47. పెళ్ళంటే వ్యాపార బంధం కాదు

0
3

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

[dropcap]“ఏ[/dropcap]మిటండీ ఇది… శుభమా అంటూ మన బంధువర్గాన్నందరినీ వెంటబెట్టుకొని పెళ్లికి తరలి వచ్చాము. రాత్రికి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అదనంగా మరో పదిలక్షలు కట్నం కావాలని అడిగితే బాగుంటుందా అండీ? వాళ్లు మన గూర్చి ఎంత చీప్‌గా అనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి” అంది మాణిక్యమ్మ భర్త వైపు ఇబ్బందిగా చూస్తూ.

కొడుకు పెళ్లి కోసం బంధుమిత్రులను వెంటబెట్టుకొని ఉదయం ఎంత వేడుకగా తరలి వచ్చారు… మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా ఎంతో సందడిగా అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు హఠాత్తుగా భర్త ఇలా మాట్లాడేసరికి అంత ఉత్సాహమూ నీరు కారి నిరాశ కమ్మేసింది ఆమెకు. భర్త ఆలోచనలు ఈ రకంగా మార్పు చెందాయని ఆమె గమనించలేకపోయింది.

ఎదురుకోలు సన్నాహాల్లో ఆడపెళ్లివారు చేసిన ఏర్పాట్లు చూసి వెంకట్రావు కళ్లు చెదిరిపోయాయి. వాళ్లు తాము ఊహించినదానికంటే ఐశ్వర్యవంతులని… తాము చాలా తక్కువ కట్నానికి ఈ పెళ్లికి ఒప్పేసుకున్నామనే భావన అతడి మనసులో తలెత్తింది. అతడి సన్నిహితులైన ఒకరిద్దరిని సంప్రదించాడు… తన ఆలోచన కరెక్టో కాదో తెలుసుకునేందుకు. వాళ్లు కూడా తానంటే తందాన అన్నట్లుగా అతడి మాటనే బలపరిచారు. ఇంక అప్పటి నుండీ మొదలు పెట్టాడు వెంకట్రావు… మరో పది లక్షలు ఇస్తేగానీ, పెళ్లి జరగదని. అందుకే భార్య మాటలు ఏమాత్రం పట్టించుకోలేదతడు.

“ఛత్, నువ్వు నోరు ముయ్యి… ఆడపెత్తనం పంబల వాయిద్యం అని అన్నిటికీ బోడి సలహాలిస్తావు… ఎవరు ఎవరేమనుకుంటే నాకేమిటి? ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనం బాగుపడలేము. ఆ క్రిష్ణప్రసాద్ ఎంత అడిగినా ఇవ్వగలడట… మీరెందుకు ఇంత తక్కువకు ఒప్పుకున్నారని అంతా ఒకటే పోరు పెడుతున్నారు” అన్నాడు వెంకట్రావు.

“ఆ చెప్పేవాళ్లకి పనీపాటా లేక ఏదో అంటే… అది పట్టుకొని మీరు ఇలా వేల్లాడడం ఏమీ బాగోలేదు. మనకి మంచి సంబంధం కుదిరిందని ఓర్వలేక వాళ్లు ఏదో అని ఉంటారు. అయినా కానీ, ఇంకా అదనంగా కట్నం అడిగేందుకు మనకున్న అర్హతలేమిటండీ?

అ రోజు పాతిక లక్షల కట్నమిచ్చి వాళ్ల కంపెనీలో మంచి ఉద్యోగమిస్తానని చెప్పగానే మనం ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాం… మన వాడు చదివిన డిగ్రీకి అదే ఎక్కువ అనుకున్నాము. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని కొన్ని గంటలలో ముహూర్తం పెట్టుకొని ఇలా కట్నం కోసం పేచీ పెట్టడం సరైందేనా? ఇలా చేస్తే మన బంధువర్గంలో మనకేమైనా విలువ ఉంటుందా?” అంటూ కొడుకు వైపు తిరిగి “ఏంట్రా నవీన్, అంతా వింటూ బెల్లం కొట్టిన రాయిలా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావు… మీ నాన్నగారి ఆలోచన సరైందేనంటావా?” అంది మాణిక్యమ్మ బాధగా.

“నేను చేస్తే మాత్రం నాన్న వింటాడా అమ్మా, అయినా నాన్న అడిగిందాంట్లో తప్పేముంది? వచ్చే చోట ఎంత వీలైతే అంతా రాబట్టుకోవాలి… మనం మగపెళ్లివాళ్లం అనే మాట మర్చిపోతే ఎలా?” అన్నాడు నవీన్ దర్పంగా.

