Site icon Sanchika

48. బిందాస్ ఫ్యామిలీ – ఇక్కడంతా అదో టైపు!

[box type=’note’ fontsize=’16’] 2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ. [/box]

నా మాట

[dropcap]ప్ర[/dropcap]తి వ్యక్తికీ యవ్వనంలో పెళ్ళికి ముందు కొద్దో, గొప్పో అనుబంధాలూ/అనుభవాలూ ఉండడం సహజమే! కానీ, వివాహానంతరం లౌక్యంగా వాటికి దూరమవడం విజ్ఞతతో కూడిన పని. లేకుంటే, అవి కుటుంబ పునాదులనే కదిలించే ప్రమాదం ఉంది.

ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది అందరికీ తెలిసిందే! అలా ఇమడ్చాలనుకోవడం శుద్ధ అవివేకం కూడా! ఒక వేళ, ఒక కుటుంబంలోని సభ్యులంతా తమ ‘పాత’ వ్యవహారాలను కొనసాగిస్తే… ? అన్న చిలిపి ఊహకు అక్షర రూపమే… ఈ “బిందాస్ ఫ్యామిలీ – ఇక్కడంతా అదో టైపు!” కథ.

ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు. ఈ పాత్రల ప్రవర్తనా సరళి ఎంత మాత్రం సమర్థనీయమూ, అభిలషణీయమూ కావు. వీటి సృష్టి కేవలం పాఠకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించడానికి మాత్రమే ఉద్దేశించబడింది! కనుక, రంధ్రాన్వేషణ చెయ్యవలదని మనవి చేస్తున్నాను.

– రచయిత.

***

అది విశాఖపట్నంలోని ‘సీ వ్యూ హైట్స్’ గేటెడ్ కమ్యూనిటీ, ఫ్లాట్ నంబర్ 777. లివింగ్ రూమ్ రివాల్వింగ్ ఛెయిర్లో విలాసంగా అటూ, ఇటూ ఊగుతున్నాడు చంద్రశేఖర్. గుబురు గెడ్డం, ఆటోవాలా డ్రెస్‍లో ఉన్న అతని మోహంలో ఓ వింత తేజస్సు ఉట్టిపడుతూంది. “పుణ్య భూమి నా దేశం” పాటలో పూర్తిగా లీనమై దానిని ఆస్వాదిస్తున్నాడతను. మరో పక్క సోఫాలో.. అతని విడో తల్లి పార్వతమ్మ – విడో అయినా ఎప్పుడూ కలర్ ఫుల్ శారీస్‌లో, స్లీవ్‌లెస్ జాకెట్‍లో జాలీగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఐఫోన్లో వాట్సాప్ మెసేజీలు పెడుతూ, మధ్య మధ్యలో పేస్‌బుక్ పోస్ట్‌లకి కామెంట్స్ రాస్తూ యమ బిజీగా ఉంది.

ఇక, డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిల్చొని క్రాఫ్ దువ్వుకుంటూ, కుదరక చెరిపేసి మరోలా దువ్వుతూ తంటాలు పడుతున్నాడు చంద్రశేఖర్ ఏకైక వారసుడు అఖిలేష్. ఈ ఆరడుగుల బుల్లెట్ అంటే ఆ కమ్మూనిటీ లోని ప్రతి అమ్మాయీ పడి చస్తుంది. లోపలికి పోయిన దవడలతో, మిలట్రీ క్రాఫ్‌తో, ఫ్రెంచి మీసంతో తనో టాప్ మేల్ మోడల్లా ఉంటానని అతని ప్రగాఢ విశ్వాసం. మోకాళ్ళ దగ్గర చిరిగిన ఫేడెడ్ జీన్స్, ఇంపోర్టెడ్ టీషర్ట్, మెడ చుట్టూ ఎర్రని గుడ్డ మీద గ్రీన్ డాట్స్ పెద్ద కర్చీఫ్ – ఇదే అతని ఐడెంటిటీగా చెప్పుకోవచ్చు. మూడొచ్చినప్పుడల్లా చేతిలోని కీచైన్ గిరగిరా తిప్పుతూ, తరువాత గుండ్రంగా తిరుగుతూ గాల్లోకి ఎగరడం, చుట్టూ ఉన్న వాళ్లంతా భయం భయంగా ఆ ఫీట్ చూస్తుండగా, నవ్వుతూ ల్యాండవ్వడం, అతనికి కిక్ ఇచ్చే పనుల్లో ఒకటి. అతని కొంటె చేష్టలకి ఏ అమ్మాయయినా బొక్కబోర్లా పడాల్సిందే! అతని కళ్ళలో ఏదో మెగా మేజిక్ ఉందని అతని ఆవారా గ్యాంగ్ ఉచితంగా విస్తృత ప్రచారం చేస్తుంటారు

“ఇదిగోరా తమ్ముడూ … నీకిష్టమైన పెసరట్టు, ఉప్మా.. జీడిపప్పు, నెయ్యి దట్టించి మరీ చేసింది అమ్మ. పీకల్దాకా లాగించెయ్!” ప్లేటు పెట్టి కిచెన్ లోకి తుర్రుమంది చందన. మామూలుగా తమ్ముడనీ, ముద్దొచ్చినప్పుడు ‘బ్రో’  అని పిలుస్తూ ఉంటుంది. అమ్మను కూడా అంతే – గారాలు పోయేటప్పుడు మమ్మీ అని ముద్దుగా పిలుచుకుంటుంది.

“పెసరట్.. పెసరట్… ఈ దిక్కుమాలిన పెసరట్టు తప్పించి ఈ కొంపలో వేరే టిఫినే ఉండదా? అయినా, అనాల్సింది మిమ్మల్ని కాదు. హోల్‌సేల్‌గా రుబ్బేసి ఇందులోనే కదూ తోసేస్తున్నారు!” అంటూ ఫ్రిజ్‌ని సమీపించి – “దీన్ని… దీన్ని… ఇవాళ ఎలాగైనా ఆర్కేబీచ్ లో విసిరేసి రాకపోతే నా పేరు అఖిలేషే కాదు. ట్రస్ట్ మీ సిస్!” అన్నాడు ఆవేశంగా. బాగా ఎమోషనల్‌గా ఉన్నప్పుడు చందనని ‘సిస్’ అని అలా ముద్దుగా పిలుస్తుంటాడతను.

“ఒన్ మినిట్ బ్రో!” అని వెనుతిరిగి మరుక్షణంలో బ్రెడ్, బటర్‌తో ప్రత్యక్షమయింది. అక్క సమయస్ఫూర్తికి ముగ్ధుడై “అపురూపమైన అనురాగానికి అడ్రస్ నువ్వే నా బెహెనా!… నన్ను ఆశీర్వదించవే!” అంటూ ఆమె పాదాలు తాకి, మరుక్షణం స్ప్రింగులా పల్టీలు కొడుతూ పైకెగిరి స్లోగా లాండై, కళ్లప్పగించి అబ్బురంగా చూస్తున్న చందనను పట్టి కుదిపాడు.

తను మార్చిన ప్రొఫైల్ పిక్చర్‌కి ఎన్ని లైకు లొచ్చాయోనని చెక్ చేస్తున్న పార్వతమ్మ ఆ థండర్‌కి ఉలిక్కిపడి భుజాలెగరేసి, ” ఓహ్ మైగుడ్నెస్, యూ గాయ్స్ ఆర్ సో క్రేజీ!” అని కితాబిచ్చి, మొహాన్ని చేటంత చేసుకొని, “ఏమేవ్ కోడలు పిల్లా… ఉన్న పళాన ఇలా లగెత్తుకురా” అని గొంతెత్తి అరిచింది.

ఆ అరుపు విని తుళ్ళిపడి, స్టవ్ మీద పాలగిన్నెను దించబోయి, గాభరాలో వాటిని కాస్తా తన కాళ్ళ పైనే వంపేసుకుంది విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖర్. కాళ్లపై బొబ్బలు తేలి మంటలు పుడుతున్నా “ఆ.. వస్తున్నా అత్తయ్యగారూ!” అంటూ కుంటుకుంటూనే డ్రాయింగ్ రూమ్ లోనికి పరుగులు తీసింది.

“చూసావా విజ్జూ, నా మనవడి స్టయిల్! ఆ వాడి, ఆ వేడి, ఆ స్పీడ్ – అచ్చమ్ స్టయిలిష్ స్టార్లా లేడూ!… యూ ఆర్ రియల్లీ రాకింగ్ రా అక్కూ!” అంటూ ఓ ఫ్లైయింగ్ కిస్ విసిరింది.

