49వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

0
1

[box type=’note’ fontsize=’16’] నవంబరు 20 నుండి 28 వరకు గోవా రాజధాని ప‌నాజిలో మన దేశం అధికారికంగా నిర్వహించిన 49వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం విశేషాలను అందిస్తున్నారు వేదాంతం శ్రీపతిశర్మ. [/box]

[dropcap]ప్ర[/dropcap]తి సంవత్సరం గోవా రాజధాని ప‌నాజిలో మన దేశం అధికారికంగా నిర్వహించే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నవంబరు 20 నుండి 28 వరకు జరుగుతుంది. బెర్లిన్, టోరొంటో, కాన్స్ (కాన్) తరువాత ఈ చలన చిత్రోత్సవానికి మంచి పేరుంది. కాకపోతే రాను రాను చలన చిత్రోత్సవ నిర్వహణ పూర్తిగా క్షీణిస్తూనే వస్తోంది. ఈ సంవత్సరం – 2018 నిర్వహణా తీరును చూస్తే రాబోయే సంవత్సరం 2019లో (50 సంవత్సరాల స్వర్ణజయంతి) అసలు వెళ్లాలా వద్దా అనే ఆలోచన వచ్చింది.

ఒక విధంగా ఆలోచిస్తే కేవలం అయిదు స్క్రీన్లు, రెండు అతి చిన్న హాళ్లు పెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో ఒక చలన చిత్రోత్వవం నిర్వహించటం ఎంతో హాస్యాస్పదంగా కనిపిస్తుంది. డెలిగేట్స్‌గా వచ్చిన వారికి రెండు షోల మధ్య ఏదైనా తిని టీ త్రాగి విశ్రాంతి పొందాలంటే కుదరదు. ఇంటర్నెట్ బుకింగ్ వ్యవస్థ కల్పించి తద్వారా మరింత హాని కలిగించారు నిర్వాహకులు. అంతర్జాతీయ పోటీలో ఉన్న చిత్రాలను చూడాలంటే చూసే వాళ్ళ పోటీ అసలు చిత్రాలలోని గుణగణాల పోటీ కంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ సంవత్సరం జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇజ్రాయిల్‌కు చెందిన డాన్ వుల్‌మాన్‌కు ఇచ్చారు. ప్రతి సంవత్సరం ‘కంట్రీ ఇన్ ఫోకస్’ అనే విభాగంలో ఒక దేశానికి చెందిన ప్రముఖ చిత్రాలను ప్రదర్శిస్తారు. అందులో ఈ సంవత్సరం ఇజ్రాయిల్ చిత్రాలు ప్రదర్శించటం విశేషం. జర్మనీ, బ్రిటన్‌కు చెందిన ‘ద ఆస్పర్న్ పేపర్స్’ ప్రారంభ చిత్రంగా ప్రదర్శింపబడింది.

   

ఈ చిత్రోత్సవంలో మధ్య చిత్రోత్సవ చిత్రం, ముగింపు చిత్రంతో పాటు అంతర్జాతీయ పోటీలలో 15 యునెస్కో గాంధీ మెడల్ విభాగంలో 12, దర్శకుల తొలి చిత్రాల క్రింద 7, ప్రపంచ పనోరమాలో 66, చిత్రోత్సవ కలైడోస్కోప్‌లో 20, సుప్రసిద్ధ దర్శకులు ఇంగ్‌మార్ బర్గ్‌మాన్‌కి సంబంధించినవి 9, ‘నివాళి’ క్రింద 3, ట్యూనిసియా వారి ప్రత్యేక విభాగంలో 3, యానిమేషన్‌లో 3, న్యాయనిర్ణేతల ఎంపికలో దక్షిణాఫ్రికా వారి ‘మండేలాస్ గన్’ ప్రదర్శితమయ్యాయి.

ఇవి కాక భారతీయ పనోరమాలో 26, చిన్న సినిమాలు, డాక్యుమెంటరీల క్రింద 21, వినోద్ ఖన్నావి 3, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 6, ‘నివాళలు’ క్రింద 4 (కల్పనా లాజ్మీ ‘రుడాలి’; ఎమ్. కరుణానిధి ‘మలైకల్లన్’; శశికపూర్ ‘విజేత’; శ్రీదేవి, ‘హమ్’) ప్రదర్శితమైనాయి. బహిరంగంగా (ఓపెన్ ఎయిర్) 6 చిత్రాలు చూపించారు. ఇందులో, 1983, ఎమ్.ఎస్ ధోని- ద అన్‌టోల్డ్ స్టోరీ ఉన్నాయి. ఈ సంవత్సరం షోలే, హిచికీ చిత్రాలు ప్రదర్శితమవటం విశేషం.