ఆ మాట వినడంతోనే తండ్రీ కొడుకులకు ధనదాహం ఎంతగా తలకెక్కిపోయిందో అర్ధమైపోయింది ఆమెకు. నిస్సహాయంగా ఇద్దరి వంక చూసింది.

కొడుకు తన మాటకు వత్తాసు పలకడంతోనే వెంకట్రావుకి మరింత బలం చేకూరినట్లయింది. “విన్నావు కదా వాడి మాట… నువ్వు వాళ్లతో ఏం చెబుతావో, ఏమో! మనం అడిగిన సొమ్ము ఇస్తేనే మన వాడు ఆ పిల్ల మెడలో తాళి కడతాడని చెప్పు… అంతే! ఇందులో మరోమాటకి తావు లేదు” అన్నాడు ఖండితంగా

దాంతో మాణిక్యమ్మకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. “బాగుంది తండ్రీకొడుకుల వరస… చేసేదంతా మీరు చేస్తూ, ఆ భారం అంతా నామీద పెట్టి నన్నడగమంటున్నారా కట్నాన్ని? చూసేవాళ్లకి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లుగా… టి.వి.సీరియల్స్‌లో ఆడవిలన్‌లా నేను కట్నం కోసం పేచీ పెడుతున్నట్లుగా ముద్ర వేయించుకోవాలా? నా వల్ల కాదు, నేను అడగను!” అంది.

అలా అడగనని తాను చెప్తే… వాళ్లేమైనా తమ ఆలోచనలు మార్చుకుంటారేమోనని ఆశపడిందామె.

భార్య మాటలు విన్న వెంటనే కోపంగా ఆమె వైపు చూస్తూ “నీకు చేతకాకపోతే నోరు మూసుకుని కూర్చో… నేనే వెళ్లి తేల్చుకొస్తాను!” అన్నాడు వెంకట్రావు విసురుగా లేస్తూ.

అతడికి చాలా నమ్మకంగా ఉంది, పెళ్లి కూతురి మేనమామ క్రిష్ణప్రసాద్ తాము ఎంత అడిగితే అంతా కా దనకుండా ఇస్తాడని.

అక్కడే ఉన్న అతడి దూరపు బంధువు చిదంబరం “నువ్వు అడిగితే ఏం బావుంటుంది బావా… నీ తరుపున నేను వెళ్లి అడుగుతానులే!” అన్నాడు భరోసాగా.

ఆ మాట వినడంతోనే ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది వెంకట్రావుకి. “సరే బావా, నువ్వెళతానంటే నాకు బెంగలేద … పని సాధించుకు వస్తావనే నమ్మకం నాకుందిలే!” అన్నాడు ఉత్సాహంగా.

క్రిష్ణప్రసాద్ విడిదింట్లో దిగిన పెళ్లివారికి మర్యాదలు జరిపించడంలో తలమునకలై ఉన్నాడు. పనివాళ్లు ఎందరున్నా ఇంటి అలంకరణ దగ్గర నుండి భోజనాల వరకూ అన్నీ అతడే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు.

“చూడండి, ఎక్కడా ఏ లోపం జరగకూడదు… పిల్లకు తండ్రి లేడన్న లోటు తెలియకుండా అన్నీ ఘనంగా జరిపించామని మగపెళ్లివారు పదినాళ్లు మనగూర్చి చెప్పుకోవాలి… మనం మధ్యాహ్నం పెట్టిన భోజనాలకే వాళ్లు గుమ్మయిపోయారు. ఇక రాత్రి భోజనాలకి మనం చేసిన ఏర్పాట్లు చూస్తే ఏమంటారో చూడాలి” అన్నాడు అతడు ఉత్సాహంగా మాట్లాడుతూ.

అతడి మాటలకి అంతరాయం కలిగిస్తూ చిదంబరం వచ్చాడక్కడికి. అతడ్ని చూడడంతోనే ఎంతో మర్యాద చేసి కూర్చోబెట్టాడు క్రిష్ణప్రసాద్.

మామూలు సంభాషణలు జరిగాక అసలు సంగతి బయటపెట్టాడు చిదంబరం. మరో పదిలక్షలు ఇస్తేగానీ – పెళ్లి జరగదని అతడి చెప్పిన మాటలు వినడంతోనే… అంతవరకూ ప్రసన్నవదనంతో మాట్లాడిన క్రిష్ణప్రసాద్ ఉగ్రుడయ్యాడు.

