Site icon Sanchika

44. కర్తవ్యం

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]యాం[/dropcap]కర్ కృతి మా కాలేజీ ఆవరణలో ‘ప్రణయ్ హత్య’ గురించి అభిప్రాయాలు తీసుకుంటుంది. ప్రిన్సిపల్ అనుమతితోనే కాబట్టి లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు. మాట్లాడే స్టూడెంట్స్ కానీ, లెక్చరర్స్ కానీ వారి వారి అభిప్రాయాలను చాలా ఉద్రేకపూరితంగా, ఉద్విగ్నంగా వెల్లడిస్తున్నారు. వారి అభిప్రాయాల్లో ఉభయపక్షంగా అనుకూల, అననుకూల వాదనలు వెలువడుతున్నాయి. ప్రిన్సిపల్ మాత్రం బయటకు రాలేదు సరికదా ఆయన దగ్గరకే వచ్చిన యాంకర్‌తో “నైతిక విలువలను నేర్పడానికి ఒక పీరియడ్ పెట్టాలనుకుంటున్నానమ్మా. దానిలో టైమ్ విలువ, వేషధారణకు కోడ్, పాజిటివ్ థింకింగ్ ప్రధానాంశాలుగా ఉంటాయి” అని విరమించుకున్నారు. యాంకర్ ఎంత బ్రతిమాలినా మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఏదో రాసుకోవడంలో నిమగ్నమయ్యారు. కృతి అసంతృప్తితో వెనుదిరిగింది. ‘ఇంత ఉద్రిక్త వాతావరణంలో అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు గురుడు…చెప్మా…!’ అనుకుంది యాంకర్ కృతి. ‘పైగా ఏజ్ కూడా కాదు. 50 సంవత్సరాలకు మించి ఉండవు. విచిత్రమైన శాలీ…’ అని భుజాలు ఎగరేసి వ్యాన్ దగ్గరకు చేరింది కృతి. అదే విషయాన్ని సిఇఒ వెంకటకృష్ణ దృష్టికి తెచ్చింది. సిఇఒ ‘అవునా’ అంటూ ఆలోచనలో పడ్డారు. మరల మరల కృతి ప్రిన్సిపల్‌తో మాట్లాడిన క్లిపింగ్ చూసి సాలోచనగా తలపంకించాడు.

మరుసటి రోజు పెన్ వీడియోకెమెరాతో ప్రిన్సిపల్‌ను కాలేజి టైమ్‌కు ఒక అరగంట ముందే సిఇఒ కలిశారు. అపాయింట్ మెంట్ దొరకడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

వెంకటకృష్ణ వెళ్లేటప్పటికే రచయిత యండమూరి వీరేంద్రనాథ్, కళ్యాణచక్రవర్తి, విరించి సైకాలజిస్ట్ కూడా ప్రిన్సిపల్ రూమ్‌లో ఉన్నారు. కించిత్ ఆశ్చర్యానికి లోనయినప్పటికీ అది పైకి కనిపించకుండా ‘మేథావి వర్గానికి వందనాలు’ అంటూ ప్రవేశించిన వెంకటకృష్ణను సాదరంగా ఆహ్వానించారు అందరూ. ప్రిన్సిపల్ బజర్ ప్రెస్ చేయగానే ఆఫీసు బాయ్ శంకర్ బిస్కెట్స్, టీ సర్చ్ చేసి వెళ్లాడు.

స్థాన గౌరవాన్ని పాటిస్తూ ముందుగా ప్రిన్సిపల్ మాధవరావు గారు మాట్లాడారు. “వెంకటకృష్ణ గారూ! కాలేజీ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి వీరిని సంప్రదించాను. మీరు నిన్న నాకు ఫోన్ చేసిన తరువాత వీరు కూడా ఈ సమయములో ఉంటే బాగుంటుందనిపించింది. ఈ విషయం మీ దృష్టికి తీసుకురానందుకు అన్యధా భావించకండి” అన్నారు చిరునవ్వుతో.

“భలేవారే సర్ ! నాకొక మేథాహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినందుకు మీకే నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి” అన్నారు నవ్వుతూ వెంకటకృష్ణ.

“చెప్పండి సర్! దేశమంతా అట్టుడుకుతున్న అమృత- ప్రణయ్ సంఘటన విషయంలో ఎందుకు మీ అభిప్రాయాలను ఎవరితోను పంచుకోవడానికి ఇష్టపడటం లేదు? విజ్ఞులయిన మీరు ఏదో నిగూఢమైన సంకల్పంతో ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఈ సంఘటన అనంతరం మీరు కాలేజి మొత్తానికి సంబంధించి తీసుకోబోతున్న ఇందాక మీరన్న కీలక నిర్ణయాలేమిటీ? అవి భవిష్యతరాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి?”