“థాంక్యూ గ్రానీ!” అని, “ఇప్పటికైనా అర్థమైందా.. సిస్, నా రేంజ్ ఏమిటో!” అంటూ చిరంజీవిలా రెండు చేతులతో కాలర్ని పైకి ఎగదోశాడు అఖిలేష్. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని కొడుకుని ఆబగా చూస్తూ ఉండి పోయింది విజయలక్ష్మి. అత్తయ్య వైపు తిరిగి – ” వీడిని చూడ్డానికి నా రెండు కళ్ళూ చాలడం లేదంటే నమ్మండి అత్తయ్య గారూ” అని, “ఇలారా.. నా బుజ్జికన్నా…” అంటూ అఖిలేష్ డొక్కు మొహాన్ని రెండు చేతులతో తడిమి – “అయ్యో.. అయ్యో .. నా మతి మండిపోనూ.. అబ్బాయికి నా దిష్టే తగిలేట్టుంది… ఈ కమ్యూనిటీ మొత్తం కళ్లన్నీ నీ మీదే ఉంటాయిరా…  ఒక్క నిమిషం… ఇలారా.. దిష్టి తీస్తాను” అంటూ మెక్కుకుంటూ బాల్కనీ వైపు పరుగు తీసింది.

“వాట్ మమ్మీ… నువ్వూ, నీ చాదస్తమూ.. ఒక్క మాట చెప్పనా.. ఈ గెటప్‌లో నువ్వెంత ముద్దుగా ఉన్నావో తెలుసా!… మైలవ్లీ మమ్మీ… యూ ఆర్ రియల్లీ ఆసమ్!” అంటూ ఆమె రెండు బుగ్గలూ చిదిమి, “ పెదవే పలికే మాటల్లో తీయని… ” హమ్మింగ్ చేస్తూ బొంగరంలా తిరిగి, పల్టీలు కొట్టి, గాల్లోకెగిరి, దభీమని లాండయ్యాడు.

ఇంతలో ఫోన్ శబ్దం విని, స్క్రీన్ వైపు చూసిన చందన కళ్ళు క్షణంలో శివకాశీ మతాబుల్లా వెలిగాయి. వెంటనే సర్దుకొని, “ఎక్స్‌క్యూజ్ మీ.. బ్రో..” అంటూ ప్రక్కనున్న బెడ్రూమ్‌లోకి దూరి తలుపేసుకుంది. కిలకిలా నవ్వుకుంటూ పరుగెత్తి, అమాంతం మంచమ్మీద దూకేసి, చేతికందిన దిండుని గట్టిగా నలిపేస్తూ – “ఓ.. అభీ.. మై డార్లింగ్…. కోపమొచ్చిందా… ఏమ్మా… ఒక్క నిమిషం కూడా ఆగలేవా! ఏం చెప్పమంటావులే నా దుస్థితి.. ఒక వైపు తమ్ముడు.. మరో వైపు డాడీ.. ఛీ.. పో…. నీకెప్పుడూ అదే ధ్యాస… వట్టి పోకిరీ…. సరే సరే .. ఓకే అన్నాగా…. ఆర్కే బీచ్… అయిదింటికి… సేమ్ స్పాట్.. బై.. సీ యూ!… మ్మ!’ అని కిస్ చేసి, ఏమీ ఎరగని నంగనాచి నత్తగుల్లలా హాల్లోకి ఎంటరయింది.

అప్పటికి పాటల పర్వం పూర్తయి, పేపర్లో లీనమై ఉన్న చంద్రశేఖర్ తలెత్తి.. “ఎవరమ్మా.. ఫోను?” వాత్సల్యం ఉట్టిపడేలా అడిగాడు. బదులుగా చున్నీని అటూ, ఇటూ మెలిపెట్టి తిప్పుతూ, కుడి కాలి బొటన వేలితో నేల మీద సున్నాలు చుడుతూ – “అదీ… అదీ… నా ఫ్రెండ్ నీహారిక డాడీ… సాయంత్రం కంబైన్డ్ స్టడీస్ కని రమ్మంటూంది. వెళ్ళనా నాన్నగారూ!” వినమ్రంగా అడిగింది. డాడీని ఎప్పుడైనా ఇంప్రెస్ చెయ్యాల్సి వస్తే, అలా ‘నాన్నగారూ’ అని గారాలు పోతూ పిలుస్తుంటుంది.

“వెళ్ళమ్మా … వెళ్ళు …. నువ్విలాగే బాగా చదువుకొని సివిల్స్ పాసవ్వాలన్నదే నా చిరకాల వాంఛ. ఈ తండ్రి కోరిక తీరుస్తావు కదూ!” గాద్గదికంగా అన్నాడు.

నాన్నకు దగ్గరగా వెళ్లి  – ” అలాగే డాడీ… అకుంఠిత దీక్షతో అహర్నిశలు శ్రమించయినా సరే మీ అభీష్టాన్ని నెరవేరుస్తాను. ఇట్సె ప్రామిస్! ఐపిఎస్ పాసై నేరస్తుల గుండెల్లో దడ పుట్టిస్తాను. ఆడపిల్లలంటే అబలలు కారని, సృష్టికి ప్రతిసృష్టి చేసే సబలలని నిరూపించి, ఆకతాయిల పాలిట సింహస్వప్నమై, సంఘ విద్రోహులందరినీ చెడుగుడు ఆడిస్తాను… నన్ను ఆశీర్వదించండి నాన్నగారూ!” అంటూ కాళ్ళకు నమస్కరించింది. ఆ దృశ్యం చూసిన పార్వతమ్మ – “చూడరా శేఖర్… ఆ వినయం… ఆ విధేయత…… నా మనుమరాలు మేలిమి బంగారంరా… పెద్దలంటే తల్లికి ఎంత గౌరవం.. ఎంత భక్తి!” అంటూ మెటికలు విరిచి, పేస్‌బుక్‌లో ములిగిపోయింది.

హాల్లో అటూ, ఇటూ తిరుగుతూ – “ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ… ” అని హమ్మింగ్ చేస్తూ ఊగుతున్న కొడుకుతో – “దాన్ని చూసయినా కాస్త బుద్ధి తెచ్చుకోరా వెధవా… ఇంకా ఎన్నేళ్లు వెలగబెడతావురా ఆ బోడి బీకామ్?… ఆ గజనీ, ఘోరీలు సైతం నిన్ను గనక చూస్తే, మరచెంబులో తలెట్టుకొని చావడం మటుకు ఖాయం. అచ్చోసిన ఆంబోతులా ఆ తొట్టి గ్యాంగ్‌తో బేవార్సు తిరుగుళ్ళూ నువ్వూనూ… నలుగురిలో తలవంపులు తెచ్చే నీలాంటి కొడుకుని కన్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి!” అంటూ చెప్పు కోసం కోపంగా అటూ, ఇటూ వెతికి, దగ్గర్లో అది కానరాక, చేసేది లేక చివరికి చేత్తోనే నుదిటిపై కొట్టుకున్నాడు.

ఇంతలో, వంటింట్లోంచి హైరానా పడుతూ పరిగెత్తుకొచ్చిన విజయలక్ష్మి వగరుస్తూ – “చెట్టంత కొడుకుని పట్టుకొని ఏమిటండీ ఆ మాటలు.. ” అంది.

“అంతేనే! వయసు మీరుతున్న తల్లిదండ్రులకు, కొడుకు చెట్టులా నీడనిస్తాడంటారు. కానీ… కానీ… వీడు మనకి పీడను తప్ప ఏమిచ్చాడే!” అంటూ కుమిలిపోసాగాడు.

ఆ మాటలన్నీ వింటున్న అఖిలేష్ కోపంగా చేతిలోని గ్లాసును విసిరేసి, పెద్దగా శబ్దం వచ్చేలా చేతులు రెండూ జోడించి – “అమ్మా, ఆయన్ని కాస్తా ఊరుకోమంటావా ప్లీజ్… ప్రతి రోజూ ఆ సోది వినలేక చస్తున్నామని చెప్పు ఆ పెద్దాయనకి… చూడండీ, నాకూ ఓ రోజొస్తుంది… అప్పుడు తెలుస్తుంది నా పవర్ ఏమిటో!” ఉక్రోషంగా అన్నాడు.

“ఆ రోజు వస్తుందో, రాదో తెలీదు గానీ, ఒక్కటి మాత్రం గ్యారంటీగా వొస్తుంది…. అదేరా… నీ నెత్తి మీద బాల్డ్ హెడ్డు!” చంద్రశేఖర్ మాటలకు కిసుక్కున నవ్వింది చందన.

“హూ .. ఇది ఇల్లు కాదు నరకం!” అంటూ గట్టిగా అరచి, తలుపుని ధభీమని మూసి బయటికెళ్లిపోయాడు అఖిలేష్. అదే క్షణం చంద్రశేఖర్ మొబైల్ రింగయింది.

