[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]
[dropcap]“అ[/dropcap]మ్మా ఎంతసేపటికి ఫోన్ తీయవేమిటి, నువ్వు ఏమైపోయావో అని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను” అంటూ గది లోకి వచ్చిన స్వప్నకి తన తల్లి పరధ్యానంగా వుండడం చూసి, “అమ్మా ఒంట్లో బావుందా, ఎంటమ్మా అలా పరధ్యానంగా వున్నావు” అంటూ తల్లి భుజం మీద చెయ్యి వేసి కదిపింది స్వప్న. స్వప్న తల్లి లలిత స్పృహ కోల్పోయి స్వప్న మీదకి ఒరిగిపోయింది. స్వప్న గాబరా పడుతూ మొహాన నీళ్ళు కొట్టి తడుతూ పిలిస్తే లలితకి తెలివి వచ్చింది. స్వప్న కంగారు పడుతూ గబగబా లోపలి వెళ్లి జ్యూస్ తెచ్చి లలితకి తాగించి కుర్చోపెట్టింది .
“అమ్మా ఒళ్ళు కాలుతోంది, నీకు జ్వరం వచ్చింది, వుండు డాక్టర్ అంకుల్ని పిలుస్తాను” అని డాక్టర్ శర్మ గారికి ఫోన్ చేసింది. ఒక అరగంటలో డాక్టర్ వచ్చి చూసి సీజనల్ చేంజ్ వల్ల వైరల్ ఫీవర్, కాకపోతే లలిత చాల వీక్గా వుంది, మంచి విశ్రాంతి అవసరం అని చెప్పి మందులు ఇచ్చారు. స్వప్న అమ్మ దగ్గరే వుండి జాగ్రత్తగా చూస్కుంది. లలిత మెల్లిగా తేరుకుంది.
“అమ్మా రేపు కాంపస్‌కి వెళ్తావా నీ షెడ్యూల్ ప్రకారం, నేను స్టూడియోకి వెళ్తాను.”
లలిత విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది, స్వప్న ఎఫ్.మ్ రేడియోలో రేడియో జాకీగా పని చేస్తోంది. స్వప్న దీనితో పాటు మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. డిగ్రీ చేసాక డాన్స్‌లో డిప్లొమా చేసింది. రేడియోలో స్వప్న షో కి మంచి క్రేజ్. ఈ మధ్యనే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. అలాంటి ఒక డాన్స్ ప్రోగ్రాంలో పరిచయం అయ్యాడు కృష్ణ. తను ఒక ఈవెంట్ మేనేజర్, స్వప్న డాన్స్‌కి ఫిదా అయిపోయాడు. అలా తనతో స్నేహం నెమ్మదిగా ప్రేమ వైపు అడుగులు వేస్తోంది అనే అనుమానం వచ్చింది స్వప్నకి. ఏ విషయం అయిన మొదటి తన తల్లితో చెప్తుంది స్వప్న. అలాగే కృష్ణ గురించి తన భావాలను తన తల్లికి చెప్పింది స్వప్న.
అలా చెప్తునప్పుడు స్వప్న అడిగింది “అమ్మా నాన్న ఎక్కడుంటారు, నా పెళ్లి గురించి మీ ఇద్దరు వెళ్లి మాట్లాడాలట కదా, నా ఫ్రెండ్ స్నేహ చెప్పింది, నువ్వు నన్ను ఇన్నాళ్ళు ఎంతగా ప్రేమించావు అంటే అసలు నాన్న అనే వ్యక్తి నా జీవితంలో లేరు అనే తేడా తెలియలేదు, అసలు నాన్న ఎక్కడ పనిచేస్తారు అమ్మా, మీరిద్దరూ విడిపోయారా” అని అడిగింది స్వప్న.
ఊహించని ఈ ప్రశ్నకి లలిత స్థాణువైపోయింది. తన చిన్నారి తల్లి పెద్దదైంది అని అర్ధమైంది ఈ ప్రశ్నతో. ఆ రోజు నుండి ముభావంగా ఉంటోంది. ఇప్పుడు ఇలా జ్వరం, నీరసం ఇవి చూసాక స్వప్నకి అసలు ఎంతో ఆరోగ్యంగా వుండే తన తల్లి ఎందుకిలా అయిపోయిందో ఒక బేతాళ ప్రశ్న అయి కూర్చుంది. ఆ విషయమే కృష్ణతో చెప్పింది. “కృష్ణా అమ్మ ఎందుకో ఈ మధ్య డీలా పడింది, అది కూడా నేను నాన్న గురించి ప్రస్తావన తెచ్చినప్పటి నుండి. నేను అనవసరంగా అమ్మని కదిపాను ఏమో” అని బాధ పడింది. కృష్ణ వెంటనే “ఏయ్ స్వప్నా… ఎందుకు దిగులుపడతావు. అసలు మీ అమ్మగారి గతం ఏంటో కూతురుగా నువ్వు తెలుసుకుంటే దానికి పరిష్కారం ఆలోచించవచ్చు. అమ్మ కొంచెం కోలుకున్నాక, ఆవిడని ఏదైనా హాలిడేకి తీసుకెళ్ళు. నేను రావొచ్చు కాని ఆవిడ నేను వుంటే నీతో మాట్లాడలేకపోవచ్చు. నాకు ఫోన్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయి” అన్నాడు.
