[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో న్యాయనిర్ణేతలు/సంపాదకుల ఎంపికలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. [/box]
[dropcap]నె[/dropcap]లలో మూడో తారీకు వచ్చినా.. ఇంకా ఫాక్టరీలో కార్మికులకి జీతాలు పంచుతూనే ఉన్నాడు స్టీఫెన్. దూర గ్రామాలలో ఉన్న వాళ్ళు రావడానికి కాస్త టైము తీసుకుంటున్నారు.
బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బు మిగిలి ఉంటే గనుక, మేనేజరు గారి బీరువా, కేష్ చెస్ట్‌లో పెట్టి తాళం వేసి, ఆ తాళం చెవిని మాత్రం దగ్గర ఉంచుకుంటాడు. ఆ రోజు ఉదయం.. కేష్ చెస్ట్ లోంచి.. మిగిలి ఉన్న డబ్బుని తెచ్చుకుంటూ, ‘కంపెనీ డబ్బు కాబట్టి, పాలోధిన్ కవర్లోంచి.. పైకి కనిపించేలా ఉన్నా.. పోకుండా.. బాగానే ఉంది’ అని అనుకున్నందుకు గాను.. సాయంత్రం చివరిగా వచ్చిన వీరస్వామికి అన్నీ చిన్న నోట్లు.. తగిలాయి.
ఇదేమిటి? అన్నీ పదులే ఉన్నాయి.. అనుకుంటూ లెక్కపెడుతుంటే చివరికి మూడు వేలు తక్కువ పడ్డాయి.
కంగారు పట్టుకుంది. మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టాడు. ఇంతకుముందు కొన్ని ‘వంద’ నోట్లు ఉండాలి. మరిప్పుడు అవి లేవే.
ఉన్నంతవరకూ ఇవ్వబోతే వీరస్వామి తీసుకోలేదు. “ఆ కాస్త డబ్బూ ఎందుకు సరిపోతుందయ్యా, మొత్తం ఒకేసారి తీసుకుంటాను” అంటూ బాధగా వెనుదిరిగాడు.
వీరస్వామి జాలి చూపులు అతన్ని ఇబ్బంది పెట్టాయి..
ఎప్పుడూ ఇలా జరగలేదు. ప్రతిసారీ వందా.. యాభై తగ్గినా సరిపెట్టేసుకునేవాడు. ఎప్పుడైనా పంపకం తనదే. ‘అపశకునం’ ముందుగా మనసు తట్టినా గమనించుకోలేకపోయాను. ఏరోజూ లేనిది .. ఈరోజే ఎందుకలా అనిపించిందో తెలీదు.
చేసేది లేక మేనేజరు లక్ష్మీనారాయణగారికి తెలియచేసాడు. “ఎక్కడికి పోతాయి మీ బీరువాలో మరోసారి వెతకండి” అన్నారు.
అలా అన్నారు కదా అని మరోసారి బీరువా పరిశీలిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. డబ్బు సంచి అలమరలో ఉంచి, బీరువా తలుపులు దగ్గరగా వేసి, గోడవారగా ఉన్న కంప్యూటర్ వైపు తిరిగి చాలా సేపు అంటే.. ఓగంట సేపు టైపు చేసుకున్నాడని, మద్యలో ఓ సారి లేచి.. వైట్ పేపర్ల కోసం బీరువా దగ్గరకు.. వచ్చినప్పుడే, డబ్బు సంచి తెరచి ఉందని. తనే మరచిపోయి ఉంటానని, క్లోజ్ చేసి మళ్ళీ టైపు చేసుకోడానికి వెళ్ళాడు.
అంటే ఎవరో తెలీకుండా నా బీరువా తెరిచారు, పనిలో పడి తను గమనించలేదు.
ఆఫీసు బాయే పెన్నులు కోసం, పెన్సిళ్ళ కోసం అంటూ అప్పుడపుడూ తన బీరువాలో కి తొంగి చూస్తుంటారు. అదే విషయం మేనేజరుగారికి చెప్పాను.
మేనేజరు గారు ఆఫీసు బాయ్స్ ముగ్గురినీ పిలిచారు. “మాకేం తెలీదు.. అసలు డబ్బుపోయినట్లే మాకు తెలీదు” అంటూ సత్తిబాబు, వేంకటపతి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకున్నారు. రామాచారి అయితే “పిల్లల మీద ఒట్టు” ఒట్టు కూడా వేసాడు మరో మాటకు అవకాశం లేకుండా.