స్క్రీన్ మీద పేరు చూసి తత్తరపడి కట్ చేసాడు. పక్కనే ఉన్న విజయలక్ష్మి – “ఎవరండీ అది… ఎందుకలా టెన్‌షనవుతున్నారు?” ఆరా తీస్తున్నట్లుగా అడిగింది. అతను మౌనంగా ఉండటంతో అతని చేతిలోని ఫోన్ లాక్కొని కాల్ డేటా చూడబోతుండగా చంద్రశేఖర్ దాన్ని తిరిగి లాక్కొని, భావరహితంగా మాస్టర్ బెడ్రూమ్ వైపుగా నడవసాగాడు. అతనిని ఫాలో అవుతూ – “నా మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆ ఇందిరాదేవి ఫోనే కదూ!” కుంటుతూనే అతని వెంట నడవసాగింది. నడుస్తూనే, “నా దేవుణ్ణి మాత్రం నాకు దూరం చెయ్యకు స్వామీ!”అంటూ మాంగల్యాన్ని కళ్ళకద్దుకొంది.

“అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన మీ అర్ధాంగి దగ్గర కూడా దాపరికాలా… నోరు విప్పండీ… ప్లీజ్!” అంటూ అతన్ని గట్టిగా ఊపసాగింది. వేదాంతిలా తల పంకించి, కిటికీ దగ్గరికి నడిచాడు చంద్రశేఖర్.

నమ్రతగా ఆతని వెంట వచ్చిన శ్రీమతితో.. “దూరంగా కనిపిస్తున్న ఆ కొండల్ని చూడు లక్ష్మీ! బడబాగ్నిలో రగులుతున్నట్లున్నాయి కదూ!… వాటినే ఈ గాగుల్స్ తో చూడు… చల్లగా, హాయిగా ఉన్నట్లు అనిపిస్తాయి. తేడా ఆ కొండల్లో లేదు లక్ష్మీ… మనలోనే ఉంది. ఇక్కడ్నుంచి నునుపుగా కనిపించే ఆ పర్వత శ్రేణులు దగ్గరగా వెళ్లి చూస్తే .. ఎగుడు దిగుడుగా మారిపోతాయి. మనిషి జీవితమూ అంతే! విధి ఆడిన వింత నాటకంలో మనమంతా పావులమే. నన్ను నమ్ము, నమ్మకపో .. ఒక్కటి మాత్రం నిజం .. నా హృదయపు కోవెలలో ఫస్ట్ టైమ్ గుడి కట్టింది మాత్రం నీకే!” అన్నాడు.

చంద్రశేఖర్ మాటలకు విజయలక్ష్మి కళ్ళ నుంచి అశ్రువులు జలజలా రాలాయి.

“దూరంగా ఉన్న ఆ కొండల్ని ఏం చూస్తారు గానీ, వెనకున్న మీ శ్రీమతిని చూడండి సార్!” అంటూ తనవైపుకి తిప్పుకొని.. “ఇప్పుడు చెప్పండి.. నా కళ్ళలో ఏం కనిపిస్తోంది?” అడిగింది చిలిపిగా.

“అరే.. ఆశ్చర్యంగా ఉందే!… నీ రెండు కనుపాపల్లోనూ నా ఇమేజే కనిపిస్తూంది!” కొంటెగా అన్నాడు. “మనసా, వాచా, కర్మణా.. హిందూ స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవమండీ!” అంది అతని ఛాతీ మీది వెంట్రుకలను కెలుకుతూ. “నేనెంత అదృష్టవంతుణ్ణి లక్ష్మీ!” అంటూ ఆర్తిగా ఆమెను గుండెలకు హత్తుకొని, పెదవులపై ముద్దు పెట్టుకోబోయాడు.

“అబ్బా… వదలండి… ప్లీజ్!.. చూడబోతే, రోజురోజుకీ మీరు మరీ శోభనం పెళ్లికొడుకై పోతున్నారు. అటు హాల్లో.. అత్తయ్యా వాళ్ళూ… ప్లీజ్!” అంటూ చెయ్యి విదిలించుకొంది. ఇంతలో చంద్రశేఖర్ ఫోన్ మళ్ళా రింగయింది.

“ఆవిడే… నువ్వు అనుమతిస్తేనే సుమా!” అన్నాడు లౌక్యంగా.

“చూడండీ! మన పెళ్లయి ఇన్నాళ్లయినా, ఏనాడయినా మీకెదురు చెప్పానా! ఒక వేళ చెప్పినా, నా మాట ఎప్పుడు చెల్లింది గనక!…. త్వరగా ముగించి రండి. ఇవాళ మీకిష్టమైన గుత్తి వంకాయ వండాను” భర్త వైపు మరో సారి ఆరాధనగా చూసి కిచెన్ వైపు కుంటుతూ వెళుతున్న భార్య వైపు చూసి జాలిగా నవ్వాడు చంద్రశేఖర్.

***

వంటింట్లోకి తిరిగొచ్చిన విజయలక్ష్మితో – “ఇందిరాంటీ అంటే ఎవరమ్మా!” ఆరా తీస్తున్నట్లుగా అడిగింది చందన.

“ఓహ్… అదా… అదో పెద్ద కధమ్మా … సమయం వొచ్చినపుడు చెప్తాను గానీ, అక్కడ పోపు మాడిపోతుంది, చూడు!” అంటూ తప్పించుకోబోయింది.

“నో వే మమ్మీ … ఇప్పుడే చెప్పాలి … నీ మాంగల్యం మీద ఒట్టు … అంతే!” అంటూ పకపకా నవ్వింది. “అమ్మని ఎక్కడ కొట్టాలో, అక్కడే కొట్టావు కదుటే.. ఇక చెప్పక తప్పుతుందా!” అంది తిరగమోత పెడుతూ.

కిటికీ వెంటిలేటర్ గుండా శున్యంలోకి చూస్తూ, భారంగా చెప్పసాగింది విజయలక్ష్మి.

“అది నైన్ టీన్ ఎయిటీ టూ.. ఫిబ్రవరి ట్వంటీ టూ… ” ఎఫెక్ట్ కోసం అన్నట్లు కాసేపు ఆగింది.

“ఓహ్.. లవ్ స్టోరీనా… అవంటే నేను చెవులతో పాటు నాలుక కూడా తెగ్గోసుకుంటాను. సస్పెన్స్ తో చంపక త్వరగా చెప్పవే ప్లీజ్!” అంది చందన.

“అప్పట్లో… నేనూ, హేమలత చాలా క్లోజ్… ఇద్దరం ఎయిత్ ఫెయిలై, మాట్నీ సినిమాలు చూస్తూ, మధుబాబుని, యద్దనపూడిని చదువుతూ, మధ్యలో బఠాణీలు తింటూ.. బంగారు కలలు కంటూ ఉండే వాళ్ళం. మా ఇంటి దగ్గర అరుగు మీద కూర్చొని సినిమా కధలు చెప్పుకుంటూ పుల్ల ఐస్ తినడమంటే నాకు చచ్చేంత ఇష్టం. ఎప్పుడు ఐస్ బండి వస్తుందాని రోజూ ఎదురు చూసే వాళ్ళం. ఆ క్రమంలోనే పుల్ల ఐస్ అమ్మే రాముడితో నాకు పరిచయమయింది. అనతికాలంలోనే అది ప్రేమగా మారింది. ఏ రోజైనా రాముడు రాకపోయినా, రావడం లేటయినా, విలవిలలాడేదాన్ని. కండలు తిరిగిన రాముడు నా కంటికి ఎన్టీవోడులా కనిపించి కలవరపరిచేవాడు. నేను ముద్దుగా వాణ్ని ‘పుల్లోడా’ అని పిలిచేదాన్ని.

ఒక రోజు రాముడు నన్ను ‘బండరాముడు’ మేట్నీకి పిలిచాడు. సినిమాహాల్లో నా వొళ్ళంతా కితకితలు పెట్టాడు. నేను భయంతో వణికిపోయాను. సినిమా పూర్తి కాకుండానే ఇంటికొచ్చేసాం.” ఊపిరి పీల్చుకుంది విజయలక్ష్మి.

“తర్వాత… తర్వాత ఏవయింది మమ్మీ?” ఆత్రంగా అడిగింది చందన.

“రోజులు సాఫీగా నడుస్తుండగా ఒక రోజు.. అమ్మా, నాన్నా పెళ్ళికని రాజమండ్రి వెళ్ళారు. నాకు తోడుగా హేమలతను ఉంచారు… ఆ రాత్రి భోజనాలయ్యాక, కబుర్లు చెప్పుకుంటుండగా, ఎవరో తలుపు కొట్టారు. నా ఫ్రెండ్ తలుపు తీసి – “లోపలికి రా.. రాముడూ..” అంటూ ఆహ్వానించింది. రాముడు నావైపు అదోలా చూడసాగాడు.