అంతర్జాతీయ ప్రతియోగితలో ఎక్కవగా సైకో అనాలిసిస్ – మానసిక పరమైన విశ్లేషణకు చెందిన చిత్రాలు కనిపించాయి. 53 వార్స్(పోలాండ్) యుద్ధం వలన కుటుంబంలోని స్త్రీలకి కలిగే మానసిక రుగ్మతను ఆవిష్కరించింది. బల్గేరియా, జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన ‘అగా’ చిత్రం ప్రకృతి ఏర్పడిన భిన్నమైన వాతావరణం నుండి తప్పించుకునే వారి గురించి చెప్పింది. ఈ చిత్రానికి మిల్కో లాజరోవ్ ప్రత్యేక బహుమతి లభించింది. మలయాళ చిత్రం ‘భయానకం’ మొదటి ప్రపంచ యుద్ధం నుండి తిరిగి వచ్చిన ఒక పోస్ట్‌మాన్‌గా పని చేస్తున్న ఒక సైనికుని కథ చెప్పింది.

అల్జీరియా, ఫ్రాన్స్, కతార్, లెబనన్ సంయుక్త చిత్రం ‘డివైన్ విండ్’ ఒక గనిని పేల్చేసే పథకంలో విఫలమైన ఒక స్త్రీ కథ చెప్పింది.

జర్మనీ, ఉక్రేయిన్, ఫ్రాన్స్, రొమానియా, నెదర్‌లాండ్స్ వారి సంయుక్త చిత్రం ‘డాన్‌బాస్’. సెర్గి లొజింట్సా దీనికి దర్సకత్వం వహించారు. ఈ చిత్రంలోని స్క్రీన్‌ప్లే ఎంతో సృజనాత్మకతతో సాగింది. ఈనాటి కల్మషయుక్త ప్రపంచంలో అంతర్యుద్ధాలు ఎంత హాస్యాస్పదంగా సాగుతున్నాయో, అందులో ‘సిద్ధాంతాల’ ప్రతిపాదనలు ఎంత కాల్పనికంగా, అర్థరహితంగా ఉంటాయో వాటిన్నిటి చిత్రీకరణ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇతివృత్తం చూసినప్పుడే దానికి పురస్కారం తథ్యం అనుకున్నారు. అనుకున్నట్లే ఈ చిత్రం బంగారునెమలిని సంపాదించుకుంది.

మన దేశం గర్వించదగ్గట్లు ఈ సారి మలయాళీ చిత్రం ‘ఈ మా యోవ్’ వెండి నెమలిని దక్కించుకుంది. అంత్యక్రియలు చాలా దర్జాగా జరగాలని వవాచన్ కోరుకుంటాడు. అలా కోరుకుని అకస్మాత్తుగా మరణిస్తాడు. ఆ తరువాత ఆ కార్యక్రమానికి ఎన్ని సమస్యలు ఎదురవుతాయో, లాటిన్ కాథలిక్ వర్గంలోని రుగ్మతలతో సహా ఎన్నో మానవీయ అంశాలను స్పృశించాడు దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సెరీ. ఈయనకు ఈ చిత్రోత్సవం ఉత్తమ దర్శకుని బహుమతినిచ్చింది.

ఎంతో ఆసక్తికరమైన ఇతివృత్తం గల చిత్రం ‘ఎ ఫామిలీ టూర్’. ఇది తైవాన్, హాంగ్‌కాంగ్, సింగపూర్, మలేసియా వారి సంయక్త చిత్రం. ఇందులో ఒక చలన చిత్రోత్సవం కథాంశంగా ఉంటుంది. చిత్ర దర్శకత్వం మానేసి ఏకాంతంలో జీవితం గడుపుతున్న యాంగ్ షు తన తల్లికి ఒక ఆపరేషన్ అవసరమై తైవాన్‌లో కలుసుకుని ఒకే హోటల్లో ఉంటారు. ఆ తరువాత ఇద్దరి భిన్నమైన గమ్యాలు విభిన్నమైన ఆలోచనలను స్ఫురిస్తాయి.

ఇరాక్ చిత్రం ‘ఇరో’ ఒక వృద్ధుడు తన కొడుకుని కాపాడకోవాలనే తాపత్రయాన్ని దర్శింపజేసింది. లిథువేనియా, ఇస్టోనియాల చిత్రం ‘ద షాడో’. గతించిన దానికీ మధ్య వర్తమానానికీ నిజ జీవితం, కల్పన అనే గీత మీద కనిపించే నీడ ఇది.

‘అవర్ స్ట్రగుల్స్’ అనే బెల్జియమ్, ఫ్రాన్స్‌ల సంయుక్త చిత్రం భార్యకు దూరమయిన ఇద్దరు పిల్లల తండ్రి పోరాటాన్ని చూపించింది.