వాళ్ళలో అతనికి రామాచారి మీదే అనుమానం. అతనికి చేతివాటం ఎక్కువ.. అయితే మేనేజరు గారూ, రామాచారి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రామాచారి ఒట్టు మంత్రం.. తేలికగా పనిచేసింది.
“ఎవరైనా తీస్తే.. రేపు ప్రొద్దుటే… ఆతను వచ్చేసరికి.. టేబుల్ డెస్క్‌లో పెట్టెయ్యండి. గొడవ లేకుండా పోతుంది. లేకపోతే పోలీస్ కంప్లైంటు ఇవ్వాల్సి వస్తుంది” అంటూ చెప్పారు మేనేజరు లక్ష్మీనారాయణ,
ఆ మాటకు స్టీఫెన్ సంతోషపడ్డాడు. మేనేజరుగారు తన పక్షాన ఉన్నారని.
మూడు రోజులు గడచినా విషయం వీసమెత్తు కూడా కదలలేదు. మేనేజరు టూర్ల మీద తిరుగుతున్నారు. ఎవరినీ అడిగేవాళ్ళు లేకపోయారు. డబ్బు దొరుకుతుందన్న ఆశ అడుగంటుకు పోయింది. తీసినవాడు జాగ్రత్త పడిపోయాడు.
మరునాటి వరకూ టైము చెప్పారు గాని, అప్పటికప్పుడు జేబులు చెక్ చెయ్యాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు.
వీరస్వామి అతని టర్న్‌లో వస్తూ.. జీతాల గుమస్తా గారు.. ఎప్పుడు పిలుస్తారా అని మాత్రం ఎదురు చూస్తున్నాడు. అతన్ని చూస్తే బాధగా ఉంది స్టీఫెన్‌కి. చిన్న ఉద్యోగి ఎన్నాళ్ళు జీతం లేకుండా ఉండగలడు.
పొలీసు కంప్లైంటూ ఇవ్వలేదు. దీపం క్రింద చీకటిలా అంతా అనిశ్చితి. ఈ స్తబ్దతను భగ్నం చేయ్యాలనుకున్నాడు స్టీఫెన్.
మరో రెండురోజుల తరువాత.. వీరస్వామిని పిలిచి “ మేనేజరుగారికి .. జీతాల గుమస్తా ఇంకా జీతం ఇవ్వలేదని నా మీద కంప్లైంటు చెయ్యి… అప్పుడైనా విషయం కదులుతుందేమో చూద్దాం” అన్నాడు.
అలాగే చేసాడు వీరస్వామి.
అంతా విని మేనేజరుగారు అన్న మాట.. అతన్ని అధఃపాతాళానికి తొక్కేసినట్లయ్యింది. కాళ్ళ క్రింద భూమి కదిలినట్లు అయ్యింది.
“అసలు డబ్బు లేకుండా చేసి నువ్వే పోయిందంటున్నావేమో”
“సార్” ఆశ్చర్యపోయాడు.
“నీ బేగ్‌లో ఎంత డబ్బుందో నేనేం లెక్కపెట్టలేదు కదా! వెంటనే అతని జీతం.. అతనికి పే చెయ్యి – లేకపోతే నేనే నీ మీద పొలీస్ కంప్లైంటు ఇవ్వాల్సి వస్తుంది” అని.
ఇంకో మాట మాట్లాడకుండా అక్కడనుంచి వచ్చేసాడు స్టీఫెన్. సీన్ ఇంత రివర్సు అయిపోతుందని అనుకోలేదు. మిన్ను విరిగి మీద పడడం అంటే ఇదే. తను.. తన గురించే ఆలోచించుకున్నాడు గాని.. మేనేజరుగారు మాత్రం ఏదీ తన మీదకి రాకుండా చూసుకున్నాడు.
***
ఇంట్లో ఏ రోజు విషయం ఆ రోజు చెప్పడంతో “ఇంట్లోంచి డబ్బు తీసుకెళ్ళి.. అతనికి జీతం ఇచ్చెయ్యిండి.. మీ మేనేజరు అన్నట్లు మీ మీద పొలీస్ కంప్లైంటు ఇస్తే.. అది ఉద్యోగానికే దెబ్బ” అన్నది ఇంటావిడ.
