42. కోరిక

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]”ర[/dropcap]మ్యా!… ఏం చదువుతావు తల్లీ? డాక్టరా? ఇంజనీరా?…” కూతురుని ముద్దులాడుతూ అడిగాడు తండ్రి వెంకట్రావు.

“నేను బాగా చదువుకొని ఉద్యోగం చేస్తాను నాన్నా” అంది.

రమ్య మాటలు విని తల్లి శారద, తండ్రి వెంకట్రావు పొంగిపోయారు.

రమ్య పెరిగి పెద్దదవుతూ, రమ్యతో పాటు ఉద్యోగం చేయాలన్న కోరిక కూడా పెరిగి పెద్దదవుతూ వచ్చింది.

రమ్యలో ఉద్యోగం చేయాలన్న కోరిక అంతగా నాటుకుపోవడానికి కారణం లేకపోలేదు.

ఎదురింట్లో ఉండే వనజ, ఆమె భర్త రామారావు ఇద్దరూ ఉద్యోగస్తులే! ప్రొద్దున్నే లేచి స్కూలుకి తయారై, వీధిలో ఆటో కోసం రమ్య వెళ్ళి నిలబడడం, సరిగ్గా ఆ టైమ్‌కే వనజ, రామారావు ఆఫీసుకు వెళ్ళడం కోసం బయటకు రావడం, రామారావు స్కూటర్ స్టార్ట్ చేయడం – వనజ స్కూటర్ ఎక్కడం “టాటా రమ్యా, సాయంకాలం స్కూలు నుండి వచ్చినాక మా ఇంటికి రా! ఆడుకుందాం” అని అనడం వనజకు రోజూ మామూలే!

ఎదురింటి ఆంటీ ఎప్పుడు చూసినా హాయిగా, సరదాగా నవ్వుతూ ఉంటుంది. తల్లి మీద ఆ చిన్నారి మనసుకి జాలివేసి మనసులో అనుకుంది రమ్య – ‘పాపం అమ్మ! ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది’.

సాయంకాలం స్కూలు నుండి వచ్చినాక స్నానం చేసి బట్టలు వేసుకొని, వేడిగా శారద చేసిన దోశలు తిని, “అమ్మా! ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళనా? ఆంటీ రమ్మంది” అంది రమ్య.

“వెళ్ళు!… ఈలోగా వంట పూర్తి చేస్తాను. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. నేను స్నానం చేసి వచ్చేలోగా, నువ్వు వచ్చేయాలి. నీతో హోమ్ వర్క్ చేయించి, చదివించాలి కదా! ప్రొద్దున్నుంచి ఒకటే పని. నీతో హోమ్ వర్క్ చేయించి, చదివిస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది” అంది శారద.

ఇంచుమించు ప్రతీరోజూ తల్లి అలానే అనడంతో రమ్య చిన్నారి మనసు ఆలోచనలో పడేది.

ఎదురింటికి రమ్య వెళ్ళగానే వనజ హాల్లో కూర్చుని టి.వి. చూస్తూ కనబడింది.

“ఆంటీ” అంది రమ్య.

“హాయ్ రా!… రమ్యా!” అని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని “ఊ… కబుర్లు ఏమైనా ఉన్నాయా?” అంది.

“బోలెడు కబుర్లు ఉన్నాయి ఆంటీ!… నా పెన్సిల్ దొంగిలించాడని రవిని కొట్టాను… ప్రియ బర్త్ డే అని చాక్‌లెట్‌లు ఇచ్చింది.”

రమ్య మాటలకు వనజ నవ్వసాగింది.

అంతలో ట్రేలో రెండు కాఫీ కప్పులు పెట్టుకుని రామారావు వచ్చాడు.

“హాయ్ రమ్యా!… ఎప్పుడు వచ్చావు? నీకు కాఫీ కావాలా? ఫ్రిజ్‌లో జ్యుస్ ఉంది. ఇవ్వనా?” అన్నాడు రామారావు.

“నాకు ఏం వద్దు అంకుల్… దోశలు తిని, పాలు తాగి వచ్చాను” అని, “అంకుల్.. నేను ఒకటి… అదే అంకుల్ డౌట్ అడగవచ్చా?” అంది రమ్య.

“అడుగు రమ్యా!” అన్నాడు నవ్వుతూ.

“మరి మీరు కాఫీ చేసి తెచ్చారు.. వంట కూడా చేస్తుంటారు. మరి మా డాడీ ఏ పని చెయ్యరు. ఆఫీసు నుంది వచ్చాకా హాయిగా టి.వి. చూస్తుంటారు. అన్ని పనులు మా మమ్మీయే చేస్తుంది. మా డాడీ మీలాగ ఎందుకు పని చెయ్యరు?” అంది.