“నేను పక్కన శివాలయంలో హరికథ విని, ఓ గంటాగి వస్తానే.. ఆల్ ద బెస్ట్!” అంటూ ఎంత చెప్పినా వినకుండా తుర్రుమంది హేమలత. మా ఇద్దరికీ ఏకాంతం కల్పించడానికే తనలా వెళ్లిపోయిందని అర్థమయింది. మా ఇద్దరి అవస్థకు ప్రకృతి కూడా సహకరించింది. కాసేపటికి భోరుమని వర్షం… ఎక్కడో పిడుగు పడ్డ శబ్ధం… ఇంతలో కరెంట్ కూడా పోయింది. నేను భయం భయంగా పుల్లోడి కౌగిలిలో ఒదిగిపోయాను. మా ప్రణయానికి ప్రతిఫలంగా నువ్వు పుట్టావమ్మా! ఈ రహస్యాన్ని నీ గుండెల్లోనే సమాధి చేస్తానని నాకు మాటివ్వు తల్లీ!” అంటూ కళ్ళు తుడుచుకుంది విజయలక్ష్మి. అమ్మ కథ విన్న చందన నిలువెల్లా కదిలిపోయింది.

“ఇంతటి అగ్ని పర్వతాన్ని నీ గుండెల్లో దాచుకొని ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా… నువ్వు… నువ్వు నిజంగా మా పాలిట దేవతవమ్మా… దేవతవు! ఇదంతా విన్నాక, అర్జంటుగా నా కన్న తండ్రిని కనులారా చూడాలని నా మనసు తహతహలాడుతుందమ్మా… ఆ అమృతమూర్తిని ఒక్కసారి నాకు చూపిస్తావు కదూ… ప్లీజ్!” అంటూ భోరుమంది.

ఇంతలో, సడన్ గా ఏదో గుర్తొచ్చినట్లయి, “అన్నట్లు నేనడిగింది ఇందిరాంటీ ఎవరని కదా… మధ్యలో ఈ పుల్ల ఐస్ కథేంటి… నాకంతా అయోమయంగా ఉంది మమ్మీ!” అంది చందన గోముగా.

గుత్తివంకాయకు మసాలా అద్దుతూ- “చూడమ్మా చందూ! ఏదైనా అర్థమైతే వృత్తాంతం.. అదే అర్థం కాకపోతే వేదాంతం అవుతుంది తల్లీ… జీవితమనే బ్లాక్‌బోర్డ్ మీద రాసుకున్న బంగారు కలలనే అక్షరాలపై విధి అనే సర్పం విషాన్ని కక్కి కర్కశంగా వాటిని చెరిపేస్తే, చివరికి మిగిలేది ఏముంటుంది తల్లీ… అంతా శున్యం తప్ప! కానీ ఒక్కటి మాత్రం నిజం.. మనం నవ్వినా, ఏడ్చినా వచ్చేవి కన్నీళ్లేనమ్మా… తమాషా ఏమిటంటే, రెండూ ఉప్పగానే ఉంటాయి… ఏ కన్నీటెనకాల ఏ వ్యథ దాగుందో, కార్చేవాడికి తప్ప చూసేవాడికి ఏం తెలుస్తుందమ్మా!” చీర కొంగుతో కళ్ళొత్తుకుంది.

“కష్టసుఖాలు నాణానికి రెండు ముఖాలని నీ కథ విన్నాక అర్దమయ్యిందమ్మా… లోకమంతా ఎదిరించినా సరే, నీకు నేను తోడుంటానమ్మా! నేను నీ కూతురినమ్మా!” అంటూ అమ్మను మరోసారి కౌగలించుకుంది చందన. తన కళ్ళ నుండి జలపాతంలా కారుతున్న కన్నీటిని తుడుచుకోడానికి చున్నీ కోసం వెదికింది. అభిరాంతో మాట్లాడుతుండగా, తాను నలిపేసిన దిండు కింద అది ఇరుక్కుపోయిందని గుర్తొచ్చి, చేసేది లేక అమ్మ కొంగుతోనే వాటిని తుడిచేసుకొంది. పనిలో పని అన్నట్లుగా, ప్రక్కన వేలాడుతున్న కర్టెన్‌తో ముక్కుని కూడా చీదేసింది.

ఇదిలా జరుగుతుండగా… హాల్లో, కాలు కాలిన పిల్లిలా అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు చంద్రశేఖర్. “ఒసేవ్! నాకసలు భోజనం పెట్టేది ఉందా లేదా? అవతల స్కూల్ వదిలే టైమయింది. నా ఆటో కోసం పిల్లలు ఎదురు చూస్తూంటారు.”

చంద్రశేఖర్ అరుపు విన్న విజయలక్ష్మి.. “అయ్యో… నా మతి మండిపోనూ!” అంటూ కుంటుతూనే భర్తకు లంచ్ ఎరేంజ్ చేసింది.

***

చంద్రశేఖర్ వెళ్లడం ఆలస్యం, బిలబిలమంటూ అఖిలేష్ జులాయి గ్యాంగ్ దాడి చేసారు. పేరుకి తగ్గట్టు… జానీవాకర్‌లా కనిపించే జానీ, దిబ్బరొట్టె లాంటి దినేష్, సదా తిండి ధ్యాసలో ఉండి చొంగ కార్చుకొనే భోజేష్, ప్రతి అమ్మాయి వెంటా పడి ఛీ కొట్టించుకొనే శనీష్ – క్లుప్తంగా వీరే అఖిలేష్ గ్యాంగ్. అంతా ఆవురావురుమని తినేసి, ‘థాంక్స్ అంటీ .. బై బై’.. అని గట్టిగా అరచి, వొచ్చినంత వేగంగా తుర్రుమన్నారు.

భోజనాలయాక. – “మమ్మీ మమ్మీ… ఇంతకీ నువ్వు నా డౌట్ తీర్చనే లేదు. ఇందిరాంటీ గురించి నువ్విప్పుడు చెప్పాల్సిందే!” నిష్ఠూరంగా అంది చందన.

సుదీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది విజయలక్ష్మి. “చెప్తాను తల్లీ… చెప్తాను.. కానీ, ఒక్క మాట.. ఇందిరాదేవి గురించి చెప్పాలంటే, ముందుగా మీ నాన్న గురించి చెప్పాలి. దానికన్నా ముందు పుల్ల ఐస్ రాముడి గురించి చెప్పాలి. ఇదంతా, చైన్ రియాక్షన్ లాంటిదమ్మా!” అంది సాలోచనగా.

“కానీ, పుల్లోడి గురించి ఇందాకే చెప్పేసేవు కదమ్మా!” అంటూ వినమ్రంగా వేడుకొంది చందన.

“జన్మనిచ్చిన ఆ పుణ్యమూర్తిని అలా ఏకవచనంలో పిలవకూడదు తల్లీ.. రాముడు గారూ అనాలి. సరేనా!” అంది.

“నా తప్పుని మన్నించమ్మా.. ఇక ముందు నా టంగు కంట్రోల్లో ఉంచుకుంటానమ్మా, ప్రామిస్.. ఇంతకీ, తర్వాతేమైందో చెప్పవే ప్లీజ్!” అంది గోముగా.

మరలా, గతంలోకి తొంగిచూడసాగింది విజయలక్ష్మి. “అలా పవిత్రమైన నా శీలాన్ని దోచుకున్న పుల్ల ఐస్ రాముడు చాన్నాళ్లు ఎడ్రస్ లేకుండా పోయాడు. తర్వాత, మరదలిని పెళ్లి చేసుకొని ఇసకతోటలో కాపురం పెట్టాడని తెలిసింది. కార్చిచ్చు లాంటి ఆ నిజాన్ని తెలుసుకొన్న నేను షాకయ్యాను. సిమ్ము లేని సెల్లు లాంటి ఈ బ్రతుకు వ్యర్థమని మనోవ్యధతో ఆర్కేబీచ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాను. సరిగ్గా అదే సమయంలో తన సైకిల్ రిక్షా పార్క్ చేసి, మిరపకాయబజ్జీలు తింటున్న ఓ పుణ్యాత్ముడు దూరాన్నుంచి నన్ను గమనించి, వాయువేగంతో వచ్చి నన్ను రక్షించాడమ్మా. ఆయన వేరే ఎవరో కాదమ్మా… మీ నాన్నే! నా పొట్ట లోని నీళ్లన్నీ కక్కించి – “చూడండి మేడమ్.. అన్ని సమస్యలకూ ఆత్మహత్యే పరిష్కారమైతే, ఈ లోకంలో సగం మంది చచ్చి ఉండే వారు” అని నాకు ధైర్యం చెప్పారు. నా కధంతా విని – “అనుమతిస్తే నేను మిమ్మల్ని పెళ్లిచేసుకుంటాను” అన్నారమ్మా ఆ అనురాగమూర్తి! తడిసిన బట్టలతోనే ఇద్దరం దగ్గర్లోని గుళ్లో దండలు మార్చుకున్నాం. మా బంధం ఈనాటిది కాదమ్మా, అది జన్మజన్మల అనుబంధం!” అంటూ చందనను గట్టిగా కౌగలించుకుంది.