“మీరన్నట్లు నిగూఢమైన సంకల్పం అని అనను కానీ, ఈ గడ్డపై మనిషిగా పుట్టి, ఒక స్థాయిలో ఉన్నందుకు- అసాధారణంగా మారిపోతున్న సామాజిక పరిస్థితులపైన, అనాగరికంగా మారుతున్న అసాంఘిక శక్తుల పైన కొన్ని అభిప్రాయాలను వెల్లడించాలనుకుంటున్నాను. అది నా కర్తవ్యం కూడా. మొదటిది మీరే సూచించినట్లు ఈ హత్యను దేశమంతా అట్టుడకాల్సిన స్థితికి మీరు తీసుకురావడం ఎంత వరకు సమంజసం? ఇది కొత్త కానీ వింత కాని కాదు. పురాణాల కాలం నుంచి ఉన్నదే. చరిత్ర చూస్తే మనదేశ ప్రధానులుగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ. వీరి విషయమే తీసుకుంటే ఇందిరాగాంధీ ప్రేమ వివాహ విషయంలో నెహ్రూ అంగీకరించనందునే గాంధీజి ఫిరోజ్ గాంధీని మతప్రమేయం లేకుండా దత్తత తీసుకొని వివాహం జరిపించిన సంగతి మనందరం చదువుకున్నదే. అప్పుడు వారిలో ఏ ఒక్కరు వివేకాన్ని మరిచినా ఇప్పటికీ చెలామణి అవుతున్న ‘గాంధీ’ పేరు ఎప్పుడో కనుమరుగయ్యేదేమో మీరు ఒప్పుకోరేమో కానీ యువతను తప్పుదారి పట్టించడంలో ప్రధాన పాత్ర మీడియాదేనని నా అభిప్రాయం.”

“పర్వాలేదు చెప్పండి. పూర్తిగా కాకపోయినా కొంత వరకు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. నేను మీడియా ప్రతినిధిని మాత్రమే కాదు. ఈ సంఘంలో ఒక మనిషిని ప్లస్ ఒక తండ్రిని కూడా చెప్పండి. ప్లీజ్, మీడియా ఏమి చేస్తే బాగుంటుంది? ఏమి చేయకపోతే బాగుంటుందని మీ అభిప్రాయం.”

“స్టూడెంట్స్‌ను, యువతని ఒకరి తరువాత ఒకరిగా వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి మీరు చేసే పరిష్కారమేమైనా ఉందా! లేదు కదా! లేకపోగా వారి లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. వారి అలోచన విధానాన్ని తికమక పెడుతుంది. గంటలు… రోజులు… నెలలు తరబడి ఇవే విషయాలు చర్చలుగా సాగుతున్నాయి. చదువు వైపు దృష్టి పోకుండా అసాంఘిక ఆలోచనలు రేకెత్తించడానికి దోహదపడుతున్నాయి. ఉన్నవి లేనివీ సోషల్ మీడియాలో విపరీత ధోరణిలో రావడం, వాటిపై పదే పదే చర్చలు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఇవ్వన్నీ యువత జీవన విధానానికే ప్రమాద హేతువులు.

ఏమి చూపిస్తే బాగుంటుందని అడుగుతున్నారు కదా! ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చట్టబద్ధమైన చర్యలు చూపించండి. వాటిలో అవకతవకలు జరిగితే వెలికి తీయండి. అనపార్లమెంటరీ వర్డ్స్ ఎవరు మాట్లాడినా వాటికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చూపండి. ముఖ్యంగా యూట్యూబ్లో అశ్లీల పోస్టర్ల నియంత్రణ విషయంలో త్రికరణ శుద్ధిగా పోరాడండి. కాలేజ్, యూనివర్సిటీ స్టూడెంట్స్‌కు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అవసరమవుతున్న  చదువుకు సంబంధించిన సమాచారం మాత్రమే మొబైల్స్‌లో ఉండే ఏర్పాటు చూడండి.

కవి రాసినట్లు “గుండె గుప్పెటంత… ఊహ ఉప్పెనంత”.

పూర్వం కోరికలు గుర్రాలయితే – వాటికి కళ్లాలేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఊహల ఉప్పెనలో కొట్టుకుపోయే యువతను కాపాడే శక్తి మాత్రం ఒక్క మీడియాకే ఉంది. భావితరాన్ని, భారతావనిని మీడియా మత్తు అనే ముసుగుకింద సమాధి కానీయకండి… భరత మాత కడుపుకోత తీర్చడంలో మీ వంతు కర్తవ్యం సమయోచితంగా నిర్వర్తించమని ఒక ఉపాధ్యాయుడిగా వేడుకుంటున్నాను” అని చేతులు జోడించారు ప్రిన్సిపల్. వెంకటకృష్ణ నోటి వెంట మాటరాలేదు, కానీ కంటిలో సన్నటి నీటి పొర తళుక్కుమంది. వెంటనే ప్రిన్సిపల్ చేతులు తన చేతులతో బంధించి ‘తప్పని సరిగా సర్’ అని మాత్రం అన్నారు.

పిల్లల మంచి ప్రవర్తనైనా, చెడు ప్రవర్తనైనా దానికి ప్రథమ కారకులు తల్లిదండ్రులు, రెండవ స్థానం ఉపాధ్యాయులు, మూడవది సమాజం. మీరు వాస్తవాన్ని అంగీకరించే సహృదయులని మాకు తెలుసు అంటూ వారి వారి అభిప్రాయాలను సున్నితంగా తెలిపారు యండమూరి, తదితరులు కూడా. వారి అమూల్యమైన మాటలతో కర్తవ్య సూర్యునిలా అక్కడి నుంచి నిష్క్రమించారు వెంకటకృష్ణ.

Exit mobile version