[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]కృ[/dropcap]ష్ణాజిల్లాలో విజయవాడకు 20 మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరిలో చంద్రయ్య అనే కౌలు రైతు ఉన్నాడు. అదృష్టానికి ఒక చెయ్యి అడ్డం పెట్టి, దురదృష్టాన్ని ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భార్య మెడలో బంగారాన్ని అమ్మి పొలంపై పెట్టుబడి పెట్టి, తీరా పంట చేతికి వచ్చే సమయానికి వరదలు వచ్చి పంట అంతా కొట్టుకుపోయింది. దీనికి తోడు పేకాట ఆడుతాడు. ఇల్లు అమ్ముకుని సొమ్మంతా పేకాటలో పోగొట్టుకున్నాడు. పేకాటలో చెయ్యి తిరిగిన నాడు ఇల్లంతా పండుగ. తిరగని నాడు ప్రభుత్వం వారు ఇచ్చే బియ్యం, కందిపప్పే గతి.
ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ టి.వి.లో వస్తున్న సీరియల్ చూస్తున్నాడు. సీరియల్‌లో ఒక మాంత్రికుడు ఒక ఇష్టరూపధారిణి అయిన పాముని చంపడానికి గుడి గోపురంపై గల కలశం కావాలని అంటాడు. అంతే కాదు, గుడిపై ఉండే కలశానికి – మెరుపులు ఉరుములతో కూడిన వర్షం పడినప్పుడు – విద్యుత్‌శక్తి లభిస్తుందని, దాని విలువ కోట్లలో ఉంటుందని అంటాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని కోరిక ఉన్న చంద్రయ్య సీరియల్ లోని ఈ కలశానికి లింకయ్యాడు. నిజంగా అది అంత శక్తి కలిగి ఉంటుందా? దానిని అమ్మితే అంత డబ్బు వస్తుందా? అని ఆలోచించడం మొదలుపెట్టాడు. రాత్రంతా ఫోన్‌లో యుట్యూబ్‌లో ఈ విషయాన్ని శోధించాదు. పదో తరగతి చదివిన చంద్రయ్యకు ఫోన్‌లో అంతంత మాత్రంగానే అర్థమయింది. దీని గురించి వివరం కోసం ఈ నెంబరును సంప్రదించండి అని ఫోన్లో చూశాడు.
వెంటనే ఆ నెంబరుకి ఫోన్ చేశాదు. అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తి ఒక అడ్రసుకి రమ్మన్నాడు. చంద్రయ్య అనుకొన్నదే తడవుగా ఆ అడ్రసుకు వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తిని కలిశాడు.
“నా పేరు చంద్రయ్య. మీ పేరు?” అని అడిగాదు ఆ వ్యక్తిని.
ఆ వ్యక్తికి 45 – 50 ఏళ్ళు ఉంటాయి. చంద్రయ్య అడిగిన ప్రశ్నకు బదులుగా “నా పేరు సూర్యనారాయణ్. మాది గుంటూరు. ఈ బిజినెస్ పని మీద విజయవాడలో ఉంటున్నా. చెప్పండి మీకు ఏ సమాచారం కావాలి?” అని అడిగాడు.
“నిన్న టివిలో కలశానికి మెరుపులు, ఉరుముల వల్ల విద్యుత్‌శక్తి లభిస్తుందని, అలాంటి కలశాన్ని అమ్మితే కోట్లు ఉంటుందని చూశాను. నిజంగా కలశం అన్ని కోట్లు ఉంటుందా?” అని ఆశ్చర్యమైన ముఖంతో అడిగాడు.
“అవును వర్షంతో పాటు పిడుగులు పడినప్పుడు గుడిపై ఉంచిన రాగి వస్తువు కలశం, గోపురం.. ఇలా కొన్ని వస్తువులు విద్యుత్‌ని గ్రహించి విలువైన వేరొక లోహంగా మారుతుంది. దానిని అమ్మితె కోట్లకు పడగలెత్తవచ్చు. కాని ఆ వస్తువును నేరుగా వ్యాపారాలకు అమ్మలేము. నేను ఒక మధ్యవర్తిని. నా పై వేరొక వ్యక్తి ఉంటాడు. అతను ఇలాంటి వస్తువులను కొనే వ్యక్తులతో డీలు మాట్లాడి చెప్తాడు. కొంత పెట్టుబడి కూడా అవసరం.”
“పెట్టుబడి అంటే వందలా లేక వేలా?” అంటూ వెకిలిగా అడిగాదు చంద్రయ్య.
“లక్షలు” అని చల్లగా సమాధానమిచ్చాడు సూర్య.