“నా ప్రాణాలు కాపాడిన ఆ ఆపద్బాంధవుణ్ణి చూస్తుంటే నా హృదయం ఉప్పొంగింది. ‘రాయిని ఆడది చేసిన రాముడివా’ అనే వేటూరి పాట అసంకల్పితంగా నా గొంతు లోంచి వెలువడింది. మీ నాన్న నా దగ్గరికొచ్చి – “ఆ తర్వాత తీరుబడిగా పాడుదువులే ముందటు చూడు” అన్నారు. అప్పటికి గానీ నాకర్థం కాలేదు.. మా అవతారాలు చూసి ముష్టాళ్ళమనుకొని అంతా చిల్లర విసురుతున్నారు. ఆ సీన్ తల్చుకుంటుంటే ఇప్పటికీ నవ్వొస్తూంది. అబ్బా! ఆ రోజులు ఎంత బావుండేవో!” అంది తన్మయంగా.

“అది సరే గానీ, ఇంతకీ ఇందిరాంటీ ఎవరో చెప్పనేలేదు” అంది చందన అసహనంగా.

“ఆ.. వస్తున్నా.. అక్కడికే వస్తున్నా!… మా పెళ్ళయాక, రిక్షా అమ్మేసి ఆటో అద్దెకు తీసుకున్నారమ్మా మీ నాన్న… ఎన్.ఎ.డి. నుంచి జగదాంబ వరకు షేరాటో నడిపేవారు. అప్పట్లో మీ నాన్న సిన్మా హీరో శోభన్ బాబులా ఉండే వారమ్మా! మా సంసారం సాఫీగా సాగిపోతుండగా ఒక రోజు – కంచరపాలెం దగ్గర ఓ అమ్మాయి మీ నాన్న ఆటో ఆపింది.

“ఫుల్ అయింది మేడం… సారీ!” అన్నారు మీ నాన్న. “అవతల నా ఎగ్జామ్స్‌కి టైమైపోతోందండీ… ప్లీజ్… నన్ను సత్యం సెంటర్ దగ్గర డ్రాప్ చేయరూ!” అంటూ బ్రతిమాలసాగింది.

ఆ అపురూప సౌందర్యరాశి అందానికే ఓ నిర్వచనంలా ఉంది. అంతటి మార్వెలస్ బ్యూటీని చూసేసరికి మీ నాన్న హార్ట్ షేకయ్యింది “స్సస్స … స్సారీ!” అంటూ గుటకలు మింగసాగారు.

“హే.. మిస్టర్… ఏమిటలా తినేసేలా చూస్తున్నావ్! తర్వాత తీరిగ్గా బిత్తరపోదువుగాని, ముందు పోనీ!” అంటూ చనువుగా అతన్ని పక్కకి జరిపి డ్రైవర్ సీట్ పక్కన కూర్చుండిపోయింది. బేలన్సు కోసం కుడి చేతిని మీ నాన్న మెడ మీదుగా పెనవేసింది. దాంతో, మీ నాన్నకు షాక్ కొట్టినట్లయి ఒళ్ళంతా మైకం కమ్మేసింది. అలా పరిచయమైన ఇందిరాదేవి ఎవరో కాదమ్మా – ప్రతిష్ఠాత్మకమైన ఇందూ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి చక్రధరరావు గారి ఏకైక వారసురాలు. బుల్లయ్య కాలేజ్‌లో జర్నలిజం కోర్సు చేస్తోంది. అంత సంపన్నురాలు, ‘షేరాటో ఏమిటా’ అనే కదూ నీ సందేహం?… అదేనమ్మా… ఇందిరాదేవి స్పెషాలిటీ!”

“నీ పేరు ఎక్కడా ఉపయోగించకుండా నా స్వయంశక్తితో నీకన్నా పెద్ద బిజినెస్ మాగ్నెట్ నవుతాను” అని వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసి వైజాగ్ వచ్చేసింది. స్కాలర్ షిప్‌తో చదువుతూ, పార్ట్ టైం డాన్స్ పాఠాలు చెబుతూ, ఆ పాకెట్ మనీతో విమెన్స్ హాస్టల్లో ఉండి చదువుకునేది. మొదటి చూపులోనే మీ నాన్నకు మనసిచ్చేసింది. కానీ, అప్పటికే తనకు పెళ్లయిందని మీ నాన్న చెప్పడంతో కుమిలిపోయింది.”

“సమాంతర రేఖల్లాంటి మనిద్దరినీ ఆ దేవుడెందుకు కలిపాడో తెలీదు గానీ ఒక్కటి మాత్రం నిజం – ఈ పవిత్ర భారతదేశంలో ఆడది తన జీవితంలో ఒక్క మగాడికే మనసిస్తుంది. నీ స్ధానంలో వేరే వ్యక్తిని ఊహించుకొని ఆత్మవంచన చేసుకోలేను చంద్రా!” అంటూ మీ నాన్న భుజాలు పట్టుకొని కుదిపేసింది. తన పిల్లి గెడ్డం పట్టుకొని బాధపడడం తప్ప మీ నాన్న ఏమీ చెయ్యలేకపోయాడు.

ఒక వైపు ఫలించని తన ప్రేమ గురించి ఆవేదన చెందుతూనే, మరో వైపు కెరీర్ మీద ఫోకస్ చేసి రాష్ట్రం మొత్తంలోనే తనో బెస్ట్ జర్నలిస్ట్ ననిపించుకొంది. TV99లో మేజర్ షేర్స్ ఈవిడ పేరునే ఉన్నాయ్. అలా పెళ్లనే మాటనే తన మస్తిష్కం లోంచి చెరిపేసి అనుక్షణం మీ నాన్ననే ఆరాధిస్తూ ఉండిపోయిందమ్మా. మీ నాన్న నడిపే ఆటో కూడా తను కొనిచ్చిందేనమ్మా!” అంటూ ఊపిరి పీల్చుకుంది.

“మరి, ఈ సంగతి తెలిసాక నాన్నను నువ్వు ఏమీ అనలేదా?” అమాయకంగా అడిగింది చందన.

“మీ నాన్న దేవుడమ్మా… ఏం ఆ తిరుపతి ఎంకన్నకి ఇద్దరుండగా లేనిది నా దేవునికుంటే తప్పేంటి? ఇందిరాదేవి అయన జీవితంలోకి రాక పూర్వం మనింట్లో రోజులు గడ్డుగా నడిచేవి తల్లీ! అప్పుడు నువ్వు చాలా చిన్నదానివమ్మా… ప్రతి రోజూ మీ నాన్న ఇంటికొస్తూ, తాటిచెట్లపాలెం మురిక్కాలవ పక్కన బడ్డీ కొట్లోంచి పది రూపాయల పకోడీ పొట్లామ్, నాలుగు మసాలా గారెలు తెచ్చేవాడమ్మా.. పట్టుకుంటే పావు లీటర్ నూనె కారే ఆ చిరుతిళ్లనే పరమాన్నంలా భావించి మనమంతా తినేసేవాళ్ళం తల్లీ!  ఆ దేవత పరిచయంతో మనింట్లో సీనంతా మారిందమ్మా. రోజూ, దమ్ బిరియానీ, బటర్ చికెన్, ప్రాన్స్ మసాలా లాంటివన్నీ డైనింగ్ టేబుల్ నలంకరించేవి. అవన్నీ తినే కదమ్మా, మీరింత వాళ్ళయింది!” అంటూ చందన బుగ్గ మీద ముద్దెట్టుకుంది.

“అది సరే గానీ అమ్మా.. మనందరికీ ఇన్నీ చేస్తున్న ఆ ఇందిరాదేవి మనింటికి ఎప్పుడూ రాదేం? మాకెప్పుడూ కనిపించదేం?” ఆరాటంగా అడిగింది.