తమిళ చిత్రం ‘టు లెట్’ 2007 సంవత్సరంలో చెన్నైలో ఇంటి వేటలో నడుస్తుంది. చెళియన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జ్యూరీ వారి ‘ప్రత్యేక మెన్షన్’లో ఎంపికయింది.

చెర్నోబిల్ విషాదం తర్వాత ఒక ఆస్పత్రిలో పని చేసిన ఒక అనువాదకుని కథ రష్యా చిత్రం ‘ఏ ట్రాన్స్‌లేటర్’.

అర్జెంటినా చిత్రం ‘ద అన్‌సీన్’ ఈ సంవత్సరం కనిపించిన చిత్రాలలో చెప్పుకోదగ్గది. యుద్ధం పరిధిలోంచి ఒక గర్భిణిని, ఆమె భర్తను ఒక యాభై ఏండ్ల వార్ కరెస్పాండెంట్ తప్పించి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. చిత్రీకరణ అద్భుతంగా సాగిన చిత్రమిది.

లాత్వియా, రష్యాల సంయుక్త చిత్రం ‘వాన్‌ గోస్’ గుర్తింపు పొందని ఒక కళాకారుడు, తన కొడుకు కలసి ‘పార్కిన్సన్ వ్యాధి’తో జరిపే పోరాటం ఎన్నో ఆలోచలనను రేకెత్తించేదిగా సాగుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు సర్గీ లివ్‌నెవ్.

ఉక్రేయిన్, పోలాండ్, మాసిడోనియా వారి సంయుక్త చిత్రం ‘వెన్ ద ట్రీస్ ఫాల్’. బంధవ్యాలు, అరాచకాలు, బాధల రొంపి విముక్తి కోసం ఒక ప్రేమ జంట చేసే ప్రయత్నాలను చిత్రీకరించింది ఈ చిత్రం. అనస్టేసియా అనే నటికి ఈ సంవత్సరం ఈ చిత్రంలో నటనకు ఉత్తమ నటి పురస్కారం దక్కింది.

చలన చిత్రోత్సవాల నిర్వహణను ఎంతో సృజనాత్కకత, చక్కని భాషా చాతుర్యం, ఓర్పు, వ్యవహార దక్షత ఉన్నవారు పని చేయవలసి ఉంటుంది. చలన చిత్రం ప్రారంభం అయ్యే ముందు మైకు పట్టుకుని తెర మీద పేరు చూసి… ఇప్పుడు ఈ సినిమా చూడండని చెప్పేవారు, సినిమా ప్రారంభం అయిపోయిన అరగంట వరకూ లోపలకి ఎవరినీ పంపకుండా నిలబడే కార్యకర్తలు, ఇలా రకరకాల వ్యక్తులు ఉత్సాహాన్ని పూర్తిగా పాడు చేస్తున్నారనే చెప్పాల్సి ఉంది.

భోజన సమయంలో ‘ఓపెన్ ఫోరమ్’ అనే కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఎవరిని, ఎందుకు, ఎలా, ఎవరు ఎంపిక చేసుకుని నిర్వహిస్తారో అర్థం కాదు.

నిజాని ఒకసారి గోవా నుంచి ఇవతలకి వచ్చాక ఏ విభాగానికి ఎలా ఎంట్రీని సమర్పించుకోవాలి అని అడిగితే చుక్కలు కనిపిస్తాయి. ఎక్కడా కనీ వినీ ఎరుగని చిత్రాలు ఎలాగో అలాగ ఇక్కడికి వచ్చి భలేగా వాలిపోతాయి!

జీవిత సాఫల్య పురస్కారాలు ఎవరి చేతిలో ఉంటాయో తెలుసుకోవటం కష్టం.

చిత్రోత్సవం అసలు మన దేశంలో స్వతంత్రంగా, చిత్తశుద్ధితో నిర్మించే వారిని పట్టించుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. బాలీవుడ్ అనేది అందరినీ తొక్కిపెట్టి పైన కూర్చునే రంగం. ఇక్కడ కూడా వాళ్లనే పూజించి సపర్యలు చేయటం ఎందరో కళాకారులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

చలన చిత్రోత్సవం ముగిపు సమారోహంలో చాలామంది వాస్తవాన్ని ప్రతిబింబించే చిత్రాలు ఎక్కువగా ముందుకు రావాలి అన్నారు.

గోవా ప్రభుత్వంలోని మంత్రి విజయ్ విజయ్ సర్దేశాయ్ వాస్తవాన్ని తెలిపారు – “కాన్ ఉత్సవం స్వతంత్ర్య గాలుల మీదయితే ‘ఇఫీ’ గోవా రెడ్ టేపిజమ్ మీద అనే పేరుంది. దీనిని రాబోయే సంవత్సరం మారుస్తాం” అన్నారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here