వనజ, రామారావు ఒకటే నవ్వసాగారు.

ఎందుకో చెప్పానా రమ్యా! మీ ఆంటీ నాలాగే తనూ ఉద్యోగం చేస్తుందిగా… అందుకే తనతో సమానంగా నాతోనూ పని చేయిస్తుంది. ఏం చెప్పమంటావు  నా బాధలు” అన్నాడు రామారావు నవ్వుతూ.

“ఇప్పుడర్థమయింది ఆంటీ!… పాపం మమ్మీ ఉద్యోగం చెయ్యడం లేదుగా… అందుకే మొత్తం పని మమ్మీయే చేస్తోంది” అంది రమ్య.

ఏం మాట్లాడాలో తెలియదన్నట్టు ఇద్దరు ఒకరి మొహలు ఒకరు చూసుకున్నారు.

***

“మీరు ఎన్ని చెప్పండి! ఇంటెడు చాకిరీ చేయలేక చస్తున్నాను. ప్రొద్దున్నుండి ఒకటే తలనొప్పి… పనిమనిషి జ్వరం అని రావడం లేదు. రమ్యకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తున్నారు, పేరెంట్స్‌ని రమ్మన్నారు, స్కూలుకి వెళ్ళండి అంటే కుదరదు, నువ్వెళ్ళు అంటున్నారు… ఇక్కడి చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టరు… అంది కోపంగా శారద.

“ఇంట్లో ఉన్నదానివి, స్కూలుకి వెళ్ళడానికి నీకే కష్టంగా ఉంటే ఉద్యోగం చేస్తున్నవాడిని… నాకెంత కష్టంగా ఉంటుంది?” అన్నాడు వెంకట్రావు.

“ఎంత జాబ్ చేస్తుంటే మాత్రం, కాస్త కూడా హెల్ప్ చేయరన్న మాట. సరే! … నాకు తగిన ఉద్యోగం నేను వెతుక్కుంటాను” అంది కోపంగా.

“ఆ పని చెయ్యి… అప్పుడు నీకు హెల్ప్ చేయడం గురించి ఆలోచిస్తాను” అన్నాడు.

వాళ్ళిద్దరి మాటలు విన్న రమ్య కాసేపు ఆలోచనల్లో పడింది.

‘పాపం మమ్మీ!… మమ్మీకి ఉద్యోగం లేదు. ఉద్యోగం చేస్తే డాడీ మమ్మీకి హెల్ప్ చేస్తారు’ అని మనసులో అనుకుంది రమ్య.

కాలచక్రం గిర్రున తిరుగుతుంది.

***

“రమ్యా…! ఏమిటి నువ్వు చెబుతున్నది? నీవు ఉద్యోగం చేస్తావా?” అన్నాడు కిరణ్ నవ్వుతూ, ఆశ్చర్యపోతూ.

“ఆ.. చేస్తాను. ఏం ఎందుకు ఆశ్చర్యపోతున్నారు” కోపంగానే అంది రమ్య.

“ఏమిటి రమ్యా… అలా సడెన్‌గా సీరియస్ అయిపోయావు…? అసలు మనకి ఏం తక్కువని? నువ్వు అనవసరంగా కష్టపడడం ఎందుకు?” అన్నాడు.

“అర్థం అయింది… మీ మగవాళ్ళ సంగతి తెలియనిది ఎవరికని? నేను జాబ్ చేయడానికి వెళితే మీ కాళ్ళ దగ్గరకు అన్నీ అందిస్తానో లేదో అని మీ భయం” అంది.

ఒక్క నిమిషం కంగారు పడ్డాడు కిరణ్.

“సారీ!.. నాకు తెలియకుండానే నిన్ను కష్టపడినట్లున్నాను. అసలు… అన్ని పనులు కల్పించుకొని చేస్తావు ఎందుకు? నాక్కూడా చెప్పు రమ్యా!” అన్నాడు కిరణ్.

కిరణ్ అలా అనేటప్పటికి రమ్య మనసు అదోలా అయింది.

‘కిరణ్ చాలా మంచివాడు. పనిలో హెల్ప్ చేయడానికి చూస్తాడు… నిజం చెప్పాలంటే డాడీ లాంటి మనస్తత్వం కాదు. కాని అలా అని చిన్ననాటి నుండి నా మనసులో ఉన్న ఉద్యోగం చెయ్యాలనే కోరిక ఎలా మానుతుంది?’ అనుకుంది.