“అంతా ఆ జగన్నాటక సూత్రధారి మాయ తల్లీ! ఇంతకీ ఆ దేవత మనకెందుకు కనిపించదని కదూ అడిగావు… చూడు తల్లీ! అనుక్షణం మనం పీల్చే గాలి మనకు కనిపిస్తుందా? మనమిష్టపడి తినే గుత్తి వంకాయ పండించిన రైతు నీకెప్పుడైనా కనిపించాడా? అందాకా ఎందుకు, మనం రోజూ తొడుక్కొనే చెప్పులు తయారు చేసిన మోచీ ఎవరో మనకు తెలుసా? వీళ్ళందరూ మన కళ్ళకి కనిపించనప్పుడు, ఆ దేవత మాత్రం ఎందుకు కనిపించాలి… చెప్పమ్మా చెప్పు!” అని ఎదురు ప్రశ్నించేసరికి కాస్త గాభరా పడి, వెనువెంటనే సర్దుకొని- “నాకిప్పుడంతా క్లారిటీ వొచ్చింది మమ్మీ… నా అనుమానమే నిజమయితే మనముండే ఈ డెబ్బయి లక్షల ఫ్లాట్ కూడా ఆంటీ చలవే అయ్యుంటుంది. యామై రైట్?” తన డిటెక్టివ్ పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అడిగింది చందన.

“నా తల్లే.. నా తల్లే … ఎన్ని తెలివితేటలో నా బంగారు కొండకి! బుర్ర నిండా ఐడియాలే!” అంటూ కూతురి నుదిటిపై ముద్దు పెట్టుకొంది విజయలక్ష్మి.

“అవునమ్మా … ఇవన్నీ ఆ దేవత ఇచ్చిన వరాలే!” అంది గాద్గదికంగా.

“అమ్మా!… నాకా దేవతను ఒక్కసారి చూడాలని ఉందమ్మా! కనీసం, ఆ వరాల తల్లి ఆటోగ్రాఫ్ తీసుకొని అయినా ధన్యురాలినవ్వాలని ఉందమ్మా. ఈ చిన్ని కోర్కెను పెద్ద మనసుతో మన్నిస్తావు కదూ!” అభ్యర్థించింది చందన.

***

అర్ధరాత్రి… అమావాస్య… రాత్రి ఒంటి గంట దాటింది. ఫ్రెండ్స్‌తో సెకండ్ షో చూసి తిరిగొస్తూ, అక్కయ్యపాలెం జంక్షన్‌లో స్నేహితులంతా విడిపోగా, వీధి చివర తనింటికి నడుచుకుంటూ పోతోంది అనుష్క. ఆమె ఎవరో కాదు… సిటీ మేయర్ జగదీశ్వరరావు ముద్దుల కుమార్తె. అమెరికాలో ఎంబిఎ చేసి, తండ్రి కోరికపై ఇండియా వొచ్చేసింది. ఎన్ని కార్లున్నా, తను మాత్రం సిటీ బస్సుల్లోనే వెళుతుంది. అదేంటని ఎవరన్నా అడిగితే ‘ఆ కిక్కే వేరబ్బా!’ అని కిలకిలా నవ్వేస్తుంది.  దటీజ్ అనుష్క!

అనుష్క అలా టర్నింగ్ ఇచ్చుకునే సమయానికి, నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీదికి ఒక ఓపెన్ టాప్ జీప్ సర్రున వొచ్చి ఆగింది. అందులో… నలుగురు రౌడీల్లాంటి కుర్రాళ్ళు.. వారి చేతుల్లో బాటిల్స్, కత్తులూ రెండూ మెరుస్తున్నాయి… జీప్ దిగి అనుష్కని రౌండప్ చేసి వేధించడం మొదలు పెట్టారు.

“ఏం పాపా, వస్తావా!” అని ఒకడంటే, “రంభ లాగున్నావ్.. నీ రేటెంతే నెరజాణా!” అని ఇంకొకడు కామెంట్స్ చేస్తుంటే, ఆమెకు క్షణాల్లో ముచ్చెమటలు పోసాయి. పోలీస్ హెల్ప్ లైన్‌కి అలెర్ట్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకోగానే, దాన్ని లాఘవంగా తన్నుకుపోయారు.

“నేనలాంటిదాన్ని కాదు… ప్లీజ్… నన్నేమీ చేయకండి!” అంటూ వేడుకోసాగింది. “నువ్వెలాంటి దానివో మా గెస్ట్‌హౌస్‌లో డీటెయిల్‌గా చెబుదువు గానిలే… నా ప్యారీ!” అంటూ వారిలో ఒకడు ఆమెను బలవంతంగా జీపులో ఎక్కించాడు.

సరిగ్గా అదే సమయానికి… రోడ్లన్నీ పోరంబోకుల్లా సర్వే చేసి, ఆఖర్లో బీర్ బార్లో తప్ప తాగి, అటుగా వస్తున్న అఖిలేష్ గ్యాంగ్‌కి – “హెల్ప్.. హెల్ప్..” అన్న మాటలు వినిపించాయి. సరిగ్గా అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా, వాళ్లంతా వాయువేగంతో అక్కడికి చేరుకొని ఆ రౌడీల భరతం పట్టడమే కాకుండా, వాళ్లందరినీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు.

ఆ రౌడీలు ఎవరో కాదు… వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అమ్మాయిలను ట్రాప్ చేసి, దుబాయ్‌కి అమ్మేసే రఫీ మాఫియా గ్యాంగ్ మనుషులే! ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ, ప్రభుత్వం నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఆ ముఠాని పట్టిచ్చినందుకు నగర పోలీస్ కమీషనర్ అఖిలేష్‌కి “యువరక్షకుడు” అనే బిరుదుతో పాటు అయిదు లక్షల నజరానా కూడా అందజేశారు.

ప్రైజ్ మనీ చెక్ తీసుకొని వస్తున్న అఖిలేష్‌ని వెనుకమాటుగా వచ్చి కళ్ళు మూసింది అనుష్క.

“నేనెవరో చెబితే, మరో అయిదు లక్షల నజరానా దక్కుతుంది” అంది అతన్ని ఆట పట్టిస్తూ.

“వలపు పంజరంలో నను బంధించిన ఈ దేవకన్య ఎవరబ్బా? ఎవరైననేమి… ఈ దేవీ అనుగ్రహముతో ధన్యుడనైతిని!” గ్రాంథికంగా అని మెల్లగా ఆమె చేతులు విడిపించుకున్నాడు.

అతన్ని పొదల మాటుకి లాక్కొని పోయి, పెదవులపై బలంగా కిస్ చేసి – “ఐ లవ్ యూ రక్షకా!… బైబై .. సీ యూ!” అంటూ అంతే వేగంతో తుర్రుమంది. లిప్‌స్టిక్ మరకలు తుడుచుకొని అక్కణ్ణుంచి బయటపడ్డాడు అఖిలేష్.

***

అయిదు లక్షల చెక్‌తో ఇంటికొచ్చిన అఖిలేష్‌కి జులాయ్ గ్యాంగ్ బాణాసంచాతో స్వాగతం పలికారు. విజయలక్ష్మి పార్వతమ్మ వైపు తిరిగి – “చూసారా అత్తయ్యా… మీ మనవడి ప్రతాపం… హీరోలకే హీరో అనిపించాడు. ఈ గౌరవం వాడిది కాదు మీదే!” అంటూ చెక్ ఆమెకు అందివ్వగా, ఆవిడ దాన్నందుకొని, అఖిలేష్‌ని బరబరా గోడకి వేలాడే ఫోటో దగ్గరికి లాక్కుపోయి – “ఏవండీ!… చూసారా మీ వంశోద్ధారకుణ్ణి… మీకు గుర్తుందా… వీడు మూడో తరగతిలో పక్కనున్న అమ్మాయి జడ పట్టుకొని లాగాడని వీడిని ‘తుంటరి వెధవా’ అని తిట్టారు… వాడేనండీ వీడు.. ఇప్పుడు రక్షకుడయ్యాడు. మీ చల్లని చూపుతో ఆశీర్వదించండి!” అంది.

టాపిక్ మార్చడానికన్నట్లు అఖిలేష్ – “ఓహ్… మైడియర్ గ్రానీ… యూ ఆర్ లుకింగ్ గోర్జియస్! ఇప్పుడే ఇట్లుంటే… నానమ్మా, అప్పట్లో ఎంత మందికి లవ్ ఫీవర్ తెప్పించి ఉంటావో కదా!… మ్మ!” అంటూ గ్రానీని కిస్ చేసాడు.

“ఛీ.. పోరా… పైనుంచి మీ తాత ఎలా తొంగిచూస్తున్నారో!” అంటూ తన రెండు చేతులతో మొహాన్ని కప్పేసుకుంది. ఇంతలో….

చందన పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికెళ్లి భళ్ళున వాంతి చేసుకుంది. నానా హైరానా పడుతూ, కుంటుకుంటూనే ఆమెను సమీపించింది విజయలక్ష్మి.