“ఏమనుకుంటున్నారండీ వాళ్లు… బంగారంలాంటి పిల్లనిచ్చి లక్షల కట్నంతో పాటు, ఉద్యోగమిచ్చి పెళ్లి చేస్తామంటే ఆనాడు సరేనని ఆనందంగా ఒప్పుకున్నారు… తీరా ఇప్పుడు పెళ్లికి తరలి వచ్చాక ఈ మడత పేచీలన్నీ ఏమిటండీ? పీటల మీదకు వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఇష్టం లేక వాళ్లెంత అడిగితే అంతా గంగిరెద్దులా తలాడిస్తూ ఇచ్చేస్తాననుకుంటున్నారా ఏమిటి? ఇంత ఖర్చు పెడుతున్న నాకు వాళ్లు అడిగిన పదిలక్షలు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు… కానీ, మాట నిలకడ లేకుండా ఇలా అడ్డుగోలుగా చేస్తున్న ఆ మనుష్యులకు ఎంత ఇచ్చినా దండగే! ఇదిగో చిదంబరంగారూ, ముందు ఒప్పుకున్నదానికి మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇష్టమైతే చేసుకోమనండి… లేదా వచ్చిన దారినే వెళ్లమనండి, నాకేమీ అభ్యంతరం లేదు” అన్నాడు ఉగ్రంగా చూస్తూ. అతడి కేకలు విని అతడి భార్య వసుంధరా, అక్క శ్రీలక్ష్మి “ఏం జరిగింది?” అంటూ ఆదుర్దాగా వచ్చారు.

“ఏం జరిగిందా? మన కరుణకి కాబోయే అత్తగారూ, మామగారూ మనం ఇస్తానన్న పాతిక లక్షలూ కాక మరో పది లక్షల కట్నం అదనంగా ఇస్తేనే పెళ్లి జరుగుతుందని, లేకపోతే లేదని ఇదిగో ఈయనతో కబురు పెట్టారు” అంటూ చిదంబరాన్ని చూపించాడు.

“రాత్రికి పెళ్లి పెట్టుకొని ఇప్పుడిలా పేచీలకు దిగుతున్నారు. ఇలాంటి మాట నిలకడ లేని వాళ్లకు మన పిల్లనిస్తే ఏం సుఖపడుతుంది? అందుకే వచ్చినదారిని వెళ్లమంటున్నాను”అన్నాడు క్రిష్ణప్రసాద్ ఆవేశంగా.

అతడి ఆవేశం చూసి చిదంబరం మెల్లగా అక్కడి నుండి తప్పుకున్నాడు.

తమ్ముడి మాటలు విన్న శ్రీలక్ష్మి నిశ్చేష్టురాలైంది. చివరికి ఎలాగో గొంతు పెగుల్చుకుని “ఏమిట్రా క్రిష్ణా ఇలా జరిగింది… ఇపుడీ పెళ్లి ఆగిపోతే ఈ జన్మలో దానికి మనం పెళ్లి చేయగలమా? నేను వెళ్లి ఆ మాణిక్యమ్మ కాళ్ల మీద పడతాను… కాస్త కనికరించమని” అంది కన్నీళ్లతో అందరి వంకా చూస్తూ,

“అవునండీ, నేనూ వదినగారూ వెళ్లి వాళ్లతో మాట్లాడతాము … ఈ పెళ్లి ఆగిపోతే నలుగురిలో మనకెంత నగుబాటు?” అంది వసుంధర.

“లాభం లేదు వసూ… వాళ్లకి డబ్బు తప్ప మరేమీ అవసరం లేదు. అలాంటివాళ్లకు మన పిల్లనివ్వడం లాంటి బుద్ది తక్కువ మరొకటి లేదు. పిల్లాడు బుద్ధిమంతుడు, ఏ దురలవాట్లూ లేవని తెలిసి… అతడికి డిగ్రీ తప్ప పెద్ద క్వాలిఫికేషన్లు ఏమీ లేకపోయినా ఈ సంబంధానికి మొగ్గు చూపాను. అంతే తప్ప లోకంలో పెళ్లి కొడుకులు దొరక్క కాదు. జరిగింది చాలు. పోతే పోనీ, ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి చేస్తాను కరుణకి. అక్కా నీ మాట కాదంటున్నానని ఏమీ అనుకోకు” అన్నాడు క్రిష్ణప్రసాద్ స్థిరంగా.

“అదికాదండీ, ఎంతయినా మనం ఆడపిల్ల వాళ్లం. ఇంతదాకా వచ్చిందాన్ని ఎలా కాదనుకుంటాము? పోనీ వాళ్లడిగినదాంట్లో ఎంతో కొంత ఇచ్చి ఆ మూడు ముళ్లు వేయించేద్దాం!” అంది వసుంధర ఆడబడుచు పడుతున్న ఆరాటాన్ని చూడలేక.