“హాఁ నిజమే కృష్ణా. ఎలాగో ప్రోగ్రాం కోసం ఈ నెల బెంగుళూరు వెళ్ళాలి, కాబట్టి అమ్మని కూడా తీసుకెళ్తాను” అంది.
***
“అమ్మా నేను ఎల్లుండి బెంగుళూరు వెళ్ళాలి, కొంచెం నువ్వు నాతో రావా, నాకు వేరే ఊరు వెళ్ళడం కొత్త కదా, నాకు కొంచెం ధైర్యంగా వుంటుంది. పైగా మనం ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదు, నా ఫ్రెండ్ చెప్పింది ప్రోగ్రాం అయిపోయాక చాముండి హిల్స్ చూడొచ్చు అని, అమ్మా అమ్మా ప్లీజమ్మా రావా” అంటూ మారం చేసింది స్వప్న. తన ముద్దులపట్టి కోరికను కాదనలేకపోయింది లలిత. ఇద్దరు కలిసి బెంగళూరు అటు నుండి మైసూరు వెళ్లారు. బెంగుళూరులో దిగాక లలిత కొన్ని చోట్ల కన్నడంలో మాట్లాడడం చూసి స్వప్నకి మతి పోయింది. తన తల్లిని ఎప్పుడు ఇలా చూడలేదు. మొత్తానికి ప్రోగ్రాం అయిపోగానే అనుకున్న ప్రకారం మైసూరు వెళ్ళడానికి టాక్సీ చేయించుకున్నారు, తామిద్దరే వుండడం వల్ల అప్పటివరకు తనలో దాగిన ప్రశ్నలు అడగాలని నిర్ణయించుకుంది
“అమ్మా నీకు బెంగుళూరు బాగా తెలుసా, అసలు నీకు కన్నడం ఎలా వచ్చు? అసలు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‍వి అని నేను అనుకుంటున్నా. కాని నువ్వు నా దగ్గర చాల విషయాలు దాస్తున్నావు. పో అమ్మా.. నేను అలిగాను” అంటూ బుంగ మూతి పెట్టింది స్వప్న. అప్పటివరకు కార్‌లోంచి చుట్టూ ప్రకృతిని చూస్తున్న లలిత కొంచెం అలోచించి “నా బంగారు తల్లి స్వప్న… ఇంకా చిన్న పిల్లే అనుకున్నా. కాని పిల్లలు కళ్ళ ముందే పెరిగిపోతారు అందులోను ఆడపిల్లలు మరీ త్వరగా పెరిగిపోతారు, సరే నీకు నా గురించి, నీ గురించి కూడా కొన్ని నిజాలు చెప్తాను. కొంచెం నెమ్మదిగా విను.”
“మా కుటుంబం విశాఖపట్నంలో వుండేది. మా నాన్నగారు వృత్తి రీత్యా జడ్జిగా పని చేసారు, అమ్మ నాన్నకి తగిన ఇల్లాలు. నేను లిటరేచర్ మీద ఇష్టం కొద్ది బియే ఇంగ్లీష్ చేసాను. మాస్టర్స్ చేద్దాం అనుకునే లోపు మా నాన్నగారి స్నేహితుడు శేషాద్రిగారు మా ఇంటికి వచ్చారు. వాళ్ళ అబ్బాయి మంజునాథ్‌కి నన్ను అడిగారు, నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పైగా పేరు పలుకుబడి ఉన్న సంబందం. ఇప్పట్లో లాగ పెళ్ళికి ముందు కలవడం లాంటివి పెద్దగా వుండేది కాదు. అలా కనీసం ముఖ పరిచయం లేకుండా ఉత్త ఫోటో చూసి పెళ్లి ఖాయం చేసేసారు మా నాన్నగారు. పెళ్లి ఘనంగా చేసారు, వాళ్ళు వ్యాపార రీత్యా బెంగుళూరులో ఏనాడో స్థిరపడిపోయారు, మంజునాథ్ గారు వాళ్ళ నాన్నకి వ్యాపారంలో సాయం చేసేవారు. పెళ్లి రోజు కనీసం కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు, నేను పక్కన కూర్చుంటే నన్ను పెద్దగా పట్టించుకోలేదు. మా వాళ్ళు మనుగుడుపులు అంటే కొంపలు మునిగిపోయాయి అంటూ హడావిడిగా అప్పగింతలు పెట్టించుకుని నన్ను తీసుకుని బెంగుళూరు తీస్కోచ్చేసారు.