“కొంపదీసి, నా కొంప గానీ ముంచేసావా ఏమిటి తింగరదానా!” అంటూ కూతురి జుట్టు పట్టుకొని గుంజి, “ఆడదాని జీవితం అరిటాకు లాంటిదని, ‘ఏ అరిటాకు మీద ఎప్పుడు పడదామా’ అని 24/7 ముళ్ళన్నీ డేగల్లా ఎదురుచూస్తూ ఉంటాయని, చిలక్కి చెప్పినట్లుగా చెప్పినా, నీకు బుద్ధి రాలేదే… ఏబ్రాసిదానా!” అంటూ ఆమె భుజాలు పట్టుకొని ఊపేయసాగింది.

“ఓ బలహీన క్షణంలో జరిగిపోయిన ఈ తప్పుని పెద్ద మనసుతో మన్నించలేవా అమ్మా!” అంటూ తల్లి కాళ్ళమీద పడి భోరుమంది చందన.

“చెప్పవే, ఎవడా ముదనష్టపెదవ! ఈ హోల్ మొత్తం వైజాగ్‌కే యువ రక్షకుడు అండగా అభయమిస్తుంటే, ఇంకా భయమెందుకే పిచ్చి తల్లీ! చెప్పమ్మా.. వాడెవడైనా సరే.. వాడి భరతం పట్టి మూడంటే మూడు నిమిషాల్లో వాడి చేత నీ మెడలో మూడు ముళ్ళూ వేయిస్తాడమ్మా…” ఓ వైపు కుమార్తెను ఓదారుస్తున్నప్పటికీ, ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా మండుతూనే ఉన్నాయ్.

“అదీ.. అదీ… అదేమో… ” నీళ్లు నమలసాగింది చందన .

“నసిగింది చాలు గానీ, ముందు ఆడెవడో చెప్పేడు!” అంటూ ఆమె రెండు చెవులూ పట్టుకొని గుంజింది విజయలక్ష్మి.

“అబ్బా!” అని మూలుగుతూనే, “తమ్ముడి ఫ్రెండ్ జానీ, నేను ప్రేమించుకున్నాం మమ్మీ, మనసులిచ్చి పుచ్చుకున్నాం. ఓ రోజు బీచ్‌లో … మేం కబుర్లు చెప్పుకుంటుండగా, ఒక్కసారిగా చీకటి కమ్మేసి భోరున వర్షం పడింది. తల దాచుకోడానికి ఇద్దరం దగ్గర్లోని పాడుబడ్డ బంగ్లాలోకి… అక్కడ… అక్కడ… ” ఆపై చెప్పలేక ఆమె గొంతు మూగవోయింది.

“ఇంక చాలు సిస్.. సీనర్ధమయింది. హరిహర బ్రహ్మాదులెదురైనా, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. హ్యాపీనా?” అంటూండగా, కన్నీళ్లు తుడుచుకొని “ఓహ్! మై లవ్లీ బ్రో!” అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకొంది చందన.

“కూల్ బేబీ కూల్… ” అంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లి – “ఇంతకీ నీ బోయ్ ఫ్రెండ్ అభిరామ్ కదూ!” అనగా “ఓహ్ అదా .. జానీలోని హీ-మాన్‌ని చూసాక ఆ డర్పోక్ అభీకి బ్రేకప్ చెప్పేశా!” అంది కూల్‌గా.

(‘పాపం అభీ… ఇప్పటికీ నేనంటే పడిచస్తాడు’ అనుకొంది స్వగతంలో)

“ఓకే.. గాట్ ఇట్” అంటూ చందన చేతిని పక్కనున్న జానీ చేతిలో పెట్టేసాడు అఖిలేష్.

ఇంతలో… అఖిలేష్ ఫోన్ రింగయింది. “హాయ్.. ఏంటి కత.. మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేశావట! ఊరందరి పెళ్లిళ్లు చేయడమేనా… నీ పెళ్లి గురించి ఆలోచించేది ఏమైనా ఉందా!.. ఇదిగో.. నీ కోసం ఇక్కడో అమ్మాయి తపస్సు చేస్తుందన్న మేటర్ నీ మైండ్‌లోకి ఎప్పుడు రీచవుద్దిరా బాబూ! హే.. లిసన్ .. నీ చేత తాళి కట్టించుకోడానికి డిసైడయ్యా… తేడా వొచ్చిందా… తెల్సుగా… నువ్వు నేషనల్ అయితే, మా నాన్న ఇంటర్నేషనల్.. నువ్వు మాసయితే, మా డాడీ మాఫియా… బీకేర్ ఫుల్!.. లవ్యూ!” అంది కిలకిలా నవ్వుతూ.

“అది బెదిరింపా లేక అర్థింపా?” కొంటెగా అడిగాడు.

“రెండూ కాదు.. కిస్సింపు!” అంది.

“యూ ఆర్ ఆసమ్!” అని అఖిలేష్ అంటుండగా, కుంటుతూ అటుగా వచ్చిన విజయలక్ష్మి —

“ఎవర్రా ఫోన్లో!” అడిగింది. “చూడమ్మా… ఈ అమ్మాయి… పేరు అనుష్క… మేయర్ కూతురు.. నేను చేసుకోకపోతే బే ఆఫ్ బెంగాల్లో దూకేస్తానని ఒకటే బ్లాక్‌మెయిల్ చేస్తోంది.” అంటూ ఫిర్యాదు చేసాడు.

“మా నాయనే… మా నాయనే… ఏదీ ఆ ఫోనిలా ఇవ్వు బాబూ!” అంటూ ఫోన్ లాక్కొని, “చూడమ్మా… నేను రక్షకుడి తల్లినమ్మా… మా వాడి మొబైల్ స్క్రీన్ మీద నీ ఇమేజ్ చూసాను తల్లీ… అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావమ్మా… ఇదంతా మా వాడి అదృష్టం.. ఓసారి వీలు చూసుకొని మా ఇంటికి రామ్మా! ఇక ఉంటాను తల్లీ!” అని ఫోన్ కట్ చేసి… “ఏమండీ విన్నారా ఈ సంగతి..” అంటూ కుంటుతూనే భర్త దగ్గరికి నడిచింది.

“మీ సుపుత్రుడు మేయర్ కూతుర్నే పడేశాడండీ. ఇప్పటికైనా తెలిసిందా వాడి తడాఖా ఏంటో?” అంటుండగా, జానీ, చందన హఠాత్తుగా వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడ్డారు. “మమ్మల్ని ఆశీర్వదించండి!” అంటూ.

“ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబూ!” అన్నాడు చంద్రశేఖర్. అనంతరం, ఆ జంట పార్వతమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా… సరిగ్గా అదే సమయానికి.. మేయర్, అతని భార్య గాయత్రీదేవి, కుమార్తె అనుష్క బిఎండబ్ల్యూ కారు లోంచి దిగారు. మేయర్ భజనపరులు రక్షకుడి ఇంట్లో మతాబులు వెలిగించారు. జగదీశ్వరరావు, చంద్రశేఖర్ పరస్పర పరిచయాలలో ఉండగా, అనుష్క అఖిలేష్‌ని కర్టెన్ పక్కకి గభాల్న లాగేసి, అతని బుగ్గని గట్టిగా కొరికేసింది.

“ఇదిగోరా.. కర్చీఫ్… లిప్‌స్టిక్ తుడుచుకో” అంటూ ఆట పట్టించింది చందన. చిరంజీవిలా కాలర్ పైకెగరేసాడు రక్షకుడు. బొంగరంలా తిరుగుతూ పైకెగరాలన్న కోరిక బలవంతంగా అణచుకొన్నాడు, ఎందుకంటే… మేయర్ తనింట్లోనే ఉన్నాడు !

సీ వ్యూ హైట్స్ కమ్మూనిటీలో సందడి మొదలయింది. సెక్యూరిటీతో పాటు అన్ని టీవీ ఛానెల్స్ అక్కడ మోహరించాయి.

మేయర్ పర్యవేక్షణలో, రక్షకుడి జులాయ్ గ్యాంగ్ ఆధ్వర్యంలో, అనుష్క- అఖిలేష్, చందన – జానీ దండలు మార్చుకున్నారు. ఆ ఆదర్శ వివాహాలను అన్ని ఛానెల్స్ లైవ్ టెలికాస్ట్ చేశాయి.

ఇంతలో, చందన ఫోన్ రింగయింది. అది అభిరాంది. ‘అయామ్ ఇన్ ఎ పార్టీ’ అని మెసేజ్ పెట్టి సెల్ స్విట్చాఫ్ చేసేసింది. అప్పుడు విజయలక్ష్మి ఫోన్ రింగయింది. కంగారుగా అటూ, ఇటూ చూసింది. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. మెల్లగా కుంటుతూ పక్కనున్న స్టోర్రూమ్ లోకి దూరి తలుపేసుకొంది. అది పుల్ల ఐస్ రాముడి ఫోన్.