“వసూ, నువ్వు కూడా ఏమిటిలా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఎంతో కొంత ఇవ్వాలా…. ఎందుకివ్వాలి? అలా చేస్తే వాళ్ల ధనదాహం ఇంతటితో తీరుతుందనే అనుకుంటున్నావా? ఇలా అడిగినంతా ఇస్తూ పోతే ఎంతయినా చాలదు వాళ్లకు.

అయినా కరుణ ఒక్కతే కాదు… దాని తర్వాత పల్లవి పెళ్లికి ఎదిగి కూర్చుంది, దాని పెళ్లి చేయ్యాలి … వీళ్ల కోసం ఇలా లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ పోతే మన పిల్లలకింక మిగిలేది చేతికి చిప్పే!” అన్నాడు కోపంగా చూస్తూ,

“ఇప్పుడంత మాటలెందుకండీ… శుభమా అంటూ పెళ్లి తలపెట్టాము. ముందు జరగవలసినది చూడండి” అంది వసుంధర.

“అవును తమ్ముడూ, అంతకంటే మరో మార్గం లేదు మనకి!” అంది శ్రీలక్ష్మి ఆశగా తమ్ముడి వంక చూస్తూ.

“మీరు ఎంత చెప్పినా నా నిర్ణయం మారదు!” అన్నాడు క్రిష్ణప్రసాద్ స్థిరంగా.

“అదికాదురా క్రిష్ణా… ” అంటూ ఏదో చెప్పబోతున్న శ్రీలక్ష్మిని మధ్యలోనే కట్ చేస్తూ “నాకింకేమీ చెప్పవద్దు అక్కా. ఆరు నూరైనా నేను ఇంతకంటే ఇవ్వను. అయినా చేసేవాడిని నేను. ఆ బరువు బాధ్యతలేవో నాకు తెలిసినట్లు నీకేం తెలుస్తాయి? అసలు నిన్ను కాదు అనవలసింది. వీళ్లందరినీ నా మెడకు చుట్టి తన దారిన తాను పోయాడే మీ ఆయన… అతడిని అనాలి!” అన్నాడు విసురుగా.

భర్త మాట ఎత్తడంతోనే శ్రీలక్ష్మి కళ్లు కన్నీటి చెలమలయ్యాయి. ఎలాగో మాట కూడదీసుకుని “మధ్యలో ఆయన మాటలెందుకురా… ముందీ ఆపద గట్టెక్కేలా చూడు!” అంది దీనంగా అతడి వంక చూస్తూ.

“చెప్పాను కదక్కా… అనుకున్న దానికి మరొక్క రూపాయి కూడా ఇవ్వను … ఇష్టం ఉంటే చేసుకుంటారు. లేదా, పోతారు అంతే!” అన్నాడు నిష్కర్షగా.

అక్కడే ఉండి ఆ సంభాషణ అంతా వింటున్న కరుణ నిర్వికారంగా కూర్చుండిపోయింది అంతవరకూ… కానీ, మేనమామ తండ్రి మాట ఎత్తడంతోనే ఆమెకు ఎక్కడ లేని బాధా, ఆవేశమూ కలిగింది. ఇంతలో విడిది నుండి మరో కబురు వచ్చింది. మగపెళ్లివారు మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతున్నారని.

ఆ మాటలు వినడంతోనే శ్రీలక్ష్మి నించున్న చోటనే కుప్పలా కూలిపోయింది. “భగవంతుడా నాకెంత కష్టం తెచ్చావు?” అంటూ,

ఆమె పెద్ద కూతురు ఝాన్సీ వసుంధరలు కలిసి శ్రీలక్ష్మికి సపర్యలు చేయసాగారు. “వదినగారూ, ఆందోళన పడకండి. ఏదోవిధంగా పెళ్లి జరిగేలా చూద్దాం!” అంది అనునయంగా.

అక్కగారిని ఆ స్థితిలో చూడడంతోనే అంతవరకూ బింకంగా మాట్లాడిన క్రిష్ణప్రసాద్ మేనకోడలి వైపు తిరిగి బేలగా చూస్తూ, “కరుణా నువ్వు చెప్పమ్మా నా ఆలోచన తప్పంటావా? నా మూలంగా నీ పెళ్లి ఆగిపోతుందని నువ్వు అనుకుంటే చెప్పమ్మా, వాళ్లడిగింది ఇచ్చి ఈ పెళ్లి జరిపిస్తాను. కానీ డబ్బుకి తప్ప దేనికీ విలువ ఇవ్వని ఆ మనుష్యుల చేతిల్లో నిన్ను పెట్టడం నాకిష్టం లేదమ్మా” అన్నాడు ఆరాటంగా చూస్తూ.