“మూడు వేలు అంటే.. పదిహేను రోజుల జీతం అని” బాధపడ్డా.. కంపెనీలో ఎవ్వరూ మాట సహాయానికి కూడా రావడంలేదు.
“బీరువా ‘సరిగ్గా’ క్లోజ్ చేసుకోకపోవడం, తప్పు నీదే” అని నొక్కి వక్కాణించారు,
ఇంటినుంచి పట్టుకెళ్ళి కట్టేసాడు. అలా ఆ సమస్య పరిష్కారం అయినా, మనసు చాలా గాయపడింది. బెంగ పెట్టేసుకున్నాడు. కష్టార్జితం ఎవడి దురాశకో అన్యాయంగా.. పోయిందని బాధపడ్డాడు.
ఆఫీస్ బాయ్స్ ముగ్గురూ తలోరకంగా ఫోజు కొట్టారు- ‘డబ్బు నొక్కేసి, అన్యాయంగా వాళ్ళని ఇరికించాలను కున్నాడని.. దేవుడు వాళ్ళందున ఉండబట్టి, సరిపోయింద’ని.
నాలుగు నెలల తరువాత… తిరుపతి పుణ్యక్షేత్రాన్ని.. దర్శించుకునేంత వరకూ బాధపడుతూనే ఉన్నాడు. కాలం ఆ చేదు జ్ఞాపకాన్ని మరుగున పడేసింది.
***
కొన్నాళ్ళకి మేనేజరు లక్ష్మినారాయణ గారు రిటైరు అయిపోవడంతో.. కొత్త మేనేజరు చక్రధరరావుగారు వచ్చారు. ఇతను భోళామనిషి.. స్టాఫ్ అందరితోనూ కలివిడిగా ఉంటారు. అయినా అధికారి అధికారే. పని దగ్గర కొచ్చేసరికి పరమ స్ట్రిక్ట్.
ఆరు నెలలు సాఫీగా గడచిపొయినాయి. నెల తిరిగింది.
మళ్ళీ మాములే. బ్యాంకు నుండి జీతాలు డ్రా చెయ్యడం.. పంచడం. ఎవరెంత తొందరపెట్టినా.. మొట్టమొదటి జీతం మాత్రం మేనేజరుగారికే పంపిస్తాడు, కవరులో పెట్టి.
ఎక్విటేన్స్ రిజిస్టర్లో మొట్టమొదటి సంతకం మేనేజరుగారిదే ఉండాలి. అది అధికారికి తను ఇచ్చే గౌరవం అని అనుకుంటాడు కూడా.
ఆ రోజూ.. మేనేజరుగారు టూర్లో ఉండి పోవడంతో జీతం డబ్బు.. తీసి కవరులో పెట్టాడు. మేనేజరు చక్రధరరావుగారి జీతం పన్నెండు వేల మూడు వందలు చక్కటి రౌండ్ ఫిగర్. మరో రూపాయి అటూ ఇటూ కాకుండా, రెండు యాభై రూపాయల కట్టలు, మూడు వంద రూపాయల నోట్లు తీసి కవరులో పెట్టి, కవరుపై ‘పన్నెండు వేల మూడు వందలు’ అని .. అంకె వ్రాసి బీరువాలో పెట్టి, జీతాలు అందరికీ పంచాడు.
డబ్బు పోయిన దగ్గరనుంచి చాలామంది ఒకటో తారికునే వచ్చి జీతాలు పట్టుకుపోతున్నారు జనాలు.
సాయంత్రం నాలుగు తరువాత …
అప్పడే… టూర్ నుంచి వచ్చిన చక్రధరరావుగారు మళ్ళీ బయటికి వెళ్ళే హడావుడిలో ఉన్నారు. “ఉండండి సార్! జీతం తీసుకుని వెళ్ళుదురు గాని” అంటూ డబ్బు కవరూ, ఎక్విటేన్స్ రిజిస్టరూ.. బాయ్‌తో అందజేశాడు.
అక్కడే.. స్టాఫ్ రూంలోనే ఉండి సంతకం పెట్టి, కవరు అందుకుంటూ “సరిగ్గానే లెక్క చూసారుగా. అయినా నాకెందుకు తక్కువ పెడతారు లెండి” అన్నాడు పెద్దగా నవ్వుతూ, తెరచి ఉన్న కవరు లోని నోట్లను కళ్ళతో.. చూసుకుంటూ.