“వామ్మో! లక్షలే… నా లాంటి వాడు పెట్టలేడుగా” అన్నాడు ఖంగుతిన్న గొంతుతో చంద్రయ్య.
“అందుకే ఐదు నుండి పదిమంది కలిసి పెట్టుబడి పెట్టి వచ్చిన సొమ్మును పంచుకుంటారు. కోట్లు రావాలంటే లక్షలు పెట్టాలిగా మరి” అని, “ఇంతకు మీ దగ్గర అలాంటి వస్తువేమైనా ఉందా?” అని అడిగాదు సూర్య.
“లేదు.ఇంతకీ అది శక్తి గల కలశం అని ఎలా కనిపెట్టాలి?” అడిగాడు చంద్రయ్య.
“ఫోన్లో యుట్యూబ్‌లో దాని గురించి చూడండి. దాని ప్రకారం ఆ కలశాన్ని పరీక్షించి ఆ తర్వాత నా వద్దకు తీసుకురండి. దానికి తగిన శక్తి ఉందో లేదో పరీక్షించి అప్పుడు కంపెనీ వాళ్ళకు పంపుతాం. వాళ్ళు మనకి హవాలా ద్వారా డబ్బు పంపుతారు. ఈ విషయం బయటవాళ్ళకు తెలియకూడదు. అప్పుడే ఆ డబ్బు మనకి అందుతుంది. లేదంటే సమస్యలు వస్తాయి. ముందు మీరు వస్తువును తీసుకురండి. మిగతా వివరాలు తర్వాత చెప్తాను. ‘ఇక మీరు వెళ్ళిరండి’ అన్నాడు సూర్య.
***
అలాంటి కలశాన్ని ఎలా గుర్తించాలో గూగుల్‌లో శోధించాడు. తన ఊరిలో ఉన్న గుడి ఒక్కొక్కటిగా ఉన్న గుడి గోపురాలను పరీక్షించాడు. ఈ తంతు రాత్రులు అంతా నిద్రపోయే సమయంలో చేసేవాడు. తనతో పాటు తన పేకాట స్నేహితులను భాగస్వాములను చేసుకున్నాడు. చివరకు ఒక్క గుడి మిగిలింది.
రాత్రి ఒంటిగంటకు ఆ గుడి వద్దకు వెళ్ళి గుడి గోపురంపైకి ఎక్కి కలశాన్ని పరీక్షించారు. వారి పరీక్ష సఫలమయింది. అది కోట్లు తెచ్చే కలశమే. క్రిందకి దిగి స్నేహితులకు ఈ విషయం చెప్పాడు. అంతా ఆనందంతో చిందులు వేశారు.
దానికి నకిలీ కలశాన్ని చేయించి దాన్ని గుడిపై ఉన్న అసలు కలశం స్థానంలో ఉంచి, అసలు కలశాన్ని సూర్య వద్దకు తీసుకువెళ్ళారు.
సూర్య ఆ కలశాన్ని పరీక్షించి “ఇది 70% మాత్రమే నేను చెప్పిన విలువైన లోహంగా మారింది. నూరు శాతం మార్పువస్తేనే దీనిని అమ్మగలం, కానీ అందుకు కొంత సొమ్ము అవుతుంది” అన్నాడు.
“ఎంత?” అడిగాడు చంద్రయ్య.
“రెండు లక్షలు” చెప్పాడు సూర్య.
“రెండు లక్షలా? మా దగ్గర అంత సొమ్ము లేదు. ఇంకోదారి లేదా?” అడిగాడు చంద్రయ్య.
“లేదు. మీరు ఎలాగైనా ఆ డబ్బు ఏర్పాటు చెయ్యండి. మిగతా విషయాలు నేను చూసుకుంటా” అంటూ వారికి తన ప్లాన్‌ను వివరించాడు.
అందరూ కలిసి “మన ఇళ్ళల్లో ఎంత డబ్బు ఉందో పోగు చేద్దాం. తర్వాత మిగతా పని చూద్దాం” అనుకున్నారు.
మొత్తం కలిపి యాభై వేలయ్యాయి. చంద్రయ్య దగ్గర మాత్రం చిల్లిగవ్వ లేదు.
“చంద్రయ్యా, మిగతా సొమ్ము నువ్వే ఎలాగొలా ఏర్పాటు చెయ్యి” అన్నారు మిగతావాళ్ళు.
“నేనా, నా దగ్గర రూపాయి కూడా లేదే! సరే ఎవర్నో ఒకర్ని అడుగుతా” అన్నాడు. ఎవరిళ్ళకి వాళ్ళు చేరారు.
రాత్రంతా చంద్రయ్య ఆ కలశం గురించే ఆలోచిస్తూనే ఉన్నాడు. తన బావమరిది స్టేట్‍బ్యాంక్ ఉద్యోగి. తనను సహాయం అడిగాలని నిర్ణయించుకున్నాడు.
