారా ఆమె భాషలో నన్ను దీవించి, ఎదురుగానున్న కాకతీయ హోటల్ కెళ్ళింది. ఆమెవంకే చూస్తున్నాను. రైస్ ప్యాకెట్ తీసుకుని పక్కనే చెట్టు నీడకొచ్చి కూర్చొని ప్రేమగా తింటుంది. మంచినీళ్ళు అందించాను. ఆమె నయనాలేం చెప్తున్నాయో అర్ధమైపోయింది. ఆర్ద్రత నిండుకున్నాయి.
పొట్టకూటి కోసం ఎంత తాపత్రయ పడిందో తెలిసింది. అంతమంది నిరాకరించినా క్షమించిన ఆమె గుణం నచ్చింది. చిన్న సాయానికే మనసారా దీవించిన ఆమె మానవత్వం కళ్ళు తెరిపించింది. అన్నీ లిప్తపాటు కాలాల్లో జరిగిపోయాయి. తినడం పూర్తైన ఆమె నన్ను సమీపించి “బాగుండాలి బాబు” అని మళ్ళీ దీవించింది. ఈ సారి నా ఇగో ఓడిపోయింది. శరీరమంతా ఆనందంతో నిండిపోయింది. వీడియోలోనున్న రెండోవ్యక్తి మొహంలోకి ఆ తేజస్సు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలిసిపోయింది.
ఎదుటివారిని ఆదుకున్నప్పుడు, క్షమించినప్పుడు మన మొహంలో దైవత్వం దర్శనమిస్తుంది. అదే నా మొహంలోనూ ప్రతిబింబించింది. కళ్ళు ఆనందభాష్పాలను నింపుకున్నాయి. ఇకంతే కడుపు నిండిపోయింది. అక్కడ్నుంచి లేచి రూమ్ కెళ్లిపోయాను. అశోక్ ఇంకా ట్రాఫిక్ లోనే ఉన్నాడు.