“ఏరా పుల్లోడా…. ఫోనుందని ఎప్పుడు పడితే అప్పుడు చేసీడవేనా? నీకు లక్ష సార్లు చెప్పాను… ఫోన్ నేనే గానీ నువ్వెప్పుడూ చెయ్యొద్దని…. ఇంతకీ, కొంపలమీద కొచ్చిన ఆ మేటరేంటో త్వరగా చెప్పేడరా!” అంటూ చిరుకోపంతో అభ్యర్ధించింది.

“అవునవును, ఇప్పుడు నీ రేంజ్ మారిందిగా! ఇంక మేమెక్కడ కనిపిస్తాములే!… అన్నట్లు, మేయర్తో సంబంధం కలుపుకున్నావటగా… అందుకేనా ఈ టెక్కు?” నిష్ఠూరంగా అన్నాడు.

“ఒరే ఐసోడా…. నా మనసంతా నువ్వేరా.. నా పరిస్థితి కూడా కాస్త అర్థం చేస్కోరా… అలకలాపి మేటర్ చెప్పరా ప్లీజ్!” అంటూ వేడుకొంది.

“ఏవీ లేదే… ‘అలంకార్’లో బండరాముడు ఏస్తన్నారంట… నీతో కలిసి మళ్ళీ చూడాలనిపించి చేసినా… అంతే!” అన్నాడు.

“సరే గానీ, రేపెలాగో మేనేజ్ చేసి మేట్నీకొస్తాలే! ఇక మూసుకొని పెట్టేసేయ్!” అని ఫోన్ కట్ చేసి, ఏవీ ఎరగని నంగనాచి నత్తగుల్లలా సైలెంట్ గా హాల్లోని మాబ్‌లో కలిసిపోయింది.

కలివిడిగా, హుషారుగా అటూ, ఇటూ తిరుగుతూ, సందడి చేస్తున్న పార్వతమ్మని మేయర్ దంపతులు పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం… మేయర్ చంద్రశేఖర్‌తో -“బావగారూ! జంటలిద్దరి చేతా మీ కుల దైవానికి మొక్కించేస్తే ఓ పనైపోతుంది కదా! ఏమంటారు?” అన్నాడు. ఇంతలో –

అటుగా, కుంటుతూ వస్తున్న విజయలక్ష్మిని చూసిన మేయర్ – “బావగారూ! వొచ్చిన దగ్గర నుండీ చూస్తున్నాను… చెల్లాయి అలా.. కాలు కాలిన పిల్లిలా… పాపం .. ఏదైనా సమస్యా?” అని అడగడంతో –  చంద్రశేఖర్ నవ్వేసి … “మీరు చెప్పిందే! పాలు తిరగబడి కాలు కాలింది.. అంతే!” అన్నాడు.

ఇంతలో – “రండి అన్నయ్యగారూ” అన్న విజయలక్ష్మి పిలుపు వినిపించడంతో, అంతా ఏంటీ రూమ్ వైపుగా కదిలారు.

ఆ గదిలో… వెలిగీ ఆరే లైట్ల మధ్య చంద్రశేఖర్ కులదైవాన్ని చూసి అంతా షాకయ్యారు.

అక్కడ …..చెక్కతో చేసిన ఓ సైకిల్ రిక్షా… ఓ కార్మికుడు… అతని మెడచుట్టూ ఆకుపచ్చని కర్చీఫ్… ఒంటి మీద ఎఱ్ఱని బనీను… ఖాఖీ నిక్కరు… కాళ్ళకి రబ్బర్ చెప్పులు… పక్కన గాలి కొట్టే పంపు.. ట్యూబూ… టైరు… గోడ మీద ఎర్రని పెయింట్‌తో – “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు– రిక్షా చంద్ర “ అని రాసి ఉంది. గదంతా అంబికా దర్బార్ గుబాళిస్తోంది. అంతా ఆ ఇంటి ఇలవేల్పుకి ఎనలేని భక్తితో నమస్కరించారు.

మేయర్ చంద్రశేఖర్ అకుంఠిత దీక్షను, కార్యశూరతను, లక్షల బేలన్స్ ఉన్నా, ఆటో నుంచి టాక్సీకి మారని అతని సింప్లిసిటీని వేనోళ్ళ కొనియాడారు.

“ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఇంట్లో మా అమ్మాయి నివ్వడం నాకెంతో గర్వంగా ఉందమ్మా!” అన్నాడు మేయర్. బదులుగా – “అంతా మీ మంచితనం అన్నయ్యగారూ!” అంటూ సిగ్గుపడింది విజయలక్ష్మి. ఆ తరువాత, జంటలిద్దరూ, మేయర్, చంద్రశేఖర్ దంపతులతో పాటు పార్వతమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

“శాస్త్రీయంగా తాజ్‌లో పెళ్ళిచేద్దామని మా అభిలాష. సరేనా.. బావగారూ!” అన్న మేయర్ రెండు చేతులనూ నవ్వుతూ తన చేతుల్లోకి తీసుకొన్నాడు చంద్రశేఖర్. ఇంతలో అఖిలేష్ గ్యాంగ్ –  “ఈ ఒక్క రోజుకీ … ప్లీజ్ … అంకుల్! “ అంటూ చంద్రశేఖర్ని ప్రాధేయపడసాగారు.

“పిల్లలేదో సరదాపడుతుంటే సందేహమెందుకు బావగారూ… అదీ కాక, మనం కూడా మనసులు విప్పి మాట్లాడుకోవాలిగా!” అంటుండగా, అతని గన్‌మేన్ అందించిన జానీ వాకర్ బ్లూ ని మేయర్ ఓపెన్ చేసి – “కమాన్ బాయ్స్.. లెటజ్ సెలెబ్రేట్!” అన్నాడు బాటిల్‌ని గాల్లోకి చూపిస్తూ.

‘హిప్ హిప్ హుర్రే!’ అని అంతా ఒకేసారి అరిచారు. ఇంతలో – “ఇందిరా మేడమ్ మీకిమ్మన్నారు సార్!” అంటూ ఓ వ్యక్తి చంద్రశేఖర్ చేతికి ఓ కవరిచ్చాడు. అందులో చందన, జానీలకి సింగపూర్‌కి హనీమూన్ వోచర్లు ఉన్నాయి.

“ఇంతకీ, ఈ ఇందిరాదేవి ఎవరండీ బావగారూ!” కుతూహలంగా అడిగాడు మేయర్.

“అదీ… అదీ..” అంటూ గుటకలు మింగసాగాడు చంద్రశేఖర్. ఇంతలో, ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్న విజయలక్ష్మి.. “తను… తను.. నా చెల్లెలండీ… మేమంటే తనకెంతో అపేక్ష” అంటూ కవర్ చెయ్యబోయింది.

“మరి అంత ముఖ్యమైన వ్యక్తిని ఇంత ఇంపార్టెంట్ అకేషన్‌కి పిలవలేదేంటి బావగారూ!” అన్న మేయర్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా అని తబ్బిబ్బు అవుతుతున్న భర్తను కవర్ చేస్తూ, విజయలక్ష్మి కల్పించుకొని, “తనో పెద్ద జర్నలిస్ట్ అన్నయ్యగారూ… ప్రస్తుతం ఢిల్లీలో జరిగే ఓ కాన్ఫెరెన్స్‌లో ఉంది” అంది. మేయర్ ఇంకా ఏదో అడగబోతుండగా, చంద్రశేఖర్ మొబైల్‌లో బీప్ శబ్దం వినిపించింది.

“టుమారో… నోవాటెల్… యూజువల్ టైం… గుడ్ నైట్ – ఇందూ” మెసేజ్ చదువుకొని, కె అని జవాబిచ్చి, పక్కకి తిరిగి, “మా ఫామిలీ ఫ్రెండ్… గ్రీటింగ్ మెసేజ్” అంటూ వేరే ప్రశ్నలకు ఛాన్సివ్వకుండా మేయర్ నోరు మూయించేసాడు చంద్రశేఖర్.

పాశ్చాత్య సంగీతం మెల్లగా జోరందుకొంది. తన మెడ చుట్టూ ఉన్న ఎర్రని కుర్చీఫ్ మరింత బిగించి బొంగరంలా తిరుగుతూ గాల్లోకెగిరి పల్టీలు కొడుతూ స్లోగా ల్యాండ్ అయి – “ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ!” అని గట్టిగా అరిచాడు అఖిలేష్. అంతా ముక్తకంఠంతో ‘చీర్స్!’ అన్నారు.

“ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ మై చైల్డ్ రక్షకా!” అని అల్లుణ్ణి గట్టిగా హత్తుకున్నాడు మేయర్.

అందరి హర్షధ్వానాలతో సీవ్యూ హైట్స్ కమ్మూనిటీ అంతా దద్ధరిల్లింది.

సర్వే జనా సుఖినోభవంతు!

Exit mobile version