మొదటి రాత్రి కనీసం నన్ను తాకలేదు, ఒక సరదా సరసం లేదు, బహుశా తనకి నేను నచ్చలేదేమో లేక ఇంకెవరినైన ఇష్టపడ్డారేమో అని సరిపుచ్చుకున్నా. కాని రాను రాను కొన్ని నెలలలోనే మా అత్తమామలు పోరు పెరిగింది పిల్లల కోసం. తన పరిస్థితి చెప్పలేకపోయాను.
ఇక భరించలేక ఒక రోజు తెగించి అతనిని అడిగేసా – “మీకు నేను నచ్చలేదా? ఎందుకు పెళ్ళి చేసుకున్నారు? నేనేమైన పొరపాటు చేస్తే చెప్పండి. దిద్దుకుంటాను. నన్ను చూసి మీరు ఎహ్యంగా మొహం పెట్టడం నేను తట్టుకోలేను” అని నిలదీసాను. ఆ ప్రశ్నకి చిన్నబుచ్చుకున్న అతని మొహం పాలిపోయింది. కాసేపు ఏమి మాట్లాడలేదు, ఇంతలో ఎవరో పిలిచినట్లు బెదిరి పారిపోయాడు. అసలు నాకు ఏమి జరుగుతోందో తెలియదు. ఊరు తెలియదు, దుఃఖం వచ్చేస్తోంది. ఇప్పటిలాగా ఫోన్‌లు పెద్దగా లేవు. నాన్నగారు కొంచెం పాత కాలం నమ్మకాలు గల మనిషి. రోజు కోర్టులో విడాకుల కేసులు చూసి మండిపడేవారు. అలా పెంచిన తల్లితండ్రులు నాదే తప్పు అని తిట్టేవారు. అయితే ఇప్పుడు నేను నా విషయం చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో అని ఒక భయం. ఇలాంటి కన్ఫ్యూషన్‌లో నేనుండగా ఒక రోజు ఇంటి దగ్గర గుడికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్దావిడ పరిచయం అయ్యారు, కట్టుబొట్టు చూడానికి హుందాగా పెద్ద ముత్తైదువ లాగ వుండేవారు. ఆవిడే సుందరి గారు. ఆవిడకి తమిళ్, కన్నడంతో పాటు తెలుగు కూడా వచ్చు. చాలా కలుపుగోలు మనిషి. నా పరిస్థితి చూసి ఒక రోజు పక్కన కూర్చుని తల మీద చెయ్యి వేసి నిముర్తు “ఏమైంది కన్నమ్మా, ఎల్లా సౌఖ్యమేనా” అని అడిగే సరికి ఆవిడా ఆప్యాయతకి నేను కరిగి నీరై నా పరిస్థితి మొత్తం చెప్పాను. అప్పటికి ఉరుకోపెట్టి మర్నాడు నన్ను చదువుకోమని ప్రోత్సహిచారు, ఇంట్లో మా అత్తయగారు కొంత బెట్టు చేసినా మా అత్తగారిని ఒప్పించారు, ఇంట్లో పని చేసుకుంటూ ఎం.ఏ. ఇంగ్లీష్ చేశా. నా భర్తకి నా గురించి పట్టింపు లేదు కాబట్టి నేను ఏమి చేసిన అతనికి పట్టేది కాదు, సుందరి గారు ఇంగ్లీష్ టీచర్ నాకు ఇంగ్లీష్, కన్నడం ఇలా వచ్చాయంటే ఆవిడ ఇచ్చిన తర్ఫీదే కారణం. ఎం.ఏ. పట్టా వచ్చే లోపు తెలిసింది ఏంటంటే మావారు మగాడు కాదు అని, అందుకే ఈ వింత ప్రవర్తన అని. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని చిన్నబుచ్చడం నాకు ఇష్టం లేదు.