“నీ ఆలోచనలో తప్పేమీ లేదు మావయ్యా… నువ్వేం చేసినా మా మేలు కోరే చేస్తావని నాకు బాగా తెలుసు. ఈ పెళ్లి తప్పిపోతున్నందుకు నాకేమీ బాధలేదు. ఇలాంటివాళ్లు వదిలిపోతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది… కానీ మావయ్యా, ఇంతవరకూ జరిగిందేదో జరిగింది. ఇకమీదట నా పెళ్లి గూర్చీ, చెల్లి పెళ్లి గూర్చీ నువ్వేమీ వర్రీ కావద్దు… మా సమస్యలు ఏదోవిధంగా మేమే పరిష్కరించుకుంటాము!” అంది కరుణ నిబ్బరంగా.

మేనకోడలు మాటలు విన్న క్రిష్ణప్రసాద్ ఉండేలు దెబ్బ తిన్న పక్షిలా విలవిల లాడిపోయాడు.

“అదేమిటి కరుణా, ఒక్కసారే అంత మాట అనేశావు. నేను మీకేం తక్కువ చేశానని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. లేక ఈ పెళ్లి వద్దన్నానని ఇలా అంటున్నావా?” అన్నాడు బాధగా.

“అదేం కాదు మావయ్యా, నువ్వు మాకేం తక్కువ చేయలేదు… ఎక్కువే చేశావు. ఈ పెళ్లి తప్పిపోతున్నందుకు కొంచెం కూడా నాకు బాధలేదు… నా బాధంతా ఒకటే మావయ్యా! నువ్వు మాకోసం ఎంతో చేస్తున్నావు, కాదనను. కానీ చేసిన ప్రతిసారీ నాన్నగారి ప్రసక్తి తెచ్చి ఆయన్ని కించపరిచి మాట్లాడుతున్నావు. అది మాకందరికీ ఎంత బాధకలిగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా?

మా నాన్నగారు ఎంత ఉత్తములో నీతో పాటు లోకానికంతటికీ తెలుసు… ధర్మారావంటే ధర్మానికి మారు పేరని ఇప్పటికి కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఆయన ఏనాడూ కుటుంబ బాధ్యతలను విస్మరించి గాలి తిరుగుళ్లు తిరగలేదు. అందరూ బాగుండాలి… ఆ అందరిలో నేనూ ఒకడిగా ఉండాలి అనుకున్నారు… ఇవన్నీ మా నాన్నగారి గూర్చి మీరంతా చెప్పిన మాటలే!

మా అమ్మ మేనమామ కూతురని ఎంతో అభిమానంతో పెళ్లి చేసుకోవడమే కాకుండా… తాతగారికి నిన్ను పట్నం పంపించి చదివించే స్తోమత లేదంటే నీ బాధ్యతను మా నాన్న భుజాల మీదకు ఎత్తుకున్నారు.

మా నాన్న తనకున్నదానిలోనే పదిమందికీ పెట్టారు. అందరూ బాగుండాలని తపన పడ్డారు. ఇంత చేసినా ఏ నాడూ ఏ రాజకీయ పదవులూ ఆశించలేదు… అయినా కొందరు స్వార్ధపరులు మా నాన్నగారు తమకి ఎక్కడ అడ్డువస్తారోనని మట్టుపెట్టారు. ఆయన అర్ధాంతరంగా పోయినా మమ్మల్నేమీ బికారులను చేసి పోలేదు. తినడానికి, ఉండడానికి ఇల్లూ, పొలమూ మిగిల్చే పోయారు.

నీకు నాన్నగారంటే ఎంతో ఇష్టం, మరెంతో గౌరవం. ఆ ప్రేమతోనే మమ్మల్ని అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేశావు. నీ పెరిగిన జీవనస్థాయికి తగినట్లే మేమూ నీతో సమానంగా ఉండాలని మాకన్ని సౌకర్యాలూ కలిగించావు. అయితే ఇంత చేసే నువ్వు మాటకి ముందు నీ గొప్పతనాన్నీ, మంచితనాన్నీ చాటుకునేందుకు మా నాన్నను తక్కువ చేసి మాట్లాడడం అమ్మకేలా ఉందో కానీ… నాకు మాత్రం తీవ్రమైన మనస్థాపాన్ని కలిగిస్తోంది మావయ్యా! అందుకే ఇక మీదట నా కాళ్ల మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను” అంది ధృఢంగా.