తెల్లవారిందో లేదో బావమరిదికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాని అతను ఇదంతా నమ్మలేదు సరికదా పకపకా నవ్వాడు.
“నిజం బావా! నేనెప్పుడూ ఇంతలా నవ్వలేదు. కోట్లు సంపాదిస్తావా? అది కూడా ఇంట్లో కూర్చునే. జోకు చాలా బాగుంది” అన్నాడు రాజేష్.
“రాజేషూ, నా మాట నమ్మరా… నిజంగానే కోట్లు వస్తాయిరా. కావాలంటే గూగుల్‌లో చూడు. తర్వాతే డబ్బులివ్వు…” అన్నాడు చంద్రయ్య.
రాజేష్ గూగుల్‌లో చూశాడు. కానీ ఆ మధ్యవర్తి మోసం చేయడని నమ్మకమేమిటి అని అనుమానం వచ్చింది. చంద్రయ్యను నేరుగా కలిసి మాట్లాడాలని అనుకున్నాడు. బావ ఇంటికి బయల్దేరాడు.
“బావా ఇదంతా అయ్యే పని కాదు గాని, ఏదైనా పని ఇప్పిస్తా, చేసుకో. మా చెల్లి చిక్కి సగం అయ్యింది. పిల్లలు ఎదుగుతున్నారు. ఇలాంటి యవ్వారాలు ఇప్పుడు నీకు అవసరమా?” అన్నాడు చంద్రయ్యకు నచ్చజెప్పుతూ.
“నా మాట నమ్ము రాజేష్. నిజంగానే కోట్లు వస్తాయి. లక్షన్నర కావాలి. ఎలాగొలా ఏర్పాటు చెయ్యి. నీకు పది కోట్లు ఇస్తా” అన్నాడు ఆశ చూపుతూ.
“పది కోట్లు తెచ్చి ఎక్కడ పెట్టుకోమంటావు? బీరువాలోనా? లేక గొడౌన్‌లోనా?” అంటూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు రాజేష్.
“ఈ ఒక్కసారి ఇవ్వు. మీ చెల్లికి మళ్ళీ కట్నంగా ఇచ్చానని అనుకో. ప్లీజ్. ఇంకెప్పుడూ నిన్ను ఏ సాయం అడగను గాక అడగను. ఒట్టు” అని రాజేష్‌కి ఒట్టేశాడు.
“సరే బావా. ఈ ఒక్కసారికి ఎలాగొలా లక్షన్నర ఇస్తా, కాని ఆ మధ్యవర్తి మనల్ని మోసం చేస్తేనో? అందుకని అతనితో స్టాంపు కాగితంపై సంతకం పెట్టించు, డబ్బులు కూడా నేరుగా అతనికే ఇస్తాను. సరేనా?” అన్నాడు.
రాజేష్‌ని తీసుకుని మధ్యవర్తి దగ్గరకు వెళ్ళాడు చంద్రయ్య. రాజేష్ చెప్పినట్లు స్టాంపు కాగితంపై అతను సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకున్నాడు. ఈ పని జరగడానికి నెల పడుతుందని చెప్పాడు. సరే అని ఇద్దరూ ఇంటికి బయల్దేరారు.
నెల తర్వాత సూర్య చంద్రయ్యకు ఫోన్ చేశాడు.
“వస్తువు తయారయ్యి వచ్చింది. దానిని కంపెనీవాళ్ళకు పంపాము. వాళ్ళు ఈ వస్తువును చెక్ చేసి తర్వాత మన వద్ద సంతకాలు పెట్టించుకుని అప్పుడు డబ్బులు పంపుతారు. ఇంతకీ మనకి వచ్చే డబ్బు ఎంతో చెప్పలేదు కదా! 200 కోట్లు. కోటి కోసం కలలు కంటూ ఉండు…. ఖర్చు పెట్టాలిగా. మీ పది మందికి మనిషికి 20 కోట్లు వస్తాయి” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
చంద్రయ్య నోరు తెరిచి నిర్ఘాంతపోయాడు. ఇరవై కోట్లే… ‘బాబోయ్! వీటిని ఎంత ఖర్చుపెట్టినా తరగవు. మా ఆవిడకు సంవత్సరానికి సరిపడా నగలు, చీరలు తీసుకుంటూ పెద్ద బిల్డింగు కడతా. వంద ఎకరాలు పొలం కొంటా’ అంటూ ఊహల్లో విహారం మొదలుపెట్టాడు. బావమరిదికి ఫోన్ చేసి కబురు చెప్పాడు.