“లెక్క చూసుకోండి సార్” అన్నాడు అంతే ధీటుగా.
“మీరు ‘తప్పు’ లెక్క పెట్టరు లెండి” నమ్మకంగా కవరు తీసుకుని బయలుదేరారు. మేనేజరుగారు తన మీద ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషపడ్డాడు స్టీఫెన్.
***
ఆ రోజు అందరికీ జీతాలు పంచి, ఇంటికొచ్చే సరికి రాత్రి ఎనిమిది గంటలైంది.
స్టీఫెన్‌కి మనసంతా చాలా హాయిగా ఉంది, ఈ మేనేజరుగారైనా తన మీద నమ్మకం ఉంచినందుకు. పదేపదే మేనేజరుగారు చివరిగా అన్న మాట “మీరు తప్పులెక్క పెట్టరు లెండి” అన్న మాటే వెంట వచ్చి… సంతోషానికి కారణం అయ్యింది.
రాత్రి పదిన్నరకు.. మంచం మీద పడుకుని నిద్రకు ఉపక్రమించిన.. స్టీఫెన్‌కు సడన్‌గా గుర్తొచ్చింది.
‘రెండు యాభై రూపాయల కట్టలు, మూడు వంద రూపాయల నోట్లు’ పన్నెండు వేల మూడు వందలు అవవని .. మరో ‘రెండు వేల రూపాయలు’ తక్కువ పెట్టానని.
అప్పుడు స్పురణకు వచ్చింది. తనను నమ్మిన మేనేజరు మంచితనాన్ని తలచుకుంటే నవ్వాగలేదు. సంతోషం పట్టలేక పైకే నవ్వేసాడు. ‘హహహ…’ అంటూ గట్టిగా నవ్వాడు. నవ్వలేక నవ్వాడు.
అలా నవ్వుతున్న అతడ్ని చూసి.. పక్కనే పడుకున్న కొడుకు ముఖం మీద దుప్పటి తొలగించుకుని చూస్తూ “ఎందుకు నాన్నా! నవ్వుతున్నావు” తండ్రి సంతోషానికి కారణం తెలుకోవాలన్న కుతూహలంతో ఆశ్చర్యంగా అడిగాడు.
జరిగిన విషయం అంతా పూస గుచ్చినట్లు చెప్పాడు నవ్వుల మద్య.
“రేపు వెళ్ళీ వెళ్ళగానే మా మేనేజరుగారికి.. ఆ రెండువేలూ కూడా ఇచ్చేయ్యలిరా” అన్నాడు వాడితో.
ఏమాలోచించుకున్నాడో గాని.. రెండునిముషాలు పోయిన తరువాత “అప్పుడు నీ డబ్బులు పోయినయ్ కదా! వీటిని ఉంచేసుకో” అన్నాడు.
పిల్లవాడు బాగానే గుర్తు పెట్టుకున్నాడు తన కష్టాన్ని అనుకుంటూ “తప్పు అలా చెయ్యకూడదు” చెప్పాడు.
***
తెల్లవారింది. సూర్యుడు నిముష నిముషానికీ ప్రచండంమై తన ప్రతాపాన్ని చూపిస్తున్నట్లు స్టీఫెన్ ఆలోచనలలో మార్పులు రాసాగాయి. ఓ సారీ చెప్పి.. ఆ ‘రెండువేలూ’ ఇచ్చేస్తే .. ‘నాకే తక్కువ ఇచ్చావంటే.. మిగిలిన వాళ్లకి ఇంకెంత తక్కువ ఇస్తున్నావో. బాద్యత గల ఉద్యోగివై ఉండి కూడా.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా. నేను స్పేర్ చెయ్యను ఇలాంటి విషయాల్లో’ అనవచ్చు.
అసలే తిక్క మాస్టరు.
ఎప్పుడూ ఇలాంటి తప్పులే చేస్తానని ముద్ర వేసుకోవచ్చు. ఇంతకుముందు ఇన్సిడెంటు ఓ నిదర్సనం. మంచి కన్నా చెడుకి వ్యాప్తి ఎక్కువ. ఈ టైముకి విషయం చేరే ఉంటుంది.
పిలిచి అడిగేతే నో!..