“ఓకే… ఓకే… అనవసరంగా వర్రీ కాకు. నీకు ఎలా అనిపిస్తే, అలా చెయ్యి రమ్యా…! ఒక్కటి మాత్రం నిజం. నీ ఇష్టాలనీ, సంతోషాలనీ కాదని, అహం చూపించే మగవాడిని మాత్రం కాదు. ఎంతోమంది ఉద్యోగాలు లేక, భార్యాపిల్లలని పోషించుకోలేక, వృద్ధాప్యంలోనున్న తల్లిదండ్రులకు అండగా నిలబడలేక బాధపడిపోతున్న నిరుద్యోగులున్నారు. మనం రోజూ పేపరులో వార్తలు చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది పి.జి.లు చేసినవాళ్ళు కూడా చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకుని కళ్ళలో ఆశ నింపుకుని ఎదురు చూస్తున్నారు. నాకు వచ్చే జీతం మనకి హాయిగా సరిపోతుందున్న ఉద్దేశంతోనే నీవు ఉద్యోగం చేస్తావా అన్నాను. ఐ యామ్ సారీ” అన్నాడు కిరణ్.

ఒక్క నిమిషం కంగారు పడింది రమ్య.

ఏవో నాలుగు మంచి మాటలు కిరణ్ చెప్పాదని తను మెత్తబడుతుందా? ఇంటర్వ్యూ వరకు వచ్చాకా ఆలోచిస్తుందా ఏమిటి?

కారు తాళం తీసుకుని హాలులోకి వచ్చాడు కిరణ్.

ఫైలు ఒకసారి తీసి డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోసాగింది రమ్య.

“పద్మా… పద్మా!” అని గట్టి కేకవేశాడు కిరణ్.

డాక్యుమెంట్స్ చూస్తూనే, “పద్మ వాళ్ళ అమ్మకి బాగోలేదట. త్వరగా పనంతా చేసి వెళతానంటే సరే అన్నాను” అంది రమ్య.

“ఏం లేదు… కాఫీ కలిపి తీసుకువస్తుందని” అన్నాదు.

వాచీ వైపు చూసి, ‘ఒకపక్క ఇంటర్వ్యూకి టైమవుతుంటే, మరో పక్క కాఫీ అంటున్నాడు ఏమిటి కిరణ్? ఎంతైనా మగవాడు కదా’ అనుకుంది మనసులో.

“టెన్షన్ ఫీలవకు… ముందు కాఫీ తాగు…” అని కాఫీ కప్పు రమ్య చేతికిచ్చాడు కిరణ్.

“మీరు కాఫీ చేశారా… మరి మీకు?” అంది.

నవ్వుతూ అన్నాడు – “చేశాను. కాని నీ అంత బాగా చెయ్యలేను. నీ కోసమే కాఫీ చేశాను… కాఫీ తాగితే నీకు బాగుంటుందని.. తాగు త్వరగా… చల్లారిపోతుంది…”

“థ్యాంక్స్ కిరణ్. మీకు ఆఫీసుకు టైమ్ అయింది… నేను ఆటోలో వెళతాను…” అంది.

“ఒక గంట లేట్‌గా వస్తానని ఆఫీస్‌కి ఫోన్ చేసి చెప్పాను” అన్నాడు.

ఏం మాట్లాడాలో తెలియని దానిలా ఒక్క క్షణం కిరణ్ వైపు చూసి కారు దగ్గరికి నడిచింది రమ్య.

***

అదొక పేరు పొందిన వారపత్రిక ఆఫీసు. సబ్ ఎడిటర్ పోస్ట్‌కి అప్లయి చేసింది రమ్య. పి.జి. అయినాక జర్నలిజం చేసింది. కథలు, సీరియల్స్ వ్రాసి పత్రికలకు పంపడం, అవి ప్రచురితమవడం జరిగింది. సబ్ ఎడిటర్ పోస్ట్‌కి ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు…!

ఇంటర్వ్యూ పది నిముషాలుందనగా ఇంచుమించు నలభై ఏళ్ళు దాటిన వ్యక్తి పాతబడిన తెల్లని బట్టలకు నీలిమందు పెట్టిన పాంటు షర్టూ వేసుకుని, చేతికి పురాతన వస్తువును గుర్తుకు తెచ్చే పాత వాచీ పెట్టుకుని, బాగా అరిగిపోయిన చెప్పులు వేసుకుని గబగబా నడుకుని వచ్చి “ఇంటర్వ్యూ మొదలుపెట్టలేదు కదండీ. రెండు బస్సులు మారి వచ్చేటప్పటికి లేట్ అయింది” అని రమ్య వైపు చూస్తూ అన్నాడు.

“లేదండి” అంది రమ్య.