రాజేష్‌కి మాత్రం ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా బావ బాగుపడతాడని ఆశతో నమ్మాడు. నెలలు గడుస్తున్నాయి. అతని నుండి ఏ కబురు లేదు.
చంద్రయ్య ఆరు నెలల తర్వాత మధ్యవర్తికి ఫోన్ చేశాడు.
“నీకే చేద్దామని అనుకున్నా చంద్రయ్యా. కంపెనీ వాళ్ళు వచ్చారు. ఇక్కడే ఉన్నారు. వస్తువు తీసుకుని బాండు రాస్తున్నారు. నీ ఆధార్ నెంబరు మెసేజ్ చెయ్యి” అని చెప్పాడు సూర్య.
అంతులేని ఆనందంతో సూర్య చెప్పినట్టు నెంబరు పంపాడు. సాయంత్రం సూర్య ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ రింగ్ అయింది. సూర్య ఫోన్. లిఫ్ట్ చేశాడు.
“చంద్రయ్యా. వస్తువు తీసుకున్నారు. డబ్బు రేపు, ఎల్లుండిలో పంపుతామన్నారు. డబ్బు దించడానికి ప్లేస్ కావాలి. ఎక్కడైనా చూడు” అని సూర్య ఫోన్ పెట్టేశాడు.
చంద్రయ్యా, అతని బావమరిది ఇంటి కోసం వెదకసాగారు. ఇంటి కన్నా పెద్ద గొడౌన్ మేలని ఎవరికీ అనుమానం రాదని వారు భావించి గొడౌన్ వెతుకులాటలో పడ్డారు.
గుంటూరు దగ్గరలో ఒక గొడౌన్ వెతికి పట్టుకున్నారు. సూర్యకు దానిని చూపించారు. రేపు ఎల్లుండి ఎప్పుడైనా వచ్చేయచ్చు, రెడీగా ఉండండి” అని వారిలో ఆశల్ని ఇంకా పెంచాడు సూర్య.
చంద్రయ్యకి నిద్ర కూడా పట్టడం లేదు. భార్యను పదే పదే లేపి, “ఆ డబ్బు ఏం చేద్దాం? మీ అమ్మకి, మా చెల్లికి, మీ అన్నయ్యకి అందరికీ ఇద్దాం సరేనా..” అంటూ విసిగించడం మొదలుపెట్టాడు. రేపు, ఎల్లుండి అంటూ మధ్యవర్తి ఏకంగా సంవత్సరం గడిపాడు. రాజేష్‌కి సందేహం ఎక్కువైంది. అతను మోసం చేస్తున్నాడని భావించాడు. చంద్రయ్యను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి బయల్దేరాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. సమయం ఉదయం 11.30 నిమిషాలు. గ్రీన్ లైట్ వెలిగింది. రాజేష్ బండి స్టార్ట్ చేశాడు. పోలీస్ స్టేషన్‌కి కరెక్టుగా 20 అడుగుల దూరం ఉంది. ఇంతలో ఒక ఆవు వారి బండికి అడ్డం వచ్చింది. అది ఆవులా కాక కామధేనువులా వెలిగిపోతోంది. ఇంతలో ఫోన్ రింగయ్యింది. చంద్రయ్య ఫోన్ ఎత్తాడు.
“హలో చంద్రయ్యా. శుభవార్త. డబ్బు గుంటూరులో దిగింది. రండి మా ఇంటికి. పార్టీ చేసుకుందాం” అన్నాడు సూర్య పట్టలేనంత సంతోషంతో.
“సరే” అని ఫోన్ పెట్టేసి రాజేష్‌కు విషయం చెప్పాడు. ఇద్దరూ తెల్లమొహం వేశారు. కొంచెం సేపు ఆగితే, ఒక్క క్షణంలో అంతా బూడిదలో పోసిన పన్నీరు అయి ఉండేది. ఆ ఆవు రావడం మన అదృష్టం అని అనుకుని ఆవు కోసం చూస్తే, ఆవు కనబడలేదు. ఇద్దరూ ఆశ్చర్యంతో సూర్య దగ్గరకు వెళ్ళారు. మరుసటి రోజు వారు అనుకున్న విధంగా డబ్బు గొడౌన్‌కు దింపి ఎవరు డబ్బు వారు ఇంటికి తెచ్చుకున్నారు. చంద్రయ్య వాళ్ళ ఆవిడ ఆ డబ్బును చూసి, “ఆ కలశం ఉత్త కలశం కాదు, మన పాలిటి కామధేనువు” అంటూ ఎగిరి గంతులేసింది. అదృష్టం పడితే ఎవరూ ఆపలేరు. మన చంద్రయ్య కూడా అంతే.