మేనకోడలి మాటలు విని నిశ్చేష్టుడైనట్లుగా కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు క్రిష్ణప్రసాద్. తను ఉద్దేశ్యపూర్వకంగా తన బావగారిని కించపరచాలని మాట్లాడకపోయినా, అనాలోచితంగా తాను అన్న మాటలు వారిని ఎంత గాయపరిచాయో గ్రహించాడతడు. తన తప్పుని ఎత్తి చూపినందుకు మేనకోడలి మీద కొంచెం కూడా కోపం రాలేదు అతడికి. అలాగే తాను చేసిన తప్పును ఒప్పుకునేందుకు ఏమాత్రం వెనకాడ లేదు.

వెంటనే కరుణ దగ్గరికి వెళ్లి ఆమె రెండు చేతులూ పట్టుకొని “అమ్మా కరుణా, నేను చాలా తప్పు చేశానురా… అకారణంగా మీ అందరి మనసులూ నొచ్చుకునేలా చేశాను. అందుకు శిక్ష వేస్తున్నట్లుగా నన్ను దూరం పెట్టకు. ఈ లోకంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను గౌరవించి పూజించేది మీ అమ్మానాన్నలనే! మీ నాన్నగా రి శిక్షణలో పెరిగిన నాలో ఇలాంటి అహంకార భావాలు ఎలా ఏర్పడ్డాయో తెలియడం లేదు. అయితే ఇవేవీ నేను కావాలని చేయలేదమ్మా… ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను. సారీరా తల్లీ!” అన్నాడు.

అతడంతలా ప్రాధేయపడుతున్నట్లుగా మాట్లాడుతుండడంతో కరుణ కంగారు పడిపోతూ “అయ్యో మావయ్యా, అంత మాట అనవద్దు… నేను గానీ, అమ్మగానీ, అక్కా చెల్లాయి గానీ నిన్నెప్పుడూ పరాయిగా అనుకోలేదు. ఇకపైన అనుకోము. మేమంటే నీకు ఎంత ప్రాణమో మాకందరికీ తెలుసు. నాన్నగారిని కించ పరిచి మాట్లాడితే భరించలేక ఏదో అన్నాను. నన్ను మన్నించు. నీకెలా తోస్తే అలా చేద్దాము” అంది అతడి వంక చూస్తూ.

“చాలమ్మా ఆడపిల్లలు లేని మేము మీ ముగ్గురినీ మా కూతుళ్లనే అనుకుంటున్నాము. కళకళ లాడుతూ ఉండవలసిన ఈ సమయంలో నీచేత కన్నీరు పెట్టించాను. నేను ఇప్పుడే వెళ్లి వాళ్లతో మాట్లాడి అంతా సరిచేస్తాను” అన్నాడు ఉద్వేగంగా.

అప్పటికి కొంచెం తేరుకున్న శ్రీలక్ష్మి వారి మాటలన్నీ విన్నది. అంతా విన్నాక తన తమ్ముడి ఆలోచనా, కూతురి ఆలోచనా సరైందే అనుకుంది. అశబోతులైన ఆ పెళ్లివారి కోసం తన తమ్ముడు ఒక మెట్టు దిగి వెళ్లడం ఆ మెకు నచ్చలేదు. అందుకే “వద్దురా తమ్ముడూ… నువ్వెళ్లి వాళ్లని ప్రాధేయపడకు. ఇందాక నేను కంగారుగా వారిని బ్రతిమాలో, బామాలో ఈ పెళ్లి జరిపించమన్నాను. కానీ వద్దురా… నీ మాటే కరెక్టు. మన కరుణను పొందే అదృష్టం వాళ్లకు లేదు!” అంది స్థిరంగా.

పెళ్లి ఆగిపోయిందని తెలిసి ఒకరిద్దరు తప్ప మిగతా బంధువులంతా వెంకట్రావు మాణిక్యమ్మలను నిలదీస్తున్నట్లుగా తలో మాటా అన్నారు.

“సిరిరా మోకాలు ఒడ్డటమంటే ఇదే! ఆ క్రిష్ణప్రసాద్‍తో వియ్యం అందాలంటే పెట్టి పుట్టాలి” అని ఒకరంటే,

“ధర్మారావుగారి వంటి మహానుభావుడి బిడ్డ కోడలిగా మీ ఇంట అడుగుపెట్టడమే గొప్ప … అవన్నీ వదిలేసి మంచీ మర్యాదా లేకుండా అదనపు కట్నం కోసం పీటల మీద పెళ్లి చెడగొట్టుకుంటారా ఎవరైనా?”

