Site icon Sanchika

5 భాషలు…. 5 వారాలు: పుస్తక పరిచయం

[dropcap]తె[/dropcap]లుగు ద్వారా ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం నేర్చుకునేందుకు చక్కా చెన్నకేశవరావు ఈ పుస్తకం రచించారు. విద్యార్థినీ విద్యార్థులకు, ఉద్యోగులకు, యువతకు, పెద్దలకు, అన్యభాషా విషయ విజ్ఞాన జిజ్ఞాసువులకు మార్గదర్శిగా ఎంతో ఉపయుక్తంగా ఉండగలదని అభిప్రాయపడ్డారు.

***

“భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశపు ఔన్నత్యం, ఎన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో భాషలు. భాషలు బహుళం అయినా భావం ఏకం. ఆచార వ్యవహారాలూ, సాంప్రదాయాలు, సుఖసౌఖ్యాలు అనేకం. కానీ ఇక్కట్లు, ఇబ్బందులు, బాధలు మాత్రం ఒకటే.

సెల్‌ఫోన్, కంప్యూటర్ పరిజ్ఞానం పురోగమించిన ఈ రోజులలో ప్రపంచం మన కండ్లముందే కదలాడుతుంది. అయినా నేటి మానవుడు బతుకుదెరువు బాటసారి. బహుళ విషయ విజ్ఞాన ఆసక్తుడు. నేర్చినది మఱ్ఱి విత్తంత, నేఱ్వవలసింది ఆ వృక్షమంత. ఉదర పోషణార్థం ఉద్యోగాన్వేషణ, ఉద్యోగ నిర్వహణ నిమిత్తం ఏ ప్రాంతానికైనా అతని పయనం అవశ్యం. అవసరార్థం ఆయా ప్రాంతాల భాష లిపి, సంభాషణల తీరుతెన్నులు తెలుసుకోవడం అత్యంత అవసరం. అన్ని భాషలో ఒకేసారి నేర్వడం వీలుకానందున, కనీసం కొన్ని భాషలు నేర్చుకొనడం లేదా ఆయా భాషల లిపి, పదాలపై ప్రాథమిక అవగాహన ఎంతయో వాంఛనీయము. ఆ విషయం దృష్ట్యా మన మాతృభాష తెలుగు భాషకు ప్రాధాన్యత సంతరింపజేస్తూ అంతర్జాతీయ భాషయైన ఆంగ్లభాష, జాతీయ భాషయైన హిందీ, ఇతర దక్షిణ భారతదేశ భాషలయిన తమిళం, కన్నడం మరియు మలయాళంలందు గల అంశములను వర్గీకరణ చేసి, పండితులే కాక పామరులు సైతం అర్థం చేసుకోగలందులకు నూత్న తరహాలో ఈ పుస్తక సంకలనం జరిగింది. వ్యాకరణాంశములు కొన్ని మాత్రమే చేర్చబడినవి.

పొరుగు రాష్ట్రములైన తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతములకు వెళ్లినపుడు బస్టాండ్, రైల్వేస్టేషన్, కార్యాలయములు, ఇతర ప్రదేశముల యందు, మనకు కావలసిన సమాచారము రాబట్టుటకు, ఆయా ప్రాంత వ్యక్తుల సంభాషణ కొంతవరకు అవగాహన చేసికొనుటకు కావలసిన పదములు, వాక్యములు పొందుపఱచడమైనది.

ఈ పుస్తక పాఠకులు దయచేసి ఈ విషయములను దృష్టిలో ఉంచుకొనవలసినదిగా విజ్ఞప్తి.

  1. ప్రతి భాషయందును ఒక పదమునకు అనేక అర్థములుండును. అట్టి సందర్భములలో కావలసినది మాత్రము గ్రహింపబడినది.
  2. ప్రాంత ప్రాంతమునకు కొన్ని పదములు, భావములో విభిన్నత గోచరించును. అట్టి మాటలు అక్కడక్కడా కలవు.
  3. అన్య భాషలపై ప్రాథమిక అనగాహనా కల్పన నిమిత్తమే ఈ పుస్తకము వ్రాయబడినది కావున ఈ పుస్తక పఠనము వలన పూర్తి పట్టు సాధించు వీలు కాదు, కానేరాదు.
  4. భాష కంటే భావమునకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పుస్తకము వ్రాయబడినందుననూ, ప్రాంతీయ భాషలు పలుకు విధానము, వ్రాయు విధానములకు అనేక భేదములుండుట అవశ్యమైనందుననూ, తెలుగుభాషా శబ్దములకు, వాక్యములకు పూర్తి ఇతర భాషల అనువాదము లభ్యము కాదు.
  5. మన తెలుగువారు ఇతర ప్రాంతములకు వెళ్లినపుడు వారి భాషాశైలి, సంభాషణా తీరు గమనించి ఈ పుస్తకములో పొందుపఱచిన పదములు, వాక్యములను ఉపయోగించిన ఎడల వారివలెనే మన వారందఱూ మాట్లాడగలందుకు మార్గము సుగమమగును.

ఈ పుస్తకం ద్వారా అందించిన సమాచారం గోరంత మాత్రమే. ‘తెలుసుకుందాం’, ‘నేర్చుకుందాం’ అను భావనే విషయ విజ్ఞాన వికాసానికి తొలిమెట్టు, కావున అదియే కొండంత విజ్ఞాన నిలయానికి ఆదిబిందువు కాగలదని నా విశ్వాసం” అని రచయిత తన ముందుమాట “మీతో మనసు విప్పి…” లో పేర్కొన్నారు.

***

5 భాషలు…. 5 వారాలు
రచన: చక్కా చెన్నకేశవరావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్, 28-22-20, రహిమాన్ వీధి, అరండల్ పేట, విజయవాడ – 520002.
పుటలు: 349
వెల: ₹200
ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు, ప్రచురణకర్త

Exit mobile version