‘పంచినది, ఇంకా పంచాల్సింది’ లెక్కలు వేసుకుని.. అప్పుడే పొరపాటును గమనించినట్లు చేసి.. అప్పుడు ఇచ్చెయ్యవచ్చు’ అనుకున్నాడు.
అందుకు మేనేజరుగారు పిలిచేంత వరకూ ఆ రూంలోకి వెళ్ళడానికి భయపడ్డాడు. అయితే, అలాంటి సమస్యేం ఎదురు కాలేదు.
చివరికి..
అందరికీ పంచేయ్యగా అ రెండువేలూ మిగిలాయి. మేనేజరుగార్కి జీతంతో పాటు టి.ఏ.లు కూడా ఎక్కువే. అందుకు జీతంలో లెక్క తేడాను గమనించుకోలేదు.
కాబట్టి, పిల్లవాడు అన్నట్లు… ఆ కవరులో మిగిలినవి తనవే. మరో కంటికి తెలీదు. మాట పెదవి దాటితే ఉద్యోగానికే ప్రమాదం. వారం రోజుల తర్వాత… రామాచారి చెప్పాడు.. “సార్! పిలుస్తున్నారు సార్” అంటూ.
అ మాటకి భయం వేసింది. అలా జరిగినప్పటినుంచి మేనేజరుగారిని తప్పించుకుని తిరుగుతున్నాడు. రూంలో అసిస్టెంట్ మేనేజరు కూడా ఉన్నారు. మేనేజరుగారు స్టీఫెన్‌ని చూస్తూ “ఈ నెలలో మీరిచ్చిన జీతంలో …..”
అని మొదలు పెట్టగానే పై ప్రాణాలు పైనే పోయినయ్.
అసలే భయం పడుతున్నందుకు వళ్ళంతా చెమటలు పట్టి, వెన్నులోంచి వేడి పుట్టుకొచ్చింది ఏ.సీ. రూంలో కూడా. డబ్బు తక్కువైన విషయం ఇప్పటికి గమనించి ఉంటారు. అందుకే అసిస్టెంట్ మేనేజరు గారిని తోడు ఉంచుకున్నారు.
అసిస్టెంట్ మేనేజరు అసలే దేవాంతకుడు. తిమ్మిని బమ్మిని చేసి.. చెయ్యని నేరాన్ని కూడా అంటగట్టేయ గల సమర్థుడు. ఒకళ్ళకి ఇద్దరు తోడయ్యారు.
ఏమైనా సరే దొరక్కూడదు. ఇన్ని రోజుల తరువాత.. జరిగినదాన్ని అంగీకరించదలచుకోలేదు. దైర్యం తెచ్చుకున్నాడు. మొన్ననే అనుకోకుండా టీ.వి.లో వెంకటేష్ ‘దృశ్యం’ సినిమా కూడా చూసాడు. ఏమైనా సరే బుకాయించదలచుకున్నాడు.
“… చాలా నోట్లు చిరిగిపోయి.. ఉన్నాయి. కొన్ని నోట్లు అసలు మార్చడానికే వీలు అవలేదు. అంతా పాత చింతపండు” విసుక్కున్నారు.
అంతలోనే అసిస్టెంట్ మేనేజరునుద్దేశించి “ఇంకా చెప్పాలంటే… ఈ నెలలో.. అసలు జీతం ఎలా ఖర్చు అయ్యిందో కూడా తెలీలేదు మా అమ్మాయి డెలివరీతో” చెప్పుకుపోతున్నాడు భోలాశంకరుడు.
అంతా.. విని తేలిక పడిన మనసుతో, నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ “పని చెయ్యని నోట్లుంటే ఇచ్చెయ్యండి సార్! ఎవరి నైనా బ్యాంకుకు పంపించి మార్పిస్తాను” చెప్పాడు చాలా నిజాయితీగా.
అనుకోని పొరపాటు.. గ్రహపాటై, అనిశ్చితికి గురిచేసి, మనశ్శాంతి లేకుండా చేసింది. తెలిసి చేసినా.. తెలియక చేసినా పొరపాటు.. పొరపాటే. అయితే.. దొరికితేనే దొంగలు. ఈసారి అదృష్టం.. అవకాశం తన వైపున ఉండి తన్ను నడిపించింది అనుకున్నాడు స్టీఫెన్.