నా పుట్టింటికి వచ్చి నాన్నగారికి విషయం చెప్పాను. వెంటనే విడాకులు అప్లై చేయించారు, మళ్లీ పెళ్లి చేస్తాను అని గొడవ చేసారు. నాకు మనసు విరిగి పోయింది, పెళ్లి వద్దు, నేను ఒక బిడ్డని దత్తత చేస్కుంటా అని చెప్పాను, అమ్మా నాన్న ఒప్పుకోలేదు. ఇలా గొడవ సాగుతోంది, నా ఎం.ఏ. పట్టా వచ్చింది. విశాఖలోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరాను. ఇంతలో మా పెద్దమ్మ కూతురు దేవి అక్క, తన భర్త ఒక కార్ ప్రమాదంలో మరణించారు అని తెలిసి విజయనగరం వెళ్ళాము, అక్కడ వాళ్ళకి ఒక 8 నెలల పాప వుంది వారికి. ఆ పాపని చూడాల్సి వస్తుందని ఎవరికీ వాళ్ళే తప్పుకుంటున్నారు, నేను ఎలాగో దత్తు తీసుకుందాం అనుకున్న కదా. అలా నా ఇంటికి వచ్చింది నా చిట్టి తల్లి స్వప్న” అంటూ స్వప్నని దగ్గరికి తీసుకుని ముద్దాడింది. తన తల్లి కధ విని స్వప్న కంట నీరు ఆగలేదు.
***
తన తల్లి బాధ చూసి తన కృష్ణతో చెప్పింది “నాకు ఏమి చెయ్యాలో తెలియట్లేదు కృష్ణ నువ్వే ఏదో ఒక సలహా చెప్పు” అంది స్వప్న.
“అది సరే స్వప్నా. మీ అమ్మగారు మొన్న ఎందుకు అనారోగ్యం పాలయ్యారో ఆలోచించు. అసలు ఇన్నేళ్ళ నుండి ఈ విషయం దాచిన ఆవిడ నువ్వు పెళ్లి గురించి మాట్లాడిన దగ్గర నుండి మథన పడుతున్నారు అని చెప్పావు. ఆవిడకి మనసుకి నచ్చిన ఎవరైనా వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో తారసపడితే బహుశా ఆవిడ ఒంటరి జీవితానికి ఒక తోడు దొరుకుతారుగా ఆలోచించు” అన్నాడు.
నిజమే కృష్ణ చెప్పే వరకు తను ఈ విషయం అలోచించ లేదు మెల్లిగా ఇంట్లో తన తల్లి డైరీ తీసి చదివింది. అది పద్ధతి కాదు అని తెలిసినా తన తల్లి మనసు గ్రహించేందుకు స్వప్నకి తప్పలేదు. 2012 సంవత్సరంలో తనతో పాటు యూనివర్సిటీలో పనిచేస్తున్న పృథ్వీ అనే అతను లలితకి పరిచయం అయ్యాడు. చాల కలుపుగోలుగా లలితతో అత్యంత సన్నిహితంగా వుండేవాడు, అతను పక్కనుంటే లలితకి అసలు సమయం ఎలా గడుస్తోందో తెలిసేది కాదు. అలా ఒక రోజు మాటల మధ్యలో లలితని తను ఇష్టపడుతున్నాను అని తనకి సమ్మతమైతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడని రాసుకుంది డైరీలో. కాని లలిత తన కూతురు గురించి చెప్పి, ‘తనకి పెళ్లి చేసే వయసులో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి’ అని వారి మధ్య ఆ ప్రస్తావన అక్కడితో ఆపేసింది. అక్కడి నుండి పృథ్వీకి కొంచెం దూరంగా వుండడం మొదలెట్టింది. ఇది గమినించిన పృథ్వీ నువ్వు నాకు ఎప్పుడు మంచి స్నేహితురాలివే, ఏదో మనసు ఉండబట్టక ఆ రోజు బయటపడ్డాను, అంత మాత్రాన నేను విలన్‌ని కాదు. నాకు జీవితం కొన్ని సంసార భాద్యతల వల్ల మొదట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. తర్వాత వయసు దాటాక నన్ను చేసుకునేందుకు ఎవరు ఒప్పుకోవట్లేదు అంటూ నవ్వేసాడు.