“ఆ క్రిష్ణప్రసాద్ తలచుకుంటే మీకీ పరగణాలో ఉప్పు పుట్టకుండా చేయగలడు తెలుసా?” అంటూ బెదిరించారు.

“అసలిదంతా ఎందుకు… అదనంగా ఇలా కట్నం అడిగి పెళ్లి చెడగొట్టుకున్నందుకు కేసు పెట్టి మీ ఇంటందరినీ కటకటాల వెనక్కి పంపిస్తే ఏం చేస్తారు?” అని బంధువులందరూ అన్న మాటలు విని అవమాన భారంతో తల వంచుకుంది మాణిక్యమ్మ. వారి మాటలు వినడంతోనే నవీన్ ఆలోచనలో పడిపోయాడు. అతడి కళ్ల ముందు కటకటాలు కదలాడాయి.

నిజానికి అతడికి కరుణ బాగా నచ్చింది. ఆమెను వదులుకోవాలని లేదు అతడికి. బెదిరిస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారని అపోహపడి తండ్రి మాటలకు తల ఊపాడు అంతే! కొడుకు ఆలోచనలో పడడం చూసి మాణిక్యమ్మకు ధైర్యం వచ్చింది. అందుకే చివరి ప్రయత్నంగా “ఒరే బాబూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు… ముహూర్తానికి ఇంకా చాలా టైముంది. మనందరం వెళ్లి జరిగిన పొరపాటును ఒప్పుకొని వాళ్లేమిస్తే అది పుచ్చుకొని పెళ్లి కానిచ్చేద్దాం!” అంది.

ఇంత జరిగినా వెంకట్రావు కింద పడినా పైచేయి తనదే అన్నట్లు మాట్లాడాడే గానీ తన మంకుపట్టు విడవలేదు. విసిగిపోయిన మాణిక్యమ్మ కొడుకు వంక తిరిగి “మీ నాన్న అంతేరా… ఇక మారడు. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు… ఈరోజు మనం చేసినట్లే రేపు నీ చెల్లెలు అత్తవారు చేసి దాన్ని ఇంకా కట్నకానుకలు తెమ్మని మనింటికి పంపితే… దాని కాపురం ఏమవుతుందో ఆలోచించరా?” అంది బ్రతిమాలుతున్నట్లుగా.

అంతవరకూ పెదవి విప్పి మాట్లాడని అతని చెల్లెలు “అవునన్నయ్యా, ఇక్కడ జరిగిందంతా మా అత్తగారు స్వయంగా చూశారు. మీవాళ్లు ఎంత ఆశబోతులు? అని నా ముఖాన్నే అన్నారు. అమ్మ అన్నట్లు రేపు వాళ్లు చేసినా ఆశ్చర్యం లేదు. ప్లీజ్ అన్నయ్యా … నా కాపురాన్ని గంగలో ముంచకు!” అంది అర్థిస్తున్నట్లుగా.

తల్లీ చెల్లెలు మాటలు విన్న నవీన్‌కి ఒణుకు పుట్టింది. వెంటనే “పదండమ్మా జరిగిన పొరపాటును ఒప్పుకుందాం!” అంటూ లేచాడు అక్కడి నుండి.

ఆ మాటలు వినడంతోనే మాణిక్యమ్మ, నీరజల ముఖాలు వికసించాయి. చుట్టూ ఉన్నవారు ప్రశంసగా చూశ శారు. అందరూ కలిసి బయలుదేరారు పెళ్లివారింటికి. వాళ్లు ఆ ఇంటికి చేరేసరికి పెళ్లి వద్దని అంటున్న శ్రీలక్ష్మి మాటలు విన్నారు.

మాణిక్యమ్మ శ్రీలక్ష్మి రెండు చేతులూ పట్టుకొని “జరిగిన పొరపాటుకు క్షమించమని అడగడం తప్ప ఇంకేమీ చేయలేను వదినగారూ! మీ మనసులు చాలా కష్టపెట్టాము మేము. మా అందరి తరుపునా క్షమించమని వేడుకుంటున్నాను. జరిగిందేదీ మనసులో పెట్టుకోకుండా అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించేద్దాం!” అంది.

“మన్నించవలసింది, ఈ పెళ్లికి అంగీకరించవలసిందీ మేము కాదండీ… మా అమ్మాయి కరుణ! అకారణంగా దాని మనసు క్షోభకి గురి చేశారు మీరు. తను ఒప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు” అన్నాడు కిష్టప్రసాద్,

వారు ఇలా వచ్చి పొరపాటు అయిందని చెప్తారని ఏమాత్రం ఊహించలేదు కరుణ. ఒక్క క్షణం అవాక్కయినట్లుగా ఉండిపోయింది.