“హమ్మయ్య” అని కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచాడు. అతని కళ్ళలో ఏదో ఆశ కనబడుతోంది. అతను కాకుండా ఇంకా కొంతమంది అబ్బాయిలు వచ్చారు. ఆ వ్యక్తి అబ్బాయిలతో మాట్లాడడం ప్రారంభించాడు. వచ్చిన అబ్బాయిలెవరికి రచనల్లోగాని జర్నలిజంలో గాని ఏ అర్హతలు లేవు. ఒకొక్కరు పిజి చేశారు. కొందరు ఎంబిఎ చేశారు. ఇక మిగిలింది తను… ఆ వ్యక్తి…

అబ్బాయిలతో మాట్లాదాక ఆ వ్యక్తి మొహం సంతోషంతో నిండిపోయింది. ఏదో గుర్తు వచ్చినవాడిలా గబాలున రమ్య వైపు తిరిగి – “మీరు ఏం చదివారండి? రచనలు ఏమైనా చేస్తారా?” అన్నాడు.

“ఎం.ఎ. చేశాను. జర్నలిజం చేశాను. చాలా పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తుంటాను” అంది రమ్య.

ఒక్కసారిగా ఆ వ్యక్తి ముఖం మాడిపోయింది.

“నేను డిగ్రీ చేశాక జర్నలిజం చేశాను. రచనలు చాలా చేశాను. ఒక దినపత్రికకు సబ్-ఎడిటర్‌గా చేశాను. ఉద్యోగం దొరికింది, ఎలాగో ఒకలాగు జీవితాన్ని నెట్టుకు రావచ్చు అనుకున్న సమయంలో లాస్ వచ్చిందని ఆ పత్రికను మూసేసారు. అప్పటి నుండి ఉద్యోగం వేటలో ఉన్నాను. ‘ఎందుకో పొద్దున్నుంచి కుడికన్ను అదురుతుంది, ఉద్యోగం నీకే వస్తుందిరా’ అని మా అమ్మా; ‘మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుందని నా మనసు చెబుతోంది’ అని మా ఆవిడా; ‘నేను ఎదురువస్తే నీకు ఉద్యోగం వస్తుంది’ అని మా చెల్లీ; ‘నాన్నకు నేను ఎదురు వస్తాను’ అని మా అమ్మాయి తెగ హడావిడి చేశారండి. అయినా అనుకున్నవన్నీ జరగవు కదండీ” అన్నాడు.

కుటుంబం అంతా ఆ వ్యక్తికి వచ్చే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు, వాళ్ళందరికీ అతనొక్కడే ఆధారం. కాని తను…

నెల వచ్చేటప్పటికి అరవై వేలు జీతం తెచ్చి తన చేతిలో పెట్టి – “సేవింగ్స్, ఇన్‍కమ్ టాక్స్… అన్ని కటింగ్‌లు పోనూ అరవై వేలు చేతికి వచ్చింది… ప్లీజ్! రమ్యా! ఇంటి మెయిన్‌టెనన్స్ చేయడం నాకు అస్సలు తెలియదు. ఎలా మేనేజ్ చేస్తావో…” అనే కిరణ్ గుర్తుకువచ్చాడు.

కిరణ్ చెప్పింది నిజం. ఈ ఉద్యోగం తనకి అవసరమా? ఇక్కడున్న వాళ్ళల్లో ఆ వ్యక్తికి,,, తనకి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తను తప్పుకుంటే… ఈ ఉద్యోగం ఆ వ్యక్తికే తప్పకుండా వస్తుంది… అవసరానికి ఉద్యోగం చేస్తే మంచిదే! చిన్నప్పటి నుండి తనతో పాటు పెరిగిన ఉద్యోగం చేయాలన్న కోరిక ఎందుకో ఆ వ్యక్తిని చూశాకా నీరుగారిపోయింది… గభాలున కుర్చీలో నుండి లేచి నాలుగడుగులు వేయబోయేంతలో..

“అదేంటండీ… ఇంటర్వ్యూకి టైమ్ అవుతోంది… ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?” అన్నాడు ఆ వ్యక్తి.

‘ఏం లేదు… ఉద్యోగం చేయాలన్న కోరిక ఈ నిమిషంలో నాలో నుండి మాయం అయిపోయింది’ అని అనాలనుకుంది, కానీ అనలేకపోయింది.

ఒక్క నిమిషం తడబడి, “ఏం లేదండీ… ఎందుకో ఉద్యోగం చేయాలనిపించడం లేదు. అన్నట్లు ఈ ఉద్యోగం తప్పకుండా మీకే వస్తుంది.  బెస్ట్ ఆఫ్ లక్” అని అడుగులు వేసింది.

బయటకు వెళుతున్న రమ్య వైపు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా చూడసాగాడు.