ఈ మధ్య స్వప్న తన తండ్రి గురించి అడిగి ఇద్దరు వెళ్లి సంబంధం మాట్లాడాలి అని చెప్పినప్పటి నుండి స్వప్నకి ఎలా చెప్పాలో తెలియక మథనపడిపోయింది లలిత. తన తల్లి ఉన్నత వ్యక్తిత్వానికి తనని పెంచిన ప్రేమకి చంద్రునికో నూలు పోగు అన్నట్టుగా తన మనసుకి దగ్గరైన పృథ్వీని ఇచ్చి వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకుంది స్వప్న. తన నిర్ణయాన్ని కృష్ణ మరియు తన మావయ్య (లలితకి పెదనాన్న కొడుకు అయిన) గోపాలానికి కుడా చెప్పింది. వారు కూడా ఎంతో ఆనందించారు, అయితే ఆ మర్నాడు గోపాలం గారు వెళ్లి పృథ్వీతో పెళ్లి గురించి మాట్లాడారు. తనకి లలిత అంటే ప్రాణం అని తనని ఒప్పించేలా ఏమి చేయమన్నా చేస్తాను అని చెప్పాడు. ఒక పది రోజుల్లో లలిత పుట్టినరోజు వుంది గనుక ఆ రోజు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే లలిత దీనికి ఒప్పుకుంటుందో లేదో అనీ చిన్న అనుమానం లేకపోలేదు.
అందుకే మర్నాడు పృథ్వీ తనకి పెళ్లి కుదిరిందని లలితని తనతో షాపింగ్ చేయడంలో సాయం చేయమని అడిగాడు. ఆ మాట వింటూనే లలిత మొహం పాలిపోయింది. కాని కనిపించకుండా ఉండేందుకు చాలా తాపత్రయం పడింది లలిత. మెల్లిగా పృథ్వీ తన నుండి దూరం అవుతాడేమో అనే భయం కలిగేలా మెలగసాగాడు పృథ్వీ. ఆ ఊహే తట్టుకోలేకపోతోంది లలిత. అయితే లలితకి తెలియకుండా మిగిలిన వారు నిర్ణయించిన రోజు రానే వచ్చింది స్వప్న లలితతో “అమ్మా ఇవాళ నీ పుట్టినరోజు కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము” అంటూ తీసుకెళ్ళింది. గుడిలో ఒక మండపం దగ్గర పెళ్లి హడావిడి నడుస్తోంది.
అది చూపించి “అమ్మా నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, నువ్వెందుకు నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు, అటు చూడు అక్కడ పెళ్లి వారి సందడి. జీవితంలో ఒకసారి తప్పు జరిగింది అని ఎప్పుడు అదే జరుగుతుందా, అయినా నా కోసం నీ జీవితం త్యాగం చేసావు, ఇన్ని చేసిన నీకు నేను ఇచ్చే చిన్ని కానుక – నువ్వు కోల్పోయిన నీ జీవితంలో కొంతైన తిరిగి ఇవ్వడం. అమ్మా నా కోసం నువ్వు పృథ్వీ గారిని పెళ్లి చేసుకో” అంటూ తల్లి కళ్ళలోకి చూసింది.
లలిత కళ్ళలో నీటి సుడులు తిరుగుతున్నాయి. “కాని స్వప్నా, నేను ఈ వయసులో అలా చేసుకుంటే నీ జీవితం ఏమవుతుంది” అంటూ వుండగా
“స్వప్న జీవితం హాయిగా వుంటుంది నాతో, నాది హామీ ఆంటీ, మీరు కంగారు పడొద్దు. ముందు మీ పెళ్ళి. ఆ తర్వాత మాది. అది మీరు ఇద్దరు దంపతులుగానే చెయ్యాలి” అంటూ పృథ్వీని పిలిచాడు కృష్ణ.
అనుకోని ఈ పరిణామానికి ఉక్కిరిబిక్కిరి అవుతోంది లలిత.
“పృథ్వీ మీకు పెళ్లి కుదిరింది అని చెప్పి షాపింగ్ చేసారు కదా, మళ్ళీ ఇదేంటి” అని అడిగింది.
పృథ్వీ వెంటనే “అవును పెళ్ళికూతురు లేకుండా పెళ్లి ఎలా? ఇదిగో ఈ పెళ్లి కూతుర్ని ఒప్పించేందుకు నాకు ఇంత టైం పట్టింది. ఇంకొంచెం వయసైతే నాకు మూడో కాలు వచ్చేస్తుంది” అంటుంటే
“అందుకే ‘శుభస్య శ్రీఘ్రం’ అన్నారు పెద్దలు. ఇవాళ కూడా మంచి రోజే ఇదిగో ఇలా కూర్చోండి” అంటూ వచ్చి మంగళ సూత్రం అందించారు గోపాలం దంపతులు.
అలా లలిత పృథ్వీలు దంపతులయ్యారు. వారికి పెళ్లి చేసి తనని పెంచిన తల్లి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేసింది స్వప్న.