ఆ తరువాత తీక్షణంగా వారి వంక చూస్తూ “ఏమిటండీ, పెళ్లంటే వ్యాపారం అనుకుంటున్నారా మీరు? క్షణానికో మాట మార్చే మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? మా మావయ్య అదనంగా ఇంకేమీ ఇవ్వనన్నాడని ఈ ఎత్తుగడ పన్నారా? ఇప్పుడు కిమ్మనకుండా పెళ్లి చేసుకొని… తీరా పెళ్లయ్యాక రేపు కట్నం కోసం పీడిద్దామనుకుంటున్నారా? మీ అబ్బాయి నవీన్ గారు పెళ్లికి ముందు ఎన్నో అదర్శాలు వల్లించారు. తీరా పెళ్లికి తరలివచ్చి మర్యాదలన్నీ పొంది, విందులారగించి మీ మాటలకి గంగిరెద్దులా తలాడించి ఎంతో వేడుకగా జరగవలసిన ఈ పెళ్లిని ఇలా రసాభాస చేశారు. ఏ నమ్మకంతో నన్ను తాళి కట్టించుకోమంటారు? జరిగింది చాలు, నాకీ పెళ్లి వద్దు!” అంది నిష్కర్షగా.

ఆ మాటలు వినడంతోనే అవమానభారంతో నవీన్ ముఖం నల్లబడిపోయింది. మాటలు కూడదీసుకుని “మీరలా అనుకోవడంలో తప్పులేదు కరుణగారూ! అంతే కాదు, జరిగిన దానిలో మా అమ్మగారి తప్పేమీ లేదండీ… మా నాన్నగారి మాటలు విని ఇంతవరకూ తెచ్చింది నేనే! జరిగిన పొరపాటుని దిద్దుకునే అవకాశాన్ని నాకివ్వండి. ఇంత జరిగాక నామీద మీకు నమ్మకం కలగడం కష్టమే!

అందుకే అదనంగా మేము డిమాండ్ చేసిన కట్నమే కాదు… అంతకు ముందు మీరు ఇస్తానన్నది కూడా తీసుకోము. నామాట నమ్మండి!” అంటూ క్రిష్ణప్రసాద్ వైపు తిరిగి “బాబాయిగారూ, జరిగిందానికి అందరి తరపునా నేను క్షమాపణ కోరుతున్నాను. నాకు కరుణని ఇచ్చి చేయండి చాలు… ఇంకేమీ వద్దు! కాక పోతే మీరు ఇస్తానన్న ఉద్యోగాన్ని మాత్రం ఇప్పించండి. ఎందుకంటే పాత ఉద్యోగానికి నేను రిజైన్ చేశాను” అన్నాడు వినయంగా.

చుట్టూ ఉన్నవారు కూడా మాణిక్యమ్మ చొరవ వలనే ఇక్కడికి వచ్చామని జరిగిందంతా వివరించడంతో అందరి మనసులూ తేలిక పడ్డాయి. కరుణ కూడా నవీన్ మాటల్లోని నిజాయితీని శంకించలేకపోయింది.

వెంకట్రావుని పదిమందీ చీవాట్లు పెట్టి పందిట్లోకి తీసుకువచ్చారు. పందిట్లో సన్నాయి మధురంగా మ్రోగింది. అన్నమాట ప్రకారం నవీన్ వారి నుండి కట్నం తీసుకోలేదు.

క్రిష్ణప్రసాద్ అతడిని అభినందిస్తూనే “మీకోసం కేటాయించిన ఈ సొమ్ము మీదే… ఏం చేసుకుంటారో మీ ఇష్టo!” అంటూ కరుణ చేతిలో పెట్టాడు వాళ్లని సాగనంపుతూ.

“మావయ్యా, నిన్న మంచికో చెడుకో నేనొక మాట అన్నాను, గుర్తుందా… ఇక మీదట మా బ్రతుకులు మేమ బ్రతుకుతాము అని. నీవు ఇచ్చిన ఈ సొమ్ముని పెట్టుబడిగా పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని పెడతాను. ఇక మీదట అమ్మా, చెల్లీ బాధ్యతను నేను తీసుకుంటాను… అందుకు అంగీకరిస్తేనే నేను ఈ డబ్బు తీసుకుంటాను” అంది కరుణ స్థిరంగా.

“సరేరా, నీకెలా నచ్చితే అలా చెయ్యి!” అంటూ నిండుగా నవ్వాడు క్రిష్ణప్రసాద్.